Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - నృత్యకళ

వికీసోర్స్ నుండి

ఆంధ్రులు - నృత్యకళ (చరిత్ర)  :- నృత్యకళ ప్రారంభదశలో రెండు విధములుగా నుండెను.

1. ఆరాధన నృత్యములు :- ఇవి ఆలయము లలో జరుగును.
2. వినోద నృత్యములు :- ఇవి ఆలయముల వెలుపల జరుగుమ

రెండవదశలో నృత్యకళ నాల్గు విధములయ్యెను. 1. ఆరాధన నృత్యకళ :- ఇందు దేవదాసీల నృత్యములు, గరగల నృత్యము, సేవ, కొలుపు, వీర నాట్యము - మొదలయినవి చేరియుండును.

2. ప్రచార నృత్యకళ  :- ఇందు కూచిపూడి భాగవతులు, గొల్లభాగవతులు, జక్కులభాగవతులు, బహురూపులు, యానాది భాగవతులు, మాలదాసరులు మున్నగువారి నృత్యరీతులు, కలాపనాట్యమేళములు, తోలుబొమ్మలు, బొమ్మలాట, పగటి వేషములు చేరును.

3. కచ్చేరి నాట్యము  :- ఇందు భోగము మేళము, మేజువాణి, భరతనాట్యము చేరును.

4. జానపద నృత్యకళ  :- ఇందు గొబ్బి, కోలాటము, తప్పెటగుండు, చిరుతల భజన, బుట్టబొమ్మలు, మాయ గుఱ్ఱములు, డోగాట, ఒతకమ్మలాట మొనలైనవి చేరును.

ప్రాచీనాంధ్రదేశములో నృత్యకళ రెండు విధములుగా ప్రచారములో నుండినది. 1. ఆలయములలో దేవదాసీలచే చేయబడిన ఆరాధన నృత్యములు. 2. ఆలయ ఆవరణముదాటి, ఆరాధనకై వచ్చిన యాత్రికులను రంజింప జేసి, ద్రవ్యార్జనకై జేయబడెడు 'కురవంజీ' ఆటవిక నృత్యములు.

దేవదాసీలు - వీరు విష్ణుదాసీలు, శివదాసీలని రెండు విధములుగా నుండెడివారు. అట్లే వారి నృత్యకళ విష్ణు దాసీలకళ 'లాస్య' (అభినయ) ప్రాధాన్యమై, శివదాసీల కళ తాండవ (నృత్య) ప్రాధాన్యమై యుండినది.

నృత్యకళను దైవారాధనములో ఒక భాగముగా మన పూర్వులు పరిగణించిరి. ప్రభాత సమయమున స్వామికి మేల్కొలుపు మొదలుకొని రాత్రి పవళింపు సేవ వరకు జరిగెడు వివిధ పూజలందు, ఉపచారములందు, ఆయాసమయములకు తగినట్లు దాసీలు నృత్యగీతాలతో భగవంతు నారాధించెడువారు. పుష్పాంజలి, మేళప్రాప్తి, పేరిణి, కౌస్తుభము, నవసంధి, సమపాద, భుజంగ, శుభ లీల మొదలైనవి వారిచే ప్రదర్శింపబడు ప్రత్యేక నృత్యములు. ఈ నృత్యములన్నియును భరతశాస్త్రము ననుసరించి, శాస్త్రీయపద్ధతిలో పెంపొందించ బడినవి. ఇందు 'లోకధర్మి' కి తావులేదు. వివిధ ఆలయములలో ఆ దేవళములోని మూర్తి ననుసరించి, స్వామికి ప్రీతిని కలిగించునట్టి కరణాంగహారములతో కూర్చబడిన నృత్యములు మాత్రమే ప్రదర్శింపబడెడివి. అంతియేగాక ప్రాతః కాలమున కొన్ని నృత్యరీతులు, ప్రదోష కాలమన కొన్ని నృత్యరీతు లుండెడివి. అట్టివే శివాలయములలో ప్రదర్శించెడు సంధ్యానృత్యము - భుజంగత్రాస. ఆలయనృత్యము లన్నియు, నృత్తప్రాధాన్యమైనట్టివి. ఇందు రేచకములు, కరణములు, అంగహారములు, మండలములు, శాస్త్రీయ క్రమము ననుసరించి ప్రదర్శించుటయేగాక, ఈ నృత్యములలో నుపయోగించిన తాళములుగూడ గణపతి, ఇంద్ర, విష్ణు, రుద్ర మొదలయిన అపూర్వ తాళములు, నృత్తము ఆయా తాళముల క్రియల ననుసరించి కూర్చెడివారు,

