Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు-చిత్రకళ

వికీసోర్స్ నుండి

ఆంధ్రులు-చిత్రకళ  :- భారతీయులందరిలో ఆంధ్రులకు శిల్పాదికళలలో విశిష్టమైన స్థానమున్నవి. మహోన్నతమైన కళాసంప్రదాయములకు ఆంధ్రదేశము నిలయము. భారత దేశమున కంతకును వన్నె తెచ్చిన అజంతా, ఎల్లోరా, అమరావతి, నాగార్జునకొండ, లేపాక్షి మొదలైన కళాక్షేత్రములు ఆంధ్రుల పురా సముపార్ధిత మైన వంట మాగాణములు.

ప్రాచీనయుగము  : మొదటి ఆంధ్రరాజులైన శాతవాహనులకాలములో ఇప్పటికి 2100 సంవత్సరముల నాడు అర్హ తాచార్యు లనే బౌద్ధసన్యాసి అజంతా సంఘా రామమును స్థాపించెను. వెనుకటి నిజాము రాష్ట్రములోని (ఇప్పటి బొంబాయి రాష్ట్రములోని ఔరంగాబాదుజిల్లాకు ఉత్తర సరిహద్దున అజంతా కొండలలో ఈ సంఘా రామము ఉన్నది. అది ఒక మనోహర దృశ్యము. ఒక సన్నని కొండలోయలో వ్యాఘ్రనదీజలపాతము పడు చుండును. అర్థచంద్రాకారముగా ఉవ్వెత్తున కోసిన కొండఒడిలో గుహలు తొలువబడి చైత్యములు, విహారములు నిర్మింపబడినవి. ఇవి ప్రారంభింపబడినది మొదలు 900 సంవత్సరములవరకు మొత్తము 24 గుహలవరకు తొలువబడినవి. అవి శాతవాహనులు మొదలు చాళుక్యుల వరకు ఆయా రాజుల పాలనలలో ఆంధ్రచిత్రకళాలక్ష్మికి కొలువుకూటములై విలసిల్లినవి. ఇప్పుడు చిత్రలేఖనము 1, 2, 16, 17 విహారాలలోను, 9,10 చైత్యాలలోను ఉన్నది. ఈ గుహలలోని చిత్రములు తిలకించినప్పుడు చూపరులు ముగ్ధులగుట నిక్కము. చిత్రకారులకు అజంతా క్షేత్రము కాశీవంటిది !

అజంతా, ఆంధ్రచిత్రకళకు ప్రారంభమనుకొనినను అది చిత్రకథారచనలో ప్రథమ ప్రయత్నము ఎంత మాత్రము కాదు. అజంతా చిత్రములలో చిత్రకళ పరాకాష్ఠ నందుకొన్నది.

ఈ చిత్రములలో బలీయమైన నిర్మాణ కౌశలము అంతట ప్రదర్శితమై ఉన్నది. ప్రాదేశిక నిర్మితిలో, రంగుల కూర్పులో రేఖల బిగువులో అజంతా చిత్రములు అద్వితీయములు.

అజంతా చిత్రములలో ఇంకొక విశేషమున్నది.. చిత్రకారులు సమస్త జీవజాలము యొక్క సర్వచ్ఛాయలు ఆ గుహాకుడ్యాలపైన అపురూపమైన కళాసంపత్తితో, రసస్ఫూర్తితో చిత్రించి వేసిరి. తరువాత వచ్చిన మహా యాన బౌద్ధములో అజంతా చిత్రకారుని రెక్కలు నిజముగా విడివడి అనంతపథ విహారము చేసినవి. అంతవరకు హీన యానములో 4 శతాబ్దులవరకు తూష్టీం భావమును వహించియున్న చిత్రకారుడు ఒక్కసారి తనచుట్టునున్న సుందర ప్రపంచము నంతను అవలోకించెను. రమణీయ పరిసరస్థ ప్రకృతినంతయు తన కళాలోకములో దివ్య కాంతుల మిలమిలలాడించినాడు. వ్యవసాయ దృశ్యములు, మహానగరములు, పల్లెలు - తోటలు, కమలాకరములు - వీటిని ఒక మహాకావ్యముగా సృష్టించివేసినాడు. లేళ్ళు, గుఱ్ఱాలు, ఏనుగులు, హంసలు, కోతులు,పక్షులు, మున్నగున వన్నియు జీవకళలూరుచు చిత్రకారుని ప్రతిభచే దృశ్యములయ్యెను. పూలకారుగా విరిసిన ఇట్టి చిత్రసమున్మేషమును తిలకించియే సర్ విలియమ్ రోథెన్ స్టైన్ ప్రాపంచిక సౌందర్యములో నుండియే అతి లోకమైన ఆధ్యాత్మిక సత్యసౌందర్యమును చూపింప గలిగెడు భారతీయ చిత్రకారుల శక్తి అజంతా గుహలలో సందర్శింపగలిగినా నని అన్నారు.

