సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అవనీంద్రనాథఠాకురు
అవనీంద్రనాథఠాకురు :- డాక్టరు అవనీంద్రనాథ ఠాకురు ఆధునిక భారతీయ చిత్రకళోద్యమమును స్థాపించిన వాడు. అతడు 1871 ఆగష్టు 7వ తేదీయందు కలకత్తా నగరమునందు ఠాకురువంశమున తదీయమైన "జోరశంకో" అను భవనములో శ్రీకృష్ణాష్టమినాడు జనన మొందెను. అతడు కీ. శే. రాజా గుణేంద్రనాథ ఠాకురు కనిష్ఠపుత్రుడు. రాజా ద్వారక నాథ ఠాకురు ద్వితీయపుత్రుడగు గిరీంద్రనాథ ఠాకురు పౌత్రుడు. ఆతని జ్యేష్ఠసోదరు డగు గగనేంద్రనాథ ఠాకురుకూడ సుప్రసిద్ధ చిత్రకారుడై వరలెను.
చరిత్రపత్రములను వెనుకకు త్రిప్పి చూచినచో, నెపోలియను కాలమునందు చిత్రకళాభ్యుదయము కాని, వాఙ్మ యాభ్యుదయము కాని ఘటిల్లినట్లు తెలియదు. అది క్రియాత్మక కాలము కాని, నిర్మాణాత్మక కాలము కాదు. సామాన్యముగా శాంతితోగూడిన కాలమునందే పూర్వాచార పరాయణుల స్తబ్ధత, విద్వత్సభల నిబంధనములు అను శృంఖలములను భేదించుకొని నవ్యములయిన చిత్ర కళోద్యమములు ఉదయించుచుండును. నిర్మాణాత్మకమయిన ఇట్టి ఉత్సాహ సంచలనము విక్టోరియా శకము యొక్క అంత్యభాగమున చూపట్టెను. తత్ఫలితముగా కళాసాహిత్యములందు అనేకములును, భిన్నములును, అయిన ఫిం-డు-సీకిల్ ఉద్యమములు తలలెత్తెను.
వర్తమాన శతాబ్ది ఆరంభమున భారత దేశమునందు రాజకీయములలోను, సాహిత్యములోను, కళలలోను,'ఈ పిం డు-సీకిల్' ఉద్యమతత్త్వము గోచరించుచున్నది. రవీంద్రనాథఠాకురు కవిత్వము ప్రాచీన కవితా సంప్రదాయములయు, రచనలయు తిరస్కా రాత్మక మైనది. సురేంద్ర నాథ బెనర్జీగారి రాజకీయక్రమము బహుకాలము నుండి అంగీకృత మైయున్న ప్రభుత్వ పరిపాలనా విధానము నెడ అసహనము యొక్క ప్రారంభదశను సూచించును. అవనీంద్రనాథఠాకురు యొక్క కళా విజ్ఞానము రసలుబ్ధులగు భారతీయుల హృదయములందు బహుకాలమునుండియు దాగియున్న నిర్మాణాత్మకమయిన ఉత్సాహాతిరేకమునకు ప్రాణము పోసెను. ఇప్పటివరకు వంగ దేశీయులు పాశ్చాత్య సంస్కృతి అను మద్యమును విశేషముగా క్రోలియున్నారు. పైతరగతికి చెందిన వంగ దేశీయుల ఆలోచనా విధానము, వారిభాష - సర్వము ఆంగ్లేయ సంప్రదాయాను కారి అయ్యెను. దీనికి అనివార్య మయిన ప్రతిక్రియ ఈ శతాబ్ది ఆదియందు పొడచూపెను. సాహిత్యము నందువలెనే కళలయందును మనజాతికి స్వతస్సిద్ధమైన ధర్మములకు అనుకూలముగ మనఃప్రవృత్తిని ఆవిష్కరించుట ఉత్తమకృత్య మని తొలుదొల్త నిరూపించినవాడు అవనీంద్రనాథ ఠాకురే. పాశ్చాత్య సంస్కృతికి విలక్షణ ఫలమయిన పాశ్చాత్యకళ పాశ్చాత్యులకు హితకర మగును. టక్సెడో (tuxedo) అనునది ప్రాచ్యులవిందులలో అనుచితమగురీతి ప్రాచ్యదేశీయ కళా విన్యాసమున పరిపూర్ణముగాను, ఆనంద సంజనకముగాను, అనర్గళముగాను, స్వీయభావములను ఆవిష్కరించుపట్ల పాశ్చాత్య కళారీతులను అవలంబించుట అనుచితమగును. శిథిలములయిన ప్రాచీన భారతీయ చిత్రకళా సంప్రదాయ తంతువులను గుమిగూర్చుటచేతను, జాతీయము లయిన వ్యవస్థల యొక్కయు, సంకల్పముల యొక్కయు, శక్తిని పునరుద్ధరించుట చేతను, దేశీయ కళాలక్ష్మికి మోక్షము సిద్దింపగలదని మొట్టమొదట గ్రహించినవాడు అవనీంద్ర ఠాకురే.
