Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికాఖండము - ఉత్తరము(భూగోళము)

వికీసోర్స్ నుండి

అమెరికాఖండము - ఉత్తరము(భూగోళము): క్రీ.శ. 1492 లో అమెరికా కనుగొనబడుట కొలంబసు యొక్క పశ్చిమ నౌకాయాత్రలకు ఫలితము. కాని, అమెరిగో వెస్పూసి, మధ్య బ్రెజిలుకు వచ్చినప్పుడా ఖండమును మొదట కని పెట్టినట్లు తలంపబడుటచే, క్రీ.శ. 1541 లో మెర్కేటరు ఆ భూభాగమునకు అతని నామమును అనుసరించి అమెరికా అను పేరు పెట్టెను. ఖండము యొక్క ఆక్రమణమును, అంతరప్రవేశమును, అట్లాంటిక్ సముద్రతీరదేశస్థుల ప్రయత్నములచే అభివృద్ధి చెందెను.

ఉత్తరఅమెరికా, ఆసియా ఖండమునుండి సన్నని బేరింగు జలసంధిచే వేరు చేయబడియున్నది. ఇందలి చాల భాగము మకర రేఖకును, ధ్రువ రేఖకును నడుమ 100° పశ్చిమ రేఖాంశమున కిరుప్రక్కల సమానముగా వ్యాపించియున్నది. ఇది పెద్దఖండములలో మూడవది. దీని వైశాల్యము 80 లక్షల చ. మైళ్ళు. దీనికొలత ఉత్తరమునుండి దక్షిణమునకు 6,000 మైళ్లు. సంయుక్త రాష్ట్రములు ఉత్తరమున మధ్యధరా సముద్రమువరకును వ్యాపించిఉన్నను, పెక్కు విషయములలో మధ్యధరా సముద్ర ప్రాంత దేశములకన్న భిన్నములుగా నున్నవి. సంయుక్త రాష్ట్రములకు ఉత్తరమున ఉన్న కెనడా సుమారు అంతే విస్తృతమైనది. సంయుక్త రాష్ట్రములకు దక్షిణమున మెక్సికోయును, ఇతర ప్రజాస్వామ్యములును ఉన్నవి.

గ్రీనులాండు ప్రధాన ఖండమునుండి బాఫిన్ అఖాతము చేతను, డేవిసు జలసంధిచేతను, వేరుచేయబడి యున్నది. బాఫిన్ ద్వీపము గ్రీనులాండుకును ప్రధాన ఖండమునకును మధ్య ఉన్న ధ్రువమండల ద్వీప సమూహమునం దెల్ల పెద్దది. ఇది ప్రధానఖండముమండి బూతియాహడ్సను సింధుశాఖల చేతను, హడ్సను జలసంధిచేతను విభజింపబడి యున్నది. బాంక్సు, గ్రాంటు, విక్టోరియా, బూతియా అనునవి ఈ ద్వీప సమూహమునందలి ఇతరద్వీపములు. ప్రసిద్ధములైన పడమటి ఇండియాదీవులు, కరివియన్ సముద్రమునందలి ద్వీపసమూహములు, క్వీను ఛార్లొటి, వాంకూవరు ద్వీపములు పసిఫిక్ తీరమునకు ఎదురుగా ఉన్నవి. అలాస్కా, కాలిఫోర్నియా, మెక్సికో, లారెన్సు, సింధుశాఖలును, హడ్సను అఖాతమును ఖండముతీరము లోనికి చొచ్చుకొసిపోయిన ప్రధాన జలభాగములు.

భౌతిక స్వరూపము  : ఉత్తర అమెరికా ఖండమును (1) పసిఫిక్ పర్వతపంక్తి (2) తూర్పు ఉన్నతభూములు (3) మధ్య మైదానములు అని మూడుభాగములుగా

విభజించుట మేలు. ఇట్టి విభాగమువలన అచ్చటి శీతోష్ణస్థితిని, వృక్ష సంపదను, ఇతర పరిస్థితులను సులభముగా అర్థము చేసికొనుటకు వీలగును. ఇతర వివరములును, స్థానిక భేదములును, ప్రధానములైన ఈ అంశముల నుండి, సహజముగా ఏర్పడినట్టివే.

