సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము)
అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము) : క్రీ. శ. 776 వ సంవత్సరము జులై 4వ తారీఖున 13 రాష్ట్రాలు తమ స్వాతంత్య్రమును ప్రకటించుకొనిన నాటి నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉత్తర అమెరికాలో విశిష్ట స్థానమును ఆక్రమించి ఉన్నవి. క్రమముగా విశాలమై అది నేడు 48 రాష్ట్రాలతో కూడి ఉన్నది. అలాస్కా, హవాయ్, పోర్టోరికో మొదలైన పరిసర ప్రాంతాలు కూడ చేరిఉన్నవి. ఇవి సుమారు 30 లక్షల చదరపుమైళ్ల వైశాల్యము కలిగి ఉన్నవి. జనాభా 1950 లో 15 కోట్ల 42లక్షల 33 వేలు ఉండెను. ఇందులో 12 కోట్ల 47 లక్షల 80 వేలమంది తెల్లజాతికి చెందినవారును, 1కోటి 50 లక్షల 42 వేల మంది నీగ్రోలును ఉన్నారు. అందువలన నీగ్రోలు జాతిభేదముకలవా రగుటచే వారి సమస్యను అమెరికావారు శ్రద్ధతో పరిష్కరించుకొనుచున్నారు.
పరిపాలన : అమెరికా ప్రజాస్వామ్య దేశము. అధ్యక్షుని పరిపాలనలో ఉండును. 1787 లో ఏర్పడిన రాజ్యాంగ చట్టము ఈనాటివరకు ఎన్నో సవరణలను పొందుచు పరిపాలనను అభివృద్ధి చేయుచున్నది. రాజ్యపాలనాధికారము అధ్యక్షుని చేతిలో ఉండును. ఈయనను, ఉపాధ్యక్షుని, ప్రతి రాష్ట్రములోను శాసనసభ్యుల సంఖ్యకు సమానమైన ఓటర్లు ఎన్నుకొందురు, జాతీయపతాకములో 48రాష్ట్రాల గుర్తులు ఇమిడ్చినారు. అది 7 ఎర్ర గీతలు, 6 తెల్లగీతలతో కూడిఉన్నది. 1814 లో యఫ్.యస్.కి. రచించిన జాతీయ గీతము అవలంబించినారు. అధ్యక్షుడు కాక మిగతావారు కార్యదర్శులని పిలువబడుచున్నారు. రాష్ట్ర కార్యదర్శి(Secretary of State), కోశ కార్యదర్శి (Secretary of the Treasury), రక్షణకార్యదర్శి (Secretary of Defence) పోస్టుమాస్టరు - జనరల్, అటార్నీ జనరల్, ఆంతరంగిక కార్యదర్శి (Secretary of the Interior), వ్యవసాయ కార్యదర్శి (Secretary of Agriculture), వ్యాపార కార్యదర్శి (Secretary of Commerce), కార్మిక కార్యదర్శి (Secretary of Labour) మొదలైన వారితో కూడిన మంత్రాంగము (Cabinet) ఉండును. శాసనాధికారము కాంగ్రెసు అను సంస్థ చేతిలో ఉన్నది. ఇందులో ఉన్నత నభ (సెనేటు), ప్రజాప్రతినిధి సభ (House of Representatives) అను రెండు సభలున్నవి. సెనేటులో ప్రతి రాష్ట్రమునకు ఇద్దరు ప్రతినిధులుందురు. వారు 6 సం.లు అధికారములో ఉందురు. శాసనములు చేసే అధికారముతోపాటు, అధ్యక్షుడు ఇతర దేశాలతో చేసికొనెడు అన్ని ఒడంబడికలను 2/3 వంతు ఓట్లతో ఆమోదించవలేను. అది లేనిచో ఆసంధిచెల్ల నేరదు. అధ్యక్షుడుచేసెడు నియామకాలను ఆమోదించవలసి ఉండును. దీని క్రింద నేడు 15 స్థాయీ సంఘాలు (Standing Committees) పనిచేయు చున్నవి. ప్రజాప్రతినిధిసభ (House of Representatives) కు ప్రతిరాష్ట్రము ఓటు చేయ నర్హతగల వారితో ఎన్నుకొని ప్రతినిధులను రెండేండ్ల అధికార పరిమితితో పంపుకొనును. ఓటుచేయు అధికారాలు ఆయా రాష్ట్రాలలో వేరు వేరు విధముల నిర్వచింపబడి ఉన్నవి. 