అవనీంద్రనాథ ఠాకురు అనేకరీతుల అసదృశమైన వ్యక్తిత్వము కలవాడు. పారమార్థిక జీవితము అను దేవాలయము నందు ఒక ప్రత్యేకమైన గూడుగా విరాజిల్లుచున్న సమకాలిక సంస్కృతియందు అతడు ఎల్లప్పుడును ఒక ప్రముఖస్థానము నాక్రమించి యుండగలడు. భారతదేశముయొక్క అన్యప్రాంతములలో అపుడపుడు ప్రదర్శింపబడుచుండు ఆతని చిత్రములు అతని చిత్రకళా కౌశలమునకు సరియగు నిదర్శనములు కావు. (అతని ఉత్తమోత్తమ చిత్రము లింకను ప్రచురింపబడ లేదు.) అతడు మోటుగను, సరికాని వర్ణములతోను, రచించి ముద్రింపించిన హాఫోటోన్సు చిత్రములే అందరెరిగినవి. అట్టి చిత్రములు వివాదోపశమముకంటె వివాదోత్పత్తికే, గుణగ్రహణముకంటే దోషావిష్కరణమునకే విశేషముగా సాధనము లయ్యెను. ఠాకురు సంచార విముఖుడు. గృహము నాశ్రయించియుండు నలవాటు కలవాడు. ఆంగ్లేయ భాషలో వ్రాయుటకు సమ్మతి లేనివాడు. అందుచేత అసాధారణ సౌందర్యము, గౌరవము కలిగి, సౌందర్య రసగ్రహణ పారీణుడయి, భారతీయ కళయందు అత్యంత ప్రతిభాన్వితుడయిన అతనితో భారత దేశమునందలి ఇతర ప్రాంతములందుండు నాగరక శిఖామణులకు పరిచయ భాగ్యము లభించుట సాధ్యపడదయ్యెను.
ప్రాచ్యఖండమునందలి ప్రాచీన విద్వద్వర్యులచే గ్రంథస్థము చేయబడి, పరిపుష్టమై, పాశ్చాత్య కళకు ఏవిధమున తీసిపోక, అత్యంత వికాస భాసురమై సంపూర్ణముగ ఉపజ్ఞాయుతమై, సౌందర్య మీమాంసా విషయకమైన భాషను ఠాకురు కనిపెట్టెను. ఇట్టి ఆవిష్కరణములో లారెన్సు బన్యన్, రోజర్ ఫ్త్ర్ అను విమర్శకులు కనిపెట్టిన విషయములను బహు సంవత్సరములకు ముందుగనే డాక్టరు అవనీంద్రనాథ ఠాకురు కనిపెట్టినవా డయ్యెను. చీనా, జపాను దేశములకు సంబంధించిన అనేక కళారూపములకు పెక్కు భంగుల భారతదేశమే గురుత్వమును పూర్వ భావిత్వమును కలిగి యుండెను. ఖజిల్(Qyzyl) హూరియోజి (Horioji) ప్రాంతమునందలి .ఫ్రెస్కోస్ (తడిగోడలపై చిత్రించు రంగు బొమ్మలు) సాక్షాత్తుగా భారతీయ చిత్రానుకరణములై యున్నవను విషయమును డాక్టరు ఠాకురు తాను సంపాదించిన పెక్కు చిత్రకళా ఖండములనుబట్టి ధ్రువపరచెను.
