Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అలెగ్జాండరు

వికీసోర్స్ నుండి

అలెగ్జాండరు  :- అలెగ్జాండరు చక్రవర్తి క్రీ. పూ. 356 లో గ్రీసులో జన్మించెను. ఇతని తండ్రి మాసిడోనియా రాజగు ఫిలిప్పు, తల్లి యెపిరట్ రాకుమార్తె యగు ఒలింపియస్. సుప్రసిద్ధ వేదాంతవేత్తయైన అరిస్టాటిల్ ఇతని గురువు. 18 వర్షముల ప్రాయమున అలెగ్జాండరు చెరోనా యుద్ధములో అశ్వదళాధిపత్యమువహించి శత్రు సైన్యముల చెండాడి తన భావి యసమాన సమర నైపుణ్యమునకు దగిన సూచనలను చూపెను. ఇరువది యేండ్ల వయసున అలెగ్జాండరు సింహాసన మధిష్ఠించెను.

శత్రువుల తిరుగుబాటులను అణచెను. ఒక సంవత్సరములో ఐరోపాను జయించి ఆసియాపై దండెత్తుటకు సంసిద్ధు డయ్యెను. అలెగ్జాండరు 30,000 కాల్బంటులతో, 5000 ఆశ్వికదళములతో ఆసియా జై త్రయాత్రకై బయలు వెడలెను. ఇతని జీవితములో మిగిలిన 12 ఏండ్లు ఆసియాయందే గడచెను. ఇతడు తాను విడిసిన చోటులందెల్ల పూర్వులను గౌర వించి, దేవతల నారాధించెను. ట్రాయి పట్టణములో ఎథీనా దేవాలయములో బలియిచ్చెను. మిలెటిస్ ను గెల్చిన తరువాత తన నౌకాదళమును విచ్ఛిన్నముచేసెను. ఇజస్ యుద్ధములో పర్షియన్ రాజగు డరియస్ ను పరాజితుని జేసెను. తన విజయ చిహ్నముగా ఇజస్ సమీపమున ఇతడు అలెగ్జాండ్రియా పట్టణమును కట్టించెను. ఈజిప్టును గెల్చి, అలెగ్జాండ్రియా రేవుపట్టణమును సృష్టించెను. ఈ ప్రాంతములందు గ్రీకు నాగరకతను, వ్యాపారమును వృద్ధిచేసెను. టైగ్రెస్ నదిని దాటి బాబిలోనియాను గెల్చెను. పెర్సిపోలిస్ ను వశపరచుకొనెను.

అలెగ్జాండరు తక్షశిల జేరి అచటి రాజును వశపరచు కొనెను. హిదా స్పెస్ యుద్ధములో పురుషోత్తముని ఓడించెను. శతద్రూనదిని సమీపించుటతో అలెగ్జాండరు

సైన్యములు ముందడుగు వేయ నిరాకరించెను. ముల్తాను ప్రాంతములందలి యాటవిక జాతులు అలెగ్జాండరునకు అనేక కానుకలు సమర్పించెను.

అలెగ్జాండరు డరయస్ కుమార్తె స్టాటిరాను పెండ్లి యాడెను. ఇతని ప్రథమ కళత్రము సోద్దియానా యనునామె. ఈ బహుభార్యాత్వములో ఇతడు తండ్రివలె ప్రాచ్యపద్ధతి నవలంబించెను. టైగ్రెస్ దాటి, ఓపిస్ (Opis) దగ్గర సైన్యములను ఇంటిదారి పట్టించెను, బాబిలోనును తన సామ్రాజ్యమునకు కేంద్రముగ చేయగోరి ఇతడిచట గొప్ప నౌకాశ్రయమును గట్టించెను. క్రీ.పూ.323 లో 33 సం. లు నిండక పూర్వమే అలెగ్జాండరు మితిమీరి త్రాగుటవలన మరణించెను.

ఆఫ్ఘనిస్థానమును, ఆక్టస్ (Oxus) నది కీవలి భాగమును, సింధునదీ ప్రాంతము వరకును జయించిన పర దేశీయులలో మొదటివాడు అలెగ్జాండరు. ఇతని శిబిరము ఒక మహానగరమువలె నుండెడిది. కవులు, గాయకులు, చరిత్రకారులు, నట్టువరాండ్రు, స్త్రీలు, ఇందు ఉండిరి. దర్బారు దినచర్యలో దైనందిన విషయము లన్నియు వ్రాయబడుచుండెను. షుమారు 13 ఏండ్లలో అలెగ్జాండరు అప్పటికి తెలిసిన ప్రపంచములో నర్ధభాగమును జయించెను. ఇతడు 12 గురు దేవతలకు కట్టించిన గుడులు కాలగర్భమున లీనమైనవి. ఇతని కాలపు శిలాప్రతిమా శిల్పచ్ఛాయలు బౌద్ధశిల్పములో లీనమై యుండవచ్చును. అసమాన సైన్య విజయములను గాంచిన యీ జయశీలి సామ్రాజ్యము ఇతని అనంతరము 3 ఏండ్లలోనే విచ్ఛిన్న మయ్యెను.

డా. వి. య.

[[వర్గం:]]