Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రులు - వాణిజ్యము

వికీసోర్స్ నుండి

ఆంధ్రులు - వాణిజ్యము  :- క్రీస్తుకు పూర్వకాలమున ఆంధ్రదేశము అరణ్యములతో నిండియుండి, చిరుత పులులు, పెద్దపులులు, ఏనుగులు, పాములు మొదలగువానికి ఆకరమై అక్కడక్కడ నివాసము లేర్పరచు కొన్న జాతులతో జనపదములతో విలసిల్లి యున్నట్లు వర్ణింపబడినది. కాని క్రమముగా జనసంఖ్య అభివృద్ధిచెంది పల్లెలు, పట్టణములు ఏర్పడి, పరిపాలనా విధానము నిర్మితమయి, ఆంధ్ర శాతవాహన రాజుల కాలములో ఉజ్జ్వలమైన నాగరికతను ఆంధ్రదేశము అనుభవించినది. నాగరకతతోపాటు వర్తక వ్యాపారాదులు అభివృద్ధిచెంది స్వదేశములోనే కాక విదేశాలలో కూడ అభిమానింపబడిన వస్తువులను ఉత్పత్తిచేసి ఓడలలో వాటిని ఇతర దేశాలకు ఆంధ్రదేశము పంపినట్లు తెలియుచున్నది. దక్షిణాపథము నకు తూర్పున, పశ్చిమమున ముఖ్యమయిన రేవుపట్టణాలు అభివృద్ధి చెందినవి. ఆంధ్ర సముద్ర తీరాలలో ఓడలను కట్టుట, వాటిని మరమ్మతు చేయుట, క్రొత్త ఓడలతో సముద్రయానము సాగించుట మున్నగు పనులు విరివిగా జరిగినవి. శాతవాహనుల రాజధాని కృష్ణాజిల్లా లోని శ్రీకాకుళము. శాతవాహన రాజుల నాణెములపై ఓడను చిత్రించుటవలన విదేశీయానము, వ్యాపారము విశేషముగ అభివృద్ధిగాంచినట్లు మనముఊహించవచ్చును.

శాతవాహనుల కాలమునాటి వర్తక వ్యాపారములకు ఆస్పదమైన రేవు పట్టణములు ఇప్పుడు శిథిలావస్థలో కనుపించు చున్నను ఆనాడు వైభవోపేతములైన వర్తక కేంద్రాలుగా ఉండినట్లు చరిత్రకారుల రచనలనుబట్టి తెలియుచున్నది. క్రీ. శ. 174-203 వరకు పరిపాలించిన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి విదేశ వ్యాపారమును విరివిగా ప్రోత్సహించినాడు. ఘంటసాల రేవు, గూడూరు రేవు ప్రసిద్ధిగాంచినవి. పెరిప్లస్ అను గ్రంథములోను, టాలెమీ అనునతడు రచించిన ఆనాటి భూగోళ గ్రంథములోను ఈ రేవులు పేర్కొనబడినవి. ఘంటసాలను 'కొంట కొల' అనియు, గూడూరును 'కొడ్డూరు' అనియు వారు పేర్కొనిరి. కృష్ణానదీ ముఖద్వారమును మసేలియా అనియు, మచిలీపట్టణము రేవును 'మైసోలస్' అనియు వ్యవహరించినారు. ఆంధ్రదేశములో దొరకిన రోమను చక్రవర్తుల బంగారు నాణెములు ఘంటసాల రేవుపట్టణ మున జరిగిన వ్యాపారములో వచ్చినవే. పెరిప్లసు అను గ్రంథములో పశ్చిమమున 'భృగు కచ్చ'ము అను నేటి బ్రోచ్ రేవుపట్టణమును 'చారి గాజా ' అని పేర్కొని దక్షిణదేశ వ్యాపారము ఇక్కడినుండికూడ విరివిగా జరిగినట్లు తెలిపిరి. ఈ దేశమును తెలిపిరి. ఈ దేశమును 'అరియకం' అనిరి. అందులో