1897 వ. సంవత్సర ప్రాంతమున అవనీంద్రనాథ ఠాకురు ఇరువదియైదు సంవత్సరముల ప్రాయమున నుండి ఇటాలియను కళావేదియగు సీనారు, గిల్ హార్డి యొద్దను, పిదప కలకత్తా నగరమునందలి దొరతనము వారి చిత్రకళాశాల యొక్క ఉపప్రధానాధికారి యొద్దను ఛాయావిశేష చిత్రణములు, రూపచిత్రణములు, వర్ణ చిత్రణములు, పరిపూర్ణాకార వివరణ చిత్రణములు మున్నగువాటిని అభ్యసించెను. పిదప ఇంగ్లండునుండి ఏతెంచిన చార్లెసు ఎల్ పామరు అను కళా వేది యొక్క చిత్రకళామందిరమున పాఠముల నభ్యసింపనారంభించెను. ఇట్లు ఠాకురు మూడునాలుగు సంవత్సరముల పర్యంతము పామరువద్ద గాఢమయిన శిక్షణము నొందిన పిదప రూపచిత్రణమున మిక్కిలి కుశలుడయి రెండేసి గంటలలో ఒక్కొక్క చిత్రమును పూర్తిచేయ గలుగునట్టి సమర్థు డయ్యెను. ఠాకురు ఈ కాలమున బహు విషయములకు చెందిన తైల చిత్రములను చిత్రించెను. 1900 సంవత్సరములో అవనీంద్రనాథ ఠాకురు మాంఘీరు పట్టణమున కేగెను. ఆ పట్టణముననున్న కాలమున, ఆతని చిత్రకళాప్రవృత్తియందు సంపూర్ణమైన మార్పు ఏర్పడుటచే, అతడు పాశ్చాత్యశైలి ననుసరించి తైలచిత్రములను చిత్రించుటమాని, నీటి రంగులతో చిత్రించుట కారంభించెను.
ఠాకురు కలకత్తాకు తిరిగివచ్చి మరికొంత కాలము వరకు పామరువద్ద నీటిరంగు చిత్రణమున శిక్షణము నొందెను. పిదప అతడు మాంఘీరునకు పోవునపుడు పామరుయొక్క 'శిక్షణ కాలమున తాను సిద్దమొనర్చి యున్న చిత్రములను తనవెంట కొనిపోయెను. 'జోరా శంకో' మందిరమున నున్న తన పూర్వుల గ్రంథాలయములో, చిత్రములతో నొప్పారుచున్న పురాతనమైన యొక ఇండో - పార్సీ గ్రంథము యొక్క వ్రాతప్రతి నాతడు ఒకనాడు చూచుట తటస్థించెను. దానితో ఠాకురుయొక్క చిత్రకళా చరితమున గొప్పమార్పు ఘటిల్లెను. ఆ వ్రాతప్రతియందలి అత్యద్భుతమైన వర్ణ చిత్రములు, సుందరమైన లేఖనకళ, ఆతని కల్పనాశక్తికి ఉత్తేజము కలిగించెను. దాన నాతడు చిత్రకళయందు నైజశక్తి నావిష్కరింప సమర్థు డయ్యెను. తదాదిగ ఠాకురు దివ్యగోపాలుడగు శ్రీకృష్ణుని జీవితమునందలి,లీల లనబడు సుప్రసిద్ధ దృశ్యములను వర్ణించునట్టి విశ్రుతములయిన చిత్రమాలికలను రచింపదొడగెను. ఈ చిత్ర రచనలు మాంఘీరు పట్టణమున అనుభూత మయిన ఆతని చిత్రకళాదర్శమునందలి సూక్ష్మపరివర్తనము యొక్క పరిణామములై యుండవచ్చును. దీనితో వెనీసు పట్టణములోని టిటియన్ వలెనే తానును వంగదేశమునందు సుప్రసిద్ధ చిత్రకారుడుగా పేరుపొందవలయునను ఆతనిఆశ అడుగంటెను. ఇది నలుబది సంవత్సరముల క్రిందట జరిగిన విషయము. అప్పటికి ముప్పదిసంవత్సరములవా డయిన అవనీంద్రనాథఠాకురు పాశ్చాత్య చిత్రకళా శైలికి స్వస్తి చెప్పి స్వీయకళాశైలిని పెంపొందించుకొనెను.