స్త్రీపురుష శరీరావయవాలలో మిలమిలలాడే తారుణ్యము, వన్యమృగాలలో తూగాడే ఏపు, బలుపు, పూవులలో పక్షులలో వెల్లివిరిసిన పావిత్య్రము, లావణ్యము అజంతా చిత్రకారులు అతిలోకముగా చిత్రించినారు. రంగుల రాళ్ళతో తయారుచేసికొన్న కొలదిపాటి రంగులతో, తాము కట్టుకొనిన తూలికలతో అంత లోకాద్భుతమైన చిత్రసంచయము సంతరించగలిగినా రన్నచో ఆ చిత్రకారులు మహాసమర్థు లని చెప్పవలెను. బుద్ధుని జీవితము, జాతక కథలేకాక సమస్త చరాచర ప్రకృతిని ప్రతిబింబించు అలంకార, భావ, కథాచిత్ర ప్రపంచము, లోకోత్తరముగా, అజంతా గుహలలో విన్యసించబడి ఉన్నది,

చిత్రలేఖనము పల్లవుల కాలములో నరసింహవర్మ కట్టించిన గుళ్ళనిండ ఉండుచుండెను. అయితే అదంతయు కాలగర్భమున మునిగిపోయినది. కాని పల్లవ చిత్రలేఖనము నేటికిని "సీతన్న వాసలు" అను గుహలయందు చూడ గలము. ఆ గుహలు పుదుక్కోట సంస్థానములో ఉన్నవి. అందలి చిత్రలేఖనము అజంతాకు అనుగుబిడ్డ, ఈ చిత్ర ములు కొన్ని నూతన లాలిత్యమునుకూడ పుణికి పుచ్చుకొన్నవి.

పుదుక్కోటదగ్గరనున్న పీతన్న వాసలు అను గుహలు పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మ (600-625) కాలము నాటివి. గుహాలయము పైకప్పున నిలచి ఉన్న "పద్మసరోవరము" అత్యుత్తమ చిత్రము. అందు పద్మాల మధ్య చేపలు, హంసలు, మహిషములు, ఏనుగులు, ముగ్గురు పద్మపాణులైన గంధర్వులు చిత్రింపబడినారు. స్తంభాలమీద అచ్చరలేమల చిత్రాలు ఉన్నవి. ఒక దేవదాసి చిత్రము, అర్ధనారీశ్వర చిత్రము గలవు.

ఎల్లోరా కైలాసనాథ దేవాలయము అంతయు చిత్రలేఖనముతో నిండి ఉండినది. దానికి వేసిన వెల్లక్రింద అది మరుగుపడి ఉన్నది. ఈమధ్య నైజాము ప్రభుత్వము కృషి ఫలితముగా వెల్లక్రింద అణగిఉన్న ఈ చిత్రములు బయట పడ్డవి. కాలక్రమముగా వచ్చిన లావణ్యము ఈ రచనలలో గోచరించును.

ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయము పైకప్పు మీదనే చిత్రాలున్నవి. దీనిని రాష్ట్రకూటుడైన రెండవ కృష్ణుడు 757-783 సంవత్సరాలమధ్య నిర్మించినట్లు చరిత్రకారుల యభిప్రాయము. ఈ కృష్ణరాజునకు కుష్ఠ రోగమువచ్చి ఎల్లోరా వద్దనున్న ఒక నూతిలోని నీటిని సేవించగా వ్యాధి నయమయినదట. ఆ సందర్భముగా శివభక్తుడైన ఆరాజు కైలాస దేవాలయమును నిర్మించుటకు పూనుకొన్నాడట !

ఈ నిర్మాణమునకు అజంతా, మహాబలిపుర శిల్పుల వంశ్యులైన ఆంధ్ర శిల్పులను రావించి కైలాస పర్వత సౌందర్యానికి ఏమాత్రము దీటుపోని ఒక శిల్ప కైలాసమును కృష్ణరాజు నిర్మింపించెనట. ఎల్లోరా ఆంధ్రశిల్పులు, అజంతా శిల్పులకు చిత్రలేఖన ప్రావీణ్యమున ఎంతమాత్రము తీసిపోవువారు కారు అని కీ. శే. అడవి బాపిరాజు గారు వచించిరి.

