సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలంకరణ కళ
అలంకరణ కళ (Decorative Art) :- 'అలంకార ప్రియో విష్ణుః' అని హిందువులు విశ్వసింతురు. అలం కరణము మానవుని స్వభావము కూడ. తాను ఉపయోగించు వస్తువులను బుద్ధికింపగురీతిని కూర్చుట లేక చిత్రించుట మానవునికి సహజమైనపని. ఇదియే అలంకరణము, కాగితాలతో పూవులుచేయుట, ముగ్గులు వేయుట, జిలుగు కుట్టుట మొదలగు పనులు అలంకారములు అనబడును.
అలంకరణము మానవుని హృదయమును రంజింపజేసి ఆహ్లాదమును కూర్చును. మనకు నిక్కమైన ధనము అలంకరణమే. మనము డబ్బుచేత డాబును కొనుచున్నాము. గౌరవమును, భోగమును, కీర్తి ప్రతిష్ఠలను కలిగించునది ఈ కళయే. నేటి ఏడంతస్థుల మేడ, సోఫా సెట్లు, అల్మా గీలు, పట్టు తివాచీలు, నాటి దర్బారు వైభవాలు, రాజ దండములు, రాజ చిహ్నములు - ఇవన్నియు అలంకరణ ఫలితములే. వీటినిబట్టియే ప్రపంచమున గౌరవమేర్పడు చున్నది. వేయేల ? వెండి రూపాయిగా మారుట, కాగితము నోటుగా మారుట అలంకరణ కళాప్రభావమే. సభ్యత యనునది ఈ కళకు బుట్టిన బిడ్డయే.
పై కళాః విషయ మంతయు మానవుని సృష్టియై యున్నది. కాని ఆకాశము, మబ్బులు, పర్వతాలు, పృథ్వి, అగ్ని, జలము, చెట్లు చేమలు మొదలగునవన్నియు బహ్మ సృష్టికి చెందినవి. ప్రకృతి యొక్క అనుకరణము మానవుని సృష్టిలో గాంచెదము. సర్వస్వతంత్ర సృష్టి సర్వేశ్వరునిదే. సర్వ స్వతంత్రమై, పరిపూర్ణమైన సర్వేశ్వరుని సృష్టిలోని నిరుపమాన సౌందర్యమును కళాకారుడు ఖండఖండములుగా చిత్రించుకొనుచున్నాడు. 'సత్యం' 'శివం' 'సుందరం' అనునట్టి ఆ పరతత్త్వ పరిణత దశను సౌందర్య స్వరూపముననే ఆరాధించుట గాంచగా, సౌందర్యము ఇహ పరములు రెంటికిని సాధన మని తెలియగలదు, సౌందర్యము ప్రతి వస్తువులోను అంతర్గతముగ వెలుగుచున్న యొక తీపి. దానిని రేఖలచే వ్యక్తపరచి రంగులతో ఉజ్జ్వలపరచుటకు చేయు ప్రక్రియయే చిత్రకళ అనబడును.
బ్రహ్మ సృష్టిలోని దృశ్యములను పరిశీలించినచో వాటి నిర్మాణములో నొక క్రమము, విన్యాసము, కనిపించును. సృస్టియనునది పునరావృత్తికలిగి దేశ కాలమానములచే నొప్పుచున్నది. చిత్రకళలో అలంకరణము ఒక భాగము మాత్రమే అయియున్నది. కేవలాలంకరణము సౌందర్యమును మాత్రమే సృష్టించును. సందేశమునిచ్చు చిత్రములు వేరుగా నుండును. బుద్ధుడు బోధివృక్షము క్రింద జ్ఞానము నార్జించిన దృశ్యము సందేశ చిత్రము. ముగ్గులు, లతలు, ద్వారబంధములపైని నగిషీలన్నియు అలంకరణ చిత్రములు.
ప్రకృతిలోని కూర్పు, క్రమము, మనకు ఆశ్చర్యమును, ఆహ్లాదమును కలిగించును. వీటిని మనము మన అవసర పూర్తీకై ఉపయోగించుకొనుటయేగాక ఇచ్ఛానుగుణముగ వాటిలో మార్పులు చేసినచో నవి ప్రయోజనాలంకారము లగును. సృష్టిలోని వస్తుజాల మంతయు నాలుగు మూలాకృతులలోని పరస్పర సమ్మేళనములలో కాంచవచ్చును
1. వృత్తము, 2. చతుష్కోణాకృతి, 3. త్రిభుజాకృతి, 4. బహుకోణాకృతి. ఎట్టి ఆకృతినయినను రేఖయే నిర్దేశము చేయును. కావున చిత్రకళ కంతటికిని మూలము రేఖయే. ఈ రేఖ ఏడువిధములుగ పరిణమించును. వీటిని'మూల రేఖ' లందుము. ఇవి అలంకరణమునకు బీజ ప్రాయములు.
