సత్యశోధన/ఐదవభాగం/26. సమైక్యత
26. సమైక్యత
ఖేడా వ్యవహారం సాగుతూ వున్నప్పుడు యూరపులో మహాయుద్ధం జరుగుతూవున్నది. యిందుకోసం ఒక సమావేశం ఏర్పాటుచేసి వైస్రాయి ఢిల్లీకి నాయకుల్ని ఆహ్వానించారు. లార్డ్‌చేమ్స్‌ఫర్డ్‌తో నాకు సత్సంబంధం ఏర్పడిందని ముందే వ్రాశాను. కాని ఆ సభలో ఎలా పాల్గొనడం? నాకు ఒక సంకోచం కలిగింది. యీ సభకు ఆలీ సోదరులను, లోకమాన్య తిలక్‌ను మరియు యింకా కొంతమంది నాయకుల్ని ఆహ్వానించలేదు. అదే నా సంకోచానికి కారణం. అప్పుడు ఆలీ సోదరులు జైల్లో వున్నారు. వారిని ఒకటి రెండు సార్లే కలిసాను. వారిని గురించి చాలా విన్నాను. వారి సేవానిరతిని గురించి వారి ధైర్యసాహసాలను గురించి అంతా పొగడటం గమనించాను. హకీం (క్రీ.శ. హకీం అజమల్ ఖాన్) గారితో ప్రత్యక్ష పరిచయం నాకు లేదు. వారి గొప్పతనాన్ని గురించి కీ.శే. రుద్ర్ మరియు దీనబంధు ఆండ్రూస్‌గారల నోట విన్నాను. కలకత్తాలో ముస్లిం లీగు సమావేశం జరిగినప్పుడు కురేషీ, బారిస్టర్ ఖ్వాజాగారిని కలుసుకున్నాను. డా. అన్సారీగారిని, డా. అబ్దుల్ రహమాన్ గారలను కూడా కలిశాను. ముస్లిం పెద్దమనుషుల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ వున్నాను. దేశభక్తులు, పవిత్రులునగు వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. వారు పిలిచిన చోటుకు సందేహించకుండా వెళుతున్నాను.
హిందువులు మహ్మదీయుల మధ్య ఐక్యతలేదని దక్షిణ ఆఫ్రికాలో వున్నప్పుడే గ్రహించాను. ఇరువురి మధ్య గల వివాదాల్ని తొలగించేందుకు అవకాశం చిక్కినప్పుడల్లా గట్టిగా ప్రయత్నిస్తూ వున్నాను. అబద్ధాల పొగడ్తలతో, ఆత్మాభిమానం చంపుకొని ఒకరిని సంతోష పెట్టడం నాకు గిట్టదు. నా అహింసా విధానం వీరిరువురి మధ్య సామరస్యం చేకూర్చునప్పుడు పరీక్షకు గురి అవుతుందని భావించాను. యిప్పటికీ నా అభిప్రాయం అదే. భగవంతుడు ప్రతిక్షణం నన్ను పరిశీలిస్తున్నాడు. నా సత్యశోధన సాగుతూనే వున్నది.
ఇట్టి భావాలతో నేను బొంబాయి రేవులో దిగాను. ఆలీ సోదరులను కలుసుకొని ఎంతో సంతోషించాను. మా స్నేహం పెరుగుతూ వున్నది. మాకు పరిచయం కలిగిన తరువాత ప్రభుత్వంవారు ఆలీ సోదరులను జీవించివుండగనే నిర్జీవులా అన్నంత పని చేశారు. జైలు అధికారుల అనుమతితో మౌలానా మహమ్మద్ ఆలీ పెద్ద పెద్ద ఉత్తరాలు బైతూల్ జైలునుండి, లేక చిందవాడా నుండి నాకు వ్రాస్తూ వుండేవారు. నేను వారిని కలుస్తానని వ్రాసి అనుమతి కోరాను. నాకు అనుమతి లభించలేదు. ఆలీ సోదరులు నిర్బంధించబడిన తరువాత కలకత్తాలో జరిగిన ముస్లింలీగు సమావేశానికి నన్ను ముస్లిం సోదరులు తీసుకు వెళ్లారు. అక్కడ మాట్లాడమని నన్ను కోరారు. అలీ సోదరులను విడిపించడం ముస్లిం సోదరుల కర్తవ్యమని అక్కడ చెప్పాను.
తరువాత వాళ్లు నన్ను ఆలీగఢ్ కాలేజీకి తీసుకువెళ్లారు. అక్కడ ముస్లిం సోదరులను దేశం కోసం ఫకీర్లు కమ్మని ఆహ్వానించాను. ఆలీ సోదరుల విడుదలకై ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు ప్రారంభించాను. యీ సందర్భంలో ఆలీ సోదరుల ఖిలాఫత్ ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేశాను. ముస్లిం సోదరులతో చర్చించాను. ముస్లిములకు నిజమైన సోదరునిగా రూపొందదలిస్తే ఆలీ సోదరులను విడుదల చేయించాలని, ఖిలాఫత్ ఉద్యమం న్యాయబద్ధంగా సఫలం కావడానికి కృషి చేయాలని భావించాను.
