Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర

వికీసోర్స్ నుండి

అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర  :- ఆర్థికసిద్ధాంత వికాసము : అతి ప్రాచీన కాలమందలి ఆర్థిక సిద్ధాంతములు మత, నైతిక, రాజకీయ, న్యాయశాస్త్ర సిద్ధాంతములతో మిశ్రితములై యుండుటచే ఏదేని యథార్థ వ్యత్యాసమును ఎత్తి చూపుటయే పెక్కు సందర్భములందు కష్టసాధ్యము. ప్రాచీన ప్రపంచపు భావనయే అన్యవిధముగ నుండెను. ఆచారములు, అధికారములు చెలాయింపు కలిగియున్న యుగ మది. పరిశ్రమము బానిసలు చెయ్యవలసిన పనియనియు, యజమాని దాని ఫలితములకు హక్కు దారుడనియు ఆనాటివారు భావించెడువారు. అట్టి పరిస్థితిలో నేడు ఆర్థికశాస్త్రము అని పిలువబడు రీతిని ఆర్థికశాస్త్రము అభివృద్ధి చెందుటకే అవకాశము లేకుండెను.

అతిప్రాచీన నాగరకతలు : ప్రకృతిమాత యొక్క అనుగ్రహమునకు లోనై, మానవుని అత్యల్ప కృషి వలన కూడ అతని అవసరములను మించిన ఫలసాయముల నొసగు దేశములందే అతి ప్రాచీనములగు మానవ నాగరకతలు ఉద్భవించినవి. అట్టి అదనపు ఫలసాయమున్నపుడే అభివృద్ధి సాధ్యమగును. మనకు తెలిసిన వాటిలో, మిక్కిలి ప్రాచీనము లగు ఈజిప్టు, బాబిలోనియా నాగరికతలు, మహానదీ లోయలలో, సారవంతమగు భూములలో, వెచ్చని శీతోష్ణస్థితిలో, స్వల్పకృషితోనే మానవులు, జీవనము చేయగల ప్రదేశములందే ఉత్పన్నమైనవి.

గ్రీసు, రోము  : గ్రీకులు ఈజిప్టుదేశస్థులతో తమకు కల్గిన సంపర్కమువలన, పెక్కు విషయములు తెలిసికొన్న వారే యైనప్పటికిని, నవీన కాలపరిస్థితులకు మార్గదర్శకులు అయి యున్నారు. ఆర్థిక విషయములను సిద్ధాంతీ కరించుట, గ్రీకుపండితుల రచనలయందే మొదట ప్రారంభమైనది. ఫినీషియన్సును మినహాయించినచో అప్పటివరకు ప్రపంచమందు మిక్కిలి ఎక్కువగా వర్తక వాణిజ్యములు నడిపినదియు గ్రీకువారే. కాని వారి యొక్క పరిశ్రమలు విశేష ప్రాముఖ్యముగలవి కావు. అవి ఉన్నతశ్రేణి పౌరులు ఆచరించుటకు అర్హములుగ పరిగణింపబడలేదు. గ్రీకు సాంఘిక ఆర్థిక తత్వవేత్తలందు మిక్కిలి ప్రముఖుడగు ప్లాటో, “రిపబ్లిక్" అను పేరుగల గ్రంథమును రచించెను. ఆదర్శసంఘము నందు ఆర్థిక విజ్ఞానమునకు సంబంధించిన కొన్ని విషయములు అందు గలవు. ధనమును ఫలరహితముగను (Barren), తత్కారణమున ' వడ్డీని అసమంజసముగను పరిగణించిన అరిస్టాటిలు ఈ శాస్త్రము ఆ పిమ్మట వృద్ధిపొందుటకు కారకుడయ్యెను.

గ్రీకుల కాలమునుండి రోమనుల కాలమునాటికి ఈశాస్త్రము మరొక అడుగు ముందుకు సాగినది. రోమను సామ్రాజ్యము నకును అంతకుముందున్న సామ్రాజ్యములకును అనేక విషయములలో సామ్యమేలేదు. అందలి పరిశ్రమలు ప్రాముఖ్యము గలవి.అందలి విదేశ వాణిజ్యము మిక్కిలి గొప్పది.అందు నాణెముల ముద్రించు విధానము విస్తృతమైనది. కాని పరిశ్రమ లింకను బానిసల పనిగనే యుండెను. తన్మూలమున రోమను ఆర్థికశాస్త్రము కూడ నవీన పరిస్థితులనుండి భేదించియే యుండెనని చెప్పవచ్చును.

