సత్యశోధన/ఐదవభాగం/14. అహింసాదేవి సాక్షాత్కారం

వికీసోర్స్ నుండి

14. అహింసాదేవి సాక్షాత్కారం

నేను రైతుల పరిస్థితిని పరీక్షించాలి. నీలిమందు కొఠార్ల యజమానులగు తెల్లదొరలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్లో ఎంత నిజం వున్నదో తెలుసుకోవాలి. యీ విషయమై వేలాది రైతుల్ని కలవాలి. వారిని కలుసుకునే ముందు నీలిమందు కొఠారుల యజమానుల్ని కలిసి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. కమీషనరుకు జాబులు వ్రాశాను. యజమానుల సంఘ కార్యదర్శి ఒకడు వున్నాడు. వెళ్లి కలిశాను. “నీవు పరదేశివి. మాకు, రైతులకు మధ్య నీవు కల్పించుకోవద్దు. ఏమైనా చెప్పదలచుకుంటే లిఖితంగా వ్రాసి పంపు” అని ఆయన అన్నాడు. ఆయన మాటకు వినమ్రంగా జవాబిస్తూ “నేను పరదేశిని కాను. రైతులు కోరినందువల్ల వారి యీ వ్యవహారం క్షుణ్ణంగా తెలుసుకొనే అధికారం నాకు వున్నది.” అని చెప్పాను. కమీషనరును కలిశాను. ఆయన నన్ను చూడగానే మండిపడ్డాడు. బెదిరించాడు. తిరహుత్ నుండి తిరుగుముఖం పట్టమని చెప్పివేశాడు. అనుచరులకు ఈ విషయమంతా చెప్పి ఇక వ్యవహారం తీవ్రరూపం దాలుస్తుంది. రైతుల పరిస్థితుల్ని పరీక్షించేందుకు ప్రభుత్వం నన్ను వెళ్ళనీయదు. నేను ఊహించినదాని కంటే ముందే నేను జైలుకు వెళ్లక తప్పదు. మోతీహారీలోగాని లేక అవకాశం దొరికితే బేతియాలోగాని నేను అరెస్టు కావడం మంచిది. నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి అని అన్నాను.

చంపారన్ తిరహత్ కమీషను యందలి ఒక జిల్లా. దానికి మోతీహారీ ప్రధాన కేంద్రం. బేతియాకు దగ్గరలో రాజకుమార్ శుక్లాగారి ఇల్లు వున్నది. అక్కడి కొఠార్లకు సంబంధించిన రైతులు కడు నిరుపేదలు. వారి పరిస్థితుల్ని చూపించాలని శుక్లాకు ఆరాటం ఎక్కువగా వున్నది. నేను అక్కడికి వెళ్లి వారిని చూడాలి అని భావించాను. వెంటనే అనుచరులందరినీ వెంటబెట్టుకొని మోతిహారీకి బయలుదేరాను. మోతిహారీలో గోరఖ్‌బాబు ఆశ్రయం, వారిల్లు సత్రంగా మారిపోయింది. మేము వారింటినంతటిని ఆక్రమించాం. మేము చేరిననాడే అక్కడికి దగ్గరలో అయిదు మైళ్ల దూరాన వున్న గ్రామంలో ఒక రైతు మీద దుర్మార్గం జరిగిందను వార్త మాకు అందింది. అతణ్ణి చూచేందుకు ధరణీధర బాబు అను వకీలును వెంటబెట్టుకొని నేను ఉదయాన వెళ్ళాలని నిర్ణయించాను. ఆ ప్రకారం ఏనుగు మీద ఎక్కి మేము ఆ గ్రామానికి బయలుదేరాం. గుజరాత్‌లో ఎడ్లబండిని ఉపయోగించిన విధంగా చంపారన్‌లో ఏనుగుల్ని ఉపయోగిస్తారు. సగం దూరం చేరామో లేదో ఇంతలో పోలీసు సూపరింటెండెంటు దూత అక్కడికి వచ్చి “సూపరింటెండెంట్ గారు మీకు సలాము చెప్పమన్నారు” అని అన్నాడు. వెంటనే విషయం గ్రహించాను. ధరణీధరబాబును ముందుకు వెళ్లమని చెప్పి వార్తాహరునితో బాటు అతను తెచ్చిన కిరాయి బండి ఎక్కాను. అతడు చంపారన్ వదలి వెళ్లిపొమ్మని నోటీసు నాకు యిచ్చి కాగితం చూపి సంతకం చేయమని అన్నాడు. “నేను చంపారన్ వదలి వెళ్ళను. నేను యిక్కడి పరిస్థితుల్ని పరీక్షించాల్సి వున్నది” అని సమాధానం వ్రాసి అతనికి యిచ్చాను. మరుసటి రోజున చంపారన్ వదలి వెళ్ళనందువల్ల కోర్టులో హాజరుకమ్మని సమను నాకు అందింది. ఆ రాత్రంతా మేలుకొని నేను వ్రాయవలసిన జాబులన్నీ వ్రాశాను. అవసరమైన సూచనలన్నీ వ్రాసి ప్రజకిషోర్‌బాబుకు యిచ్చాను.

