సకలనీతికథానిధానము/మున్నుడి

వికీసోర్స్ నుండి

మున్నుడి


నీతిబోధకములగు గ్రంథములు తెలుఁగువాఙ్మయమునఁ బెక్కులు గలవు. నారాయణకవి, భానుకవి వేంకటనాథుల పంచతంత్రానువాదములు, దశకుమారచరిత్రమువంటి గద్యకావ్యముల యనువాదములు కదిరీపతి కృతమగు శుకసప్తతి, అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి వంటికథలు విక్రమార్కగాథలు, ఇవియన్నియును నీతిబోధక వాజ్మయమునకు చెందినవే. సకలనీతి కథానిధానముగూడ యీ శ్రేణిలోనిది. ఈకృతి ఎఱ్ఱయకవిది. ఐదాశ్వాసముల హృద్యప్రబంధము. ఇందు బృహత్కథ, దశకుమారచరిత్ర కాదంబరి మొదలగు వానిలోని కథలే కాక కలియుగరాజుల చరిత్రలుకూడ కొన్ని వర్ణింపబడినవి. అనుప్రసక్తములుగా చిన్న చిన్న నీతికథలేశాక బేతాళకథలును జొనుపబడినవి. అనేక నీతి శ్లోకములకిందు తెలుగుసేత కలదు,

కృతికర్త - కాలము

ఈ కావ్యరచయిత ఎఱ్ఱయ శ్రీవత్సగోత్రుఁడు, కూచనామాత్య పుత్రుడు, “ అష్టభాషాకవితాప్రవీణ ” “ నవఘంటాసురత్రాణ " అను బిరుదములు కలవాడు. ఈతఁడే కొక్కోక పండితకృతమగు రతిరహస్యమును దెలిగించెను. పురాణసారమను వేఱొకకృతి గూడ నీతఁడు రచించెనట. (ప్రథమాశ్వాసము 18వ పద్యము చూడుడు.) అది గానరాదు. కుంటముక్కుల పినభైరవమంత్రి ప్రేరణమున నీకవి యా కృతిని శ్రీవేంకటేశ్వరస్వామి కంకతమొనర్చెను. భైరవమంత్రి పినతండ్రి మల్లమంత్రి. ఈతఁడే కొక్కోక కృతిపతి. పిన భైరవమంత్రి కొండపల్లి కిని, మల్లమంత్రి వినుకొండకును పదునైదవశతాబ్ది ఉత్తరభాగమున ప్రభువు లుగానుండిరను చరిత్ర నిర్ణయమువలన కృతికర్త ఎఱ్ఱయ కృష్ణామండలపు కొండవీటిసీమవాసిగా ఆకాలముననే వెలసినట్లు తేలుచున్నది.

కవిత్వము

ఈయనరచనలో క్త్యార్థకసంధులు మొదలైన లక్షణాతిక్రమణము లటనట గానవచ్చుచున్నవి. నాటి కావ్యములు పెక్కిటి యందివి సామాన్యములే గాన గుణమహితమగు నిట్టి కావ్యమందవి యంతగాఁ బరీగణనీయములుగావు. వివిధములగు కథల సంకలనమైన యీ కావ్యమునందలి యీతని కథనవైఖరియును, శైలియును, యాయా రస భావములకు పరిపోషకములుగా నమరి విసువుపుట్టింపనివియై మనోహరముగా నున్నవి.

సంస్కరణము

దీని ముద్రణమునకు ప్రాచ్యలిఖతపుస్తకాగారముననున్న ప్రతులే యాధారములు. D-Nos. 857, 858, 859 కలవి మూడు ప్రతులు కలవు, D-No. 857 కాగితపు బ్రతిని ఆదినుండి చతుర్థాశ్వాసమునఁ గొంతవఱకుఁ గలదు. D-No. 858 కాగితవుఁ బ్రతిలో దీని తర్వాతి భాగముగలదు. మూడవదియగు D-No. 859 తాళపత్ర ప్రతి, వీని మాతృక. గ్రంథపాతము లెక్కువగా నేర్పడినవి. అచ్చటచ్చట శైథిల్యములుగూడగలవు. సాధ్యమైనంత వఱకు సంస్కరింపఁబడినది. గ్రంథపాతములు లక్షణదోషములు సందిగ్ధపాఠములు మున్నగునవి ప్రశ్నార్థకాది చిహ్నములతో సూచింపబడినవి.

దీనిని ముద్రణమునకు సిద్ధపడిచి ప్రూఫులనుజూచిన శ్రీతాడూరి లక్ష్మీనరసింహారావు బి. ఎస్. సి. గారు, లైబ్రరీ పండితులు సంస్మరణీయులు, దీని ముద్రణమునఁదగు శ్రద్ధగైకొని మేలుగ రూపెత్తించిన “రత్నం ” ముద్రణాలయమువారికిఁ గృతజ్ఞతాభివందనములు.

టి. చంద్రశేఖరన్