Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్లూరి సీతారామరాజు

వికీసోర్స్ నుండి

అల్లూరి సీతారామరాజు  :- భారతీయ తత్త్వదర్శ నాంశములను పూర్వజన్మ సంస్కారమున గ్రహించి, ఆంధ్రత్వము నిలువబెట్టుటకు పరిశ్రమించిన విరాగి, త్యాగి, పరోపకారపరాయణుడు, దీన జ నా వ ను డు అల్లూరి సీతారామరాజు. బ్రిటిషు ప్రభుత్వమువారి దమన నీతి నసహ్యించుకొని, దుష్టపరిపాలనమునకు ఎదురుతిరిగి, బ్రిటిషు ప్రభుత్వమును ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీరు తాగించిన యోధుడు అల్లూరి సీతారామరాజు.

ఇతని స్వగ్రామము పశ్చిమ గోదావరిజిల్లా, భీమవరముతాలూకాలోని మోగల్లు గ్రామము. క్షత్రియవంశమువాడు. తండ్రి పేరు వేంకట్రామరాజు. తల్లి పేరు నారాయణమ్మ. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీరామరాజు. కాని యితడు వలచిన కన్య సీత యను యువతి అకాలమృత్యువు వాతబడుటచే, ఆమె జ్ఞాపకార్థము తన పేరును సీతారామరాజుగా మార్చుకొనెను.

శ్రీరామరాజు చిన్నతనమునుండియే ఎప్పుడును, ఏదో ఆలోచించుచు ఉండెడువాడు. చదువుసంధ్యలయందు దృష్టి లేకుండెడువాడు. ఇంగ్లీషు పాఠశాలలలో చెప్పెడు విద్య విద్య కాదనియే అతడు భావించుచుండెను. సీతా కన్య మరణానంతరము వివాహకార్యము తలపెట్టక, వైరాగ్యశీలియై, అడవులు పట్టి తపస్సు చేయసాగెను.

అతడు గోదావరీనదీతీరమందలి పాపికొండల గుహలలో ఏకాంతవాసము చేయుచుండెను. అప్పుడు అచ్చటి ఆటవికు అయిన సవరలతో అతనికి పరిచయము కలిగెను. సవరలు అతనికి సపర్యలు చేయుచు, తమగురువుగా నెంచి ఆతనిని మన్నింపసాగిరి.

సవరలు చేయునది బోడువ్యవసాయము. ప్రభుత్వాధికారులు లంచము లియ్యని సవరలభూములను లాగుకొని తాము ఏర్పాటుచేసిన ముఠాదారులకు సంక్రమింపజేసి ధనము గడింపసాగిరి. పండ్లు కోసినారనియు, కట్టెకొట్టినారనియు, వెట్టి చేయలేదనియు ఏవేవో నేరములు మోపి ఆయారణ్యకులను తహస్సీలుదారు, పోలీసు వారు బాధలు పెట్టుచుండిరి. ఈ ప్రభుత్వాధికారులకు క్రైస్తవమిషనరీలు తోడ్పదు చుండిరి. ముఠాదారులకును, సవరలకును విభేదములు ఏర్పడి తగవులు ప్రబలము కాసాగెను.

ఈ ఆటవికుల దుర్భర జీవనమును గమనించి సీతారామరాజు యమాయకులపక్షమున నిలచి ప్రభుత్వాధికారులతో వాదించసాగెను. ప్రభుత్వమునకు ఈ సీతారామరాజు కంటకుడయ్యెను. అంత ప్రభుత్వము సీతారామరాజును గూడ నిర్బంధములపాలు చేయుటకు సంకల్పించెను. సీతారామరాజు క్రమముగా ప్రతిఘటించి సవరలను సంస్కరించి యుద్ధ సన్నద్ధుల గావించెను. తమ పూజ్యగురువునకు ఎట్టి అపాయము జరుగకుండ సవరలు వేయికన్నులతో కని పెట్టుచు, అంగరక్షకభటులుగా నిలుచుండిరి. పోలీసుబలముతో సవరలకు ముఖాముఖి పోరాటము 1922లో ప్రారంభమయ్యేను. అడవిలోని దుంపలను తీయగూడదనియు, గొడ్లకు గడ్డిని కోయ గూడదనియు, దొరతనము వారుఆజ్ఞలను కావించిరి. 'ఆకలి మంట లొక్కసారి విజృంభించుటచే సవరలు గండ్ర గొడ్డండ్లతో అరణ్యములోని చెట్లను నరుకుటకు కడంగిరి. ఇదియే పోరాటమునకు కారణము.

