సత్యశోధన/ఐదవభాగం/29. రౌలట్ యాక్టు - ధర్మ సంకటం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

29. రౌలట్ అక్టు - ధర్మసంకటం

మథెరాన్ వెళితే శరీరానికి త్వరగా పుష్టి చేకూరుతుందని మిత్రులు సలహా యిచ్చారు. ఆ ప్రకారం నేను మథెరాన్ వెళ్లాను. అక్కడి నీళ్లు పడలేదు. అందువల్ల నా వంటిరోగి అక్కడ వుండటం కష్టమైపోయింది. ఆమం ఎక్కువ కావడం వల్ల మలద్వారం మెత్తబడిపోయి అక్కడ బాగా గాట్లు పడ్డాయి. దొడ్డికి వెళితే యమబాధ ప్రారంభమైంది. అందువల్ల ఆహారం ఏమన్నా తీసుకుందామంటే భయం వేసింది. ఒక్క వారం రోజుల్లో మథెరాన్ నుండి తిరిగి వచ్చివేశాను. నా ఆరోగ్యాన్ని గురించి శంకరలాల్ శ్రద్ధ వహించాడు. డాక్టర్ దలాల్ సలహా తీసుకోమని వత్తిడి చేశాడు. డాక్టర్ దలాల్ వచ్చారు. వెంటనే నిర్ణయం చేసే ఆయన శక్తి నన్ను ఆకర్షించింది. ‘మీరు పాలు తీసుకోనంత వరకు నేను మీ శరీరాన్ని బాగుచేయలేను. మీ శరీరం బాగుపడాలంటే పాలు త్రాగక తప్పదు. ఆర్సెనిక్ ఇంజెక్షన్లు చేయించుకోవాలి. మీరు సరేనంటే మీ శరీర బాధ్యత నాది’ అని అన్నారు. “ఇంజెక్షన్లు తీసుకుంటాను కాని పాలు మాత్రం త్రాగను”. “పాలను గురించిన మీ ప్రతిజ్ఞ ఏమిటి?” ఆవులను గేదెలను నరకయాతనలకు గురిచేస్తారని తెలిసి పాలంటే నాకు ఏవగింపు కలిగింది. పాలను ఆహారంగా తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల పాలు త్రాగడం మానివేశాను”. “అయితే మేకపాలు తీసుకోవచ్చు గదా!” అని నా మంచం దగ్గరే నిలబడి వున్న కస్తూరిబాయి అన్నది. “మీరు మేకపాలు పుచ్చుకున్నా చాలు” అని అన్నాడు డాక్టరు. నేను ఓడిపోయాను. సత్యాగ్రహ సంగ్రామపు మోహం జీవించాలనే లోభాన్ని కలిగించిందన్న మాట. ప్రతిజ్ఞను అక్షరశః పాటిస్తున్నానని సంతోషపడి దాని ఆత్మకు హాని కలిగించాను. పాలు త్రాగను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నాదృష్టిలో వున్నది ఆవులు గేదెలు మాత్రమే. అయినా పాలు అంటే అన్నిరకాల పాలు అని అర్థం కదా! జంతువుల పాలు ఆహారంగా తీసుకోకూడదు అని నేను భావించాను గనుక ఏవిధమైన పాలు నేను పుచ్చుకోకూడదు కదా! యీ విషయం తెలిసి కూడా నేను మేకపాలు పుచ్చుకునేందుకు సిద్ధపడ్డాను. సత్యాన్ని పూజించే వ్యక్తి సత్యాగ్రహ సంగ్రామం జరపడం కోసం జీవించాలనే కాంక్షతో అసలు సత్యాన్ని అణచివేసి దానికి మచ్చ తెచ్చాడన్న మాట.

