సత్యశోధన/ఐదవభాగం/27. సైన్యంకోసం యువకుల ఎంపిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

27. సైన్యం కోసం యువకుల ఎంపిక

నేను సభలో పాల్గొన్నాను. సైనికుల్ని చేర్పించి ప్రభుత్వానికి నేను సాయం చేయాలని వైస్రాయి అభిప్రాయపడ్డారు. నేను సభలో హిందీ - హిందుస్తానీలో మాట్లాడతానని చెప్పాను. వైస్రాయి అంగీకరించారు. హిందీతో బాటు ఇంగ్లీషులో కూడా మాట్లాడమని కోరారు. నేను ఉపన్యాసం యివ్వదలచలేదు. “నా బాధ్యత ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. తెలిసికూడా నేను యీ తీర్మానాన్ని సమర్ధిస్తున్నాను” అని మాత్రం అన్నాను.

హిందుస్తానీలో మాట్లాడినందుకు చాలామంది నన్ను అభినందించారు. వైస్రాయి సభలో యీ రోజుల్లో హిందుస్తానీలో మాట్లాడటం యిదే ప్రథమం అనికూడా చెప్పారు. అభినందన, మొదటి పర్యాయం అను మాటలు రెండు నాకు గుచ్చుకున్నాయి. నేను సిగ్గుపడ్డాను. మన దేశంలో, దేశ సమస్యను గురించి దేశభాషలో మాట్లాడకపోవడం, దేశభాషను అవమానించడం ఎంతో విచారకరమైన విషయం. నావంటి వ్యక్తి రెండు వాక్యాలు హిందుస్తానీలో మాట్లాడితే అందుకు అభినందించడమా? మన పతనావస్థను యీ విషయం సూచిస్తున్నది. సభలో నేను అన్నమాటలకు నా దృష్టిలో మంచి తూకం వున్నది. దాన్ని మరిచిపోయే స్థితి యీ సభలో నాకు ఏమీ కనబడలేదు. నాకు గల ఒక బాధ్యతను ఢిల్లీలో నిర్వహించవలసియున్నది. వైస్రాయికి జాబు వ్రాయడం తేలికపనియని నాకనిపించలేదు. సభలో పాల్గొనేందుకు నా తడబాటు, అందుకు గల కారణాలు, భవిష్యత్తుపై నాకుగల ఆశ మొదలగు వాటిని స్పష్టంగా వెల్లడించడం అవసరమని భావించాను.

