Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభ్రకము

వికీసోర్స్ నుండి

అభ్రకము* :- అభ్రకము (Mica) అను పేరున పిలువబడు కొన్ని శైలస్థ ఖనిజములు అనాదినుండియు మానవులచే విరివిగా ఉపయోగింపబడుచు వచ్చినవి. ఇవి కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి యున్నవి. మైకా( Mica) అను పదము ల్యాటిన్ భాషయందలి మైకేర్(Micare మిణుకు మిణుకు మనుట) పదమునుండి వచ్చినట్లు భావింపబడుచున్నది. ఈ సంచయమునందలి ముఖ్య ఖనిజముల పేర్లు, వాని రాసాయనిక నిబంధములు (Chemical compositions) క్రింద ఉదహరింపబడినవి.

1. అభ్రకము - మస్కో వైటు (Common mica, Potassium mica) - H2. K. Al (Sio4,)3,
2. మలాభ్రకము - బయోటైట్ (magnesium iron mica) - H2, K (Mg, Fe), (Al, Fe) (Sio4,)3,
3. భ్రాజాభ్రకము – ఫ్లోగోపైట్ (magnesium mica) H2, K Mg, Al2 (Sio4)3 .
4. లఘుజాభ్రకము - లెపిడోలైట్ (lithium mica)(O H F)2, K Li Al2 Si3 O10
5. క్షారాభ్రకము - పెరాగోనైట్ (Sodium mica)H2 Na Al3, (Sio4)3,

అభ్రకమునకు గల పారిశ్రామిక ప్రాముఖ్యమునకు దానికి గల కొన్ని అనన్యలక్షణములే కారణము. ఈ లక్షణము లన్నియు ఏ ఇతర ప్రాకృతిక పదార్థమందు గాని, సంశ్లేష (Synthetic) పదార్థమందుగాని లేనందున విద్యుద్రాసాయనిక పరిశ్రమలలో అభ్రకము యొక్క ఉపయోగము అనివార్య మగుచున్నది. ముఖ్యముగా విద్యుత్పరిశ్రమలో, అభ్రకము లేనిదే ప్రస్తుతము సాధ్యమైన పురోభివృద్ధికి అవకాశముండి యుండెడిది కాదు. ఇంత ముఖ్య ఖనిజ మగుటవలననే దీనిని అమెరికా ప్రభుత్వపు సైనిక నౌకాస్త్రగణము (Army and Navy Munitious Board) వారు తమ ఇరువదిమూడు యోధన నైతిక (Strategic) ఖనిజములలో చేర్చిరి. క్రీ.శ. 1878 సంవత్సరమున ఎడిసన్ మొదటి మోటారు తయారు చేసి నప్పటినుండి నేటివరకు విద్యుత్ శాస్త్రీయ పురోభివృద్ధికి ప్రత్యేక లక్షణ లక్షితమగు ఈ ఖనిజసంచయము చాల దోహద మిచ్చినదని చెప్పుట అతిశయోక్తి కాజాలదు.

భారతదేశ మందును, అన్యదేశముల యందును గల అభ్రకపుగనులు  : భారత దేశమున మస్కో వైట్ విరివిగా లభ్యమగుచున్నది. ద్రవస్థితినుండి ఘనీభవించిన అనేక రకముల శిలలలో గ్రానైట్లు (granites) ఆఖరున ఏర్పడిన శిలలుగా పరిగణింపబడుచున్నవి. ఈ స్థితిలో మిగిలిన ద్రవపదార్థములోను, వాయురూప పదార్థములోను అభ్రక నిర్మాణమునకు అవసరమగు వివిధపదార్ధములు నిల్వయుండును. ఇవి పెగ్మటైట్స్ (Pegmatites) అనబడు శిలలలో అభ్రక పుస్తకములుగా తయారగుచున్నవి. పెగ్మటైట్స్ విభిన్నమగు శిలలలో చొచ్చుకొని అనేకములగు ఆకారములను గలిగియుండును. అభ్రకము ఇట్టి పెగ్మటైట్సునుండి సేకరింపబడుచున్నది. మన దేశమున ఉత్పత్తియగు అభ్రకము బీహారు, ఆంధ్రరాష్ట్రము, రాజస్థాన్ అను తావులనుండి వచ్చుచున్నది. ఇందులో బీహారునందలి 'కోడర్మా' అను అభ్రక క్షేత్రమునందు 'బెంగాల్ కెంపు' (Bengal ruby) అని పిలువబడు మస్కో వైట్ లభ్యమగుచున్నది. మనదేశమున నుత్పత్తియగు అభ్రకములో నాలుగింట మూడువంతు లిచ్చటిదే. కోడర్మా క్షేత్ర విస్తీర్ణము సుమారు 1500 చతురపుమైళ్లు. ఆంధ్ర దేశమునందలి నెల్లూరు ప్రాంతమునుండి, హరితాభ్రక (green mica) మనుమస్యో వైట్ లభ్యమగును. విద్యు త్పరిశ్రమలో బీహారునందలి దానికంటె ఆంధ్రదేశములో ఉత్పత్తియగు అభ్రకమే అధికముగా వాడుకలో నున్నది. దీనికి కారణము ఇచ్చటి అభ్రకపు రేకులు అధికముగా సమతలము కలిగియుండుటయే. రాజస్థాన్ నందు కూడ 'కెంపు' అభ్రకము లభ్యమగును. ఇచ్చటి గనులు చెదురు మదురుగా నున్నవి.