1952 లో అమెరికాలో 9కోట్ల 84లక్షల మంది ఓటర్లుగా నిర్ణయింప బడిరి. 1953-55 సంవత్సరాలకు ఎన్నుకోబడిన మొత్తము ప్రతినిధులు 435 గురు ఉన్నారు. శాసనసభలలో ఉన్న వారు ఉద్యోగములో ఉండకూడదు. 1924 సంవత్సరములో ఇండియను లనబడు స్థానిక వాసు లందరికిని ఓటు హక్కు ఇయ్యబడినది. రాష్ట్రాలలో కూడ రెండు శాసనసభలు ఉన్నవి. వాటిని కూడ ఉన్నత సభ (నెనేటు) ప్రజాప్రతినిధిసభ (House of Representatives) అందురు. రాష్ట్రాలన్నియు కేంద్ర ఫెడరలు రాజ్యానికి కేటాయింపబడిన విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల మీద శాసనాధి కారము కలిగిఉండును. ప్రజలలో ఓటుచేసేడు వారందరు కలిసి గవర్నరును ఎన్నుకొందురు. వీరి అధికారాలు ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి ఉండును.
సాంఘిక పరిస్థితులు : అమెరికాలో 1951 లో 38,489,54 గురు జన్మించినారు. 14,31,119 గురు మరణించినారు. 15,94,904 వివాహాలు జరిగినవి. అందులో 3,71,000 రద్దుఅయినవి. ఇప్పుడు 1000 కి జన్మించెడివారి సంఖ్య 245, మరణించెడువారి సంఖ్య 9.7 మాత్రమే. 1952 లో 2,65,520 మంది ఇతర దేశాల నుండి వచ్చి యిక్కడ ఉండి పోయినారు. పురుషులలో 1950 లో 100కి 26.2 మంది అవివాహితులున్నారు. స్త్రీలలో 19.6 మంది అవివాహితలు. అయినను నూటికి 66.2 మంది మాత్రమే సంసారము చేయుచున్నారు. 1940 లో 2,50,000 కు మించిన జనాభా గల పట్టణములు 37 ఉన్నవి. ఒక లక్ష జనాభాకు పైగా ఉన్నవి 55 ఉన్నవి. ప్రొటిస్టెంటు శాఖకు చెందిన క్రైస్తవులు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. విద్యాప్రచారము ఎక్కువగా ఉన్నది. 7 మొదలు 16 సంవత్సరాల బాలబాలికలకు చదువు నిర్బంధముగా నేర్పబడుచున్నది. 1951 లో 1859 కళాశాలలు పనిచేసినవి. ఇవిగాక వృత్తివిద్యలు నేర్పెడు పాఠశాలలున్నవి. విద్య యావత్తు రాష్ట్రము చేతులలో ఉండును. మత ప్రసక్తి తో కూడిన విద్యాలయాలకు ప్రభుత్వ విరాళాలు ఉండవు. అట్టి విద్యాలయాలలో 100 కి 10మంది చేరి ఉన్నారు. 1951 లో 1773 ఇంగ్లీషు దినపత్రిక లున్నవి. న్యాయస్థానాలు రాష్ట్ర సంబంధులు గాను, కేంద్ర ఫెడరలు సంబంధులుగాను ఉన్నవి. సర్వోన్నత న్యాయస్థానము కూడ ఉన్నది. అపీలు న్యాయస్థానాలు 11 ఉన్నవి. 1951 లో 6,820 హత్యలు, 5,510 పొరపాటు హత్యలు, 16,800 మానభంగాలు, 52,090 దొంగతనాలు జరిగినవి. 1950 లో 2,09,040 మంది డాక్టర్లున్నారు. 1951లో 6,637 ఆసుపత్రు లున్నవి.