ప్రథమ రేఖ స్తుడి (Spiral). ఇది నీటిలోను, నెత్తి పైనను, నత్తగుల్లల పైనను కానవచ్చును.
రెండవది సున్న లేక వర్తులము. దీనిని సూర్యుని ఆకృతియందు లేక వలయములందు గనవచ్చును.
మూడవది చంద్రవంక లేక అర సున్న. దీనిని విదియ నాటి చంద్రునియందును,ఇంద్ర ధనుస్సునందును జూచెదము.
నాలుగవది ' కాటాకొండి'. ఇది మంటలలోను, పొగలోను, గాలమందును కానవచ్చును.
ఐదవది 'తరంగ రేఖ' దీనిని అలలయందు లేక అరాళ కుంతలములయందు గాంచెదము.
ఆరవది 'క్రకచరేఖ'. దీనిని రంపపుపిండ్లు, కొండ కొనలు, విద్యుత్ రేఖలు మున్నగు వాటియందు గాంచెదము.
ఏడవది సాధారణమైన 'సూటిగీత'. (straight line) దీనిని బట్ట అంచులలోను, బల్లలందును, త్రాటియందును, దిక్చక్రము (Horizon) నందును చూడవచ్చును.
ఈ మూలరేఖలు మనము నిత్యము దర్శించు వస్తువులలో గోచరించును. ఈ రేఖలు అలంకరణకళకు ప్రధాన
మయినవి. వీటియొక్క వివిధ సమ్మేళనముల చేతను, బంధములచేతను అనేక ఆకృతులు ఉత్పన్నమగును.
వీటిని కలుపుటలో రెండుపద్ధతులు గమనింపదగి యున్నవి.
1. ఒక రేఖ మరొకదానిని కోయకూడదు. లేక ఒక రేఖ మరొక రేఖకు అసంగతముగా నుండక సుసంగతముగా నుండవలయును.
2. ఒకే జాతిరేఖను అనేకసార్లు అంచులో నుపయోగించునపుడు సమానాంతరముగా (parallel) ను సమదూరముగాను వేయవలెను. ఇవి సామాన్యసూత్రములు.
తోరణములు - Running Designs. ఈ మూల రేఖలలో ఒక దానిని మరొకదానిచే జోడించినచో భిన్న భిన్న రూపము లేర్పడును.
మూల రేఖలను కుదింపవచ్చును, సాగదీయవచ్చును.
దిగువ నుదాహరింపబడిన బంధయుక్తి ననుసరించి గీచినచో అనంతములయిన అలంకార ఖండములను సృష్టింప వీలగును.
ఆల్పన (ముగ్గులు): ఈ కళ నెరుగని ఆడుబిడ్డలు ఆంధ్రదేశములో లేరనవచ్చును. అక్షరము వ్రాయలేని ఆడువారికి అలంకరణము వెన్నతో బెట్టిన విద్య. మన దేశములో మూగ మగువలకుగూడ మ్రుగ్గులు వేయుట ఉగ్గుపాలతోనే నేర్పిన విద్య. ఈ కళ సర్వసాధారణమై నేటికిని జీవించియున్నది.
ఒక్క తరంగ రేఖను ఎన్ని విధాలుగా మలచవచ్చునో ఈ దిగువ నిరూపింపబడినది.
'లయ' (Rhythm) : అలంకరణ కళను దృశ్యసంగీత మనవచ్చును. సంగీతమునకువలె స్వరము, రాగము, తాళము అలంకరణ చిత్రమునకుకూడ ఆవశ్యకములు.రేఖ యొక్కయు, స్థలము (Space) యొక్కయు, క్రమ విభాగము వలన లయ ఏర్పడును. రేఖ యొక్క సమ గతియు, క్రమగతియు లయ యనబడును. ఇది సంగీతములో తాళమువంటిది.
స్థల విభాగము, (1) మంద, మధ్య, త్వరితగతి రేఖలచే ఇరుకుగాను, విశాలముగాను క్రిందివిధముగా చేయ వచ్చును. మొదట చుక్కలు సమదూరములో పెట్టి ఏదైన ఒక మూల రేఖచే కలిపినచో నీ క్రింది విధముగా నుండును.
పై తావున బిందువులు క్రకచరేఖలచే కలుపబడినవి. పై వానికి ఇతర మూల రేఖలచే క్రమపద్ధతిలో జోడించినచో అంచులోని అలంకరణము అధికతరమగును, రేఖా గతియందు మార్పుండియు సరిపోటీ క్రమముగానున్నది. సాధారణముగా జంగమ రేఖ ఒకటిగా నుండదు. ఇట్టి రేఖలు క్రమబద్ధమైన ఎడమును, గతియు కలిగి యుండి అలంకరణ ప్రక్రియతో లయను సృష్టించును. ఇట్టి రేఖల సమూహ ప్రవాహగతిలో కొంచెము మార్పు గల్గించినచో లయలో నవీనత ఏర్పడి క్రింది విధముగా నది ఎక్కువ ఆకర్షణీయముగా నుండును.