ఆలయము వెలుపల వినోదార్థము ప్రదర్శింపబడిన నృత్యరీతులే కురవంజి, యక్షగానములు. ఈ నృత్యములకు శాస్త్రముతో సంబంధము లేదు. 'నాట్యధర్శి' కన్న 'లోకధర్మి' యే యిందు విశేషముగా ప్రాముఖ్యము వహించును. ఇది దేశీయ విద్య. ఆలయ నృత్యములను 'మార్గ' నృత్యరీతులుగా, కురవంజి నృత్యములను 'దేశి' నృత్యరీతులుగా పేర్కొనవచ్చును. లయ ప్రాధాన్యమైన అంగచలనము ఈ నృత్యములలోని విశేషము. ఒక పురాణ గాథ ననుసరించి వీరు నృత్యముసల్పినను, కథను పాడుచు మధ్యమధ్యన ఉత్సాహముగా నుండుటకుగాను, ఆ గీతము యొక్క లయకు తగినట్లు అడుగులు వేయుదురు. హస్త విన్యాసము (ముద్రాభినయము) వీరికి తెలియదు. ఈ నృత్యరీతిలో తాళము కంటెను, లయ కెక్కువ ప్రాధాన్యము ఉండెడిది. కురవంజి అనగా 'కురవలు' మొదలైన ఆటవికుల 'అంజి' నృత్త విశేషము. దీనినే 'చిందు' అనిగూడా పిలుచుట కద్దు. అట్లే యక్షగానము-యక్షుల (జక్కుల) గాన పద్ధతియై యున్నది.

కురవంజి, యక్షగానములందు ఆదిలో ఒక్కరే నృత్య మాడుచు కథచెప్పెడు వారు (నేటి కాలపు హరికథల వలె). అటుపై సింగి, సింగడు అను పాత్రలు సృష్టింపబడినవి. వీరిద్దరును కథలోని వివిధ పాత్రలుగా మారి నృత్య మాడెడువారు. తరువాత కొంతకాలమునకు కథను నడుపుటకుగాను కోణంగి (చోడిగాడు) అనుపాత్ర ప్రవేశ పెట్టబడినది, ఈ మూడుపాత్రలే కథనంతయు నడపెడు వారు. నృత్యమందు వీరు పాడెడు సంగీతరచనలు -త్రిపుటలు, అర్థ చంద్రికలు, జంపెలు, ధవళములు, శోభనములు, ద్విపదలు, కందము మొదలైనవి, లయ ప్రాధాన్యము కలవై, నృత్తమునకు మాత్రము అనువైనట్టి రచనలు, గరుడాచల యక్షగానము (చెంచులక్ష్మినాటకము) శ్రీగిరికురవంజి, సుగ్రీవ విజయము ఈ తరగతికి చెందిన ప్రాచీన యక్షగానములు.

నృత్యమందు పూర్వకథ ననుసరించి అనేక పాత్రములను ప్రవేశపెట్టి, ఆ పాత్రములచే మాట్లాడించు విధానము తరువాత వచ్చిన వీధినాటకములందు గాననగును.