లంబోదరు డను శాతవాహన రాజు. దీనిని అందులో పరిపాలించినట్లు చెప్పబడి ఉన్నది. రోము నగరము తోడనేగాక ఈజిప్టుతో కూడ సన్నిహిత వర్తకము జరిగినది. ఈజిప్టు దేశములోనికి వర్తక వ్యాపారాలకోశము 'సుబ' JJ' అను భారతీయుడు వచ్చినాడని ఈజిప్టు శాసనములలో పేర్కొనబడి ఉన్నది. దక్షిణమున కావేరి పట్టణ మనబడు 'కమరా' రేవు విదేశ వ్యాపారములో ఘనత కెక్కినది. ఇదిగాక క్రీస్తు పూర్వమునుండి జైన బౌద్ధమత ప్రచారమునకై విదేశాలకు యాత్రీకులను చేర వేసిన కళింగపట్టణము రేవు కూడ ప్రాచీనమైనదే. ఈ రేవులో ఓడలను ఎక్కి విజయుడను కళింగరాజు 700 మంది బౌద్ధ బిక్షువులతో సింహళము చేరినాడని ఔద్ద గ్రంథములు తెలుపుచున్నవి. కాకినాడకు పదిమైళ్ళదూర ములో కోరంగి అను ప్రాచీన రేవుపట్టణము ప్లినీ కాలమునాడు ప్రసిద్ధికెక్కినది. ఇక్కడ నౌకా నిర్మాణము విరివిగా జరిగినది. శాతవాహన రాజ్యములో ఒక భాగమైన నేటి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరీ ముఖద్వారములో ప్రాలూరు అను రేవుపట్టణముండెను. దీనిని టాలెమీ తన భూగోళములో పేర్కొనెను. శాతవాహనుల కాలములో చైనా, బర్మా, మలయా, రోము, ఈజిప్టు మొదలగు దేశాలతో ఆంధ్రదేశము విరివిగా విదేశవ్యాపారము జరిగించినట్లు స్పష్టముగా తెలియు చున్నది. వ్యాపార వస్తువులలో ఆంధ్రదేశమునుండి వజ్రములు, అద్దకపు బట్టలు, డక్కా మజ్లినులవంటి సన్న బట్టలు, బియ్యము, ఎగుమతి అగుచుండెను. దిగుమతులలో బంగారము, వెండి ముఖ్యముగా చెప్పదగినవి. వస్తువుల వ్యాపారముతోబాటు, ఆంధ్రదేశము నుండి బర్మా, మలయా, సయాం దేశాలకు కోడూరు రేవునుండి వెడలిన యాత్రిక నౌకల ద్వారమున బౌద్ధమతము వ్యాపించినది.

శాతవాహనుల తరువాత ఆంధ్రులను సామ్రాజ్య స్థావనకు తయారుచేసి ఆంధ్ర సామ్రాజ్యమును సుమారు మూడువందల ఏండ్లు పరిపాలించినవారు కాకతీయులు. వీరి రాజ్యకాలములో గణపతిదేవుడను రాజు విదేశ వ్యాపారమును ప్రోత్సహించి నట్లు మోటుపల్లి శాసనము వలన తెలియుచున్నది. కాకతీయ సంచికలో శ్రీ రాళ్ల బండి సుబ్బారావుగారు “గణపతిదేవుని కాలమున, తూర్పు తీరము జయింపబడినతోడనే విదేశములతో వర్తకము విరివిగా సాగనారంభించెను. గుంటూరుజిల్లాలోని మోటుపల్లి గొప్ప రేవు పట్టణమై వరలెను. తూర్పునందు బర్మా,చైనా, తూర్పు దీవులు, సింహళము మున్నగువాటి తోడను, పశ్చిమమునందు అరేబియా, పారశీకము, ఈజిప్టు మొదలగు దేశముల తోడను, వర్తకము సాగుచుండెను. గణపతిదేవుని మోటుపల్లి శాసనమునుబట్టి విదేశ వర్తకమును వృద్ధిచేయుటకై అతడు 'కూఫ' శుల్కము తప్ప తక్కిన పన్నుల నన్నిటిని రద్దుచేసినట్లును, వర్తకులను, వారి యోడలను రక్షించినట్లును తెలియుచున్నది. అతడు ఓడదొంగలను శిక్షించెను; ఆయా వస్తువులపై సుంకముల నిర్ణయించెను. ఆ కాలమున శ్రీగంధము, కర్పూరము, ముత్యాలు, దంతము, లోహము, నూలు బట్టలు, కంబళ్ళు, సుగంధ ద్రవ్యములు, మిరియాలు, రత్నములు ఎగుమతి చేయబడుచుండెను. పట్టు సామానులు, గాజు, చీనాకర్పూరము, పంచదార, గుఱ్ఱములు, దిగుమతి యగుచుండెను. ఇట్లే మచిలీపట్టణముగూడ ఆ కాలమున గొప్ప ఓడరేవుగాను, వర్తక స్థలముగాను ఉండేను."

