Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్లసాని పెద్దన

వికీసోర్స్ నుండి

అల్లసాని పెద్దన  :- స్వారోచిష మనుసంభవ కర్తగా అల్లసాని పెద్దన యాంధ్రసాహిత్య లోకమున సుప్రసిద్ధుడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు, ఋగ్వేది. ఆశ్వలాయన సూత్రుడు. వశిష్ఠసగోత్రుడు. తండ్రి పేరు చొక్కనామాత్యుడు. బళ్ళారి మండలమునందలి ‘దొరాలయము' లేక 'దోరాల' యను గ్రామ మీ కవి జన్మ స్థాన మని జనశ్రుతి కలదు. ఈతని బాల్యమును గూర్చియు విద్యాభ్యాసమును గూర్చియు మన కంతగా తెలియదు. శఠకోపయతి తనకు గురు వని తెలిపి, మనుచరిత్ర పీఠికలో పెద్దన గురుస్తుతి కావించెను. తన కవిత్వము శఠకోపయతి ప్రసాదాసాదిత మని యితడు వాకొనెను. శిష్యుడయిన పెద్దన కీ శఠకోపస్వామి హయగ్రీవ మంత్రము నుపదేశించెననియు, తత్ప్రసాదమున నతనికి కవితాధార సిద్ధించెననియు గొందరు వ్రాసిరి. ఏది ఎట్లున్నను విద్యాభ్యాసానంతరమున బెద్దన యెట్లో కృష్ణరాయల యాస్థానమును జేరి అష్టదిగ్గజములలో నగ్రగణ్యుడని పేరొందెను. పారిజాతాపహరణ కర్త యగు నంది తిమ్మన, రాజశేఖరచరిత్రమును రచించిన మాదయగారి మల్లనయు, కాళహస్తి మాహాత్మ్య రచయిత యగు ధూర్జటియు నితనికి సమకాలికులగుటయేగాక, రాయల యాస్థానమునందే యుండిరి. అష్టదిగ్గజములలోనివారే యగు మాదయగారి మల్లన్నయు వసుచరిత్ర కర్త రామ రాజభూషణుడును, పెద్దనకు శిష్యులని ప్రసిద్ధి.

సంస్కృతాంధ్రములయందు పెద్దన గొప్ప పండితుడు; కర్ణాటక భాషా పరిచితియు కలవాడు. పురాణాగమేతిహాస కథార్థశ్రుతియుతుడు. చతుర్విధ కవితా విశారదుడు. చతుర వచోనిధి. కవి పండిత మండిత మగు నిండుసభలో న సమానమగు నాశుకవితాధోరణిచే 'సాహిత్య సమరాంగణ సార్వభౌము' డగు కృష్ణరాయలను మెప్పించి, బిరుదు గండపెండేరమును తన పాదమున తొడిగించుకొనిన మేటి. ఆస్థాన కవిశ్రేష్ఠుడుగను, పరీక్షాధి కారిగనుఉండియు ఈర్ష్యారహితుడై యనేకాంధ్రకవులకు రాయలచే సన్మానము చేయించిన యుదార శీలుడు. శ్రీకృష్ణ దేవరాయ లతనిని 'ఆంధ్రకవితా పితామహ' బిరుదముతో బహూకరించెను. ఈ బిరుదము "పెద్దనకు పూర్వమునను, పరమునను నున్న దేయైనను నిది

యితనిపట్ల నవ్వర్థమైన ట్లన్యుల యెడ కాలేదు. తన పోషకుడగు రాయలచే నితడందిన గౌరవ మసాధారణము. ఈ కవి యెదురయినచో రాయలు తన మదకరీంద్రము డిగ్గి కేలూత యొసగి యెక్కించుకొను చుండెనట మను చరిత్రమును కృతినందువేళ పల్లకిని తన కేలబట్టి యెత్తెనట. ఇంతమాత్రమేకాక రాయ లితనికి నడిగిన సీమలం దనేకాగ్రహారములిచ్చి మన్నించెను. విశేషముగ రాజసన్మానము లందిన యాంధ్ర కవులు శ్రీనాథ, పెద్దన లిరువురే.

