Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరేబియా (భూగోళము)

వికీసోర్స్ నుండి

అరేబియా (భూగోళము) :- స్థాన నిరూపణము : అరేబియా ఆసియా యొక్క నైరృతి దిక్కునందు 34° 30' ఉ; 12°45' ఉ. యొక్కయు,32° 30' ;మరియు 60° తూ. ల యొక్కయు నడుమ వ్యాపించి యున్నది. అది పశ్చిమమున ఎఱ్ఱ సముద్రముచేతను ; దక్షిణమున హిందూ మహాసముద్రము చేతను, ఏడెన్ సింధు శాఖ చేతను; తూర్పునందు ఓమెన్, పర్షియన్ సిందుశాఖల చేతను చుట్టుకొనబడియున్నది. ఉత్తరమున ఇరాక్, ఇస్రాయిల్ దేశములు అను భూ భాగములు ఎల్లలుగా నున్నవి.

వాయవ్య దిశనుండి ఆగ్నేయ దిశ వరకు ఈ ద్వీప కల్పము యొక్క గరిష్ఠ దైర్ఘ్యము కాననగును. మొత్తము విస్తీర్ణము దాదాపు 12,00,000 చదరపు మైళ్ళు.

'సామాన్య లక్షణములూ: అరేబియా ఒక పీఠభూమి. అది నైరృతి దిశనుండి ఈశాన్య దిశ వైపునకు ఏట వాలుగా నున్నది. దాని నైరృతి దిగగ్రము మిక్కిలి ఉన్నత మైనది.

నిట్రముగానున్న పడమటి అంచు ఎఱ్ఱసముద్రమట్టము నుండి 4000 అడుగులు మొదలుకొని 8000 అడుగుల ఎత్తును కలిగియున్నది. 30 మైళ్ళకు మించని వెడల్పు గలిగిన మండల మొకటి సముద్రతీరమునకును, పర్వతపాదములకును నడుమ నేర్పడుచున్నది. ఈ పీఠభూమి యొక్క పూర్వోత్తరభాగము క్రమముగా, యూఫ్రటీసు నదివైపునకును, పర్షియన్ సింధుశాఖ వైపునకును వాలియున్నది. పూర్వ దిశాంతమునందు జె బెల్ల్-అఖ్తర్ పర్వత పంక్తి ఈ వాలును అడ్డగించుచున్నది.

నీటివసతి లేకపోవుటవలనను, అనిశ్చిత మైన వర్షపాతము వలనను ఎడారిమొత్తములో భాగము మాత్రమే స్థిర నివాసమునకు యోగ్యమైయున్నది. నైరృతి ఋతుపవనముల మార్గమునకు ఎడముగా నుండుటవలనను, ఎత్తైన కొండలు లేకపోవుటవలనను, ఇచట చాలినంత వర్షము పడదు. కాబట్టి అది వట్టి శుష్కమైన పీఠభూమి. నదులు అప్పుడప్పుడు వరదలై పారును కాని సాధారణముగ అవి ఎండియే యుండును. అరేబియాను మూడు నైసర్గిక భాగములుగా విభజించవచ్చును. (i) ఉత్తరభాగము, (ii) మధ్యభాగము, (iii) దక్షిణ భాగము,

(i) ఉత్తరభాగము :- ఇంచుమించు ఉత్తరభాగమంతయు ఇసుకతోను రాళ్లతోను నిండియుండును. కాని కొన్ని ఋతువులలో ఉత్తమమైన పచ్చిక బయళ్ళు అక్కడ కనిపించును. జనులందరును దాదాపు స్థిరనివాసములు

లేక ద్రిమ్మరుచుందురు. గోపాలకవృత్తి నవలంబించు చుందురు.

(ii) మధ్యభాగము:- ఇది శుష్కమైనది. ఇసుక స్టెప్ లతోను, రాళ్ళతోను నిండియుండును. అచ్చటచ్చట కొన్ని బావులు కనిపించును. ఎప్పుడును సంచరించు స్వభావముగల జను లీప్రాంతము నాక్రమించియుందురు. ఇక్కడ సేద్యము చేయుటకు కొంత అవకాశము కలదు.

(iii) దక్షిణభాగము -ఇందుఆసియాఖండపు ఎత్తయిన పీఠభూములు కలవు. పశ్చిమమున ఎమెను, తూర్పున జెబెల్ అఖ్తర్ అను పర్వత పంక్తులు కలవు. ఉన్నత ప్రదేశ మగుటవలనను, సముద్రము సమీపమున నుండుటచేతను, ఇచటి శీతోష్ణ స్థితి సమముగా నుండును. జనులు వ్యవసాయమే వృత్తిగా గలవారు. ఈద్వీపకల్పముతో ఓమెన్ ప్రాంతమునందలి బాటినా తీరము మిక్కిలి సారవంతమయిన మండలము ఆమండలము జేబిల్ - అఖ్తర్ కొండల నుండి పారు ఏరుల సహాయముతో సాగు చేయ బడుచున్నది.

ఉద్బిదజాలము : వేసవి కాలములో అన్ని ప్రాంతము లందును జొన్నలు, ధురా, దుఖాన్ మున్నగు ఆహార ధాన్యములను ఇచట పండింతురు. పీఠభూములలో మొక్కజొన్న, గోధుమ, బార్లీ, చలికాలమునందు పరిమితముగా పండింతురు. గుమ్మడికాయలు, ముల్లంగి గడ్డలు, దోసకాయలు, కర్భూజాకాయలు బంగాళాదుంపలు, ఉల్లిగడ్డ, వీక్సు (ఒక విధమైన ఉల్లి) మున్నగు శాకములు పండింతురు. గులాబీ, మల్లె, వాము చెట్టు, లవెండరు మున్నగు సువాసనగల మొక్కలను ఇచట పరిమళద్రవ్యములను తయారు చేయుటకయి పెంచుదురు. 4000 నుండి 7000 అడుగుల ఎత్తుగల ప్రదేశములలో కాఫీ ఉత్పత్తి జరుగును. అరేబియా ఖర్జూరపు చెట్లకు సుప్రసిద్ధము.

జనులు : ఇచటి జనులు రెండు తెగలకు చెందినవారై యున్నారు. అచ్ఛమైన అరబ్బులనియు, ముస్తారబ్ లేక స్వదేశస్థులుగా అంగీకరింపబడిన వారనియు. ఇచటి మొత్తము జనాభా 60 లక్షలు. ఇందులో సంచరణ శీలురైనవారు పదిలక్ష లుందురు. జనులు విశేషముగా ద్వీపకల్పము యొక్కతీరప్రాంతమందు నివసింతురు. వారు వర్షపాతమున్న ప్రాంతములలో భూమిని దున్ని వ్యవసాయము చేసి కొందురు.

జంతుజీవనము :ఒంటె అరబ్బులకు మిక్కిలి ఉపయోగకరమైన పెంపుడు జంతువు. ఇది దప్పికను సహింపగలుగును. అందుచేత ఇది ఎడారిలొ దీర్ఘమైన ప్రయాణము చేయగలదు. దీనిపాలుమనుష్యులకును, గుఱ్ఱములకును జీవనాధారము. సాధారణముగా, 400 పౌనుల బరువును మోయును. ఎండకాలములో దినమునకు 20, 25 మైళ్లవరకు ప్రయాణము చేయగలదు. మూడు నాలుగు దినముల కొకసారి దీనికి నీరు అవసరమగును. చలికాలమున 25 దినములు మీరి నీరు త్రాగకుండ ఇది బ్రతుకకలదు. సవారి చేయువానిని సవారిఒంటే దినమునకు నూరుమైళ్లు మోసికొనిపోగలదు. ఎడారి వేడిమిని తుఫాను గాలులను తట్టుకొనగలదు. కావున దీనికి 'ఎడారి ఓడ' అను పేరు కలిగినది.

ప్రముఖులైన పేకులు, అమీరు కుటుంబముల వారు మాత్రమే గుఱ్ఱములను పోషింతురు. దాడులు జరుపుటకు మాత్రము వీటిని ఉపయోగించుచుందురు. వీటికి కావల సిన మేతను నీటిని ఒంటేలపైన తీసికొనిపోవుచుందురు. ఉత్తరభాగమునందలి ఎడారిలోను, మెసపొటోమియాలోను, అనేజ, షమ్మర్ అను జాతులవారు అధికసంఖ్యలో గుఱ్ఱములను పోషింతురు. ఇచ్చట కొన్ని ఉత్తమజాతికి చెందిన గుఱ్ఱములును కలవు. కాని అవి దప్పికను ఓర్చు కొనజాలవు. అరేబియా దేశమందంతటను గాడిదలను పెంచుదురు. పట్టణములందు ధనికులు వీటిపై నెక్కుదురు. వీటి పాలను కూడా జనులు ఉపయోగింతురు. ఈ దేశమునందు గల జనుల ఆస్తులలో గొట్టెలు, మేకలు ముఖ్యమైనవి. ఎండ కాలమున రెండు దినములకొకసారి నీరు త్రావును. ఇచటి స్త్రీలు దినమున కొకసారి సంజ వేళ పాలు పితుకుదురు.పు రు షు లు ఒంటె పాలను పితుకుదురు.

బి. యజ, చ.

[[వర్గం:]]