కొన్ని సంవత్సరములకు పిమ్మట ఠాకూరునకు. ఇ బి. హావెల్ అను పేరుగల కలకత్తా నగరమునందలి చిత్రకళా ప్రధానాధికారిని కలిసికొను అవకాశము లభించెను. అత్యుత్సాహ సంభరితుడగు ఠాకురునకు హావెలు ఆనుకూల్యము, సానుభూతి కల మిత్రుడుగా గోచరించెను. అప్పటినుండి అయ్యిరువురును ఆ సంస్థయందు కలిసి పనిచేసిరి. తదాదిగా వంగ చిత్రకళాశాఖ, పరంపరాగతమయిన భారతీయ చిత్రకళా సంప్రదాయము యొక్కయు తద్ధ్యేయముల యొక్కయు పునరుజ్జీవనమునకై సర్వదా యత్నించెను.
పూర్వోక్తరీతిగా అవనీంద్రనాథ ఠాకురు యొక్క అద్వితీయ ప్రతిభ మొట్టమొదటిసారి “రాధాకృష్ణ" అను చిత్రమాలిక యందు ఆవిష్కృత మయ్యెను. ఈ మాలికా చిత్రములు అతవి జీవిత దశయందేకాక ఆధునిక భారతీయ చిత్రకళా క్షేత్రమునందుకూడ నొక నూతన శకమును ప్రవేశ పెట్టెను.
అవనీంద్రనాథుని చిత్రకళాభివృద్ధిని పురస్కరించుకొని స్థూలముగా అతని చిత్రములను మూడు అంతరములుగా విభజింప వచ్చును.
(1) 1895 వరకు పాశ్చాత్య చిత్రకళాశైలి ననుసరించి వ్రాయబడిన చిత్రములు.
(2) 1895 వ సంవత్సరమున ఆధునిక కాలికమైన రచనా విధానముతో నొప్పారిన భారతీయ చిత్రముల సంగ్రహ గ్రంథ మొకటి (లక్నో ఖలం) అతనికి బహుమానముగా లభించెను. ఇట్టి సంఘటనముచే నాతనికి తొలిసారిగా భారతీయ చిత్రకళా పరిచయ మేర్పడెను. ఠాకురు యొక్క చిత్రములకు రాజపుత్ర - మొగలు చిత్రములతో సామ్యము తక్కువ. పాశ్చాత్య లఘుచిత్రములతో సామ్యము మెండు. 'ఐనను అవి వర్ణనాత్మకములు కాసాగెను. ఇట్టి రచనా విధానము నాతడు తరువాత ఎన్నడును ఆశ్రయించిన వాడు కాడు.
(3) 1897 మొదలుకొని 1900 వరకుగల మధ్య కాలముననే అతని చిత్రకళయందు హిందూకళా సంప్రదాయములతోను రాజపుత్ర చిత్రములతోను సామ్యాభివృద్ధి ఘటిల్లెను. 1901, 1902 సంవత్సరములలో అతడు ఆధునిక జపానీయ పారగులతోను, వారి రచనల తోను, పరిచయమునుపొంది స్వీయ కళా విధానమును పెంపొందించుకొనెను. శిల్ప శైలియందు కొంత భేదము స్థూలదృష్టికి గోచరించినను, ఇప్పటినుండి మొత్తము మీద ఆతని రచనయందు చెప్పదగినంత మార్పేమియు లేదన వచ్చును.
