Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలంకారశాస్త్ర చరిత్ర

వికీసోర్స్ నుండి

అలంకారశాస్త్ర చరిత్ర :- రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో అలంకార శాస్త్రమును తొలుత శివుడు బ్రహ్మ కొసగెననియు, బ్రహ్మనుండి అది ఇతరులకు లభించుచు వచ్చెననియు చెప్పెను. సంస్కృతాలంకార శాస్త్రమునకు భరతముని వ్రాసిన నాట్యశాస్త్రమే పురాతనమైన మూలగ్రంథమని భావింపబడుచున్నది. నాట్యశాస్త్రమునందలి మొదటి ఐదు అధ్యాయములు క్రీ. శ. 5వ శతాబ్దికి పూర్వము రచింపబడినట్లు తెలియుచున్నది. సంస్కృతమున అలంకార శాస్త్రమును గూర్చి వ్రాసినపండిత ప్రకాండులు పెక్కురుకలరు. వ్రాయబడిన ఉద్గ్రంధములును పెక్కులు కలవు. అవి యెవ్వియన-భామహుని కావ్యాలంకారము (క్రీ. శ. 6వ శతాబ్దికి పూర్వము) ; దండి కావ్యాదర్శము (క్రీ. శ. 6వ శతాబ్ది) ; ఉద్భటుని అలంకార సారసంగ్రహము. (క్రీ. శ. 8 వ శతాబ్ది) : వామనుని కావ్యాలంకార సూత్రవృత్తి (క్రీ. శ. 8వ శతాబ్ది); రుద్రటుని కావ్యాలంకారము (క్రీ.శ.825-875); ఆనందవర్ధనుని ధ్వన్యాలోకము (క్రీ.శ.840-870); రాజశేఖరుని కావ్య మీమాంస (క్రీ. శ. 870-950); ముకులభట్టు అభిధావృత్తిమాతృక (క్రీ. శ. 9వ శతాబ్ది - అంత్యభాగము); భట్టతౌతుని కావ్య కౌతుకము (క్రీ. శ. 950-980); భట్టనాయకుని హృదయదర్పణము. (క్రీ. శ. 900-1000); కుంతకుని వక్రోక్తి జీవితము (క్రీ. శ. 925-1025); ధనంజయుని దశరూపకము, (క్రీ. శ. 10వ శతాబ్ది మధ్యభాగము) ; రాజానకమహిమ భట్టువ్యక్తి వివేకము. (క్రీ.శ. 1020-1060); భోజుని సరస్వతీ కంఠాభరణము, శృంగార ప్రకాశము. (క్రీ. శ. 1030-1050); క్షేమేంద్రుని ఔచిత్య విచార చర్చ, కవికంఠాభరణము. (క్రీ.శ.1000-1063); మమ్మటుని కావ్యప్రకాశము (క్రీ. శ. 1050-1150 శతాబ్ది ఉ.భా.); రుయ్యకుని అలంకార సర్వస్వము (క్రీ. శ. 1150 పెదవ); వాగ్భటుని వాగ్భటా లంకారము (క్రీ. శ. 1150 తరువాత); హేమ చంద్రుని కావ్యానుశాసనము. (క్రీ.శ. 1106-1150 కి తరువాత - 1172); జయదేవుని చంద్రాలోకము (క్రీ. శ. 1200-1250); విద్యాధరుని ఏకావళి (క్రీ. శ. 1285-1325); విద్యానాథుని ప్రతాపరుద్ర యశో భూషణము (క్రీ. శ. 1296-1325); వాగ్భటుని కావ్యానుశాసనము (క్రీ. శ. 14 వ శతాబ్ది); విశ్వనాథుని సాహిత్య దర్పణము, (క్రీ. శ. 14 వ శతాబ్ది); భానుదత్తుని రసమంజరి, రసతరంగిణి (క్రీ.శ. 13 వ శతాబ్ది -అంతమున, 14 వ. శ. ఆదియందు); రూప గోస్వామి భక్తిరసామృత సింధువు, ఉజ్జ్వల నీలమణి (క్రీ. శ. 1470-1554) ; కేశవమిత్రుని అలంకార శేఖరము (క్రీ. శ. 16 వ శతాబ్ది ఉత్తరార్ధము); అప్పయ దీక్షితుని వృత్తివార్తికము, కువలయానందము, చిత్ర

మీమాంస (క్రీ. శ. 16 వ శతాబ్ది అంతము - 17 శ. ఆది); జగన్నాథుని రసగంగాధరము (క్రీ.శ. 1620 - 1660).

అలంకార శాస్త్రమనగా కావ్యమును కావ్యాంగములను గూర్చి వివరించు శాస్త్రము. ఇండోయూరపియను భాషలలో ఋగ్వేదము అత్యంత ప్రాచీనమైన ప్రథమ గ్రంథము. అది ప్రధానముగా దేవతలను గూర్చి చేయబడిన స్తోత్రాత్మకమైన మంత్రగ్రంథమైనప్పటికిని దానియందు కావ్య లక్షణములు విశేషముగా కాన్పించు చున్నవి. అందు ఉషస్సును వర్ణించు ఋక్కులు సుందర కావ్యఖండములు - కొన్ని ఋక్కులలో ఉపమా-వ్యతిరేక అతిశయోక్తి - శ్లేష - ఉత్ప్రేక్షాద్య లంకారములు మిగుల మనోహరములుగా ప్రయోగింపబడినవి. తరువాతి లౌకిక కావ్యములలో వలెనే వేదవాఙ్మయములో కూడ ప్రకృతి మున్నగువాటి వర్ణనము మనోహరముగ చేయబడినది. నాటక బీజములు కూడ వైదిక సాహిత్యమునందు కన్పట్టు చున్నవి. నాటక నిర్మాణము కొరకు ఋగ్వేదమునుండి పాఠమును, సామ వేదమునుండి గీతములును, యజస్సులు నుండి అభినయమును, అథర్వవేదమునుండి రసములును గ్రహింపబడినవని భరతుడు నాట్యశాస్త్రములో చెప్పెను.

వేద కాలము తరువాత క్రీస్తునకు అనేక శతాబ్దులకు పూర్వమే ఉత్కృష్టమైన కావ్యనిర్మాణము సంస్కృత వాఙ్మయములో చేయబడినది. రామాయణ మహాభారతములలో అత్యున్నతమైన కావ్యరచన సాగెను. అలంకార శాస్త్రములో ఉద్గ్రంథములైన ధ్వన్యాలోక, కావ్య ప్రకాశములలో మహాభారతమునుండి గృధ్రగోమాయు సంవాదాదులైన అనేక విషయములు ఉదహరింపబడినవి, రామాయణమునుండికూడ కొన్ని శ్లోకములు ఈగ్రంథములలో తీసుకొనబడినవి.

అలంకార శాస్త్రారంభము : క్రీ.శ. రెండవ శతాబ్ది నాటివియు, ఆ తరువాతివియు నగు శాసనములను బట్టి అంతకు పూర్వమే అలంకార శాస్త్రరచనము ఆరంభింప బడినట్లు తెలియుచున్నది. క్రీ.శ. 150వ సంవత్సరపు రుద్రదాముని జునాగఢ్ శాసనమునుబట్టి అప్పటికే కావ్యము గద్య పద్యాత్మకమయి యుండెననియు “స్ఫుట-మధుర - కాంత-ఉదార" అను కావ్యగుణములు తెలిసియుండెననియు స్పష్టమగుచున్నది. ఈ యంశమునే అంతకు కొంచెము పూర్వపుదైన “సిరిపులుమాయి” నాసిక శాసనముకూడ “తెల్పుచున్నది. అది ప్రాకృతభాషలో నున్నది. ఈ రెండు శాసనములే గాక క్రీ. శ. మొదటి రెండు శతాబ్దులలోని సంస్కృత ప్రాకృత శాసనములు ఈ విషయమును ధ్రువపరుచుచున్నవి. ఇంతియేగాక ఈ శాసనములలో 'గంధర్వవేద-నట-గీత-వాదిత్ర- ఉత్సవసమాజ" ఇత్యాది శబ్దములు వాడబడినవి. వీటిలో శబ్దాలంకారములు, దీర్ఘ సమాసములు కలవు. పూర్వపు గద్యప్రబంధములు ఈ శైలిలోనే వ్రాయబడుచుండెడివి. వీటినిబట్టి చూచినచో ప్రాచీన కాలమునందే అలంకార శాస్త్రము ఎంతో అభివృద్ధి చెందినట్లు కనిపించుచున్నది.