సాధు సీతారామరాజు బోధనానుసారము సవరలు సాయుధ విప్లవమునకు సంసిద్ధు లగుచున్నారని పోలీసు సిబ్బందితో అధికారులు గ్రామములపయి దండెత్తిరి. కొంపలను తగులబెట్టిరి. సీతారామరాజును, నూరుగురు సవర ముఖ్యులను పట్టుకొనిపోయి, విచారణతంతు నడిపి, జెయిలుకు పంపిరి. కాని సీతారామరాజు జెయిలునుండి విచిత్రముగా అంతర్ధాన మయ్యెను. పర్లాకిమిడి, జయపూరు, గోదావరి అరణ్యములు అప్పుడాతనికి ఆటపట్టు లయ్యెను. సవరలకును, ఖాండులకునుతప్ప సీతారామరా జెక్కడ నున్నాడో ఎవ్వరికిని తెలియకుండెను. నమ్మిన బంట్లగు సవరలు, ఖాండులు రహస్యమును కాపాడిరి.

ఆటవికులు సాయుధ, నిరాయుధ వర్గములుగా నేర్పడిరి. సాయుధ వర్గము ప్రభుత్వముతో పోరాడునట్టిది. నిరాయుధ వర్గములో కార్మికులు, కర్షకులు ఉండుచుండిరి. నిరాయుధవర్గమువారు సమ్మెలుకట్టి, పన్నులు ఎగ బెట్టి విధి నిర్వహించెడు వారుగా ఉండిరి. ఈ విధముగా విప్లవము సిద్ధమయ్యెను. సీతారామరాజు ఈ విప్లవమునకు అధినాయకుడు.

ఈ విప్లవ సేన విండ్లు, బాణములు, కత్తులు, బల్లెములు ధరించి 1922 లో చింతపల్లి గ్రామమునకు పోయి పోలీసు స్టేషనును ముట్టడించెను. పోలీసువారు గడగడ వడకిరి. రాజు ఒక కుర్చీలో కూర్చుండి, అచ్చట ఎట్టి ఆయుధము లున్నవో ఇన స్పెక్టరు నడిగి తెలిసికొనెను. సీతారామరాజునకు కుడి, ఎడమ భుజములుగానున్న గాము గంటందొర, గాము మల్లుదొర అను గ్రాము సోదరులు పోలీసు ఠాణా యంతయు గాలించి, ఆయుధ సామగ్రి తెచ్చి, రాజు సమక్షమున ప్రోగుపరచిరి. రాజు వాటిని వివరముగా రికార్డు పుస్తకములో వ్రాసి, దస్కతు చేసి, తప్పుడు రికార్డులను చించిపారవై చెను. అచ్చట దొరకిన ఆయుధ సామగ్రితో సపరివారముగా రాజు వెడలిపోయెను. ఎవరిని హింసించలేదు, గ్రామజనము గుమిగూడి తమాషాగా చూచుచు నిలుచుండిరి. పోలీసులు గండము గడచిన దని, ప్రాణములతో బయటపడ్డామని ఊపిరిపీల్చిరి. తరువాత రాజు కృష్ణదేవిపేటలో పోలీసులను చెట్లకు బంధించి, స్టేషనులోని తుపాకులను గై కొని వెడలిపోయెను.

మొట్టాడం వీరయ్యదొర ఒక ధీరుడు. ఇతనిని “లాగ రాయి" పితూరీ జరిగినప్పుడు పట్టుకొనిపోయి నానాకష్టముల పాల్చేసిరి. వీరయ్యదొర తప్పించుకొనిపోయి అరణ్యములలో సవరల రక్షణలో రహస్యముగా నుండగా ప్రభుత్వమువారు వేగులవారిద్వారా గాలించి పట్టుకొని "రాజవొమ్మంగి" ఠాణాలో నిర్బంధించిరి. వెంటనే సవర నాయకులు ఠాణాపై దాడి సలిపి, కొట్టు పగులకొట్టి, వీరయ్యదొరను విడిపించిరి. అచ్చటి ఆయుధము లన్నియు దోచుకొనబడెను. వీరయ్యదొర విప్లవ సైన్యమునకు ఉపనాయకు డయ్యెను (1922). ఈ విధముగా 26 తుపాకులు, 2500 రౌండ్ల మందుగుండ్లు, 10 కత్తులు, 10 మందుసంచులు, 12 పెద్దగొలుసులు, 28 బయొనెట్లు, 9 ఖడ్డీలు - ఇంకను పోలీసుదుస్తులు, ఇతర వస్తువులు సీతారామరాజు వశమయినట్లు సర్కారు లెక్కలలో వ్రాయబడియున్నది.