సృష్టిలోని లయ అనేక రీతులనుండును. కాని సాధారణముగా దానిని నాలుగు విధములుగా విభజింపవచ్చును.
1. సమానాంతరత. 2. చతురస్రత. 3. ప్రసరణము. 4. క్రమ రేఖ.
అంచులు : అంచులలోను తోరణములలోను 'ముఖ్య రేఖ' యొక్క లయగతియు దానిననుసరించియున్న ఇతర రేఖలును సుసంగతి (Harmonious) గా నుండుట అత్యవసరము అంచు ముందు సాగిపోవుచు పెరుగుచుండవలెను. ఏడు మూల రేఖలలోను ఏదైన నొక దానిని ముఖ్య రేఖగా గొని, దాని కిరువైపుల ఇతర రేఖలను జోడించినచొ అంచు లో గతి, లేక చలనము గలుగును. ఉపరేఖలు ఎల్లప్పుడును 'మధ్యధారా రేఖ'ను ఆధారముగా బేసికొని ప్రవర్తించును.
పై తరంగ రేఖ ప్రవాహ రేఖయై ముఖ్య రేఖయైనది.దానికి సుడులు జోడింపగా, ఉప రేఖలైనవి.
రేఖలస్థితులు : మూలరేఖ లన్నియు ప్రధానముగా నాలుగు స్థితులు కలవిగా నుండును.
ఈ వలయావస్థ యొక్క కూర్పులచేత అనేకరకాలైన పుష్పాకృతులు సృష్టియగును. వీటిలోని రేఖలు గానుగ గతిచే ప్రవహించి కట్టుబడి, సంపూర్ణ దృశ్యములను నిర్దేశించును.
అనురూపత : అలంకరణ చిత్రములలో లేక ప్రకృతిలోని దృశ్య పదార్థముల యందును రెండు భాగములు సమమై, ఒకదానికి నొకటి పోటీగా స్ధాయి (Balance) గలిగి ప్రతిబింబించినచో అనురూప (symmetrical) చిత్రములు, లేక దృశ్యములు అనబడును. ఇట్టి చిత్రములోని ప్రతి సూక్ష్మ వివరము గూడ ఎదుటి భాగములో ప్రతిబింబించు నట్లుండును. ఈ రెండు ప్రత్యర్థిభాగముల యొక్క కలయికచే ఒకే చిత్రమగును. అది చూచుటకు అందము గూర్చును.
చక్కగా పరిశీలించినచో ప్రకృతిలోని అనేకపదార్థములయందు అనురూపత వ్యక్తము కాగలదు. పోకలు, పండ్లు, ఉల్లిగడ్డలు, కఱ్ఱ మొదలగు వాటిని కోసి రెండు భాగముల నట్లే యుంచి చూచినచో, రెండు భాగములలోని వివరములు కూడ ఒకదాని కొకటి ప్రతిరూపముగా నుండును. సమాన ప్రతిభ గలిగిన ఇద్దరు గాయకుల పోటీ గానమును, సమశక్తి గలిగిన ఇద్దరు మల్లుల కు స్త్రీని వీక్షించు వారికి అవి చెవులకు కన్నులకు విందొనగూర్చునట్లు అనురూపచిత్రములును సౌందర్యమును అందించును. ఈచిత్రములలో సంపూర్ణమైన'స్థాయి' (Balance) ప్రకటితమగును. వీటిలోని రేఖలన్నియు దృష్టిని తమతో బాటు అటు నిటు త్రిప్పి చివరకు మధ్యభాగమువరకు దెచ్చి వదలివేయును. దీనిచే దృష్టికి 'స్థైర్యము' ఏర్పడును.
