Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్థశాస్త్ర ప్రమేయము

వికీసోర్స్ నుండి

అర్థశాస్త్ర ప్రమేయము  :- మానవునకు గల శక్తి, సాధనములు బహు పరిమితములు. కాని అతనికి పెక్కు కోర్కెలు గలవు. కావున ఆ అవసరములలో ఏదిముందు, ఏది వెనుక తీర్చికొనవలయునని యోచించుట అవసర మగుచున్నది. అట్లు పరిమిత శక్తి సాధనములను వివిధ అవసరములకు వినియోగించుటలో మిక్కిలి తక్కువ ప్రయత్నముతో అత్యధికమగు సంతృప్తి నొందుటకు ప్రయత్నము జరుగుట సహజము. కావున కోర్కెలు, వాని సంతృప్తి. అందులకు జరుగు ప్రయత్నము - అనునవి ఆర్థిక సమస్యలయందు ప్రధానభాగములు. నాలుగవది యైన 'మార్పిడి' (exchange) ఈనాటి ఆర్థిక సమస్య లందు ప్రాబల్యము వహించుచున్నది.

ఆర్థికశాస్త్రము సంఘజీవియగు మానవునియొక్క ధన సంబంధమగు సమస్యలకు సంబంధించి యున్నది. ఇది ఒక సాంఘికశాస్త్రము. గైరొమియా అను గ్రీకు పదమునుండి పుట్టినది. గృహనిర్వహణ శాస్త్రమని ఈ పదమునకు అర్థము, మార్క్సు అను రచయిత యావత్ చరిత్రను ఆర్థిక దృష్ట్యా వ్యాఖ్యానించుటను బట్టియే ఈనాడు ఆర్థిక సమస్యలెంత ప్రాముఖ్యమైనవో తెలియగలదు. రాజకీయ స్వాతంత్య్రమును పొంది, ఆర్థిక స్వాతంత్య్రము కొరకు ప్రణాళికలద్వార మనము తీవ్ర ప్రయత్నములు చేయు మనదేశమున ఈ విషయ ప్రాముఖ్యమును గూర్చి నొక్కి చెప్పవలసిన పనిలేదు.

ఒక శాస్త్రప్రమేయమును స్థూలముగా గుర్తించుట వేరు; సూక్ష్మముగా నిర్వచించుట వేరు. మరి ఆర్థిక శాస్త్రము నిర్వచించుటెట్లు? అరిస్టాటిల్ ఏనాడో దీనిని గృహనిర్వహణ శాస్త్రముగ పరిగణించెను. అతనిదృష్టిలో కోర్కెలను తృప్తిపరచుకొనుటకు సంబంధించిన అందలి భాగము సహజము; డబ్బు మార్పిడి మొదలగునవి అసహజములు. నవీనార్థిక సిద్ధాంతములకు జనకుడని చెప్పబడెడు అడమ్ స్మిత్ జాతుల సంపదల స్వభావము, అందుకుగల కారణములు వీనికి సంబంధించిన విచారణగ దీనిని పరిగణించెను. దాని నాధారముగ జేసికొని 19 వ శతాబ్దములోని రస్కిన్, కార్లయిల్ మొదలగు సాహితీపరులు దీనిని "భయంకరశాస్త్ర" మని వర్ణించిరి. కాని అర్థశాస్త్రరీత్యా సంపద యన కేవలము ధనమని మాత్రమే అర్థము కాదు. ప్రజల అవసరములను తీర్చు పరిమితము లగు వస్తువులు, పనులు అని అర్ధము. ఆల్ ఫ్రడ్ మార్షల్ "సంక్షేమమునకు వలయు భౌతిక వస్తుసంచయమును సంపాదించి, ఉపయోగించుటకు సన్నిహితముగ సంబంధించినటువంటి వ్యక్తిగత సాంఘిక చర్యలోని భాగము" ఇందలి విషయమని వర్ణించినాడు. ఇతని దృష్టిలో అది కేవలము సంపదకు సంబంధించినదే కాక అంతకంటెను ముఖ్యముగా మానవునకు సంబంధించి యున్నది. ఈ నిర్వచనము యొక్క ముఖ్య గుణము ఏమన అది సంపదకు, సంక్షేమమునకు పరస్పరసంబంధము కల్గించుచుండుటయే, పెరూ మొదలగు ఆర్థిక శాస్త్రవేత్త లీ యంశమునే విస్తరింపచేసిరి. ప్రసిద్ధ భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త యగు డా. వి. కె. ఆర్. వి. రావుగారు "ఆర్థిక కార్యముల స్వభావము - ఉద్దేశము" అను ఉప న్యాసములో ఆర్థిక శాస్త్రము ఉత్పత్తి, మార్పిడి మొదలగువానిని పరిశీలించుట, కేవలము పరిశీలన కొరకే కాక, మానవ వ్యక్తిత్వ వికాసము అను ఆదర్శసాధనకు మాత్రమే యని వక్కాణించియుండిరి. ప్రొఫెసర్ కానన్ "భౌతిక సంక్షేమ కారణముల పరిశీలన" యని ఆర్థిక శాస్త్రమును నిర్వచించెను. ఈ నిర్వచనమును లయెనల్ రాబిన్సు అను ఆర్థిక శాస్త్రవేత్త విమర్శించుచు ఆర్థిక శాస్త్ర దృష్ట్యా ఏవి భౌతిక వస్తువులో, ఏవి కావో వాటిని చెప్పుట కష్టము అని వాకొనినాడు. ఉదాహరణకు గాయకుని గానము వంటివి భౌతిక వస్తువులు కాకపోయినను అవిగూడ ఆర్థిక శాస్త్రరంగములోనివే. మరియు సాంఘిక సంక్షేమమునకు దోహదకరములుగాని (ఉ: సారాయము తయారు చేయుట) అనేక విషయములు గూడ అర్థశాస్త్రరంగము లోనివే అని రాబిన్సు వాదించెను. సంక్షేమము అను పద ప్రయోగములో నైతిక విషయము ఇమిడియున్నది. అట్టి తీర్పు చెప్పు అధికారము ఆర్థికశాస్త్రమునకు లేదు అనునది రాబిన్సు చేసిన మరియొక విమర్శ. ఈ నిర్వచనము ఆదర్శవాదముపై ఆధారపడినదనియు, ఏ శాస్త్రమును అట్టి పునాదులపై ఆధారపడరాదనియు కూడ ఆక్షేపింపబడినది. హిక్సు మొదలగు ఆర్థికవేత్తలకు ఈ విమర్శనము అంకుశమువలె నాటుటచేత సంక్షేమ ఆర్థిక శాస్త్రమునకు శాస్త్రయుక్తమైన పునాది నిర్మించుటకు వారు కంకణధారులైరి.