కాలక్రమేణ దాసీల నృత్యము ఆలయము దాటి ఆలయ ప్రాంగణము ప్రవేశించినది. ఉత్సవమూర్తిని ఊరేగించి కళ్యాణమంటముపై అధిష్ఠింపజేసి, ఆ స్వామి కెదురుగా నృత్యము సలుపబడెడిది. ఆ నృత్యము అభినయ ప్రాధాన్యమై, ఆరాధన ప్రాధాన్యము తగ్గి అచ్చట చేరిన ప్రేక్షకుల వినోదమునకు చేయబడెడు ప్రదర్శనముగా తయారైనది. ఆలయములో మాత్రము, మూల విరాట్టున కెదురుగా దాసీలు శాస్త్రీయ నృత్యములనే ప్రదర్శించేడు వారు. పిమ్మట కొంతకాలమునకు దాసీల నృత్యకళ, గణికలద్వారా, రాజాంతఃపురము ప్రవేశించినది. దర్బారు విద్య శాస్త్రీయ కళయైనను, ఆధ్యాత్మిక భావముల కంతగా విలువ నివ్వక, రాజసభలలోని పండిత, రసిక జనులకు విజ్ఞానముతోగూడిన వినోదము నిచ్చెడిది. పామర జన రంజకముగా నుండి, ప్రకృతిపై ఆధారపడుచుండిన 'దేశికథ' యగు కురవంజి, యక్షగానములకు గూడ శాస్త్రము నెరిగిన పండితుల ఆదరము లభించినది. రాజ సభలలో ఈ విద్యకు ఆదరము లభించినంతనే భరతవిద్య యందు పాండిత్యముగల ఆచార్యులు యక్షగానములను రచింప మొదలిడిరి. ఈ యక్ష గానములను రాజమందిరములలోను, పల్లెపట్టణములందును భరతమును, అభినయమును తెలిసిన వేశ్యలు ప్రదర్శించెడువారు. కాని ప్రభువుల రంజింప జేయుటయే వీరి ప్రథమ కర్తవ్యమగుటచే, వీరి యొక్క కళయందు శాస్త్రభాగము నానాటికి క్షీణింపజొచ్చినది. ఆ విద్యతోపాటు, వేశ్యల జీవిత విధానము గూడ ఈ కళకు కళంకము తెచ్చినది. అట్టి శొచనీయపరిస్థితిలో మన నృత్యకక పూర్తిగ నశించిపోకుండ కాపాడుటకు, 'నాట్యమేళములు' మన దేశములో ఉద్భవించినవి. శాస్త్రము నెరిగిన బ్రాహ్మణ పండితులు, ఈ మేళములను సృష్టించిరి. వీనియందు స్త్రీలకు స్థానములేదు సరిగదా, స్త్రీలు నృత్యమాడుట యీ మేళములవారు పూర్తిగా బహిష్కరించిరి. వీరి నాటకములందు స్త్రీ పాత్రమును గూడ పురుషులే ధరించెదరు. వీరు జట్టులుగా తయారయి, దేశములోని మారుమూల పల్లెలుగూడ సంచారముచేసి, ప్రదర్శనము లిచ్చి, నృత్యగీతములద్వారా మన పురాణేతిహాసములలోని రసవంతమైన ఘట్టములను అభినయించి, నాట్యమాడి సామాన్య ప్రజానీకములో మత ప్రచారము చేసెడు వారు. కనుక వీరికి ప్రచార నర్తకులని పేరువచ్చినది. ఆదిలో వీరు శివసంబంధమైన కథలనే నృత్యమాడు చుండిరి. కృష్ణభక్తి దేశములో ప్రబలిన తరువాత కృష్ణపరమైన భాగవత కథల నాడుట మొదలిడిరి. నాటి నుండి వీరిని భాగవతులనియు, వీరు ప్రదర్శించు నాట్యమేళములను భాగవతము లనియు పిలుచుట ఆచారమైనది. ఈ కాలమునుండియే దాసీల నృత్యకళను నట్టువ మేళము లనియు, నాట్య మేళములవారిని భాగవతులనియు, పిలుచుట ప్రారంభమయినది. ఈ భాగవతులలో కూచిపూడివారు ముఖ్యులు. వీరు బ్రాహ్మణులు. సంగీతము. భరతము, మంత్రశాస్త్రముల నెరిగిన వేదాధ్యయన పరులు, కూచిపూడి భాగవతులకు భరతవిద్య నేర్పినవారు యోగి సిద్ధేంద్రులవారు. వీరు 'పారిజాతాపహరణము' అను నాటకమును రచించి కూచిపూడివారికి నేర్పిరి. నాటి కూచిపూడివారు, వారి తరువాత తరములవారు కూడ నృత్యము నారాధించుటకుగాను, గోల్కొండ నేలిన తానీషా యొద్దనుండి కూచిపూడి అగ్రహారమును దానముగా బడసిరి. అంతియేగాక కూచిపూడిలో పుట్టిన ప్రతి బ్రాహ్మణ బాలుడు యుక్త వయస్సు వచ్చినంతనే, నృత్యవిద్య నభ్యసించి, తన జీవితములో నొక్కసారైనను గజ్జెకట్టి, ఆలయములో స్వామి కెదురుగా, భామకలాప మాడవలెనని శాసించిరి. ఆ సంప్రదాయమును నేటికిని కూచిపూడి వా రనుసరించుచున్నారు. కలాపములతో ప్రారంభమైన వీరి విద్య కాలక్రమేణ, వీథి నాటకములలో పరాకాష్ఠ నందు కొన్నది. కథననుసరించి అనేక పాత్రములు ప్రవేశ పెట్టబడి, ఆ పాత్రములచే మాట్లాడించు విధానము వీధి నాటకము లందు గాననగును. అట్లు ప్రవేశించు పాత్రముల సంభాషణములు 'దరువుల' రూపములోను, ద్విపద,సీసార్థము, సీసము, కందార్థము, కందము మొదలైన దేశీయ ఛందస్సులందును, చంపకమాల, ఉత్పలమాల, పంచచామరము, శార్దూలము మొదలైన వృత్తము లందును రచింపబడినవి. ఈ రచనలద్వారా రాగములకు ప్రాముఖ్యము హెచ్చినది. మరియు వృత్త ప్రాధాన్యము తగ్గి, నృత్యము పెంపొందినది.