స్థాయి (Balance): అనురూప చిత్రములలోని రెండు భాగములలో సంపూర్ణ స్థాయి యుండును. కాని సరిసమానము కాని భాగములలో స్థాయి యుండినచో అది ఆశ్చర్యమును కల్గించును. బాట్లు చిన్నవే గాని భారము సమానముగా నుండుట లేదా? సమాన స్థాయిని నిర్ణయించుటకు కొంత ప్రయత్నము అవసరము. చిత్రములలోసు,అలంకరణ చిత్రములలోను కొలది స్థలమును ఆక్రమించిన ఆకృతి, అధిక ప్రమాణము గలిగిన ఆకృతికి, లేక స్థలమునకు, సమతూనికగా నుండును. కాని చిన్న ఆకృతికి అధిక ప్రాముఖ్య ముండుట అవసరమైయుండును. ఒక స్తంభపు నీడ దాని కన్న పెద్దగా నున్నను, దాని నీడతో కలిసి దృష్టికి స్థాయిని ఒనగూర్చును. చూచు వాని దృష్టి స్తంభము వైపే లగ్నమగుచుండును. దీనికి కారణము స్తంభముపై నున్న వెలుతురు ఛాయలు చుట్టుప్రక్కల ప్రదేశములలో కంటే ప్రగాఢమైయుండును. ఇటులనే తామర పుష్పము దాని చుట్టు వ్యాపించిన విశాల పత్రముల పరిసరములలో ప్రధానమై ఆకర్షణీయముగా వెలుగొందును. దీనికి కారణము ఛాయల వ్యత్యాసమే కాక వర్ణ వ్యత్యాసము కూడ నై యుండుట.
సాలెపురుగు నేతలోని నడిమిభాగములోని తంతు రేఖలు అధికముగా నుండుటచే వివరములు అధికమగును. దీనిచే ఆకర్షణ అధికమై ఇతర విశాల భాగములతో విశేషించి తులతూగుచుండును. రేఖలు ఒకచోటు నుండి మరొక చోటికి ప్రవహించునపుడు ఒక ప్రత్యేక దిశను సూచించును. అనేక రేఖలు ఒకేబిందువు వైపు నుండి పారుచున్నను, అనేక దిశలనుండి బిందువు వైపు ప్రసరించినను, ఆ దిశకు ప్రత్యేక ఆకర్షణము ప్రాప్తించును. ఇట్టి రేఖల ప్రయోజనము అలంకార చిత్రములలోనే గాక, సమస్త చిత్రములలో గూడ పెక్కు లుండును. రెండు అసమానభాగములు సమానమగుటకు కారణము ఆ రెండు కూడ సమానాధిక్యమును కలిగియుండుటయే.
పరివ్యాప్త అలంకరణము (All over Design): అడవులలోను, ఊరి బయళ్ళలోను, చేలలోను, తోటలలోను పూలు విరగబడి పూయును. ఇవన్నియు స్థలము నాక్రమించుచు వ్యాపించుచుండును. వీటి కూర్పునందు క్రమబద్దత కనబడుట దుస్తరము. కాని ఇవ్వన్నియు వ్యాపించి, కిలకిల నగి, గిలిగింతలు పెట్టును. ఇది పరివ్యాప్త - అలంకృతిలోని క్రమపద్ధతి. ఇటులే ఆకాశముపై తారలు, నేలపై రాలిన ఆకులు, పూలు, జముడుమీది ముండ్లు,కోమటి రాళ్ళు భిన్న వర్ణము అయిన భిన్న ఛాయా (tones) భూమికలపై చూచియున్నారము. వాటికి క్రమబద్ధముగ పడియుండు అవకాశములు లేవు. కానీ వాటి కూటమి కొంత స్థల మాక్రమించుచున్నది. ప్రతికూటమిలోని రూప భూమియు, విరామభూమియు తప్పనిసరిగా జ్యామితి రేఖాకృతి విశేషములు ((geometrical details) కలిగి యుండి, వివిధ దిక్కులను పునరావృత్తిని లయలను, స్థాయిని గూర్చు వెలుతురు ఛాయలను కలిగియుండును.
ప్రపంచమునందలి అన్ని దేశములలోని ఉత్తమ అలంకరణ కళాఖండములలో క్రమములేని పరివ్యాప్తములైన అలంకృతులు చాల అరుదుగా నుండును. ఒకవేళ ఉన్నను అవి చాలవరకు ప్రకృత్యనుకరణ (Realistic) పద్ధతిలోనే ఉండును. కాని వివరములన్నియు ఒకానొక అలంకార సూత్రమును అనుసరించి, బిగించి, శైలీకరింపబడును. - కొన్నిసార్లు గుచ్ఛము లన్నియు ఒక నిర్దిష్ట ఆకృతియందు నిండునట్లు వేయుటయు గలదు. ఐనను అది పరివ్యాప్త అలంకారమే అగును.
ఈ అలంకరణము సమముగా విభజింపబడిన భూమికపై 'వేయబడును.
మూలాకృతులును, గుచ్ఛములును (units) సంతరణ స్థానములందు (crossings) సమదూరములందుండి భూమికను సమముగా విభజించును. 16 వ పటములోని 1 వ పటములో మాదిరి ఏకాంతరిత (Alternative) స్థలము లందైనను, 2 వపటముమాదిరి చిన్నని మూలాకృతులు ఖాళీస్థలములందైనను వేయబడును. 3, 4 లో మాదిరి వట్టిగీతలు లేక చుక్కలు మలుపబడవలయును.