నేను వైస్రాయికి జాబు వ్రాసాను. అందు లోకమాన్య తిలక్, ఆలీ సోదరులు మొదలగువారిని సభకు ఆహ్వానించనందుకు విచారం వెల్లడించాను. ప్రజల రాజకీయ కోరికలను గురించి, యుద్ధంవల్ల మహమ్మదీయులకు కలిగిన కోరికలను గురించి ఆ జాబులో పేర్కొన్నాను. జాబును ప్రకటించేందుకు అనుమతించమని వైస్రాయిని కోరాను. ఆయన సంతోషంతో అనుమతించారు. ఆ జాబు సిమ్లా పంపాల్సి వచ్చింది. సమావేశం ముగియగానే వైస్రాయి సిమ్లా వెళ్లిపోయారు. పోస్టులో జాబు పంపితే ఆలస్యం అవుతుంది. నా దృష్టిలో జాబుకు విలువ ఎక్కువ. సమయం ఎక్కువ పట్టకూడదు. ఎవరి చేతనో జాబు పంపడం మంచిదికాదు. పవిత్రుడగు వ్యక్తి ద్వారా జాబు పంపితే మంచిదని భావించాను. దీనబంధు మరియు సుశీల రుద్రగారలు సజ్జనులగు రెవరెండ్ ఐర్లండుగారి పేరు సూచించారు. జాబు చదివిన తరువాత తనకు నచ్చితే తీసుకువెళ్లేందుకు ఆయన అంగీకరించాడు. జాబు రహస్యమైనదికాదు. ఆయన చదివారు. ఆయనకు నచ్చింది. తీసుకొని వెళ్లేందుకు అంగీకరించారు. సెకండ్‌క్లాసు కిరాయి యిస్తానని చెప్పాను. కాని ఆయన కిరాయి తీసుకునేందుకు అంగీకరించలేదు. రాత్రిపూట ప్రయాణం అయినా ఆయన ఇంటర్ టిక్కట్టు తీసుకున్నాడు. ఆయన నిరాడంబరత, స్పష్టత చూచి ముగ్ధుడనయ్యాను. యింతటి పవిత్రవ్యక్తి ద్వారా పంపిన జాబుకు సత్ఫలితం చేకూరింది. దానితో నాకు మార్గం సులువైపోయింది. సైన్యంలో యువకుల్ని చేర్చడం యిక నా రెండో బాధ్యత. ప్రజల్ని సైన్యంలో చేరమని నేను విన్నపం చేయాలంటే అందుకు తగిన చోటు ఖేడాయే గదా? నా అనుచరుల్ని ఆహ్వానించకపోతే యింక ఎవర్ని ఆహ్వానించగలను? ఖేడా చేరగానే వల్లభాయి మొదలగు వారితో చర్చించాను. చాలామందికి నా మాటలు రుచించలేదు. రుచించినవారికి యిందు సాఫల్యం లభిస్తుందా అని సందేహం కలిగింది. ఏ వర్గం వారిని ఇందు చేర్చాలో ఆ వర్గం వారికి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ప్రభుత్వ అధికారుల వల్ల కలిగిన అనుభవాలు వాళ్లు యింకా మరిచిపోలేదు. అయినా పని ప్రారంభిద్దామని అంతా నిర్ణయానికి వచ్చారు. పని ప్రారంభించినప్పుడు నా కండ్లు తెరుపుడు పడ్డాయి. నా ఆశావాదం తగ్గిపోయింది. ఖేడా సంగ్రామం జరిగినప్పుడు జనం తమ సొంత బండ్లను యిచ్చారు. ఒక్క వాలంటీరుతో పని జరిగేచోట నలుగురు వాలంటీర్లు పనిచేశారు. కాని యిప్పుడు డబ్బుయిచ్చినా బండి కట్టేవాళ్లు కనబడలేదు. అయితే మేము నిరాశపడే రకం కాదుగదా! బండ్లకు బదులు కాలినడకన తిరగాలని నిర్ణయించాం. రోజుకు 20 మైళ్లు నడవాల్సి వచ్చింది. బండిదొరకని చోట తిండి ఎలా దొరుకుతుంది? భోజనం పెట్టమని అడగటం మంచిది కాదుగదా! అందువల్ల ప్రతి వాలంటీరు బయలుదేరినప్పుడే ఆహారం వెంటతెచ్చుకోవాలని నిర్ణయించాం. వేసవికాలపురోజులు. అందువల్ల కప్పుకునేందుకు బట్టలు అవసరంలేదు. వెళ్లిన ప్రతి గ్రామంలో సభ జరిపాం. జనం వచ్చేవారు కాని ఇద్దరు ముగ్గురు మాత్రమే తమ పేరు నమోదు చేయించుకునేవారు. “మీరు అహింసావాదులు కదా! మమ్మల్ని ఆయుధాలు పట్టమని ఎలా చెబుతున్నారు? ప్రభుత్వం యీ దేశప్రజలకు ఏమి మేలు చేసింది? దానికి సాయం చేయమని మీరు ఎలా కోరుతున్నారు?” ఈరకమైన ప్రశ్నలు జనం వేయసాగారు.

ఇట్టి స్థితిలో కూడా మెల్లమెల్లగా పని చేశాం. పేర్లు బాగానే నమోదు కాసాగాయి. మొదటి బృందం బయలుదేరి వెళ్లితే రెండో బృందానికి మార్గం సుగమం అవుతుందని భావించాం. జనం ఎక్కువగా చేరితే వాళ్లను ఎక్కడ వుంచాలా అను విషయాన్ని గురించి కమీషనరుతో మాట్లాడాను. కమీషనరు కూడా ఢిల్లీ పద్ధతిలో సభలు జరుపుతున్నారు. గుజరాత్‌లో కూడా అట్టిసభ జరిగింది. అందు నన్ను నాఅనుచరులను పాల్గొనమని ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి సభలో పాల్గొన్నాను. ప్రతి మీటింగులోను పరిస్థితి మరో విధంగా వుంటూ వుంది. చిత్తం చిత్తం అను పద్ధతి ఎక్కువ కావడం వల్ల నేను అధికారుల మధ్య యిమడలేక పోయాను. సభలో నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. నా మాటల్లో ముఖస్తుతి అనునదిలేదు. రెండు కటువైన మాటలు కూడా అందు వున్నాయి. సైన్యంలో యువకుల్ని చేర్చుకునే విషయమై నేను ఒక కరపత్రం ప్రకటించాను. సైన్యంలో చేరే విషయమై వెలువరించిన విజ్ఞప్తిలో ఒక తర్కం వున్నది. అది కమీషనరుకు గుచ్చుకున్నది. “బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలు అపరిమితం. ప్రజలనందరినీ ఆయుధాలు లేకుండా చేసిన చట్టం దేశచరిత్రలో మాయనిమచ్చ అని చెప్పవచ్చు. చట్టాన్ని రద్దు చేయాలన్నా, ఆయుధాలను ప్రయోగించడం నేర్చుకోవాలన్నా ఇది మంచి తరుణం. రాజ్యం ఆపదలోవున్న సమయంలో మధ్య తరగతి ప్రజలు స్వచ్ఛందంగా సాయపడితే వారి మనస్సులో గల అపనమ్మకం తొలగిపోతుంది. ఆయుధాలు పట్టదలచినవారు సంతోషంగా పట్టవచ్చును” ఇది ఆ తర్కానికి సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమీషనరు మీకు మాకు మధ్య అభిప్రాయబేధం వున్నప్పటికీ సభలో మీరు పాల్గొనడం నాకు ఇష్టం అని అన్నాడు. అందుకు నేనుకూడా నా అభిప్రాయాన్ని తీయని మాటలతో సభలో సమర్ధించుకోవలసి వచ్చింది. వైస్రాయికి నేను పంపిన పత్రం యొక్క వివరం క్రింద ప్రకటిస్తున్నాను.