ఠాకురు భిన్నములైన ద్రవ్యసాధనములతో అసంఖ్యాకము లయిన చిత్రములను చిత్రించెను. వాటిలో ఒక్కొక్క చిత్రము యొక్క ప్రత్యేక శైలి నైపుణ్యములను వివక్షించినచో అది చిత్రకళకు ఒక అమూల్య ఉపహారముగా పరిగణింపబడదగి యుండును.
1930 లో అవనీంద్రనాథుడు "అరేబియన్ రాత్రులు” అను చిత్రమాలికను ప్రారంభించెను. ఈ చిత్రమాల అతని సృజనాత్మకమయిన చిత్రకళా జీవితమునందలి చరమ దశాసూచకమై యున్నది. జపానీయకళాపారగుల పరిచయ మేర్పడిన కాలమునుండి ఠాకురుయొక చిత్రము లందలి ప్రసాధక గుణము అప్రధానమయ్యెను. కాని 'అరేబియన్ నైట్సు' అను మాలికాచిత్రములలో మరలప్రసాధక గుణము అతిశయించెను. దీనికి కారణ మతడు తద్రచనమున బుద్ధిపూర్వకముగా నొనర్చిన యత్నమే. ఇవ్విషయమున అతడు పొందిన జయము అపూర్వము.
చిత్రకారుడుగా డాక్టరు ఠాకూ రొనర్చిన కృషిని సమగ్రముగ ప్రశంసింప శక్యముకాదు. అతని కళ బహుముఖములతో, వివిధ రీతులతో సంకలిత మైయున్నది. 1896 వ సంవత్సర ప్రాంతమున ఠాకూరు ప్రారంభించిన చిత్రకళోద్యమము యొక్క ఆరంభావస్థయందు అతడు చిత్రించిన చిత్రములు పాశ్చాత్య చిత్రకళా ప్రభావమును నిరసించుటకును, దేశీయ కళాశైలి సాధనముగా ప్రాచీన భారతీయ చిత్రకళ నుద్ధరించుటకును, ఉద్దిష్టములయినవి. (భారతీయ చిత్రకళా ప్రవృత్తియందు) పాశ్చాత్య కళాధిపత్యమును సహింపని తిరుగుబాటుదారుగాను, భారతీయ చిత్రరచనయందలి అతి సూక్ష్మతత్త్వములను అత్యంత సామర్థ్యముతో నిరూపించుచు వ్యాఖ్యానించువాడుగను, అతడు రంగమున ప్రవేశించెను. అట్లనుటచే నతడు కేవలము ప్రాచీనకళారీతుల నుద్ధరించుటకై యత్నించె నని అనుకొనుట సరికాదు. అతడు అన్ని దేశములందలి చిత్రకళారీతులను, విధులను, కల్పనా సంప్రదాయములను సమీకరించుకొనగల ఒకానొక అద్భుతశక్తితో విశిష్టమైన ప్రతిభ కలవాడు. ప్రాచ్య - ఆసియాయందును పాశ్చాత్యదేశములందును గల కళాప్రవీణుల చిత్రరచనా క్రమమును సాదరముగా, యథేచ్ఛముగా అత డవలంబించెను. అతడు తన చిత్రసృష్టి యొక్క ఆరంభదశయందు ప్రాచ్య - పాశ్చాత్యదృక్పథములను రెండింటిని అనిర్వచనీయమైన సంయోగముతోను సమీకృతమైన మైత్రితోను ఉపయోగించెను.