పునరావృత్త - అలంకరణము (Repeated Design) : సాధారణముగా గోడలపై నతికింపబడు కాగితములలోను, నేతబట్టలలొను అద్దకములలోను పునరావృత్త అలంకరణము కనిపించును. ఏదేని ఒక అలంకరణ గుచ్ఛము క్రమబద్ధమైన ఎడమిచ్చి (Regular Intervals) సంతరణ పద్దతిలో చిత్రింపబడును. దీనిచే అలంకరణము పరివ్యాప్తమై విశాలప్రదేశముల సమముగా నాక్రమించునదిగా నుండును. ఇట్టివి క్రమబద్ధమైన కొలత గలిగిన కూర్పుచే అందమును స్పందింపజేయును. కొన్ని అలంకృతులలో ఖండగలకూర్పు సన్నిహితమగుట చేత అల్లిక లుత్పన్నమై సేతవలెను, గూన పెంకులు పేర్చినట్లును, ఇటుక పెడ్డల నతికినట్లును ద్యోతకమగుచుండును. ఈ విధముగా ఖండికల వివిధబంధములచే విశాల ప్రదేశములు వింత భూమికలుగా మారును,
పునరావృత్త అలంకారము వ్యామోహకరముగా నుండును. నిత్యము మనము దర్శించు వస్తువులతో నిట్టి క్రమము గాంచవచ్చును. ఈ కూర్పు అనేక రకములుగా నుండును. అనాసపండు చర్మము చతుష్కోణమయముగా నుండును. దేవదారు చెట్లు, చేపల వైపొలసులు, తేనె తెట్టెపై తొరటలు ఒకదాని నొకటి రాచుకొని జ్యామితి రేఖాకృతులు కలిగి వ్యాపించియుండుట చూతుము. ఇట్టి ఏక ఖండికా పునరావర్తనమే పునరావర్తిత - అలంకరణ మనబడును. ఇట్టి అలంకరణము గచ్చు, లోహము, చర్మము, కడవలు, కప్పులు, కఱ్ఱలు మున్నగువాటిపై కానవచ్చును.
పై చిత్రములలో అలంకరణము అడ్డదిడ్డముగా నుండక ఒకేచాలు ననుసరించి కచ్చితమై క్రమముగానున్నది.
కొన్ని అలంకరణములలో రేఖాగణితముననుసరించిన బంధములు కాననగును. కాని యందలి పునరావర్తన తంత్రము సుళువుగా నుండక చిత్రఖండిక ఒకటిగా నుండక, అనేకాకృతులుగల గుచ్ఛములను సమప్రమాణమును ఛాయను మాత్రము గలిగియుండును. గుచ్ఛ సమూహములు వంకరటింకరగా (zig-zag) పునరాగమించుచు పోటీగా (Reverse) ప్రత్యక్షమగును.
ప్రయోజనాలంకరణము, (Functional Design.) : నభోభాగాన పారెడు పక్షుల తోరణమును గమనించినచో ఒకదృశ్య కవిత్వము గోచరించును. అది బాణాగ్రాకృతిని పోలు చాలు గలిగియుండును. ఇట్టి ఆకృతిలో సౌందర్యమును, ప్రయోజనమును రెండును కలిసియున్నవి. బలిష్ఠమైన నీటిబాతొకటి ముందుగా గాలిని చీల్చుకొని పోవుచుండ, దాని వెన్నంటిపోవు బాతులు మొదటిదానంత
శ్రమకు గురికావలసిన అవసరము ఉండదు. వీటి వ్యూహబంధములోనున్న అలంకారము 'ప్రయోజనాలంకరణ' మనబడును. అనగా అలంకారము, ప్రయోజనము ఏక వస్తువునందు మిళితమైనపుడు అది ప్రయోజనాలంకరణ మగును. వ్యూహము సరియైనచో దాని పరిణామము గూడ సరియగును. ప్రయోజనాలంకరణము ఒకవస్తువు యొక్క ప్రమాణముతోను, బరువుతోను, గట్టితనముతోను, దాని రంగుతోను సంబంధము కలిగియుండును.కెమెరాను చేతులలో" తేలికగా నుండునట్లు నిర్మించుట ప్రయోజనదాయకము. దీనియొక్క ఆకృతిని కుంచించుట, అవసరమునుబట్టి పెంచుట, బరువుతక్కువగా నుండుట, మలచి చంకలో తగిలించినను సుందరముగా నుండుట, అనునవి దీని ప్రయోజనములు. అట్టి ప్రయోజనములలో దాని నల్లనిరంగు. దాని బిరుసుదనము (Rough texture) కూడ పేర్కొనదగినవి. పులులు, పక్షులు, లేళ్ళు, సీతాకోక చిలుకలు మున్నగు వాటి యందున్న మచ్చలు, వాటిని పరిసరములనుండి కప్పిపుచ్చుటకు ఉపయోగించుచున్నవి. యుద్ధ విమానములపై, ఆయుధములపై, సైనికుల దుస్తులపై మేఘచ్ఛాయలను, చెట్లరంగులను, చిత్రించుటవలన శత్రువుల బారినుండి ఆత్మ రక్షణము చేకూరుచున్నది. ఇటులే, పెన్సలు, పలకలుపలకలుగా నున్నచో నది పొరల కుండును. ముంగిటిలో వేసిన పిండి ముగ్గులు అందమును కూర్చుటయేగాక, చీమలకు ఆహారముగా నుపకరించును. నావకు ముందు వెనుకల సన్నముగా చెక్కుటచే నది నీటిని కోయగలుగును. వివిధ మతస్థులు ధరించు ఊర్ధ్వ పుండ్రములు, విభూతి, బెండకాయబొట్లు, మొదలగునవి వారివారి మతచిహ్నము లగుటయేగాక అలంకారములుగ కూడ ఎన్నతగియున్నవి. ప్రయోజనము ననుసరించి మలచిన పనిముట్లన్నియు వాటియం దిమిడియున్న లయగతిరేఖల చేతను, రంగులచేతను స్వతఃసిద్ధముగా అలంకృతములై యుండి కన్నులకు విందొన గూర్చును.
