Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమ్మరాజ విజయాదిత్యుడు

వికీసోర్స్ నుండి

అమ్మరాజ విజయాదిత్యుడు (క్రీ. శ. 945-970) :- క్రీ. శ. 625 నుండి సుమారు నాలుగు శతాబ్ధులకాలము ఆంధ్రదేశమును అతివైభవముతో పరిపాలించిన తూర్పు చాళుక్యవంశజులలో ప్రఖ్యాతిచెందిన వారిలో రెండవ అమ్మరాజు ఒకడు. ఈతడు రెండవ చాళుక్య భీమునకు లోకమాంబిక వలన జన్మించెను. క్రీ.శ.945 లో తండ్రి మరణానంతరము తనకు అగ్రజుడును, సవతితల్లి కుమారుడును అయిన దానార్ణవుని త్రోసిపుచ్చి విజయాదిత్యు డను బిరుదువహించి అమ్మరాజు. వేంగి సింహాసనమును అధిష్ఠించెను. రాజ్యాధికారము వహించునప్పటికి అమ్మ వయస్సు 10, 12 సంవత్సరములు మాత్రమే. రాజ్యమునకు వచ్చిన వెంటనే ఇతనికి దాయాదియయిన రెండవ యుద్ధమల్లునితో పోరు ప్రారంభమాయెను. యుద్ధములో అమ్మరాజునకే విజయము లభించినది. కాని ఇంతలో అతని కష్టములు కడతేరలేదు. దేశములో బలవంతులయిన సామంతులు పెక్కురు అమ్మరాజు యొక్క అధిపత్యమును నామమాత్రముగా మాత్రమే గుర్తించిరి. దాయాది మత్సరమువలన ప్రమాదముకూడ పూర్తిగ సమసిపోలేదు. రెండవ యుద్ధమల్లుని కుమారులైన బాదపుడు, రెండవ తైలపదేవుడు. అమ్మ రాజును పదచ్యుతుని చేయుటకు ప్రయత్నించిరి. వీరు అమ్మ రాజు సామంతు లయిన వారిలో కొందరను తమ పక్షమునకు త్రిప్పుకొనిరి. అంతేకాక, రాష్ట్రకూట రాజయిన మూడవ కృష్ణుని సహాయమును గూడ సంపాదించుకొనిరి. రాష్ట్రకూట సైన్యములు వేంగీ సామ్రాజ్యములో అడుగు పెట్టగానే గండనారాయణునివంటి సామంతులును, పాండురంగనివంటి సేనానాయకులును అమ్మ రాజును విడిచి పారిపోయిరి. యుద్ధములో ఓడిపోయి ప్రాణము రక్షించుకొనుటకై అమ్మరాజు రాజ్యమును విడిచి పారిపొయెను.

అమ్మరాజును రాజ్యమునుండి తరిమివేసిన తరువాత. బాదపుడు వేంగీ సింహాసనమును అధిష్ఠించెను. కొంతకాలము రాజ్యముచేసి బాదపుడు మృతినొందిన తరువాత అతని తమ్ముడు రెండవ తైలపదేవుడు విష్ణువర్ధనుడను బిరుదముతో రాజ్యమునకు వచ్చెను. తరువాత కొద్ది కాలమునకే అమ్మరాజు ప్రవాసమునుండి వెలువడి వేంగీ దేశములో ప్రవేశించెను. రాష్ట్రకూటులు వేంగి పై దండెత్తి వచ్చినప్పుడు అమ్మరాజును విడిచి పారిపోయిన సామంతులును సైన్యనాయకులును తిరిగివచ్చి అతని యండ చేరిరి. తైలపదేవుని ఓడించి అమ్మరాజు సింహాసనమును అధిష్ఠించెను, తరువాత కొంత కాలము ఒడుదొడుకులు లేకుండ అమ్మరాజు పరిపాలన సాగినది. క్రీ.శ.955 లో రాష్ట్రకూటులు తిరిగి వేంగి పైకి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిపోయి అమ్మరాజు కళింగదేశమునకు పారిపోయెను,