పై విధముగా భాగవత మేళములవారు కళా సంస్కరణోద్యమమును ఆరంభించి, కళ యొక్క శాస్త్రీయతను, పవిత్రతను కాపాడుటకు పాటుపడుచుండ రాజ దర్భారులలోని నృత్యకళగూడ పెక్కు మార్పులను చెందినది. రాజనర్తకులు యక్షగానములలో - శాస్త్రీయ నృత్త నృత్య అభినయ రీతులను ప్రవేశ పెట్టినను వారు నృత్య నాటకముల ప్రదర్శనములతో సంతృప్తి చెందలేదు. యక్షగాన పద్ధతిలో ప్రదర్శింపబడిన నాటకములోని నృత్త నృత్యములు కథ ననుసరించి చేయబడుటచే ఒక క్రమపద్ధతిలో నుండ వీలులేదు. నాటకము ననుసరించి అందలి పాత్ర పోషణార్థము, దరువు లేర్పరుచబడి యుండుటచే నర్తకి కొన్ని నిబంధనములకు కట్టుబడి యుండవలె గావున నృత్త నృత్యములందు విజృంభించి తన ప్రతిభ వెల్లడించు అవకాశములేదు. ఈ లోటులను దీర్చుటకే రాజాస్థానములలోని సంగీత విద్వాంసులు నాటక కథతో సంబంధము లేకుండ, సంగీత ప్రాధాన్యమై, నృత్తనృత్యములందు పూర్తిగా నర్తకులు తమ పాండిత్యమును ప్రదర్శించుటకు అనువైన రచనలు చేసిరి. అవియే స్వరపల్లవులు, జాతిస్వరములు, శబ్దపల్లవులు, శబ్దములు, కేళికలు, పద కేళికలు, చౌవదకేళికలు, దురువద కేళికలు మొదలైనవి. స్వరపల్లవులు, శబ్దపల్లవులు, జాతిస్వరములు నృత్తమున కనువైనట్టి రచనలు. ఇందు నర్తకి పల్లవి నాధారముగా జేసికొని, వివిధరీతుల రాగమును సంచారము చేసి, వివిధ జాతులలో అడవులు ప్రదర్శించెడిది. నాటినుండే నృత్త 'అడవుల' కూర్పు ప్రారంభమైనది. తత్పూర్వము నృత్తమందు అడుగులే గాని అడవులు ప్రదర్శించే సంప్రదాయము లేదు. 'అడవు' అనగా ఒక నృత్తహస్తమును, దాని కనుగుణముగా పాదవిన్యాసము చేర్చి, వివిధగతుల ప్రస్తారముచేసి ముగించుట. అడుగులకు ఇట్టి క్రమము లేదు. మృదంగగతిని గాని, జతిని గాని అనుకరించి, లయ ప్రాధాన్యముగా పాదసంచలనముచేసి ముగించుట అడుగు. శబ్దములు, పద కేళికలు, దరువులు నృత్యమున కనువైన రచనలు. ఈ వర్ణనాత్మక రచనలకు ఆంగికాభినయము (ముద్రాభినయము) ప్రదర్శించుచుండెడు వారు.