నిరుక్తమును వ్రాసిన యాస్కముని, ఋగ్వేదములోని “ఇదమివ, ఇదంయథా, అగ్నిర్న, తద్వత్" మొదలయిన ఉపమాలంకార ద్యోతకములగు పదములను ఉదాహరించెను. ఇవియేకాక అనేక ఉపమలు వేద వాఙ్మయములో ఉన్నట్లు తెలుపుచు యాస్కముని ఉపమా భేదములనుకూడ వివరించెను. పాణిని వ్యాకరణ సూత్రములకు పూర్వమే ఉపమాలంకారమునకు అంగములైన ఉపమాన, ఉపమేయ, సామాన్యధర్మ, ఉపమా వాచకములు తెలిసియుండినట్లు "ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్యా ౽ ప్రయోగే; 'ఉపమానాని సామాన్య వచనైః' " ఇత్యాది సూత్రములవలన మనకు స్పష్టమగు చున్నది. వ్యాసుని బ్రహ్మ సూత్రములలో ఉపమా రూపకాలంకారములు పేర్కొనబడినవి. క్రీ. శ. ఒకటి రెండు శతాబ్దులలో రచింపబడిన అశ్వఘోషుని బుద్ధ చరితము, సౌందరనందము అను కావ్యముల వలన పూర్వమే కొన్ని అలంకారములు ప్రచారములో నుండినట్లు తేటబడుచున్నది. భరతుని నాట్యశాస్త్రములో రససిద్ధాంతము, నాటక లక్షణము, నాలుగు అలంకారములు, గుణములు వివరింపబడినవి. బాణుడు తనకాదంబరిలో అక్షరచ్యుతక, మాతాచ్యుతక, బిందుమతి మొదలగు ప్రహేళికలను, శ్లేష - ఉత్ప్రేక్ష - ఉపమ - దీపకము ఇత్యాద్యలంకారములను గుర్తించెను. పైన పేర్కొనబడిన అంశములను బట్టి క్రీ.శ. 6వ శతాబ్దివరకే లౌకిక సంస్కృత వాఙ్మయములో అలంకారములు, కావ్యభేదములు ఏర్పడి ఉండినట్లు మనకు తెలియుచున్నది. శాస్త్రనామము  : ప్రాచీనాలంకారికులయిన భామహ, వామన' రుద్రటులు తమ గ్రంథములకు సాధారణముగా "కావ్యాలంకారము” అను పేరునే పెట్టిరి. ఈ గ్రంథములకు ఈ పేరు పెట్టుటకు ముఖ్యముగా వీటిలో అలంకారములకు ప్రాధాన్యమిచ్చుటయే ఐయుండును. అలంకారము అనగా అలంకరించునది. కావ్యశోభా హేతువైనది. కావ్యాలంకారముల గూర్చి లక్ష్యలక్షణములను తెలుపునట్టిది. కాబట్టియే, ఈ శాస్త్రమునకు 'అలంకారశాస్త్రము' అని పేరు పెట్టబడినది. కొందరు లాక్షణికులు తమ గ్రంథములకు అలంకారశాస్త్రమని పేరు పెట్టలేదు. ఉదా:- దండి కావ్యాదర్శము. ధ్వని కారుడు అలంకార శాస్త్రకర్తలను కావ్యలక్షణ కర్తలు అనియే వ్యవహరించెను. ఈ లక్షణ గ్రంథములకు సాహిత్య శాస్త్రమని కూడ మరియొక పేరు కలదు. తరువాతి లక్షణగ్రంథకర్తలు సాహిత్యశబ్దమును కావ్యము అను నర్థమునందే. వాడినారు. బిల్హణుడు 'సాహిత్య పాథో నిధి మంథనోత్థం' అని సాహిత్యశబ్దమును తన విక్రమాంక దేవచరితమునందు కావ్యము అను నర్థమునందు ఉపయోగించినాడు. రాజ శేఖరుడు సాహిత్యశాస్త్రము అయిదవ శాస్త్రమనియు అది చతుశ్శాస్త్రముల సారమనియు తన కావ్య మీమాంసలో తెల్పివాడు. సాహిత్యమనగా శబ్దార్థములు సహితములైయుండుట అని నిర్వచనము చెప్పవచ్చును. సాధారణముగా కావ్యలక్షణములను తెలుపు శాస్త్రమును సాహిత్యశాస్త్రమని కూడ వాడుట పరిపాటియై వచ్చుచున్నది.

అలంకారశాస్త్ర విషయములు  : 1. కావ్యప్రయోజనములు, 2. కావ్య హేతువులు, 3. కావ్య విభాగములు 4. శబ్దార్థములు శబ్దశక్తులు, 5. కావ్యలక్షణములు, రస, అలంకార, రీతి, ధ్వని, ఔచిత్య, వక్రోక్తి వాదములు, 6. కైశిక్యాది వృత్తులు, 7. దోషములు మున్నగునవి అలంకార శాస్త్రమునందు చర్చింపబడు విషయములు.

పైన సూచింపబడిన విషయములను అన్నింటిని సాధారణముగా అలంకార శాస్త్ర గ్రంథములన్నియు చర్చించినవి. ఈ శాస్త్రగ్రంథములు అనేక వర్గములుగా నున్నవి. (1) విశ్వనాథుని సాహిత్య దర్పణము, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణము ఈ రెండు కృతులును

పై విషయములను నాటక లక్షణములతోపాటు సమీక్షించినవి. (2) దండి కావ్యాదర్శము, వామనుని కావ్యాలంకార సూత్రవృత్తి, భామహ, రుద్రట, వాగ్భటుల కావ్యా లంకారములు, మమ్మటుని కావ్య ప్రకాశము. జగన్నాథ పండితుని రసగంగాధరము - ఈ మొదలయిన అనేక సుప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథములు ఒక నాటక లక్షణమును తప్ప కావ్య విషయములనన్నింటిని ప్రాయికముగ చర్చించినవి. (3) భరతుని నాట్యశాస్త్రము, ధనంజయుని దశరూపకము మొదలగు కొన్ని గ్రంథములు నాటక లక్షణములు, రసస్వరూపమును మాత్రమే చర్చించినవి. (4) అలంకార సారసంగ్రహము, అలంకార సర్వస్వము, కువలయానందము, చిత్రమీమాంస, మొదలగు అనేక కృతులు అలంకారములను మాత్రమే చర్చించినవి. (5) కొలది గ్రంథములు ప్రత్యేక సిద్ధాంతములను చర్చించినవి. వాటిలో ధ్వన్యాలోకము ధ్వనిచర్చను, వ్యక్తివివేకము వ్యంజనావృత్తి ఖండనమును, వక్రోక్తి జీవితము వక్రోక్తి చర్చను చేసెను. మేమేంద్రుని ఔచిత్య విచారచర్చ ఔచిత్యమే కావ్యజీవితము అను విషయమును ప్రతిపాదించెను.

1. కావ్య ప్రయోజనములు : కావ్యము కళాత్మకము. దానివలన భావుకులకు వెంటనే రసానందము కలుగును. సంస్కృత కావ్యవిమర్శకులు పురాతన కాలమునుండియు రసానందమునే కావ్యప్రయోజనముగా పేర్కొనిరి. ధ్వన్యాలోక వ్యాఖ్యాతయగు అభినవగుప్తుడు, కావ్యమునకు ప్రీతియే ప్రయోజనము, అదియే రసాత్మగా నుండునని చెప్పినాడు. అలంకార శాస్త్రకర్తలు కావ్య ప్రయోజనమును అనేక విధములుగ తెలిపినారు. (1) దుఃఖశాంతి. (2) మతవిజ్ఞానము, తత్వశాస్త్రజ్ఞానము (3) కళానైపుణ్యము, వ్యవహార జ్ఞానము ఈ ప్రయోజనములు కావ్య పఠితకు చేకూరును. కావ్యరచన వలన కవికి కీర్తియు, ధనమును చేకూరును. నాట్యము, శ్రమము చేతను దుఃఖాదులచేతను పరితప్తులైన వారికి శాంతిని చేకూర్చును అని భరతముని చెప్పెను. సత్కావ్యము పఠితకు పురుషార్థము లందును, కళలందును, నైపుణ్యమును కీర్తిని, ప్రీతిని కలిగించునని భామహుడు చెప్పెను. కావ్య ప్రకాశకారుడు కావ్యమువలన కీర్తి, ధనము, విజ్ఞానము, లోకజ్ఞానము, అమంగళశాంతి,ఆనందము, సదుప దేశము అను ప్రయోజనములు కలుగునని వివరించెను.ఆనందము, యశస్సు, సదుపదేశము అనునవి మాత్రమే కలుగునని హేమ చంద్రుని మతము. చతుర్వర్గ ఫలప్రాప్తి. శాస్త్రములవలన కలిగినప్పటికిని శాస్త్రములు నీరసములు, దుర్గమములు కనుక సులభమును, మృదువునైన కావ్యమునే ఫలప్రాప్తి సాధనముగా పలువు రాదరింతురని, రుద్రటుని సిద్ధాంతము. ఏకావ్యము ఏవిధముగ ఉపదేశించినను, రామునివలె నడుచుకొనవలెను, రావణునివలె నడువకూడదు అనియే తెల్పుడు. 'కావ్యపఠనమునకు ఆనందమే ముఖ్యమని ఆలంకారికు అందరును భావించిరి.