మధ్య యుగము  : బౌద్ధ విహారములు, దేవాలయములలోనే కాక జనసామాన్యమునకు విజ్ఞానమును, వినోదమును సమకూర్చుటకు రాజమందిరాలలోను, నగర మధ్య మంధును మేలురకముచిత్రములు సేకరించబడి ప్రదర్శించబడు చుండెడివి. నాగరకులలోని పెద్దలు, సామంతులు, ధనికులు విలువైన చిత్రములతో గృహములను అలంకరించుకొనుచుండిరి. వాటిని చిత్రాగారము లనుచుండిరి. రాణివాసమునందు శయనాగారములందు చిత్రము లుండెడివి. స్నాన గృహములందు, సూతికా గృహము లందును, కళాఖండములను అలంకారములుగా నుంచు కొనుచుండిరి. గృహములలో శృంగార, హాస్య, శాంతరస సూచకములయిన చిత్తరువు లుండెడివి. నగరులలో, రాజ ప్రాసాదములలో, వేటకు, యుద్ధమునకు, రాసలీలకు, పానగోష్ఠికి సంబంధించిన చిత్రములు పలురకములవి ఉండెడివి. ఆనాటి నాగరక జీవనము, రసికత, చిత్రకళ,క్రీడాభిరామము మొదలైన గ్రంథములలో కనిపించు చున్నవి.

ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకియైన మాచల్దేవి చిత్రశాలలో శివుని దారుకావన విహారము, వాణీ చతుర్ముఖులు, గోపికా కృష్ణులు, అహల్యాపురందరులు, తారాచంద్రులు, దాశక న్యాపరాశరులు, మేనకావిశ్వామిత్రులు మొదలైన చిత్రము లుండెను.

ఉ. "తియ్యని వింటిజోదు రతి
       దేవి చనుంగవ నొత్తిగిల్లి యొ
య్యెయ్యన వంక చక్కఁబడ
       నో త్తెడుఁ జూచితే పుష్పబాణముల్
మయ్యెర వ్రాసెఁ జిత్తరువు
       మాఁగిలి మాఁగిలి ; చిత్రకారుడా!
దయ్యముగాక; నీవి షన
       దానము టిట్టిభ ! వీనికేఁ దగున్ "

అని రతీమన్మథులను రచించిన చిత్రకారుని మంచన శర్మ అనువాడు ప్రశంసించినట్లు క్రీడాభిరామములో వర్ణితమైనది. తత్కర్తయగు శ్రీనాథుడు 15వ శతాబ్దివాడైనను, క్రీడాభిరామమునకు మాతృకయైన ప్రేమాభిరామమును వ్రాసిన సంస్కృత కవి, ఓరుగల్లు ప్రాభవమును కన్నులార చూచియున్నవాడుగనుక, క్రీడాభిరామములో అభివర్ణితమైన విషయములు యథార్థములుగ తీసికొని గ్రహింపవచ్చును.

ఆనాడు నాట్యశాలలందు మనోహరమైన చిత్తరువులు అమర్చబడి ఉండెడివి. 'రాయల రాజధాని యగు విజయనగరమున నాట్యశాలలను వర్ణించుచు అబ్దుల్ రజాక్ ఈ విషయములు పేర్కొని యున్నాడు. రాజకుమారులయు, రాజకుమారిక లయు తస్వీరులు చిత్రకారులు చిత్రించు చుండిరి. వీటివల్ల వివాహములు కూర్చుట జరుగు చుండెను.

పింగళి సూరన రచించిన ప్రభావతీ ప్రద్యుమ్నములో కథకు జీవమైన ఒక చక్కని సన్ని వేశము కలదు. రాక్షసరాజైన వజ్రనాథుని కుమార్తె కలలో, పార్వతి ప్రత్యక్షమై సంకల్పమాత్ర తక్షణ సన్ని ధాపితంబగు చిత్రఫలకంబు నందు నొక్క పురుషు ప్రాయంపువాని వ్రాసి, “ఇతండ వల్లభుండు", అని చెప్పి యా చిత్రఫలక మిచ్చి అంతర్ధాన మందెను, అంత నా ప్రభావతి చెలికత్తియతో నా వృత్తాంతము చెప్పి చిత్రఫలకము చూపును. అప్పలక పావడ యెడలించి--

"కలకల నవ్వినట్ల, తెలికన్నుల నిక్కమ చూచినట్ల తో
బలుకఁ గడంగినట్ల, కడు భావగభీరత లబ్బినట్ల, పెం
పొలయఁదనర్చి జీవకళ యుట్టిపడన్ శివవ్రాసినట్టియా
చెలువున కాభిముఖ్యము భజింపఁ దలంకెను దాను
బోటియున్.

