Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలంపురము

వికీసోర్స్ నుండి

అలంపురము  :- అలంపురము తుంగభద్రాతీరమున ఉన్న ప్రాచీన పట్టణము. ఇది రాయచూరు జిల్లాలోని ఒక తాలూకా కేంద్రము. ఇందలి జనసంఖ్య 7000. ఇప్పుడీ గ్రామ మంతయు శిథిలావశేషములతో నిండి యున్నది. విశాలమైనకోట, పురాణ ప్రసిద్ధములైన నవబ్రహ్మాలయములు, మనోహర శిల్పఖండములు, అనేక శిలాశాసనములు మనకిప్పటికినీ కనబడుచు నాటి వైభవమును స్మరణకు తెచ్చుచున్నది.

చరిత్ర  : ఈ ప్రాంతము చాల ప్రాచీనమైనది. ఇచటికి సమీపమున ఉన్న గొందిమళ్ళ, చాగటూరు శివారులలో కెయిరనులు (cairns) అనబడు ప్రాగైతిహాసిక యుగపు సమాధులు విశేషముగా నున్నవి. అవి శిలాయుగమునకు చెందినవి. వాటిని త్రవ్వించి పరిశోధనలు జరిపినచో క్రొత్తవి శేషములు బయటికివచ్చును.

అలంపురమను పేరెట్లువచ్చెనో ఇందలి కోటను దేవాలయములను ఎవరు ఎప్పుడు నిర్మించిరో తెలుపగల ఆధారములు లభింపలేదు. పురములోని దేవద్రోణి తీర్థమున కోటగోడకు వేయబడిన విజయాదిత్య సత్యాశ్రయుని శాసనమునుబట్టి కోట 7 వ శతాబ్దము తరువాత కట్టబడెననియు, స్వర్గ బ్రహ్మాలయ ద్వారపాలకుని మీదగల వినయాదిత్య సత్యాశ్రయుని లేఖనమునుబట్టి ఆలయములు 7 వ శతాబ్దమునకు ముందు నిర్మింపబడి యుండెననియు గట్టిగా చెప్పవచ్చును.

స్థలపురాణములో, హేమలాపురమనియు, శాసనములలో హతంపుర మనియు నిది పేర్కొనబడినది. 11 వ శతాబ్దపు శాసనములలో అలంపురము పేరు కానవచ్చును. నిఖిలభారత ఆయుర్వేద విద్యాపీఠము (లాహోరు) వారు ప్రకటించిన "ఆనందకందం" అను వైద్యగ్రంథమున అలంపురము ప్రస్తావింపబడినది. ఆ గ్రంథకాల నిర్ణయమున అభిప్రాయ భేదములు కలవు. భారత ప్రభుత్వ-ఆర్ష శాఖవారి 1937 వ వార్షిక నివేదికలోని గురిజాల ప్రాకృత శాసనమందు 'హలంపురస్వామి' ఒకడు అచటి బౌద్ధ స్తూపమునకు దానముచేసిన విషయము కలదు. ఆ హలంపురము ఈ అలంపురమేయైనచో 3 - 4 శతాబ్దములనాటికే అలంపురము ప్రసిద్ధినంది యుండవలెను.

పరిసరములలోనున్న తక్కపిల, ఉండవెల్లి, శాతన కోట గ్రామనామము లీప్రాంతము యొక్క ప్రాచీనతను అస్పష్టముగ తెలుపుచున్నవి. అలంపురపు శిలాలేఖనములను బట్టి, వాస్తు శిల్పములనుబట్టి ఆలయములు 6-7 శతాబ్దములలో బాదామీ చాళుక్యుల కాలమున నిర్మింపబడి యుండునని ఊహింపవచ్చును.

