సత్యశోధన/ఐదవభాగం/30. ఒక అద్భుతమైన దృశ్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

30. అద్భుతమైన దృశ్యం

రౌలట్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా ఒకవైపున ఉద్యమం సాగుతూ వుంటే మరోవైపున ప్రభుత్వం ఆ రిపోర్టును అమలుపరిచి తీరాలనే నిర్ణయానికి వచ్చింది. రౌలట్ బిల్లు వెలువడింది. నేను కౌన్సిలు మీటింగులో రౌలట్ బిల్లు మీద జరిగే చర్చ విందామని ఒకసారి వెళ్లాను. శాస్త్రిగారి ఉపన్యాసం మహావేడిగా సాగుతున్నది. ఆయన గవర్నమెంటును గట్టిగా హెచ్చరిస్తున్నారు. శాస్త్రిగారి మాటలు జోరుగా సాగుతూ వుంటే వైస్రాయి ఆయన ముఖం వంక శ్రద్ధగా చూస్తూ వున్నాడు. శాస్త్రి గారి మాటల ప్రభావం ఆయన మీద బాగా పడివుంటుందని అనుకున్నాను. శాస్త్రి గారి భావావేశం బాగా పొంగిపొర్లుతూ వుంది.

నిద్రపోతున్నవాణ్ణి మేల్కొల్పవచ్చు. కాని మేల్కొనివుండి నిద్రపోతున్నట్లు నటించేవాడి చెవి దగ్గర శంఖం ఊదినా ప్రయోజనం ఏముంటుంది? కౌన్సిల్లో బిల్లుల మీద చర్చ జరిగినట్లు పెద్ద నాటకం ఆడాలికదా! ప్రభుత్వం ఆ పని చేసింది. అయితే తను అనుకున్నట్లే చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. అందువల్ల శాస్త్రిగారిది అంతా కంఠశోష అని తేలిపోయింది. ఇక ఆ సందట్లో నామాట వినేవాడెవరు? వైస్రాయిని కలిసి అనేక విధాల చెప్పాను. జాబులు వ్రాశాను. బహిరంగ లేఖలు కూడా వ్రాశాను. సత్యాగ్రహం తప్ప గత్యంతరం లేదని కూడా ప్రకటించాను. అంతా అడవిలో గాచిన వెన్నెల చందాన అయిపోయింది.

ఇంకా బిల్లు గెజట్లో ప్రకటించబడలేదు. నా శరీరం బలహీనంగావుంది. అయినా పెద్ద పోరాటానికి నడుం బిగించాను. పెద్ద ప్రసంగాలు చేసే శక్తి ఇంకా నాకు చేకూరలేదు. నిలబడి మాట్లాడగల శక్తి ఎప్పుడో పోయింది. ఆ శక్తి ఇక యీనాటివరకు నాకు చేకూరలేదు. నిలబడి కొద్ది సేపు మాట్లాడితే శరీరం వణికిపోవడం, గుండెలో నొప్పి యిదీ వరస. అయితే మద్రాసు నుండి అందిన ఆహ్వానం అంగీకరించాలని భావించాను. దక్షిణాది ప్రాంతాలు నా స్వగృహాలు అని అనిపించేవి. దక్షిణాఫ్రికాలో ఏర్పడ్డ సంబంధం వల్ల తెలుగు, తమిళం భాషల వారిమీద నాకు హక్కు వున్నట్లు భావించేవాణ్ణి. ఆవిధంగా భావించడంలో పొరబడలేదనే విశ్వాసం ఇప్పటికీ నాకు వున్నది. కీ.శే. కస్తూరీ రంగస్వామి అయ్యంగారి ఆహ్వానం నాకు అందింది. ఆ ఆహ్వానం వెనుక శ్రీ రాజగోపాలాచార్యులు వున్నారు. ఆ విషయం మద్రాసు చేరిన తరువాత నాకు తెలిసింది. శ్రీ రాజగోపాలాచార్యులతో ఇది నాకు ప్రథమ పరిచయమని చెప్పవచ్చు. వారి రూపాన్ని మొదటిసారి చూచాను. ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కస్తూరి రంగస్వామి అయ్యంగారి వంటి మిత్రుల ప్రోత్సాహంతో సేలం వదిలి పెట్టి మద్రాసులో వకీలు వృత్తి, ఆచార్యులు ప్రారంభించబోతున్నారని తెలిసింది. వారింటి దగ్గరే నాకు మకాం ఏర్పాటుచేశారు. అయితే యీ విషయం నాకు రెండు రోజుల తరువాత తెలిసింది. కస్తూరి అయ్యంగారి బంగళాలో నేను అతిథిగా వున్నానని అనుకున్నాను. మహాదేవదేశాయి నా పొరపాటును సరిచేశారు. రాజగోపాలచారి మా ఎదుట పడకుండా తప్పుకు తిరుగుతూ వున్నాడు. అయితే మహాదేవ్ ఆయనను పసిగట్టి “మీరు రాజగోపాలాచారితో పరిచయం చేసుకోవాలి” అని నాకు చెప్పాడు.