పోతన భాగవతమున ఉషాపరిణయమున చిత్రరచనా విధానముకూడ వర్ణింపబడినది. "ధళధళ మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబు సేసి వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేరువేరు కనక రజత పాత్రంబుల నించి; కేలం దూలిక ధరించి " చిత్రరేఖ రచన కుపక్రమించును. ఈ విధానము పశ్చిమ చాళుక్యరాజగు సోమేశ్వరుడు రచించిన అభిలషి తార్థ చింతామణిలో రంగులు, కుంచెలు, వాటి ఉపయోగ పద్ధతులు వర్ణితము లయినవి. గోడలమీద, పలకలమీద, పటములమీద చిత్ర రచనలు చేసెడివారని చెప్పబడినది.

వ్యక్తిగతమైన ఒక దేవతామూర్తిని ఆరాధించుట యనునది మానవ సహజమైన ప్రవృత్తి. అది హిందూమతములో నేకాక బౌద్ధ, జైనమతములలో కూడ గలదు. బౌద్ధములో మౌర్య, సంగ, పూర్వాంధ్ర యుగములలో గొప్పమార్పులు వచ్చినవి. హీనయానములో బుద్ధుడు మహా సంబుద్ధియై నిర్వాణము చెందిన ఒక వ్యక్తి - అంతే! తరువాతవచ్చిన మహా యానములో బుద్ధుడు ఒక ధర్మానికి ఆదర్శమూర్తియై అవతరించి మానవులకు ఎంతగా ఆరాధనీయుడై నాడో తరువాత చిత్రాలలో అజంతాలో చూడవచ్చును.

బుద్ధుని పూర్వజన్మములకు సంబంధించిన ధ్యాని బుద్ధులును, వారి సంతతికి చెందిన బోధిసత్వులును, తారాదేవి మొదలైన స్త్రీ దేవతలును ఉపాస్యమూర్తులై నారు. వీరుగాక హిందువుల బ్రహ్మ, ఇంద్రుడు యక్షులు, నాగులు, బౌద్ధములో చేర్చబడినారు. వీరందరు విశిష్టమైన రూపాలతో ఉపాసించబడుచు వచ్చినారు.

బౌద్ధము తరువాత శైవము, వైష్ణవము ప్రాముఖ్యము వహించినవి. శైవ, వైష్ణవ సామరస్యముకోసము సృష్టించబడిన హరిహరదేవుడుకూడ చిత్రాలలో స్తుతించ బడినాడు.

అనంతపురం జిల్లాలో, హిందూపూరుకు 7 మైళ్ళ దూరములో లేపాక్షి అను గ్రామమున ఒక పెద్ద వీర భద్రాలయము ఉన్నది. ఆ గుడి పైకప్పుమీద, గోడల మీద చక్కని చిత్రములు ఉన్నవి. అవి విజయనగర చిత్రకళకు చక్కని తార్కాణములు. శైవ, వైష్ణవ గాథలు చక్కని దేశీయమయిన ఫక్తిలో చిత్రితమై ఉన్నవి. విజయనగర రాజుల వైభవము ఈ చిత్రములలో చూడగలము. పూవులు, లతలు అల్లిన రకరకములగు చీరలు, ఆభరణములు, కేశబంధములు రాయలనాటి తెలుగువారి నాగరకత యావత్తు కన్నులకు కట్టినట్లు ఈ చిత్రములలో చూడగలము.

లేపాక్షిలో హరిహరమూర్తి చిత్రము ప్రసిద్ధము. అందు గల కిరాతార్జునీయము నందలి కొన్ని ఘట్టములను ఆద్భుతముగా చిత్రించినారు. వాటిలో కిరాత వేషములో పరమశివుడు ఎరుకలతో వేటకువచ్చు చిత్రము చాల చక్కనిది. బోయజాతికి చెందిన స్త్రీ పురుష చిత్రములు, లేళ్ళు, అడవి పందులు—— అవి ప్రాణభీతితో పరుగిడుచున్న ఆటవిక పరిసరములు చక్కగా చిత్రించినారు. తన బిడ్డ రాకుమారుని రథచక్రములక్రింద నలిగిపోగా రాజుగారితో మొరపెట్టుకొన బోవుచున్న గోమాత చిత్రము కరుణ రసాత్మకమయినది. గోమాత రాజప్రాసాదము తల వాకిట గంట మ్రోగించుట మొదలు శివుడు ప్రత్యక్షమై వరము లొసగుటవరకు గల గాథను ఎంతో చక్కగా చిత్రించినారు.