పై తరగతి రచనలన్నింటియందును నృత్త నృత్యములకు అవకాశమున్నను, భారతీయనృత్యకళకు తలమానికమైన సాత్వికాభినయమునకు ఈ రచనలు ఉపయోగించవు. కావున నర్తకులు నృత్త నృత్యములతో తృప్తిచెందవలసి వచ్చినది. ఆ లోటును గూడ తీర్చి, మన నృత్యకళకు సంపూర్ణత్వముచేకూర్చుటకేగాబోలు క్షేత్రయ్య పద రచన చేసెను. ఈ పదములు విలంబిత లయను గలిగి, శృంగార రస ప్రాధాన్యమై, నాయికానాయకులకు సంబంధించి యుండుటచే దేవదాసీలు పదాభినయముద్వార సాత్వికాభినయమును ప్రదర్శించి తమ కళకు సంపూర్ణత్వము చేకూర్చుకొన్నారు. నాటివరకు దరువుల కిచ్చిన అగ్రస్థానము ఇపుడు పదములకు లభించినది. భాగవత మేళములవారు గూడ తమ నాటకములలో రసవర్ఘట్టముల నభినయించవలసినపుడు, దరువులతోపాటు పదరచనలను గూడ అభినయించుట ప్రారంభించిరి. ఈ రీతిని ఆలయములలో ఆరాధనకళగా ప్రారంభమైన దాసీల నృత్త ప్రధానమగు కళ, క్రమముగా రాజదర్బారులలో నృత్త నృత్య అభినయాదులలో వికాసముజెంది, పరిపూర్ణత నొంది, సంపూర్ణకళగా విరాజిల్లినది. కురవంజి రూపములో నుండిన దేశీయకళ, భాగవత మేళ పండితులచే సంస్కరింపబడి వీధి నాటకములుగా ప్రఖ్యాతిగాంచినది. బ్రాహ్మణమేళములవారు అనేకవిధములైన శాస్త్రీయ విధానములను యక్షగానములందు ప్రవేశ పెట్టినను, జక్కులవారి విద్య మాత్రము ఇంకను ప్రాచీన దేశి సంప్రదాయము ననుసరించియే ప్రదర్శింపబడుచున్నది. వీరి కథ నడుపువిధముగాని, దరువుపట్టుగాని అతి ప్రాచీనముగా నుండును. వీధి నాటకముల పూర్వపు 'దేశి' స్వరూపమును మనము తెలంగాణములోని 'బహురూపుల' కళయందును, ఆంధ్రప్రాంతములోని జక్కుల, యానాది, దాసరి భాగవతుల నాట్యములందును చూడగలము.

ఇవి గాక తోలుబొమ్మలాట, బొమ్మలాటగూడ మన దేశములోని ప్రచార నృత్యకళలలో ప్రాముఖ్యము వహించిన విద్యలు, తోలుబొమ్మలాట అతి ప్రాచీనమైన విద్య. క్రీస్తు పూర్వము శాతవాహనుని కాలమునుండియు తోలుబొమ్మలాట తెలుగు దేశములో ప్రచారములో నున్నట్లు చరిత్రలు చాటుచున్నవి. ఆంధ్రదేశమునుండియే యీ విద్య, మన నృత్యకళతోపాటు బలి, జావా ద్వీపములకు ప్రాకినది. హరికథ, బుర్రకథ, పంబలకథ మొదలైన వినోదములుగూడ పురాతన యక్షగాన విద్యనుండి చీలి, ప్రత్యేక కళలుగా ఏర్పడిన విద్యలు.

ఈ నృత్యరీతులేగాక నారాయణతీర్థయతీంద్రుల వారిచే రచింపబడిన 'కృష్ణలీలా తరంగిణి' లోని తరంగముల నృత్యమాడు ప్రత్యేక నర్తకులు గూడ ఆంధ్రదేశములో నుండిరి. తరంగముల నృత్య యొక ప్రత్యేక కళ. తరంగ నర్తకులకు తాళ లయలు స్వాధీనమందున్నట్లు మరొకరి యందు గానము, తాళమును విన్యానము చేయుచు నృత్యము చేయుట చూచినప్పుడు, వారు 'లయతో ఆడు కొనుచున్నారా ?' అనిపించును.