నేను పరిచయం చేసుకున్నాను. రోజూ యుద్ధ ప్రణాళికను గూర్చి సలహా సంప్రదింపులు జరుపవలసిన అవసరం ఏర్పడింది. సభలు తప్ప నాకు మరేమీ తోచడం లేదు. రౌలట్ బిల్లు చట్టరూపం దాలిస్తే దాన్ని సవినయంతో ఎలా ఎదుర్కొనడం? అట్టి అవకాశం ప్రభుత్వం కల్పిస్తేనే గదా? ఆ చట్టాన్ని సవినయంగా వ్యతిరేకిస్తే దానికి గల హద్దు ఏమిటి? ఈ విషయాలపై మా మధ్య చర్చ జరుగుతూ వుండేది. శ్రీ కస్తూరి రంగస్వామి అయ్యంగారు కొద్దిమంది నాయకుల్ని పిలిచి సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో బాగా చర్చ జరిగింది. ఆ చర్చలో శ్రీ విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు. ఆయన సూక్ష్మంగా కొన్ని సూచనలు చేసి సత్యాగ్రహం మీద పుస్తకం వ్రాయమని సలహా యిచ్చారు. అది నా శక్తికి మించినపని అని చెప్పాను.

ఇంకా ఒక నిర్ణయానికి మేము రాలేదు. పొయ్యి మీద పులగం వుడుకుతూ వుంది. ఇంతలో బిల్లు చట్టం రూపంలో గెజెట్‌లో ప్రకటించబడిందను వార్త మాకు అందింది. ఈ వార్త అందిననాటి రాత్రి ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపోయాను. ప్రాతఃకాలం మెళుకువ వచ్చింది. అర్ధ నిద్రావస్థలో ఒక స్వప్నం వచ్చింది. అందు ఒక సలహా వినబడింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశమందంతటా హర్తాలు జరపమని ప్రకటన చెయ్యాలి. సత్యాగ్రహం ఆత్మశుద్ధికి సంబంధించిన యుద్ధం. అది ధార్మిక యుద్ధం, ధర్మకార్యం. శుద్ధిగా ప్రారంభించాలి. అందువల్ల ఆ రోజున ఉపవాసం చేయాలి. పనులేవీ చేయకూడదు. ముస్లిం సోదరులు రోజూ ఉపవాసం చేస్తారు గనుక 24 గంటలపాటు అంతా ఉపవాసం చేయాలి. అన్ని ప్రాంతాలవారు చేరుతారో లేదో తెలియదు. కనుక ముందుగా బొంబాయి, మద్రాసు, బీహారు, సింధ్‌లో జరపాలి. యీ ప్రాంతాల్లో సరిగా హర్తాళ్ జరిగితే దానితో తృప్తిపడాలి’ యిదీ స్వప్నంలో నాకు వినబడిన సలహా.

ఈ సలహా రాజగోపాలచార్యులకు బాగా నచ్చింది. తరువాత యితర మిత్రులకు తెలియజేశాం. అందరూ హర్షం ప్రకటించారు. ఒక చిన్న నోటీసు తయారుచేశాను. ప్రారంభంలో ది. 30 మార్చి 1919 నాడు హర్తాళ్ జరపాలని నిర్ణయించారు. తరువాత అది ఏప్రిల్ 6వ తేదీకి మారింది. ప్రజలకు కొద్దిరోజుల ముందే యీ సమాచారం అందజేయబడింది. పని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాము. వ్యవధి ఎక్కువగా లేదు.

ఆశ్చర్యం! ఎలా జరిగాయో ఏమో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. హిందూ దేశమంతట పట్టణాల్లో, పల్లెటూళ్లలో జయప్రదంగా హర్తాళ్ జరిగింది. అద్భుతమైన దృశ్యం అది.