కాకతీయుల కాలమునాటి పరిస్థితులను మార్కో పోలో అను విదేశయాత్రికుని వర్ణనల వలన తెలిసికొనవచ్చును. మోటుపల్లి రేవునుండి సాలీడు దారమువలె సన్నముగా ఉండెడు గుంటూరు పత్తిదారముతో నేసిన మల్లు సెల్లాలు ఎగుమతి అగుచుండెడివట. మోటుపల్లి వద్ద వజ్రాల గను లుండెడివని 'నికోలో కొంటి' అను ఇంకొక యాత్రికుడు వ్రాసినాడు. ఈ జిల్లాలో దొరకిన రోమను బంగారు నాణెములు విదేశవర్తకములో ఆంధ్రులు సంపాదించుకొన్న వని మనకు తెలియుచున్నది. కాకతీయులు స్వయముగా నాణెములను ముద్రించి వ్యవహారములో ఉంచినట్లు వ్రాయబడి ఉన్నది. ఆనాడు దేశములో వర్తకపు వస్తువులమీద పన్నులను కాకతీయులు విధించినట్లు తెలియుచున్నది. వీటినే ఇప్పుడు మనము "వ్యాపార సుంకములు" (Commercial Taxes) అని అనుచున్నాము. వరంగల్లుకోటకు పోవు మార్గములో, ఖానాసాహెబుతోట వద్దనున్న శాసనములో, దేశవ ర్తకముపై ఆనాడు విధింపబడిన పన్నులు ఈ క్రిందివిధముగా వర్ణింపబడినవి :-- నీలి - మాడకు రెండు వీసాలు, పోకలు లక్షకు పాతిక, కూరగాయలు బండికి పాతిక, మామిడి, కొబ్బరి మొదలయినవి బండికి పాతిక, నూవులు, గోధుమలు,పెసలు, వడ్లు, జొన్నలు - బండికి మానెడు, ఉప్పు- బండికి పది పెరుకల మానెడు- ఆవాలు మొదలగు కొలబండాలు మాడకు పాతిక, తగరము, సీసము, రాగి, తులము 1 కి ఒక పలము, చందనము తులము 1 కి ఫలము ; కర్పూరము వీసెకు 2 చిన్నాలు. జవాది మాడ (కు) పరక, కస్తూరి – 100 చిన్నాలకు 2 చిన్నాలు. పట్టు నూలు - తులం 1 కి చిన్నము, ఇవిగాక మంజిష్ఠము, ముత్యము, రుద్రాక్ష, గాటపూస మున్నగు వాటి యందును, పసుపు, ఉల్లి, జాజు, కంద, పెండలము మొదలగు ధుంపదినుసులయందును వర్తకము జరుగుచుండెడిది.

కాకతీయుల సామ్రాజ్యానంతరము ఆంధ్రదేశములో స్థాపించబడినది విజయనగర సామ్రాజ్యము. ఆ కాలములోనే మధ్యాంధ్ర, ప్రాగాంధ్ర ప్రాంతములలో రెడ్డి రాజులు బలిష్ఠమైన దుర్గములను నిర్మించుకొని రాజ్యము చేసిరి. వినుకొండ, కొండవీడు, ఉదయగిరి, నెల్లూరు, కొండపల్లి, నిడదవోలు మున్నగు దుర్గములకు అధిపతులయిన రాజుల రాజ్యములు అవిచ్ఛిన్నములుగా సాగినవి. వర్తక వ్యాపారాలు విజృంభించినవి. లలితకళలు కొనసాగినవి. చిన్న చిన్న పరిశ్రమలు అనేకములు అభివృద్ధి చెందినవి.

పరిశ్రమలు : గ్రామము పరిశ్రమలకు మూలాధారముగా ఉండెడిది. విశ్వకర్మ పుత్రులగు కంసాలి, కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, సాలె, గృహ నిర్మాణకర్త అనువారు బయలుదేరినారు. శివలింగ నిర్మాణములోను, దేవాలయ నిర్మాణములోను ఎక్కువ ప్రతిభ వ్యక్తమగుచుండెడిది. సొమ్ములు చేయుట యొక ప్రత్యేక కళగా వర్ధిల్లెను.రెడ్డిరాజుల వైభవమునకు తగినట్లుగా సొమ్ములు చేయుట విశేష ప్రతిభావంతమైన పరిశ్రమగా తయారయినది విజయనగర సామ్రాజ్యమునందలి సింహాసనమును గురించి అబ్దుర్ రజాకు అను నాతడు "చాల పెద్దదిగా బంగారుతో చేయబడిన ఈ సింహాసనము మణులతో పొదగబడి, ప్రపంచములో ఎక్కడను లేని పనితనముతో కూడినది" ఆ వ్రాసెను. ఇటువంటి సింహాసినములు అనాడు విరివిగా తయారైనవి. రాగి, ఇత్తడి, కంచు. ఇనుము మున్నగు లోహ పరిశ్రమలు బాగుగా ఆభివృద్ధిగాంచినవి. అనపోతారెడ్డి ద్రాక్షారామ భీమేశ్వరునకు పెద్దగంట సమర్పించెను. కొయ్య చెక్కడాలు, దంతపు పనులు, ఇనుముపోత, వజ్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధికాంచినట్లు మార్కొపోలో వర్ణించినాడు. వినుకొండ, పల్నాడు తాలూకాలలో బట్టల పరిశ్రమ కేంద్రీకృతమయినది. రంగుల అద్దకము విస్తారముగా జరిగినది. సూరవరము, కామవరము బట్టలు అతి ప్రసిద్ధిగాంచినవి. పెక్కు రకాల పట్టుగుడ్డలు వాడుకలో నుండెను. వెలిపట్టు, నీలిపట్టు, హోంబట్టు, నేత్ర పట్టు, వజ్రపట్టు అను రకాలు రంగురంగుల పట్టు బట్టలను తెలుపుచున్నవి.పెదగంజాము, చినగంజాము, ఉప్పుగుండూరు, ఉప్పరాట్ల మొదలైన గ్రామాలలో ఉప్పు తయారయినది.

