సత్యశోధన/ఐదవభాగం/22. ఉపవాసం

వికీసోర్స్ నుండి

22. ఉపవాసం

కార్మికులు మొదటి రెండువారాలు ధైర్యంగాను శాంతంగాను వున్నారు. రోజూ జరిగే సభకు వస్తూ వున్నారు. నేను రోజూ వారికి వారు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేస్తూ వున్నాను. మేము ప్రాణమైనా వదులుతాం, ప్రతిజ్ఞను మాత్రం నెరవేరుస్తాం అని బిగ్గరగా అరుస్తూ వున్నారు. కాని చివరికి వారు జారిపోతున్నారని అనిపించింది. మిల్లులోకి వెళుతున్న కార్మికులను చూచి వాళ్లు హింసకు దిగారు. ఎవరిమీదనైనా చెయ్యి చేసుకుంటారేమోనని భయం కలిగింది. రోజూ సభకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొద్దిమంది వచ్చినా నిరుత్సాహంతో వుండేవారు. కార్మికుల్లో స్థిరత్వం తగ్గిందని తెలిసి విచారించాను. దక్షిణాఫ్రికాలో కార్మికుల సమ్మెకు సంబంధించిన అనుభవం నాకున్నది. కాని యిక్కడ క్రొత్త అనుభవం కలిగింది. రోజూ ప్రతిజ్ఞ చేయిస్తూ సాక్షిగా వున్న నా ఎదుటే యిలా జరిగితే నేనేం చేయాలా అని ఆలోచించాను. యిది నాకు కలిగిన అభిమానం అనుకున్నా సరే, కార్మికుల యెడ, సత్యం యెడ నాకు గల ప్రేమ అనుకున్నా సరే తీవ్రంగా యోచించాను.

ఉదయం సభ ప్రారంభమైంది. ఏం చేయాలో తోచలేదు. స్థిరంగా ధైర్యంగా వుండక పోతే సమస్య పరిష్కారం కాకపోతే అంతవరకు నేను ఉపవాసం చేస్తాను అని ప్రకటించివేశాను. కార్మికులు నివ్వెరపోయారు. అనసూయాబెన్ కండ్లనుండి నీరు కారింది. మీరు ఉపవాసం చేయొద్దు. మేము చేస్తాం. ప్రతిజ్ఞ మీద నిలబడివుంటాం క్షమించండి అని కార్మికులు అన్నారు. మీరు ఉపవాసం చేయనవసరంలేదు. మీరు మీ ప్రతిజ్ఞ నెరవేర్చండి చాలు. మా దగ్గర డబ్బులేదు. అయినా కార్మికులకు బిచ్చం తినిపించి సమ్మె చేయించడం నాకు యిష్టంలేదు. మీరు కాయకష్టం చేసి పొట్టపోసుకోండి. ఎన్నాళ్లు సాగినా సరే నిశ్చింతగా సమ్మె చేయండి. నిర్ణయం జరగనంతవరకు నా ఉపవాసం సాగుతుంది అని చెప్పివేశాను. వల్లభభాయి కార్మికులకు మునిసిపాలిటీలో పని యిప్పించాలని ప్రయత్నించారు. కాని ప్రయోజనం కలుగలేదు. ఆశ్రమంలో నేత గృహం దగ్గర గల గొయ్యిని పూడ్చాలి. కార్మికులను అందుకు వినియోగించవచ్చునని మగన్‌లాలు సలహాయిచ్చారు. అందుకు కార్మికులు అంగీకరించారు. అనసూయాబెన్ ఇసుకతో నిండిన మొదటి తట్టను నెత్తికి ఎత్తుకున్నది. నది నుండి ఇసుక తట్టలను ఎత్తుకు వచ్చి గొయ్యిపూడ్చడానికి కార్మికులు పూనుకున్నారు. చూసేందుకు ఆ దృశ్యం ముచ్చటగా వున్నది. కార్మికులకు నూతనోత్తేజం కలిగింది. వారికి మజూరీ చెల్లించిన ఆశ్రమం వారికి నిజంగా అలసట కలిగిందని చెప్పవచ్చు. పని ముమ్మరంగా సాగింది. అయితే నా యీ ఉపవాసంలో ఒక దోషం వున్నది.

యజమానులతో నాకు మధుర సంబంధం వున్నదని మొదటనే వ్రాశాను. అందువల్ల నా ఉపవాసం వారిని కదిలించి తీరుతుంది. ఒక సత్యాగ్రహిగా యజమానులకు వ్యతిరేకంగా నేను ఉపవాసం చేయకూడదు. నిజానికి కార్మికుల సమ్మె ప్రభావం మాత్రమే వాళ్ళ మీద పడాలి. నేను పూనుకున్న ప్రాయశ్చిత్తం యజమానులు చేసిన దోషానికి సంబంధించినది కాదు. కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ వున్నందున వాళ్ల దోషాలకు నేను బాధ్యుణ్ణే. యజమానులను ప్రార్ధించగలను. వారికి వ్యతిరేకంగా ఉపవాసం చేయటం వారిని ఘెరావు చేయడమే అయినా నా ఉపవాస ప్రభావం యజమానుల మీద పడుతుందని నాకు తెలుసు. పడింది కూడా. కాని నా ఉపవాసాన్ని వారెవరూ ఆపలేని పరిస్థితి ఏర్పడింది.

