సత్యశోధన/ఐదవభాగం/28. మృత్యుశయ్యమీద

వికీసోర్స్ నుండి

28. మృత్యుశయ్య మీద

సైన్యంలో యువకుల్ని చేర్చడం కోసం నా శరీరం అరిగిపోయింది. అప్పుడు వేయించి దంచిన బెల్లం కలిపిన వేరుసెనగపప్పు నా ఆహారం. అరిటిపండ్లు, రెండు మూడు నిమ్మకాయల రసం, వేరుసెనగ పప్పు ఎక్కువగా తింటే హానిచేస్తుందని తెలుసు. అయినా దాన్ని ఎక్కువగా తిన్నాను. అందువల్ల విరోచనాలు పట్టుకున్నాయి. నేను తరచు ఆశ్రమం వెళ్లవలసి వస్తూ వుండేది. విరోచనాలు అంత బాధాకరమని అనిపించలేదు. రాత్రి ఆశ్రమం చేరాను. అప్పుడు మందులేమీ వాడేవాణ్ణి కాను. ఒక పూట ఆహారం మానివేస్తే విరోచనాలు తగ్గిపోతాయని భావించాను. మరునాడు ఉదయం ఏమీ తినలేదు. దానితో బాధ కొంత తగ్గింది. యింకా ఉపవాసం చేయడం అవసరమని, ఆహారం తీసుకోవలసి వస్తే పండ్లరసం వంటి వస్తువేదైనా తీసుకోవాలని నాకు తెలుసు.

అది ఏదో పండగరోజు. మధ్యాహ్నం ఏమీ తిననని కస్తూరిబాయికి చెప్పినట్లు గుర్తు. కాని ఆమె పండగపూట కొంచెం తినమని ప్రోత్సహించింది. నేను కొంచెం ఉబలాటపడ్డాను. నేను పశువుల పాలు పుచ్చుకోవడం లేదు. అందువల్ల నెయ్యి, మజ్జిగ కూడ మానివేశాను. కస్తూరిబాయి నూనెతో వేయించిన గోధుమజావ, పెసరపప్పు పదార్థం నాకిష్టమైనవి చేసివుంచింది. వాటిని చూచేసరికి నాకు నోరు ఊరింది. కస్తూరిబాయికి తృప్తి కలిగించేందుకు కొద్దిగా తిందామని, రుచి చూడటంతోపాటు శరీర రక్షణ కూడా సాధ్యపడుతుందని భావించాను. కాని సైతాను రెడీగా పొంచివున్నాడు. తినడం ప్రారంభించిన తరువాత పూర్తిగా తినివేశాను. తినడానికి పసందుగా వున్నాయేగాని, యమధర్మరాజును చేతులారా కొని తెచ్చుకున్నానని తరువాత తేలింది. తిని ఒక గంట అయిందో లేదో కడుపులో నొప్పి ప్రారంభమైంది.

రాత్రికి నడియాద్ వెళ్లాలి. సాబర్మతి స్టేషను వరకు నడిచి వెళ్లాను. మైలున్నర దూరం నడవాలంటే కష్టమైపోయింది. అహమదాబాదు స్టేషనులో వల్లభభాయి కలిశారు. ఆయన నేను పడుతున్న బాధను గ్రహించారు. అయినా బాధ భరించలేకపోతున్నానని ఆయనకుగాని, యితర అనుచరులకుగాని నేను చెప్పలేదు. నడియాద్ చేరాం. అక్కడికి అనాధాశ్రమం అరమైలు దూరాన వుంది. పదిమైళ్ల దూరం నడిచినంత శ్రమ కలిగింది. అతికష్టం మీద అక్కడికి చేరాను. మెలికలు తిరిగేటంతగా వుంది కడుపునొప్పి. పావుగంటకు ఒకసారి చొప్పున విరోచనాలు ప్రారంభమైనాయి. భరించలేక నేను పడుతున్న బాధను గురించి చెప్పివేశాను. మంచం ఎక్కాను. అక్కడి పాయిఖానా దొడ్డిని ఉపయోగించాను. కాని అంత దూరం కూడా వెళ్లలేక పక్క గదిలో కమోడ్ పెట్టమని చెప్పాను. సిగ్గుపడ్డాను కాని గత్యంతరం లేదు. పూల్ చంద్ బాపూజీ పరుగెత్తుకొని వెళ్లి కమోడ్ తెచ్చాడు. చింతాక్రాంతులైన నలుగురూ చుట్టూ మూగారు. అంతా ప్రేమామృతం నామీద కురిపించారు కాని నా బాధను పంచుకోలేరు గదా! నా మొండిపట్టు కూడా యిబ్బందికరంగా వున్నది. డాక్టర్లను పిలుస్తామంటే వద్దని వారించాను. మందు తీసుకోను. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాను అని చెప్పివేశాను. అనుచరులు ఓర్పు వహించారు. 24 గంటల్లో 30 లేక 40 సార్లు విరోచనాలు అయ్యాయి. ఆహారం పూర్తిగా మానివేశాను. తిందామనే వాంఛ పోయింది. రాతి వంటి శరీరం నాది అనుకునేవాణ్ణి. కాని బలం తగ్గిపోయింది. డాక్టర్లు వచ్చి మందు తీసుకోమని చెప్పారు. నేను తీసుకోనని చెప్పివేశాను. ఇంజక్షను గురించి అప్పటి అజ్ఞానాన్ని తలచుకుంటే నవ్వువస్తుంది. ఇంజక్షను గొట్టంలో ఒక విధమైన చెడు ఔషధం వుంటుందని అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం సరికాదని తరువాత తెలిసింది. అయితే అప్పటికి సమయం దాటిపోయింది. జిగట విరోచనాలు తగ్గలేదు. మాటిమాటికి లేవవలసిన పరిస్థితి ఏర్పడింది. దానితో జ్వరం వచ్చింది. ఒళ్లు తెలియకుండా పడిపోయాను. మిత్రులు భయపడిపోయారు. చాలామంది డాక్టర్లు వచ్చారు. కాని రోగి అంగీకరించకపోతే వారేం చేస్తారు?