1. పసిఫిక్ పర్వతపంక్తి  : ఈ పర్వత పంక్తి పసిఫిక్ తీరమునంటి ఉత్తరమునుండి దక్షిణమువరకు వ్యాపించు టయే కాక ఇంకను దక్షిణముగా దక్షిణ అమెరికాలోనికి కూడ కొనసాగుచున్నది. ఇది పసిఫిక్ సముద్రతీరము నంటి యున్న పసిఫిక్ పర్వత మేఖలలోని ఒక భాగము. ఈ పర్వత పంక్తి హిమాలయము లేర్పడిన కాలముననే ఏర్పడినది. ఈ మడత పర్వతములలో పలువిధములైన గుట్టలు కనబడుచున్నవి. వీటి ఇరుపార్శ్వములందును బంగారము, వెండి, రాగి సీసము, నూనె కలవు.

పర్వతపంక్తిలో పెక్కు పర్వతములు సమానాంతరముగా వ్యాపించి, దక్షిణమున విస్తృతములై, తిరిగి మధ్య అమెరికాలో కలియుచున్నవి. ఉత్తరమున కెనడాలో ఈ పర్వములు తీరభూమినుండియు కలవు. వీటికి తీర పర్వతములు, సెలకర్కు పర్వతములు, రాకీ పర్వతములు అని పేర్లు. దక్షిణమున వాని పరిశిష్టములు తీరపర్వతములు, కాస్కేడు, సిరానివాడా, రాకీ పర్వతములు అని పిలువబడును. వీటిలో రాకీ పర్వతములు ప్రధానములైనవి. ఈ పర్వత పంక్తులు నడుమ కొలరేడో, పెద్ద అమెరికా ఎడారి, (గ్రేటు బేసిన్) మున్నగు మైదానములు, ఎడారులు, కాలిఫోర్నియాలోయ మొదలగు సుందరము లైన లోయలు కనబడుచున్నవి.

2. తూర్పు ఉన్నతభూములు  : తూర్పు తీరమున ఉత్తరమునుండి దక్షిణమువరకును గ్రీనులాండు పీఠభూమియు కెనేడియనుషీల్డును, అస్లాషియను పర్వతములును, వ్యాపించియున్నవి.

కెనేడియను షీల్డనునది కఠినస్ఫాటిక శిలామయ ప్రదేశము. ఇది పసిఫిక్, పర్వతపంక్తి కంటెను ముందేర్పడినది. ఇందు ఇనుము, రాగి, వెండి, బంగారము, కోబాల్టు, నికెలు కలవు. అస్లాషియను పర్వతముల పడమటి పార్శ్వమున ఖండమునకు సంబంధించిన ముఖ్యమైన బొగ్గుగనులును, నూనె గనులును గలవు. షీల్డుపై ఇప్పు డేర్పడిన పెక్కు సరస్సులు గొప్ప హిమయుగములలో హిమఫలకములచే చేయబడిన వివరములు. మధ్య మైదానములకు ఉత్తరముగా పారు మంచుప్రవాహములు, కరగిన హిమఫలకములవలన ఏర్పడినవి. ఉత్తరాన హడ్సన్ లోయ నుండినై రృతిదిక్కుగా టెన్నీసులోయవరకును వ్యాపించు అప్లొషియనులలో కొండలును, పీఠభూములును కలవు. ఈ కొండలు పీడ్మంటు అనబడు వెడల్పయిన పీఠభూమి రూపమున అట్లాంటిక్ తీరమువరకును వ్యాపించుచున్నవి. అట్లాంటిక్ సముద్రములో పడు వేగవంతములైన నదులచే ఈ పీఠభూమి విభక్తము చేయబడుచున్నది. వేగవంతములై న నదులును, జలపాతములును విస్తారముగా గల ఈ పంక్తికి జలపాతపంక్తి (Fall Line) అని పేరు.నీలపర్వతపంక్తి (Blue Mountain ridge) పీడ్మంటుకు పడమటి సరిహద్దు. దానికి పడమట విశాలములయిన 'బొగ్గుగనులకు ప్రసిద్ధివడసిన ఆలిఘనీ పీఠభూమి కలదు,

మధ్య మైదానములు  : పడమటి పర్వతపంక్తి కిని తూర్పు ఉన్నతభూములకును నడుమ ఉన్న ప్రదేశమంతయు చదునయిన భూములతో కూడియున్నది. హడ్సను అఖాతము నకును, పెద్ద సరస్సులకును, మిసిసిపీ సెంటులా రెన్సు నదులకును, అట్లాంటిక్ తీరమునకును చుట్టును పల్లపు భూములు గలవు. మధ్యనున్న పల్లపుభూములనుండి అచ్చటి నేల పడమటగా ఎత్తుగా పెరిగి రాకీ పర్వతములతో కలియుచున్నది. ఈ ప్రదేశమునకు పెద్ద మైదానము అని పేరు. కెనడా షీల్డుప్రాంతమునందుతప్ప మిగిలిన మధ్య మైదానముక్రింద భూగర్భములో ఇటీవలి కాలమున ఏర్పడిన మెత్తని పిండి రాళ్ళ కొండలు కనుపట్టును.