విప్లవకారులు చర్యలు దొరతనము వారికి తెలియగనే వందలకొలది పోలీసులు అచ్చటికి పంపబడిరి. తెల్ల అధికారులు గూడ వచ్చిపడిరి. ఒక వైపున విప్లవ సైన్యము వీర మర్యాదలు పొందుచుండగా, వేరొకచోట ప్రభుత్వదళము ప్రజలను భయ పెట్టసాగెను. విప్లవకారుల గుంపుజాడ దొరతనమువారికి తెలుపువారు ఎవ్వరును కనబడకపోయిరి. పైగా తప్పుత్రోవ చూపుచుండిరి.

ఒకసారి రామరాజు నిరాయుధుడుగా నున్నప్పుడు సై నికుల కెదురయ్యెను. వారతనిని గుర్తింపజాలరైరి. తమ మూటలను మోయుమని రాజున కాజ్ఞాపించిరి. రా జొకమూటను నెత్తిపై పెట్టుకొనేను. ఆతని యనుచరులును మూటల నెత్తుకొనిరి. వారందరును అరణ్య మధ్యములో ఒకచోట విశ్రమించిరి. నడిరాత్రివేళ సైనికులు గాఢనిద్రలో నుండగా, వికృత కోలాహల మొనర్చుచు, ఆ మూటల నెత్తుకొని అనుచరులతో సీతారామరాజు అంధకారబంధుర మగు మనారణ్యమధ్యము చొచ్చెను. సైనికులు వితాకుపడిపోయిరి.

ఒకసారి 'ట్రెమన్ హోరు' అనువాని నాయకత్వమున సర్కారు సైన్యదళము అరణ్యములో పితూరీదారులను వెదకు చుండెను. విప్లవకారులు “రామరాజునకు జై" అని కేకలు వేసిరి. సైనికులు తుపాకులు సరి పెట్టుకొనునంతలో కూలీలు పరుగిడిపోయిరి. సైనికులు తుపాకులు కాల్చిరి. అయినను భయపడక విప్లవకారులు తుపాకులు కాల్చుచు ముందుకు వచ్చిరి. బాణవర్షము గురియించిరి. టెమన్ హోరుకు బాణములు తగిలెను. అందరును పిరికిపడి ఎవ్వరి అనుమతిలేకయే పరుగిడిపోయిరి. విప్లవకారులు మందుగుండ్లు, తుపాకులు, కత్తులు, దుస్తులు నూడబెరికి తీసికొనిపోయిరి. దీనిని ప్రథమ సమర మని యెదరు.

మోటువారిని సత్యపథమున నడిపించుటకు దేవీ భక్త్యారాధనలు మహోపకారకములుగా నుండెను. కావున సీతారామరాజు "గూడెము" అను గ్రామములో దేవీపూజలు సలుపుటకు ఏర్పాటు చేసెను. ఈ సంగతి తెలిసి శాండర్సుదొర సైన్యముతో గూడెమునకు బయలుదేరెను. ఇతనికి సహాయముగా టాల్బర్టుదొర రిజర్వు దళముతో "పెదవలస" అను గ్రామములో మకాం చేసెను. దేవీ పూజ నిర్విఘ్నముగా సాగుటకై ఒక యుక్తి చేసి రామరాజు కొందరు విప్లవ కారులను టాల్బర్టు మీదికి పంపెను, వారు ఏమరుపాటుననున్న సైనికులపై బడి బాగుగ మర్దించి తరిమివైచిరి. విప్లవకారులు వేగులవాడు శాండర్సును సమీపించి టాల్బర్టు పరిభవము ఎరింగించెను. శాండర్సు వెనుకకు మరలేను. పెదవలసకు పోయి విప్లవ కారులను పట్టుకొన తలంచెను. కాని గూడెముకుపోయి దేవీ పూజలో పాల్గొనిరి.