శ్రీనాథుని వలెనే పెద్దనయు యౌవనమున సమస్త భోగభాగ్యము లనుభవించెను. కాని వార్ధక్యమున నతని వలె నిడుమల బడలేదు. రాయలు పెద్దనకొసగిన యగ్రహారము లనేకములు, వానిని జీవితాంతము దాననుభవించుటేకాక, కోకట గ్రామమునకు 'శఠకోపపుర' మని పేరు పెట్టి దానిని దేవబ్రాహ్మణుల కగ్రహారముగా నొసగి పెద్దన తన గురుభక్తిని ప్రకటించుకొనెను. శఠకోప యతికి శిష్యుడయిన పిదప నీకవి వైష్ణవ మతాభిమానిగా మారెనని తెలియుచున్నది. అట్లయ్యు నితడు పరమత ద్వేషములేక యద్వైతభావము గలిగియుండెను. పెద్దన తన యగ్రహారములలోని కొంత భూమిని శివకేశవులకు నిరువురకును ధూపదీప నైవేద్యాది అంగరంగ భోగములకు దానముచేసి యుండుటయు, మనుచరిత్రాదిలో నీశ్వరస్తుతి గావించుటయు నిందుకు తార్కాణములు. ప్రభువులవలన నగ్రహారములు పడసిన కవులు పలువురు కలరు. కాని వారిలో ననేకములను దేవబ్రాహ్మణ వినియోగమునకు శాసన పూర్వకముగా దానముచేసిన యాంధ్ర కవిశిఖామణి పెద్దన యొక్క డే! పెద్దన మను చరిత్రమను ప్రబంధమును మాత్రమేకాక హరికథా సారమను గ్రంథమునుగూడ రచించినట్లు రంగారాట్భం దాదుల వలన తెలియుచున్నది. కాని యీ గ్రంథము లభింపలేదు. ఇవికాక యితడు సీసపద్య శతకమును రచించెనని కొందరును, రామస్తవరాజము, అద్వైత సిద్ధాంతము అను మరిరెండు కృతులను వ్రాసెనని కొందరును వ్రాసిరి. కాని వీనినిగూర్చి మనకేమియు తెలియదు. సత్యావధూ ప్రీణనాది సంస్కృత గ్రంథములు 'ఆముక్త మాల్యద' యను నాంధ్ర ప్రబంధముగూడ . పెద్దన విరచితములేయని పూర్వలాక్షణికులును,వ్యాఖ్యాతలును వ్రాసిరి. ఈ వ్రాతలు నిజము కావనియు శ్రీకృష్ణదేవరాయలే పై గ్రంథముల రచించెననియు నాధునిక పండిత విమర్శకులు నిర్ధారించిరి. అనేకులు దీని నామోదించిరి.

