సత్యశోధన/ఐదవభాగం/15. కేసు ఉపసంహరణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

15. కేసు ఉపసంహరణ

నా మీద కేసు నడిచింది. గవర్నమెంటు వకీలు, మరియు మేజిస్ట్రేటు కంగారుపడ్డారు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. గవర్నమెంటు వకీలు విచారణను వాయిదా వేయమని ప్రార్ధించాడు. నేను చంపారన్ వదిలివెళ్లమని యిచ్చిన నోటీసుని ఖాతరు చేయలేదు. అపరాధం అంగీకరిస్తున్నాను అని అంటూ నేను వ్రాసుకొచ్చిన క్రింది పాఠాన్ని కోర్టులో చదివి వినిపించాను

“చట్టప్రకారం సెక్షను 144 క్రింద విధించబడ్డ ఆదేశాన్ని ఉల్లంఘించవలసి వచ్చిన కారణాల్ని మీ అనుమతితో క్లుప్తంగా వివరించదలచుకున్నాను. అది నిరాదరణకు సూచకం కాదని మనవి చేస్తున్నాను. యిక్కడి ప్రభుత్వానికి నాకు మధ్య గల అభిప్రాయ భేదమే ఇందుకు కారణం. ప్రజాసేవ ద్వారానే దేశ సేవ చేయడానికి నేను యిక్కడికి వచ్చాను. ఇక్కడి రైతులను యజమానులు సరిగా చూడటం లేదు. అందు నిమిత్తం నన్ను గట్టిగా కోరినందున వారి స్థితిని చూచి సరిచేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చాను. నా రాకవలన శాంతి భంగం వాటిల్లుతుందని గాని, రక్తపాతం జరుగుతుందనిగాని నేను భావించడం లేదు. యిట్టి విషయాలలో నాకు మంచి అనుభవం వున్నదని మనవి చేస్తున్నాను. కాని గవర్నమెంటు మరో విధంగా తలుస్తున్నది. ప్రభుత్వానికి గల యిబ్బంది కూడా నేనెరుగుదును. తనకు అందిన సమాచారం మీదనే ప్రభుత్వ ఆధారపడవలసి వస్తుంది. నేను ప్రజాహితం చేస్తూ అందుకు సంబంధించిన చట్టాల్ని ఆమోదించి ఆ ప్రకారం నడుచుకోవాలని భావించేవాణ్ణి. కాని నాకిచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని పాటించితే ప్రజలకు నేను న్యాయం చేయలేనని భావిస్తున్నాను. వారి మధ్యన వుండి మాత్రమే నేను యిక్కడి ప్రజలకు సేవ చేయగలనని నమ్ముతున్నాను. అందువల్ల నేను యిప్పుడు చంపారన్ విడిచి వెళ్లలేను. నాకిది ధర్మసంకటం. అందువల్ల చంపారన్ వదిలి వెళ్లమని ప్రభుత్వం యిచ్చిన ఆ దేశపు బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను.” “భారతదేశంలో ప్రజాజీవనమునందు నా వంటి గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తి ఒక చర్యకు పూనుకొన్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసియున్నదని నాకు తెలుసును. కాని నాకు యిక్కడ కల్పించబడిన పరిస్థితిని ఆత్మాభిమానం గల వ్యక్తి ఎవ్వడూ అంగీకరించలేడని చెప్పవలసిన అవసరం కలగడం దురదృష్టకరం. ప్రభుత్వ స్థానిక అధికారుల ఆదేశం కంటే, నా అంతర్వాణి పెద్దదని, దాని ఆదేశాన్ని పాలించడం నా కర్తవ్యమని భావిస్తున్నాను.”

నా ప్రకటనతో కేసును వాయిదా వేయవలసిన అవసరం లేకుండాపోయింది. యిలా జరుగుతుందని వకీలుగాని, మేజిస్ట్రేటుగాని ఊహించలేదు. అందువల్ల శిక్ష విధించేందుకు కోర్టువారు కేసును ఆపి వుంచారు. నేను యీ వివరమంతా తంతి ద్వారా వైస్రాయికి తెలియజేశాను. పాట్నాకు కూడా తంతి పంపాను. భారత భూషణ్ పండిత మదనమోహన మాలవ్యా వంటి పెద్దలకు కూడా తంతి పంపాను. నేను కోర్టుకు బయలుదేరబోతూ వుండగా వైస్రాయి గారి ఆదేశం ప్రకారం కేసును ఉపసంహరించుకోవడమైనదని మేజిస్ట్రేటు నాకు సమాచారం అందజేశాడు. మీరు చేయదలచిన పరీక్షలు చేయండి అని కలెక్టరు నుండి జాబు అందింది. అధికారుల సహాయం పొందవచ్చునని ఆ జాబులో ఆయన సూచించాడు. మా చర్యకు యింత త్వరగా శుభ పరిణామం కలుగుతుందని కలలో కూడా మేము ఊహించియుండలేదు.