2. కావ్య హేతువులు : అలంకార శాస్త్రకర్తలు పలువురు ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములను కావ్యమునకు ముఖ్య హేతువులనుగా వక్కాణించిరి. ఈ మూడింటిని కొలది భేదములతో దండి, భామహుడు, గుద్రటుడు, మమ్మటుడు, ఏకావళి కాగుడు, అలంకార శేఖర కారుడు కావ్య హేతువులనుగా అంగీకరించిరి. సమర్థుడైన కవి యగుటకు ఒక్క ప్రతిభ యేచాలును అని రాజ శేఖరుడు, వాగ్భటుడు, జగన్నాథ పండితుడు భావించిరి. ప్రతిభ యనగా అతి విశిష్టమైన శక్తి. ప్రతిభావంతుడైన కవసహృదయుడైన పఠిత యొక్క హృదయమునకు అతి మధురములు, అపూర్వములు అయిన అనుభవములను కలిగించును.

ప్రజ్ఞా నవనవోన్మేష శాలినీ ప్రతిభామతా'
'ప్రతిభా అపూర్వవస్తు నిర్మాణ తమా ప్రజ్ఞా'

  • స్ఫురంతీ సత్క వేర్బుద్ధిః ప్రతిభా సర్వతోముఖి'

అని బహుముఖముగా అనేకులు ప్రతిభను నిర్వచించినారు. ప్రతిభ యన త్రై కాలికములైన విషయములను గోచరింపజేయు ప్రజ్ఞ. అది సహజము, అనేక జన్మ సంస్కా రజన్యము అని అందరు అంగీకరించినారు. కావ్యపఠితకు గూడ భావనాశక్తి, సంస్కారము ఉండవలెను. అవి కలవానికే కావ్యరసానుభూతి బాగుగా కలుగును. సుకవియైనవాడు కావ్యములందు స్వతంత్రించి అచేతన వస్తువులను చేతనములనుగాను, చేతనములను అచేతనములనుగాను, య థేచ్చముగా వహృదయులకు గోచరింప జేయును అని ధ్వనికారుడు నుడివెను. కావ్య, శాస్త్ర, లోకజ్ఞానములు కలిగియుండుటయే వ్యుత్పత్తి యనబడును. మహాకవుల యొద్ద కావ్యశిక్షను పడయుటయు, నిరంతర కావ్యరచనా వ్యాసంగము చేయుటయు అభ్యాస మనబడును. ఇట్లు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము, ఈ మూడును సత్కావ్యరచనకు ఆవశ్యకములుగ చెప్పబడుచున్నవి.

3. కావ్యవిభాగములు : పాశ్చాత్యులు కావ్యమును ఇతిహాసము, గేయము, నాటకము అని విభజించినట్లే, సంస్కృతములో కూడ అట్టి విభాగములు వివిధ విషయములనుబట్టి చేయబడినవి. దండి కావ్యమును గద్యము, పద్యము, మిశ్రము అని మూడు విధములుగా విభజించెను. వామనుడు 'గద్యం కవీనాం నికషం వదంతి' అని చెప్పుటవలన, గద్యరచన కవిప్రతిభకు నికషోపలము వంటిదని స్పష్టమగుచున్నది. దండి, తన కావ్యాదర్శములో పద్యకావ్యము, సర్గబంధము (మహాకావ్యము). ముక్తకము (ఒక పద్యము), కులకము (అయిదు పద్యములు), కోళము, సంఘాతము (పరస్పర సంబంధము లేని అనేక పద్యముల కూర్పు), అని అయిదు విధములుగ నుండునని చెప్పెను. మిశ్రకావ్యము, నాటకము మొదఅయిన రూపకములు. గద్యప్రబంధము, కథ, ఆధ్యాయిక మున్నగు భేదములు గలది. సంస్కృత, ప్రాకృత, అపభ్రంశాది భాషాభేదములచే గూడ కావ్యము విభజింపబడుచున్నది. వామనుడు కావ్యము గద్యపద్యాత్మక మని చెప్పి, గద్యము, వృత్తగంధి (పద్యమువలె నుండునది), చూర్ణము, ఉత్కలికాప్రాయము అని మూడు విధములనియు, పద్యప్రబంధము అనేకవిధములుగా నుండు ననియు వచించెను. గద్యపద్యములును అనిబద్ద (సంబంధము లేనివి), నిబద్ద (సంబంధముకలవి) భేదముచే రెండు విధములుగ సూచించి, ప్రబంధము అన్నిటిలోను దృశ్య ప్రబంధము సర్వోత్తమమైనదని 'సందర్భేషు దళరూపకం శ్రేయః' అను వాక్యముచే నతడు స్పష్టపరచెను, హేమ చంద్రాదులు కావ్యము వేశ్యము. శ్రవ్యము అని రెండు విధములుగచెప్పి, వేశ్యమునకు పాఠ్యగేయ రూపములచే ద్వైవిధ్యమును సూచించి, ఈ రెండును అనేక భేదములు కలవి అనిచెప్పిరి. వస్తువును బట్టి కావ్యము ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రము అనికూడ విభజింపబడినది.

4 శబ్దార్థములు, శబ్దశక్తులు: శబ్దములు వస్తువులను, భావములను బోధించును. అర్ధమును తెలుపగల సామర్థ్య మునే శక్తి యనుచున్నారు. శబ్దమునకు మూడుశక్తులు కలవు. అవి అభిధ, లక్షణ, వ్యంజన అనబడుచున్నవి. అభిధాశక్తి చే తెల్పబడు అర్థము వాచ్యార్థము అనబడును. దీనికే ముఖ్యార్థము, సంకేతికార్ధము అనికూడ పేళ్లు. లక్షణా శక్తి చే తెలుపబడు అర్ధము లక్ష్యార్థము. వ్యంజనా శక్తిచే బోధింపబడు అర్థము వ్యంగ్యార్థము. శబ్దము లన్నియు ప్రధానముగా వాచ్యార్ధమును తెల్పును. కొన్ని వాక్యములందు శబ్దమునకు వాచ్యార్థము మాత్రము చెప్పి కొన్నచో, అర్థము కుదరదు. అనుపపత్తి ఏర్పడును. అప్పుడు ఆ శబ్దమునకు సంబంధించిన మరియొక అర్ధము రూఢిప్రయోజనములనుబట్టి చెప్పబడును. ఇదియే లక్ష్యార్థము. వ్యంగ్యార్ధమనబడునది వాచ్య లక్ష్యార్థములకంటె భిన్న మైనది. వాక్యమునందలి పదములు తమతమ ముఖ్యార్థములను బోధించి విరతవ్యాపారము లయిన తరువాత ఏ శబ్దశక్తి చే రమణీయమయిన మరొక అర్థము వాటినుండి స్ఫురించునో అట్టి శబ్దశక్తి వ్యంజనావృత్తి యనబడును. శబ్దశక్తులనే శబ్దవృత్తు లనియు వ్యవహరించుచున్నారు.

5. కావ్యలక్షణములు : ప్రాచీనాలంకారికులు కావ్య లక్షణములను అనేక విధములుగా నిర్వచించిరి. శబ్దార్థములు రెండును కలిసి కావ్యమని భామహ, వామన, రుద్రట, వక్రోక్తి జీవిత కార, మమ్మట, హేమచంద్ర, విద్యానాథాదులు నిర్వచించిరి. శబ్దమే కావ్యమని దండి, అగ్నిపురాణకర్త, జగన్నాథ పండిత, చంద్రాలోకకారాదులు నుడివిరి, 'రసాత్మకమయిన వాక్యమే కావ్యమని అలంకార శేఖర కార, విశ్వనాథ, సరస్వతీ కంఠాభరణ కారాదులు చెప్పిరి.