పదునారవ శతాబ్దమునకు పూర్వపు టాంధ్రకవులందరును నన్నయ మార్గము ననుసరించి సంస్కృత పురాణములనో, కావ్య నాటకాదులనో తెనిగించుచు నాంధ్ర సారస్వతము నభివృద్ధి కావించిరి. కాని వీరు స్వతంత్ర రచనలకు పూనరయిరి. ఇట్టియెడ పదునారవ శతాబ్ది ఆరంభమున అల్లసాని పెద్దన మనుచరిత్రమును రచించి ప్రబంధ కవులకు మార్గదర్శి యయ్యెను. మనుచరిత్రమున కే స్వారోచిష మనుసంభవ మనునది నామాంతరము. ఇందలి కథ మార్కండేయ పురాణాంతర్గతము.ఈ పురాణమును పెద్దనకు పూర్వుడుగు మారనకవి తెనిగించెను. ఇయ్యుభయ పురాణముల ననుసరించి పెద్దన మనుచరిత్రమను మహా ప్రబంధమును రచించెను. మూలములోని కథను చాలవర కీకవి యథాతథముగ గైకొనెను. ఔచితీ పోషణమునకై కొన్ని చిరుమార్పులు కావించెను. స్వారోచిషుడను ద్వితీయ మనువు యొక్క జన్మ వృత్తాంత మిందలి యితివృత్తము. ఈ కథ మూలము నందు స్వారోచిషుని పితరుడగు స్వరోచి యొక్క సంభవమునకు హేతుభూతమగు వరూధినీ ప్రవరుల వృత్తాంతముతో ప్రారంభమయి, స్వారోచిషునకు మనుత్వము సిద్దించుటతో ముగియుచున్నది. పెద్దనయు నీకథ నిట్లే చిత్రించెను. ఈ కారణముననే కొందరిందు వస్వైక్యము లేదనుటకు వీలయ్యెను. కాని నాటకములందిది పాటింప బడినంతగా కావ్యములందు పాటింపబడక పోవుటచేత దీనియొక లోపము కాజాలదు. పురాణ కథనే చేపట్టినను పెద్దన యిందు లాక్షణిక నిర్దిష్టములగు నష్టాదశ వర్ణనలను సందర్భోచితముగా కల్పించి మిక్కిలి రసవంతముగా వర్ణించి మూలకథను నాల్గు రెట్లు పెంచి మనుచరిత్రము నొక స్వతంత్ర ప్రబంధముగా నిబంధించెను. ఇందలి వర్ణనములలో పెక్కులు స్వకపోల కల్పితము లగుటచే నిది యనువాద గ్రంథము కాదు. కథ పురాణ ప్రసిద్ధమగుటవలన కల్పితమును కాదు. ఇందలి ప్రధాన రసము శృంగారము. ఇతర రసములును యధోచితముగ పోషింపబడేమ. మొదటిదగు ప్రవర వరూధినీ వృత్తాంతమును పెద్దన మిక్కిలి మనోహరముగను రసవంతముగను రచించి కృతకృత్యుడయ్యెను. రససమంచిత కథలతో కూడిన స్వారోచిషమను సంభవ కథను చతుర రచనతో ప్రబంధముగ రచించుటయే కృతిభర్త యొక్కయు కృతికర్త యొక్కయు ఉద్దేశమని మనుచరిత్ర పీఠిక వలన తెలియుచున్నది.

