Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్హీనియస్

వికీసోర్స్ నుండి

ఆర్హీనియస్ :- స్వాంతె అగస్టస్ అర్హీనియస్ (1859-1927) పేరుపొందిన స్వీడన్ దేశపు రసాయన శాస్త్రజ్ఞుడు. ద్రావణములలో విద్యుత్ప్రసరణమును గురించిన ఇతని సిద్ధాంతములు ఎన్నియో సమస్యలకు ఉపకరించినవి. వీటికై 1908 లో ఇతనికి నోబెల్ బహు మాన మీయబడినది. స్టాక్ హోములో ప్రొఫెసరుగా నుండి తదుపరి నోబెల్ ఇన్స్టిట్యూటులో భౌతిక రసాయన శాఖకు డైరెక్టరుగా చనిపోవువరకు పనిచేసెను.

అర్హీనియస్ స్వీడన్ లోని రైతు కుటుంబమునకు చెందినవాడు. ఇతడు 1859 సంవత్సరము, ఫిబ్రవరి నెల 19 వ తేదీనాడు ఉప్సాలా పరిసరములో జన్మించెను. స్కూలు చదువు పూర్తి అయిన తరువాత 17 వ ఏట ఉప్సాలా విశ్వ విద్యాలయములో ఉన్నతవిద్య నభ్యసించెను. అచట క్లీవ్ వద్ద రసాయన శాస్త్ర పరిశోధనమునందు శిక్షణ పొంది, స్వతంత్రముగా పరిశోధనములు జరుపుటకు స్టాక్ హోమ్ లో ఎరిక్ ఎడ్లుండ్ అను భౌతిక శాస్త్రజ్ఞుని వద్ద చేరెను, ఆ రోజులలో శాస్త్రజ్ఞులకు ద్రావణముల ధర్మములపై మోజు ఎక్కువగా నుండెను. వాంటుహాఫ్ కొల్రాష్ ఓస్ ట్వాల్డ్ మున్నగు శాస్త్రజ్ఞులు ద్రావణముల వివిధధర్మములపై పరిశోధనలు జరుపు చుండిరి. అందుచే అర్హీనియస్ తన డాక్టరేట్ కొరకు ద్రావణముల విద్యుద్వాహకత్వము (Conductivity of Solution) గురించి ప్రయోగములు ప్రారంభించెను. 1884 లో స్వీడిష్ అకాడమీకి విద్యుత్కణముపై తన పరిశోధన ఫలితములు సమర్పించెను.

డాక్ట రేటు లభించినను అర్హీనియస్ పరిశోధనములకు తగిన గౌరవము దొరకలేదు. అయినను ఇతర దేశములలో ఆలివర్ లాజ్, ఒస్వాల్డ్ మున్నగు శాస్త్రజ్ఞులు ఇతని పరిశోధనములను మెచ్చుకొనిరి. అదే సంవత్సరములో ఉప్పాలాకు ఓస్ ట్వాల్డ్ రాక వలస అర్హీనియసు కొంత గౌరవము లభించెను. 1855 లో ఎడ్లుండ్ ప్రయత్నముపై ఇతనికి అయిదేళ్ళవరకు యూరప్ లోని వివిధ దేశముల ప్రయోగశాలలలో పనిచేయుటకు స్వీడిష్ అకాడమీనుంచి వేతనము లభించెను. ఈ అవకాశమును పురస్కరించుకొని ఓస్ ట్వాల్డ్, కోబ్రాష్, వాంట్ హఫ్. బోల్టుస్మన్ వంటి ప్రముఖ శాస్త్రజ్ఞులవద్ద పెక్కు పరిశోధనములు జరిపెను. తరువాత లెప్సిగ్ లొ ఓప్ ట్వాల్డ్ కు అసిస్టెంటుగా చేరెను.