“యుద్ధ పరిషత్తులో పాల్గొనే విషయమై నాకు సంకోచం కలిగింది. కాని మిమ్ము కలసిన తరువాత ఆ సంకోచం తొలగిపోయింది. మీ యెడ నాకు గల అమిత ఆదరణ అందుకుగల ఒక పెద్దకారణం. ఆ సభలో పాల్గొనమని లోకమాన్యతిలక్ మిసెస్ బిసెంట్, ఆలీ సోదరులను మీరు ఆహ్వానించకపోవడం నా సంకోచానికి మరో పెద్ద కారణం. వారు గొప్ప ప్రజా నాయకులని నా విశ్వాసం. వారిని ఆహ్వానించకపోవడం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. యిక ముందు జరిపే ప్రాంతీయ సభలకు వారిని తప్పక ఆహ్వానించమని నా సలహా. ఇంతటి ప్రౌఢనాయకుల్ని అభిప్రాయభేదాలెన్ని వున్నప్పటికీ ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని నా నమ్రతతో కూడిన వినతి. అందువల్ల నేను సభ యొక్క కార్యనిర్వాహక సమితి సమావేశాల్లో పాల్గొనలేకపోయాను. సభలో తీర్మానాన్ని సమర్థించి తృప్తి పడ్డాను. ప్రభుత్వం నా సలహాను అంగీకరిస్తే నేను వెంటనే నా సమర్ధనకు కార్యరూపం ఇవ్వగలనని తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వపు భవిష్యత్తులో మేము భాగస్వాములమని విశ్వసిస్తున్నామో ఆ ప్రభుత్వం ఆపదలో వున్నప్పుడు దానికి పూర్తిగా మద్దతు అందించడం మా కర్తవ్యం. యిట్టి మద్దతు ద్వారా మేము మా లక్ష్యం వరకు త్వరగా చేరుకోగలమని ఆశిస్తున్నామని చెప్పడం ఈ సందర్భంలో అవసరమని భావిస్తున్నాను. మీరు మీ ఉపన్యాసంలో పేర్కొన్న మార్పుల్లో కాంగ్రెస్, ముస్లిమ్‌లీగు కోరుతున్న కోరికలు కూడా చోటు చేసుకుంటాయని విశ్వసించే హక్కు ప్రజలకు వున్నది. నావల్ల నెరవేరగల పరిస్థితి పుండివుంటే ఇటువంటి సమయంలో హోమ్ రూలు మొదలగు వాటి పేరు ఎత్తి వుండేవాణ్ణి కాదు. సామ్రాజ్యానికి సంభవించిన ఈ కష్టసమయంలో శక్తివంతులైన భారతీయులందరు దాని రక్షణార్థం మౌనంగా బలిదానం అయిపోవాలని ప్రోత్సహించేవాణ్ణి. ఈ విధంగా చేయడం వల్ల మేము సామ్రాజ్యంలో ఆదరణగల గొప్ప భాగస్వాములం అయివుండేవాళ్లం. వర్ణభేదం, దేశభేదం పటాపంచలైపోయేవి.