ఈ ప్రాంతములు వరుసగా బాదామీ చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణీ చాళుక్య, కాలచుర్య, కాకతీయ,విజయనగర రాజులచే పాలింపబడినవని శాసనములు చెప్పుచున్నవి. తరువాత కుతుబుషాహీ, మొగలు పాదుషాలకు లోబడి బిజ్జులవారు కొంతకాలము పాలించినారు. ఆంధ్రానర్ఘరాఘవ కావ్యకర్తయగు బిజ్జుల చినతిమ్మ భూపాలుడు అబుల్ హసన్ కుతుబ్ షా సామంతుడై అలం

గణపతి - అలంపురము పురమును ఏలినాడు పిదప 19 వ. శతాబ్దమునషాయారుల్ ముల్కు అను జాగీరుదారు కొన్నాళ్ళు ఏలినాడని పార్సీ లేఖనములు తెలుపు చున్నవి.

శాసనములు : అలంపురము ఆలయములలో పెక్కు శాసనము లున్నవి. అవి దక్షిణాపథ చరిత్రకు ముఖ్యముగా పశ్చిమాంధ్ర చరిత్రకు మిగుల ప్రధానమైనవి. ఇంతవరకు లభించిన శాసనములలో వినయాదిత్యుని లేఖనలే ప్రాచీనమైనవి.

ఇచటబాదామీ చాళుక్యులు వినయాదిత్య, విజయాదిత్య, సత్యాశ్రయులు, రాష్ట్రకూట ప్రభూతవర్ష, ధారావర్ష మహారాజులు, కల్యాణీ చాళుక్యులగు త్రైలోక్యమల్ల, జగదేకమల్ల, భువనైక మల్ల, త్రిభువనమల్లుల కాలమున వారి పట్టమహిషులు, ప్రధానులు, సామంత మండలేశ్వరులైన తెలుగుచోడ, వైదుంబరాజులు, కలచురి భుజబల మల్లుని కాలమునందలి అయ్యావొళై మార్వర్ స్వాములు కాకతీయ ప్రతాపరుద్రదేవునికాలపు వీరబలంజ్యసమయ ధర్మ ప్రతిపాలకులు,అం తెంబరగండ పెర్మాడి రాయని ప్రధాని అయితరాజు, అంతెం బరగండ రాయి దేవమహారాజు, విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు మొదలయినవారు వేయించిన శిలాశాసనము లనేకము లున్నవి, వీటి వలన వాటి విద్యాపీఠములు, వ్యాపార శుల్కములు, అర్చావిశేషములు, రాజవంశ ప్రశస్తులు, మొదలయిన అపూర్వ చారిత్రకాంశములు తెలియవచ్చు చున్నవి. ఇచటి వీరగల్లుల పై విగ్రహములపై గూడ లేఖనములుండి చారిత్ర కాంశములను వెల్లడించుచున్నవి.


దేవాలయ శిల్పము - ఆలంపురము అలంపురములో నందులు మఠము, మబ్బు మఠము, అను శైవ మఠములు కలవు. నందుల మఠములో మల్లి కార్జునరాయల సేనాని కాచప్పొడయలు దానమిచ్చిన తామ్ర శాసనము కలదు. అలంపురములోను పరిసర గ్రామాలలోను ఉన్న తామ్ర శిలాశాసనములు ప్రకటింప బడినచో ఇదివరకు తెలియని యనేక విశేషములు బయల్పడ గలవు.

పుణ్యక్షేత్రము  : అలంపురము దక్షిణ కాశీ యనియు, భాస్కర క్షేత్రమనియుప్రసిద్ధిపొందినది. శ్రీశైల క్షేత్రమున కిది పశ్చిమద్వారము. తుంగభద్రాతీర మందలి 64 ఘట్టములతో, అష్టాదశ తీర్థములతో, జోగుళాంబాబ్రహ్మేశ్వరులతో, మాధవ, గణేశ, కాలభైరవ, మణికర్ణి కాతీర్ధములతో అలంపురము వారణాసితో నన్ని విధముల పోలియున్నది. ఇచట కోటిలింగము లున్నవని ప్రతీతి. ప్రస్తుత మిచట నరసింహస్వామి, సూర్యనారాయణస్వామి, చెన్నకేశవ, నీలకంఠేశ్వర, బ్రహ్మేశ్వరాలయము లున్నవి. అన్నియుసుందర

ఆలంపురము దేవాలయములు

నటరాజు- ఆలంపురము

శిల్ప విలసితములు. వీనిలో బ్రహ్మేశ్వరాలయము ప్రధాన మైనది.