శివ పార్వతుల ప్రణయ చిత్రము మరియొక గొప్ప చిత్రము. శివుని ప్రక్కన పార్వతి శ్వేతవసన ధారిణియై సర్వాభరణ భూషితయై శయ్యపై నాసీనయైనది. చందనమును, తాంబూలమును పార్వతీ పరమేశ్వరులకు పరిచారికలు అందించు చుందురు. వింజామరలు విసరుచు ఇద్దరు పరిచారిక లున్నారు. వారి వస్త్రధారణము, అలంకరణము ఆకర్షకములుగా ఉన్నవి. వారి కొప్పులు, చీరలు, ఆభరణములు, చక్కని రేఖలలో, రంగులలో విన్యసించబడినవి. ఇవిగాక మునివాటికలో శివుని భిక్షాటన చిత్రము కాలభై రవస్వామి చిత్రము, దేవర్షి భక్త గణ పరివృతుడయిన హరిహరనాథుని చిత్రము అత్యంత మనోహరములు. దేవాలయ నిర్మాతలగు విరుపణ్ణ సోదరుల రూపచిత్రములు ఆనాటి రూపరచనకు చక్కని ఉదాహరణములు. మాచెర్ల వద్ద దద్దళము మీద నున్న దశరథుని పుత్రకామేష్టి యాగము మొదలగు వానికి సంబంధించిన చిత్రములు కలవు. లేళ్ళు, నెమళ్ళు మొదలయిన అలంకార చిత్రములు గలవు. ఇచ్చట గాలికి, వానకు రూపరిపోవుచున్న ఈ చిత్రములలోని రంగులు పోయియున్నను చిత్రకారుడు వివిధ స్థాయులలో లోపల రచించిన రేఖలమూలమున అతని ప్రజ్ఞ ద్యోత మగుచున్నది. ఆ చెరగిపోవుచున్న రేఖలతో మాచెర్లలో నున్న వీరభద్రాలయము పై కప్పునకూడ ఆనాటి చిత్రములుకలవు.

అర్వాచీన యుగము  : మొగలు సంప్రదాయము దక్షిణాపథమునకు వచ్చిన కొత్తదినాలలో కొండపల్లి, తంజావూరు, మధురలలోని ఆంధ్ర చిత్రకారులు ఆ పద్దతిలో జాతీయ రచనా విధానమును కలిపి ఒక క్రొత్త సంప్రదాయమును సృష్టించిరి. ఆ రకము చిత్రములు మద్రాసు మ్యూజియములోను, బందరు ఆంధ్రజాతీయ కళాశాల లోను కలవు. నెలలను, తిథులను, ఋతువులను ధ్యానశ్లోకముల నాధారముగా గైకొని రచింపబడిన వాటి అధిదేవతల మూర్తులను ప్రతిపాదించు తంజావూరు చిత్రములు సుప్రసిద్ధములు. నాయకరాజుల కాలములో మధుర దేవాలయములో వెలసిన చిత్రాలు ఈ నాటికిని కలవు.

జనపదాలలో, పట్టణాలలో, రామాలయాలలో, రచ్చ సావిళ్లలో స్థానికముగా కులవృత్తిగా చిత్రరచన చేసెడి

ముచ్చీలు, జీనిగర్లు చక్కని చిత్రాలు భారత భాగవత రామాయణాలలోని గాథలు చిత్రించుచునుందురు. నేటికీ చేర్యాలలోను, (జనగామ తాలూకా) వేములవాడలోను కాకిపడగలవాండ్ల పటాలు, కాటమరాజు కథకు సంబంధించిన బొమ్మలు, పెద్దమ్మల వాండ్ల బొమ్మలు చేసి వాటిపై రంగువేయు సంప్రదాయ చిత్రకారులు గలరు. నేటికిని తోలు బొమ్మలను చిత్రించువారు గలరు.

బందరు కలంకారీలు, కొండపల్లి నకాషీలు, దేవాలయపు తెరలమీద చిత్రించిన శైవ, వైష్ణవ గాథలు హృద్యములుగా ఉండును. పేకముక్కలపై దశావతారముల బొమ్మలు కూడ చాల ప్రసిద్ధములు. నిర్మల (ఆదిలాబాదు జిల్లా) లో దక్కను చిత్రకళా సంప్రదాయము నేటికిని జీవించియున్నది. కాని ఆంగ్ల పరిపాలనలో ఈ కళలకు ప్రోత్సాహము, గౌరవము పోయి ఆ వృత్తులు నశించి పోయినవి.