కానన్ నిర్వచనమును ఇట్లు చీల్చి చెండాడిన రాబిన్సు, ఆర్థిక శాస్త్రమును. "కోర్కెలకును, బహువిధోపయోగములుగల పరిమితవస్తు సంచయమునకునుగల పరస్పర సంబంధముగా మానవ ప్రవర్తనమును పరిశీలించుట" అని నిర్వచించెను. కేవలము ఆశయములుగాని, సాంఘిక పరిస్థితులుగానిగాక వాటిపరస్పర సంబంధ మే ఆర్థికశాస్త్రము యొక్క పరిశీలనాంశమని రాబిన్సు అభిప్రాయము. అతనిదృష్టిలో ఆర్థిక వేత్త. ఒక మార్గమునకు సంబంధించిన వివిధాంశములను చర్చింపగలడేకాని ఆ మార్గము ఉచితమైనదా యను విషయముపై తీర్పు చెప్పజాలడు.

ఈ నిర్వచనమునగూడ లోపములు లేకపోలేదు. పైనిర్వచనము ఒక ప్రత్యేకరకపు మానవ కార్యములకు పరిమితమై యుండ, ఇది ఒక ప్రత్యేక ప్రవర్తనమునకు పరిమితమైయున్నది. అంతేగాక రాబిన్సు పేర్కొనినట్లు “పరిమితత్వము” ఆర్థిక విధాన మంతటి యొక్కయు సామాన్య లక్షణమని చెప్పుట సాహసము. అంతేగాక ఆర్థిక వేత్త ఆదర్శములపై తీర్పు చెప్ప నని మడిగట్టుకొని కూర్చుండుట అసాధ్యము, అవాంఛనీయమునుగూడ. పెగూ చెప్పినట్లు ఆర్థికవేత్తకు ఇందలి కుతూహలము తత్త్వవేత్తకువలె విజ్ఞానము విజ్ఞానము కొరకేయను జిజ్ఞాసవలన కలిగినది కాదు. రోగిని నయము చేయవలయునను ఆసక్తిగల శరీర శాస్త్రవేత్త యొక్క కుతూహలము వంటి దది. అట్టిపని అవాంఛనీయ మనుటకు కారణము ఆర్థిక వేత్త తీర్పుచెప్పుటయగునేమో అని భయపడినంత కాలము అది కేవలము ఒక సాంకేతిక శాస్త్రముగనే మిగిలియుండి అందుండి మానవ సమస్యల పరిష్కార మార్గములు లభించుట దుర్లభ మగుటయే.