ఈ ఖండమునందలి నదులను రెండు గొప్పశాఖలుగా విభజింపవచ్చును. (1) పడమటి పర్వతపంక్తులనుండి పసిఫిక్ సముద్రములో పడు నదులు (2) మధ్యమైదానముల నుండి ఆర్కిటికు సముద్రములో కాని అట్లాంటికు సముద్రములో కాని పడు నదులు.

అలాస్కాలోని యూకను, కెనడాలోని ఫ్రేజరు, కొలంబియా నదులు, సంయుక్త రాష్ట్రము లందలి స్నేకు, కోలిరేడో నదులు మొదటిశాఖకు చెందును. మెకంజీనది ఆర్కిటిక్ సముద్రములోనికి ప్రవహించును. సాస్కెచ్చివానాయు ఎఱ్ఱనదియును విన్ని పెగ్ సరస్సు ద్వారా హడ్సను అభాతములోనికి ప్రవహించును. పెద్ద సరస్సులనుండి ప్రవహించు సెంటులారెన్సునది అట్లాంటిక్ సముద్రములో పడుచున్నది. ఈ రెండవశాఖకు చెందిన ప్రధానమయిన ఈ నదులన్నియు కెనడాలోనే ఉన్నవి. మిస్సిసిపీ మహానదియు దాని ఉపనదులును మధ్య మైదానముల దక్షిణమునుండి ప్రవహించుచున్నవి. ఆ ఉపనదులలో ఆర్కన్ పస్, మిస్సౌరీ పశ్చిమ పర్వతముల నుండియు, ఓహియో పెన్నెసీనదులు తూర్పు ఉన్నత భూముల నుండియు ప్రవహించుచున్నవి. అఫ్లాషియనుల యందు పుట్టి అట్లాంటిక్ సముద్రములోనికి ప్రవహించు చిన్న నదులు అనేకము లున్నవి. వానిలో హడ్సను,డెలా వేరు, పోటోమాక్ అనునవి ముఖ్యములై నవి. రియో గ్రాం డి, డినార్టీయు దాని ఉపనదులును మెక్సికో సింధుశాఖలో కలియు చున్నవి.

రాకీ పర్వతములందును అచ్చటి పీఠభూములందును పెక్కు సరస్సు లున్నవి. వానిలో పెద్ద ఉప్పు సరస్సు మిక్కిలి ప్రసిద్ధమైనది. గ్రేటు బేరు, గ్రేటు స్లేవు, అత బాస్కా, విన్ని పెగ్ సరస్సులును సుపీరియరు, మిచి గాన్, హ్యూరన్, ఈరీ, అంటారియో మొదలగు మహా సరస్సులును ఒక పెద్ద సరఃపంక్తిగా ఏర్పడి యున్నవి. ఇవి వాయవ్యమునుండి ఆగ్నేయము వరకును వ్యాపించి యున్నవి. ఇవన్నియు కెనడాలోనే ఉన్నవని చెప్పవచ్చును. కాని పై మహాసరస్సులు కెనడా సంయుక్త రాష్ట్రముల సరిహద్దునందున్నవి. ఈశాన్య భాగమున పెద్దవియు, చిన్నవియు అగు అనేక సరస్సు లున్నవి.

శీతోష్ణస్థితి :శీత కాలములో క్వినుచార్లటి ద్వీపమునకు దక్షిణముననున్న పడమటి తీరము, మధ్య అమెరికా, మిసిసిపీ తీరమునందలి నెంట్ లూయీకి దక్షిణము నందలి పల్లపు భూములు, న్యూయార్కు వరకును గల తూర్పుతీర ప్రదేశములు తప్ప మిగిలిన ఉత్తర అమెరికా అంతయు నీరు ఘనీభవించు ఉష్ణోగ్రతకు (Freezing Point) క్రిందుగా ఉండును. పడమటి తీరము, బ్రిటిషు కొలంబియా తీరము చేరుచున్న ఉత్తర పసిఫిక్ ఉష్ణజల ప్రవాహముచే ఆవరింపబడి యుండును. అచ్చట అది చీలి దక్షిణమున శీతజల ప్రవాహముగను, ఉత్తరమున ఉష్ణజల ప్రవాహముగను మారుచున్నది.