నవ్యయుగము : మరల ఈ శతాబ్దారంభములో దేశ పరివ్యాప్తముగా వచ్చిన దేశీయోద్యమము ఫలితముగ దేశీయమైన కళలు తేరుకొన్నవి. పూర్వ సంప్రదాయములు పునరుద్ధరింపబడి చిత్రకళ కొక క్రొత్తవికాసము కలిగినది. బెంగాలులో అవనీంద్రుని కృతముగ తీసికొని రాబడిన ఈ కళాచై తన్యమును మొట్టమొదట ఆంధ్రదేశమున వీరియించిన గౌరవము బందరు ఆంధ్రజాతీయ కళాశాలకు దక్కినది. శ్రీ ప్రమోద కుమార ఛటోపాధ్యాయుల అంతే వాసిత్వమున కొందరు యువచిత్ర కారులు కళాదీక్షను కైకొనిరి. అడివి బాపిరాజు, కవుతా ఆనంద మోహనశాస్త్రి, రామమోహన శాస్త్రి, గుఱ్ఱం మల్లయ్య మొదలైనవారు అక్కడ తయారయినవారే. శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు తమ సమీక్షావ్యాసముల ద్వారా ఉత్తమ భారతీయ కళాధర్మములు వివరించి, ఈ ఉద్యమమునకు మూలపురుషులయినారు. అజంతా సంప్రదాయ జనితమైన 'రేఖావిన్యాసములతో, అలంకార యుతమై, భావప్రధానమైన చిత్రములు ఇచ్చట తయా రయినవి. బాపిరాజుగారి రేఖా చిత్రములు, కవుతా సోదరుల పెనిసిలు, ఎచ్చింగ్ రూపచిత్రములు ప్రసిద్ధములు.

ఆ రోజులలోనే గౌతమీ తీరాన రాజమండ్రి ప్రభుత్వ కళాళాలలో ఓస్వాల్డు కూల్డ్రే దొర ప్రిన్సిపాలుగా ఉండెడివాడు. ఆయన 'ఆంధ్ర సంప్రదాయములన్నను, ఆంధ్ర సంస్కృతి అన్నను పరమ పవిత్రముగా ఎన్నుకొనెడు కళాతపస్వి. ఆయన తన కాలేజీ విద్యార్ధుల లేత హృదయాలలో జాతీయమైన ఈ భావములు నాటిరి. ఆయన కవి, చిత్రకారుడు, కథా రచయిత. ఈమూడు ప్రక్రియలలో అతడు తన శిష్యులను ప్రోత్సహించినాడు.

చిత్ర కారుడుగ ఆయన భుజమెక్కినది. కీ. శే. దామెర్ల రామారావుగారు. అతడు బొంబాయి చిత్రకళాశాలలో ప్రశంశ నీయుడుగా ఉత్తీర్ణుడయి, భారతదేశము నందలి వివిధ కళా క్షేత్రములు సందర్శించుకొని, కలకత్తాలో వంగీయ చిత్రకళా ఫక్కికలు కూడ అవగాహన చేసికొని 1922 లో రాజమండ్రి చేరుకొన్నాడు. కళావిధానాలలో ఉన్న బాగోగులు చక్కగా ఆకలింపు చేసికొన్న వాడు గనుక తన వ్యక్తిత్వము, అనుభూతి, ఆంధ్రత్వము వెల్లి విరియు విధముగా ఒక క్రొత్త పంథాను అతడు ఏర్పరుచుటకు ప్రయత్నము చేసెను. 1922 లోనే "ఆంధ్ర చిత్ర కళాశాల"ను స్థాపించి పలువురు యువకులను చిత్రకళా దీక్షితులను చేసెను. వారి కళాకృషి దేశములోను, ఖండాంతరములలోను ఖ్యాతి నార్జించుకొనెడు రోజులలో 1925 లోనే ఆయనకు అకాలమృతి సంభవించినది. ఆయనకు అప్పుడు 27 సంవత్సరముల వయస్సు. రామారావుగారు ప్రాక్పశ్చిమ సంప్రదాయములను సమన్వయముచేసి ఒక సంప్రదాయమును సృష్టించుటకు ప్రయత్నముచేసి ఆ మూడు సంవత్సరములు స్వల్ప వ్యవధిలో చాలవరకు కృతకృత్యు లయిరి.

నిత్యజీవితము, చరిత్రలు, పురాణములు -వీటినుంచి రామారావుగారు విషయము తీసికొని నీటిరంగులతోను, నూనె రంగుల తోను విస్తృతముగా చిత్రరచన చేసినారు. ఒక గురువు తీర్చిన బాటలోగాని, అమశ్రుతమైన ఒక

సంప్రదాయములో గాని గొప్ప చిత్రములు చిత్రించుట అంత విశేషముగాదు. తానుగా ఒక పద్ధతిని సృష్టించుకొని పలువురకు ఆదర్శప్రాయమైన ఆ సంప్రదాయమునకు మొనగా నిలువగలుగుట ప్రతిభా విశేషము రామారావుగారు విశిష్టమైన ఒక ఆంధ్ర చిత్రకళా సంప్రదాయమునకు మూలపురుషుడు. రామారావుగారి శిష్యులలో వరదా వెంకటరత్నము, చేమకూర సత్య

నారాయణ, భగీరథి, దిగుమర్తి బుచ్ఛికృష్ణమ్మ, సత్యవాణి మొదలైనవారు ఆతని సంప్రదాయము కొనసాగించినారు. వరదా వెంకటరత్నంగారు రామరాయ చిత్రకళాశాల అనుదానిని స్థాపించి నడుపుచున్నారు. భగీరథిగారు నీటిరంగులతో చిన్నచిన్న ప్రకృతి చిత్రములు రచించుటలో సిద్ధహస్తులయిరి.