వ్యాపార మార్గాలు  : విజయనగరము, కందుకూరు, అద్దంకి, కొండవీడు, కొండపల్లి, నిడదవోలు మొదలైనవి 'వ్యాపార కేంద్రాలుగా ఉండెడివి. నదులను "పుట్టి” అనే చిన్న చిన్న పడవలలో దాటెడువారు. కనుకనే సంసార ములో ఎవరి పరిస్థితి అయినను బాగుగ నుండనిచో "వాని పుట్టి మునిగినది' అందురు. వ్యాపారములో పెరుకలు అను గోనెబస్తాలను వాడెడువారు. ఇవి అటు, ఇటు రెండు పెద్ద సంచులుగ నుండి మధ్యభాగమున మూతిని కలిగి, గాడిదమీద వేయుటకు వీలుగా ఉండును. ఈ పెరుకల వ్యాపారముచేయువారు ఆ పేరుగల ఒక కులముగా వ్యవహరింప బడినారు. వీరు బలిజలతో సన్నిహితముగా ఉండుచుందురు. శ్రీశైలము, త్రిపురాంతకము మీదుగా అయోధ్యకు ఏకమార్గము ఉన్నదట! శాతవాహనుల కాలము నుండి ఆంధ్రదేశములో వృత్తిసంఘాలు ఉన్నట్లు శాసనాల మూలమున తెలియుచున్నది. శ్రేణులు. సమయములు అని ఈ సంఘాలకు పేళ్ళు. ఇవి అష్టాదశ సంఖ్యాకముగా ఉన్నవట! తెలకులకు ప్రత్యేక సంఘాలు శాతవాహనుల నాటి నుండి తిలపిష్టకాలను పేరుతో ఉండెడివి. వేంగి పరిపాలకుల కాలములో వేయికుటుంబాల తెలకులు ప్రసిద్ధులైనారు. 'వీరభలంజ్య సమయ ' మనునది వ్యాపారస్థుల సంస్థ. దానిని గురించి కొంత చింతపల్లి శాసనములో ఉదహరింపబడినది. వ్యాపారస్థులు గుంపులు గుంపులుగా వర్తకమునకు బయలు దేరెదరు. ఉత్తర హిందూస్థానములో ఉన్న బేరారునకు ఆంధ్రదేశము నుండి బయలుదేరిన వర్తకబృందము వేయి ఎద్దులమీద సామాను వేసికొని బయలు దేరినదని ఫెరిస్ట్గా వ్రాసినాడు. సుంకాలు కట్టుకొనుచు వెళ్ళెడువారు. సుంకాల లెక్కలు తేల్చువారిని సుంకము కరణా లందురు.వ్యాపార సమయాలకు సంబంధించిన సమావేశాలు,తీర్పులు, దేవాలయ ముఖమండపాలలో జరుపుచుండెడు వారు.

విదేశ వ్యాపారము  : శాతవాహనుల నాడే ఆంధ్రులు నౌకాయానమునకు ప్రసిద్ధిచెందినారు. చాళుక్యరాజైన మొదటి శక్తి వర్మ నాణెములు బర్మాలోను, సయాంలోను దొరికినవగుటచే, ఆంధ్రులు వ్యాపారరీత్యా ఆదేశాలకు విరివిగా వెళ్ళినట్లు తేలుచున్నది. కాకతీయుల అనంతరము విదేశ వ్యాపారమునకు ఊత ఇచ్చినది ప్రోలయ వేమారెడ్డి. అనపోతారెడ్డి మోటుపల్లి రేవును బాగుచేయించి విదేశ యాత్రీకులను ఆహ్వానించినాడు. దొంగలనుండి కాపాడు ఏర్పాట్లు చేయించి సుంకముల విషయములో ఎన్నో సదుపాయాలు ప్రకటించినాడు. మిగత సుంకాలను ఈ క్రింది విధముగా తమిళభాషలో వ్రాయించినాడు:

"దక్షిణదేశమునుండి వచ్చు సామానులు 100 కట్టలకు - 3 కట్టలు ; 100 వస్త్రాలకు - 2 నాణేములు, ఉత్తరమునుండి వచ్చెడు వస్తువులు 100 కట్టలకు - 5 కట్టలు; 100 వస్త్రాలకు 3 నాణెములు; విదేశాలకు వెళ్లు వస్తువులు - 100 గుడ్డలమీద 3 నాణెములు. 100 ముత్యాల మీద 7½ నాణెములు." ఆ కాలములో మోటుపల్లి ప్రధానమైన రేవుగా నుండెడిది.

పడవలు నాలుగు రకాలు - కప్పలి : ఇది పాశ్చాత్య నౌకలకంటే పెద్దదిగా ఉండి ఐదు తెరచాపలు కలిగి ఉండెడిదట.

జొంగు : ఇది చీనా, భారతదేశాల వాణిజ్యము కోసము నిర్మింపబడిన ప్రత్యేక నౌక, ఇట్టి పడవలు చీనాలో తయారు చేయబడు చుండెడివి.