'శ్లేషాలంకరణమూ : భారతీయ శిల్పములలోను, చిత్రములలోను అచ్చటచ్చట ఈ వింత చిత్రములు కానవచ్చును. అజంతాలో నాలుగు జింకల కొకేతల చిత్రింపబడినది. ఇది చిత్రకారుని అధికశ్రమను తగ్గించి, సందర్భపూర్వకముగా చిత్రింపబడుటచే ఆశ్చర్య మొనగూర్చును. ఇటులే భువనేశ్వర శిల్పములో నలుగురు వీరుల బంధములో రెండే తల లున్నవి. ఎటు త్రిప్పి చూచినను దేనికదే వేరుగా కనిపించును. దేవాలయములపై కోణములలో అనగా రెండు గోడలు కలియుచోట రెండుకోతులు లేక సింహములుండి ఒకేతల మధ్యభాగములో చెక్కబడును. రామప్ప దేవాలయ మంటప స్తంభముపై చెక్కబడిన భజనమండలిలో మధ్యభాగమున నాట్యము చేయుచున్న వ్యక్తి యొక్క పాదములు కుడి ఎడమల నున్న వారిలో నొక్కొక్కరి పాదముతో కలిసి రెండేపాదములుగా మలచబడినవి (ప. 16). కవి ఒకే పదమునకు సందర్భానుసారముగ రెండు మూడర్థములను గల్పించునట్లు చిత్రమునందును, శిల్పమునందును ఒకే రూపములో అనేక రూపములు కల్పనచేయుట రూప శ్లేష అనబడును.
పటము 18. రామప్ప దేవాలయ శిల్పము
బంధములు (compositions) : మూల రేఖలచే తయారైనా అలంకృతు లన్నియు రెండు తరగతులలో విభజింప బడును. వాటిలో మొదటి తరగతివి దృష్టికి విశ్రాంతి నిచ్చుచు, నిశ్చలమై స్థాయి గలిగియుండును. ఇవి 'స్థావరములు' (static arrangement) అనబడును. రెండవ తరగతివి కదలిక గలిగి విస్తరించి పెరుగుచుండునవి. ఇవి జంగమము అనబడును. (Dynamic arrangement)).
పటము 19. స్థావర బంధములు స్థావరములన్నియు విశ్రాంతి భావమును సూచించును. రేఖలన్నియు ఒకదానికొకటి తులదూగుచుండి స్థలమును సమానముగా నాక్రమించును.
రెండవతరగతి జంగమ బంధములు, అంచులు, తోరణములు మొదలగువానికి ఉపయోగించునవి. రేఖలన్నియు ఒకచోటనుండి మరొక చోటికి పారుటచే మన దృష్టిని తమతో లాగుకొనిపోవును. వీటిలో చలనము ప్రధానాంశము.
సామాన్యముగా కదలిక అనునది ఎడమనుండి కుడి దిక్కునకు చూపబడును. ఆవిధముగానే భావింపబడును కూడ. ఉపరేఖలు ముఖ్య రేఖను కలియునపుడు ప్రవాహపు దిక్కునుండియే కూడును.