ఒకనాడు దమనపల్లిలో విప్లవ కారుల వంట చేసికొనుచుండిరి. సైన్యములరాక వారికి తెలిసెను. వెంటనే గాముసోదరులు అనుచర సమేతముగా త్రోవగాచిరి, కొండల నొరసికొని ఒక ఏరుపారుచుండును. ఏటి యొడ్డుననుండి బాట పోవును. ఆ బాట మిగుల ఇరు కయినది. గాముసోదరులు ఈ బాటప్రక్కన కొండలపై గుబుగుచెట్టుల చాటున తుపాకులు బారువెట్టి కూర్చుండిరి.

ఒకరి వెనుక నొకరుగా సైనికులు పోవుచుండిరి. నల్లసిపాయిలు దాటిపోయిన తరువాత కవర్లు, హైటరు అను నిద్దరు సేనానులు నడచుచుండిరి. వీరిద్దరు విప్లవకారుల తుపాకుల గుండ్లకు గురియై నేలకూలి దొర్లి, ఏటిలోబడి కొట్టుకొని పోయిరి. మిగిలినవారు పారిపోయిరి. గాముసోదరులు చేసిన హత్యావ్యవహారము రామరాజునకు తెలియదు. ఆతడప్పుడు పర్వతము పై తపస్సు చేయుచుండెను.ఈ హాత్యావిషయ మాతనికి తెలిసినప్పుడు గాముసోదరులను కోపగించి, చీవాట్లు పెట్టెను. రామరాజు అహింసాప్రియుడు.

కవర్డు, హైటరుల మరణము తెల్లవారిలో గొప్ప అలజడిని కలిగించెను. ప్రబల సన్నాహముతో మలబారు పోలీసులతో, పటాటోపముతో మిస్టర్ నాఫ్ దొర దిగి వచ్చెను. ఇట్టి బ్రహ్మాండమయిన ప్రయత్నమంతయు నెందులకు? రామరాజు యొక్క ఎనుబదిమంది అనుచరులను పట్టుకొనుటకే. “రామరాజు రాజత్వవాది. గూడెము తాలూకాకు తాను ప్రభువు కాదలచి యీ పితూరీని లేవనెత్తెను. గ్రామములను దోచి ప్రజలను హింసించుచున్నాడు" అని ప్రభుత్వమువారు పచ్చి అబద్దపు ప్రకటన చేసిరి.

రామరాజు చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి 'స్టేషనులను హఠాత్తుగా ముట్టడించెను. కాని తరువాత తరువాత కలెక్టరుకు నోటీసు ఇచ్చి, ఆప్రకారము చేయుచుండ మొదలు పెట్టెను. గ్రామోద్యోగులకు తాను ఎచ్చటెచ్చటికి పోవుచుండెడిది, ఎప్పుడెప్పుడు పోవుచుండునది తెలుప సాగెను. అడ్డతీగల, పైడిపుట్టి, రంప చోడవరము, ఏనుగగుంట, పాత మల్లు పేట, అనుమలపూడి, అన్నవరము మొదలగు గ్రామములలోని ఠాణాలను ముట్టడించి దోపిళ్ళు జరిపెను. కాని రాజు కార్యక్రమము ముందుగా తెలిసియుండియు అధికారులుగాని, సేనానులుగాని జంకి రాకపోయిరి. వచ్చిన వారు విప్లవకారులను చూడగనే పలాయనము చిత్తగించెడి వారు.

రామరాజు ప్రభుత్వపు గూఢచారులను బట్టుకొని, భయపెట్టి వదలెడువాడు. వస్తుసామగ్రి, ఆయుధాలు, మందుగుండ్లుగల బండ్లను ఆపి అంతయు కాజేసెడివాడు.తలపడి యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు విప్లవకారులు చాకచక్యమునకు సైనికులు విభ్రాంతులగుచుండిరి.విప్లవకారులు ఒక నిమిషమున కొండలమీద, మరు నిమిషమున సమతలముమీద కనబడుచుండిరి. పారిపోవు చున్నారని తరుముచుపోగా. వెనుకనుండి విప్లవకారుల పోటు దుర్భరము కాజొచ్చెను. ఇది రామరాజు యొక్క రణనీతి విధానము.