  • భారతీయ జాతీయ భూతాత్విక సమీక్ష డైరక్టరుగారి అనుమతితో.

ప్రపంచమునందు ఉత్పత్తియగుచున్న అభ్రకములో నూరింట నెనుబదిపాళ్ళు భారత దేశమునందలి నిధులనుండి లభ్యమగుటచే ఈ విషయమున మనదేశము అగ్రస్థానము వహించి యున్నది. 1940-53 సంవత్సరముల మధ్య మన దేశమందలి అభ్రకము యొక్క ఉత్పత్తి వివరములు రేఖాపట (గ్రాఫ్) రూపమున నీ క్రింద నీయబడినవి.

రష్యా, కెనడా, రొడీషియా, టాంగనీకా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రములు, మెడ గాస్కర్, ఆర్జంటీనా, బ్రెజిల్, నార్వే, కొరియా, గౌటి మాలా మొదలగు దేశములందలి గనులనుండి గూడ అభ్రకము సంగ్రహించ బడుచున్నది.

అభ్రకమును శుభ్రపరచుట, క్రమస్థావనము (grading) : గనులనుండి తీయబడిన అభ్రకపుస్తకములలో మంచివానిని వేరుపరచి భాండాగారములలో నిలువచేసెదరు. ఇట్టి పుస్తకములను దళసరి రేకు (sheet) లలోనికి చీల్చి వాని చివరలను సమముగానుండునట్లు కోసివేయుదురు. ఈ పనికై కొడవండ్లను, కత్తెరలను వాడుదురు. ఈ రేకులలో ఇమిడియున్న ఇతరఖనిజములను బట్టియు, వాటి రంగును బట్టియు వాటిని వివిధరకములలోనికి విభజింతురు. వాటి నుండి లభ్యము కాగల దీర్ఘచతురస్రాకారపు గరిష్ఠ వైశాల్యమును బట్టి వాటిని వేర్వేరు క్రమములలో నుంతురు.

చిన్న చిన్న పుస్తకములుగ లభ్యమగు నభ్రకమును ఎగుమతిచేయుటకుముందు వాటిని సాధ్యమైనంత సన్నని పొరలుగా వేరుచేతురు. బీహారురాష్ట్రమున అభ్రకమును చీల్చుటయే వృత్తిగాగల బాలబాలికలు, స్త్రీలు ఈ పని యందు అత్యంత సామర్థ్యముకలవారై యుండుటవలన అభ్రకమునుచీల్చుటలో ప్రపంచమున బీహారు రాష్ట్రమున కొక విశిష్టస్థానము లభించినది. ఇతరదేశములయందు యంత్రసహాయమున సాధింపబడనేరని ఈ కార్యమును వీరు తమ హస్తలాఘవముచే సునాయాసముగా చేయగలుగుటచే ప్రతివత్సరము పొరలుగా చీల్చుటకు కొంత అభ్రకము మనదేశమునకు పంపబడుచున్నదనిన ఆశ్చర్యములేదు.