సుసంగతి (Harmony) : ఆకులు, పూవులు, కొమ్మలు ఒక క్రమములో అభివృద్ధిని, క్షయమును కలిగియుండుట గమనింపదగినది. ఒక పత్రమునకును ప్రక్కనున్న మరొక పత్రమునకును రూపము లో అత్యంత స్వల్పభేద ముండుటచే అవి చూచుటకు అందముగ నుండును. హార్మోనియమునందలి 'స'అనుస్వరము ప్రక్క నున్న రీడును నొక్కినచో 'రి' అను స్వరము పలుకును. ఇటులనే 'రి' అను స్వరమునకు ప్రక్కననున్న రీడును నొక్కినచో 'గ' అను స్వరము పలుకును. ఇట్లు సప్తస్వరములు ఒక దాని ప్రక్కన నొక్కటి ఇల్లు కట్టుకొనినట్లే, రేఖలు రూపమును స్వల్ప భేదములచే ఒక దాని ప్రక్కన నొక్కటి ఉన్నచో వాటి సుసంగతి మనకంటికి గోచరించుచుండును.
ఏకాంతరితము. ఇట్లే ఏకాంతరిత (Alternative) రేఖాదృశ్యములలో కొంత సుసంగతి దృగ్గోచరమగుచుండును.
చిత్రములో రేఖలు రెండింటికంటె అధికముగా నున్నచో, వాటి పరస్పర స్నేహమే సుసంగతి యగును. ఒక రేఖ మరొక రేఖతోను, ఒక పర్ణము మరొక పర్ణముతోను, గుణ ధర్మమునందు సంపూర్ణ వ్యతిరేకముగా నున్నను, ఖండించు చున్నను అసంగత రేఖలు (Contrasting lines) లేక వర్ణములు అనబడును.
పటములో 1, 2, 3, 4, 5 అనునవి ఒకదాని ప్రక్కన ఒకటి యున్నచో సుసంగతములు అనబడును. కాని 1,5 లు అసంగతములు. ఎందుకనగా, 1 వృత్తము; 5 సూటిగీత. ఈ రెంటి గుణధర్మములు వేరు. కాని 5, 4; 4, 3; 3, 2; ఇవన్నియు సుసంగతములే.
ఇటులే వర్ణములయందు సుసంగతి గాంచనగును.నారింజ - ఎరుపు; ఎరుపు - ధూమ్రము ; నీలము - ఆకుపచ్చ; పసుపు - నారింజ ; మొదలగు వర్ణములన్నియు సుసంగతములే. ఎందుకనగా, ప్రతి జంటవర్ణములో ఏదో యొకరంగు రెంటిలో కలిసియుండుటచే, స్వల్పభేదము వలన రెండును ఇంపుగానే కన్పించును. ఎరుపు, నారింజలలో, ఎరుపురంగు ఈ రెంటిలో నుండి, నారింజలో కొంచెము పసుపువన్నెతో కలిసియుండును. కావున చూచుటకు స్వల్పభేదముండి కూడ ఆకర్షణమును కలిగించును. కాని ఎరుపు, నీలము, పసుపు అను వర్ణములు యథాతథముగా పరస్పరము భిన్న వర్ణములు, ఈమూడు వర్ణములను సమన్వయపరచుటకు ఏదైన నొక వర్ణము అన్నిటిలో కలిసియుండినచో చిత్రములో ఏకత్వము (unity) కుదిరి సుసంగతి వ్యక్తమగును. లేనిచో అసంగతి తోచును. ఉదా :-
సుసంగతియు క్రమవృద్ధిక్షయములును ఈ క్రింది వస్తునిర్మాణములలో గాంచును.
పరి ప్రేతత దృష్టితో (perspective) చూచిన ద్వారములు, వరుసగానున్న కుండలు కూడ సుసంగతి నొనగూర్చును.
ప్రసాధక రూపము (Decorative Form) : ఏ రూపమైనను ప్రధమదర్శనములో సంక్షిప్తముగ గోచరించును.
అనగా గుండ్రముగానో, త్రిభుజముగానో, చతుష్కోణము గానో ఫలకములుగానో కనబడును. ఇదియే సంక్షిప్తరూపము, కాని దీనినే తదేకదీక్షతో తిలకించినదో అపుడు అనేకవివరములు గోచరించును. దానితోబాటు అనేక వంకలును, వికృతులును కనబడును. ఒక కమలమును చూడుడు. చూచినచో దాని సంక్షిప్త రూపము 'గుండ్రముగా కాన్పించును. కాని ప్రకృతిలోని విరోధశక్తుల వలన దాని దళములు మాడియో, ఊడియో, క్రమరహితముగా కనబడును.
చిత్రకారుడు ఒకానొక వస్తువు యొక్క ఆకృతి యందలి వికారమును తొలగించుటకై, ఒక సులభపద్ధతి నాశ్రయించును. దానికై మూల రేఖలను, రూపములను బోలు ఆకృతులను మలచును. దీనిచే సంగ్రహరూపములు సృష్టి యగును. కమలమును చిత్రించుటకు దానిరూపములు బోలిన వలయమును చిత్రకారుడు వ్రాసియందు రేకులు క్రమబంధమును చిత్రించును. దీనిచే శ్రమలేకయే దాని రూపము సులభగ్రాహ్యమగును. ఇదియే ప్రసాధక రూప మనబడును.
