సత్యశోధన/ఐదవభాగం/24. ఉల్లిపాయల దొంగ

వికీసోర్స్ నుండి

24. ఉల్లిపాయల దొంగ

చంపారన్ భారతావనియందు ఒక మూల వున్నది. అక్కడ సాగిన పోరాటం పత్రికలకు ఎక్కలేదు. అక్కడి పరిస్థితుల్ని చూచేందుకై బయటివారు రాకుండా ప్రభుత్వం చర్య గైకొన్నది. అయినా ఖేడా సత్యాగ్రహాన్ని గురించి పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. గుజరాతీ వారికి ఈ విషయం తెలిసింది. వారు శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. వాళ్లు ఎంత డబ్బు అయినా సరే యివ్వడానికి సిద్ధపడ్డారు. కాని ఈ పోరాటం కేవలం డబ్బుతో నడవదు. డబ్బు అవసరం బహు తక్కువేనని ఎంత చెప్పినా వారికి బోధపడలేదు. వద్దని ఎంత చెప్పినా వినకుండా బొంబాయి పౌరులు చాలా ధనం ఇచ్చి వెళ్లారు. అవసరాన్ని మించి ధనం ఇచ్చినందున పోరాటం ముగిసిన తరువాత కొద్దిగా ధనం మిగిలింది. సత్యాగ్రహులనే సైనికులు సాదా జీవనం నేర్చుకోవలసిన అవసరం వున్నది. వారు పూర్తిగా పాఠం నేర్చుకున్నారని చెప్పలేను, కానీ చాలావరకు తమ జీవనంలో మార్పు తెచ్చుకున్నారని మాత్రం చెప్పగలను.

అక్కడి రైతులు మొదలగు వారికి కూడా పోరాటం క్రొత్తదే. ఊరూరా తిరిగి యీ పోరాటం గురించి ప్రచారం చేయవలసి వచ్చింది. అధికారులు ప్రజల యజమానులు కారు. వారు సేవకులు. ప్రజలిచ్చే డబ్బునే వాళ్లు జీతాలుగా తీసుకుంటున్నారు అని చెప్పి అధికారులంటే గల భయం పోగొట్టవలసిన అవసరం ఏర్పడింది. నిర్భయంతోబాటు వినమ్రతకూడా వాళ్లకు నేర్పవలసి వచ్చింది. ఇది చాలా కష్టమైన పని. భయం పోయిన తరువాత అధికారులు చేసిన అవమానాలకు, వాళ్లు పెట్టిన కష్టాలకు పగతీర్చుకోవద్దంటే జనం ఊరుకుంటారా? కాని అది సత్యాగ్రహి లక్షణం కాదు. పాలలో విషం కలపడమేకదా? అక్కడి జనం వినమ్రతా పాఠం అర్థం చేసుకోలేదను విషయం ఆ తరువాత తెలుసుకున్నాను. వినయం సత్యాగ్రహికి వుండవలసిన ప్రధాన గుణమని అనుభవంవల్ల తెలుసుకున్నాను. వినయమంటే మాటల్లోనేకాక, వ్యతిరేకులను కూడా ఆదరించాలి. సరళస్వభావం కలిగివుండాలి. అందరి మంచిని కాంక్షించి వ్యవహరించాలి. ఆరంభంలో ప్రజల్లో ధైర్యం అమితంగా కనబడింది. ప్రారంభంలో ప్రభుత్వం కూడా మెత్తగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం పెరిగి వాళ్లకు ధైర్యం వచ్చిన కొద్ది ప్రభుత్వం యొక్క కరుకుదనం కూడా అమితంగా పెరిగిపోయింది. జప్తు చేసేవాళ్లు రైతుల పశువుల్ని అమ్మివేశారు. ఇళ్లలో దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. భూములను గురించి కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పండిన పంటల్ని పూర్తిగా జప్తు చేశారు. దానితో జనం భయపడ్డారు. చాలామంది పన్ను చెల్లించి వేశారు. కొంత మంది అధికారులు వచ్చి జప్తు చేయాలని పొంచివున్నారు. అక్కడి జనంలో చివరి శ్వాస వరకు పోరాటం సాగించినవారు కొందరున్నారు. ఈ లోపున శ్రీ శంకర్ లాల్ పారిఖ్ గారి పొలానికి చెల్లించవలసిన పన్ను, అక్కడ పని చేస్తున్న వాడు చెల్లించివేశారు. దానితో గందరగోళం జరిగింది. వెంటనే శంకరలాల్ తన భూమినంతటిని జనానికి దానం చేసి తన మనిషి చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దానితో ఆయన ప్రతిష్ఠ ఇనుమడించింది. అది యితరులకు మంచి ఉదాహరణ అయింది.

తప్పుగా జప్తు చేయబడిన ఒక పొలంలో ఉల్లిగడ్డల పంటవున్నది. భయపడిన జనానికి ధైర్యం కలిగించాలనే భావంతో నేను మోహన్ లాల్ పాండ్యాగారి నాయకత్వాన ఉల్లిగడ్డల్ని పెకిలించమని చెప్పాను. నా దృష్టిలో అది చట్టాన్ని వ్యతిరేకించడం కాదు. చెల్లించవలసిన కొద్దిపన్ను కోసం పంటనంతటినీ జప్తు చేస్తున్నారు. అది మరీ నీతి బాహ్యమైన చర్య. బహిరంగంగా చేస్తున్న దోపిడీయే. అందువల్ల యిటువంటి జప్తుల్ని ఎండగట్టడం అవసరమని చెప్పాను. ఆ విధంగా చేసినందుకు జైలుకు పంపుతారు, సిద్ధపడాలి అని కూడా చెప్పాను. మోహన్ లాల్ పాండ్యా అందుకు సిద్ధపడ్డాడు. కష్టాలు పడకుండా వ్యతిరేకతను ఎదుర్కోకుండా సత్యాగ్రహం విజయం సాధించడం ఆయనకు యిష్టంలేదు. పొలంలో వున్న ఉల్లిగడ్డల్ని పెకిలించేందుకు సిద్ధపడ్డాడు. ఏడెనిమిదిమంది ఆయనకు సాయం చేశారు. ప్రభుత్వం వారిని పట్టుకోకుండా ఎలా వూరుకుంటుంది? పాండ్యాను, ఆయన అనుచరులను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకున్నది. దానితో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. జైళ్లకు వెళ్లడానికి జనం సిద్ధపడినప్పుడు రాజదండనకు ఎవ్వరూ భయపడరు. ఆ కేసు విచారణను చూచేందుకు జనం విరుచుకుపడ్డారు. పాండ్యాకు, వారి అనుచరులకు కొద్దిగా కారాగార శిక్ష విధించబడింది. కోర్టు వారిచ్చిన తీర్పు తప్పులతడక. అసలు ఉల్లిగడ్డల పెకిలింపు దొంగతనం క్రిందకు రాదు. అయినా అప్పీలు చేయాలని తలంపు ఎవ్వరికీ కలుగలేదు. జైలుకు వెళుతున్నవారిని సాగనంపుటకు ఉల్లిపాయల దొంగ అను గౌరవం ప్రజల పక్షాన పాండ్యా పొందాడు. యిప్పటికీ ఆయన ఆ శబ్దాన్ని తన పేరుతో బాటు ఉపయోగిస్తూ వున్నాడు.

ఈ పోరాటం ఎలా ముగిసిందో వివరించి ఖేడా ప్రకరణం ముగించివేస్తాను.