కావ్యాత్మనుగూర్చి భిన్నాభిప్రాయములు కలవు. భరతుడు రసమును, వామనుడు రీతిని, ఆనందవర్ధనుడు ధ్వనిని, వక్రో క్తి జీవిత కారుడు వక్రోక్తిని, క్షేమేంద్రుడు వక్రోక్తి ఔచిత్యమును కావ్యాత్మగా వర్ణించిరి. మహిమభట్టు అను ఉద్దండ తర్కపండితుడు ధ్వనిని ఖండించి దాని స్థానములో అనుమానమును సిద్ధాంతీకరించెను. అతని ననుసరించు వారెవరును లేనందున అతనిది ఒక మతమని చెప్పుటకు వీలులేదు, వక్రోక్తి జీవిత కారుడు గూడ గణములో చేరిన వాడే.

రస సిద్ధాంతము: ఈ వాదమును ప్రప్రథమముగా ప్రతిపాదించినవాడు నాట్యశాస్త్రకర్త అయిన భరతుడు.అయితే అంతకు పూర్వము ఈ వాదము లేదని తలచ కూడదు. నాట్యశాస్త్రము ప్రధానముగా నాటక లక్షణమును తెలుపుచున్నది. ధ్వన్యాలోకమునకు, నాట్యశాస్త్రమునకు, వ్యాఖ్య రచించిన అభినవగుప్తుడు, నాట్యమే రసమని, రసమే నాట్యమని' వచించినాడు. కావ్యము దశరూపకాత్మక మే అనికూడ అతడనినాడు.ధ్వన్యాలోక రచన జరుగువరకు కూడ కావ్యమునకు రసముతో గల సంబంధము ఒక పద్దతి ప్రకారము వివరింపబడలేదు. ప్రాచీనాలంకార శాస్త్రకర్తలు రస ప్రాముఖ్యమును గూర్చి 'ఎరుగరు' అని చెప్పుటకు వీలులేదు.'సర్వాలంకారములు రసములోనే పర్యాప్తములు' అని దండి తన కావ్యాదర్శములో చెప్పినాడు. అతడు రసములను, స్థాయి భావములను బాగుగా ఎరిగినవాడు. భామహుడు రసతత్త్వమును సమగ్రముగ ఎరిగినవాడే కానిఅతడు కావ్యములో రసములకు ప్రాధాన్యమును ఈయలేదు. మొదటిసారిగా తన కావ్యాలంకార గ్రంథములో రసప్రశంస చేసినవాడు రుద్రుడు. రుద్రటునికి దాదాపు ఒక శతాబ్ది పూర్వపువాడైన మాఘుడు 'శిశుపాలవధ' కావ్యములో రసములను గూర్చి నాటక సందర్భములో వర్ణించెను. నాటకముతో. రసమునకు సంబంధము కలదు గనుక భరతుడు నాట్యశాస్త్రములో రసమును గూర్చి చర్చించెను. నాటకము చతుర్విధాభినయముల ద్వారమున రసాభివ్యక్తిని సామాజికునకు కలిగించును అని భరతుడు చెప్పెను.

నాట్యశాస్త్రము, దానిపై అభినవగుప్తుడు వ్రాసిన వ్యాఖ్యానము, సరస్వతీ కంఠాభరణము, శృంగార ప్రకాశము, దశరూపకము, శృంగార తిలకము, థావ ప్రకాశము, రసతరంగిణి - ఈ మొదలైన గ్రంథములు రసవాదమును సిద్ధాంతీకరించినవి. ఈ గ్రంథము లన్నింటిలోను రససిద్ధాంతమును గూర్చి కొలది భేదము చూచింబడినది. అన్నిటికన్న ప్రాచీనమైన నాట్య శాస్త్రములో భరతుడు 'విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తిః' అని రససూత్రమును రచియించెను. దీనికి నలుగురు వ్యాఖ్యాతలు భిన్న భిన్న మార్గములతో వ్యాఖ్యానము చేసిరి. వీరిలో భట్టలోల్లటుడు, శ్రీశంకుకుడు, భట్టనాయకుడు అను మువ్వురి మతములను మనము అభినవగుప్తుని వ్యాఖ్యానమువలన తెలిసికొనవలసినదే కాని వారు రచించిన గ్రంథములు లభించుటలేదు. ఈ సూత్ర వ్యాఖ్యాతలలో నాలుగవవాడైన ఆచార్య అభినవ గుప్త పాదుడు ముఖ్యుడు. అతడు రసమునకు అభివ్యక్తి వాదమును లేవదీసెను.

ఈ వాదమును ఆధారముగా చేసికొని అతడు తక్కిన ముగ్గురి యొక్క 'ఉత్పత్తివాదము, అనుమితివాదము. భుక్తివాదము' ఆను సిద్ధాంతములను ఖండించెను. 'విభావాను భావసాత్విక వ్యభిచారి భావములతో పరిపుష్టమైన రత్యాది స్థాయి భావములే రసరూపముగ అభివ్యక్తిని పొందును అని ఇతని సిద్ధాంతము. లోకములో రస శబ్దము, మధుర ఆమ్లాదులకు కూడ వాడబడును. అవి రుచులు. కావ్యరసముకూడ రస్యమానమే కనుక దానికి రసశబ్ద వ్యవహారము కలిగినది. స్థాయిభావము రసాభి వ్యక్తి పర్యంతము స్థిరముగా నిలచునది. దానికి ఆలంబన, ఉద్దీపన విభావములు, సాత్విక భావములు, అనుభావములు, వ్యభిచారి భావములు పరిపోషకములుగా ఉండును. ప్రతి రసమునకు ఒక స్థాయిభావము వేరుగా నుండును. రసానుభవము సహృదయునకు మాత్రమే కలుగును. 'శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము,' అని ఎనిమిది రసములను మాత్రమే ప్రాచీనులు అంగీకరించి నారు. కాని ఆ తరువాత శాంతరసము వాటితో చేర్చబడి రసములు తొమ్మిది అయినవి. అది కావ్యమైన రామాయణము నందు కరుణరసము ప్రధానముగ సమగ్ర రూపములో అభివ్య క్తమగును. 'శాంతరసమును తొమ్మిదవ రసముగా చేర్చవలెనా లేదా' అను విషయమును గూర్చియు, రసముల సంఖ్యను గూర్చియు ఆలంకారికులలో భిన్నాభి ప్రాయములు కలవు. రసము సామాజిక నిష్ఠమేకాని నటగతముకాదు. నటుడు శిక్షాభ్యాసము వలన భయ కోపాది భావములను అభినయించుచున్నప్పుడు ఆయా భావముల సంస్కారము సామాజికులకే కలుగును.

భోజుడు తన శృంగార ప్రకాశములో శృంగార మొకటే రసమని విపులముగా చర్చించి నిర్ణయించినాడు. ఆనందమయము బ్రహ్మాస్వాద తుల్యమునైన రసము ఆత్మకు నిరతిశయానందమును కలిగించును. అది ఒక శృంగారమే అని భోజుని మతము. స్త్రీ పురుషుల అనురాగాత్మకమగు లౌకిక శృంగారమును భోజుడు పరిగణింపలేదు. ఆత్మకు కలుగు నిరతిశయమైన శాశ్వతా నందమే శృంగారమని అతడు చెప్పెను. ఈ రసానందము ఇతరు లంగీకరించిన నవవిధ రసములలో సమానమేగనుక అన్ని రసములవలన కలుగు ఫలము ఒకటేయని అతడు భావించెను. కొందరు అద్భుతము ఒక్కటే రసమని అనిరి. భవభూతి కరుణ మొక్కటే రసమని నుడివెను.

