సత్యశోధన/ఐదవభాగం/13. బీహారీల అమాయకత్వం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

13. బీహారీల అమాయకత్వం

మౌలానా మజహరుల్ హక్ మరియు నేను లండనులో కలిసి వున్నాం. తరువాత మేము 1915లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ యందు కలుసుకున్నాం. అప్పుడు ఆయన ముస్లింలీగ్ అధ్యక్షుడు. పాత పరిచయాన్ని తిరగవేసి ఈ మారు పాట్నా వచ్చినప్పుడు మా యింటికి దయచేయండి అని చెప్పాడు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నా రాకకు కారణం తెలుపుతూ వారికి జాబు వ్రాసాను. వెంటనే ఆయన కారు తీసుకొని వచ్చి తన ఇంటికి రమ్మని పట్టుపట్టారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి నేను ఫలానా చోటుకు వెళ్ళాలి, యిప్పుడు ఏ రైలు వుంటే దానిలో నన్ను ఎక్కించండి అని అన్నాను. రైల్వే గైడు చూస్తే నాకు ఏమీ బోధ పడలేదు. రాజకుమార్ శుక్లాతో మాట్లాడి, మీరు ముందు ముజప్ఫర్ వూరు వెళ్లాలి అని చెప్పి ఆరోజు సాయంత్రం ముజప్ఫర్ వూరుకు వెళ్ళే రైలు ఎక్కించారు. ఆచార్య కృపలానీ అప్పుడు ముజప్ఫర్ పూర్‌లో వున్నారు. వారిని నేను ఎరుగుదును. ఆయన ముజప్ఫర్‌పూర్ కాలేజీలో ప్రొఫెసరుగా వున్నారు. ప్రస్తుతం ఆ పనికూడా మానుకున్నారు. నేను వారికి తంతి పంపాను. రైలు ముజప్ఫర్ పూరుకు అర్ధరాత్రి చేరింది. ఆయన తన శిష్యమండలితో రైలు స్టేషనులో సిద్ధంగా వున్నారు. ఆయనకు అక్కడ ఇల్లు లేదు. ప్రొఫెసరు మల్కానీ గారి యింట్లో వుంటున్నారు. నన్ను వారింటికి తీసుకొని వెళ్లారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంటు కాలేజీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న వ్యక్తి నా వంటివాణ్ణి తన గృహంలో ఉండనీయడం గొప్ప విశేషమే.

కృపలానీ బీహారు స్థితిని గురించి, ముఖ్యంగా తిరహుత్ ప్రాంతపు దీనగాధను గురించి చెప్పారు. నేను పూనుకోబోతున్న పని ఎంత కష్టమైనదో కూడా చెప్పారు. గయాబాబు యిక్కడ పేరుగల వకీలు. వారి పక్షాన వారింటికి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. మేమంతా గవర్నమెంటుకు భయపడేవాళ్లమే. అయినా చేతనైనంత సహాయం మీకు చేస్తాం. రాజకుమార్ శుక్లా చెప్పిన మాటలు చాలా వరకు నిజమే. అయితే ఆయన నాయకుడు. యివాళ యిక్కడ లేడు, బాబూ ప్రజకిషోర్ మరియు బాబూ రాజేంద్ర ప్రసాదుకు తంతి పంపాము. వాళ్లిద్దరూ వస్తారు మీకు విషయమంతా చెబుతారు. సాయం చేస్తారు. దయయుంచి మీరు గయాబాబు గారింటికి బయలుదేరండి” అని అన్నారు. ఈ మాటలు విని నేను మెత్తబడ్డాను. నేను బసచేస్తే గయాబాబుగారికి యిబ్బంది కలుగుతుందేమోనని సంకోచించాను. కాని గయాబాబు సంకోచించవద్దని నాకు చెప్పారు. నేను గయాబాబు గారింటికి వెళ్లాను. వారు, వారి కుటుంబంలోని వారు నన్ను ప్రేమ జల్లుతో తడిపివేశారు.