ఈ రోజులలోనే తనకు ఖ్యాతినిచ్చిన అయానీకరణ (Electrolytic dissociation) సిద్ధాంతమును విశదీకరించెను, ద్రావణముల విద్యుద్వాహకత్వముపై తాను సాగించిన ప్రయోగముల ఫలితముగా అర్హీనియస్ కొన్ని నిర్ణయములకు రాగలిగెను. ఇతని సిద్ధాంతమును క్రింది విధముగా తెలుపవచ్చును.

లవణములు, ఆమ్లములు, లవణాధారములు ద్రావణ రూపములో అయాన్ల (Ions) క్రింద విచ్ఛేదింపబడును. ఈ అయనవిచ్ఛేదనము సజలతతో అధికమగును. అనంత సజలీకృత ద్రావణములో అయానీకరణము సంపూర్తియగునని అర్హీనియస్ సిద్ధాంతము. విద్యుత్ప్రసరణము అయాన్ల ద్వారా జరుగును. గనుక, సజలతతో విద్యుద్వాహకత్వము కూడ హెచ్చును. అర్హీనియస్ సిద్ధాంతము ప్రకారము గరిష్ఠ విద్యుద్వాహకత్వము సంపూర్ణ-అయన విచ్ఛేదనము సూచించును. ఏదైన గాఢత (సాంద్రత) గల ద్రావణములోని విచ్ఛేదనాంశమును కనుగొనుటకై ఈ క్రింది నిష్పత్తిని అర్హీనియస్ తన ప్రయోగములద్వారా సాధించకలిగెను,


ఇందు L విచ్ఛేద నాంశమునకు గుర్తు. AP ద్రావణము యొక్క విద్యుద్వాహకత్వముపైన, Aoc అనంత సజలీ కృత స్థితిలో ద్రావణము యెక్క విద్యుద్వాహకత్వము పైన ఆధారపడి ఉండును.

ఈ విధముగా విద్యుద్వాహకత్వము ద్వారమున కొలువబడిన విచ్ఛేదనాంశములు ఇతర ప్రయోగముల ద్వారమున కొలవబడిన విలువలతో సరిపోయెను. అంతేగాక ఇతనీపరిశోధనములు ద్రావణములు ఇతరధర్మములను అర్థము చేసికొనుటకు ఎంతో తోడ్పడినవి.

ఇతడు ప్రతిపాదించిన, ఉపయోగకరమైన మరి యొక సిద్ధాంతము రసాయన ప్రక్రియా వేగమునకు ఉష్ణోగ్రతకు సంబంధించినది. రసాయనప్రక్రియలు భిన్న అణువులు సంయోగమువలన జరుగును. ఈ సంయోగము అణువుల మధ్య సంఘర్షము ద్వారమున ఫలించును. కాని అణువుల మధ్య జరుగు ప్రతిసంఘర్షము సంయోగమునకు దారి తీయలేదని అర్హీనియస్ వాదము. మామూలు అణువులకన్న హెచ్చు శక్తిగల అణువుల మధ్య జరుగు సంఘర్షములే ప్రక్రియకు తోడ్పడును. అనగా సంఘర్షమునకు పూర్వము కొంతశక్తి సంపాదించవలెను. ఇట్టి శక్తిని సంపాదించిన అణువులను ఉత్తేజిత అణువులనియు ఈ శ క్తిని ఉత్తేజనశక్తి అనియు నందురు. సాధారణ - ఉష్ణస్థితిలో ఈ ఉత్తేజితాణువుల సంఖ్య బహు స్వల్పము. కాని ఉష్ణోగ్రత పెరిగినచో వీటి సంఖ్య చాల త్వరగా పెరుగును. అనగా రసాయన ప్రక్రియ వేగము హెచ్చును. ఈ విధముగా ఉష్ణోగ్రతకు ప్రక్రియా వేగమునకుగల సంబంధము విశదీకరించుటేగాక, ఉత్తేజనశక్తిని కొలుచుటకు ఒక సమీకరణమును కనిపెట్టెను. ఈ సమీ కరణము రసాయనమార్పులు విధానమును అర్ధము చేసి కొనుటకేగాక, రసాయనమార్పును పొందించుటకు కావలసిన ఉష్ణశక్తి కొలుచుటకుగూడ ఉపయోగపడు చున్నది. శక్తిశాస్త్రము (Thermodynamics) ద్వారా కూడ ఈ సమీకరణము రుజువు చేయబడినది.