అంతమాత్రముచేత రావిన్సు యొక్క నిర్వచనములో సుగుణము లేదని చెప్పరాదు. ఆ నిర్వచనము పరిమితత్వము (Scarcity), ఎన్నిక (Choice) అను ప్రాతిపదిక లపై నాధారపడి ఆర్థికశాస్త్రరంగమును సువిశాలము చేసినది.

ఆర్థిక శాస్త్రమును ఇంకను పెక్కుమంది పెక్కు విధముల నిర్వచించిరి. ఉదాహరణకు బెవరిడ్జి దీనిని " భౌతి కావసరములు తీర్చుకొనుటకు మానవు లొకరితో నొకరు సహకరించు సామాన్యపద్ధతుల యొక్క పఠనము" అని నిర్వచించెను.

ఆర్థిక శాస్త్ర స్వభావము  : ఆర్థికశాస్త్ర నిర్వచనము తర్వాత ప్రధానమైన ప్రశ్న, ఆర్థికశాస్త్రము ఒక శాస్త్రమగునా, కాదా యనునది. శాస్త్రము (Science) అను అర్థములో తీసికొనినచో పారిశ్రామిక విప్లవమునకు పూర్వము గల ఆర్థిక శాస్త్రమునకు అర్థశాస్త్ర మనిపించు కొనుటకు పూర్తిగ అర్హత లేదు. ఈ విప్లవారంభములోనే ఆడమ్ స్మిత్ మహాశయుని కృషివలన ఈ శాస్త్రమునకు పునాదులు వేయబడినవి. ఆర్థికశాస్త్ర మొక సాంఘిక శాస్త్రము; సంఘములోని మానవు డిందలి విషయము; గమనించిన విషయసామగ్రి ఆధారముగ సంఘమందలి సామాన్య లక్షణములను కనుగొనుటయే యిందు జరుగు ప్రయత్నము. ఐతే దీనిని ఒక కళ (art) అను వారును లేకపోలేదు. పెగూ యను ఆర్థికవేత్త దీనిని నీతిశాస్త్రమునకు సహకారిణి (A hand maid of ethics) అని వర్ణించినాడు. ఇతని దృష్టిలో ఆర్థికశాస్త్రమనగా మెదడుతో వ్యాయామము చేయుట కారాదు.

అయితే ఈ రెండు అభిప్రాయములును రెండు అతివాదములై యున్నవి. స్వచ్ఛ రూపములో ఆర్థికశాస్త్రమొక శాస్త్రమే. అది పెగూ చెప్పినట్లు ఆచరణలో పనికి వచ్చు సూచనలిచ్చు బాధ్యతకల్గి యుండుటయు నిజమే. కావున "కళకు ఆధారము కాజాలు శాస్త్రము" అను 'వర్ణనము సమంజసముగా నుండును.

ఇది శాస్త్రమే ” యగు నెడల ఈ శాస్త్రములందలి నియమముల స్వరూపమెట్టిడి యమ ప్రశ్నము ఉదయింప గలదు. అవి భౌతిక శాస్త్రము రసాయనశాస్త్రము మొదలగు శాస్త్రము లందలి : నియమము లంత నిర్దిష్టములు కావు. కాని మార్షల్ చెప్పినట్లు, ఇతర సాంఘిక శాస్త్రము లందలి నియమములకన్న ఇవి మిగుల నిర్దుష్టమయినవని అంగీకరింపవలసి యుండును. ఈనాడు గణితము మొదలగు శాస్త్రముల సహకారముతో ఆర్థికశాస్త్రము మరింత శాస్త్రయుక్త మగుచున్నది.

ఆర్థిక శాస్త్రము = ఇతర సాంఘికశాస్త్రములు  : (1) ఆర్థిక శాస్త్రము - సంఘశాస్త్రము (Sociology) : కామ్టే అను నతడు ఆర్థికశాస్త్ర మొక ప్రత్యేక శాస్త్రము గాదనియు అది సాంఘికశాస్త్రమందు అంతర్భాగమనియు చెప్పెను. ఇది కొన్ని విషయములం దట్లు కనబడినను, దీని ఉద్దేశములు వేరు. ఈ రెండు శాస్త్రముల యొక్క అవకాశ, ప్రమేయములలోనే భేదము కలదు.