విజ్ఞాన పునరుజ్జీవనము - మర్కంటైల్ సిద్ధాంతము  : విజ్ఞాన పునరుజ్జీవన కాలమువరకు దీనిని క్రమబద్ధముగ విభజించుట కెట్టి తీవ్రప్రయత్నమును జరగలేదు. ఆర్థిక విచారముపై మత రాజకీయ విచారణల నీడలు ప్రసరించు చుండెను. పదునైదవ శతాబ్దియందలి విజ్ఞాన పునరుజ్జీవనము, నూతన ప్రపంచము కండ్లబడుట, విజ్ఞాన పునరుద్భవము, ప్రొటస్టెంట్ మత సంస్కరణము, ముద్రణయంత్రము కనుగొనబడుట మొదలగు కారణముల వలన ప్రపంచము తీవ్రగతిని పురోగమించుచున్నట్లు కనబడెను. క్రొత్త ప్రపంచము కనుగొనబడుటవలన పాత ప్రపంచము వారి అందుబాటులోనికి వచ్చిన అపార సంపదకై జరిగిన సంఘర్షణలో స్పెయిన్, పోర్చుగల్ దేశములకు అత్యధిక భాగము లభించెను. కాని వారి ఐశ్వర్యమే వారి వినాశ హేతువయ్యెను. త్వరలోనే వారి కంటే బలవంతములైన హాలెండు, ఫ్రాన్సు, ఇంగ్లండు దేశములు వారిస్థానము నాక్రమించినవి. తుదకు ఫ్రెంచి వారిపై, యూరపునందును, భారతదేశ మందును ఏక కాలములో విజయము సాధించి ఇంగ్లండుదేశము నావికా బలమున అసమాన ప్రాబల్యమును సంపాదించెను.

ఈ కాలమందే వాణిజ్యము బహు విస్తృతమయ్యెను. ప్రభువు భూమిని తన ప్రత్యేకోపయోగమునకు ఉపయోగించుకొను విధానము స్థానే జాతీయార్థిక వ్యవస్థ అవతరించినది. ఆంగ్ల వర్తకులు సామ్రాజ్యస్థాపనకు పునాదులు నిర్మింపదొడగిరి. ఈనాటి ఆర్థికశాస్త్ర గ్రంథము లన్నిటి యందును ఆంగ్లదేశపు విదేశ వ్యాపారము, నావికా విధానములకు సంబంధించిన ప్రసక్తి మెండుగా గాన వచ్చును. మర్కంటైల్ సిద్ధాంత మీ విధముగా ఉద్భవించి ఆంగ్లేయ వ్యాపారకృషియందు రెండు శశాబ్దుల కాలము ప్రముఖస్థానము నాక్రమించినది. దేశములోనికి బంగారము తీసికొని రాగల ఎగుమతులను ప్రోత్సహిం చుట, దేశము తన బంగారము వెచ్చింపవలసిన దిగుమతుల నిరుత్సాహపరచుట, విదేశ వ్యావారము యొక్క ఆశయమై యుండవలెనని వ్యాపారశీలురు (Mercantilists) భావించిరి. వాణిజ్య విధానము పలు వైపులుగ వ్యాపించి, ఆర్థిక అభ్యుదయములో జాతీయశక్తిగ పరిగణింపబడ నారంభించినది. ఎగుమతులు ప్రోత్సహింపబడి, దిగుమతులు కొన్ని నిషేధింపబడుట మరికొన్ని ఎక్కువ సుంకములకు గురిచేయబదుట జరిగెను. ప్రతి మారకములోను ఒక పక్షమువారికి లాభము కల్గిన, మరియొక పక్షమువారికి నష్టము కలుగునను భావనపై ఈ సిద్ధాంతము ఆధారపడి యున్నది. ఈ విధమైన స్వజాతీయ ఆర్థికాభిమానము ఆంగ్లదేశమునకే పరిమితముగాదు. పదునేడవ శతాబ్దపు ఐరోపాఖండపు జాతులన్నిటికినీ, ముఖ్యముగా ఫ్రాన్సు ప్రష్యాలకును ఇది విశిష్టలక్షణము.