అలంపురమునకు 9 'మైళ్ళ దూరములో కృష్ణా తుంగభద్రా సంగమేశ్వరమును, 18 మైళ్ళలో సప్త నదీ సంగమ క్షేత్రమును కలవు.

బ్రహ్మేశ్వరాలయ పశ్చిమద్వారమున 'షాఆలీ పాదుషా' దర్గా ఉన్నది. దానికి “జిలభాత్" నెలలో గొప్ప ‘ఉరుసు' జరుగును. మహమ్మదీయుల కిది పవిత్రమైనది.

దేవతామూర్తులు : ఈ క్షేత్రమున సూర్యుడు, సప్తమాతృకలు, కుమారస్వామి, మహిషాసుర మర్దని, నటరాజు, నాగరాజు, విఘ్నేశ్వరుడు, నరసింహుడు, భైరవులు, ఆంజనేయుడు, నంది, గౌరీ శంకరమూర్తులు, వివిధాకృతులతో కాన వచ్చుచున్నవి. ఇవిగాక, కామాక్షి, పరశురామ, వేంకటేశ్వర, చెన్న కేశవ, పాండురంగ, గోపాలకృష్ణ, శ్రీరామ, దత్తాత్రేయ, దుర్గామూర్తులు కూడ పూజింప బడుచున్నవి. ఇచట శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, స్కాందాది మతశాఖలకు సంబంధించిన అన్ని దేవతా మూర్తులును ఉండుట గమనింపవలసిన విషయము.

ఇచట బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ లను నవబ్రహ్మాలయములు కలవు. అన్నియు శివలింగములే. వీటిలో బాల బ్రహ్మేశ్వరుడు క్షేత్రస్వామి. ఈ దేవునకు శివరాత్రి సమయమున బ్రహ్మోత్సవ రథోత్సవములతో తిరునాళ్ళు జరుగును. ఇందలి ప్రధాన దేవీమూర్తి జోగులాంబ -అష్టాదశ దేవీ పీఠములలో చేరిన ఈ దేవత జోగాంబ యని ఆనందకందమునందును, యోగేశ్వరి యని రసరత్నాక రమునందును, 'విశృంఖలా' యని లలితా సహస్రనామ భాస్కరరాయ భాష్యమునను ప్రస్తుతింపబడినది. నవరాత్రులలో నీమెకు రథోత్సవాదులు జరుగును.

బ్రహ్మేశ్వరాలయమున కెదురుగ నంది ప్రక్కనఉన్న చిన్న గుడిలో 'నగ్నకబంధము' భూదేవి యను పేర వంధ్యాస్త్రీలచే సేవింపబడుచున్నది. ఈమూర్తి షోడశీతంత్రమున చెప్పబడిన "ఛిన్నమస్తాదేవి" కాదు. ఇట్టి మూర్తు లీ తీరమున నాలుగున్నవి. మహేంజోదారో త్రవ్వకాలలో ఇట్టిమూర్తి బయటపడిన దట.

వాస్తు పద్ధతి  :- ఇచటి ఆలయ నిర్మాణ పద్ధతి దాక్షిణాత్య సంప్రదాయమునకు చెందినది కాదు. కొన్ని దేవా లయములు దీర్ఘచతురస్రములుగను, కొన్ని చతురస్రములుగను ఉండి రథాకృతిలో కట్టబడిన గర్భాలయములు, వాటిముందు ముఖమంటపములు కలిగియున్నవి. ద్వారబంధముపై కొన్నిటికి గజలక్ష్మి, కొన్నిటికి ఆయా