నేను చేసిన యీ పని నాకు బాధ కలిగించింది. ఆ బాధ ఆ గాయం యింకా మానలేదు. మేకపాలు మానివేయాలి అను యోచన నాకు కలుగలేదు. మేకపాలు రోజూ త్రాగుతూ వున్నప్పుడు లోలోన బాధపడసాగాను. అయితే సేవ చేయాలనే అతిసూక్ష్మమైన మోహం నన్ను పట్టుకున్నది. అది నన్ను వదలలేదు. అహింసా దృష్టితో ఆహార ప్రయాగాలు చేయడం నాకు యిష్టం. అందువల్ల నా మనస్సుకు ఆహ్లాదం చేకూరుతుంది. కాని మేకపాలు తాగడం మాత్రం సత్యశోధన దృష్ట్యా నాకు యిష్టంలేదు. అహింస కంటే కూడా సత్యాన్ని ఎక్కువగా తెలుసుకోగలిగానని నా భావం. సత్యాన్ని త్యజిస్తే అహింస ద్వారా సమస్యల్ని పరిష్కరించలేనని నా విశ్వాసం. సత్య పాలన అంటే మాటను పాటించడం. శరీరం, ఆత్మ రెండిటిని రక్షించడం. శబ్దార్ధం మరియు భావార్ధం రెండిటినీ దెబ్బ తీశానన్నమాట. ప్రతి క్షణం యీ బాధ నన్ను బాధిస్తూనే వుంది. విషయాలు అన్నీ తెలిసినప్పటికీ అసలు విషయం నేను పూర్తిగా తెలుసుకోలేదన్నమాట లేక దాన్ని పాటించే ధైర్యం నాకు చాలలేదని కూడా చెప్పవచ్చు. “ఓ భగవంతుడా! నాకు అట్టి ధైర్యం ప్రసాదించు!” మేకపాలు తాగడం ప్రారంభించిన కొద్ది రోజుల తరువాత డా. దలాల్ మలద్వారం దగ్గర పడ్డ గాట్లకు శస్త్రచికిత్స చేశారు. దానితో గాట్లు సర్దుకున్నాయి. ఇప్పుడు లేవగలననే ఆశ కలిగింది. పత్రికలు చదవడం ప్రారంభించాను. ఇంతలో రౌలట్ కమిటీ రిపోర్టు నా చేతికి అందింది. అందు పేర్కొన్న సిఫారసులను చదివి నివ్వెరబోయాను. ఉమర్‌భాయి (సుభానీ), శంకరలాల్ యీ విషయమై గట్టి చర్య తీసుకోవాలని అన్నారు. ఒక నెల రోజులు గడిచిన తరువాత నేను అహమదాబాదు వెళ్లాను. వల్లభభాయి ప్రతి రోజు నన్ను చూచేందుకు వస్తూ వుండేవారు. వారితో మాట్లాడి దీన్ని గురించి ఏమైనా చేయాలి అని అన్నాను. “ఏం చేయాలి?” అని ప్రశ్నించారు వల్లభభాయి. కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం చట్టం చేయబడితే వెంటనే సత్యాగ్రహం ప్రారంభించాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞ గైకొనేవారు కొందరైనా అవసరం అని చెప్పాను. నేను మంచం పట్టి వుండకపోతే ఒంటరిగానే పోరాటానికి దిగేవాణ్ణి. తరువాత కొంతమంది అయినా పోరాటంలో చేరేవారు. శరీర దారుఢ్యత లేనందువలన ఒంటరిగా పోరాటానికి దిగగల శక్తి నాకు లేదు అని చెప్పాను.

ఈ సంభాషణ జరిగిన తరువాత నాతో బాటు పని చేస్తూ వున్న వారి సమావేశం ఒకటి ఏర్పాటు చేశాను. రౌలట్ కమిటీ చేసిన సిఫారసులు, వాటికి సంబంధించిన చట్టాలు అన్నీ అనవసరం అని నాకు తోచింది. అభిమానం గల ఏ దేశమూ యిట్టి చట్టాల్ని అంగీకరించదని స్పష్టంగా తేలిపోయింది. సమావేశం జరిగింది. 20 మంది మాత్రమే ఆహ్వానించబడ్డారు, వల్లభభాయి గాక శ్రీమతి సరోజినీ నాయుడు, హార్నిమెన్, కీ.శే ఉమర్ సుభాని, శంకర్ లాల్ బాంకరు, అనసూయా బెన్ వారిలో వున్నారని నాకు బాగా గుర్తు. ప్రతిజ్ఞాపత్రం తయారుచేయబడింది. అక్కడ వున్నవారంతా దాని మీద సంతకాలు చేశారని నాకు జ్ఞాపకం. అప్పటికి నేను పత్రికా ప్రచురణ ప్రారంభించలేదు. కాని పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూవుండేవాణ్ణి. శంకర్ లాల్ బాంకరు ఉద్యమం ప్రారంభించాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అప్పుడు నాకు బాగా బోధపడ్డాయి. సత్యాగ్రహాన్ని మించిన మరో క్రొత్త ఆయుధ ప్రయోగం ఎవరైనా ప్రారంభిస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అందువల్ల సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయబడింది. ముఖ్యమైన పేర్ల పట్టిక బొంబాయిలోనే తయారైంది. అందుకు కేంద్రం బొంబాయి నగరమే. ప్రతిజ్ఞాపత్రం మీద ఎక్కువమంది సంతకాలు చేయసాగారు. ఖేడా సంగ్రామంలో వలె యిక్కడ కూడా కరపత్రాలు వెలువడ్డాయి. అనేక చోట్ల సభలు జరిగాయి. ఆ సంస్థకు నేనే అధ్యక్షుణ్ణి. చదువుకున్న వర్గం వారికి, నాకు అంతగా పొసగదని తేల్చుకున్నాను. కరపత్రాల్లో గుజరాతీ భాషనే వాడాలని చెప్పాను. యిలాంటివే మరికొన్ని విషయాలు వాళ్లను గొడవలో పడవేశాయి. అయినా చాలామంది నా పద్ధతి ప్రకారం నడిచేందుకు సిద్ధపడి తమ ఉదారబుద్ధిని చాటుకున్నారు. అయితే యీ సభ ఎక్కువ రోజులు నడవదని ప్రారంభంలోనే గ్రహించాను. పని మాత్రం బాగా పెరిగిపోయింది.