Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర సినిమా పరిశ్రమ

వికీసోర్స్ నుండి

ఆంధ్ర సినిమా పరిశ్రమ: - పరిశ్రమలలో సినిమా పరిశ్రమ ఏడవది. ప్రపంచములో చిత్రనిర్మాణము చేసెడు దేశాలలో హిందూదేశము మూడవ స్థానమును సంపాదించుకొన్నది. మొన్న మొన్నటి వరకును అమెరికాకు తరువాతిది గానే ఉండెడిది. కాని ఆ రెండవ స్థానమును జపాను సంపాదించుకొనుటవల్ల మూడవ స్థానమునకు మారవలసివచ్చినది.

మూగచిత్రాల నిర్మాణదశ : 1903 వ సంవత్సరమున "క్రీస్తు జీవితము" అను చలనచిత్రము మొదటిసారిగా హిందూ దేశీయులు చూచినారు. అప్పటినుండి 1910 వరకు ఇతర దేశపు చిత్రములు చూపుచు వచ్చినారు. 1911 నాటికి "రాజదర్బారు" అను చిత్రమును, తొలిగా హిందూ దేశీయులు నిర్మించినారు. 1913 లో దున్దిరాజ గోవిందఫాల్కే అను నాయన 'హరిశ్చంద్ర' చలనచిత్రము నిర్మించినాడు.

మద్రాసులో రఘుపతి వెంకయ్యగారు 'గెయిటీ' టాకీసు మొట్టమొదట కట్టించినారు. ఇదే తెలుగువారి మొదటి సినిమా హాలు. ఆ తరువాత ఆయనే గ్లోబు (ఇప్పటి రాక్సి), క్రౌను థియేటర్లు కట్టించినాడు. ఈ సినిమా హాలులవల్ల మంచి లాభాలు రాసాగినవి. అందువలన ఆయన కుమారుడైన సూర్యప్రకాశరావును (ఆర్.యస్. ప్రకాశ్) సినిమా సాంకేతిక విద్యను నేర్చుకొని రమ్మని హాలివుడ్డుకు పంపినాడు, ప్రకాశ్ హాలివుడ్డులో సిసిల్ బి. డి. మిల్లి దగ్గర శిక్షణమును వడసినాడు, సినిమా సాంకేతిక జ్ఞానమును సాకల్యముగ గ్రహించినాడు. 'మెట్రోగోల్డ్విన్ మేయర్సు' చిత్రములో ఒక వేషము గూడ వేసినాడు.

శ్రీ ప్రకాశ్ స్వదేశమునకు వచ్చిన తరువాత 1923 లో "భీష్మ" అనెడు చిత్రమును నిర్మించినాడు. అది విజయ వంతముగా ఆడినది. . ఇతడు "స్టార్ ఆఫ్ యీస్టు ఫిల్ము

కంపెని" అను పేరుతో ఒక శిల్పగృహము (స్టూడియో)ను 1926 లో నిర్మించినాడు. ఇతనితో భాగస్వామిగా మద్రాసు వాసియైన ఆర్. నారాయణ చేరినాడు. "జనరల్ పిక్చరు కార్పొరేషన్" అనెడు సంస్థను స్థాపించి, వీరిరువురు చిత్రాలు దీయ దొరకొన్నారు. ఆర్. యస్. ప్రకాశ్ 'గజేంద్రమోక్షము', 'నందనారు', అను చిత్రాలను తీసినాడు. 1927 నాటికి నారాయణ ఇతర దేశములకు వెళ్లి, పరిశ్రమకు గూర్చి తెలిసికొని తిరిగి వచ్చినాడు. వచ్చిన వెంటనే అతడు ద్రౌపదీ వస్త్రాపహరణము', 'కీచక వధ' తీసినాడు.

1929 లో ఏలూరు వాస్తవ్యులయిన శ్రీ మోతే నారాయణరావు గారు " గ్యారంటీ ఫిలుముసు " అనెడు సంస్థను స్థాపించి, ఆర్. యస్. ప్రకాశ్ దర్శకునిగా నియమించుకొని, "కన్యకా పరమేశ్వరి" అనెడు చిత్రమును దీసినారు. జనరల్ పిక్చరు కార్పొరేషన్ లో శ్రీ వై.వి. రావు శిల్పి (ఆర్టిస్టు), దర్శకుడుగా, నటుడుగా నుండెను. వీరి ఛాయాగ్రాహకుడుగా ( కెమేరా మేన్ జితిన్ బెనర్జి పనిచేసెను.

మద్రాసులో నిట్లుండగా, శ్రీ హెచ్. యం. రెడ్డిగారు బొంబాయి, కొల్హాపూరులలో మూగ చిత్రాలు తీయసాగిరి. ప్రకాశ్ గారి దగ్గరనున్న ఫోటోగ్రాఫరు రంగయ్య తోడ్పాటుతో శ్రీ సి. పుల్లయ్యగారు "మార్కండేయ” తీసినారు. దీనిలో పుల్లయ్యగారే యముని పాత్ర వహించినారు.