మనదేశమునందలి అభ్రకపు గనులవద్ద మిగిలిపోవు అభ్రకపు ముక్కలు (Scrap mica) విరివిగా పారవేయబడుచున్నవి. అభ్రక చూర్ణమును తయారుచేయుటలో ఇతర దేశములం దిట్టి అభ్రకము ఉపయోగింపబడు చున్నను మనదేశమున నింకను ఈ విషయముపై దృష్టి మరలలేదు.

పారిశ్రామిక దృష్ట్యా అభ్రక లక్షణములు  : అభ్రకపు రేకులకుగల ఉపయోగములు వాటి స్ఫటికా కారము (Crystal) పై, వాటి నిర్మాణము (Structure) పై చాల వరకు ఆధారపడియుండును. స్ఫటికములకు ఉండవలసిన ముఖ్య లక్షణములు పగుళ్ళు లేకుండుట, వాటి తలము దృఢముగాను, విశాలముగాను ఉండుట, ఇతర ఖనిజ పదార్థముల యొక్కగాని, జీవసంబంధ (Organic) పదార్థముల యొక్క గాని రంగు వాటియందు లేకుండుట,

  • అంగుళములో 1/1000 మందముగల పొరలుగా సులువుగా వేరుపరచుటకు అనువుగా నుండుట ముఖ్యమైనవిగా పరి

గణింప బడుచున్నవి. ప్రపంచములో ప్రస్తుతము విద్యుత్పరిశ్రమలో ఉపయోగింపబడు అభ్రకపు రేకులలో అధిక భాగము ఒకటినుండి మూడు చతురపు టంగుళముల వైశాల్యముగల చిన్న చిన్న పుస్తకములనుండి లభ్యమగు చున్నది.

సన్నటి పొరలలో అభ్రకము ⅛ అంగుళము వ్యాసముగల కడ్డీ (rod) చుట్టును చుట్టినను ఏమాత్రము తునగకుండ వంచుటకు వీలు (flexible) గా నుండును. సాధారణ పరిస్థితులలో అభ్రకము కరుగదు. అత్యధికోష్ణము సోకినను ఇది ఏవిధమైన భౌతికములును, రాసాయనికములును నగు మార్పులను చెందదు. అంతియేకాక ఆకస్మిక విద్యు దుష్ట భేదములవలనగూడ దాని లక్షణములలో ఎట్టి మార్పును కలుగదు. అందుచే ఇది వొక అద్భుతమగు ఉష్ణవిసంవాహన (Heat insulating) పదార్థమని తేలుచున్నది.

ఇదేవిధముగా అభ్రకము విద్యుత్పరిశ్రమలో విసంవాహన (insulating) పదార్థముగా ఉపయోగపడు చున్నది.అభ్రకము నందు ప్రవేశింపగల విద్యుత్ప్రవాహము అతి సూక్ష్మమైనది. అందుచే అనవసరమగు తావులందు ఆ మాత్రమే ప్రవాహమార్గ ముండుటకును, శేషించిన తావులందు ప్రవాహమును నిరోధించుటకును ఇది ఉపయోగపడుచున్నది. స్థితి భేదము చెందకుండ అభ్రకము అత్యధిక శక్తిమంతమగు విద్యుత్ప్రవాహమునకు తాళగలదు. పారద్యుతిక క్షేత్రము (dielectric field) నందు క్షణికముగా స్థితిక విద్యుచ్ఛక్తి (Electrostatic energy) ని పట్టియుంచి అత్యల్ప నష్టముతో తిరిగి దానిని విడువ గలిగి యుండుటచే ఇది విరివిగా రేడియో కండెన్సరుల (Radio Condensers) లో వాడబడుచున్నది.

ఈ ఖనిజమునకుగల ఇతర లక్షణములలో నీటి సన్నిధిలో స్థిరత్వము (stability) సన్నని పొరలలో దీనికిగల పారదర్శకత (transparency), సంపీడన నిరోధకశక్తి (incompressibility) కూడ ముఖ్యమైనవి. అనునాదము (resonance) యను స్వభావమును గలిగియుండుటచే నిది రేడియో పరిశ్రమలో ముఖ్యముగా వాడబడుచున్నది.