పెద్దగడ్డపాలెము యుద్ధములో ప్రభుత్వపు సైనికులు మారణ యంత్రములను, ఆగ్నిగోళములను విచ్చలవిడిగ ప్రయోగించిరి. విప్లవకారులు కొందరు మడిసిరి. లింగ పురము ఏటిదగ్గర రాత్రి యుద్ధము జరిగెను. చాలమంది విప్లవకారులు హతులైరి. తరువాత ఎవరిమార్గమున వారు పలాయితు లయిరి. ఇది ఆరవయుద్ధము.

గాయపడిన విప్లవకారులను గ్రామీణులు తమ ఇండ్లలో నుంచుకొని చికిత్సలు జరిపెడివారు. ఉపచర్యలు సల్పెడి వారును గ్రామీణులే. అందుచే ప్రభుత్వమువారు ప్రజలను వేధింప గడంగిరి. క్రూర శాసనములు గావించిరి.

రామరాజు అన్నవరము సత్యనారాయణస్వామి దర్శనార్థము కొండమీదికి వెళ్ళెను. ఈ వార్త పొక్కగానే జనులు గుంపులు గుంపులుగా వచ్చిరి. రాజును దర్శించి ప్రేమ, భక్తి, గౌరవములను ప్రకటించిరి. పూల మాలలు వేసిరి. మంగళ హారతులు పట్టిరి. కానుక లొసంగిరి. పాలు, పండ్లు సమర్పించిరి. అచట రాజు స్నానము చేసి, సంధ్య, జపము, తపము ఆచరించెను. శంఖవరము వెడలినపుడును ప్రజలు ఇట్లే అతనిని సమ్మానించిరి.

ఒకసారి రామరాజు తన ముఖమునకు మసిపూసి కొనెను. విప్లవకారులు మలబారు పోలీసు దుస్తులను ధరించియుండిరి. వీరిని చూచి తమవారే అని తెల్లదొర భ్రమవడి మోటారులు ఆపెను. వెంటనే తుపాకులు గురి పెట్టి అసంసిద్ధులైయున్న సైనికులపై విప్లవకారులు' విజృంభించిరి. తరువాత వారిని నిరాయుధులను చేసి, యుద్ధసామగ్రి నంతయు గ్రహించి పారిపోయిరి.

సర్కారువారు విప్లవకారులకు ఆహారపదార్థములు దొరకకుండ కట్టుదిట్టములు చేసిరి. నదీమార్గములు, భూ మార్గములు, రైలుమార్గములు కాపలా కాచి వర్తకులను నిర్బంధించిరి. కాని యెట్లో ఆహారపదార్థములు మాయమగుచునే యుండెను. ప్రభుత్వమువారు పన్నాగములు పన్ని జనులలో విభేదములు కలిగించుటకు ఆరంభించిరి.

రామరాజు యుద్ధములందు జయాపజయములను పొందినవాడు. ఓడినప్పుడు కొండల కెగబ్రాకి, అనువగు తావులను చేరి, మరల యుద్ధము ప్రకటించుచుండెను. గ్రామోద్యోగులను, సివిలు ఉద్యోగులను బాధించలేదు. వారికి జరిమానాలు మాత్రము విధించెడివాడు. వారు సంతోషముతో జరిమానాలు చెల్లించుచుండిరి. రాజు వదలి పెట్టిన వారిని ప్రభుత్వము వారు శిక్షించసాగిరి. ఎటు అయినను మనకు కష్టములు, అవమానములు తప్పవుగదా యని ప్రజలు విప్లవకారుల యెడ విముఖులైరి. ప్రజలలో నిరుత్సాహ మధికమయినది.

ఇట్లు పదునారు మాసములు యుద్ధభీతి ప్రవర్తిల్లెను. విప్లవ కారులసంఖ్య పలుచబడెను. అందుచే కొత్తబలగము సమకూర్చుకొనుటకై రాజు పర్లా కిమిడి పోయెను. గంటన్నదొర నాయకత్వమును వహించెను. గంటన్న దొర తప్పత్రాగి ఒక యుంపుడుకత్తె యింటికిపోయెను. ఆ యుంపుడుకత్తె మోసముచేసి వానిని సర్కారువారికి పట్టీయిచ్చెను. గంటన్నదొర పరమవిధేయు డయినబంటు. తాగుబోతు తన మొక్కటే వానియవగుణము. ఆయవ గుణమును మాన్చుటకు రామరాజు ఎంతో ప్రయత్నించెను. చివరకా గుణమే వానికి ముప్పు తెచ్చినది.

