Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలాస్కా

వికీసోర్స్ నుండి

అలాస్కా  :- అమెరికా సంయు క్త రాష్ట్రములలో రాజకీయముగా అలాస్కా ఒక భాగముగ పరిగణింపబడు చున్నది. ఉత్తర అమెరికా పశ్చిమోత్తరపు తుది భాగమున 54°-40° ఉ. నుండి 71°-50° ఉ. అక్షాంశములలోను, 141° నుండి 169° పశ్చిమ రేఖాంశములలోను అలాస్కా వ్యాపించి ఉన్నది. దీని పైశాల్యము 5,86,400 చదరపు మైళ్ళు. అల్యూషను దీవులలో ఉన్న అనాటిగ్ నక్ ద్వీపము అలాస్కాకు దక్షిణపుకొన. ఇచ్చటినుండి అలాస్కాకు ఉత్తరపుకొన అయిన బరోకు 1400 మైళ్ళదూరమున్నది. ఈ దేశమునందలి ముప్పాతిక వంతు భూ భాగము ఉత్తర సమశీతోష్ణ మండలములో నున్నది. అలస్కా యొక్క తీరప్రాంతపు పొడవు 26,000 మైళ్ళు. అలాస్కాలోని భూమి సమతలముగ లేదు. ఇందు దాదాపు 20,000 చ. మైళ్ళు హిమానీ నదములచే (glaciers) కప్పబడును. వాటిలో మిక్కిలి పెద్దది మలాస్ఫినా అనునది. అది 18,008 అడుగుల ఎత్తైన మౌంటు సెంటు ఇలియాసు అను పర్వతము యొక్క పాదభాగమున ఉన్నది.

నైసర్గిక లక్షణములు, శీతోష్ణస్థితి :- అలాస్కా చాల విశాలమైన దేశము. అక్కడి శీతోష్ణస్థితి అడుగడుగునకు మారుచుండును.

దక్షిణ అలాస్కా  :- ఇది బ్రిటిషు కొలంబియాకు సమాంతరముగా నున్నది. దీనిని బ్రిటిషు కొలంబియాలో కలుపుచున్న దీవులకు అలెగ్జాండరు ద్వీపసముదాయ మని పేరు. దక్షిణ అలాస్కాలో సుమారు 10,000 అడుగుల ఎత్తైన పర్వత శిఖరములు కలవు. ఇందు సమతల ప్రదేశము చాల తక్కువ. అపుడపుడు శీతకాలములో చలి ఎక్కువ గను, వేసవిలో ఎండలు తక్కువగను ఉండినను, మొత్తము మీద ఇచ్చట సమశీతోష్ణస్థితి ఉండును. ఈ ప్రదేశమునందు వర్షపాతము చాల ఎక్కువ. వివిధ ప్రాంతములలో ఈ క్రింది విధముగ వర్షించును; వారను దీవియొక్క దక్షిణాగ్రమున సుమారు 200 అంగుళములు, తెచ్చికాన్లో 150 అంగుళములు, జూనియన్ లో 84 అంగుళములు, యాకుటాటాలో 180 అంగుళములు. ఈ ప్రదేశమునకు ఉత్తరపు చివరయందు వాన బొత్తిగా తగ్గిపోవుచున్నది.

మధ్య అలాస్కా :- ఈ మండలము యుకానుకు అలాస్కాకు సరిహద్దగు 141 వ రేఖాంశమునుండి పశ్చిమముగా అలాస్కా పర్వతశ్రేణికిని పసిఫిక్ సముద్రమునకును మధ్యనున్నది.

శీతోష్ణస్థితి :- ఇచ్చట ఉష్ణోగ్రత తగుమాత్రముగ నుండును. వర్షపాతము ఎక్కువగ నుండును. తీరప్రాంతమున అధికముగా వర్షించినను లోనికి పోవుకొలది వర్షపాతము తక్కువగుచుండును. ఉదా: ల ఔషులో సగటున 185 అంగుళముల వానపడును. ఆంకొ రేజిలో 15 అంగుళముల వాన మాత్రమే.

పశ్చిమ అలాస్కా : ఇందులో బ్రిస్టలు,కుస్కో క్విమ్ అఖాత మైదానములు చేరియున్నవి. ఇది అలాస్కా పర్వత పాద భూమినుండి పశ్చిమముగా బేరింగు సముద్రపు వైపు వ్యాపించినది. ఈభూభాగమునందే యూ కాను, కుస్కోక్విమ్ అను నదులు పారు చున్నవి. ఇందులో టుండ్రా ప్రాంతమే అధికము

శీతోష్ణస్థితి : వానమితముగా పడును. తరచుగా ఆకసము మేఘావృత మగును. తీరప్రాంతమున పొగ మంచు కనిపించును.

అలాస్కా ద్వీపకల్పము, అల్యూషను ద్వీపము  : ఈ మండలము మెరక పల్లములతో నుండును. ఇందు చెట్లు చేమలు లేని కొండలు నిండియుండును. ఈ ద్వీపకల్పము యొక్క దిశాంతమందు 80 మైళ్ళ పొడవుగల ఇవి యామ్నా అను మంచినీటి సరస్సు ఒకటి ఉన్నది. ఇందు 58 అగ్ని పర్వతము లున్నవి. వాటిలో పెక్కు పర్వతములు ఇప్పటికిని నిప్పులను గ్రక్కుచుండును. అల్యూషన్సులో పెక్కు ద్వీపము లున్నవి. వీటిలో 13 పెద్దవి. ఇవికూడ అంతర్విభాగము లను పొందియున్నవి. ఫాక్సు ద్వీపములు, ఆండ్రినాధ్ ద్వీపము, రాట్ ద్వీపము, నియర్ ద్వీపము తూర్పున నున్నవి.