అలంకారవాదము  : కావ్యము సౌందర్య మయము. అలంకారములు అనగా కావ్యసౌందర్య వర్థకములు అని భామహునిమతము . రూపకాది - అలంకారములు బాహ్యములే యగును. కావ్యశోభాకరములయిన ధర్మములు అలంకారము లని దండి నిర్వచించెను. వామనుడు తన కావ్యాలంకార సూత్రవృత్తిలో అలంకారములకు ఉచిత స్థానము నిచ్చెను. కావ్యముయొక్క ఉపాధేయతయే అలంకారముమీద ఆధారపడును అని ఆతని మతము. (కావ్యగ్రాహి అలంకారాత్). వామనుని అలంకార నిర్వచనము మిగుల సమంజసముగా కనిపించుచున్నది. "సౌందర్యమే అలంకారము" అని అతని లక్షణము. 'అలంక్రియతే అనేన' అను వ్యుత్పత్తినిబట్టి అలంకార శబ్దము అనుప్రాస - ఉపమాదులయందు వర్తించును. అలంకారముల శబ్ధార్థములయొక్క అస్థిర ధర్మములు, కావ్యశోభాతిశయ కారములు; రసోవస్కా రకములు అని విశ్వనాథుని లక్షణము. "చారుత్వ హేతుః అలంకారః" అని ప్రతాపరుద్రీయము.

కవి సౌందర్యోపాసకుడు. కవి నిర్మితియగు కావ్యము సౌందర్యరాశియగును, అలంకారశాస్త్రములో కావ్యము సౌందర్యవతి యగు సుందరితో పోల్చబడినది. అందు అలంకారములు విద్యమానమగు సౌందర్యమును వృద్ధి పరచును. కొందరు ఆలంకారికులు అలంకారములు ఆవశ్యకము లనిరి. కొందరి మతమున అలంకారములు అత్యంతావశ్యకములు కావు. “వనితాముఖము కాంత మయినప్పటికిని నిరలం కారమగుచో భాసిల్లదు. అటులనే కావ్యముకూడ రమ్యమయినను అలంకారముల నపేక్షించును" అని భామహుని మతము. గుణప్రాధాన్య వాధియు రీత్యాచారుడును అగు వామనునకు ఇది రుచింపలేదు. "కావ్యము యువతి యొక్క రూపమువంటిది. అది కేవల గుణాత్మకమయినను రసికులకు మనోజ్ఞమే. అలంకార యుక్తమగుచో మిక్కిలి రుచికరము. గుణహీన మగు కావ్యము యౌవనము గడచిన అంగన యొక్క శరీరము వంటిది. అలంకారములు మాత్రమే శోభాకరములు కావు" అని అతడు వాదించెను. అర్వాచీనాలం కారికులు కావ్య శరీరమునకు అలంకారములు అంగద - కుండల హారాదులవంటివే యను నభిప్రాయమును వ్యక్తికరించిరి.

అలంకారములను గుణములనుండి పృథక్కరించి భామహుడు భావికము అను నాలంకారమును గుణముగా పరిగణించెను. గుణములను మొదట చూపినవాడు వామనుడు. దండి దళగుణములను కూడ అలంకారములుగా పరిగణించెను. “కాశ్చిన్మార్గ విభాగార్థ ముక్తాః ప్రాగవ్య లంక్రియాః' వామనుని మతమున "కావ్యము యొక్క శోభాకరములగు శబ్దార్థ ధర్మములు గుణములనబడును. అవి ఓజః ప్రసాదాదులు, యమకోపమాదులు కావ్య శోభను అతిశయింప జేయును, కేవలాలంకారములు శోభాకరములు కావు. గుణములు నిత్యములు. అవి లేనిచో కావ్యశోభయే లేదు. అలంకారములు అనిత్యములు, అలంకార వాదము మిగుల ప్రాచీనమైనది. భామహుడు, ఉద్భటుడు, దండి, రుద్రటుడు మొదలగు వారు అలంకారప్రాధాన్యమును అంగీకరించిరి.

అలంకారములకును రసమునకును గల సంబంధము ప్రాచీనకాలముననే గుర్తింపబడినది. భామహుడు మహా కావ్యము సకల రసయుక్తము కావలెను" అనెను. భామహాదులు రసవత్, ప్రేయ, ఊర్జస్వి - ప్రభృతులను అలంకారములనుగా పరిగణించిరి. రసవదలంకారమును "దర్శిత స్పృష్ట శృంగారాది రసమ్" అని భామహుడు నిర్వచించెను. అర్వాచీనాలం కారికులలో పెక్కురు వీటిని అలంకారములుగా గణింపలేదు. వీరికి అలంకారములే కావ్యములో ప్రధానముగా గోచరించెను. వీరికి సునిశ్చితమగు ధ్వని సిద్ధాంతము (ప్రతీయమానార్థవాదః) సువిశదముకాకపోయినను, ధ్వనిమాత్రము వీరికి విదితమే. వీరి మతమున అలంకారములే ప్రధానములు.

భరతుని నాట్యశాస్త్రములో ఉపమ, రూపకము, దీపకము, యమకము, అను నాలుగు అలంకారములు పేర్కొనబడినను, అలంకారముల సంఖ్య క్రమముగా పెరుగుచు వచ్చెను. దండి 35 అర్థాలంకారములను పేర్కొనెను, యమకమును గూడ వివరించెను. మమ్మటుడు 61 అర్థాలంకారములను విశదీకరించెను. అర్వాచీనాలంకారికులలో కొందరు అలంకారముల సంఖ్య రెండు వందలకుపైగా నుండవచ్చును అనిరి. అలంకారమనగా ఉక్తి వైచిత్య్రము. ఈవై చిత్య్రము అనంతముగాన అలంకారములుగూడ ననంతములే యనుచో నతిశయోక్తి కాదు.

భామహుడు, దండి మొదలగువారు వక్రోక్తి అతిశయోక్తి అను నీరెండును అలంకారములకు మూలములని నుడివిరి. భామహుని మతమున “వాక్కు యొక్క వక్రార్థ శద్దోక్తి అలంకారోత్పాదకము. అలంకృతి యనగా వక్రాభిధేయ శబ్దాక్తి యగును." శబ్దార్థముల వక్రత యనగా లోకోత్తర రూపముగా వాటి అవస్థానమే. భామహుడు వక్రోక్తికి ప్రాధాన్య మిచ్చెను. "వక్రోక్తియే సర్వస్వము. వక్రోక్తి మూలముననే అర్థము విభావింపబడును. కవి వక్రోక్తికొరకు యత్నము చేయవలెను. వక్రోక్తిలేనిచో అలంకారమే లేదు.” అందుననే ఈయన స్వభావోక్తిని అలంకారముగా పరిగణింప లేదు. "స్వభావోక్తి రలంకార ఇతి కేచిత్ ప్రచక్షతే"' అని మాత్రము పేర్కొనెను. దండి అతిశయోక్తి సర్వాలంకార పరాయణమని వచించెను. "అలంకారాంతరాణా మష్యేకమాహుః పరాయణమ్ | వాగీశ మర్హ తాముక్తి మిమామతిశయాహ్వయామ్.” అలంకారములను వైజ్ఞానిక పద్ధతిచే విభజించిన ప్రథమ అలంకారికుడు రుద్రటుడు. ఈయన అలంకారములను వాస్తవ, ఔవమ్య అతిశయ,,శ్లేషమూలకములుగ విభజించెను. కొన్ని అలంకారములు రెండు వర్గములకు చెందును. ఉదా: ఉత్ప్రేక్షాలం కారము ఔవమ్యాతిశయమూలము. ఉపమాదులు సాదృశ్య గర్భములు, విభావనాదులు విరోధగర్భములు. కావ్య లింగాదులు తర్క న్యాయమూలములు. యథాసంఖ్యాదులు కావ్యన్యాయమూలములు. ప్రతీపాదులు లోక న్యాయ మూలములు, సూక్ష్మాదులు గూఢార్థ ప్రతీతిమూలములు. కారణమాలాదులు శృంఖలాబంధమూలములు- అని అర్థాలంకారముల వర్గీకరణము, అనేక అలంకారముల యొక్క కలయిక సంశ్లేష మనబడును. అర్థాలం కారములు చతుర్విధములు. అవి (1) ప్రతీయమాన వస్తువులు. (2) ప్రతీయమాన ఔపమ్యములు. (3) ప్రతీయమాన రస భావాదులు- (4) అస్ఫుట ప్రతీయమానములు అని ఇందు అతిశయోక్తి మొదలగునవి మొదటివర్గమునకును, రూపకాదులు రెండవవర్గమునకును, రసపదాదులు మూడవ వర్గమునకును, అర్ధాంతరన్యాసాదులు నాలుగవ వర్గమునకును చెందును. అలంకారములు శబ్దగతములనియు అర్థగతములనియు మరియొక విభాగము. అందు శబ్దాలంకారము, అనుప్రాస, యమకము అని ద్విధాభిన్నము. ఛేకానుప్రాస, వృత్యనుప్రాస, శ్రుత్యనుప్రాస, అంత్యానుప్రాస మొదలగునవి అనుప్రాసభేదములు. లాటానుప్రాసాదులు ఉభయగతములు అని కొందరి మతము. అర్థాలంకారములు ఉపమాదులు. అర్థాలంకారములలో ఉపమాలం కారము నిర్వాదరణీయము, "ఉపమా కవిలోకన్య మాతా" కవికుల గురువగు కాళిదాసుని ఉపమలు జగత్ప్రసిద్ధములు.