నాగబంధము - ఆలంపురము

గర్భాలయ మూర్తులను సూచించు చిహ్నములున్నవి. ఇరుప్రక్కల ద్వారపాలకులతోబాటు మకర కచ్ఛపములపై ఆరోహించిన గంగా యమునామూర్తు లుండును. ముఖమంటపము పైకప్పునకు సాధారణముగా నాగరాజుగాని, వికసిత పద్మముగాని ఉండును. కొన్నిటిపై దశావతారములు, అష్టదిక్పాలకుల విగ్రహములు చెక్క బడియున్నవి. ఇందలి గోపుర నిర్మాణము విశిష్టమైనది.గోపురము లన్నియు చదరములై నాలుగు మూలలలో ఆమలకములను, శిఖరమున గొప్ప ఆమలక గోళమును కలిగియున్నవి. బాదామీ, పట్టదకల్లు మొదలయిన స్థలములలో నిర్మింపబడిన వానివలె నీ యాలయములును చాళుక్య వాస్తు పద్ధతిలో నిర్మింపబడియున్నవి. వీనిపై అజంతా ప్రభావము విశేషముగ కలదని శిల్ప శాస్త్రజ్ఞుల అభిప్రాయము. శిల్ప విశేషములు :_ ఆలయ ద్వారబంధముల మీదను, వివిధాకృతులతో తీర్చబడిన స్తంభములమీదను, దూలము పైకప్పులమీదను, ఆలయ కుడ్యములమీదను సిద్ధహస్తులైన శిల్పులు మనోహర శిల్పమును వెలయింప జేసినారు. గరుడ, స్వర్గ, విశ్వబ్రహ్మాలయములలో శిల్పలక్ష్మి తాండవము చేసినది. ఇనుకరాతిపై చెక్కబడిన లతా రీతులు, దేవతామూర్తులు, పూర్ణకుంభములు, వివిధ జంతు పక్షి రూపములు, తోరణప్రాయములుగు చెక్కిన గంధర్వ మిథునములు, విచిత్ర భంగిమములతో ఒప్పిన మానవసింహ ముఖములు, దర్శనీయములై చూపరులను ఆకర్షించుచున్నవి. ఇందలి_స్తంభరచన ప్రత్యేక మైనది. స్తంభములు, దిగువభాగమునను పై భాగమునను పూర్ణకుంభ ములను, మధ్యభాగమున అర్ధపద్మమును కలిగియున్నవి. గాలి, వెలుతురు వచ్చుటకై అమర్చబడిన రాతి కిటికీలపై స్వస్తికాది ముద్రలు, లతలు సుందరముగా చెక్క బడినవి. చాళుక్యులు శివ కేశవులకు భేదము పాటింపని వారగుట చేత ఆలయ కుడ్యములపై శైవ వైష్ణవ గాథలు చెక్కబడినవి. లింగోద్భవ, త్రిపురాసుర సంహార, వామనావతార, రత్నాసురసంహార, కిరాతార్జునీయ, గజేంద్ర మోక్షణగాథలు మనోహరముగ తీర్చబడినవి. విమతీయుల క్రూర కృత్యములచే కుడ్యశిల్పము చాలవరకు పాడై పోయినది.

వస్తుప్రదర్శనశాల  : హైదరాబాదు ప్రభుత్వ - ఆర్ష శాఖవారు ఈ ఆలయములను శ్రద్ధతో రక్షించి ఇచట దొరకిన శిల్పఖండములతో నొక పురావస్తు సంగ్రహా లయమును స్థాపించినారు. అందుగల నాగరాజు, నటరాజు, మహిషాసురమర్దని, ప్రదోషమూర్తి, సూర్యుడు, లకులీశ్వరుడు, కార్తికేయుడు, నగ్నక బంధము, భైరవ మూర్తులు మనోజ్ఞ ములయినవి.

స్కాంద పురాణమునందును, నిత్యనాథసిద్ధుని రస రత్నాకరమునందును, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రయందును, శేషారాధ్యుని పర్వత పురాణమునను ఈ బ్రహ్మేశ్వర క్షేత్రవర్ణనము విశేషముగ కలదు.

ఇట్లు అన్ని విధముల ప్రసిద్ధిపొంది తైర్థికులకు, శిల్పులకు, చారిత్రకులకు యాత్రాస్థలమై సంస్కృతీ కేంద్రమై విలసిల్లిన అలంపురము ద్రోణాచలం - సికింద్రాబాదు రైలుమార్గమున కర్నూలు ప్రక్కన నున్నది.

గ, రా.శ.

[[వర్గం:]]