శీతోష్ణస్థితి : ఈ మండలమునందలి వాతావరణము తరచుగా మారుచుండును. వేసవియందు పొగమంచు కనిపించును. తుపానులు చెల రేగును.

ఉత్తరదేశము  : ఇక్కడ ఉత్తరదేశ మనగా ఆర్కిటికుపర్వత మండలము ఆర్కిటికు ప్రాంతమందలి ఏట వాలుగానున్న టుండ్రాభూమి బేరింగు సముద్ర తీరమువరకు వ్యాపించి యున్నది. ఇందలి బీళ్ళు టుండ్రా మాదిరివి.

శీతోష్ణస్థితి  : గొడ్డునేల. ఇందలి వర్షపాతము 10 అంగుళములకంటె తక్కువ. వేసవియందలి ఉష్ణోగ్రత సహ్యముగ నుండును, శీత కాలమునందలి చలి దుర్భరము,

ఆహార ధాన్యములు  : ఇచటి తీరమండలములు సేద్యమునకు పనికి రానివి. తనానా లోయవంటి దక్షిణప్రదేశము లందు గోధుమలు పండును. అచ్చటనే యవలు, ఓటు ధాన్యములుకూడ పండించుటకు వీలున్నది. ఫెర్ బాంక్సు జిల్లాలో ధాన్యోత్పత్తికై ప్రయోగశాలలు నెలకొల్పబడినవి.

చేపల పరిశ్రమ : సాల్మన్ చేపల పరిశ్రమ అలాస్కా దేశమున ఎక్కువ ప్రాముఖ్యమును వహించినది.ఈ రకపు చేపలు దేశమందు అంతటను, ముఖ్యముగా ఫియర్డు తీరములందు అధికముగాను లభించును. పసిఫికు అమెరికాలలో దొరకు సాల్మను చేపల మొత్తములో 5 వ భాగము అలాస్కాలోనే లభించును. ఖనిజములు  : ఇచ్చటి రాళ్ళలో ఖనిజములు దొరుకును. ఇందు బంగారపు గనులు చాల ముఖ్యమైనవి. ఇచ్చట రాగి కూడ విరివిగా లభించును. బొగ్గుకూడ దొరకును, చిటినా నది లోయలో నున్న కెన్ని కాటు రాగి గనులు ముఖ్యమైనవి. అలాస్కాలోని ఈశాన్య దిక్కున నున్న కెచికన్ కూడ తామ్రోత్పత్తికి ప్రాముఖ్యమును వహించినది. కాటలా, మాటనుస్కా అనునవి బొగ్గునకు ముఖ్యమైన గనులు. కాటలాగనిలో ఆంత్రోసైటు రకపు బొగ్గు పొరలు పొరలుగా దొరకును. మాటనుస్కా గనిలో మెత్తని బొగ్గు (Bituminous), కొలదిగ గట్టియయిన బొగ్గు (Sub- bituminous) లభించును. నానాయిమా గనిలో కొంత హీనమైనబొగ్గు దొరకును.

జూనో, విల్లోక్రీకు, ప్రిన్సువిలియం సౌండు అను గనులలో బంగారము దొరకును, ఇందులో కొంత బంగారము ఇసుకతోను, మట్టితోను కలిసి లభించును.మరికొంత గనుల పొరలనుండి లభించును.

రవాణా సౌకర్యములు : ఈ దేశమున పెక్కు నదు లున్నవి. అందుచేత నౌకాయానమునకు ప్రాముఖ్యము చేకూరినది, బొగ్గు ఉత్పత్తి కారణముగా రైల్వేలుగూడ అభివృద్ధి చెందినవి. భారీ సరకులు సముద్రమార్గమున రవాణా చేయబడుచున్నవి. ప్రయాణించువారికిని, తేలిక సరకుల రవాణాకును విమానములు అధికముగ ఉపయోగపడు చున్నవి.

జనులు  : ఎస్కిమోలు, హైడాలు, ఖ్లిన్కిట్లు, అధో పొస్కనులు అను నాలుగు తెగల జనులు ఇచ్చట నివ సించుచున్నారు. జపానీయులు, చైనీయులు ఇక్కడకు వలసవచ్చి యున్నారు. ఇచ్చటి జనులు యూరోపియనుల మతాచారములను అవలంబించుచున్నారు.

రెడ్డు ఇండియనులు అఫోగ్నికు ద్వీపములో నివాసములను ఏర్పరచుకొనిరి, సముద్రతీరమందును ఇతరపట్టణము లందును తెల్లజాతివారు నివసించుచున్నారు, వారు తరచుగా తమ నివాసములను మార్చుకొను చుందురు. సిట్కా, డగ్లసు అను నగరములు ముఖ్యమైనవి. ఈ పట్టణప్రాంతములందు ఖనిజ ఉత్పత్తి విరివిగా జరుగును.

ఇచ్చటి సైనికోద్యోగీయులలోను రాష్ట్ర పరిపాలన-ఉద్యోగీయులలోను పెక్కురు అమెరికా సంయుక్త రాష్ట్రములనుండి వచ్చినవారే. ఈ ప్రదేశము యుద్ధ వ్యూహములకు సహజముగ తగియున్నది.

బి. యన్. చ.

[[వర్గం:]]