నేను కలెక్టరు మి. హెకోసును కలిశాను. అతడు మంచివాడుగా కనబడ్డాడు. మీరు అవసరమనుకున్న పత్రాలన్నీ చూడవచ్చు. అవసరమని అనుకున్నప్పుడు మీరు తిన్నగా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఏ సాయం కావాలనన్నా మీకు అందిస్తాను అని ఆయన చెప్పాడు.

మరో వైపున భారతదేశానికి సత్యాగ్రహం అంటే ఏమిటో, చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించడం అంటే ఏమిటో పాఠం నేర్చినట్లయింది. పత్రికల ద్వారా నా యీ వ్యవహారానికి పెద్ద ప్రచారం లభించింది. చంపారన్‌లో, నాయీ కార్యక్రమానికి ప్రఖ్యాతి లభించింది. నేను అక్కడి పరిస్థితుల్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా నేను నిష్పక్షంగా వ్యవహరించడం అవసరమని అయితే అందుకు పత్రికా విలేఖరులను తీసుకొని వెళ్లి వాళ్ల ప్రకటనలు వెలువరించవలసిన అవసరం లేదని నిర్ణయించాను. వాళ్లు పెద్ద పెద్ద రిపోర్టులు పత్రికల్లో ప్రకటిస్తే అపకారం కూడా జరుగవచ్చు. అందువల్ల చాలామంది పత్రికా సంపాదకులకి మీ విలేఖర్లను పంపవద్దని అవసరమైన వివరాలు నేనే మీ విలేఖర్లకు అందజేస్తూ వుంటానని జాబులో వ్రాశాను. చంపారన్‌లో గల తెల్ల ఖామందులు బాగా కోపంగా వున్నారని నాకు తెలుసు. అధికారులు కూడా లోపల సంతోషంగా వుండరని తెలుసు. వాళ్లకు కోపం వస్తే నన్నేమీ చేయలేరు కాని పాపం అక్కడి నిరు పేదలగు రైతుల్ని యమబాధలు పెడతారని, అందువల్ల నేను చేయదలచుకున్న విచారణ సరిగా జరుగదని గ్రహించాను. తెల్లదొరలు అప్పుడే విషప్రచారం ప్రారంభించారు. వాళ్లు నాకు, నా అనుచరులకు వ్యతిరేకంగా అబద్ధపు ప్రకటనలు పత్రికల్లో ప్రకటించడం ప్రారంభించారు. నేను ఎంతో జాగ్రత్తగా వున్నందున, బహు చిన్న విషయాలలో సైతం సత్యం మీద ఆధారపడియున్నందున తెల్లదొరలు ప్రయోగించిన బాణాలు గురి తప్పిపోయాయి. ప్రజకిషోర్‌బాబును బాగా దుమ్మెత్తి పోశారు. తెల్లదొరలు వారిని నిందించిన కొద్దీ వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరిగిపోయాయి.

ఇట్టి సున్నితమైన వాతావరణంలో రిపోర్టర్లను వెంటవుండమని నేను ప్రోత్సహించలేదు. నాయకుల్ని కూడా ఆహ్వానించలేదు. “అవసరమైనప్పుడు తనను పిలవమని, తాను సిద్ధంగా వున్నానని” పండిత మదనమోహన మాలవ్యాగారు మనిషి ద్వారా వార్త పంపారు. అయినా వారికి కూడా నేను శ్రమ కలిగించలేదు. యీ సమస్యను నేను రాజకీయం చేయదలచలేదు. ఎప్పటికప్పుడు జరిగిన వివరాలు పత్రికలకు పంపుతూ వున్నాను. రాజకీయ సంబంధమైన వ్యవహారాలకు కూడా, రాజకీయ అవసరం లేనప్పుడు రాజకీయ రూపం కల్పించితే రెంటికీ చెడిన రేవడి చందమవుతుంది. యీ విధంగా అసలు విషయాన్ని స్థలం మారకుండా అక్కడే వుండనిస్తే అంతా సర్దుకుంటుందని నా విశ్వాసం. ఎన్నో పర్యాయాలు కలిగిన అనుభవం వల్ల నేను యీ విషయం గ్రహించాను. పరిశుద్ధమైన ప్రజా సేవయందు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా రాజకీయం తప్పక పనిచేస్తుంది. చంపారన్‌లో జరిగిన పోరాటం యీ విషయాన్ని రుజూ చేసింది.