ప్రజకిషోర్ బాబు దర్భంగా నుండి వచ్చారు. రాజేంద్రబాబు పూరీ నుండి వచ్చారు. లక్నోలో నేను చూచిన ప్రజకిషోర్ బాబు సామాన్యుడు కాదని తేలింది. బీహారు ప్రజలకుండే సహజ వినమ్రత, సాదాతనం, మంచి మనస్సు, అసాధారణమైన శ్రద్ధ వారిలో చూచి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బీహారు వకీళ్లు వారి యెడ చూపించిన ఆదరం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఆ మండలి సభ్యులకు నాకు మధ్య ఏర్పడ్డ ప్రేమబంధం జీవితాంతం విడిపోకుండా నిలిచిపోయింది. ప్రజకిషోర్‌బాబు అక్కడ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పారు. ఆయన బీదరైతుల పక్షాన కోర్టుల్లో వాదిస్తున్నారని, రెండు మూడు కేసులు అట్టివి నడుస్తున్నాయని, ఆ కేసుల్లో వాదించి వ్యక్తిగతంగా కొంత ఊరట చెందుతూ వున్నారని తెలుసుకున్నాను. అప్పుడప్పుడు అందు ఓడిపోతూ వుంటారట. అమాయకులైన ఆ రైతుల దగ్గర సామ్ము తీసుకుంటూ వుంటారట. త్యాగులే అయినా ప్రజకిషోర్‌బాబు, రాజేంద్రప్రసాద్‌లు కక్షిదారులగు రైతుల దగ్గర ధనం తీసుకుంటూ వుంటారని, అందుకు సంకోచించరనీ తెలిసింది. వృత్తిపరంగా డబ్బు తీసుకోకపోతే మా ఇంటి ఖర్చులకు డబ్బు ఎలా వస్తుందని వారి తర్కం. అట్టి డబ్బుతోనే సమాజ సేవ కూడా చేయగలుగుతున్నామని చెప్పారు. వారికి లభించే సొమ్ముకు, బెంగాల్ బీహారుకు చెందిన మిగతా బారిష్టర్లకు లభించే సొమ్ముకు గల ఊహకైనా అందని వ్యత్యాసాన్ని అంకెల రూపంలో తెలుసుకుని నివ్వెరబోయాను.

“బాబు గారికి మేము ఒపీనియన్ (అభిప్రాయం) కోసం పదివేలు యిచ్చాం.” అని జనం చెబుతూ వుంటే ఆశ్చర్యం వేసింది. వెయ్యికి తక్కువ మాట నాకు వినబడలేదు. ఈ విషయంలో నేను తియ్యగా ఆ మిత్రమండలిని మందలించాను. ఓర్పుతో నా మందలింపును వారు సహించారు. విపరీతార్థాలు తియ్యలేదు. అంతా విన్న తరువాత “ఇక యిట్టి కేసులు మనం విరమించుకోవాలి. యీ విధమైన కేసుల వల్ల ప్రయోజనం శూన్యం. అణగారిపోయి భయభ్రాంతులై వున్న రైతు సోదరుల్ని కచ్చేరీల చుట్టూ త్రిప్పితే లాభం లేదు. అది సరియైన చికిత్స కాదు. వాళ్లకుగల భయాన్ని పోగొట్టాలి. అదే సరియైన చికిత్స. తిన్‌కఠియా రివాజు రద్దుకావాలి. అప్పటివరకు మనం విశ్రమించకూడదు. రెండు రోజుల్లో సాధ్యమైనంతగా చూచి తెలుసుకుందామని వచ్చాను. అయితే యీ పనికి రెండు సంవత్సరాలు పట్టవచ్చని తోస్తున్నది. అంత సమయం యివ్వడానికి సిద్ధంగా వున్నాను. యిందుకు ఏంచేయాలో నిర్ణయిస్తాను. కాని మీ సాయం కావాలి” అని స్పష్టంగా చెప్పాను.

ప్రజ కిషోర్ బాబు అసలు విషయం అర్ధం చేసుకున్నారు. అయితే నాతోను మిగతా వారితోను తర్కం చేయసాగారు. నామాటల్లో గర్భితమైయున్న భావాన్ని గురించి ప్రశ్నించాను. మీ అభిప్రాయంలో వకీళ్లు చేయాల్సిన త్యాగం ఏమిటి? ఎంతవరకు? ఎంతమంది వకీళ్లు కావాలి? కొద్దిమంది కొద్దికాలం పనిచేస్తే సరిపోతుందా లేదా? మొదలగు ప్రశ్నలు వేశారు. మీరంతా ఎంత త్యాగం చేస్తారో చెప్పండి అని ఆయన మిగతా వకీళ్లను అడిగారు. ఈ విధమైన చర్చ సాగించి చివరికి “మేము యింత మందిమి మీరు అప్పగించిన పని చేయడానికి సిద్ధంగా వుంటాము. వారిలో ఎవరిని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ దగ్గరకు వస్తాము. జైలుకు వెళ్లాలంటే మరి అది మాకు క్రొత్త. అందుకు అవసరమైన శక్తి చేకూర్చుకునేందుకు ప్రయత్నిస్తాం” అని తమ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు.