Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అరేబియా (చరిత్ర)

వికీసోర్స్ నుండి

అరేబియా (చరిత్ర) :- అరేబియా చరిత్ర యనగా అరబ్బుల చరిత్ర, అరేబియా దేశపు ప్రజలు అరబ్బులు అనబడుదురు. కాని "అరబ్బులు" అను పదమును విశాలదృష్టితో నుపలక్షించిన యెడల. ఇందు అరేబియా దేశ వాసులు మాత్రమేకాక, ఇతర దేశములలో నివాసముగనున్న మరికొందరు ప్రజలు కూడ చేరుదురు. ఆయా కాలము లందు అరేబియా దేశవాసులు పరరాష్ట్రములను జయించి, అచ్చట పరిపాలకులుగ శాశ్వత నివాసము లేర్పరచుకొనిరి. మరికొందరు అరబ్బులు, వ్యాపారము కొరకును, ఇతర కారణములవలనను ఇతర రాజ్యములకు వలసపోయి, అచ్చటనే శాశ్వతముగ నిలచిపోయిరి. వీరు కాలక్రమమున స్థానికులగు ప్రజలతో కలసిపోయి నందున, ఒక సమష్టి ప్రజ యేర్పడినది. ఆ మిశ్రజాతులు కూడ నేడు అరబ్బు ప్రజలుగ పరిగణింపబడుచున్నారు. ఈ నూతన అరబ్బులు ఆకార లక్షణములందు అరేబియా నివాసులకంటే భిన్నులుగ నున్నను వారిని అరబ్బీ భాష, అరబ్బీ సభ్యత, ఇస్లాంమతము అను మూడు స్వర్ణ సూత్రములు ఏకస్థుల గావించి బంధించుచున్నవి. కేవలము అరేబియా దేశవాసులు 80 లక్షలకు పైబడియున్నారు. వీరు కాక ఇరాకు, సిరియా, లెబనాన్, పాలస్తీనా, ట్రాన్స్ జోర్డాన్, ఈజిప్టు, ఉత్తర సూడాన్ ప్రాంతము లలో అరబ్బీ భాష మాట్లాడువారు 3½ కోట్ల ప్రజలుకలరు. లిబియా, ట్యునీసియా, అల్జీరియా, మొరాకో ప్రాంతము లందుకూడ అనేకులు అరబ్బులు నివసించుచున్నారు. కాని ప్రస్తుతము మన మీ విశాలమగు అరబ్బుజాతి చరిత్రను 'కాక, పరిమితమగు అరేబియా నివాసులు కథను సంగ్రహముగ తెలిసికొనగలము.

అరేబియా నివాసుల చరిత్రను మూడు భాగములుగ విభజింపనగును. అతి ప్రాచీన కాలమునుండి క్రీ. శ. 622 వరకు మొదటియుగము. క్రీ.శ. 622 నుండి 1750 వరకు మధ్యమ యుగము. 1750 తరువాతయుగము ఆధునిక యుగము.

ఆదికాలమున అరేబియా యొక్క దక్షిణ భాగమున నాగరకులగు ప్రజలు నివసించుచుండిరి. వారికి ప్రత్యేకమగు రాజ్యమును, మతమును, భాషయు, విజ్ఞానమును ఉండెడివి. వీరు స్వచ్ఛమగు అరబ్బీజాతి వారనియు, ఉత్తర అరేబియాయందు నివసించుచు, సంచార శీలురుగానున్న బదాయూన్ అరబ్బులు మిశ్రమజాతివారనియు, ఆ దేశములో వాడుక గలదు. చాలకాలము వరకును ఔత్త రాహులగు అరబ్బులు, దాక్షిణాత్యులు యాధిక్యమును, వారి విజ్ఞానమును అంగీకరించి మెలగుచుండెడివారు. కాని క్రీస్తుశకము ప్రారంభమైన వెనుక, అరేబియాకు ఉత్తరముననున్న, సిరియా, మెసపొటోమియా రాజ్యముల వారి ప్రభావము, ఉత్తర అరబ్బు ప్రజలపై ప్రసరింపసాగెను. ఉత్తర అరేబియాలో క్రొత్త రాజ్యములు బయలుదేరెను. ఇవి లభ్మిడ్, ఘసానీడ్ అను పేర్లు గలవి. ఇవి క్రైస్తవులచే పాలింపబడెను. క్రీస్తుశకము అయిదు ఆరు శతాబ్దులు అరబ్బుల చరిత్రయందొక స్వర్ణయుగము. ఆకాలమునాటి అరబ్బులు వీరులును, దేశభక్తులును, ఉదారులు నై యుండిరి. అతిథి పూజనము వారి ముఖ్య సద్గుణములలో నొకటి, ఆ కాలమున హాతింతాయివంటి మహాపురుషులు అరబ్బులలో జన్మించిరి. కాని ఈ యుగమున అరబ్బులలో అనేక దురాచారములుకూడ వ్యాపించెను. సురాపానము, ద్యూతము, పసిబాలికలను సజీవముగ పాతి వేయుట, స్త్రీలకు సమాజములో అర్హ స్థానము లేకుండుట మున్నగు గొప్ప లోపములు వీరియందుం డెను. ఈ కాలమున యెమెన్, జీమన్, హెజాజ్, నెజ్ద్ ప్రాంతములలో కొన్ని చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములు నెలకొని యుండెను. అందు కొన్ని కేవల నగర రాజ్యములు. మ్వానిలో హెజాజ్ నందలి మక్కా పట్టణము ముఖ్యమైనది. ఇది పవిత్రమగు యాత్రాస్థలముగను, వ్యాపార కేంద్రముగనుకూడ ఖ్యాతి వహించెను. ఇట్టి మక్కా నగరమున ప్రవక్తయగు మహమ్మదు జన్మించెను.

ప్రవక్తయగు మహమ్మదు నూతనమగు నొక మతమును స్థాపించుటయేకాక, అరేబియాయం దొక బలమగు ప్రభుత్వమును నెలకొల్పి, అరబ్బు ప్రజలను సంఘటిత పరచుటకై యత్నించెను. ఆయన మరణించుసరికి పశ్చిమ అరేబియా అంతయును, మక్కా మదీనా పట్టణములును ఆయన వశమయ్యెను. మహమ్మదు తరువాత రాజ్యమునకు వచ్చిన మొదటి ఖలీఫాయగు అబూబకర్ అరేబియా రాజ్యమునంతను జయించి, ప్రభుత్వమును బలపరచెను. క్రమక్రమముగా అరబ్బులు పశ్చిమమునకు వ్యాపించి, ఆఫ్రికా, ఐరోపాఖండములలో తమ సామ్రాజ్యమును విస్తృత పరచిరి. అనేక కారణములవలన అరబ్బు రాజ్యములో అంతఃకలహము లుప్పతిల్లెను. క్రీ.శ.660 వ సంవత్సరమున, డెమాస్కస్ నగరము అరబ్బు రాజ్యమునకు ముఖ్యస్థాన మయ్యెను. ఇచ్చటినుండి పరిపాలనము కావించిన ఒమయ్యదు ఖలీఫాలు అరేబియా సామ్రాజ్య సర్వస్వమునకును ఏలికలుగ నుండిరి. వారి యనంతర మధికారముపూనిన అబ్బాసీ ఖలీఫాలు తమ కేంద్రమును బగ్దాదు నగరమునకు మార్చిరి. అందువలన క్రమముగా అరేబియా ప్రజలకును, ఖలీఫాల రాజ్యమునకును సంబంధములు తెగిపోయెను. అరేబియాయందు కేంద్ర ప్రభుత్వము లేదయ్యెను. అంతఃకలహములు చెలరేగి, దేశమున చిన్న రాజ్యములు 'నెలకొనెను. మహమ్మదు ప్రవక్త వారసులగు షరీపు వంశీయులు, ఈ అంధకార యుగములో కొంత ప్రాముఖ్యమును సంపాదించిరి. కాని వారుకూడ ఈజిప్టు రాజులకును, ఆపైన కాస్ స్టాంటినోపిలునుండి గొప్ప సామ్రాజ్యమును పాలించిన తురుష్క చక్రవర్తులకును వశులైరి. ఇది మధ్యయుగవు చరిత్ర.