ఇదిగాక ఎన్నియో విషయములపై అర్హీనియసు జరిపిన పరిశోధనముల యొక్క ఫలితములు ఓస్ ట్వాల్ట్ సంపాదకత్వము క్రింద వెలువడిన పత్రిక "సైట్ ప్రిఫ్ట్" (Zeitschrift) లో ప్రచురింపబడెను. ఈ పరిశోధనముల ద్వారమున భౌతికరసాయన శాస్త్రజ్ఞుడుగా గొప్ప పేరు పొందుటేగాక, వందలకొలది విద్యార్థులకు భౌతిక రసాయనములో పరిశోధనలు జరుపుటకు ఇతడు ఉత్సాహము కలుగజేసెను.

1891 లో స్వీడనుకు తిరిగివచ్చెను కాని, అర్హీనియస్ కు గౌరవముగల ఉద్యోగ మేదియు దొరకలేదు. అయినను స్వదేశాభిమానముగల అర్హీనియస్ పరదేశములలో దొరకుచున్న ఉద్యోగములను కాలదన్ని స్టాక్ హోమ్ విశ్వవిద్యాలయ కళాశాలలో అతికష్టముమీద ఉపన్యాసకుని ఉద్యోగము సంపాదించుకొనెను. 1895 లో ప్రొఫెసర్ పదవి పొందెను. అప్పటినుండి అర్హీనియస్ జీవితము ఒడుదొడుకులు లేకుండ సాగినదని చెప్పవచ్చును.

1903 లో నోబెల్ బహుమానము పొందెను. ఎన్నియో దేశములనుండి గౌరవము పడసెను. బ్రిటను నుంచి డేవీపతకము (శాస్త్రజ్ఞునకు దొరుకు గొప్ప గౌరవ చిహ్నము) లభించెను.

అర్హీనియస్ ను స్వీడనులోనే ఉంచుటకు ఆ దేశపు రాజు ఇతనిని నోబెల్ సంస్థలో భౌతిక రసాయనశాఖకు డైరక్టరుగా నియమించెను. ఈ లేబరేటరీలో తనకు నచ్చిన విషయములపై పరిశోధనములు సాగించుటకు అర్హీనియస్కు స్వాతంత్య్ర మియ్యబడెను. రసాయనమే గాక, వాతావరణ విషయములలోను (Meteorological), రోగ నివారక రసాయన (immuno chemistry) శాఖ లోను కూడ ముఖ్యమైన పరిశోధనములు ఇతడు జరిపెను. ఈ పదవిలో 1927వ సంవత్సరము వరకు పనిచేసి, అనారోగ్య కారణముచే పదవినుండి విరమించుకొనెను, ఒక వారమురోజులు జబ్బుచేసిన తరువాత 1927 అక్టోబరు 2 వ తారీఖున ఇతడు మృతినొందెను.

అర్హీనియస్ తన చివరిరోజులను శాస్త్రీయ విజ్ఞానమును జనసామాన్యమునకు అందచేయు నుద్యమములో గడిపెను వివిధ దేశములలో జరుగు విజ్ఞాన వేత్తల సమావేములకు హాజరై అక్కడి శాస్త్రజ్ఞులతో ముచ్చటించుటయన్న ఇతడు ఎక్కువ ప్రీతి చూపించుచుండెడివాడు. స్వీడను శాస్త్రజ్ఞులలో బెర్జీలియస్ తరువాతి స్థానము అర్హీనియస్ అని చెప్పవచ్చును.

జె.జొ.

[[వర్గం:]]