బోగమువారి కచ్చేరి విద్య మూడు విధములుగా విడిపోయినది. మేళములు, మేజువాణి, ఏక పాత్రనృత్యము. బోగము మేళములందు సుమారు పండ్రెండు మంది స్త్రీ లుందురు. వారిలో శాస్త్రము నెరిగిన నర్తకి పెద్దగా (నాయకురాలుగా) నుండును. మేళములందు నృత్త, నృత్యములు మాత్రమే ప్రదర్శింపబడును. సాధారణముగా ఈ నృత్యరీతి ఊరేగింపులకు ఎక్కువగా నుపయోగించును. మేజువాణియందు ప్రతి నర్తకి తన యొక్క విద్యను ప్రదర్శించుటకు అవకాశముండును. పదములు, వర్ణములు, శ్లోకములు మొదలైన ప్రసిద్ధ రచనలు ముఖ్యముగా అభినయించెదరు. అభినయమే ప్రత్యేకముగా మేజువాణిలో చూడవలసిన విశేషము. అలంకార శాస్త్రము, భరతశాస్త్రము నెరిగి, కావ్యపురాణేతి హాసములందు పాండిత్యముగల్గిన నాయకురాలు సాధారణముగా మేజువాణీలో 'పదము' నభినయించును. విదములోని నాయికను సాత్మిక సంచారులతో రంజింప చేయుచు, శాస్త్రముల నెరిగిన విద్వాంసుని ప్రశ్నలకు సమాధానము చెప్ప గలిగెడు సామర్థ్యముగల నర్తకి మాత్రమే సభలో గజ్జెగట్టి పదము పట్టుల కర్హురాలు.

ఏకపాత్ర నృత్యము — ఇదే నేటికాలములో భరత నాట్య మను పేరుతో ప్రసిద్ధిగాంచినది. ఈ నృత్యరీతి సంస్థానము లున్న ప్రదేశములలో పెంపొంది ప్రచారము లోనికి వచ్చినది. తంజావూరు, కాళహస్తి, కార్వేటి నగరము, వేంకటగిరి, పిఠాపురము, పెద్దాపురము, కొల్లాపురము, విజయనగరము మొదలయిన సంస్థానములలో ఆ రాజుల పోషణములో వృద్ధిచెందినది. ఇందును క్షత్రియ సంస్థానము లందలి (విజయనగరము, పెద్దాపురము మొదలయినవి) విద్యకును, వెలమరాజుల రాజ్యములలోని (తంజావూరు, వెంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలయినవి) విద్యకును చాల భేద మున్నది. ఈ పద్ధతి నృత్య మందు ఒకే నర్తకి పాల్గొనును, నాట్యాచార్యు డామె నాడించును. నృత్యము 'మేళప్రాప్తి' లేక 'అలరింపు' అను నృత్తముతో ప్రారంభమై 'జావళీ' లేక 'తిల్లాన'తో ముగియును. ఈ నృత్య సంప్రదాయము నృత్తముతో ప్రారంభింపబడి, నృత్యము ప్రదర్శించిన తరువాత అభినయముతో ముగియుచున్నది. భారత దేశములోని నృత్యరీతు లన్నింటిలోను ఈ నృత్య సంప్రదాయమందు మాత్రమే, నృత్త నృత్య అభినయములు శాస్త్రీయ దృక్పథములో, చక్కగా సమపాళ్ళలో పోషింపబడుచున్నవి.

సంస్థానములందు 'చర్మకట్టు వాద్యనృత్య"మని మరొక నృత్తరీతి ప్రచారములో నుండినది. ఈ నృత్యరీతియందు సుమారు పండ్రెండుమంది డోలు (శృంగి భేరి) వాయిద్యకులు, సన్నాయి పాటగాండ్రు ఇరుప్రక్కల ఎదురెదురుగా నిలబడి వాయిద్యముల వాయింతురు. వారిమధ్య ఏబది లేక అరువదిమంది శ్వేతాంబర ధారిణులయిన దేవదాసీలు బారులుదీరి నిలువబడి యుందురు. సన్నాయి వాద్దెగాండ్రు అతి విలంబితలయలో 'చౌక వర్ణము”లను వాయించెదరు. శృంగిభేరి వాద్యకులు ఆ వర్ణము యొక్క లయను దెల్పుచు, కాల పై కాలములలో ప్రస్తారము చేయుచు వివిధ జాతులందు జతులను కట్టి వాయించి తీర్మానించెడివారు. నర్తకిణు లందరును ఏక కాలమందు ఆ పాట యొక్క లయ ననుసరించి అడవులు పట్టి, పై కాలమందు తీర్మానించెడివారు. ఇది లయ ప్రధానమైన బృంచనృత్త విశేషము.