కోర్టువాళ్లు సమను పంపారను వార్త క్షణంలో జనానికి తెలిసిపోయింది. మోతిహారీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘట్టం జరిగిందని ప్రజలు గోల పెట్టారు. గోరఖ్‌బాబుగారి యింటిదగ్గర, కోర్టు దగ్గర గుంపులు గుంపులుగా జనం చేరారు. అదృష్టవశాత్తూ ఆ రాత్రే పనులన్నీ పూర్తిచేయడం వల్ల ఆ జనాన్ని శాంతింపచేసేందుకు నాకు అవకాశం చిక్కింది. నా అనుచరుల వల్ల కలిగే ఉపయోగమేమిటో నాకు బోధపడింది. వాళ్లు జనాన్ని వరసగా నిలబెట్టడం ప్రారంభించారు. కోర్టులో ఎక్కడికి వెళితే అక్కడ నా వెంట ఒకటే జనం. కలెక్టరు, మేజిస్ట్రేట్, సూపరింటెండెంటుతో కూడా నాకు సంబంధం ఏర్పడింది. గవర్నమెంటువారి నోటీసుల్ని ఒప్పుకున్నాను. అధికారులతో ఎంతో మంచిగా వ్యవహరించాను. దానితో వారందరికీ నా విషయమై భయం పోయింది. వారిని మంచిగానే వ్యతిరేకిస్తానని వాళ్లకు బోధపడింది. నన్ను అదుపులో పెట్టడానికి బదులు జనాన్ని అదుపులో పెట్టడానికీ నా అనుచరులకు సంతోషంతో వాళ్లు సహకరించడం ప్రారంభించారు. దానితోబాటు తమ అధికార ప్రాబల్యం ఆనాటితో తగ్గిపోయిందని వాళ్లు గ్రహించారు. ప్రజలు ఆ క్షణం గవర్నమెంటు అధికారుల దండన, శిక్షల భయం మరచిపోయి తను క్రొత్త మిత్రుని యెడ గల ప్రేమ యొక్క ఆధిపత్యానికి లోబడిపోయారని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

నిజానికి చంపారన్‌లో నన్ను ఎవ్వరూ ఎరుగరు. రైతులు నిరక్షరకుక్షులు. చంపారన్ గంగానదికి ఆవలి ఒడ్డున హిమాలయ పర్వత చరియల్లో నేపాలుకు దగ్గరగా వున్న ప్రాంతం. అంటే అదీ ఒక క్రొత్త ప్రపంచమన్నమాట. అక్కడ కాంగ్రెస్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్ మెంబరు ఒక్కడు కూడా అక్కడ లేడు. కొందరి పేర్లు వినపడ్డా వారు భయంతో నక్కి కూర్చున్నారు. కాంగ్రెస్ పేరు తెలియకపోయినా యీనాడు కాంగ్రెస్ జరిగినంతపని అయింది. అనేకమంది సేవకులు కాంగ్రెసులో చేరినట్లయింది. అక్కడ కాంగ్రెస్ ప్రారంభమైందని అనిపించింది. అనుచరులతో సంప్రదించిన పిమ్మట కాంగ్రెస్ పేరట ఏ పనీ చేయకూడదని నిర్ణయించాం. పేరుతో అవసరం లేదు. పని ముఖ్యం అని భావించాం. మాటలు కాదు చేతలు ముఖ్యం అని నిర్ణయించాం. కాంగ్రెస్ పేరు ఎవ్వరికీ ఇష్టం కాలేదు. యీ పరగణాలో కాంగ్రెసంటే ప్లీడర్ల వాద ప్రతివాదాలు, చట్ట సంబంధమైన ఛిద్రాలతో తలపడటం అనే ప్రచారం అయింది. కాంగ్రెస్ అంటే బాంబులనీ, మాటలే కాని చేతలు లేనిదని యిక్కడి గవర్నమెంటు, మరియు దానికి దన్నుగా నిలబడియున్న తెల్లదొరల అభిప్రాయం. అట్టి కాంగ్రెస్‌కు, యిక్కడి కాంగ్రెస్‌కు తేడా వున్నదని మేము రుజువు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల కాంగ్రెస్ ఊసే ఎత్తకుండా పనిచేయాలని భావించాం. కాంగ్రెస్ పేరుతో గాక, దాని లక్ష్యాలను ప్రజలు తెలుసుకుంటే చాలునను నిర్ణయానికి వచ్చాం. అందువల్ల కాంగ్రెస్ పేరట రహస్యంగాని, బహిరంగంగా గాని ఏ పనీ చేయలేదు. రాజకుమార్ శుక్లాకు వేలాదిజనంతో కలిసిపోయే శక్తిలేదు. రాజకీయంగా అక్కడ యింతవరకు ఎవ్వరూ పనిచేసి యుండలేదు. చంపారన్ బయటగల ప్రపంచాన్ని ఆయన ఎరుగడు. అయితే మా యిరువురి కలయిక పాతమిత్రుల కలయికగా పరిణమించింది. ఆ రూపంలో నేను దేవుణ్ణి, అహింసను, సత్యాన్నీ దర్శించాను. ఇది అక్షరాలా నిజం. ఈ విషయమై నాకు గల అధికారం ఏమిటి అని ఆలోచిస్తే ప్రేమ తప్ప వేరే ఏమీలేదని ప్రేమ, అహింసల ఎడ నాకు గల నిశ్చలమైన శ్రద్ధ తప్ప మరేమీ లేదని తేలింది.

చంపారన్‌లో జరిగిన ఈ వ్యవహారం నా జీవితంలో మరిచిపోవడానికి వీలులేనిది. అది నాకు, రైతులకు ఉత్సవదినం. ప్రభుత్వ నిర్ణయ ప్రకారం నామీద కేసు నడపబోతున్నది. ఆ కేసు నామీద కాక ప్రభుత్వం మీదనే నడవబోతున్నదన్న మాట. నా కోసం కమీషనరు పరిచిన వలలో ఆంగ్ల ప్రభుత్వమే చిక్కుకోబోతున్నదని వాళ్లు అప్పుడు గ్రహించలేదు.