రీతి వాదము  :- ఈ వాదమును ప్రవేశ పెట్టిన వారిలో వామనుడు అతి ముఖ్యుడు. దండి దీనినే 'మార్గము' అని వ్యవహరించెను. అతడు వైదర్భ, గౌడ అను రెండు మార్గములను నిర్దేశించెను. భామహుడు రీతిద్వయ వాదమును అంగీకరింపలేదు. కావ్యమునకు ఆత్మరీతియని వామనుడు సిద్ధాంతీకరించెను. రీతియనగా గుణసహితమైన విశిష్టపద రచన యని అతని భావము, రీతి గుణాత్మకమే. అతడు వైదర్భి, గౌడి, పాంచాలి, అను మూడు రీతులను పరిగణించెను. వామనుడు గుణములు పదియని పేర్కొ నెను, ఓజస్సు, ప్రసాదము, సమత, శ్లేష, సమాధి, మాధుర్యము, సౌకుమార్యము, ఉదారత, అర్థవ్యక్తి, కాంతి అనునవి పదిగుణములు, వామనుడు ఈ గుణములను శబ్ధగతములుగను, అర్థగతములుగను విభజించెను. భరతుని నాట్య శాస్త్రములోగూడ పదిగుణములే గ్రహింపబడినవి. భరతుడు గుణాలంకారములను రసమునకు అంగములుగా వర్ణించెను. దండి గుణాలంకారములకు భేదమును పాటింపలేదు. వామనుడు అవి భిన్నములని చెప్పెను. వైదర్భీరీతిలో అన్ని గుణములు ఉండుననియు, గౌడీ రీతిలో ఓజస్సు, కాంతి మాత్రము ఉండుననియు, పాంచాలీ రీతిలో మాధుర్య, సౌకుమార్యములు ఉండుననియు వామనుడు వివరించెను. ఈ రీతులు విదర్భ మున్నగు దేశములలో ఎక్కువగా వ్యవహరింపబడుటచే వాటికి ఆపేళ్ళు వచ్చియుండునని సూచించెను.

గుణముల లక్షణములను నిర్వచించుటలో భరతుడు దండి, వామనుడు, భిన్నమార్గములను త్రొక్కిరి. ఎట్లన సమాసవత్తులయిన విచిత్ర పదములతో గూడినది ఓజో గుణమని భరతుడు నిర్వచించెను. సమాస భూయ స్త్వము ఓజస్సు అని దండి మతము. గాఢ బంధత్వము, అర్థప్రౌఢి, ఓజోగుణము అని వామనుడు విస్తరించెను, కావ్యమునందు గుణములు నిత్యములు. అలంకారములు అనిత్యములు. కాన అలంకారములు లేకున్నను కావ్యమునకు కావ్యత్వ భంగము కలుగదు. రీతి ఒక వేళ వాస్తవమైన కావ్యసారమును అందుకొనలేక పోయినను దానికి అతి సమీపమునకు చేరగలదు. వామనుడు చెప్పిన మూడు రీతులకు భోజుడు అవంతి, మాగధి, లాటి, అను మరి మూడు రీతులను చేర్చెను.

గుణములు నిజముగా కావ్యాత్మయైన రసాదులకు చెందినవి. మాధుర్య గుణము ప్రత్యేకముగా శృంగార రసమునకు చెందినదనియు, ఆ గుణము విప్రలంభ శృంగారములోను, కరుణములోను పరాకాష్ఠ నందుకొనుననియు ఓజోగుణము రౌద్ర, వీర, అద్భుతములుగల కావ్యములలో ప్రత్యేకముగా ఉండు ననియు, ప్రసాదగుణము సర్వరస సామాన్యమనియు ధ్వని కారుడు స్పష్ట పరచెను. భామహుడు గుణములనుగూర్చి చాల సంగ్రహముగా వివరించి, మాధుర్య, ఓజః, ప్రసాదగుణములను మాత్రమే సూచించెను. తరువాతి శాస్త్రకర్తలైన హేమ చంద్రాదులు గుణములను పై మూడింటివరకు తగ్గించి 'తక్కిన గుణములు ఈ మూడింటిలో నైనను చేరును. లేదా నిజ ముగా దోషాభావమే గుణము' అను సిద్ధాంతమునైన అనుసరించవలెను అని నుడివిరి.

ధ్వనివాదము  : కావ్యమార్గ (ఆత్మ) నిరూపణము నందు భామహ, దండి, వామన, ఆనందవర్ధనులు ఒకరి కంటె నొకరు ఒక్కొక్క అడుగు పురోగమించిరి. వీరిలో వామనుడు ప్రప్రథమమున కావ్యమునకు ఆత్మ అనునది కలదనియు, అది రీతియనియు వచించెను. ఆనంద వర్ధనుడు ధ్వన్యాలోక మను గ్రంథమును వ్రాసెను. అతడు పూర్వాలం కారరికులకు పరిచితము కానట్టియు, అభిదా లక్షణలకంటే భిన్నమై నట్టియు ఒకానొక వ్యంజన అను వృత్తిని ప్రతిపాదించెను. ఎట్లన గంగాయాం ఘోషః(గంగ యందు గొల్లపల్లె) అనుచోట లక్షణచేత తీరము లక్షితము కాగా, శీతత్వ - పావనత్వాదులు ఈ వ్యంజనా వృత్తి చేతనే తెలుపబడును. లక్షణ, లక్ష్యార్థమును చెప్పి విరతి నొందగా, శీతత్వ, పావనత్వాది బోధార్థమై తప్పక మరియొక వృత్తిని అంగీకరింపవలసి యుండును. అది వ్యంజనావృత్తియే, మరియొకటి కాదు అని చెప్పెను.

ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకమునందు ఒక క్రొత్త సిద్ధాంతమును ఆవిష్కరించెను. "ధ్వనతీతి ధ్వనిః (కావ్యం) ధ్వన్యతే ఇతి ధ్వనిః (వ్యంగ్యార్థము); ధ్వననం ధ్వనిః (వ్యంజనా) అని అభినవ గుప్తాచార్యుడు ధ్వని శబ్దమునకు మూడు రీతుల వ్యుత్పత్తులను గ్రహించి, కావ్య పరముగా, వ్యంగ్యార్థపరముగా, వ్యంజనావృత్తిపరముగా వ్యాఖ్యాన మొనర్చెను. ధ్వని జీవితము అనుచోట ధ్వని శబ్దమునకు వ్యంగ్యార్థమనియే అర్థము." ఆనంద వర్ధనుడు ధ్వని ప్రాధాన్యవాది. అతని సిద్ధాంత మిది :- "కావ్య స్యాత్మా ధ్వనిః." కావ్యమునకు ధ్వని ఆత్మ. లోకమున జీవితము ఉన్నపుడే శరీరమునకు అలంకారములు మున్నగునవి సౌందర్య సంపాదకము లగుచుండుట చేత, అలంకారాదుల కంటె జీవితము ప్రాముఖ్యమును వహించు చున్నది. అట్లే కావ్య శరీరమునకు ధ్వని యనునది జీవితము. అనగా ఆత్మ. అదియే ప్రధానమయినది. ఆ ధ్వని వస్తుధ్వని, అలం కారధ్వని, రసధ్వని అని మూడు తెరగులు. వీటిలో రసధ్వని, ఉత్తమోత్తమము. అలంకార-గుణ-రీతులు అనునవి ధ్వనికి ఉపస్కారకములుగా (తోడ్పడునవిగా) నుండదగును అని వచించి, అలంకారగుణరీతి సిద్ధాంతములను ధ్వని కారుడు, తన ధ్వని సిద్ధాంతమునకు అంగములుగా సమన్వ యించెను. అతడు శబ్దార్థ - ఉభయము కావ్యశరీరము కాదనియు, చారుత్వాతిశయముతో కూడి, అర్థ ప్రకాశకమయిన శబ్దవిశేషమే కావ్యమనియు గ్రహించినట్లు తెలియుచున్నది.