నృత్యకళ, ఈ విధముగా కులవిద్య, వృత్తి విద్యగా తయారయి ప్రత్యేక తరగతులకు చెందినవారే దీనిని ఆరాదించుటచే, సంఘములోని యితరజాతులవారు ---స్రీ పురుషులు తమయొక్క వినోదార్థము, పర్వదినము లందు అందరును ఒక చోట గూడి సంతోషముగా కాలము గడుపుటకు కొన్ని నృత్యముల నేర్పరచుకొనిరి. అవియే జానపద నృత్యములు. ఈ నృత్యములకు శాస్త్రముతో ఎక్కువ సంబంధములేదు. ప్రత్యేక శిక్షణ, సాధన అవసరము లేనట్టియు, అందరికిని అందుబాటులో నుండెడు విద్యలు ఈ జానపద నృత్యములు. అట్టివే పల్లెలందలి స్త్రీలు ప్రదర్శించెడు గొబ్బి, కోలాటము, బ్రతుకమ్మలాట మొదలైనవి. తెలంగాణములోని మారుమూల ప్రాంతములలో కొన్ని తెగలకు చెందిన పురుషులు ప్రదర్శించెడు కోలాట నృత్యమందు కొంత పాండిత్యము గానవచ్చును. అట్లే విశాఖ జిల్లాలోని 'తప్పెట గుండు' నృత్యము, కృష్ణా గుంటూరు జిల్లాలలోని 'గుఱ్ఱము ఆట'. గుఱ్ఱము ఆట ఒక చిత్ర నృత్య రీతిగా పేర్కొనవచ్చును, గుఱ్ఱమునకు, మృదంగ వాయిద్యము ననుసరించి తాళ లయలలో జాతీర్ణముగా నృత్యమాడుటకు శిక్షణ ఇవ్వబడును. ఉత్సవములందు, ఊరేగింపులందు ఇవ్విధముగా శిక్షణనొందిన గుఱ్ఱము కాళ్ళకు గజ్జెలు కట్టి, పాటకుడు పాడే గీతము, తాళ లయల ననుసరించి మృదంగజతులకు గుఱ్ఱముచే నృత్యమాడించెదరు. ఇవి గాక మాయ గుఱ్ఱములు, బుట్ట బొమ్మలు మొదలైన వానిలో మనుష్యులు లోపల ఉండి వాని నాడింతురు.

తెలంగాణములో జోగుజాతికి చెందినవారు ప్రదర్శించెడు 'జోగాట' ముఖ్యముగా పేర్కొనదగిన నృత్యము. ఈ నృత్యము డప్పుల వాయిద్యముల ఆధారముతో చేయబడును, 'జోగాట' మాలమాదిగ కులముల వారిలో ఎవరైన చనిపోయి నప్పుడు శవమును శ్మశానమునకు గొనిపోవు నపుడు ముఖ్యముగా ఆడుదురు. వీరి నృత్యరీతు లన్నింటిలోను 'పిండోత్పత్తి' క్రమమును వర్ణించు నృత్యము ముఖ్యముగా చూడదగ్గది. ఈ నృత్యము బాగుగా తిలకించిన సంగీత రత్నాకరములోని సారంగదేవుని పిండోత్పత్తి నృత్య క్రమమును జ్ఞప్తికి తెచ్చును.

ఆలయము లందు దేవ దాసీలు నృత్యపూజ యందు పాల్గొనినను వీరశైవము మన దేశములో ప్రబలముగా నున్నప్పుడు శైవ మతస్థులలో పురుషులు గూడ ఆరాధన నృత్యములు చేసెడివారు. ఆ నృత్యములకే 'వీరనాట్యమ'ని పేరు. చేతఖడ్గము, డాలు ధరించి ఖడ్గము లనెడు రచనలను గానము చేయుచు, గంభీరముగా వీరంగము పలుకుచుండగా వీరావేశముతో వీరముష్టి నర్తకులు నాట్యమాడెడు వారు. ఈ నృత్యము తాండవ పద్ధతికి చెందినట్టిది. ఇట్టివే అమ్మవారు పూజలందు ప్రదర్శింపబడు గరగల నృత్యములు, సింహాచల స్వామి ప్రీత్యర్థము చేయబడు సేవ, పల్నాటిసీమలో వీరుల కొలుపులందు ప్రదర్శింపబడు కొలుపు నృత్యములు. " ఈ నృత్యరీతులుగాక ఆంధ్ర దేశములోని అరణ్యములలో నివసించెడు ఆటవికుల - (కోయలు, చెంచులు, గోండులు, సుగాలి, సవరలు మొదలైనవారు) నృత్యము లనేకములున్నవి. ఇందు ప్రకృతి ఆరాధన నృత్యములు, ఋతువుల నృత్యములు ముఖ్యము. ఇవన్నియును బృంద నృత్యములు. పర్వదినములందు కొన్ని వందలమంది స్త్రీలు పురుషులు ఒకచోటగూడి యీ నృత్యములందు పాల్గొందురు, వీరి నృత్యము లయ ప్రధానమయి, సాధారణముగా త్రిశ్రగతిలోనుండును.