ఈ ఉష్ణ ప్రవాహముయొక్క ప్రభావము పడమటి తీరమున అట్లాంటిక్ తీరమునకంటే మిక్కిలి ఉత్తరము వరకును కానబడుచున్నది. ఈశాన్య తీరమునకు దూరముగా ప్రవహించు శీతల లాబ్రడారు ప్రవాహము అచ్చటి భూములను చల్లగా ఉంచును. ఈ ప్రవాహము ఉష్నజల ప్రవాహము (Gulf stream) తో కలిసినప్పుడు ప్రమాదకరమైన పొగమంచు ఏర్పడుచుండును. ఏ పర్వత పంక్తి చేకొని అడ్డబడని శీతల ధ్రువమండల వాయువులు దక్షిణమున రియో గ్రాండ్ డీనార్టీ, సెంట్ లూయీల వరకునుగల ఖండ భాగమును చల్లగా ఉంచును. న్యూయార్కు సున్నా (0°) డిగ్రీలకు క్రిందుగా ఉండును. ఖండమునకు పడమటినుండి తూర్పునకు అడ్డముగా పెక్కు వాయుగుండములు సంచరించుచు గాలివాలుగల రాకీపర్వత భాగమునకు వర్షమును ఇచ్చును. కాని ఖండములో అవి పొడిగానే ఉండును.

ఉత్తర పసిఫిక్ తీరమున సంవత్సరమంతయు వర్షపాతము ఉండును, కాని గాలి కొట్టువైపున గల లోయ లన్నియు శుష్కములుగా ఉండును. ఉత్తర పసిఫిక్ ప్రవాహమునుండి వీచువాయువులు ఉష్ణములై నీటి ఆవిరితో గూడి పడమటి తీరమున అధిక వర్షము కలిగించును. అవి ఒక్కొక్కప్పుడు రాకీ పర్వత పంక్తిని దాటి మైదానములోనికిదిగి ధ్రువమండల వాయువుల చల్లదనమునకు కొంత ఉపశాంతిని సమకూర్చును. ఈ వాయువులకు "చినూక్సు" అని పేరు. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టునున్న ప్రదేశము వెస్టర్లీ వాయువుల ప్రభావమునకు గురియై శీతకాలమున దక్షిణముగా తిరుగును. వేసవిలో ప్రదేశముపై వాటి ప్రభావము ఉండదు. అందుచే ఈ స్వల్ప ప్రదేశమున మధ్యధరా శీతోష్ణస్థితి కానబడును.

వేసవిలో, వాయవ్యమున మెకంజీ ముఖద్వారము వరకును, సరఃపంక్తి వరకును, నేరుగా లాబ్రడారు రాష్ట్రము వరకును గల ఖండమునందలి చాలభాగము నందు ఉష్ణోగ్రత 60° F కంటె అధికముగా ఉండును. మెక్సికన్ పీఠభూమిలో తాపక్రమము 90° F కు పైగా నుండును. మధ్య మైదానములు మిక్కిలి ఉష్ణములగును, శీత కాలములో నీరు గడ్డకట్టు ఉష్ణోగ్రతకు (0°C) క్రిందుగా ఉండు న్యూయార్కు ఇప్పుడు దక్షిణభారతదేశము యొక్క పశ్చిమతీరమువలె అధికమైన ఉష్ణమునకు గురిఅగును. మెక్సికో సింధు శాఖనుండి ఉష్ణవాయువులు (సాధారణ పవనములు) ఖండము యొక్క పై భాగమునకు వీచి, ఉత్తరమునుండివచ్చు శీతల వాయు సమూహములపైగా ప్రయాణించుచు, మధ్య మైదానములో వేసవి కాలమున వర్షము కలిగించును. ఈశాన్య వ్యాపార పవనములు పడమటి ఇండియా ద్వీపములకును, మధ్య అమెరికా తూర్పు తీరమునకును, సంవత్సరము పొడుగునను అధిక వర్షమును కలుగ జేయును. మెక్సికన్ పీఠభూమి అధికమగు ఉష్ణోగ్రతకు తావయిన కారణమున, స్థానికమైన ఋతుపవన మొకటి బయలు దేరి మెక్సికో, పడమటి తీరమునకు వర్షమునొసగును. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపట్ల గల ప్రదేశమున శీత కాలమున వర్షము కురియును. మధ్య మైదానము లందును, మెక్సికో ఆగ్నేయ పశ్చిమతీరము లందును, వేసవిలో వర్షములు కురియుచుండును. సంవత్సరము పొడుగునను వర్షము కురియు ప్రదేశములు మూడు ఉన్నవి. 1. ఉత్తర పసిఫిక్ తీరము 2. పడమటి ఇండియా ద్వీపములు.2. మధ్య అమెరికా తూర్పుతీరము, 3. ఈశాన్య- ఉన్నతభూములు, రాకీ పర్వతపంక్తి వర్షచ్ఛాయ యందును, దానిచే ఆవరింపబడిన పీఠభూము లందును, చాల తక్కువ వర్షము కురియును. అందుచే అక్కడ ఎడారులు ఏర్పడినవి.