వల్లి: వాల్లిక - వీటిని గురించిన వివరాలు తెలియవు. దిగుమతులు - ఎగుమతులు : శ్రీనాథుడు హరవిలాసములో ఆనాటి వ్యాపారమును ఈ క్రింది విధముగా వర్ణించినాడు :

Caption text
దేశము పేరు దిగుమతియైన వస్తువు
చీనా పట్టు గుడ్డలు
సింహళము ఏనుగులు, రత్నాలు
పంజార (సుమత్రా) కర్పూరము
జలనొంగి (మలయా) బంగారు మొలక
హురుమంజి (పర్షియాలోని హురుమజ్ పట్నము) గుఱ్ఱములు
గోవా సంకుమదద్రవము -(జవాది)
యంప (జాఫ్నా) ముత్యాలు
భొటా (భూటాన్) కస్తూరి
తరుణాసిరి చందనము
తావాయి అగరు
గోవా కర్పూరము
రమణ హిమాంబువు (Rose water)
ఇందులో తరుణాసిరె Tennasirin Coast of Malaya
తావాయి Tavoy in Martaban Peninsula
రమణ Ramanna desa in Pegu భాగవతములోని రమణక ద్వీపము

"చీని సింహళతవాయి హురుమంజి జోణంగి, ప్రభృతి నానాద్వీప నగరాకరంబగు ధన, కనక వస్తు, వాహన, మాణిక్య గాణిక్యంబులు దెప్పించి" అని హరవిలాసములో చెప్పబడిన దానినిబట్టి విదేశ వ్యాపారము విశేషముగ జరుగుచుండెడిదని గమనింపవచ్చును. దిగుమతులను గురించి ఇన్ని వివరాలు తెలిపిన శ్రీనాథుడు ఎగుమతులనుగూర్చి ఎక్కువగా చెప్పలేదు. వస్త్రములు ఎక్కువగా ఎగుమతి అయినట్లు తెలియుచున్నది. డమాస్కస్ లో కత్తులు తయారుచేయుటకు వీలైన ఇనుము పల్నాడు తాలూకానుండి అచటికి పంపబడినదట!

ఆధునిక యుగము  :- ఈ విధముగా అభివృద్ధిగాంచిన విదేశ వ్యాపారము యావత్తు మహమ్మదీయ బ్రిటిషు దండ యాత్రల మూలమున విచ్ఛిన్నమై ఆధునిక కాలములో నూతన రూపాలు దాల్చినది. పోర్చుగీసువారు, ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు ఆంధ్రదేశములో తమ వర్తక కేంద్రములు నిర్మించుకొని వ్యాపారము సాగించినారు.కాలక్రమమున నౌకాయాన ప్రాబల్యము పాశ్చాత్యుల హస్తగత మయినది. వారి ఓడలు ఆంధ్ర సముద్ర తీరములో నిలిచి వ్యాపారము సాగించినవి. ఆంధ్ర సముద్రతీరము పొడుగునను కోటలు నిర్మించుకొని ఆంగ్లేయులు వర్తకము సాగించినారు.

భీమునిపట్నం  :- ఇక్కడ 1628 లో డచ్చివారు ఒక కోటను, ఫ్యాక్టరీని నిర్మించినారు. బట్టలు ఉతికే మూడు చాకిరేవులు నిర్మించినారు. 1824 లో ఈ పట్టణము ఇంగ్లీషువారి వశము అయినది. గోనె సంచులు, నువ్వులు,నేతబట్టలు ఎగుమతి అగుచుండెడివి. ఏడు యూరోపియన్ కంపెనీ లుండెడివి.

విశాఖపట్టణము  :- 1682 అక్టోబరులో ఈస్టుఇండియా కంపెనీవారు ఈ రేవును కౌలుకు తీసికొని ఫౌజుదారు సహాయముతో వ్యాపారము సాగించినారు. 1685 లో ఫ్యాక్టరీ నిర్మాణము జరిగినది. 1687 లో సలాబత్ జంగ్ వద్దనుండి ఇంగ్లీషువారు ఆక్రమించినారు. 1802 లో శాశ్వత నిర్ణయము జరిగినది. పాలకొండ ఎస్టేటును ఆక్రమించి ఆర్బత్ నాటు కంపెనీకి కౌలు కిచ్చినారు. ఈ కంపెనీ, చిట్టివలసలో ఫ్యాక్టరీ నిర్మించినది. ఇది 1867లో గోనె సంచుల ఫాక్టరీగా మారినది. ఏడాదికి 20 లక్షల సంచులు ఉత్పత్తి అయ్యేడివి,

కోరంగి  :- ప్రాత కాలపు కోరంగి రేవు ప్రాముఖ్యము తగ్గిన తరువాత 1789 లో టాపింగ్ అను మదరాసు ప్రభుత్వపు భూగోళశాస్త్రజ్ఞుడు తాను కోరంగి వచ్చినప్పుడు అక్కడికి ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, ఇంగ్లీషు నావలు వచ్చెడి వనియు, దొంగల బాధ వివరీతముగా ఉండెడిదనియు వ్రాసినాడు. 1759 లో వెస్టుకాట్ అనే ఇంగ్లీషువర్తకుడు కోరంగి రేవును మరల కట్టించినాడని 1877-78 లో 8,22,000 రూపాయల వ్యాపారము ఈ రేవుగుండ జరిగినది. తాళ్ళరేవు  : నౌకల మరమ్మతు కొంతకాలము జరిగిన తరువాత 1802లొ ఇచెంజర్ రోబన్ అను ఇంగ్లీషు వర్తకుడు ఇక్కడ డ్రైడాక్ నిర్మించినాడు. ఆల్బాట్రాప్ అను నౌకను ఇక్కడ బాగుచేసినారు.