ఇంతవరకు రాత్రులందు దీపాల వెలుగులో ప్రదర్శించెడు నృత్యకళను గూర్చి మాత్ర ముచ్చరింపబడినది. అట్లు గాక దినమందే వివిధ వేషములు ధరించి ప్రజలను రంజింప జేసెడు పగటి వేషములవారు గూడ మనదేశములో నున్నారు. ఈ పగటి వేషములవారు అతిపురాతన కాలము నుండి మన దేశములో నుండిరి. కళింగ గంగరాజు పగటి వేషముల వారితో జేరి శత్రువులను జంపినట్లు ఒక కథ ప్రచారములో నున్నది. భాగవత మేళములవారివలెనే వీరుగూడ తమ విద్యను దేశకళ్యాణమునకు ఉపయోగించిరి.

ఆంధ్రుల నృత్యకళకు-తంజపురినేలిన నాయక రాజుల కాలము స్వర్ణయుగముగా పేర్కొనవచ్చును. ఆ కాలము నందే యక్షగానము ప్రభువుల ఆదరణములో శాస్త్రీయ నృత్య సంప్రదాయముగా వృద్ధిపొందినది. నాయక రాజులు కళా పోషకులేగాక, స్వయముగా అనేక యక్షగానములను రచించిరి. ఆకాలములో చౌపదకేళిక, దురుపద కేళిక, పద కేళిక', నవపదము, జక్కిణి, కొరము, పేరిణి, దేశి, మదన బలద్యూతము, కందుక క్రీడ, గుజ్జరి, దండ లాస్య, కోపు, చిందు, వాల్విచి, విల్వేడు, గుజరాతి దేశి, శుభలీల, కొరవంజి _ అను 19 రకముల నృత్యరీతులు రాజదర్బారులోని నర్తకిణులు ప్రదర్శించెడువారు. ఆ కాలమందే కచ్చేరి నాట్యము క్రమపద్ధతిని ప్రదర్శించు విధానము ఏర్పరుపబడినది. తరువాత వచ్చిన మహారాష్ట్ర రాజులుగూడ అనేక యక్షగానముల రచనను జేసి నృత్య కళను పోషించిరి. రాయల కాలములో రాణివాసము వారు నృత్యకళ నారాధించినట్లు చరిత్రలవలన తెలియుచున్నను, నాటి నృత్యరీతుల స్వరూపము మాత్రము తెలియవచ్చుటలేదు. కాకతీయ ప్రభువుల కాలములో ఆరాధన నృత్యకళ ప్రసిద్ధిగాంచినది. కాకతీయుల నాటి ఆలయములను తిలకించిన గర్భగుడి కెదురుగా, నందికి వెనుకనే దేవదాసీలు నృత్యమాడుటకు సుమారు ఎనిమిదడుగుల వ్యాసముగల్గిన వలయాకారపు చదునైన రాతి నమర్చెడువారు. నర్తకి ఆరాతిపై నృత్యము చేసెడిది. ఇట్టి ఏర్పాటు హిందూ దేశములోని మరి ఏ ఆలయము నందును గానరాదు, కాకతీయులు నిర్మించిన ఆలయము లందు మాత్రమే యిట్టి నృత్య వేదికల యేర్పాట్లున్నవి.

ఆనాటినుండి నేటివరకు ఆంధ్రదేశములో నృత్యకళ పెంపొందిన విధమునుగూర్చి యిందు సూత్రప్రాయముగ చర్చించబడినది. ఇచ్చట పేర్కొనిన నృత్యరీతులను గూర్చియు ఆయాపద్ధతులను గూర్చియు విపులముగా నిచ్చట వివరించుట కవకాశము లేదు.

స.రా.

[[వర్గం:]]