ఖిలాఫత్ నాకు సులువైన వ్యవహారమే. అందు స్వతంత్రించి గుణదోషాలు చూడవలసిన అవసరంలేదు. ముస్లిం సోదరుల కోరిక నీతి విరుద్ధం కాకపోతే వారికి సాయం చేయాలని భావించాను. మత విషయంలో శ్రద్ధకు మహత్తరమైన స్థానం వుంటుంది. అందరి శ్రద్ధ ఒకే వస్తువు యెడ, ఒకే విధంగా వుండి వుంటే ప్రపంచంలో ఒకే మతం వుండివుండేది. ఖిలాఫత్‌కు సంబంధించిన కోరిక నాకు నీతి విరుద్ధమని అనిపించలేదు. యీ కోరికను బ్రిటిష్ ప్రధానమంత్రి లాయడ్‌జార్జి అంగీకరించాడు కూడా. ఆయన అంగీకారాన్ని ఆచరణలో పెట్టించడమే నా కర్తవ్యమని భావించాను. అయన మాటలు స్పష్టంగా వున్నాయి. యిక గుణదోషాల్ని గురించి యోచించడం ఆత్మ తృప్తి కోసమేనని తేల్చుకున్నాను.
ఖిలాఫత్ వ్యవహారంలో నేను ముస్లిం సోదరులను సమర్థించాను. దానితో మిత్రులు, కొందరు విమర్శకులు నన్ను తీవ్రంగా విమర్శించారు. వారి విమర్శలను పరిశీలించి చూచిన తరువాత కూడా నేను చేసింది సరియైన పనియేనని నిర్ణయానికి వచ్చాను. ఈనాడు కూడ అటువంటి సమస్య వస్తే నా నిర్ణయం అలాగే వుంటుందని చెప్పగలను. ఈ భావాలతో నేను ఢిల్లీకి వెళ్లాను. మహమ్మదీయుల బాధను గురించి వైస్రాయితో మాట్లాడవలసి వున్నది. అప్పటికి యింకా ఖిలాఫత్ ఉద్యమం పూర్తి రూపు దాల్చలేదు.
ఢిల్లీ చేరగానే దీనబంధు ఆండ్రూస్ ఒక నైతిక ప్రశ్న లేవదీశారు. ఆంగ్లపత్రికల్లో ఇటలీ, ఇంగ్లాండుల మధ్య రహస్య ఒడంబడిక జరిగినట్లు వెలువడిన వార్తలు చూపించి అట్టి స్థితిలో మీరు యీ సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఆ ఒడంబడికను గురించి నాకు ఏమీ తెలియదు. దీనబంధు మాటలు నాకు చాలు. దానితో మీ సమావేశంలో పాల్గొనుటకు నేను సంకోచిస్తున్నానని లార్డ్ చేమ్స్‌ఫర్డుకు జాబు వ్రాశాను. చర్చలకు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించారు. వారితోను, మి. మేఫీతోను విస్తృతంగా చర్చించాను. చివరికి సమావేశంలో పాల్గొనుటకు నిర్ణయించుకున్నాను. “బ్రిటిష్ మంత్రివర్గం చేసిన నిర్ణయం వైస్రాయికి తెలియవలసిన అవసరం లేదు గదా? ప్రభుత్వం ఎన్నడూ తప్పుచేయదని నేను చెప్పలేను. ఎవరైనా పొరపాటు చేయవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వపు ఉనికి ప్రపంచ మనుగడకు మేలు కలిగిస్తుందని, దాని కృషివల్ల ఈ దేశానికి సామూహికంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తే ఆపద సమయంలో దానికి సాయపడటం ప్రతిపౌరుని కర్తవ్యమని మీరు భావించరా? రహస్య ఒడంబడికను గురించి పత్రికల్లో మీరు చూచినట్లే నేను చూచాను. అంతకంటే మించి నాకేమీ తెలియదు. మీరు నామాట నమ్మండి. పత్రికల్లో ఏదో తలాతోక లేని వార్త వెలువడినందున మీరు యిలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకరించడం విరమిస్తారా? యుద్ధం ముగిసిన తరువాత మీ యిష్టం వచ్చినన్ని నైతిక ప్రశ్నలు చేయవచ్చు, యిష్టం వచ్చినట్లు చర్చలు జరపవచ్చు” యిదీ వైస్రాయి లార్డ్ చేమ్స్‌ఫర్డు మాటల సారాంశం.
ఈ తర్కం క్రొత్తది కాదు. అయితే సమయం, విధానం రెండిటి దృష్ట్యా కొత్తదనిపించింది. నేను సమావేశంలో పాల్గొనుటకు అంగీకరించాను. ఖిలాఫత్ విషయమై వైస్రాయికి నేను జాబు వ్రాయాలని నిర్ణయం జరిగింది.