ఆనాటి చిత్ర పరిశ్రమ, చిత్ర నిర్మాణములను గూర్చి తలచుకొనినచో నవ్వుగా నుండును. ఆ రోజులలో చిత్ర నిర్మాణ శాలలు పెద్ద భవనముల ఆవరణములలో నుండుచుండెను. ఈ రోజులలో వలె సెట్సు వేసేవారు కాదు. నాటకాలలో వలె తెరలు ఉపయోగించెడువారు. నటీనటులను ఆంగ్లోయిండియనుల నుండి, వేశ్యల నుండి ఎన్నుకొనెడువారు. ఒక చిత్రమునకు నిర్మాణ వ్యయము పదునైదువేల నుండి ఇరువది వేల వరకు ఉండుచుండెను. ఒక్కొక చిత్రమునకు మూడు అచ్చు ప్రతులు (ప్రింట్లు) మాత్రమే తీసెడివారు. అవి నూట యేబది సార్లు ఉపయోగించగానే నిరుపయోగమయి పోవుచుండెను. పంపక దారు (డిస్ట్రిబ్యూటరు) అనువాడు ఆరోజులలో లేనేలేడు. నిర్మాతే తన చిత్రమును ఆడించుకొనవలసి వచ్చుచుండెను.

1927 వ సంవత్సరము నాటికి హిందూ దేశపు మొత్తమునకు 156 సినిమా ప్రదర్శనశాలలు మాత్రమే యుండెను. అయితే, మద్రాసునగరములో మాత్రము 9 సినిమా శాల లుండెను. ఈ సినిమాశాలలలో ఇతర దేశ చిత్రములే ఎక్కువగా ఆడెడువారు. ఆ చిత్రములలో సాహసము, దెబ్బలాటలు ఉన్న చిత్రములు వచ్చుటయు, ప్రజలు ఆనందించుటయు జరుగజొచ్చెను. అందుచే మనవారు పురాణ కథలతోబాటు రాజపుత్రుల చరిత్రలు, సాహసము దెబ్బలాటలు కల చిత్రాలు తీయసాగిరి.

చిత్రాలు మూగవి యగుటచే, భాష లేకపోవుటచే చిత్రముతోపాటు ఒక వ్యాఖ్యాతను పంపెడువారు. అతడు తన వాక్పటిమను, హాస్య ధోరణిని ఉపయోగించి కథ చెప్పి, ప్రేక్షకులను తన్మయులను చేసెడువాడు. కొన్నాళ్లు గడిచిన తరువాత వాద్య గోష్ఠిని గూడ చిత్రముతో పాటు పంపవలసివచ్చినది. అంతియే గాక, ప్రేక్షకులను ఆకర్షించుటకు బహుమానములు, టికెట్ సంఖ్యకు ఇచ్చుచుండెడువారు. పిల్లలకు బొమ్మలు పంచి పెట్టుచుండువారు. ఒక్కొక పట్టణములో రెండు సినిమా ప్రదర్శనశాలలు ఉండుచుండెను. అక్కడ పోటీ తప్పనిసరిగా ఏర్పడుచుండెను. ఆ పోటీలో టికెట్టు ధర కానీ వరకు కూడ తగ్గించెడువారు.

1928 నుండి 1931 వరకు లాభములు తగ్గుముఖము కాజొచ్చెను. నాటక సంఘము లుండుటచే నాటకాల ప్రాముఖ్యము ఎక్కువయినది. ఆ నాటకాల ముందు ఈ మూగ చలన చిత్రములు తట్టుకోలేక పోయినవి. అందుకై నిర్మాతలు మరియొక క్రొత్త ఆకర్షణమును చిత్రముతో పాటు సమకూర్చవలసివచ్చినది. అందుకై వారు భిక్షావతి వంటి ఆనాటి సినిమారంగపు నాట్యకత్తెలను గూడ చిత్రముతో పాటు పంపెడువారు. చిత్రముతో పాటు వీరి నాట్యము రెండవవిషయముగా ఉండుచుండెడిది. దానితో మళ్లీ ప్రేక్షకుల సంఖ్య పెరుగ మొదలు పెట్టినది.

వాక్చిత్రముల దశ (19311-1933) : ఖాన్ బహదూరు అర్దేషీర్ ఇరాని యనువాడు "ఇంపీరియల్ కంపెని" అను పేరుతో ఒక సంస్థను బొంబాయిలో స్థాపించెను. "ఆలమ్ ఆరా” అను చిత్రమును 14-3-1931వ నాటికి హిందీలో వెలువరించెను. ఆ సంవత్సరములోనే (1931) హెచ్.యం. రెడ్డిగారి దర్శకత్వమున ప్రహ్లాద ” అను వాక్చిత్రమును తెలుగులో బొంబాయిలో తీసివారు. ఇదియే మొదటి తెలుగు వాక్చిత్రము.

1932 లో 2, 1933 లో 6 వాక్చిత్రములు తయారయినవి. మొట్టమొదటి నటకులలో యడవల్లి సూర్య నారాయణగారు. సురభి కమలాబాయిగారు ముఖ్యముగా బేర్కొనదగిన వారు.