దోషభూయిష్టమైన ఉపవాసం చేస్తున్నానని నేను గ్రహించాను. నా ఉపవాసం వల్ల మీరు మీ మార్గాన్ని వదలవద్దని నేను యజమానులకు చెప్పాను. వాళ్లు కటువుగాను, తియ్యగాను, నన్ను ఎన్నో మాటలు అన్నారు. అట్టి హక్కు వారికి వుంది. సేఠ్ అంబాలాలు యీ సమ్మెకు వ్యతిరేకంగా యాజమాన్యానికి నాయకత్వం వహించాడు. ఆయన గుండెదిటవు చూచి ఆశ్చర్యం కలిగింది. ఆయన నిష్కపటి కూడా. ఆయనతో వివాదపడటం నాకు యిష్టం. అయినా ఉపవాస ప్రభావం ఆయన మీద పడకుండా వుండటం సాధ్యమా? మరో రూపంలో ఆయన మీద వత్తిడి తీసుకురావడమేగదా! ఆయన భార్య సరళాదేవీ నన్ను సొంత సోదురునిగా చూసుకుంటుంది. ఆమెకు నా యెడ అమిత అనురాగం. నేను ఉపవాసం చేస్తుంటే ఆ దంపతులకు కలిగే బాధ నాకు తెలుసు.

ఉపవాస సమయంలో అనసూయాబెన్, యితర మిత్రులు, కార్మికులు నాతో బాటు ఉపవాసం చేశారు. వారిని నేను వారించాను. కాని వింటారా? యి విధంగా వాతావరణం ప్రేమతో నిండిపోయింది. యజమానులు దయాభావంతో రాజీపడేందుకు సిద్ధపడ్డారు. అనసూయాబెన్‌తో వారి చర్చలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనందశంకర్ ధ్రువగారు కూడా రంగంలోకి దిగారు. చివరికి వారినే పెద్దగా నిర్ణయించారు. సమ్మె విరమణ జరిగింది. మూడురోజులు మాత్రం నేను ఉపవాసం చేయవలసి వచ్చింది. యజమానులు కార్మికులకు మిఠాయిలు పంచారు. 21వ రోజున ఒడంబడిక కుదిరింది. ఒక ఉత్సవం జరిపారు. అందు యజమానులు, కమీషనరు కూడా పాల్గొన్నారు. మీరు గాంధీ చెప్పిన ప్రకారం నడుచుకోండి అని కమీషనరు వారికి చెప్పాడు. ఆ కమీషనరుతోనే జగడం పెట్టుకోవలసి వచ్చింది. అతడూ మారాడు. ఖేడాలో పార్టీవాళ్లను నా మాట వినవద్దని అతడే చెప్పాడు.

ఒక కరుణాజనకమైన విషయం యిక్కడ పేర్కొనడం అవసరమని భావిస్తున్నాను. యజమానులు తయారుచేయించిన మిఠాయిలు ఎక్కువగా వున్నందున వేలాదిమంది కార్మికులకు వాటిని ఎలా పంచాలా అని మీమాంస బయలుదేరింది. ఏ చెట్టు క్రింద కార్మికులు ప్రతిజ్ఞ చేశారో, అక్కడ 21 రోజులు నియమాన్ని పాటించిన కార్మికులంతా వరుసగా క్యూలో నిలబడి మిఠాయి తీసుకోవాలన్న నిర్ణయాన్ని అమాయకంగా నేను ఒప్పుకున్నాను. కార్మికులు ఒక్కుమ్మడిగా మిఠాయిల మీద విరుచుకుపడకుండా పంపిణీ జరుగుతుందని భావించాను. కాని పంపిణీ సరిగా జరగలేదు. రెండు మూడు నిమిషాలకే వరుసక్రమం పోయింది. కార్మిక నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం కలుగలేదు. కార్మికులు తండాలు తండాలుగా విరుచుకుపడినందువల్ల కొంత మిఠాయి పాడైపోయింది. మిగిలిన మిఠాయి జాగ్రత్తగా సేఠ్ మిర్జాపూర్‌లోగల అంబాలాల్ గారి బంగాళాకు చేర్చారు. మరునాడు ఆ బంగాళా మైదానంలో మిఠాయి పంచవలసి వచ్చింది. చెట్టు దగ్గర మిఠాయి పంచుతున్నారని విని అహమదాబాదులో గల బిచ్చగాళ్లంతా వచ్చి మిఠాయి కోసం విరుచుకు పడినందున ఏర్పాట్లన్నీ చెల్లాచెదురయ్యాయని తరువాత తెలిసింది. ఇందు కరుణరసం ఇమిడి వున్నది.

ఆకలి అను రోగంతో బాధపడుతున్న దేశం మనది. తత్ఫలితంగా దేశంలో బిచ్చగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. భోజనం దొరుకుతుంది అంటే అన్నార్తులు నియమాల్ని, నిబంధనల్ని పాటించవలసిన విధుల్ని మరిచిపోతారు. ధనవంతులు యిట్టి బిచ్చగాళ్లకు పని అప్పగించకుండా వాళ్లకు బిచ్చం యిచ్చి వాళ్ల సంఖ్యను బాగా పెంచుతున్నారు.