డాక్టరు అవనీద్రనాథ ఠాకురు ఉపాధ్యాయుడుగా అసదృశుడు. మిక్కిలి పనివారయిన శిష్యులయెడ కన్నతల్లివలె అపరిమితమైన ఓపికను, కన్నతండ్రివలె వాత్సల్యమును, అనుకంపను అతడు చూపెను. సాధారణులయిన శిష్యుల యొక్క హృదయములందు లీనమైయున్న శక్తులను బహిర్గతము చేయుటయం దీతనికిగల శక్తిసామర్థ్యములు అద్భుతావహములు. తన శిష్యులపై తన రచనా విధానము నెన్నడు అతడు విధించియున్నవాడు కాడు.
అవనీంద్రనాథుడు చిత్రకళకు సంబంధించిన నూతనోద్యమమునకు నాయకుడుగా ఎడతెగని కృషి సల్పేను. తన అనుయాయులకును, సన్నిధాన వర్తులగు శిష్యులకును ఉత్సాహావేశములను కల్పించెను. వారి కాతడు ఉత్తమ హైందవ కళాచిత్రములను అవగతము చేసికొను విధానమునందును, నూత్నాలోచనలు కల ఆధునికుల భావ ప్రకృతులకును, అవసరములకును, పరిస్థితులకును అనువగు రీతిగా నూతనకళారీతులను పునర్ని యోజన మొనర్చు టకై, భావములను, ద్రవ్యములను, సంగ్రహించు విధానమునందును సాకల్యమైన శిక్షణ మొనగెను. 1906 వ సంవత్సరములో అవనీంద్రనాథుడు తన శిష్యుల కొసగిన ఉపవ్యాసమునందు చిత్రకళపై తనకుగల ఆశయములను ఇట్లావిష్కరించెను. “మీరొక సుందరమైన ప్రదేశ చిత్రమును వ్రాయు సంకల్పముతో ఒక ఉద్యానమునకుగాని, నదీ తీరమునకుగాని పోయి అచ్చటి మొక్కలను, పువ్వులను, జంతువులను రంగులతో చిత్రించుట నేనెరుగనిది కాదు. అట్టి సులభసాధనములతో సౌందర్యమును మీ యధీన మొనర్చుకొనుటకు మీ రొనర్చు యత్నములు నాకాశ్చర్యమును కలిగించుచున్నవి. సౌందర్యము బహిరుపాధుల నాశ్రయించునదికాదు. అది అత్యంతముగా అంతరమైన హేతువును ఆశ్రయించునది. మీరు మున్ముందు కాళిదాస కవితా వైశిష్ట్యమునందు మగ్న మనస్కులు కండు. పిదప ఆకసమును తిలకింపుడు. అపుడు నిత్య నూతనమైన మేఘ సందేశము యొక్క శాశ్వత సౌభాగ్యమును మీరు గ్రహింప గలుగుదురు. మొదట వాల్మీకి కృతమైన సముద్ర వర్ణనమున మగ్నులు కండు. పిదప యథేష్టముగా సముద్రమును చిత్రింపుడు.”
అవనీంద్రనాథుడు దివికేగినాడు. అతని మరణముచే ఆధునిక చిత్రకళోద్యమమున నొక మహానాయకుని, ఒక దేశాభిమానిని, ఒక చిత్రకళా ప్రబోధకుని భారతదేశము కోల్పోయినది. చిత్రకళోద్యమమున మిక్కిలి ప్రతిభావంతుడును, సమకాలిక మహాపురుషులలో నొక్కడును, మానవ సంస్కృతి చరిత్ర పత్రములందు మాసిపోని చిహ్నములను నిలిపినవాడును అగు అవనీంద్ర నాథునకు భారతదేశము స్తుత్యువహారాభివందనములను అర్పింపవలసి యున్నది.
అవనీంద్రనాథునకు కీర్తిని తెచ్చిన శిష్యులు పెక్కురు కలరు. వారిలో నందలాల్ బోసు, అసితకుమార్, హాల్దారు, వకీలు, దేవీప్రసాదరాయ్ చౌదరీ, ప్రమోద కుమార్ చటర్జీ పేర్కొన దగినవారు.
వి. ము.