భూమికా బంధము ' : చిత్రించవలసిన భూమిని నిర్దేశించిన తర్వాత దానిలో చిన్నవియు పెద్దవియునైన అనేక అలంకార ఖండికలను కూర్చుటకు అవలంబింపవలసిన పద్ధతి బంధ మనబడును.
1. అన్నిటికంటె ప్రధానరూపము మొదట సాధారణముగా మధ్య భాగములోనైనను దానికి సమీపమునందైనను చిత్రింపబడును. పిమ్మట అంతకంటే తక్కువ ప్రాధాన్యముగల రూపము చిత్రించబడును. తుదియందు చుక్కలు మొదలగు అల్పాకృతులు అవసరమైనచో ఖాళీ స్థలములలో నింపబడును.
2. అలంకరణ చిత్రములో ప్రమాణములు (Proportions) పరిగణనీయములు కావు.
3. చిత్రితమైన భాగము ఎక్కువ స్థలమును ఆక్రమించి యుండవలయును. (కొన్ని చోట్ల చిత్రిత భాగము ఖాళీ భాగముతో సమానముగా నుండ వచ్చును.)
4. రంగులు, రేఖలు, ఛాయలవ్యత్యాసములు, పరస్పరముగా సుసంగతిలో నుండవలయును.
5. చిత్రములో స్థాయి ఉండవలయును.
పరి ప్రేక్ష ణము (perspective) సాధారణముగా అలంకార చిత్రములలో తక్కువ, అలంకారఖండములు ఒక దాని పై నొకటి చేరి కలిసిపోకుండుటకై ఖండిక లమధ్య భాగమున కొంత ఎడముంచవలయును.
6. అలంకరణ చిత్రములో చేయబడు వస్తువులను యథాతథముగ చిత్రించక అతిశయ రూపములు (Exaggerated forms) గా మార్చవలయును.
7. చిత్రకారుడు చిత్రకళాసూత్రములను పాటించుటతోబాటు స్వప్రతిభను ప్రయోజనానుసారముగా ఉపయోగించ వలయును.
అలంకరణములో సందేశముకన్న సౌందర్యమే ప్రధానమైనది. కావున వస్తు ప్రమాణముల నెట్లు మార్చినను చిక్కులేదు. అవి క్రమగతములైన చాలును. వస్తు ప్రమాణములందును, రంగులయందును, భావమందును కారణ మీమాంస తగదు. ఇది చిత్రకారుడు కన్న 'కల', కలలో కారణములుండవు. అదిసుఖస్వప్నమైతే చాలును. కావుననే వక్రతుండము నోటినుండి తీగెలు బారినవి. మకరములు మకరతోరణాలైనవి. హంసలకు తోకలు పెరిగినవి. పొన్న వాహనము సున్నయైనది. హనుమంతునికి పట్టెనానూలు, నగిషీగల బెట్టిలాగు, ఉంగరాలు, శంఖచక్రాది చిహ్నములు పెరిగినవి. ఇట్టి అలంక రణము శిల్పకారుని చిత్తము ననుసరించియే చేయబడును.
రంగులు - ఛాయలు (Colours & Tones): అలంకరణములో భావ ప్రాధాన్యములేనపుడు రంగుల వాడుకను గురించి శాసనాలు చేయుటకు వీలు లేదు. వర్ణలేపనము చిత్ర కారుని స్వేచ్ఛపై నాధారపడి యుండును. భావమే ప్రధానమైనచో రంగులు దాని ననుసరించి వాడనగును.
ఛాయ : ప్రతివర్ణము కనీసము మూడువిధములుగా నుండును. (1) గాఢచ్ఛాయ (నలుపు) (2) మధ్యచ్ఛాయ (3) మందచ్ఛాయ (శ్వేతమిశ్రణము).
మనము ఒకే రంగుమీద ఆరంగునే వేరు వేరు చాయలలో వేసినచో నది దృగ్గోచరమగును.
మిశ్రవర్ణములు : ఒక వర్ణములో మరొక వర్ణము కలిసినచో మిశ్రమ వర్ణ మనబడును. మిశ్రవర్ణములు చూచుటకు ప్రాథమిక వర్ణముల (Primary colours) కంటే తక్కువ దీప్తికలిగి యుండును. కాని ఉత్తమ కళాఖండము లన్నియు ఇట్టి మిశ్రవర్ణ సమన్వితములే అనవచ్చును. అలంకరణ చిత్రమునందలి వస్తువులను సహజ వర్ణరూప యుతములుగా చిత్రింపవలయునన్న నియమము లేదు.
కొం.శే
[[వర్గం:]]