“పూర్వాలంకారికులు భరతుని రస సిద్ధాంతమును రూపకమునకుమాత్రమే సమన్వయించియుండిరి. ఆనంద వర్ధనుడు దృశ్యములు, శ్రవ్యములు అను ఉభయ విధ కావ్యములకును రసము సాధారణ మని వచించెను. రూపకమునకు వలెనే శ్రవ్యకావ్యమునకును, రసమే ప్రధానమైనది. రసము వాచ్యరూపముగా గాక, వ్యంగ్య రూపముగా నుండదగును. రసభంజకములయిన దోషములు గ్రాహ్యములు కావు. రసవ్యంగ్యమువలెనే వస్త్వలంకార వ్యంగ్యములుకూడ స్వీకరింపదగినవే. రసము అలంకారములో (రసవదలంకారము) చేరదు. కావ్యాత్మయైన రసమును అలంకారముగ గ్రహింపకూడదు.” అని ఉద్ఘొషించెను. తరువాతి ఆలంకారికులు పెక్కురు ఆనంద వర్ధనుని సిద్ధాంతమును స్వీకరించిరి.

అభినవగుప్తుడు వస్త్వలంకార ధ్వనులయందుకంటె రసధ్వనియందే, ఆదరాతిశయమును చూపెను. రసము చేతనే కావ్యము జీవించును. రసములేని కావ్యముండదు. త్రివిధ ధ్వనులలో రసధ్వనియే కావ్యాత్మ. వస్తుధ్వని, అలంకారధ్వని అనునవి రెండును, రసపర్యవసాయులు కావలయును - అని అతడు సిద్ధాంత మొనర్చెను. విశ్వనాథుడు 'రసాత్మక మగు వాక్యమే కావ్యము' అని కావ్య నిర్వచన మొనర్చి, వస్త్వలంకార ధ్వనులకు ప్రత్యేకత్వమును అంగీకరింప లేదు. జగన్నాథుడు 'రమణీ యార్థమును (చమత్కారమును గలిగించు నర్థమును) ప్రతిపాదించు శబ్దమే కావ్యము' అని కావ్యనిర్వచనము చెప్పెను. పూర్వాలంకారికులు శబ్దమునకును, అర్థమునకును - రెండింటికిని ప్రాధాన్యము నొసగిరి. జగన్నాథుడు శబ్దమునకే ప్రాముఖ్య మిచ్చెను. ఆ శబ్దము వాచకము, లక్షకము, వ్యంజకము అని త్రివిధము. ఆ మూడును క్రమముగా వాచ్యార్థమును, లక్ష్యా ర్థమును, వ్యంగ్యార్థమును ప్రతిపాదించును అని అతడు నుడివెను.

ఔచిత్యవాదము  : ఒక్కొక్క కాలమున ఒక్కొక్క ఆలంకారికుని రుచిభేదము నుబట్టి ఒక్కొక్క కావ్యాంగమునకు ప్రాముఖ్యము లభించుచు వచ్చెను. కాశ్మీరదేశీయుడును, అవంతివర్మయొక్క ఆస్థాన విద్వాంసుడునగు క్షేమేంద్రుడు (క్రీ. శ. 1010-1020) ఔచిత్యము అను నొక సిద్ధాంతమును లేవదీసెను. క్షేమేంద్రుడు సుమారు నలువది గ్రంథములను రచించెను. వాటిలో ఔచిత్యవిచారచర్చ, కవికంఠాభరణము అనునవి అలంకార శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములు.

క్షేమేంద్రుని 'ఔచిత్యవిచార చర్చ' మృదుమధుర భాషా నిబద్ధము. సహృదయ రంజకము. అందు అతడు ఔచిత్యమును గూర్చి ఇట్లు విచారణచేసెను. జౌచిత్యము రసమునకు జీవితభూతము. చమత్కార కారి. అది రస ప్రసిద్ధమైన కావ్యమునకు స్థిరమైన జీవితము. (ఔచిత్యం రససిద్ధస్యస్థిరం కావ్యస్య జీవితం) కావ్యమునందు జీవితభూత మైన ఔచిత్యము లేకున్నచో, బాహ్య శోభాకరములయిన అలంకారములుగాని, గుణములుగాని ప్రయోజనకారులు కాజాలవు. కాబట్టి రసవంతమగు కావ్యమునకు ఔచిత్యమే జీవితభూత మగుచున్నది.

ఔచిత్యమును క్షేమేంద్రు డిట్లు నిర్వచించెను. ఏది దేనికి తగునో అది ఉచితము. ఉచితము యొక్క భావమే ఔచిత్యము.

(ఉచితం ప్రాహు రాచార్యాః సదృశంకిల యస్యయత్,
ఉచితస్యహి యోభావః తదౌచిత్యం ప్రచక్షతే॥)

లోకమునందు శరీరాలంకారములు ఉచితస్థానములందు విన్యస్తములై ఔచిత్యమును పోషించును. గుణములు ఔచిత్య యుక్తములైనప్పుడే గుణము లగును, కంఠము నందు మేఖలను, నితంబఫలకమునందు హారమును, పాణి యందు నూపురమును, చరణమునందు కేయూరమును ధరించుట, ప్రణతుడైన శత్రువునందు శౌర్యమును చూపుట మున్నగు కృత్యములు, హాస్యమునకు హేతువు లగుచున్నవి. అట్లే అలంకారములు, గుణములు, ఔచిత్య రహితములైనచో రుచికరములు కాజాలవు అని అతడు చెప్పెను.

క్షేమేంద్రుడు అనౌచిత్యమును పద, వాక్య, ప్రబంధార్థ, గుణ, అలంకార, రస, క్రియా, కారక, లింగ, వచన, విశేషణ, ఉపసర్గ, నిపాత, దేశ, కాల, నామాది భేదములచే విభజించెను. విభజించుటయే గాక, ఆ పద వాక్యాది - ఔచిత్యములను నిర్వచించి, వాటినన్నిటిని సోదాహరణముగ వివరించెను. కాళిదాసాది మహాకవుల గ్రంథములలోని అనౌచిత్యదోషములను నిర్దాక్షిణ్యముగా విమర్శించెను.

క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్యయందు పూర్వాలంకారికులకు ఋణపడి యున్నట్లు విదితమగు చున్నది. ఎట్లన దండి, కామం సర్వోప్యలం కారో రస మర్థే నిషించతి । తథా ప్యగ్రామ్యతై వైనం భారం వహతి భూయసా' (సర్వాలం కారములును నిస్సందేహముగా రస స్ఫోరకములే. ఐనను అగ్రామ్యతయే అనగా అనౌచిత్యా భావమే సర్వభారమును వహించును) అని నుడివెను. ఆనౌచిత్యాభావ మన ఔచిత్యస్థితియని అర్థము. ఔచిత్య స్థితిచే రసస్ఫురణ మేర్పడు ననుచో అనౌచిత్యము రసభంజకమని తేటపడుచున్నది. ఆనందవర్ధనుడు ఈ భావము నే,

'

అనౌచిత్యాదృతే నాన్య ద్రసభంగస్య కారణమ్ ।
ప్రసిద్దౌచిత్యబంధస్తు రసస్యోపనిష త్పరా॥

' (అనౌచిత్యము కంటె రసభంజకమైన హేతువు మరియొకటి లేదు. ఔచిత్య విశిష్టమయిన కావ్యము రసోపనిషత్తే) అని వచించెను. ఆనందవర్ధనుని ఈ కారికార్థమునే స్వీకరించి క్షేమేంద్రుడు 'ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యస్య జీవితమ్' అను తనవాదమును ప్రతిష్ఠించెను. అందుచే క్షే మేంద్రుని ఔచిత్యవాదములో నుపజ్ఞ లేదనియు, దాని నాతడు పూర్వాలంకారికులనుండి గ్రహించి విపులీకరించి దానికొక ప్రత్యేకస్థాన మొసగెననియు విదితము కాగలదు.

వక్రోక్తి సిద్ధాంతము  :- వక్రోక్తియను శబ్దము సాహిత్యములో చాల ప్రాచీనకాలమునుండియు పెక్కు అర్ధములలో ప్రయోగింపబడుచు వచ్చెను. బాణుడు 'వక్రోక్తి నిపుణేన విలాసిజనేన' అని ప్రయోగించెను. దండి తన కావ్యాదర్శములో వక్రోక్తిని స్వభావోక్తికి వ్యతిరేకముగా వాడెను. శ్లేష వక్రోక్తికి పోషకమని యాతడు పల్కెను. వక్రోక్తియనగా ఉక్తి వైచిత్య్రము. అది తరచుగా శ్లేషపై ఆధారడియుండి, ఋజుభాషణము నకు భిన్నముగానుండును. భామహుడు ఈ యర్థములోనే దీనిని ప్రయోగించెను. కావ్యమునందును వ్యవహారమునందలి పదములే ప్రయోగింపబడుచున్నను, కావ్యమునందు అవి విశిష్ట పద్ధతిలో వాడబడుచున్నవి. దీనినే వక్రత యందురు.