కవి యిందు నాటకఫక్కి ననుసరించి కూర్చిన వరూధినీ ప్రవరుల సంభాషణము హృద్యాతిహృద్యము, ఇట్టి సంభాషణములు, సంవాదములును కల సందర్భము లీప్రబంధమున మరికొన్ని గలవు. ఐనను ప్రవరవరూధినుల సంభాషణ రూపపద్యములు పెద్దన రచనా చాతుర్యమునకును ఔచితీ నిర్వహణనైపుణికిని చక్కని నిదర్శనములు. అందును వారి తొలిసంభాషణములోని "ఎవ్వతె వీవు' 'ఇంతలు కన్నులుండ' అను రెండు పద్యములును రెండు రత్నములు, ఉత్కృష్టమైన వ్యంగ్యవైభవశోభితములు. 'అల్లసానివాని యల్లిక జిగిబిగి' వీనియందు పరాకాష్ఠనంది వ్యక్తావ్య క్తముగా కాననగును. ప్రవరునిపాత్ర యాంధ్రసాహిత్యమునందు విశిష్టమైనది. అతని మనోజ్ఞమూర్తి, ధర్మకర్మదీక్ష, ఏకపత్నీ వ్రతము, పరస్త్రీ వై ముఖ్యము, శాంతరసమొల్కు బ్రహ్మతేజస్సు, వైరాగ్య వహ్ని తప్తమై పుటములుదేరిన యతని మనోనైశ్చల్యము మున్నగు ధీరశాంతగుణములు మనుచరిత్ర ప్రథమ ద్వితీయాశ్వాసములలో కన్నులగట్టినట్లు చిత్రింపబడినవి, ననవిల్తు శాస్త్రంపు మినుకులను వెన్నతో నభ్యసించిన ప్రోడయగు వరూధినీ వచోవైదగ్ధ్యమును కామశాస్త్రొ పాధ్యాయిత్వము క్రింద కట్టివేసిన అకాముకు డితడు. మె మేని జవ్వాది పనగదంబించు నొడలు గడిగికొని వార్చి శుచియైన వాసనారహితుడు. పెద్దనవంటి సిద్ధహస్తుని చేతిలో పడుటచేత ప్రవరుడు కేవల ప్రబంధ మాత్రోవ జీవికాక, యాంధ్రుల హృదయప్రపంచమున శాశ్వత సజీవవ్యక్తిత్వమును సంపాదించుకొన గలిగెను. దేవవేశ్యయగు వరూధినియందు, తాము వలచిన వారినివలలో వైచుకొనుటకై వారవనిత లుపచరించు వగలు, వలపులు చూపి, యవి నిష్ఫలము లైనపుడు వానిని లకు మార్చి, స్త్రీస్వభావము నత్యంత సహజముగ చిత్రించెను. కావుననే ‘పాటున కింతులోర్తురె' యని పెద్దన వ్రాసిన పద్యము ననుసరించి తర్వాతి ప్రబంధములలో రోదనపద్యము లనేకములు పుట్టినవి.

త్వతీయాశ్వాసమున మాయా ప్రవరుని వంచక స్వభావమును గ్రంథకర్త నేర్పుతో జిత్రించెను. ఈ ప్రబంధము నందలి మొదటి మూడాశ్వాసములు రసవత్తరములు, మధుర భావ విలసిత చతుర కవితాశోభితములు. నాల్గవ ఆశ్వాసము నందలి స్వరోచికృతమైన వేటయంతయు పెద్దన కల్పించినదే. పెద్దన శృంగార శాకుంతలములోని వేట ననుసరించి దీనిని సృష్టించి పెంచి వ్రాసెను. భాషయు, శైలియు ప్రత్యేకమై యుండుటయేగాక యిది కవియొక్క లోకజ్ఞానమునకు గీటురాయివంటిది. మనోరమా వృత్తాంతము నీయాశ్వాసముననే కలదు. మనోరమా స్వరోచుల వివాహము సంప్రదాయాను సారముగా విపులముగా వర్ణింపబడినది. కడపటి దగు నారవయాశ్వాసమున కళావత్యాదుల శాపమోచనము, స్వరోచితో వారి పరిణయము, వనదేవతయందు స్వారోచి జననము, తపస్సు, విష్ణుసాక్షాత్కారము, స్వారోచికి మనుత్వసిద్ధి, అతని రాజ్య పరిపాలనము అను విషయములు కలవు.

ఈ ప్రబంధమున సందర్భానుసారముగ ననేక నీతు లుపదేశింప బడినవి. చతుర్థ పురుషార్థ కామి యగు వైదిక గృహస్థునకు ప్రవరు డాదర్శ పురుషుడు. ప్రవరసిద్ధుల సంభాషణమునందు గార్హస్థ్య సన్యాస ధర్మములును వాని యౌత్కృష్ట్యమును తెలుపబడినవి. వరూధినీ ప్రవరుల ఘట్టమున బ్రహ్మానందమును గోరువారు శమదమాదిగుణ సంపన్ను లగుటతోబాటు పరవిత్త పరనారీ విముఖులు కావలెననియు ధర్మకర్మాద్యనుష్ఠానములచే నివి సుసాధ్యము లనియు, నిశ్చల వైరాగ్య చిత్తులగు ధీరుల చిత్తముల నెట్టిపరిస్థితియందును స్త్రీల మాయలు కలంచజాలవనియు, కవి సూచించెను. మరియు ధర్మ కామములకు సంఘర్షము కలిగినపుడు యత్నముచే ప్రవరునివలె ధర్మమునే రక్షించు కొనవలెననియు కవి బోధించెను. దివ్యజ్ఞాన సంపన్ను లయ్యును కేవల కాముకు లెట్లు పరుల మోసములకు లోనగుదురో, పరవంచన కెట్లు తలపడుదురో ఈ విషయముల వరూధినీ మాయాప్రవర వృత్తాంతములు క్రమముగా నెరిగించుచున్నవి. ధర్మ సమ్మతమయ్యును బహుభార్యాత్వము నింద్య మనియు, స్వకళత్రమునం దయినను నమితభోగేచ్ఛగల వాని బ్రతుకుపై పశుపక్ష్యాదులకు సైతము రోత కలుగు ననియు స్వరోచి వృత్తాంతమువలన తెలియుచున్నది.