సైన్యము : 1951 లో 15,61,212 మంది సైనికులున్నారు. 20 డివిజనులు, 18 రెజిమెంట్లు ఉన్నవి. పదాతి సైన్యము, వాయు విమాన సైన్యము, కవచ సైన్యము అను మూడు రకాల సైన్యము లున్నవి. నావికా సైన్యములో 8,20,000 ఆఫీసర్లున్నారు. 1952 లో వాయువిమాన వాహన నౌకలు 3 పెద్దవి. 11 చిన్నవి, 5 ఇంకను చిన్నవి ఉన్నవి. 10 వెంబడించు నౌకలు, 4 యుద్ధ నౌకలు, 15 బరువు ఓడలు, తేలిక ఓడలు 450 విధ్వంసక నౌకలు, 100 జలాంతర్గాములు, 880 ఇతర రకాల ఓడలు ఉన్నవి. 1951 లో 7,87,000 మంది విమానబలములో ఉండిరి. సుమారు 16,900 విమానము లున్నవి.
అర్థికపరిస్థితులు ; "ఫెడరలు ప్రభుత్వము 1953 లో 68,736 లక్షల డాలర్లు ఆదాయమును, 79,028 లక్షల డాలర్ల ఖర్చును కలిగి ఉన్నది. 48 రాష్ట్రాలు 28,083 లక్షల డాలర్ల ఆదాయమును కలిగి ఉన్నవి.
ఆర్థిక సంపద : ప్రపంచములో భాగ్యవంతమయిన దేశాలన్నిటిలోను అగ్రగణ్యమయినది సంయుక్త రాష్ట్ర ప్రాంతము. 1950 లో 5,95,92,000 మంది కష్టపడి పనిచేయుచుండిరి.
వ్యవసాయము : ఆధునిక పద్ధతులమీద చేసెడు వ్యవసాయమువల్ల వ్యవసాయఫలితము అత్యధికముగా ఉన్నది 53,82,162 వ్యవసాయ క్షేత్రము లున్నవి. 1952 లో వేల బుషెల్సులో ఇవ్వబడిన లెఖ్ఖల ప్రకారము వ్యవసాయోత్పత్తి ఈ విధముగ ఉన్నది. మొక్కజొన్న, 33.06,735; ఓటు ధాన్యము 12,68,280; గోధుమ 12,91.477; బంగాళాదుంపలు 3,47,051; బార్లీ 2,27,008; సోయా 2,91,682. ఇవి దేశము మొత్తము మీద అన్ని రాష్ట్రాలలో పండుచున్నవి.పొగాకు 2,32,82,26,000 పౌనులు పండినది. 1951 లో ప్రత్తి 151,44,000 బేళ్ళు పండినది. 1952 లో 18,864,667,000 డాలర్ల విలువగల పశువులున్నవి.
అడవులు : అమెరికా సంయుక్త రాష్ట్రములలో 46,10,44,000 ఎకరాల అడవి ఉన్నది. అందులో నుండి ఏటేటా 1,600,972,000,000 బోర్డు అడుగుల చెక్కను కోసెదరు. అందులో అన్నిరకాల కఱ్ఱలు ఉన్నవి.
'ఖనిజములూ : 1951 లో అమెరికాలో ఈక్రింద పరిమాణమున ఖనిజ ఉత్పత్తి జరిగినది. ఇనుము 1159 లక్షల టన్నులు; వెండి 397 లక్షల ఔన్సులు; బంగారము 17 లక్షల 41 వేల ఔన్సులు; రాగి 9, 28, 329 టన్నులు; సీసము 3,88,143 టన్నులు; జింకు 6,71,525 టన్నులు బాక్సైటు 18,48.676 టన్నులు; పాదరసము 7,293 బుడ్లు ఉత్పత్తి చేయబడినవి.