నవీన ఆర్థికశాస్త్రము - సనాతన వర్గము :- ప్రముఖుడును స్కాట్లండు దేశస్థుడును అగు ఆడముస్మిత్తు ఆర్థిక శాస్త్రమునకు తండ్రిగాను స్థాపకుడుగాను పరిగణింపబడుచున్నాడు. కాని ఇది పూర్తిగా యథార్థము కాదు. ఈ శాస్త్రమునకు నిర్దిష్టమగు సంపూర్ణరూపమిచ్చిన వారిలో ప్రథముడితడే యనుమాట వాస్తవమేయైనను, ఆర్థికాభివృద్ధికి మూలము స్వాతంత్య్రమే అను భావమును మొదట కలిగించిన వారు బహుశః ఫిజియో కాట్సు అను ఫ్రెంచి ఆర్థిక శాస్త్రవేత్తలని అంగీకరింపవలసి యుండును. ప్రకృతి నిర్దేశ సూత్రము (rule of nature) అనుసరింపవలయు నని వారు బోధించుటయే అట్లు పరిగణించుటకుగల కారణము. ఈ వర్గము వారి నాయకులు క్వాస్నే, టర్ గెట్ అను వారలు. ప్రకృతి నిర్దేశమునకు మానవుల చర్యలన్నియు లోబడి యుండుననియు, అనిర్దేశము అందరికిని సుకరముగ నుండు రీతిని వారిని నడుపు ననియు వీరి అభిప్రాయము. స్వచ్ఛందపు పోటీ సూత్రము ప్రధానాతి ప్రధానము. ప్రభుత్వపు జోక్యమునకై చేయబడు ప్రయత్నముల నిరసించవలసి యుండును. లెసేఫేర్ " (Laissez Faire) అను వ్యక్తి స్వాతంత్య్ర వాదమునందు వారి సిద్ధాంతము ఇమిడియున్నది. వ్యక్తికి ఏది అత్యంత ప్రయోజనకారియో అదియే సంఘమునకును ప్రయోజన కారియని వారు భావించిరి. " ఆడమస్మిత్తు యొక్క "ప్రపంచజాతుల సంపద"(Wealth of Nations) అను గ్రంథమున ఆర్థిక స్వేచ్ఛ అను నూతన సిద్ధాంతము మరింత సమగ్రముగ వెల్లడింపబడి సవిస్తరముగ వర్తింపజేయబడినది. ఆయనకుగల ప్రాముఖ్యము అసామాన్యము. దాదాపు ఏ యుగములోను ఏ రచయితయు తన తోడిమానవుల భావములపై ఇంతకన్న నెక్కువ ప్రాబల్యము కలిగియుండలేదు. అతడాకాలమునాటి పరిస్థితులకు అతీతమైన ముందు చూపును కనపరిచినవాడు. ఈనాడు ఆర్థిక శాస్త్రములో సత్యములుగ పరిగణింపబడు విషయములలో కొంచెముగనో గొప్పగనో ఆయన దృష్టికి గోచరించనిది లేదు. వీటి నన్నిటికిని మించి అతడు ఆర్థికశాస్త్రములో మానవసంబంధమైన లేక వ్యక్తిగతమైన విషయము యొక్క ప్రాముఖ్యమును గమనించెను. ఆర్థిక సిద్ధాంతములందు ఆయన కృషివలన నూతన శకము ప్రారంభమైనది. ఆర్థిక సూత్రములను విస్తరింపచేసి, మున్ముందు ఆర్థికవేత్తలు కట్టడము నిర్మింప వీలయిన శాస్త్రీయమగు పునాదిని ఏర్పరచుటకు జరిగిన ప్రథమయత్నము ఆతనిదే.