ఒక్క ప్రవరునిపాత్ర తక్క యిందలి పాత్ర లన్నియు నతి మానుషము అయిన గంధర్వాప్సరాది దేవత పాత్రలు. స్వరోచి పాత్ర మనుజ గంధర్వ సమ్మిశ్రితముగా గోచరించును. అట్లయ్యును వాని సుఖదుఃఖాదులతో మనకు సంపూర్ణ సానుభూతి కలుగునట్లు కని వానిని నిపుణముగ పోషించెను. కోపస్వభావులును శాపాయుధులు నగు మునులును నిందుగనుపింతురు శాంత స్వభావుడగు ప్రవరుని పాత్రకు వన్నె దెచ్చుటకే వీరి కథలు పెంచి వ్రాయబడినట్లు తోచును. ఇట్లి మహాకవి మూల కథను పెంచి రసభావపూరిత మహాప్రబంధముగ తీర్చి దిద్దుటచే నాంధ్రకవితాపితామహ బిరుదు మితనియందు సార్థకము. దీనికితోడుగా చక్కని ప్రకృతి చిత్రములను, సుందర సన్ని వేశములను, సందర్భానుకూలము లయిన సరస సంభాషణములను పొందుపరచి, నుడికారములను వాడి, జాతీయములను సంతరించి, శబ్దార్థాలంకారములను సవరించియు పెద్దన తనప్రబంధమునందలి యందము నధిక మొనర్చెను. ఈ కారణముననే రామరాజభూషణుడును తదితర ప్రబంధ కవులును మనుచరిత్రము ననుసరించి తమ రచనలను సాగించిరి. పెద్దనయు శ్రీనాథాది పూర్వుల ననుసరించుటయే కాక మనుచరిత్రమున నన్య దేశీయముల నందముగ ప్రయోగించెను.

పోషకు డగు శ్రీకృష్ణదేవరాయలచే నిట్లత్యంతముగ మన్నింపబడి, రాయల యనంతరమున 'కృష్ణరాయలతో దివి కేగలేక బ్రతికి యుంటిని జీవచ్ఛవంబు వోలె' అని దుఃఖించెనేకాని 'మరి హేమపాత్రాన్న మెచట గలుగునని విలపింపలేదు పెద్దన. రాయలు లేని రాజధాని యందుండలేక వైరాగ్యచిత్తుడై తన గురువర్యుడగు శఠకోపయతి యున్న కోకటగ్రామ సమీపమున పెద్దనపాడను గ్రామమును జేరి యందే జీవిత శేషమును గడపెను. హరికథాసారమును పెద్దన యీ కాలమున రచించి యుండెనేమో ? పెద్దనయందలి గౌరవముచే నాగ్రామమున నాటికి నేటికిని అల్లసానివారికి నగ్రతాంబూల సన్మానము నిలచియున్నట్లు చెప్పుదురు. ఈ కవి వంశీయు లిప్పటికిని గొందరు జీవించియున్నారు.

వ. దు.

[[వర్గం:]]