వీరి సమకాలికులుగా భీమవరములో అంకాల వేంకట సుబ్బారావుగారు, 'పెనుగొండలో సి. యన్. వెంకట్రావు గారు, వి. అర్, చిత్రాగారు పేర్కొనతగినవారు, వి.ఆర్. చిత్రాగారు కుటీర పరిశ్రమలలో ప్రత్యేకముగా కృషి చేసిరి. వీరును, తేజోమూర్తుల కేశవరావుగారును, శాంతినికేతనములో చిత్రకళాభ్యానము చేసిరి. కేశవరావు గారి దారుచిత్రములు (woodcuts) సుప్రసిద్ధములు.

ఇంతలో మద్రాసు చిత్రకళాశాలలో శ్రీ దేవీ ప్రసాద రాయ చౌదరిగారు ప్రిన్సిపాలుగా వచ్చిరి. రాయచౌదరి గారు ప్రాక్పశ్చిమ కళా సంప్రదాయములకు ప్రతినిధి. ఆయన తన శిష్యులకు ఆత్మ వ్యక్తీకరణములో చక్కని కళాభినివేశమును కలిగించి స్వేచ్ఛనిచ్చిరి. అక్కడ తయారయినవారి చిత్రములలో జాతీయమైన తూగు, గాఢమైన కళా సంపత్తి, వస్తు వైవిధ్యము, స్వేచ్ఛ ప్రబలముగా నున్నవి. ఆయనయొద్ద సయ్యదు అహమ్మదు, సంఘం లక్ష్మీబాయి, మాధవపెద్ది గోఖలే, నారాయణరావు, మొక్కపాటి కృష్ణమూర్తి, పిలకా నరసింహమూర్తి, శ్రీనివాసులు, ఎ. పైడిరాజు, రామగోపాలు మొదలైనవారు చిత్ర విద్య నభ్యసించిరి.

శ్రీనివాసుల చిత్రములు జానపదరీతిలో ఒక సౌలభ్యమును గడించినవి. పిలకా నరసింహమూర్తి చిత్రములలో జానపదచ్ఛాయలున్నను అవి పౌరాణికముల వైపునకే మొగ్గును. మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రములు పౌరాణికమైన పరిధిలో నిలిచి నిత్యజీవనచ్ఛాయలు ప్రతిబింబించు చుండును. ఈయన తోబుట్టువులు పినుపాటి సీతాదేవి, పిలకా విజయలక్ష్మి, కవుతా స్వరాజ్యలక్ష్మి అనల్పమైన కృషిచేసి, చిత్రకళా లక్ష్మీకి క్రొత్త ఒయ్యారములు కూర్చిరి. వీరుగాక స్త్రీచిత్రకారిణులలో రత్నాల కమలాబాయి, తుంగల లక్ష్మీదేవి, యమ్. నాగేశ్వరీబాయి గణనీయలు. స్వయంకృషివల్ల స్వతంత్రముగ చిత్రకళ నభ్యసించి, ఆచంట జానకిరామ్, కూచి భాగేశ్వర శర్మ చక్కని చిత్రములు రచించిరి.

తెలంగాణములో ఈనాడు జరుగుచున్న చిత్రకళా కృషి ప్రత్యేకముగా ఎన్నదగినది. హైదరాబాదు పట్టణము అటు ఉత్తరాది- ఇటు దక్షిణాది నాగరకతలకు ఆటపట్టు. అందువలన ఆ రెండు నాగరకతల సమన్వయము వలన ఏర్పడు చక్కని సంస్కారము అక్కడి చిత్రకారుల కృషిలో సమున్మేషము చెంది ఉన్నది.