అతని పిమ్మట వచ్చినట్టి ఆర్. మాల్ ధస్ (1766-1854) సాధారణ ఆర్థిక శాస్త్రముపై ఒక గ్రంథమును రచించెను. జనసంఖ్యను గూర్చిన అతని సిద్ధాంతమునకు ప్రబల వ్యతిరేకత ఉద్భవించి అర్థశాస్త్రము "భయంకర శాస్త్ర"మని పేరు వచ్చుటకు చాలవరకు కారణమయ్యెను. ఆ పిమ్మట వచ్చినవాడు డేవిడ్ రికార్డో అను నాతడు (1772-1823). అద్దెను గూర్చిన సిద్ధాంతము ఇతడు ప్రవచించిన ముఖ్య విషయము. ఇది ఇప్పటికిని అతని పేరుననే పిలువబడుచున్నది. అర్థశాస్త్రమందలి అముక్తతర్కమునకు ఇతని పేరు ప్రధాన ఉదాహరణముగ పేర్కొనుట ఇప్పటికిని అలవాటు.

ఆపిమ్మట వచ్చిన రచయితలలో ప్రధానముగ పేర్కొనవలసినవాడు జాన్ స్టూఅర్టుమిల్ (1806-73). సనాతన ఆర్థికశాస్త్రవేత్తలందలి జెట్టీలలో కడసారివా డీతడే, అర్థశాస్త్ర సూత్రములు (ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఇకానమీ) అను ఇతని గ్రంథము ఆర్థికశాస్త్ర చరిత్రలో నూతనశక మారంభ మగుటకు కారణమైనది.. అందు, ఎల్లరును ఆర్థిక శాస్త్రము పరిపక్వమై సంపూర్ణస్థితికి వచ్చినట్లు పరిగణింపసాగిరి. సాంఘిక తత్వవేత్తకూడ నై యుండి ఆర్థికశాస్త్రము యొక్క దృష్టిని విస్తృతము గావించుటకు ఇతడు ఎంతో కృషిచేసెను.

"ప్రపంచ జాతుల సంపద (Wealth of nations) అను గ్రంథమునకును “అర్థశాస్త్ర సూత్రములు" అను గ్రంధము నకును నడుమ యూరపుఖండమునందలి అనేకమంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశాస్త్రాభివృద్ధికి తోడ్పాటు చేయుచుండిరి. వారిలో ఫ్రాన్సు నందలి సే, కౌర్ నట్, సిస్ మోండీ బెస్టేటు అను వారలును జర్మనీయందలి హెర్ మన్, ధూనెన్, రే అనువారలును ముఖ్యులు. వీరిలో పెక్కుమంది సనాతన సిద్ధాంతములు వెలువడిన పిమ్మట వచ్చినవారై, వాటిని మరింత అభివృద్ధిలోనికి తెచ్చిన వారే. అముక్తతర్కము, అనుమేయవిధానము (Deduction) వారు అనుసరించిన పద్ధతులు. వ్యక్తి స్వాతంత్య్ర అంగీకారము (Laissez Faire) ను సమర్థించుటకుగాను సనాతన ఆర్థిక వేత్తల యొక్క సిద్ధాంతములను ఉపయోగించు కొనిన మాంఛస్టరు ఆర్థికశాస్త్ర వర్గమునకు చెందిన పండితులుకూడ ఈ విధానములనే అనుసరించిరి.

చారిత్రకవర్గము  : సంప్రదాయ వర్గము వారి ఆర్థిక పరిశోధనా విధాన పద్ధతుల కన్న అన్యములను అనుసరించు ఉద్యమము రానున్నదని జాన్ స్టూఆర్టు మిల్ యొక్క రచనలు సూచించినవి. కేవలము సిద్ధాంతానుసార భావములపై ఒక విధమగు వ్యతిరేక భావమును ఈ శాస్త్రమును వాస్తవిక, చారిత్రక పునాదులపై నిర్మింపవలెనను ఆకాంక్షయు క్రమ క్రమముగా పెంపొందదొడగెను. డేవిడ్ రికార్డో అనునాతడును అతని యనుచరులును యథార్థరహితములు లేక రుజువు కాని విషయములను ఆధారములుగ చేసికొని, ఆర్థికశాస్త్రమును కేవలము ఒక ఊహాధారమైన శాస్త్రముగ పరిగణించి రనియు, అట్టి వాటిలో సాధ్యమైనంత యెక్కువ సంపదను బడయుట, సాధ్యమైనంత తక్కువ శ్రమను పొందుట, అను రెండు ఆశయములు గల "ఆర్థిక వ్యక్తిత్వము” అను భావన ముఖ్యమైన దనియు, మిల్ నొక్కి చెప్పేను.