ఇంజరం  :- ఇది కాకినాడకు 15 మైళ్ళ దూరములో ఉన్నది. 1708 లో తూర్పు ఇండియా సంఘమువారు ఫ్యాక్టరీని నిర్మించినారు. 1722 లో ఈ ఫ్యాక్టరీలో ఇండియాలోకెల్ల శ్రేష్ఠమైన లాంగ్ క్లాత్ ఉత్పత్తి అయ్యెడిదని కెప్టెన్ హామిల్టన్ వ్రాసినాడు.

యానాం  :- ఇక్కడ ఫ్రెంచివారు 1750 లో ఫ్యాక్టరీని నిర్మించిరి.

నీలపల్లి  :- ఫ్రెంచివారు 1751 లో బట్టల మిల్లు స్థాపించినారు. 1854 లో ఫ్రెంచి ఇంజనీరు బియ్యపు మిల్లు పెట్టినాడు. నీలిమందు ఫ్యాక్టరీగా ఇది కొన్నాళ్ళు పనిచేసినది.

మాధవాయపాలెం  :- 1628 లో నరసాపురములో డచ్చివారు ఇనుపకార్ఖానా పెట్టుకొన్నారు. ఇక్కడ 1677 లో ఫ్యాక్టరీని నిర్మించినారు. పెద్ద పెద్ద ఓడలు ఇక్కడ మరమ్మతు అగుచుండెడివి.

బందరు  :- 1611 లో తూర్పు ఇండియా సంఘము వారు ఫ్యాక్టరీని నిర్మించినారు. ఇక్కడినుండి మస్లినులు ఎగుమతి అగుచుండెడివి. 1614 లో డచ్చివారును, 1669 లో ఫ్రెంచివారును వ్యాపారమును ప్రారంభించినారు.

కృష్ణాపట్నం  :- 13 వ శతాబ్దము నాటినుండి "కొల్లి త్తురై " అను పేరుతో ఇక్కడ గొప్ప రేవుపట్టణము ఉండెడిది. 18 విదేశాలనుండి వచ్చిన 500 మంది వర్తకులు ఇక్కడ చేరినారని ఒక శాసనము చెప్పుచున్నది.

ఆంధ్రరాష్ట్రము - వాణిజ్యము  : ఆంధ్ర రాష్ట్రము ప్రధానముగా వ్యావసాయిక దేశము. అందువలన వ్యవ సాయమువలన వచ్చు పంటల వివరాలనుబట్టి వ్యవసాయ ఉత్పత్తిని గ్రహించవచ్చును. మొత్తముమీద 250 కోట్ల రూపాయల పంట పండుచున్నది.

Caption text
పంట విస్తీర్ణము, వేల ఎకరములు ఉత్పత్తి, లక్షల టన్నులు మొత్తపు పంట విలువ, లక్షల రూపాయలు
ధాన్యము 42,84.00 28.00 61,84
గోధుమ -- 0.01 5
చోళ్ళు 25,76.00 5.20 11,37
సజ్జలు 8,94.00 2.00 4,45
జొన్న 5,27.00 0.10 29
రాగి 5,93.00 2.30 4,83
కొట్టి 1,23.00 1.30 2,46
వరిగలు 2,63.00 0.50 80
ఇతరములు 5,50.00 0.90 1,70
సెనగలు 1,05.00 0.20 74
పెసలు 3,56.00 0.30 1,79
కందులు 1,85.00 0.20 86
మినుములు 1,50.00 0.20 93
ఉలవలు 8,27.00 0.66 2,47
ఇతరములు 56.00 0.03 14
వేరుసెనగలు 22,85.00 8.60 50,38
కొబ్బరికాయలు 83.00 -- 3,22
పంట విస్తీర్ణము, వేల ఎకరములు ఉత్పత్తి, లక్షల టన్నులు మొత్తపు పంట విలువ,లక్షల రూపాయలు
నువ్వులు 3,45.00 0.40 3,91
ఆముదము 1,64.00 0.10 82
చెఱకు 1,27.00 3.50 20,14
ప్రత్తి 5,86.00 0.70 2,72
కాఫీ 0.20 -- 1
పొగాకు 3,35.00 1.10 20,71
తమల పాకులు 0.40 -- 7
మిరప కాయలు 2,69.00 1.10 22,87
ఉల్లి పాయలు 29.00 1.20 1,63
బంగాళాదుంప 0.01 -- 1
పండ్లు 2,75.00 -- 7,45
అరణ్య సంపద గడి పాఠ్యం గడి పాఠ్యం 11,44
మొత్తం -- -- 2,40,10

ఈ రాష్ట్రములో 420 లక్షల ఎకరములలో 210 లక్షల ఎకరములందు ఏదో ఒక పైరు వేయబడి ఉన్నది.