వక్రోక్తి కావ్యజీవితము అని నుడివినవాడు కుంతకుడు. ఈతని గ్రంథము 'వక్రోక్తి జీవితము'. వక్రోక్తి యనగా 'వై దగ్ధ్య భంగీ భణితిః' అని ఇతడు నిర్వచించెను. వక్రోక్తి కవియొక్క వాడ్నైపుణ్యముచే నేర్పడునని ఈతని యభిప్రాయము. స్వభావోక్తిని అలంకారమనిన వారిని ఈతడు పరిహసించేను. వక్రోక్తి అరువిధము లని ఇతడు నిరూపించెను. అవి వర్ణవిన్యాస, పదపూర్వార్ధ, ప్రత్యయ, వాక్య, ప్రకరణ, ప్రబంధ గతములు,

ధ్వనికారుడు 'సంభాషణ వైచిత్రియే వక్రోక్తి'యని చెప్పి అది అలంకారమని నుడివెను. వామనుడు వక్రోక్తి 'సాదృశ్య లక్షణ' యని నిరూపించెను. రుద్రటుడు వక్రోక్తి శబ్దాలం కారమనిచెప్పి అది కాకు వక్రోక్తి, శ్లేష వక్రోక్తి అని రెండువిధములుగ నుండుననెను. భోజుని సరస్వతీ కంఠాభరణములో వాఙ్మయమంతయు వక్రోక్తి, రసోక్తి, స్వభావోక్తి యని మూడు విధములనియు, రసోక్తి సహృదయ హృదయాకర్షకమనియు చెప్పబడినది, వక్రో క్తిని గురించి ఈ విధముగా చెప్పుటవలన అది విలక్షణమైన కావ్యస్వరూపమును తెలుపుచున్నదని భావించవలెను. సాధారణ ప్రసంగములలో వాడబడు పదములను గైకోను కావ్యమునం దైనను వక్రోక్తి కొరకు పదములను ఏరుకొను పద్ధతి ఇతర సామాన్య సంభాషణలోకన్న వేరుగానుండును.

కైశిక్యాది వృత్తులు  : ఇప్పుడు 'వృత్తి, ప్రవృత్తి' అను వాటినిగూర్చి చర్చించి వాటికి రీతులతో గల సంబంధ మును చర్చించుట చాల ఆవశ్యకము. 'భారతి, సాత్వతి, కైశికి, ఆరభటి అను నాలుగు వృత్తులను, వాటి అంగములను గూర్చి భరతుడు నాట్యశాస్త్రములో వివరించెను. అతడు వృత్తులు నాట్యమునకు తల్లులవంటివని చెప్పెను. కైశికివృత్తి శృంగార, హాస్యరసములలోను, సాత్వతి, వీర, రౌద్ర, అద్భుతములలోను అవశ్యముగా వాడవలె నని భరతుని మతము. రసార్ణవ సుధాకారుడు వృత్తులకు పైనియమములనే సూచించి, 'భారతీ' అను పదము 'భారీ' శబ్దమునుండియు, 'కైశికీ' అను పదము ' కేశ’ శబ్దమునుండియు ఉత్పన్నములయిన వని వాటికి పౌరాణిక వ్యుత్పత్తులను తెలిపెను. ఒక రసమునకు అనుగుణము అయిన శబ్దముల, అర్థముల ప్రయోగమును గూర్చి తెలిపి, ధ్వని కారుడు ఆవృత్తులే ఔచిత్యయుక్తములై వివిధములుగా తెలియనగు నని కూడా చెప్పెను. వృత్తియనగా వ్యవహారము అని యర్థము. రసానుగుణమై, ఔచిత్యవంతమయిన వ్యవహారముగల కైశిక్యాది వృత్తులు అర్థాశ్రయములనియు, ఉపనాగరికాదులు శబ్దాశ్రయము లనియు అభినవగుప్తుడు తెలిపెను. అతడు 'రసాదుల దృష్ట్యా వాడబడిన వృత్తులు నాట్యమునకు, కావ్యమునకు ఒక అపూర్వమయిన శోభను కలిగించును. ఆ రెంటికిని రసాదులు జీవితభూతములు. ఇతి వృత్తాదులు శరీర భూతములు' అని చెప్పెను. కనుక నాట్యమునకుగాని కావ్యమునకుగాని ఇతివృత్తము శరీరమని స్పష్టమగు చున్నది. కైశిక్యాదులు అర్ధవృత్తులని, ఉపనాగరికాదులు శబ్దవృత్తులనికూడ స్పష్టమైనది. భరతుడు కైశికీవృత్తిని స్త్రీలుమాత్రమే బాగుగా నటించగలరని అనెను. ఉద్భటుని మతములో వృత్తులు పరుష, ఉపనాగరిక, గ్రామ్య భేదముచే మూడు విధములు.

నాట్యశాస్త్రములో భరతుడు అవంతి, దాక్షిణాత్య, పాంచాలి, ఓడ్ర, మాగధి, అను ప్రవృత్తులను చెప్పి, ప్రవృత్తియనగా నానా దేశ వేష భాషా- ఆచారవా ర్తలను ప్రఖ్యావన చేయునది అని తెలిపెను. దాక్షిణాత్య ప్రవృత్తిలో అనేక నాట్యములు, గానము, సంగీతము కలవనియు ఆతడు వచించెను. కావ్య మీమాంసలో వేష విన్యాసక్రమము ప్రవృత్తి యనియు, విలాస విన్యాసక్రమము వృత్తి యనియు, వచన విన్యాసక్రమము రీతి యనియు ఈ మూడింటికిని గల విశేషమును అతి స్పష్టముగా తెలిపెను. సాగరనంది వైదర్భి, గౌడి, పాంచాలి, అను రీతులకు భారతీ వృత్తియు, పాంచాలికి సాత్వతియు, వైదర్భికి, కైశికి, గౌడికి ఆరభటియు, క్రమముగా అంగము లని చెప్పెను.

కావ్యదోషములు  : అలంకారశాస్త్ర గ్రంథములన్నిటిలోను, దోషములను గూర్చి చర్చ జరిగినది. కుకవి యగుటకంటె అకవిగానుండుటయే మేలనియు, కుకవి యగుట మరణప్రాయమే యనియు భామహుడు వచించెను. భరతుడు పదిదోషములను పేర్కొనెను. అవి -'అర్థహీన, ఏకార్థ, గూఢార్థ, అర్థాంతర, విసంధి, శబ్ద చ్యుతి (శబ్దహీన), విషమ, భిన్నార్థ, అభిష్టుతార్థ, న్యాయాద పేత' అనునవి. దండి పదిదోషములను, భామహుడు పదునొకండు దోషములను చెప్పిరి. దోషములు సాధారణముగా పదగతములు, వాక్యగతములు, పదార్థ గతములు, వాక్యార్థగతములు, ఛందోవ్యాకరణగతములు, రసగతములు, దేశ కాలగతములు అయి యుండును. అర్థదోషముల భేదములను మమ్మటుడు, తరువాతి గ్రంథకర్తలు వామన మతానుసారముగా నంగీకరించిరి. మమ్మటుడు కావ్యప్రకాశములో, అలంకార దోషములనుకూడ చెప్పి అన్ని దోషములను అరికట్ట జాలము గనుక ఘోరములయిన దోషములను నిరోధింపవలె ననియు, అన్నింటిలోను ఘోరాతిఘోరములయిన రసదోషములను కవి ప్రయత్నాతిశయముచే దొరలకుండ చేయవలె ననియు. విశదీకరించెను. కావ్యమును నిర్దోపముగా కూర్చుట అసంభవమని విశ్వనాథు డనెను. 'దోషదృష్టి పరముగా మనస్సును అతిగా ప్రవర్తింప చేయకూడదు. దోషైక దృక్కులకు దోషము లేని చోటకూడ దోషము కనిపించును' అని కుమారిలుడు తేటపరచెను.

క.ల.శా

[[వర్గం:]]