సేఠ్ అంబాలాలు, ఆయన సతీమణి నడియాద్ వచ్చారు. అనుచరులతో మాట్లాడి నన్ను మీర్జాపూరులో వున్న తమ బంగళాకు కడు జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. జబ్బుస్థితిలో నేను పొందిన నిర్మల, నిష్కామసేవ మరెవ్వరూ పొందియుండరని చెప్పగలను. జ్వరం తక్కువగా వున్నా శరీరం క్షీణించిపోయింది. జబ్బు చాలాకాలం లాగుతుందని మంచం మీద నుండి లేవలేనని అనుకున్నాను. అంబాలాలు గారి బంగళాలో ప్రేమామృతం వారు ఎంత కురిపిస్తున్నా నేను అక్కడ వుండలేకపోయాను. ఆశ్రమం చేర్చమని వారిని వేడుకున్నాను. నా పట్టుదలను చూచి వారు నన్ను ఆశ్రమం చేర్చారు. బాధపడుతున్న సమయంలో వల్లభభాయి వచ్చి యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని, సైన్యంలో యువకుల్ని చేర్చవలసిన అవసరం లేదని కమీషనరు చెప్పాడని అన్నారు. సంతోషం కలిగింది. బరువు తీరినట్లనిపించింది. జల చికిత్స ప్రారంభించినందున నా శరీరం యింకా నిలిచివున్నది. బాధ తగ్గింది. కాని శరీరం కుదుటబడలేదు. వైద్యులు, డాక్టర్లు ఎన్నో సలహాలు యిచ్చారు కాని నేను అంగీకరించలేదు. పాలు తీసుకోకపోతే మాంసం పులుసు పుచ్చుకోమని, ఆయుర్వేద శాస్త్రంలో అందుకు అంగీకరించారని కొందరు వైద్యులు గ్రంథాలు తిరగవేసి మరీ చెప్పారు. ఒకరు గుడ్డు తీసుకోమని చెప్పారు. ఎవ్వరి మాటా నేను వినలేదు. ఆహారం విషయంలో గ్రంథాల మీద నేను ఎన్నడూ ఆధారపడలేదు. ఆహారంలో ప్రయోగాలు నా జీవితంలో భాగమై పోయాయి. ఏదో ఒకటి తినడం, ఏదో మందు పుచ్చుకోవడం నేనెరుగను. నా బిడ్డలకు, భార్యకు, మిత్రులకు వర్తించని ధర్మం నాకు మాత్రం ఎలా వర్తిస్తుంది? ఇది జీవితంలో నాకు చేసిన పెద్దజబ్బు, ఎక్కువకాలం మంచం పట్టిన జబ్బు కూడా యిదే. జబ్బు తీవ్రతను దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు చిక్కింది. ఒకనాటి రాత్రి యిక బ్రతకనని అనిపించింది. మృత్యువుకు దగ్గరలో వున్నానని అనిపించింది. శ్రీమతి అనసూయాబెన్‌కు కబురు పంపాను. ఆమె వచ్చింది. వల్లభభాయి వచ్చారు. డాక్టర్ కానూగా వచ్చారు. డాక్టర్ కానూగా కూడా నాడిని జాగ్రత్తగా పరిశీలించి చూచి “మృత్యు లక్షణాలేమీ నాకు కనబడటం లేదు. నాడి శుభ్రంగా వున్నది. బలహీనత వల్ల మీరు మానసికంగా భయపడుతున్నారు” అని చెప్పారు. కాని నా మనస్సు అంగీకరించలేదు. ఆ రాత్రి అతికష్టం మీద గడిచింది. కన్ను మూతబడలేదు.