ఆంధ్రరాష్ట్రములో వ్యవసాయసంపద, పశుసంపద, అరణ్యసంపద, ముడిసరుకులు విరివిగా ఉన్నప్పటికిని అవి ఇంకను సంపూర్ణ వికాసమును చెందలేదు. అందుచేత పరిశ్రమలలో కూడ విస్తారము చెప్పుకొనదగినంత అభివృద్ధి లేదు. ఆంధ్రరాష్ట్రములోని పారిశ్రామికాభివృద్ధి సుమారు 35 కోట్ల రూపాయల విలువగల వస్తువులను ఉత్పత్తి చేయగలిగినదని ఈ క్రింది వివరములు తెల్పుచున్నవి.

లక్షల రూపాయలు
పంచదార బిళ్ళలు 29
సిమెంటు 1,40
పింగాణి పరిశ్రమ 11
రాసాయనిక వస్తువులు 41
గుడ్డలు 31
సారా వగైరా 5
ఇంజనీరింగు 1,28
గోగునార సంచులు 3,57
లోహపు పనులు 73
కాగితము - అట్ట 3
బియ్యపు మరలు 10,27
సబ్బు 3
పంచదార 2,46
తోళ్ళు 1,96
నూనెలు 11,66
మొత్తము 34,76

పైన ఉదహరించిన పెద్ద పరిశ్రమలు కాక కుటీరపరిశ్రమలెన్నో ఉన్నవి. వాటిలో చేనేత పరిశ్రమ, తివాసీలు నేయుట మొదలైనవి ఉన్నవి. వీటి విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉండునని తేలుచున్నది.

ఆంధ్రదేశము ఖనిజసంపదకు పేరు వహించినది. అయినను ఖనిజ పరిశ్రమ ఇంకను బాగుగా అభివృద్ధిచెందలేదు ఏటేటా తీయబడుచున్న ఖనిజముల విలువ ఈ క్రింది చూపబడినది.

లక్షల రూపాయలు
ఆస్ బెస్టాసు 0.20
బారైట్సు 8.00
జిప్సం 1.20
ఇనుము వగైరా 1.00
మాంగనీసు 4.20
మైకా 173..60
స్టియటైట్ 0.27
పలక 0.16
ఇతర ఖనిజాలు 11.37
మెత్తం 200.00

వ్యాపారము  : రాష్ట్రములో జరుగు వ్యాపారము సుమారు 225 కోట్ల రూపాయల విలువగలదనియు, రాష్ట్రము బయట జరుగు వ్యాపారము 129 కోట్ల రూపాయల విలువగలదనియు లెక్క వేసినారు. ఇందులో 63 కోట్ల రూపాయల విలువగల వస్తువులు దిగుమతిలో ఉన్నవి. రాష్ట్ర రాష్ట్రే తర వ్యాపారమును గురించి సరియైన లెక్కలు లేవు. కాని ఉజ్జాయింపుగా ఆంధ్రరాష్ట్రము ఇతర రాష్ట్రాలతో చేయు ఎగుమతి దిగుమతులను ఈ క్రిందివిధముగా చూపవచ్చును.

Caption text
ఎగుమతులు విలువ రూ.
పశువులు 81,900
గొట్టెలు, మేకల (సంఖ్య) 1,02,088
ఇతర పశువుల(సంఖ్య) 37,88,600
ఎముకలు 1,24,611
తోళ్ళు (పచ్చివి) 12,42,486
మేకతోళ్ళు (పచ్చివి) 13,43,800
తోళ్ళు - ఊనినవి 69,176
బియ్యము 85,53,165
ఇతర రకాలు 6,75,330
సజ్జలు 57,70,872
పప్పులు 37,61,408
నూనెలు, నూనెగింజలు 8,40,37,924
సిమెంటు 18,35,163
జనపనార 1,16,56,855
గోనెసంచి - గుడ్డ 1,48,35,232
మాంగనీసు 50,68,100
ఉప్పు 18,59,559
బెల్లము 1,02,91,627
పంచదార 13,55,376
పొగాకు 3,47,04,180
నెయ్యి 64,07,199
టేకు, కలప 1,32,66,464
రంగులు, వగైరా 73,680
పండ్లు (ఎండినవి) 6,45,52,444
నార 5,03,232
లక్క 27,440
మొత్తము 27,59,97,911
Caption text
దిగుమతులు విలువ రూ.
సిమెంటు 9,17,967
బొగ్గు 85,42,785
ఇనుము, ఉక్కు 2,77,69,406
లక్క 1,42,400
మాంగనీసు 3,45,72,285
కిరసనాయిలు 36,28,,376
టెకు, కలప 4,78,66,094
కాఫీ 46,38,193
టీ 35,70,850
ప్రత్తి-నూలు 1,25,78,160
గుడ్డలు 2,39,14,043
నార 4,03,899
జనుము 33,19,260
పూలు 7,05,078
గొనెగుడ్డ 78,87,040
పండ్లు (ఎండువి) 1,10,05,316
నెయ్యి 1,09,100
సజ్జలు 44,24,584
పప్పుదినుసులు 4,12,09,760
ఇతరములు 15,85,940
గడ్డి 1,15,55,426
నూనెలు, నూనెగింజలు 35,60,090
పంచదార 1,77,27,022
మెత్తము. 27,52,33,674
దీనినిబట్టి పారిశ్రామికాభివృద్ధి కొరతపడ్డ రాష్ట్రాలలో దిగుమతులు ఎక్కువగా ఉండును. ఒక్క మదరాసు రాష్ట్రము నుండియే ఆంధ్రరాష్ట్రము సాలీనా పదికోట్ల రూపాయల వస్తువులను అదనముగా దిగుమతి చేసికొను చున్నది.