ఇంతవరకు తెలుగు పెట్టుబడిదారులు లేరు. అందరును బొంబాయి, కలకత్తాలవారే. నటీనటులు మాత్రము తెలుగు వారు. చిత్రము లన్నియు పురాణకథలకు సంబంధించినవే. హిందూస్థానీ సంస్థలు తెలుగువారి మేధాశక్తిని ఉపయోగించుకొని లాభములు సంపాదించుకొను చుండిరి.

ఇప్పటికి, తెలుగువారు సినిమాలపై మోజుపడినారు. కాని, వీరు సాంకేతిక, వ్యాపారిక మర్మములు కనిపెట్టవలెనని మాత్రము ముందుకు రాలేకపోయినారు. ఈ 'కాలములో చిత్రనిర్మాణ వ్యయము ముప్పది వేలు మొదలు నలుబదివేల రూపాయలవరకు ఉండుచుండెను. నటీనటులకు ప్రయాణ వ్యయములు, ఇతర వ్యయములు మాత్రమే గిట్టుచుండెను. వీరందరిని సమకూర్చెడు ప్రతినిధులకు కమీషను డబ్బులు గిట్టుచుండెడివి. కవితలో కూడ కేవలము నాటకాలను కుదించి చిత్రీకరించుటయ జరుగుచుండెను. కవులలోగూడ సాంకేతిక విజ్ఞానము లేకపోవుటచే నాటకాల పద్ధతిలోనే మాటలు వ్రాయుచుండిరి. శబ్దగ్రహణములో మాటలు సరిగా వినపడవేమో అని అసహజముగా, మెల్లగా విడివిడిగా పలికెడువారు.

ఇంతవరకు తెలుగుదేశమునుండి నిర్మాతగా ఎవరును ముందుకు రాలేదు. ఉన్న దర్శకులయినను వ్రేళ్ళమీద లెక్క పెట్టగలిగినంతమందే! తెలుగువారిలో సాంకేతిక శిక్షణము పొందవలయునను కోరికగలవారు తక్కువమందే ఉండిరి. ప్రదర్శనశాలల విషయము చూచినచో అద్దెలకు తెచ్చిన సినిమా పరికరా లగుటవలన లాభాలు అంతంత మాత్రముగా నుండుచుండెడివి. పంపక సంస్థ ఒక్కటైనను తెలుగువారిది లేదు. ఇది వాక్చిత్ర నిర్మాణమునందలి తొలిదశ.

1934-1935: ఈ కాలము తొలిదశలో రెండవభాగము. చరిత్రలో ప్రాతరాతియుగము, క్రొత్త రాతియుగము అన్నట్లు ఇది ఒక భాగముగా నున్నది.

1934 వ సంవత్సరమునందు బందరులోని చిత్రప్రదర్శనశాల అధిపతియైన శ్రీ పి. వి. దాసు, శ్రీ చల్లపల్లి రాజావారు, మద్రాసులోని జి. డి. స్వామి, ఎం. టీ. రాజన్, జి. పి. పార్థసారథిగార్లతో చేరి, “వేల్ పిక్చర్సు" అను చిత్రనిర్మాణ శాలను నిర్మించినారు. దీనివలన ఈశాల యొక్క నిర్మాతలకు మంచిలాభాలు వచ్చినవి. తెలుగువారు చిత్ర నిర్మాణములో భాగస్థులయినారు. చిత్రాల నిడివి 17 వేల నుండి 18 వేల అడుగులవరకు నుండెడిది. దక్షిణ భారతమున 'వేల్ పిక్చర్సు' చిత్ర శాలలో మొదటిసారిగా నిర్మించిన తెలుగు చిత్రము సీతా కల్యాణము.

నూతనముగా తీయబడిన చిత్రములలో పాట లెక్కువగా నుండెడివి. ఈనాటి నాటకాలలో 'ఇన్ని వందల పద్యాలు చదివెదరు" అన్నట్లు, ఆరోజులలో “ఇన్ని పాట లున్నవి” అని ప్రచారము చేయుచుండువారు,ఆరు అచ్చుప్రతులు తయారుచేయుచుండిరి. ప్రెస్ షోలు ఇచ్చెడు వారు. దానికై భోజనాదులతోసహా పెద్ద వివాహపు తంతువలె నడిపెడు వారు. చిత్రనిర్మాణ వ్యయము 35 వేలు మొదలు 75 వేల వరకు పెరిగిపోయినది. చిత్రాలు వారాల తరబడి ఆడి, చిత్రప్రదర్శకులకు మంచి లాభాలు తెచ్చి పెట్టసాగినవి. ప్రదర్శనశాలల నిర్మాణము ఎక్కువయినది, ప్రతి క్రొత్తచిత్రము తమ ప్రదర్శనశాలలకే తెప్పించుకొనవలయునను కోరికతో చిత్రనిర్మాతలకు డబ్బు ముందుగానే యివ్వసాగించిరి. ఇంతలోనే మంగ రాజుగారు "క్వాలిటీపిక్చర్సు" అను పేరుతో 1935 సం.లోనే ఒక పంపకపు సంస్థను విశాఖపట్టణము లో స్థాపించినారు.

ఈ సంవత్సరముననే "మద్రాస్ ఫిలిం లీగ్" అను సంఘమును స్థాపించి బాలెట్ ను నడప సాగించినారు. తెరమీద ముద్దులు పనికిరావనే విషయమును ఢిల్లీలో శాసనసభవారు చర్చించివారు.

ఆనాటి కృష్ణాపత్రికకు వడ్లమన్నాటి కుటుంబరావు మేనేజరుగా నుండెను. అతడు కృష్ణాపత్రికలో చిత్రాలను గూర్చి విమర్శలు వ్రాయ మొదలు పెట్టినాడు. దానితో తెలుగు ప్రముఖ పత్రికలలోను సినిమాలకై ఒక పుట కేటాయించిరి. అందు సినిమాలను గూర్చిన రచనలు వెలువడుచు వచ్చినవి.

1936—1940 : 1936 లో దక్షిణ దేశమున చిత్ర నిర్మాణశాల యున్నను, చిత్రనిర్మాణము చాలవరకు ఉత్తర హిందూ స్థానములోనే జరిగినది. చిన్నపిల్లలకై ధ్రువ, అనసూయ అను చిత్రములను సి. పుల్లయ్యగారు నిర్మించిరి. పిదప “ప్రేమవిజయ" మను మొదటి సాంఘిక చిత్రము వెలువడినది. బెజవాడలోని వ్యాపారస్థుల సంఘమువారు ఒక నిర్మాణసంస్థను పంపకపు సంస్థను సరస్వతీటాకీస్ అను పేర నెలకొల్పినారు. దానికి పారేపల్లి శేషయ్య ముఖ్యుడు.

సర్కారులనుండి పెట్టుబడిదారులు ముందుకు రాసాగినారు. ఇటు నెల్లూరునుండి కొందరు పెట్టుబడిదారులు, నిర్మాతలు వచ్చినారు. దానితో పోటీ ప్రారంభమైనది. తెలుగు పెట్టుబడిదారులు చిత్రనిర్మాణ శాల యొక్క ఉపయోగమును గుర్తించినారు. దాని ప్రతిఫలముగానే నిడమర్తి సోదరుల దుర్గాసినీటోను రాజమండ్రిలో నిర్మాణమయినది. ఆ దుర్గా సినీటొనునే సి. పుల్లయ్యగారు కౌలుకు తీసికొని “ఆంధ్రాటాకీసు" అను పేరు పెట్టి చిత్ర నిర్మాణము సాగించినారు. క్వాలిటీ పిక్చర్సు అనునది పూర్ణా పిక్చర్సు అను పేర బెజవాడకు మార్చబడినది.

ఈ కాలము సినిమా పరిశ్రమకు ఉచ్చదశ యని చెప్పవచ్చును. సాంఘిక చిత్రములకు, అందులోను సమస్యా చిత్రములకు మంచిలాభమున్నదని "మాలపిల్ల" చిత్రము నుండి నిర్మాతలు గ్రహించినారు. జాతీయాభ్యుదయ సందేశ చిత్రాలు వెలువడిన కాలము ఆది.

మద్రాసులో “జయా ఫిలిమ్స్ట్సు" అనెడు ఆంధ్రుల చిత్రనిర్మాణశాల యొక్క నిర్మాణము జరిగినది. విశాఖపట్టణములో "ఆంధ్రాసినీటోన్" అనెడు మరొక స్టూడియో నిర్మాణము జరిగినది. తమిళ చిత్రములో నటించిన ఆంధ్రుడగు 'వై. వి. రావును ఫిలిం బాలెట్ గౌరవించినది. మద్యపాన నిర్మూలనమునకు దోహద మిచ్చెడు గృహలక్ష్మి యను సాంఘిక చిత్రమును, మొదటి జానపద చిత్రమగు గులేబకావలియు నిర్మితములయినవి. వ్యావహారిక భాషను పురాణచిత్రములో ఉపయోగించి సి. పుల్లయ్యగారు "మోహినీభస్మాసుర "అను చిత్రమును సిద్ధపరచారు.

శారదా రాయలసీమ స్టూడియో నిర్మాణము జరిగి, పురిటిలోనే సంధిగొట్టిపోయినది. 1-8-1939 నుండి సినిమా టికట్లపై ప్రభుత్వము వినోదపు పన్ను విధించినది. సాంఘిక చిత్రాలు ఎక్కువగా వచ్చినవి. తారల గిరాకీ కారణముగా చిత్ర నిర్మాణ వ్యయము లక్ష రూపాయల వరకు పెరిగినది. 1939 లో పెట్టుబడి చాలినంత లేని సంస్థలు ఏర్పడి పెక్కు అగచాట్లపాలయినవి. కొన్ని సంస్థలు కాలగర్భములో లీనమైపోయినవి. సినిమా ఒక వ్యాపారము కాదు. అందులో మోస మెక్కువకలదు అనెడు భావము ప్రజలలో ప్రబలినది. దానితో పెట్టుబడి దారులు వెనుకకు తగ్గినారు.

1940 లో "చారిష్టరు పార్వతీశం" అను ప్రఖ్యాత నవలను అనుసరించి, సంపూర్ణ హాస్యచిత్ర నిర్మాణము జరిగినది. "చండిక", "కాలచక్రము" అను చారిత్రక చిత్రాలు వెలువడినవి.

యుద్ధము సినిమా పరిశ్రమపై దెబ్బతీయసాగినది. ముడిఫిల్ము కొరత ఏర్పడినది. యుద్ధనిధులకయి చిత్రాలు ఆడవలసి వచ్చినది. యుద్ధప్రచార చిత్రములను తీయుడని ప్రభుత్వము నిర్మాతలను కోరినది. కర్మశాలా చట్టము సినిమాలకు వర్తింపచేయబడినది. ఆపరేటర్లకు అనుమతి పత్రము (లైసెన్సు) ఉండవలెనని అది పరీక్షించి యివ్వబడునని ప్రభుత్వము శాసించినది.

చిత్రాలకుగూడ లాభాలు సరిగా రాలేదు. ప్లేబాకు పద్ధతి వచ్చినది. ఇది చిత్రమునకు ఎంతో మేలు చేసినది. ఇంతవరకు పాటను చిత్రీకరించుటగూడ మాటలను శబ్ద గ్రహణము చేసినట్టు చేసెడివారు. సెట్టుమీదనే వాద్యగోష్ఠికూడ ఉండెడిది. అయితే వాద్యగోష్ఠికి ఒక మైకు, నటునకు మరొక మైకు పెట్టి శబ్దగ్రాహకుడు సంయోగ పరచెడువాడు. అయితే, పరుగెత్తుచు, పాడుటకు వీలుండెడిదికాదు. అంతేగాక, నటులే పాడవలసివచ్చు చుండెను. అందరు నటులును పాడగలవారుగా నుండరు కదా! ఉన్నను సంగీతముమీద దృష్టి యుంచినపుడు నటనకు, నటనమీద దృష్టి యుంచినపుడు పాటకు లోపము జరుగుచుండెడిది. ఈ యిబ్బందులన్నియు ఈ 1940 నుండి తీరిపోయినవి.

ఈ కాలము నాటికి తెలుగులో సినిమా పత్రికయే లేదు. శ్రీ ఇంటూరి వేంకటేశ్వరరావు "చిత్రకళ” అను పేరుతో ఒక మాస పత్రికను ఆరంభించెను. అదే మన తెలుగు సినిమా పత్రికలలో మొదటిది.

1941–1942: 1941 లో వెలువడిన చిత్రములలో "మహాత్మాగాంధీ" అనునది మొదటి డాక్యుమెంటరీ చిత్రము. ఈ సంవత్సరమున చిత్రపరిశ్రమ యుద్ధము వలన పెద్ద దెబ్బ తిన్నది. పెట్రోలు దొరకుట కష్టమైనది. ముడి ఫిలుము లభించుట కూడ కష్టమయ్యెను. సినిమా పరికరముల విషయములో ప్రభుత్వము ఎక్కువ ఆంక్షలు పెట్టినది. ప్రతి వస్తువు యొక్క ధర పెరిగి పోయినది. బర్మా, మలయా రాష్ట్రములను జపాను పట్టుకొనుటచే, అక్కడికి మన చిత్రాలను పంప వీలు కాకుండ నైనది. కుల మత కలహాల వలన సినిమా చూచెడు ప్రేక్షకుల సంఖ్య సన్నగిల్లిపోయినది. వరదలు, గాలివానలు ఎక్కువైనవి.

ముడి ఫిల్ములకు కోటా సిస్టము వచ్చినది. అంతకు ముందు సంవత్సరాలలో చిత్రాలు తీయుచున్న వారికే చిత్ర నిర్మాణమునకు ప్రభుత్వమునుండి అనుమతి లభించుచుండెను. అందువలన క్రొత్తవారు పరిశ్రమలోనికి రాలేక పోయినారు.

ఏ పౌరాణిక కథనో తీసి నాలుగుపైనలు సంపాదించు కొనవలయుననెడు మనస్తత్వము నిర్మాతలకు ఏర్పడినది. అందువలన మరల ఈ రెండు సంవత్సరాలును పురాణ చిత్రాల యుగమయిపోయినది. అయితే, యుద్ధమువలన ప్రజల చేతులలో నాలుగు పైసలు ఉండుటచేత సంవత్సరాంతమునకు సినిమా ప్రేక్షకలోకము ఎక్కువైనది.

నిజముగా చారిత్రక చిత్రమనునది 1942 లో వచ్చినది. అదియే “పత్ని”. మొదటిసారిగా కవిజీవితమును ప్రతిపాదించు "పోతన" కూడ ఈ సంవత్సరమే వచ్చినది. చిత్రమ నిడివి 11 వేలకు మించియుండరాదని మరల మరి యొక ఆంక్ష వచ్చినది. దానితోపాటు ట్రైలర్లు గాని, ప్రచార చిత్రాలు గాని తీయగూడదని ఆదేశ ముండెను, 7-5-42 నాటికి పేపరు కంట్రోలు వచ్చినది. 23-11-42 నాటికి మద్రాసులో ఎలక్త్రి సిటీ కంట్రోలు కూడ ఏర్పడినది. ఇన్ని ఇబ్బందులతో పరిశ్రమ ముందుకు త్వరగా సాగలేక పోయినది.

ఇంతవరకు నొకసారి సమీక్ష చేసి చూతము, ఇంత వరకు వెలువడిన చిత్రాలు 105. అందులో 75 చిత్రాలు పౌరాణికములు ; ఒక చారిత్రక చిత్రము. చారిత్రకముల వంటి చిత్రములు రెండు. 20 సాంఘిక చిత్రములు, 2 డాక్యుమెంటరీ చిత్రములు, చిల్లరమల్లర చిత్రాలు 5.

ఇంతవరకు తెలుగువారి పెట్టుబడి దాదాపు 75 లక్షలు. వచ్చిన రాబడి 50 లక్షలు. పోగా 25 లక్షల రూపాయలు నష్టము. తారలలో పురుషులకంటే స్త్రీలకు వేతనాలు అధికము. ఈ కాలమునాటికి సినిమాలమీద ఆధారపడిన తెలుగువాండ్రకు భుక్తికి లోటులేకుండ పోయినది. పంపకము, ప్రదర్శనము (Exhibition), నిర్మాణము మున్నగు చిత్రశాలా శాఖలలో దాదాపు 25 వేల మంది తెలుగు వారు బ్రతుకుచున్నారు. స్టూడియోలు పెట్టిన తెలుగు వారికి కోలుకోలేనంత నష్టము ఏర్పడినది. చిత్రనిర్మాణము లోను పెక్కు సంస్థలు తబ్బిబ్బులయినవి. పంపక దారులు గూడ పెక్కుమంది రంగము నుండి నిష్క్రమించినారు. నిపుణులగు శబ్ద గ్రాహకులు గాని, ఛాయాగ్రాహకులుగాని తెలుగువారు చాలినంత మంది లేకుండిరి. అంతటను బెంగాలీల ప్రాబల్యమే ఏర్పడినది. ఇంతవరకు సినిమా పరిశ్రమ చాలవరకు అనుభవ శూన్యులును, సంకుచిత భావములను విడువలేని వారును అయిన వ్యక్తుల చేతులలో ఉండిపోయినది.

1943–1945 : 1943 లో పరిశ్రమ దిగజారి పోయినది. తెలుగు నిర్మాతలు తమిళచిత్రాలు తీయ మొదలు పెట్టినారు. 9-10-43 నుండి చిత్రాలతోపాటు “అప్రు వుడు ఫిల్ము" ఆడవలసి వచ్చినది. 1944 లో పరిశ్రమ యింకను దెబ్బతిన్నది. ఫిలిం ఛాంబర్ ఆలిండియా రేడియోతో ఒక ఒప్పందము చేసికొన్నది (7-8-44). దాని ద్వారమున సినిమా పాటను రేడియో వాడిన యెడల ఒక్కొక్క తడవకు ఒక రూపాయి చొప్పున లాభాంశము (royalty) నిర్మాతకు ఇచ్చుట జరుగసాగినది.

మొత్తము మీద ఈ మూడు సంవత్సరములు ఎక్కువగా చిత్రములు రాకుండుటకు కారణము ప్రభుత్వపు కంట్రోళ్ల వలన బాధయే కంట్రోళ్ళనన్నిటినీ 14-8-1945 కు రద్దు చేసినను పరిస్థితులు చక్కబడక పోవుటవలన ప్రయోజనము లేకపోయి నది. మద్రాసు ప్రభుత్వము డిప్లమా కోర్సొకటి నెలకొల్పి దానికై యొక పాలీటెక్నికు పాఠశాల పెట్టినది.

1946-1950 : ఈ అయిదు సంవత్సరముల కాలము జానపద యుగమని చెప్పవచ్చును. పరిశ్రమ కొంచెము బాగుపడెడు దారిలో పడినను, బాధలు తగ్గలేదు. ప్రభుత్వానుమతిపత్రముల పోకతో క్రొత్త నిర్మాతలు తలలెత్తినారు. రెండవ ప్రపంచ సంగ్రామ వ్యవహారములో దేశము మునిగియుండుటవలన కొత్త చిత్ర ప్రదర్శనశాలల నిర్మాణము కాలేదు. మొదటిసారిగా ఆటవిక చిత్రము "వనరాణి" వెలువడినది. 1-10-1946 నాటికి చిత్రముల నిడివి పై గల ఆంక్షను ప్రభుత్వము తొలగించినది. “ఆంధ్ర సినీ ఎంప్లాయీస్ అసోసియేషన్” అనెడు సంస్థ విజయవాడలో నెలకొల్పబడెను. ఇది సినిమా ఉద్యోగుల ట్రేడ్ యూనియన్.

1947 లో ఒక రూపాయకు 5 అణాల 4 పైనలు చొప్పున వినోదపు పన్ను ప్రభుత్వము తీసికొనసాగినది. నిర్మాణ వ్యయము మూడు మొదలు అయిదు లక్షల రూపాయల వరకు పెరిగిపోయినది. బ్రహ్మాండవిజయము సాధించుకొన్న “గొల్లభామ " తో జానపదాల వైపు నిర్మాతల దృష్టి మరలినది. కాంగ్రెసు పరిపాలనలో సెన్సారు నిబంధనలు కఠినమైనవి. ప్రభుత్వము ప్రకటించిన నిబంధనలకు కట్టుబడుటకు మొదట నిర్మాతలు కష్టపడినారు.

1948లో ద్రవ్యాభావముచేతను ముడిఫిల్ము సరిపడు నంత లేకపోవుటచేతను పరిశ్రమ ప్రగతిచూపలేకపోయినది. తెలుగువారు "చంద్రా ఆర్టు స్టూడియో” నిర్మించినారు గాని అది వెంటనే పడిపోయినది.

1949 లో తిరిగి "అప్రువుడు " ఫిలిములు ఆడవలసి వచ్చినది. A. (“పెద్దలకు మాత్రమే) V (అందరకు) అనెడు యోగ్యతా పత్రములు నెన్సారు బోర్డు ఇయ్యసాగినది. చిత్ర ప్రదర్శనశాలలలో పొగ త్రాగరా దనెడు నిబంధన యీ సంవత్సరమే ఏర్పడినది. ప్రభుత్వము మంచి చిత్రములకు బహుమతు లివ్వసాగినది. ప్రభుత్వము వారి యాజ్ఞ ప్రకారము విద్యాబోధన చిత్రాలను విద్యాలయములలో చూపుటకు అనుమతి పత్రములను (లైసెన్సు) పొంది కొందరు వ్యాపారము చేయసాగిరి.

1950 లో జానపద చిత్రము లనిన ముఖము మొత్తినది. ఇంతలో "సంసారం" అను చిత్రము వెలువడినది. దాని మూలమున చేకూరిన లాభమునుబట్టి ఆ చిత్రములో పనిచేసిన వారందరి సంసారములును బాగుపడెను. దానితో నిర్మాతలకు "సాంఘిక చిత్రములు" లాభదాయకము లనెడు భావ మేర్పడినది, తెలుగు సంస్థయయిన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీవారి “నవజీవన" అను తమిళ చిత్రమును ప్రభుత్వమువారు ఉత్తమ చిత్రముగా పరిగణించి దానికి ట్రోఫీని ప్రసాదించిరి. తెలుగులో మొదటి డబ్బింగుచిత్రము "ఆహుతి".

1951-1956: 1951 లో ముడిఫిలము ధారాళముగా దొరకసాగినది. ఎక్కువమంది చిత్రనిర్మాణ రంగములోనికి దూకినారు. జానపద చిత్రములు దెబ్బతిన్నవి. ప్రొజెక్టర్లను ప్రతి పాఠశాల కొనవలయునని ప్రభుత్వము వారు ఆదేశించినను, కొన్ని పాఠశాలలు మాత్రమే కొనుట చేత ఒక లక్షరూపాయలవరకు ప్రదర్శకులకు నష్టము వచ్చినది.

1952 సినిమా పరిశ్రమకు మంచి ఉచ్చదళ. 1951 లో తీసిన చిత్రాలవలన నిర్మాతలకు కనకవర్షము కురిసినది.ఆ డబ్బు చూడగానే ఏమి చేయవలయువా అన్న స్థితికి వారు వచ్చినారు. క్రొత్త నిర్మాతలు ఎందరో రంగములోనికి దిగినారు, మొయిలుచూచి చెరువుకట్ట తెగగొట్టు కొన్నట్లు పాతనిర్మాతలు విశేష ద్రవ్యమును వ్యయించి చిత్రనిర్మాణశాలలు కట్ట సాగించినారు. అట్లు వచ్చిన తెలుగు చిత్ర నిర్మాణశాలలు 1. భరణి. 2. నరుసు, 3. ప్రకాశ్, 4. రోహిణీ లు. అంతవరకు సహాయకులుగా నున్న వారికి ఉన్నతిని కల్పించి క్రొత్త నిర్మాణశాలలలో "వారిని నిపుణులనుగా చేసి కొన్నారు. ఎన్నో చిత్ర నిర్మాణములు బయలు దేరుటతో క్రొత్త రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రంగములోనికి ప్రవేశించినారు.' పంపక దారులు పరిశ్రమలో పాదుకొన్న వారికే డబ్బు పెట్టుచుండిరి. అందువలన, తక్కువ ధనముతో చిత్ర నిర్మాణరంగములోనికి దిగిననిర్మాతలకు ధనలోపము చేత చిత్ర నిర్మాణశాలలలో పని లేకపోయినది. పనివాండ్రకు జీతాలు ప్రయాసమీద చిత్రనిర్మాణశాలాధిపతులు ఇయ్యవలసి వచ్చినది. పెరుగుట విరుగుట కొరకే అన్న సిద్ధాంతము నిజమయినది. సాంఘికములకే కొంత ధన లాభము ఏర్పడినది. కాని మొత్తముమీద ఈ సంవత్సరము చిత్రములు అంత విజయవంతములు కాలేదు.

స్త్రీ దర్శకత్వములో దక్షిణ హిందూస్థానము నందు బయలుపడ్డ చిత్రము “చండీరాణి". దానికి దర్శకత్వము వహించినది శ్రీమతి పి. భానుమతి. అందులోను ఒకేసారి మూడు భాషలలో నిర్మాణము సాగించినది. ఎక్కువగా డబ్బింగు చిత్రాలు బయటికి వచ్చినవి. తెలుగువారు చాల మంది సాంకేతిక నిపుణులుగా తయారయినారు.

ఉపసంహారము  : మొత్తముమీద సగటున సంవత్సరమునకు 35 చిత్రములు వచ్చినవి. 27-3-1955 నాటికి "ఆంధ్రా సినిమా రెగ్యులేటింగు యాక్టు' ప్రచురించినారు. 1956 నాటికి తెలుగువారికి మద్రాసులో ఆరు స్టూడియో లున్నవి. భరణి, రోహిణి నరుసు, ప్రకాశ్, వీనస్, వాహిని అనునవి వాని పేర్లు వాహినీలో మాత్రమే లేబరేటరీ ప్రోసెసింగులు ఉన్నవి జయా లేబరేటరీ అనునదొకటి కలదు. ఆంధ్రులకు పంపకపు సంస్థలు 57 వరకు ఉన్నవి. అందులో రెండు మూడు సంస్థలు పాశ్చాత్య చిత్రముల పంపకముకూడ చేయుచున్నవి. ఒకటి 16 M. M. చిత్రములు పంపకము చేయుచున్నది. విజయవాడ, గుంతకల్లు పంపకపు కేంద్రాలుగా నున్నవి.

ఆంధ్రులకు (1) ఆంధ్రసినీ ఎంప్లాయిసు అసోసి యేషను, (2) ఆంధ్రా ఫిలిం ఛాంబరు ఆఫ్ కామర్సు (3) పిల్లల చిత్రాలదర్శిని అనుసంస్థలు ఉన్నవి.

తెలుగులో పాతికపయిగా పత్రికలు సినిమా విషయములకు ప్రాముఖ్యము నిచ్చుచున్నవి. 1955 నుండి చిత్రపరిశ్రమకు మంచియోగము పట్టినట్టున్నది.

ఇప్పుడాంధ్రప్రదేశములో మూడువందల యిరువదికి పైగా ప్రదర్శనశాలలున్నవి. నూరు వరకు సంచరించే చిత్రప్రదర్శన శాలలు ఉన్నవి. 1918 కి పూర్వము జొ బయాన్కోవు పేర సంచరించు చిత్రప్రదర్సనశాలలను నడి పెడివారు. ఆరోజులలో ఇప్పటివలె డేరా లుండెడివి కావు. చుట్టును గుడ్డతెరమా త్రముండుచుం డెను. తెరదగ్గర మాత్రము చిన్న పందిరి ఉండెడిది. ప్రొజెక్టరులో ఆర్కు లాంపునకు బదులు కార్యైడు లైటు ఉపయోగించెడు వారు. ప్రొజెక్షను యంత్రము చేతితొ త్రిప్పెడువారు. రెండు గ్యాసులైట్లు తెరదగ్గర కట్టి పెట్టెడివారు. ఆట ఆరంభించుటకు ముందు ఆ రెండు లైట్లను దీపాలలోనికి దింపెడువారు.

1919 లో రఘుపతి వెంకయ్యగారు ఇంజను డైనమోతో కూడిన సంచార చిత్రమును ఆంధ్రదేశములో ప్రథమ పర్యాయము ప్రదర్శించినారు.

సంచారచిత్రములకు ప్రభుత్వము అనుమతి పత్రములు, నిబంధనలు పెట్టుటతో కొంతవరకు ప్రదర్శన శాలాధిపతు లకు నెమ్మది చిక్కినది.

ఈ ప్రదర్శన శాలాధిపతులకు కొందరకు ఆంధ్రలో సర్క్యూట్లు ఉన్నవి. అవి :

1. ప్రసాద్ బ్రదర్సు సర్క్యూటు: వీరికి విశాఖపట్టణము, విజయవాడ, మచిలీపట్టణము, గుంటూరులలో హాలులు కలవు.

2. కాజ వెంకట్రామయ్య సర్క్యూటు: వీరికి విజయనగరము, ఏలూరు, గుడివాడ, రాజమండ్రులలో ప్రదర్శనశాలలు గలవు.

3. సెలెక్టు పిక్చరు సర్క్యూటు: ఈ కంపెనీవారికి విజయనగరము, విశాఖ పట్టణము. విజయవాడ, బందరులలో ప్రదర్శనశాలలు ఉన్నవి.

4. నిడమర్తి సర్యూటు: వీరికి విజయనగరము, విశాఖపట్టణము, రాజమండ్రులలో ప్రదర్శన శాలలు ఉన్నవి.

ప్రస్తుతము ఆంధ్రలో త్రై పరిమాణిక (Three dimesional) చిత్రాల ప్రదర్శనమునకు గాని, సినోరమాలకు గాని సరిపడెడు సినోరమిక్ తెర, కటకములు, పరికరాలు గల ప్రదర్శనశాల విజయవాడలో గల లీలామహలే అది ప్రసాద్ సర్క్యూటు వారిది.

చిత్రనిర్మాతలు దాదాపు 40 మందికి పై గానున్నారు. తెలుగు చిత్రాలు నిర్మించెడు అంధేతర సంస్థలు దాదాపు 15 వరకు నున్నవి.

సి. యస్. ఆర్./బి. వి. యస్. ఎ.

[[వర్గం:]]