తెల్లవారింది. నేను చనిపోలేదు. అయినా బ్రతుకు మీద ఆశ నాకు కలుగలేదు. మరణం దగ్గరలో వున్నదని భావించి గీతాపఠనం విడువకుండా సాగించమని చెప్పి, గీతాశ్లోకాలు వింటూ పడుకున్నాను. పనిచేసే శక్తి లేదు. చదివే ఓపిక అసలే లేదు. రెండు మూడు వాక్యాలు మాట్లాడేసరికి మెదడు అలిసిపోతున్నది. అందువల్ల ప్రాణం మీద ఆశపోయింది. బ్రతకడం కోసం బ్రతకడం నాకు యిష్టం లేదు. కాయకష్టం చేయకుండా అనుచరుల చేత చేయించుకుంటూ బ్రతకడం భారమనిపించింది. ఈవిధమైన స్థితిలో వుండగా డాక్టర్ తల్‌వల్కర్ ఒక విచిచిత్రమై వ్యక్తిని తీసుకువచ్చారు. ఆయన మహారాష్ట్రకు చెందినవాడు. భారతదేశంలో ఆయనకు ఖ్యాతి లేదు. ఆయనను చూడగానే నా మాదిరిగానే ఆయన కూడా పెంకిరకమని గ్రహించాను. ఆయన తన చికిత్సను నా మీద ప్రయోగించి చూచేందుకు వచ్చాడని తేల్చుకున్నాను. ఆయన గ్రేట్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రం అధ్యయనం చేశాడు. అయితే డిగ్రీ తీసుకోలేదు. బ్రహ్మ సమాజంలో చేరాడని తరువాత తెలిసంది. ఆయన పేరు కేల్కర్. పూర్తిగా స్వతంత్ర స్వభావం గల వ్యక్తి. మంచు చికిత్స తప్పదని ఆయన భావం. నా జబ్బు విషయం తెలిసి మంచి చికిత్స చేయడానికి వచ్చాడన్నమాట. ఆయనకు ఐస్ డాక్టర్ అని పేరు పెట్టాము. తన చికిత్స అంటే ఆయనకు గట్టి నమ్మకం. డిగ్రీ హోల్డర్ల కంటే తను గొప్ప డాక్టరునని ఆయనకు అపరిమితమైన విశ్వాసం.

అయితే తనకెంత విశ్వాసంవుందో అంత విశ్వాసం నాకు కలిగించలేకపోయాడు. ఈ విషయం మా ఇరువురికీ విచారం కలిగించింది. కొన్ని విషయాలలో ఆయన తొందరపడ్డాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా నాశరీరం మీద ఆయనను ప్రయోగాలు చేయనిచ్చాను. బాహ్య చికిత్సే గదా అని భావించాను. ఆయన శరీరమంతా మంచుగడ్డలతో రాయడం ప్రారంభించాడు. ఆయన చికిత్స వల్ల చెప్పినంత ప్రయోజనం కలుగకపోయినా మృత్యువు కోసం మొదట నిరీక్షించినట్లు యిప్పుడు నిరీక్షించడం మానివేశాను. జీవితంమీద ఆశ చిగురించింది. కొద్దిగా ఉత్సాహం కలిగింది. తినే ఆహారం కొద్దిగా పెరిగింది. 10 నిమిషాలపాటు రోజూ పచారు చేయసాగాను. ఆయన నా ఆహారంలో కొద్దిగా మార్పు చేయమని సూచించి “మీరు గ్రుడ్డురసం త్రాగండి. యిప్పటికంటే అత్యధికంగా మీకు ఉత్సాహం కలుగుతుంది. పాల వలెనే గ్రుడ్డు కూడా దోషంలేని వస్తువు. అది మాంసం కానేకాదు. ప్రతి గ్రుడ్డు నుండి పిల్ల పుట్టదు. పిల్లగా మారని గొడ్డుబోతు గ్రుడ్లు కూడా వుంటాయి. వాటిని వాడవచ్చును. నా మాటను రుజూ చేసి చూపిస్తాను” అని మాటల వర్షం కురిపించాడు. కాని అందుకు నేను యిష్టపడలేదు. అయినా నా బండి కొంచెం ముందుకు సాగింది. కొద్ది కొద్దిగా పనులు చేయసాగాను.