ఈ లోపములను సవరించుటకు తీవ్ర ప్రయత్నము సలిపిన వారిలో ప్రథముడు ఆగస్టేశాంటీ (1798-1857) అను ఫ్రెంచి దేశస్థుడు. యూరపు ఖండమందలి చారిత్రక ఆర్థిక శాఖలకు ఇతనిని స్థాపకునిగా పరిగణింపవచ్చును. అతని దృష్టిలో సాంఘిక శాస్త్రమనునది ఒకే శాస్త్రము. ఇతర విధానములను పూర్తిగా వర్ణింపక చారిత్రకమయిన పోలికలను గమనించుట ఇందు అవలంబించవలసిన ప్రధాన విధానము. విపులార్ధములో యావత్తు చరిత్రయు, నేటి పరిస్థితులకు సంబంధించిన విషయ సామగ్రియు, ఆర్థిక పరిశోధనకు ముడిసరుకు నియ్యగల సుక్షేత్రములు. ఈ నూతన విధానము, విస్తృత అంగీకారమునొంది ఫ్రాన్సు నుండి యూరపు ఖండమునందలి ఇతర దేశములకు వ్యాపింప జొచ్చెను. జర్మనీలో ముఖ్యముగా ఈ చారిత్రక పద్ధతులు సామ్యవాద సిద్ధాంతములు బలపరచుటకు ఉపయోగింపబడెను. ఈ సందర్భమున కారల్ మార్క్సు ఈగిల్సు, రాడ్ బెర్ టస్, లాసల్లేల నామములను ముఖ్యముగా పేర్కొనవలసి యున్నది. అదనపు విలువ సిద్ధాంతము (Theory of Surplus Value) ను, పెట్టుబడి దారీ పారిశ్రామిక విధానమును నశింపచేయగల విషక్రిములు దాని గర్భమునందే కలవను సిద్ధాంతమును పట్టువిడువక సమర్థించుటలో మార్క్సు ప్రసిద్ధుడు. పంపకములో పెట్టుబడిదారుసకును, కార్మికునకును వైరుధ్యము నాతడు నొక్కి వక్కాణించెను. పెట్టుబడిదారి కృషి నశించుట అనివార్య మనియు అంతటితో కార్మికులు అధినేతలై, ఉత్పత్తి, జాతీయమగుటయు, పరిశ్రమపై కమ్యూనిస్టు అధికారము సాధ్యమగుటయు జరుగునని అతడు అభిప్రాయపడెను. శాస్త్రాధార సామ్యవాదమునకు మిక్కిలి దోహదమిచ్చినవా డితడే. అప్పటినుండియు ఇతని భావ ములే సామ్యవాద ప్రపంచమునందెల్లెడలను ప్రధాన స్థానమును ఆక్రమించెను.

లాసెల్లే పేరు వేతనమునకు సంబంధించిన జీవనభృతి సిద్ధాంతము (Iron law) తో అనుబంధింపబడియున్నది.

నవీన రూపములో ఆర్థికశాస్త్ర తత్వము పరిణతి నొందుటకు శాస్త్రదృక్పథము విశేషముగా గల డల్లియు. యస్. జేవన్సు (1835-82) ముఖ్య కారకుడు. ఆయన ఆ విధానమునే అవలంబించి అమూల్య ఫలితములను సాధింపజాలెను. "ప్రభుత్వము కార్మికులు" (The state in relation to labour) అను ఇతని గ్రంథము వ్యక్తి స్వాతంత్య్ర సూత్రము (Laissez-faire) నందలి నిర్దాక్షిణ్యమును స్పష్టపరిచేను. “ధనము మారకపు (Exchange) సాధన యంత్రము" (money and the mechanism of exchange) అను ఇతని గ్రంథమొక ఆదర్శగ్రంథము. అతడు ఫైనల్ యుటిలిటీ అని పేర్కొనిన "మార్జినల్ యుటిలిటి" అను సూత్రమునకును, మరియు “వ్యాపార చక్రములు (Trade cycles), మూల్య చలన గతులు అనువాని చరిత్రకు సంబంధించిన సిద్ధాంతములకును ఆర్థికశాస్త్ర వేత్త లెంతయు ఋణపడియున్నారు.

