Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అర్జెంటైనా

వికీసోర్స్ నుండి

అర్జెంటైనా  : 1516 వ సంవత్సరములో రయోడిలా ప్లాటా అను ప్రదేశమును డా౯ జువా౯ డయాజ్ డిపోలిస్ అను యాత్రికుడు గొనెను. ఈ దేశము దక్షిణ అమెరికా ఖండములోనిది. 1816 లో అర్జెంటైనా రిపబ్లికా అను రాజ్యము స్పెయిను వారి పరిపాలనము నుండి స్వాతంత్య్రము సాధించుకొనెను. ఇది 27 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యముకలిగి, ఒకకోటి 78 లక్షల ప్రజలతో నిండియున్నది.

జనులు, పరిపాలనము : ఇది ప్రజాస్వామ్యదేశము 1949లో రాజ్యాంగనిర్ణయము జరిగినది. ఈ దేశములో 16 రాష్ట్రాలు, 8 ప్రదేశాలు, 1 ఫెడరలు జిల్లా ఉన్నవి. ఈ దేశములో నున్న వారిలో ఎక్కువ మంది ఖండము నుండి వచ్చినవారే. వారిలో ఇటలీ, స్పెయిను దేశాలవారు ఎక్కువమంది ఉన్నారు. ఇండియనులు అను స్థానిక వాసుల సంఖ్య 30,000 లకు మించిలేదు. ప్రజలలో పెక్కురు క్రైస్తవులు కలరు. వీరు రోమను కాథలిక్ శాఖకు చెందినవారు. 6 మొదలు 12 సంవత్సరాల వరకు పిల్లలకు ఇచట ఉచితవిద్య ఒసగబడును.1950 లో 90,201 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో చదువుచుండిరి. ఇచటి ఫెడరలు న్యాయస్థానము, రాష్ట్ర న్యాయస్థానాలు వివాదాలను తీర్చు చున్నవి. బ్యూనాస్ ఐర్స్ అను పట్టణము అర్జెంటైనాకు రాజధాని. అక్కడ సర్వోన్నత న్యాయస్థానము (Federal Court) ఉన్నది. సైన్యములో నౌకాబలము ఎక్కువ. దానిలో 500 ఆఫీసర్లు, 11,000 నావికులు ఉన్నారు. 50 నౌకలు పనిచేయుచున్నవి. అమెరికా నుండి యుద్ధ నౌకలు కొనబడినవి.

ఆర్థిక పరిస్థితులు  : అర్జెంటైనాలో ముఖ్య పరిశ్రమ పశువులను పెంచుట. ఇచ్చటి పశుసంఖ్య 3 కోట్ల 75లక్షల పరిమితి గలిగి, ప్రపంచములో చతుర్థస్థానమును ఆక్రమించుకొనుచున్నది. అర్జెంటైన్ పశువులసంస్థద్వారమున ఈ పశు పరిశ్రమ జాతీయము చేయబడినది. ఇచటి నుండి జరుగు మాంసము యొక్క ఎగుమతి ప్రపంచములో ప్రథమ స్థానమును ఆక్రమించినది. బ్యూనాస్ ఐర్సిలో ప్రపంచములో నెల్ల మాంసము నిలువచేయు గొప్ప యంత్రాగార మొకటి ఉన్నది. అందులో ప్రతిదినము 5000 పశువులు, 10,000 గొజ్జెలు వధింపబడి, వాటి మాంసము నిలువచేయబడు చున్నది. ఇచట గోధుమపంట ఇటీవల వృద్ధిఅయినది, నూనెగింజల ఉత్పత్తిలో, వ్యాపారములో అర్జంటైనాకు అగ్రస్థానము ఉండెడిది. ఇప్పుడు నూనెను ఈ దేశములోనే తీయుచున్నారు. గోధుమ రవ్వను తయారుచేయుట ఈ దేశములో రెండవ పెద్ద పరిశ్రమ. ఆధునిక పరిశ్రమలు స్వల్పముగా స్థాపింపబడినవి. ఇచటి విదేశ వర్తకమంతయు ప్రభుత్వమే చేయు చున్నది. అర్జెంటైనా, పారిశ్రామిక వస్తువులను చాల భాగము దిగుమతి చేసికొనుచున్నది. ఇది ఇంచుమించు పూర్తిగా బ్రిటను దేశముతోనే విదేశ వ్యాపారమును చేయుచుండును. కాని, వ్యాపారము అంతయు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రములతోనే జరుగుచున్నది. పెక్కు రైలు మార్గాలు కలవు. 46,000 కిలోమీటర్ల రైలు మార్గము ప్రభుత్వము అధీనములో ఉన్నది.నౌకా వ్యాపారము ఎక్కువగా నున్నది.

డి. వి. కృ.

[[వర్గం:]]