తెలంగాణములో కొండలు, దుర్గములు, శిథిలములైన పురావైభవ చిహ్నములే అడుగడుగునను కనుపించును. రాళ్లుకావు, అవి రత్నము లనెదను. కొండలు చేరువౌతున్నకొలది వాటి హృదయ స్పందములు గుండెలలో ముదురుకొనుచున్న కొలది గట్టు, కన్నము ఎరుగని మెట్ట పొలాలలో జొన్న పైరు బంగరు విస్తీర్ణాలు చూచినకొలది చూపులలో, తలపులలో, అంతస్సులో ఏదో వింతమార్పు వెల్లివిరిసివచ్చును. ఆ పరిసరాలలో నిత్యము వసించెడు కళాశీలికి ఆ దృశ్యములు ఎంత ఉత్తేజము నిచ్చి, చిత్ర నిర్మాణమునకు ఉన్ముఖుని చేయునో ఊహించలేము. అక్కడ ప్రముఖ చిత్రకారుడైన కొండపల్లి శేషగిరిరావు గారి 'రాయగిరి కొండలు' అన్న చిత్రము చూచినచో ఆప్రదేశాలలో తిరుగుచున్నట్లే అనిపించును. శేషగిరిరావు గారు హైదరాబాదు చిత్రకళాశాలలో చిత్ర విద్య నేర్చుకొని, ఒక సంవత్సరము శాంతినికేతనములో కూడ ఉండి వచ్చిరి. వారి చిత్రములలో ఆ ఛాయలు కనిపించును. తరువాత చీనా పద్ధతిలో ఆయన చాల చిత్రములు రచిం చిరి. కొండకొమ్మున కూర్చున్న కోతులు', వారి'కాకులు' అందుకు చక్కని ఉదాహరణములు. వీరితో పాటు ఆ కళాశాలలో తయారయినవారు వి. మధుసూదనరావు కె. రాజయ్య, సయ్యద్ బిన్ మహమ్మదు ముఖ్యులు రాజయ్యగారి చిత్రములలో -జానపద శైలిలో -"గృహిణి' మొదలైనవి చక్కని ఉదాహరణములు. మధుసూదన రావు గారి 'సోదె ' పల్లెజీవనమునకు చెందిన చక్కని చిత్రము. సయ్యద్ బిన్ మహమ్మదుగారు రూపచిత్రణలో సిద్ధహస్తులు.

వీరుగాక బొంబాయి చిత్రకళాశాలలో విద్యాభాసము చేసివచ్చిన పి. తిరుమల రెడ్డి, దీనదయాళ్ నాయుడు మొదలయినవారు చాల గట్టివారు. తిరుమల రెడ్డి ఆ కళాశాలలో ఛార్లెసు జిరార్డు (Gerard) ప్రిన్సిపాలుగా ఉన్నప్పుడు వారిచెంత కళ నుపాసించిరి. ఆయన ప్రచురించిన 'చిత్రవృంతము' (Album) చూచినప్పుడు ఆ కళాశాలలో ఇయ్యబడిన ఉత్తమ శిక్షణము బోధపడుచున్నది. గురుశిష్యులకు ఎట్టి సంబంధము ఉండేడిదో జిరార్డుగారు వ్రాసిన తొలిపలుకులో తెలియుచున్నది. రెడ్డి, పాశ్చాత్య ఇంప్రషనిష్టుల వర్ణ విన్యాసమును అలవర్చుకొన్నాడు. బొంబాయిలో ఇప్పుడు ప్రసిద్ధులైన హస్సేన్, ఆరా మొదలయిన చిత్రకారుల కృషి బిజాలు వీరి చిత్రాలలో కలవు. వీరి స్టిల్ లైఫ్ చిత్రములు చాల హృదయం గమముగా ఉన్నవి. దీనదయాళ్ సుమారు 70 సంవత్సరాల వయస్కుడు. ఐనను యువకునివలె నేటికిని చిత్రకల్పన చేయుచునే ఉండును. ఆయన దారుమూర్తులను సృజించుటలొ అందెవేసిన చేయి.

అనుశ్రుతమయిన దక్కను కలమునకు చెందిన చిత్రకార కుటుంబమువారు వెంకటరామయ్య, బాణయ్య అనువారు. వీరు నిజామలీఖాన్ దర్బారులో ప్రఖ్యాతి గాంచిన వెంకటాచలం అను చిత్రకారుని వంశమునకు చెందినవారు. వారి చిత్రములు అచ్చముగా పూర్వపు చిత్రములను పోలి ఉండును. సాలార్ జంగు మ్యూజియములోను, విదేశీయుల సంకలనములలోను ఆ చిత్రములు గలవు.

ప్రస్తుతము ఢిల్లీలో ఉన్న కుమారిలస్వామి తెలంగాణమునకు చెందిన చిత్రకారుడే, దేశము స్వతంత్రమై చిత్రకళ ఒక క్రొత్త తేజము వెలయించుచున్న యీ సమయములో హైదరాబాదు నగరము ఆంధ్రదేశమునకేగాక దక్షిణాపథమున కంతటికిని కళాకేంద్రము కాగల అవకాశము లెన్నో కలవు.

మొ. కృ.

[[వర్గం:]]