ఆస్ట్రియన్ వర్గము  : "మార్జిన్ (margin) అను భావమును శాఖోపశాఖలుగా ఆర్థిక పరికరముగా నుపయోగించుటతో ఆస్ట్రియన్ వర్గము వారి పేరు అనుసంధింపబడినది. అతిస్పష్ట భావావళి ఈ శాఖవారిలో పరాకాష్ఠ చెందినది, వారి సిద్ధాంతమునందలి ప్రధాన విషయములు మూడు.

(1) ఉత్పత్తి - వ్యయములు వెలను నిర్ణయించునను సిద్ధాంతములను అంగీకరింపక ప్రయోజనమును బట్టియే వెల నిర్ణయమగునని వారు భావించిరి. అది, ఆవశ్యకమని భావించిన వ్యక్తి యొక్క ఉద్దేశమందు ప్రతిబింబించు నని వారి ఉద్దేశము.

(2) ఈ విలువ 'మార్జిను' వద్ద నిర్ణీతమగును, అనగా తదుపరి భాగముల ప్రయోజనము తగ్గుదలలో నుండును. నిరుపయోగకర మగుచున్న వస్తుజాతము యొక్క విలువను దాని లభ్యతను బట్టి నిర్ణయించునది, దానిని ఉపయోగమును పొందుచున్న అంత్యము అముఖ్యమైన ప్రయోజనమే.

(3) ఖర్చు అయిన వస్తువుల విలువనుబట్టి వాటియొక్క ఉత్పత్తి సాధనములకు విలువ ఏర్పడును. అనగా విలువను బట్టి ఖర్చులు నిర్ణయమగునుగాని ఖర్చులనుబట్టి విలువ నిర్ణయింపబడదు. ఈ వర్గమునందలి ప్రముఖులు కార్లు మెంజరు, వెయిజరు, బొహం బియార్కు అనువారు.

ఆల్ ఫ్రెడ్ మార్షల్ : ఆర్థిక వేత్తలలో నవీన మైన ఆర్థిక శాస్త్రమునకు గొప్ప ప్రయోజనము కలిగించినవాడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమునకు చెందిన ఆల్ ఫ్రెడ్ మార్షలు. ఇతడు ఆధునిక శాస్త్రమునకు జనకుడని పేర్కొనదగిన మహావ్యక్తి. రికార్డో యొక్క ఉత్పత్తి వ్యయసంబంధమైన విలువ సిద్ధాంతమును మార్షల్ త్రోసి రాజనినప్పటికిని అతడు దానిని జవాన్సు యొక్క మార్జినల్ యుటిలిటి సిద్ధాంతముతో జోడించి ప్రయోగించి, దాని మూలమున తన వెలను నిర్ణయించు ప్రాతిపదిక సిద్ధాంతమును నిర్మించెను. అది అర్థశాస్త్రశాఖలకు అన్నిటికిని వర్తించునని చూపెను. విలువ, ప్రత్యేకముగా అపేక్ష, సరఫరా అనువాటిలో ఏ ఒక్క దాని పైనను ఆధారపడదు. అది ఆ రెంటి పైననుగూడ ఆధారపడునని తన శాస్త్రీయ విభజన, సమ్మేళనములద్వారా మార్షలు నిరూపించెను. పంపకమును గూడ అదేరీతిని విభజించి, అదేవిలువ సిద్ధాంతమును అన్ని ఉత్పత్తిసాధనములకును వర్తింపజేయవచ్చునని మార్షలు నిరూపించెను. తన్మూలమున అతడు ఆర్థిక విలువకు సంబంధించిన మన భావములకు పరస్పరానుగుణ్యమును, ఐక్యమును కల్గించెను. ప్రతిఉత్ప త్తిసాధనమునకును లభించు ప్రతి ఫలము, అపేక్షకు సంబంధించినంతవరకు మార్జినల్ ప్రొడక్టివిటీ మీదను, సరఫరాకు సంబంధించినంతవరకు ప్రతిసాధనము యొక్క ఉత్పత్తి వ్యయముపైనను, ఆధారపడునని నిరూపించుటకు, 'మార్టిన్' అను అతి ముఖ్యమైన సూత్రమును అతడు ప్రవేశపెట్టెను.