(2) ఆర్ధిక శాస్త్రము - రాజకీయ శాస్త్రము : పై రెండును సన్నిహితములుగా గోచరించినప్పటికినీ భేదము లున్నట్లే. ఈ రెంటియందును భేదము లెంత ప్రస్ఫుటములుగా నున్నప్పటికిని వీటి పరస్పర సంబంధము బహు సన్నిహితము. 'పొలిటికల్ ఎకానమీ' అను పేరు ఈ శాస్త్రమునకు ఇటీవలివరకు ప్రయోగింప బడుటయే యిందులకు ప్రబలసాక్ష్యము, నవీనార్థిక శాస్త్ర జనకుడగు ఆడమస్మిత్ దీనిని ప్రభుత్వమునకు రాబడి తెచ్చు సాధనముగ పరిగణించెను. ఆర్థిక కార్యములు రాజకీయ చట్రము లోలోపల నే జరుగును. మరియు అనేక రాజకీయ సమస్యల పునాదులు ఆర్థికము లగుటయు కద్దు. అంతేగాక ఈ రెండు శాస్త్రములకు సంబంధించిన విషయములు పెక్కు గలవు. ఈనాడు ఎల్లెడల వినబడు సామ్యవాద వ్యవస్థను అందుకు ఉదాహరణముగా పేర్కొనవచ్చును.

(3) ఆర్థిక శాస్త్రము, నీతిశాస్త్రము - ఏదితప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించునది నీతిశాస్త్రము. ఆర్థిక శాస్త్రము ఆ విషయములో మూకీభావము వహించును. కాని అర్థ శాస్త్ర విషయములనుండి నీతిశాస్త్ర ఆదర్శములకును, నీతిశాస్త్ర - ఆదర్శములనుండి సంక్షేమ - ఆర్ధికశాస్త్రమునకును పుష్టి కలుగుచున్నది. ఐతే మద్యపాన నిషేధము వంటి కొన్ని సమస్యల పై ఆర్థికశాస్త్రవేత్త చూపు వేరు, నీతిశాస్త్రవేత్త దృక్పథము వేరు.

ఇంతవరకును ఆర్థికశాస్త్ర స్వరూప, స్వభావముల గూర్చి, స్థూలముగ చర్చించితిమి. ఇట్టి చర్చవలన మనము వివాదములకు వ్యామోహితుల మగు ప్రమాదము తప్పగలదు. మనకు ఈ శాస్త్రమువలన వాస్తవిక దృష్టి అగపడు ననుటకు ఎన్నేని ఉదాహరణము లీయవచ్చును. మన జాతీయోద్య మారంభములో రేనడీ మహాశయుని గ్రంథములు, దాదాభాయి నౌరోజీ భారతీయ దారిద్య్రమునుగూర్చి వ్రాసిన గ్రంథము - ఇవి మన కనులను విప్పిన అమూల్య గ్రంథములు. కేవలము భారీ పరిశ్రమలే త్రవ్వి తలకెత్తునను వ్యామోహములో చిక్కుకొనియున్న మనకు డా. కుమారప్పవంటి గాంధేయ ఆర్థిక శాస్త్రవేత్తలు, మహాత్ముని యొక్క వికేంద్రీకరణ సూత్రమును వివరించి మేలు చేసిరి. అంతేగాక "స్వచ్ఛమగు ఆర్థిక శాస్త్రము" మేధకు ఆసనము వంటిది. సంక్షేమ ఆర్థిక శాస్త్రము పరిపాలకులకును, శాసనసభ్యులకును చక్కని సూచనలు నీయజాలును. ఆర్థిక సమస్యలకు ఈనాటి ప్రపంచములోగల ప్రాధాన్యమును గుర్తించినవారికి ఈశాస్త్రపఠన మెంత ప్రయోజనకరమో సుస్పష్టమగును. ప్రపంచశాంతిని కాపాడుటయే ఆశయముగాగల ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యమున ఆర్థిక విషయములలో పని చేయుటకు ప్రత్యేక శాఖలు నెలకొల్పబడినవి.

ఈ యంశము లన్నియు ఆర్థిక శాస్త్రమునకు నేటి జీవితములోగల ప్రాధాన్యమును స్పష్టపరచుచున్నవి.చిన్న పంచాయితీ సంస్థ, రాబడి సమస్య మొదలుకొని పార్లమెంటు చర్చించు ఆదాయ వ్యయ పట్టిక వరకును ప్రతిచిన్న సమస్యను, పెద్ద సమస్యను గ్రహించుటకు ఆర్థిక విజ్ఞానము అవసరము. ముఖ్యముగా ప్రభుత్వమునకు ఆర్థికరంగమున గల స్థానము వికేంద్రీకరణము -మొదలగు సమస్యలపై తర్జన భర్జనలు జరుగు నీనాడు భారత యువకులు కీ శాస్త్రములో సమగ్ర విజ్ఞాన మావశ్యకము.

డా. ఆర్. వి. రా.

[[వర్గం:]]