విదేశ వ్యాపారము : ఆంధ్ర రాష్ట్రము యొక్క విదేశ వ్యాపారము ముఖ్యముగా విశాఖపట్టణము, కాకినాడ, మదరాసు రేవులద్వారా జరుగుచున్నది.

విశాఖపట్టణము  :- ఇక్కడినుండి 20 కోట్ల రూపాయిల సరుకు ఎగుమతి అగుచున్నది. మాంగనీసు, పొగాకు మిరపకాయలు, వేరుసెనగనూనె, ఇనుమురాయి, బెల్లము, తోళ్ళు, కాయలు, ఆముదము, స్పిరిటు, సిమెంటు రాయి, కొమ్ములు, ఎముకలు, పసుపు, డివిడివి చెక్క, తివాచీలు, గ్రాఫైట్ మొదలైనవి ఉన్నవి.

కాకినాడ  :- ఇక్కడినుండి మూడుకోట్ల రూపాయల విలువగల వస్తువుల ఎగుమతి ఉన్నది. పొగాకు, జీడిపప్పు, తాటినార, నూనెలు, తోళ్ళు, తోళ్ళు శుభ్రపర చెడు దినుసులు, ప్రత్తి, పసుపు మొదలైనవి ఇందు కలవు.

మదరాసు :- ఈ రేపుగుండ మొత్తము 56 కోట్ల రూపాయల విలువగల వస్తువులు ఎగుమతులుగా వెళ్ళు చున్నవి. అందులో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వస్తువుల విలువలు : మైకా రు. 183 లక్షలు ; నూనెలు, గింజలు రు.598 లక్షలు ; పొగాకు రు. 3388 లక్షలు, మాంగనీసు రాయి రూ.51లక్షలు ; చందనము, నూనె రూ. 33 లక్షలు; ఇనువరాయి రూ. 20 లక్షలు; కై నైట్, స్టియటైట్ రూ. 6 లక్షలు. మొత్తము 12కోట్ల 29లక్షల రూపాయల వస్తుసామగ్రి ఎగుమతియగుచున్నది. ఆంధ్ర దేశము మొత్తము ఎగుమతులు 40 కోట్ల రూపాయలని అంచనా వేయబడినది. ఎగుమతులు ఎక్కువ భాగము యునైటెడ్ కింగ్ డం, అమెరికా, జపాను, జర్మనీ, కెనడా మొదలైన దేశాలకు వెళ్ళుచున్నవి.

దిగుమతులు  : వక్కలు, క్రొవ్వువత్తులు, బొగ్గు, సైకిళ్ళు, ఖర్జూరము, మందులు, విద్యుచ్ఛక్తి సామాను, ఇనుప సామాను, నూనె, పెట్రోలు, మోటారు నూనెలు, యంత్ర సామగ్రి, లోహాలు, మోటార్లు, రాసాయనికపు నూనెలు, రంగులు, వార్నీషు, గుడ్డలు, నూలు మొదలైనవి ఎన్నో ఉన్నవి. విశాఖపట్టణము, కాకినాడ రేవులలో దిగుమతి అగుచున్నవి. విశాఖపట్టణములో ముఖ్యముగా యంత్రసామగ్రి, తిండిగింజలు దిగుమతి అగుచున్నవి. కాకినాడలో తిండిగింజలే ముఖ్యమైన దిగుమతి. మిగతావి మదరాసు రేవునకే వచ్చుచున్నవి. రేవు పట్టణాల అభివృద్ధికి కూడ ఆంధ్రరాష్ట్రము ఎంతో పాటుపడవలసి యున్నది.

ఆంధ్రరాష్ట్రపు వ్యాపారము ఈ క్రింది విధముగా జరుగుచున్నది.

ఎగుమతులు లక్షల రూ. దిగుమతులు లక్షల రూ.
రైలుమార్గం గుండా 27.59 27.52
మదరాసు రేవు 22.00
ఆంధ్ర రేవులు 18.00 35.00
మెత్తము. 67.59 62.52

పై పట్టిక ననుసరించి ఆంధ్ర రాష్ట్రము 5,07 లక్షల రూపాయీలు అదనముగా వ్యాపారములు కలిగిఉన్నను మదరాసు రాష్ట్రపు వ్యాపారము కూడ లెక్క చూచి కొనిన మొత్తము మీద 10 కోట్ల రూపాయలు తరుగు ఉండునని అంచనా వేయవచ్చును, ఆంధ్రరాష్ట్రములో కొన్ని పరిశ్రమలను స్థాపించిననే తప్ప ఈ పరిస్థితి చక్కబడుటకు అవకాళము లేదు.

డి. వి. కె.

[[వర్గం:]]