రామరాజు పర్లాకిమిడినుండి బలగముతో తిరిగివచ్చి శంఖమును పూరించెను. కాని అంతయు నిరాశాజనకముగా పరిస్థితులు మారియుండెను. అస్సాము రైఫిల్సు పటాలము రంగమున ప్రవేశించెను. లార్డు వెల్లింగ్ డన్ మద్రాసు గవర్నరుగా విచ్చేసెను.

రామరాజును పట్టియిచ్చువానికి పది వేలరూపాయల బహుమానమును ప్రభుత్వము ప్రకటించెను. మన్యము చుట్టును రాకపోకలు ఆపివై చిరి. వర్తకము స్తంభించెను. రాజు విప్లవము నాపివై చితినని ప్రకటించెను. రాజు ప్రజలను రక్షించుటకును, పితూరీచారులకు తిండి సంపాదించుటకును అశక్తుడయ్యెను. 1924 మే నెలలో రామరాజు అనుచరుల నెల్ల చేరబిలిచి వారికెల్లరకు వీరమర ణము శాసించెను. విప్లవవీరులు ఒక్కొక్కరే సైనికుల నెదిర్చి హోరాహోరీగా యుద్ధముసలిపి వీరమరణము నొందిరి. రామరాజు కనబడుట లేదు.

ఒక యోగి ఒక యేటిదగ్గర ఒక కోయబాలునకు గన్పించెను. ఆ యోగి ఒక లేఖవ్రాసి దానిని సేనాధిపతి కిడుమని వానికి చెప్పెను. ఒక పోలీసు ఉద్యోగి ఉత్తరమును చదువుకొని యోగివద్దకు వచ్చెను. అతని యొద్ద ఎట్టి ఆయుధమును లేదు. నిశ్చలముగా తపస్సు చేసికొను చుండెను. ఇంతలో సైన్యమువచ్చి అతని చుట్టుముట్టెను. వారికి తానే సీతారామరాజు నని యోగి చెప్పెను. ఆ యోగిని మేజరు గుడాలు అను తెల్ల సేనానికడకు తీసికొని పోయిరి. ఇతడు రామరాజు అగునా, కాడా ఆలొచించుటకు గుడాలు పూనుకొనలేదు. గొలుసులతో యోగిని చెట్టునకు కట్టించెను. యోగి మాట్లాడనుండగా గుణాలు తుపాకి గురిపెట్టెను. కుడి యెడమల వరుసగా పాదములనుండి పైపైకి తుపాకీ కాల్చుచుండెను. పాదములు, మోకాళ్ళు, తొడలు, నడుము, నాభి తుపాకి గుండ్లతో గాయము లయి రక్తము ప్రవహింపసాగెను. విశాలవక్షముపై కాల్చుటతో యోగి శాశ్వత నిద్ర చెందెను.

గుడాలు శాసన విరుద్ధమయిన పని గావించెను. గుడాలు ఖూనీచేసెను. మరణించిన వాడు రామరాజగునో కాడో తెలిసికొనుటకును, శవమును బహిరంగ పరచుటకును, వీలుగా లేకపోయెను. పరీక్షార్థము ఈ మాంసపుముద్దను ఎచ్చటికి పంపిన ఏమి ప్రమాదమో యని అధికారులు, చేతులు పిసికికొనిరి. గుడాలు నాక్షేపించుచు నెత్తి, నోరు గొట్టుకొనిరి. తమ యపరాధరహస్యము వెల్లడికాకుండ నుండుటకై గప్ చుప్ గా శవదహనము గావించిరి. (మే 7, 1924).

ఆయోగి రామరాజు కాడనియు, పృథ్వీసింగు అను అనుచరుడయి యుండియుండుననియు, అల్లూరి సీతారామరాజు చిరంజీవియనియు జనులు ఇప్పటికిని తలంచు చున్నారు. ఈతనినిగూర్చి పాటలు, పద్యములు, బుఱ్ఱకథలు, రచితములై ప్రచారములో నున్నవి.

అల్లూరి సీతారామరాజు గొప్ప మేధావి, తేజస్వి. శివాజీ, రాణాప్రతాపసింహ, ఝాన్సీ లక్ష్మీబాయి మున్నగువారి శ్రేణిలో చేరతగిన జాతీయవీరుడు. లోకహితైక పరాయణుడు.

ఆ. వీ.