సత్యశోధన/ఐదవభాగం/23. ఖేడా సత్యాగ్రహం

వికీసోర్స్ నుండి

23. ఖేడా సత్యాగ్రహం

కార్మికుల సమ్మె ముగిసింది. యిక నాకు ఒక్క నిమిషమైనా తీరిక చిక్కలేదు. వెంటనే ఖేడా జిల్లాలో సత్యాగ్రహం ప్రారంభించవలసి వచ్చింది. ఖేడా జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడినందున పన్నుల వసూళ్లు రద్దు చేయమని అక్కడ రైతులు కోరుతున్నారు. యీ విషయం శ్రీ అమృతలాల్ ఠక్కర్ పరిశీలించి రిపోర్టు యిచ్చారు. నేను వెళ్లి కమీషనరును కలిశాను. శ్రీ మోహనలాల్ పాండ్యా, శ్రీ శంకర్‌లాల్ పారిఖ్, శ్రీ విఠ్ఠల్‌భాయి పటేల్ ల ద్వారా వాళ్లు కౌన్సిలులో ఉద్యమం సాగిస్తున్నారు. ప్రభుత్వం దగ్గరికి రాయబారాలు చాలాసార్లు సాగించారు.

అప్పుడు నేను గుజరాత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుణ్ణి. కాంగ్రెస్ పక్షాన కమీషనరుకు, గవర్నరుకు ప్రార్ధనా పత్రాలు పంపాను. టెలిగ్రాములు యిచ్చాను. అవమానాలు సహించాను. వాళ్ల బెదిరింపుల్ని మ్రింగాను. ఆనాడు అధికారులు వ్యవహరించిన తీరును యీనాడు తలచుకుంటే హాస్యాస్పదంగా వుంటుంది.

ప్రజల కోరిక న్యాయం, సమంజసం. దాన్ని అంగీకరింప చేయడం కోసం నిజానికి ఉద్యమం అనవసరం. ప్రభుత్వ నియమం ప్రకారం రూపాయికి నాలుగు అణాలకు పంట తక్కువగా పండితే పన్నుల వసూళ్లు వెంటనే ఆపివేయాలి. కాని అక్కడి ఆఫీసర్ల అంచనా ప్రకారం రాబడి నాలుగు అణాలకు పైగా వున్నది. ప్రజలు అది తప్పని రుజువు చేయసాగారు. కాని ప్రభుత్వం అంగీకరిస్తుందా? పంచాయతీ పెద్దల్ని నియమించి నిర్ణయించమని ప్రజలు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. ఎన్నో పర్యాయాలు ప్రార్ధనా పత్రాలు పంపి విసిగి వేసారి అనుచరులతో చర్చలు జరిపి చివరికి సత్యాగ్రహం ప్రారంభించారు. వారిలో ఖేడా జిల్లా సేవకులే కాక ప్రత్యేకించి శ్రీ వల్లభ భాయి పటేల్, శ్రీ శంకర్ లాల్ బాంకరు, శ్రీ అనసూయా బెన్, శ్రీ ఇందూలాల్ యాజ్ఞిక్, శ్రీ మహాదేవ దేశాయి మొదలుగా గలవారు కూడా వున్నారు. వల్లభభాయి ముమ్మరంగా సాగుతున్న వకీలు వృత్తి మానుకొని వచ్చారు. ఆ తరువాత వారు వకీలు వృత్తి సాగించలేకపోయారు.

మేము నడియాద్ అనాధాశ్రమంలో మకాం బెట్టాం. అందుకు ప్రత్యేకించిన కారణం ఏమీ లేదు. నడియాద్ లో యింత మంది వుండటానికి మరో ఖాళీగృహం దొరకలేదు. అక్కడి జనం చేత క్రింద తెలిపిన మతలబు వ్రాసిన పత్రం మీద సంతకాలు చేయించి తీసుకున్నాం. “మా గ్రామంలో పంట రాబడి రూపాయికి నాలుగు అణాల కంటే తక్కువని మాకు తెలుసు. ఆందువల్ల పన్నుల వసూళ్లు ఒక సంవత్సరం వరకు ఆపమని ప్రార్ధించాం. కాని పన్నుల వసూళ్లు ఆపలేదు. అందువల్ల యీ పత్రం మీద సంతకం చేసిన మేము యీ ఏడు పన్నులు చెల్లించలేమని మనవి చేస్తున్నాం. పన్నుల వసూళ్లకు పూనుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేము వ్యతిరేకించం. ఎన్ని కష్టాలైనా సహిస్తాం. మా పొలాలు జప్తు చేసినా ఊరుకుంటాం. మా చేతులతో పన్నులు చెల్లించి అబద్ధాల కోరులం అయి ఆత్మాభిమానం చంపుకోము. ప్రభుత్వం పన్నుల వసూళ్ళు అన్ని చోట్ల ఆపి వేస్తే మాలోశక్తి కలిగిన వాళ్లం పూర్తిగానో లేక కొంత భాగమో తప్పక చెల్లిస్తామని మాట యివ్వలేము. మాలో శక్తిగలవారం పన్నులు చెల్లించి వేస్తే, శక్తి లేనివారు భయపడి తమ కొంపాగోడూ తెగనమ్మి పన్నులు చెల్లించి నానా యాతనలు పడతారు. అందువల్ల శక్తిగలవారం కూడా పన్ను చెల్లించం. యిలా చెల్లించకపోవడం శక్తివంతుల కర్తవ్యమని భావిస్తున్నాము.

ఈ పోరాట వివరాలు తెలుపుటకు ప్రకరణాన్ని పొడిగించదలుచుకోలేదు అందువల్ల యిందుకు సంబంధించిన మధురస్మృతులు అనేకం యిక్కడ వివరించడం లేదు. మహత్తరమైన ఖేడా సత్యాగ్రహ పోరాట చరిత్రను వివరంగా తెలుసుకోవాలని భావించినవారు శ్రీ శంకర్ లాల్ పారిఖ్ వ్రాసిన ఖేడా పోరాట విస్తృత ప్రామాణిక చరిత్ర అను పుస్తకం చదవమని సిఫారసు చేస్తున్నాను.