చదువుకున్న ప్రజలు యింతకంటే కొంచెం తక్కువ ప్రభావం కలిగించే మార్గం ఎన్నుకున్నారు. ప్రజాబాహుళ్యం మీద వారి ప్రభావం బాగా పడింది. భారతదేశం వచ్చినప్పటి నుండి సామాన్య ప్రజానీకంతో సంబంధం పెట్టుకున్నాను. వారి హృదయంలో కూడా హోంరూలును గురించిన ఆకాంక్ష నాటుకున్నదని మనవి చేయదలుచుకున్నాను. హోంరూలు లేకపోతే ప్రజానీకం సంతృప్తి చెందదు. హోంరూలు కోసం ఎంతటి త్యాగానికైనా ప్రజానీకం సిద్ధంగా వున్నది. రాజ్య రక్షణకు ఎంతమంది సైనికులైనా మేము యివ్వవలసిందే. కాని ఆర్థిక సాయం విషయమై నేను మాట యివ్వలేను. భారతదేశపు ప్రజానీకానికి యిది శక్తికి మించిన విషయం. ఇప్పటికి యిచ్చిందే చాలా ఎక్కువ. అయితే సభలో కొందరు చివరి శ్వాస వరకు సాయం చేయాలని నిర్ణయించారు. కాని అది మావల్ల కాని పని. మేము గద్దెల కోసం గాని మేడల కోసం గాని ఎగబడటం లేదు. మా సాయం భవిష్యత్తు మీద గల ఆశల పునాది మీద ఆధారపడియున్నది. ఆ ఆశలు స్పష్టంగా చెప్పడం అవసరమని భావిస్తున్నాను. నేను బేరసారాలకు దిగను. కానీ ఈ విషయమై మా హృదయాలలో నిరాశ నెలకొంటే మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యం మీద మాకు గల నమ్మకం అంతా నీరుగారిపోతుంది. గృహకల్లోలాలు మరిచిపొమ్మని అన్నారు. దానికి అర్థం అధికారుల ఆకృత్యాలను మరిచిపొమ్మనా? అలా అనుకుంటే అది సాధ్యం కాని పని. సుసంఘటితంగా సాగే దుర్మార్గాన్ని పూర్తి శక్తి సామర్ధ్యాలతో ఎదుర్కోవడం ధర్మమని నా భావం. అందువల్ల అధికారులకు దుర్మార్గాలు ఆపివేయమని, ప్రజాభిప్రాయాన్ని ఆదరించమని చెప్పండి. చంపారన్‌లో శతాబ్దాల తరబడి సాగుతున్న దుర్మార్గాన్ని ఎదుర్కొని బ్రిటిష్ వారి న్యాయవ్యవస్థ ఎంత గొప్పదో నిరూపించి చూపించాను. సత్యం కోసం కష్టాల్ని సహించగల శక్తి తమకు వున్నదని తెలుసుకున్న ఖేడా ప్రజలు వాస్తవానికి ప్రభుత్వ శక్తి ఒక శక్తి కాదని, ప్రజా శక్తియే నిజమైన శక్తియని గ్రహించారు. ఆ తరువాత అక్కడి ప్రజలు అప్పటివరకు తాము శపిస్తున్న ప్రభుత్వం శక్తి యెడ తమకు గల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని సహించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయదని విశ్వసించారు. అందువల్ల చంపారన్, ఖేడాలలో నేను జరిపిన చర్యలన్నీ యుద్ధానికి సహాయపడాయని భావిస్తున్నాను. యిటువంటి చర్యలు చేయవద్దని మీరు నన్ను కోరితే శ్వాస పీల్చవద్దని మీరు చెబుతున్నారని భావిస్తాను. ఆయుధ బలం కంటే ఆత్మ బలం, అనగా ప్రేమ బలం గొప్పదను భావం ప్రజల హృదయాలలో నేను నాటగలిగితే భారతదేశం మొత్తం ప్రపంచానికే తలమానికం కాగలదని భావిస్తున్నాను. అందువల్ల ప్రతివ్యక్తీ కష్టాలు దుఃఖాలు సహించగల శక్తిని అలవరచుకునే పద్ధతిన సనాతన విధానాన్ని జీవితంలో అనుసరించడం కోసం నా ఆత్మశక్తిని వినియోగిస్తాను. ఈ విధానాన్ని అనుసరించమని యితరులను కూడా ఆహ్వానిస్తూ వుంటాను. యితర వ్యవహారాలలో తలదూర్చడం యీ విధానం యొక్క గొప్పదనాన్ని రుజూచేసేందుకేనని మనవి చేస్తున్నాను.

ముస్లిం రాజ్యాల విషయమై గట్టిగా మాట యిమ్మని బ్రిటిష్ మంత్రి వర్గానికి మీరు వ్రాయండి. ప్రతి మహమ్మదీయుడు యీ విషయమై చింతిస్తున్నాడని మీరు గ్రహించండి. నేను హిందువును అయినా వారి భావాన్ని విస్మరించలేదు. వాళ్ల దుఃఖం మా దుఃఖమే. ముస్లిం రాజ్యాల హక్కుల రక్షణ కోసం, వారి ధార్మిక స్థలాల విషయంలో, వారి భావాల్ని ఆదరించే విషయంలో భారతదేశానికి హోమ్‌రూలు మొదలగు వాటిని అంగీకరించడం బ్రిటిష్ సామ్రాజ్యానికే క్షేమం కలిగిస్తుందని మనవి చేస్తున్నాను. ఇంగ్లీషు వారిలో గల విశ్వసనీయతను ప్రతి భారతీయుని హృదయంలో నెలకొల్పాలని కాంక్షిస్తున్నాను.