సహజ వృక్షసంపద  : ఉత్తర అమెరికా యందలి సహజవృక్షసంపద ఆయా ప్రదేశములందలి శీతోష్ణస్థితుల కనుగుణముగా ఉన్నది. అలాస్కా నుండి లాబ్రడారువరకు టండ్రాభాగము వ్యాపించి ఉన్నది. దక్షిణమున కెనడాలో చాలభాగమందును, పడమటి కార్డెలరా దక్షిణభాగమందును సూచీ (పత్రములైన) వృక్షముల వరుస.కన్పించుచున్నది. తూర్పున సరఃపంక్తికి, చుట్టునుగల అల్ప ప్రదేశములో సూచీపత్రములును, పత్రచమోకములునగు వృక్షములు కలవు. అప్లొషియను పర్వతము లందలి ఉన్నత ప్రదేశములందు కూడ సూచీపత్రము లున్నవి. అమెరికా సంయుక్త రాష్ట్రముల తూర్పుతీరమునను పత్రమోచక వృక్షములు గలవు. దానిపై భాగమును నమశీతలమనియు క్రింది భాగమును సమోష్ణ

మనియు చెప్పవచ్చును. ఆ అక్షాంశ రేఖలమీదనే పడమటి తీరమున ఇట్టి సహజవృక్ష సంపదగల కొంత భాగమున్నది. సంయుక్త రాష్ట్రములందలి మధ్య మైదానములును, కెనడా మధ్యభాగమందలి అల్ప ప్రదేశమును పచ్చిక బయళ్ళచే ఆవరింపబడిఉన్నవి. వీనికి "ప్రయిరి" అని పేరు. ఈ 'ప్రయిరీ' లలో వర్షపాతము ననుసరించి పడమట పొట్టిగడ్డియు, తూర్పున పొడుగుగడ్డియు పెరుగును. ఇవి వ్యవసాయము విస్తృతముగ జరుగుచున్న ప్రదేశములు. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టునుగల ప్రదేశమున మధ్యధరా వృక్షసంపదయు, మధ్య అమెరికా యందలి ఉష్ణప్రదేశములందును, పడమటి ఇండియా ద్వీపములందును, ఉష్ణ నిత్యహరితములైన అరణ్యములును గలవు. పసిఫిక్ కార్డి లరా పొడి వర్షచ్ఛాయలందు ఎడారు లున్నవి.