పరిశ్రమలు : 1950 లో అమెరికాలో 2,50,000 ఫ్యాక్టరీ లున్నవి. అందులో 1,17,68,056 మంది పని చేయుచున్నారు. 20 రకాల పరిశ్రమ విభాగాలు ఏర్పాటు చేయబడినవి. అందులో ఆహారపరిశ్రమ, పొగాకు, గుడ్డల నేత, కొయ్యపని, కాగితపు పరిశ్రమ, అచ్చుపనులు, రాసాయనిక పదార్థాలు, గాజుపనులు, యంత్రపు పనులు, రవాణా యంత్రసామగ్రి ఉన్నతస్థితిలో ఉన్నవి. ఇనుప పరిశ్రమ చాల గొప్పది. అమెరికా సంయుక్త రాష్ట్రాల కార్పొ రేషను ప్రపంచములో నెల్ల గొప్పసంస్థ.
టినెస్సిలోయ సంఘము : ఇది అమెరికా కంతటికిని ముఖ్యమయిన ఆర్థికాభివృద్ధి ప్రణాళిక గలది. టి. వి. ఎ. అను పేరుగల సంస్థ. 1951 లో టినెస్సీ అనెడు నదికి 18 వ ఆనకట్ట పూర్తి చేసినారు. ఇప్పుడు దానికి 28 పెద్ద ఆనకట్ట లున్నవి. 630 మైళ్ల నీటి ప్రయాణ సౌకర్యము ఉన్నది. 600 మిలియన్ టన్నుల - మైళ్ల మోటారులు, ఇనుము, ఉక్కు, గోధుమ, మొక్కజొన్న, బొగ్గు, పెట్రోలియం మొదలయిన యితర సామగ్రి ప్రయాణము చేసినది. ఇందులో 1500 మిలియన్ కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయినది. దానిధర 1.35 సెంట్ల ఖరీదు ఉన్నది. ఈ లోయలో ఎరువులు ఉత్పత్తి. బ్రహ్మాండమైనది. 1950లో ఈలోయ ప్రజల ఆదాయము 5 రెట్లు పెరిగినది.
వర్తకవ్యాపారము : 1952 లో 15,642,415,000 డాలర్ల ఎగుమతులు - 10,353,255,000 డాలర్ల దిగుమతులు జరిగెను. ఎగుమతులలో ధాన్యాలు, ధాన్యపు వస్తువులు, వ్యవసాయ యంత్రసామగ్రి, పారిశ్రామిక యంత్రసామగ్రి, మోటారు యంత్రసామగ్రులు, ప్రత్తి, దానివస్తువులు చాల ముఖ్యమైనవి. దిగుమతులలో కాఫీ, ఇనుముజాతికి చెందని ఖనిజవస్తువులు, పెట్రోలియం వస్తువు, వార్తాపత్రిక లకాగితము, రబ్బరు, ఉన్ని ముఖ్యమైనవి. బ్రిటను ముఖ్యమైన వ్యాపారదేశము అయినను అమెరికా వ్యాపారము ఆసియాతో ఎక్కువ జరుగు చున్నది. తరువాత ఆఫ్రికాఖండము ఎన్నదగినది. అమెరికాతో వ్యాపారముచేయని దేశము లేదని చెప్పవచ్చును.
రహదారులు : 1952లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 3,312,975 మైళ్ల రోడ్లున్నవి. అందులో 1,700,000 మైళ్ళ రోడ్లు సరిగా నిర్మింపబడిన ఉపరిభాగము కలిగి ఉన్నవి. 1950 లో 223,779 మైళ్ల రైలు మార్గము ఉన్నది. ప్రపంచములో అది నూటికి 29 వంతులున్నది. 1951 లో 88,545 విమానాలు వర్తకములో ఉన్నవి.
డి. వి. కె.