అరేబియా దేశము యొక్క ఆధునిక చరిత్రలో వహాబీ ఉద్యమము పేర్కొనదగినది. ఈ ఉద్యమమును ప్రారంభించిన యాతడు మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్. ప్రవక్త మహమ్మదుచే బోధింపబడిన ఇస్లాము మతము నందు కాలక్రమమున ప్రవేశించిన లోపములను సంస్కరించి, సత్యమగు ఇస్లాము మతమును మరల నెలకొల్పవలెననియు, ఆనాడు అరేబియాలో వ్యాపించియున్న అంతఃక లహములను తుదముట్టించి, బలమైన యొక అరబ్బు రాజ్యమును స్థాపింపవల ముననియు, ఈ సంస్కర్త ఆశయములు. వహాబీ ఉద్యమము 18 వ శతాబ్దియందు ప్రారంభమై క్రమముగ బలపడెను. మొదటినుండియు సౌదీ వంశమువారు వహాబీ ఉద్యమమును బలపరచి, అరబ్బు జాతీయ రాష్ట్ర స్థాపనకై యత్నింప సాగిరి. ఈ ప్రయత్నములో తురుష్కులు వీరిని ప్రతిఘటించిరి. ఈ కథా కాలమునాటికి అరేబియా, తురుష్క సామ్రాజ్యములో నొక భాగముగ నుండుట గమనింపదగినది. అయినను వెనుదీయక వహాబీలు రియాఫ్ అనుచోట తమ ముఖ్యస్థానమును నెలకొల్పి, నూతన రాజ్య స్థాపనమునకై ప్రయత్నములు సాగించిరి. 1902 సంవత్సరము నాటికి అబ్దుల్ అజీజ్ ఇబ్న్ సౌద్ అనునాయకుడు వహాబీ ఉద్యమమునకు 'నేతయై దానిని బలపరచెను. ఇతడు క్రమముగ తన రాజ్యమును పెంపొందించుకొని, మొదటి ప్రపంచ యుద్ధమున ఆంగ్లేయుల పక్షము వహించి, తురుష్కులతో పోరాడి వారి నోడించెను. ఈ విధముగ ఇబ్న్ సౌద్ బలపడెను. ఈ రాజు మిక్కిలి రాజనీతి కుశలత గలవాడు. ఈతడు తన దేశములోని తిరుగుబాటు దారుల నణచివైచియు, బలవంతులగు నాంగ్లేయులతో స్నేహభావము పాటించియు, నేటిబలవత్తరమగు సౌదీఅరేబియా రాజ్యమును నెలకొల్పగల్గెను. ఈతడు ఎఱ్ఱ సముద్ర తీరమునను, పారసీక గుడ ప్రాంతమునందును గల నూనె గనులను అమెరికా కంపెనీలకు కౌలుకిచ్చి విశేషధనమును సేకరించెను. ఆ ధనమును వ్యయపరచి, అతడు తన రాజ్యమునందు గనులను త్రవ్వించియు, నీటి పారుదల సదుపాయముల గావించియు, అరబ్బు ప్రజల క్షేమమునకై పాటుపడెను. ఇబ్న్ సౌద్ తన రాజ్యములోని వివిధ భాగములకు స్వపరిపాలనాధికారము నొసంగి, ప్రజాస్వామిక సిద్ధాంతముల నంగీకరించెను. రెండవ ప్రపంచయుద్ధములో ఇబ్న్ సౌద్ రాజు తటస్థభావమును వహించి, యుద్ధపు దుష్ఫలితములనుండి తన రాజ్యమును కాపాడెను. అరేబియా యొక్క ఆధునిక చరిత్రలో ఇబ్న్ సౌద్ రాజు పరిపాలన మొక ముఖ్యఘట్టము.

అరబ్బులు కేవలము వీరులుమాత్రమే కారు. వారి యందు విజ్ఞానపిపాస కూడ మిక్కుటముగ కలదు. అరబ్బీ భాష ప్రపంచములోని ఉత్తమ ప్రామాణిక భాషలలో నొకటిగ పరిగణింపబడుచున్నది. ఈ భాషయందు ప్రవక్త మహమ్మదునకు పూర్వమే ఉన్నతస్థాయికి చెందిన కవిత్వము ఆవిర్భవించెను. ఇస్లాము మతము దేశ దేశాంతరములలో వ్యాపించిన కాలమున అరబ్బీ భాషకూడ మిక్కిలి అభివృద్ధి గాంచెను. అబ్బాసీ వంశపు ఖలీఫాల కాలమున అరబ్బీ భాష యందు అనేక శాస్త్ర గ్రంథములు రచింపబడెను. అల్ మన్సూర్, హారూన్ అల్ రషీద్ అను ఖలీఫాలు గొప్ప విద్యాపోషకులుగ ఖ్యాతివహించిరి. వారి ప్రోత్సాహము వలన గ్రీకు, పారసీక, సిరియన్ భాషలలోని అనేక ఉత్తమ గ్రంథములు అరబ్బీ భాషలోని కనువదింపబడెను. ఈ ఖలీఫాలు బాగ్దాదు, బాస్రా, క్యూఫా, బొఖారా, అలెగ్జాండ్రియా నగరములందు ఉత్తమ విద్యా కేంద్రములను గ్రంథాలయములను నెలకొల్పిరి. అరబ్బులు చారిత్రిక రచనము, భూగోళశాస్త్రము, గణితశాస్త్రము, తత్త్వ శాస్త్రము, ఖగోళశాస్త్రము, వైద్యశాస్త్రము మున్నగు విద్యలందు గొప్ప ప్రజ్ఞను సాధించి, చక్కని గ్రంథములను రచించిరి. అరబ్బులు శిల్పకళను కూడ మిక్కిలి అభివృద్ధి కావించిరి. స్పెయిను దేశమున అరబ్బులచే నిర్మింపబడిన ప్రాచీనపు కట్టడము లిందులకు నిదర్శనము.

ఖ. భా.

[[వర్గం:]]