ఉత్పత్తి ' : కెనడాయందు ప్రయిరీలు — ముఖ్యముగా నందలి తూర్పుభాగములు విస్తృతముగా గోధుమలు ఉత్పత్తి యగు ప్రదేశములు. ఇచ్చట ఓట్లు, బార్లీ, రై, అవి సెచెట్లు (నార) (flax) పెరుగును, ఈ ప్రదేశమున వ్యవసాయమును, పశుపోషణమును కలిసి జరుగుచున్నవి. ఇది సంయు క్త రాష్ట్రములందు వసంత కాలమున గోధుమలు పెరుగు ప్రదేశము యొక్క అవశేషము. దీనికి తూర్పున పెద్ద సరస్సుల చుట్టును, ఈశాన్య రాష్ట్రము లందును వ్యవసాయమును, పశుపోషణమును జతగా జరుగు ప్రదేశ మున్నది. దీనికి దక్షిణమున ఖండము యొక్క పూర్వార్ధమందు మొదట ధాన్యము పండు ప్రదేశమును, తరువాత ఖండమున కడ్డుగా ధాన్యము పండునట్టియు, శీతకాలమున గోధుమలు పండునట్టియు ప్రదేశమును కలవు. టెక్సాసునుండి తూర్పుగా దక్షిణ రాష్ట్రము అన్నిటియందును ప్రత్తి విస్తారముగా పండును. ఉన్నతములయిన పశ్చిమ మైదానములలో పందులను, కోళ్లను, పెంచు ప్రదేశములును, ఇంకనుపడమటగా గొజ్జెలను పెంచు ప్రదేశములును ఉన్న వి. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టునుగల మధ్యధరా శీతోష్ణస్థితితోకూడిన ప్రదేశమున మధ్యధరా ఫలోత్పాదక భాగమున్నది. ఉత్తర పసిఫిక్ తీర ప్రదేశములందు మిశ్రవ్యవసాయము సాగుచున్నది. పెద్ద సరస్సులకును, సెంటులారెన్సునకు ఉత్తరమునను కలపవ్యాపారమే ప్రధానమైన వృత్తి. కెనడా తూర్పు పడమర తీరములకు కొలది దూరమున చేపలను పట్టుటకు తగిన ప్రదేశము లున్నవి. మెక్సికో ఉష్ణతీరము లందును మధ్య అమెరికా ప్రజాస్వామ్యము లందును చెరకు, రబ్బరు, పొగాకు, వనిల్లా (Vanilla), జనపనార మొదలగునవి పెంచబడును. సమశీతోష్ణ పర్వత తటము లందు కాఫీయు, విస్తారమైన మొక్కజొన్నయు పెరుగును, పీఠభూములందు ప్రత్తి, గోధుమ, మొక్కజొన్న పండును. ఇచ్చట గొజ్జెలును, పశువులును పెంచబడును. క్యూబా పోర్టోరికోలు చెరకును, పొగాకును, విస్తారముగా పండించు ప్రదేశములు. జమైకా, చెరకునకును. బొంత అరటిపండ్లకును ప్రసిద్ధి, చిన్న ద్వీపములలో వివిధములయిన ఉష్ణమండలపు పంటలు పండును.

అమెరికా ఖండములో అధికమైన ఖనిజసంపద కలదు. కెనడాలో ఖనిజములుగల ముఖ్యప్రదేశము పెద్ద సరస్సులకు ఉత్తరమున ఉన్నది. ప్రపంచమునందలి మొత్తము నికిల్, రాగి, లోహములలో శేవ వంతు ఇచ్చటనే ఉత్పత్తి అగుచున్నది. సుపీరియరు సరస్సు ఉత్తరతీరము లందును, క్విబెక్ లాబ్రడారు లందును విస్తృతములైన ఇనుప గనులు కలవు. పోర్క్యు పైను, కర్కులాండు సరస్సుల ప్రాంతములలో వెండి, మణిశిల, బంగారము కలవు. ఇవిగాక పడమటి కార్డిలరా పార్శ్వములందు నూనెగను లున్నట్లు తలపబడుచున్నది. కెనడాయందలి ప్రయిరీల క్రింద పెద్ద బొగ్గుగను లున్నవి (1) అఫ్లాషి నా (2) దక్షిణ అప్లాషియన్ (3) ఇలివోయిన్ (4) కన్సాస్(5) ఓకహామా పెన్సిల్వేనియాలు అమెరికా సంయుక్తరాష్ట్రములందలి ముఖ్యమైన బొగ్గుగనుల ప్రదేశములు. కాలిఫోర్నియా, ఖండ మధ్య రాష్ట్రములు, టెక్సాసు, ఉత్తర అప్లాషియను, సింధుశాఖాతీరము, మెక్సికో యందలి టెంపికో మున్నగునవి నూనెను ఉత్పత్తిచేయు ముఖ్య కేంద్రములు. ఇనుము, బొగ్గులకుతోడు ప్రపంచమునందలి వెండిలో సగము భాగమును, విస్తారమైన రాగియును, మెక్సికోయందలి పీఠభూమి ప్రాంతములలో ఉత్పన్నమగును. అమెరికాలో పడమటి కార్డిల రా భాగమందురాగి, జింకు, బంగారము, వెండి, సీసము మున్నగు ఖనిజములలో చాల భాగము ఉత్పన్నమగును, అప్లాషియను పర్వతములలో అల్యూమినము గనులు త్రవ్వబడు చున్నవి. మిన్నెసోటా, విస్కాన్సిన్, మిచిగాన్, అను ప్రదేశములందు ముఖ్యముగా ముతక ఇనుము కాన వచ్చుచున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములు అభ్రకము, తగరము, మాంగనీసు, క్రోమియము, నికిలు, టంగ్ స్టను, సౌపిరము మున్నగు లోహములలో కొరవడి ఉన్నవనుట గమనింపవలసిన విషయము.