అమ్మరాజును పారద్రోలి, అతని సవతి సోదరుడయిన దానార్ణవునకు రాజ్యము కట్టబెట్టి, రాష్ట్రకూట సైన్యములు వేంగిని విడచి పోయెను. రాష్ట్రకూట రాజునకు సామంతుడుగా కప్పము చెల్లించుచు దానార్ణవుడు కొంత కాలము పరిపాలన సాగించెను. ఇంతలో కళింగము నుండి అమ్మరాజు, పైతృకమయిన సింహాసనము సంపాదించుటకు తిరిగి వేంగిలో ప్రవేశించెను. పోరువల్ల ప్రయోజనము లేదని తెలిసికొని దానార్ణవుడు అమ్మ రాజునకు రాజ్యమును వశపరచెను, అప్పటికిని అమ్మరాజు యొక్క కష్టములు కడ తేరలేదు. తరువాత కొంత కాలము ఒడుదొడుకులు లేకుండ పరిపాలన సాగినను ఆతని రాజ్యావసానకాలములో తిరిగి అంతఃకలహములు చెలరేగెను. అంతవరకు అణగిమణిగి యుండిన దానార్ణవుడు తిరిగి విప్లవము లేవదీసెను. ఈ విప్లవము యుద్ధముగా పరిణమించెను. తుదకు యుద్ధములో అమ్మరాజు మరణించెను. అమ్మరాజు తనతండ్రి సింహాసనము నధిష్టించి 25 సం॥రము లయ్యెను, ఒడుదొడుకులతో నిండిన అమ్మరాజు జీవితము ఈ విధముగా యుద్ధరంగములో సమాప్తమయ్యెను.

అమ్మరాజ విజయాదిత్యుడు గొప్ప యోధుడు. దక్షతగల పరిపాలకుడు. పరమతసహనము కలవాడు. విధి ప్రాబల్యముచే యుద్ధములో ఓడిపోయి రెండుసార్లు రాజ్యము విడచి పారిపోవలసి వచ్చెను. కాని ఇందులకు కారణము పిరికితనము కాదు. అతని పరిపాలన సాగినంత కాలము దేశము సుభిక్షముగా నుండెను. అమ్మరాజు ఏ మతస్థుడయినది ఇదమిత్థమని నిర్ణయించుటకు తగిన ఆధారములు లేవు. అతడు అన్ని మతస్థులను సమాసదృష్టితో ఆదరించెను. అటు హిందూమతమునకు చెందిన శాఖలలో ఆ కాలములో ముఖ్యమయిన కాలాముఖ శైవమునకును, ఇటు వివిధ జైనసంఘములకును సమానప్రతిపత్తి నిచ్చి ఇతడు ఆదరించెను. తన సామంతులలో ఒకడయిన దుగ్గరాజు అనునతడు ధర్మపురికి దక్షిణమున కట్టించిన కటకాభరణ జినాలయమను జైనదేవాలయమునకు అమ్మ రాజు మలియంపూడి అను గ్రామమును సర్వకర పరిహారముగా దానము చేసెను. అమ్మ రాజు యొక్క భోగస్త్రీ అయిన "చామెక" అను వేశ్య కలుచుంబర్రు అను గ్రామమును సకల లోకాశ్రయ జినభవన మను జైన దేవాలయము లోని భోజనశాలను బాగు చేయించుటకు దానము చేసినట్లు ఒక శాసనమువల్ల తెలియవచ్చుచున్నది. అమ్మరాజు సామంతవర్గములోని వారైన భీముడు, నరవాహనుడు అను ప్రభుసోదరు లిరువురు విజయవాటిక అనుచోట రెండు జైనదేవాలయములు కట్టించినట్లును, ఆ దేవాలయముల పోషణార్ధము అమ్మరాజు ఇప్పటి తెనాలి తాలూకాలోనున్న పెద్దగావిడిపర్రు అను గ్రామమును దానము చేసినట్లును మరియొక శాసనమువల్ల తెలియ వచ్చుచున్నది.

ఈ విధముగా తన రాజ్యములోని అన్ని మతముల వారిని సమానముగా ఆదరించి దేశము యొక్క సర్వతోముఖాభివృద్ధికి సర్వదా పాటుబడుచు అమ్మ రాజ విజయాదిత్యుడు క్రీ. శ. 970 లో వీరస్వర్గమందెను.

ఆర్. ఎన్. ఆర్.

[[వర్గం:]]