మార్షలు యొక్క సిద్ధాంతములు, “పరిశ్రమకు సంబంధించిన ఆర్థికవిషయములు” “అర్థశాస్త్ర సూత్రములు" "పరిశ్రమ - వ్యాపారము,” “ధనము - అప్పు- వాణిజ్యము" అను విశ్వవిఖ్యాతములైన ఉద్గ్రంథములందు పొందుపరుపబడియున్నవి.

జే. యం. కీన్సు : ఆడము స్మిత్, జే. యస్. మిల్, ఆల్ ఫ్రెడ్ మార్షలు అనువారియొక్క కోవకు చెందిన ఆర్థికశాస్త్రవేత్త లలో కీన్సు ఒకడు. ఒక తరమునుండియు ఆర్థికసిద్ధాంతములకు సంబంధించిన ప్రధాన పరిణామముతో ఇతని పేరు జోడింపబడియే కన్పడుచున్నది. అర్థ శాస్త్రమునకు సంబంధించిన సిద్ధాంత చర్చలయందే కాక శాస్త్రమునకు సంబంధించిన అంతర్జాతీయ చర్చల యందును ఇతని ప్రాబల్యము చూపట్టుచున్నది.

కీన్సు 1981 లో "ధనము" ను గూర్చి వ్రాసిన గ్రంథము (Treatise on money) అర్థశాస్త్రమునకు ఆయన అర్పించిన అమూల్యమైన కానుక, ఐతే కీల్షియం-బైబిలు అని పరిగణింపబడు "ఉద్యోగము - వడ్డీ, ధనము వీటికి సంబంధించిన సాధారణతత్వము" అను గ్రంథము బోధనా కార్య నిమగ్నులగు ఆర్థిక శాస్త్రవేత్త లందు కలిగించినంతటి సంచలనమును ఆడము స్మిత్తు యొక్క 'ప్రపంచజాతుల సంపద" అను గ్రంథము తర్వాత ఏ ఇతర గ్రంథము కల్గించలేదు.

కీన్సు వెల్లడించిన భావములు ప్రపంచమందంతటను అంగీకృతములైనవి. నిరుద్యోగమును గూర్చి ఇతడు చేసిన కృషి ఆ తర్వాత వెలువడిన అనేక గ్రంథములకు మూలాధార మైనది. ఆర్థికశాస్త్రము చాలవరకు రాబడి వ్యయముల ప్రవాహముల యొక్క పరస్పర సంబంధమును పరిశీలించుటయే అనియు, పరస్పర సంబంధములో గల్గిన మార్పులే ఆర్థిక స్థిరత్వముపై తమ ప్రాబల్యమును కనపరచుననియు ఇతడు నిరూపించెను. నిరుద్యొగము అనునది పొదుపుచేయబడిన మొత్తము పెట్టుబడుల యొక్క సంబంధమునకు సంబంధించిన సమస్యయనియుకూడ అతడు చూపెను. వీటియొక్క సమన్వయము కొరవడినచో నిరుద్యోగము పెరుగును. పై రెంటిని సమపాళములో నుంచగల చర్యలను తీసికొను బాధ్యత ప్రభుత్వమే కలిగింపవలెను.

ఉపసంహారము  : ఆర్థిక శాస్త్రవేత్తలు తమ వ్యాసంగ మందలి ప్రాతిపదికల విషయములో ఏకభావము కలిగి యున్నను, కొన్ని విషయములపై వారియందు పూర్వ మున్నంత ఏక గ్రీవాభిప్రాయము లేదు. ఆర్థిక విషయముపై నేడు వెల్లడింపబడిన భావములు సనాతన వర్గము వారి రోజులలో వలె నిష్కర్షగా చెప్పబడుటలేదు. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతములలో అంతిమ నిర్ణయమనునది ఉండదని ఈనాడు గుర్తింపబడుచున్నది. ఆర్థిక విధానము బహుసమస్యలతో నిండినది. ప్రతి రంగములోను ఆర్థిక శక్తుల ఫలితములు బహుక్లిష్టములై ఏ ఆర్థిక సూత్రమునకు లోబడకున్నవి.

జి. రా.రె.

[[వర్గం:]]