కెనడాలో పెద్ద సరస్సులకును, సెంటులా రెన్సుకును, తూర్పు ప్రదేశమున జలశక్తి ఆధారములు అధికముగా తూర్పు, ప్రదేశమున పెంపొందింప బడుచున్నవి. అట్టివి కొన్ని అంటారియో నైరుతి భాగమున కూడ కలవు. అమెరికా సంయుక్త రాష్ట్రములందలి జలశ క్తి లో అధికభాగము ఉత్తర ఈశాన్య భాగములందును, అప్లాషి యను లందును, జలపాత పంక్తి యందును, టెన్నెసీయందును ఉత్పన్న మగుచున్నది.

ప్రజలు - రాజకీయ విభాగములు  : యూరోపియనులు రాకముందు అమెరికాలో ఎఱ్ఱుఇండియనులు నివసించు చుండిరి. వీరు దేశ ద్రిమ్మరులయి, వేటాడుచు ముఖ్యముగా ప్రయిరీలలో నివసించుచుండిరి. ఆజ్ టెక్కు లన బడు నాగరక ప్రజలు మెక్సికో యందును, మధ్యఅమెరికా యందును నెలకొనియుండిరి.

ప్రస్తుతము అమెరికా ఈ క్రింది దేశములుగా విభజింపబడి ఉన్నవి.

1. కెనడా: ఇది బ్రిటిషు కామనువెల్తునందలి భాగము. న్యూ ఫౌండులాండు లాబ్రడారులు కూడ ఇందులో కూడిఉన్నవి. ఇవి క్రీ. శ. 1949 లో ఇందు కలసినవి.

2. అమెరికా సంయుక్త రాష్ట్రములలో వాయవ్యమున అలాస్కాయు, పోర్టోరికోయు, పెనామాకాలువ ప్రదేశమును కలిసియున్న వి.

3. మెక్సికో ఒక ప్రజాస్వామ్య రాజ్యము. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రములకు దక్షిణమున ఉన్నది.

4. గాటెమలా, హండూరాస్, సాల్వడారు, నికరాగువా, కాస్టారికా, వెనామా అనునవి మధ్య అమెరికా యందలి ప్రజాస్వామ్యములు.

5. బ్రిటిషు హొండూరాను బ్రిటిషువారి వలస రాజ్యము. 6. పడమటి ఇండియా ద్వీపములలో (అ) క్యూబా ప్రజాస్వామ్యము. (ఆ) రెండు నీగ్రో ప్రజాస్వామ్యముల నడుమ విభక్తమైన హిస్పానియోలా. (ఇ) బ్రిటిషు(జనతారాజ్యము) నకు చెందిన జమైకాయు ఇతర ద్వీపములు - చేరియున్నవి.

అమెరికా వ్యాప్తి - ఆక్రమణములు : జాతీయ రాజ్య ప్రదేశవ్యాప్తి అమెరికా ప్రాథమిక చరిత్రలో స్థిరమైన పద్ధతిగా నుండెను. కొన్ని అపవాదములున్నను దీనికి ప్రకృతిశక్తులలో ముఖ్యమైన ఇతర సమస్యలు కారణములై ఉండెను. అంతరములైనట్టియు, వైదేశికములై నట్టియు కష్టములను ఎదుర్కొనుటయు, రాజకీయార్థిక సమస్యలును ఆకారణములని చెప్పవచ్చును. ఆ వ్యాప్తి బహుళ అపరిహార్యమై ఉండెను. ఆక్రమణపద్ధతి కృతకములైన కుట్రలకు కాక, వ్యవసాయము వలన శాంత జీవితమును సంపాదించు ప్రజల సహజమైన ఆర్థిక సాంఘికాభివృద్ధికి ఫలితముగా ఏర్పడెను. ఏదో యొక యూరపు రాజ్యము యొక్క ఆలోచనలను గురించిన భయమో, ఈర్ష్యయో ఆక్రమణ పద్ధతిపై అధికమైన ప్రభావము ప్రదర్శించియుండెను. ఆక్రమణములు చాలమట్టుకు పాలనాధికారులతోడి సంప్రదింపులకో, యుద్ధము వలననో, అవసరము వలననో, భూమిని కొనుటకో ఫలితములై ఉండెను. ప్రతి ఆక్రమణమును స్వదేశీయ విదేశీయ వైరుద్ధ్యము నకును, సంకుఛితములైన భవిష్యదాలోచనలకును, తావొసంగెను. కాని కాలము గడచిన కొలదిని సింధు శాఖవరకును దూరమునందలి పసిఫిక్ వరకును వ్యాప్తిచెందుట దానికి ఎక్కు వపుష్టి చేకూర్చెనని నిరూపింపబడినది. వ్యాప్తి ఈ క్రింది పద్ధతుల ననుసరించి కొనసాగెను.

(1) క్రీ. శ. 1803 లో నెపోలియనునుండి లూయిసియానాను. కొనుటవలన యూనియనుకు 1,171,931 చ. మై. వైశాల్యముగల ప్రదేశము చేకూరెను.
(2) క్రీ., 1819-1821 లో ఫ్లోరిడా సంధివలన స్పెయినునుండి 59,268 చ. మైళ్ళ ప్రదేశము సంపాదింప బడెను,
(3) క్రీ.శ. 1845 లో, సమ్మతిమీద టెక్సాసు (376,133 చ.మై) చేర్చబడెను.
(4) క్రీ. శ. 1847 లోని యుద్ధములో. న్యూమెక్సికోయు, ఉత్తర కాలిఫోర్నియాయు (545783 చ.మై) మెక్సికోనుండి గ్రహింపబడి ఆక్రమింపబడెను.
(5) క్రీ. శ. 1853 లో మెక్సికో ప్రభుత్వమునుండి గాడ్సడను కొనుటవలన దక్షిణ అరిజోనా న్యూమెక్సికోలలో (45,535 చ. మై.) ప్రదేశము సంపాదింపబడెను.
(6) క్రీ.శ. 1867 లో రష్యానుండి అలాస్కా (590,584 చ.మై) ప్రదేశము కొనబడెను.
(7) క్రీ. శ. 1898 లో హవాయి రాణియగు లిలియు కాలనీ ఆనునామెకు పరిహార మొసగి 6740 చ. మైళ్ళ వైశాల్యముగల పసిఫిక్ సముద్ర ద్వీపమైన హవాయి (Hawaii) ద్వీపము కలుపుకొన బడెను.
(8) క్రీ. శ. 1898 లో స్పెయినుతో జరిగిన యుద్ధమునకు ఫలితముగా మొత్తము (150,000 చ. మైళ్ళ వైశాల్యముగల పోర్టోరికో, ఫిలిప్పైన్ ద్వీపములు, లాడ్రోను ద్వీపములందలి గాము (Gaum) గ్రహింపబడినవి.
(9) క్రీ. శ. 1899 లో గ్రేటు బ్రిటను జర్మనీలతో జరిగిన సంధివలన మొత్తము (54 చ. మైళ్ళు) వైశాల్యముగల షామోను వర్గమునకు చెందిన టౌ, ఒన్సింగా ఓఘ అను చిన్న ద్వీపములతో గూడిన టుట్యులా (Tutuila) సంపాదింపబడెను.
(10) క్రీ. శ. 1916 లో డెన్మార్కు నుండి వర్ణిను ద్వీపములు కొనబడినవి.
(11) పైవానికి తోడు భిన్న కాలములందు పసిఫిక్ ద్వీపము నందలి అచ్చటచ్చటి ద్వీపములు ఆక్రమింపబడినవి.

క్రీ. శ. 1903 లో జరిగిన హేవరిల్లా సంధివలన పెనామా ప్రజాస్వామ్యము, సంయుక్త రాష్ట్రములకు కెరీబియన్ తీరమునందలి కొలోనునుండి పసిఫిక్ తీరము నందలి పెనామా వరకుగల పదిమైళ్ళ వెడల్పుగల ప్రదేశమును శాశ్వతముగా ఉపయోగించుకొను హక్కు ఒసంగెను. సంయుక్త రాష్ట్రములకు పోలీసు, న్యాయము మున్నగు ఇతర ప్రయోజనముల విషయమున ప్రత్యేకాధికారము కలదు. కాలువ మధ్యస్థమై ప్రపంచ వాణిజ్యమునకు ఉపయోగించునదిగా నుండవలెను.

జి. స.

[[వర్గం:]]