అభ్రకము యొక్క ఉపయోగములు : పైన వివరించి నట్లు విద్యుత్పరికరముల నిర్మాణము అభ్రకపు రేకులపై ఆధారపడియున్నది. ఇట్టివాటిలో వ్యత్యయ ఖండములు (commutator segments), V ఆకారపు బిళ్ళలు (V-rings), ఆర్మచూర్లు (armatures), విమానవహిత్ర స్ఫులింగ నిగములు (air plane motor spark plugs), రేడియో నాళములు (radio tubes), పరివర్తకములు (transformers), రేడియో కండెన్సర్లు (radio condensers)దూరశ్రవణయంత్రములు గలవు. ఇవిగాక విద్యుత్ సహాయమున పనిచేయు ఇస్త్రీ పెట్టెలు, రొట్టెలను కాల్చు పనిముట్లు (toasters), నీటిని కాచు సాధనములు (water heaters) మొదలగు గృహోపకరణములుకూడ గలవు. పరితాపనీ వాతాయనముల (stove windows) కును, లాంతరుచిమ్నీగాను, కొలుముల (furnace) దృష్టి రంధ్రములు మూయుటకును, పగులని సులోచనములకును, నియోన్ (Neon) దీపములలోను, వలయకములు (washers) గాను కూడ అభ్రకము ఉపయోగింపబడుచున్నది. చూర్ణము చేయబడిన అభ్రకము గూడ అనేక రీతుల పారిశ్రామికముగా ఉపయోగపడుచున్నది. ఈ చూర్ణము అభ్రకము నుండి ప్రత్యేక సాధనములతో తయారు చేయబడుచున్నది. తడి పద్ధతి (Wet process) పొడిపద్ధతి (Dry process) అనబడు పద్ధతులలో ఇది తయారగుచున్నది. గోడలకు ఉపయోగించు కాగితములలోను రంగుల (paints) లోను, గుడారములు కురియకుండ చేయుటకును, రబ్బరు పరిశ్రమలోను, గట్టి రబ్బరులోను, కొన్ని రకముల రబ్బరు వస్తువులలోను, జడపూరకము (inert filler) గాను, రబ్బరు టైరులను పోత (moulding) పోయుటయందును, గంధ దృంహణము (vulcanising) నందును, కందెన(lubricant) గాను, టైరులకు లోనున్న నాళములతోడి రాపిడి తొలగించుటకును, టైరులు లోపలనున్న నాళములతో అతుకుకొనకుండ చేయుటకును తడిపద్ధతిపై తయారగు చూర్ణము వాడబడుచున్నది. కొన్ని ప్లాస్టిక్ (plastic) పదార్థముల తయారునందు కూడ ఇది వాడబడుచున్నది. పొడి పద్ధతిపై తయారుచేయబడిన చూర్ణము గృహములలోపల కప్పుట కుపయోగించు కాగితమును తయారుచేయుటకు ఉపయోగపడుచున్నది. ఇది యింకను గొట్టములలోను, కాగుల (boilers) లోను, పరివేష్టనము (lagging) నకును, లోహమును కరగి అతుకు పరికరముల (welding rods) పూతగను, నాళికా కాచము (pipeline enamel) నకును, అభితాపనము (annealing) నందును, వస్త్రపరిశ్రమయందును, నూనె బావులను తొలుచుట (oil well drilling) లోను, కాంక్రీటు మొదలగు పదార్థములచే తయారుచేయబడు పెంకుల అలంకరణము నందును గ్రామఫోను రికార్డులయందును, ప్రేలుడు పదార్థముల (explosives) ఉత్పత్తి యందును, మార్జన(cleansing) సంయోగముల యందు ఆధారము (base)గాను, శిలాముద్రణ (lithographing) మందును కూడ ఉపయోగింపబడు చున్నది. క్రిస్మస్ పండుగయందలి వృక్షాలంకారములకును చలనచిత్ర నిర్మాతలచే కృత్రిమ హిమముగాను ఇది వాడబడుచున్నది. విద్యుత్పరిశ్రమలో వాడబడు మైకాలెక్స్ (micalex) అను విద్యుత్సం వాహ నిరోధ పదార్థ నిర్మాణమునందు ఇది ముఖ్య పదార్థమై యున్నది. మనదేశమున ఆయుర్వేద ఔషధములందు కూడ చూర్ణరూపమున అభ్రకము వాడబడు చున్నది.

కృతకాభ్రకము (మైకానైట్): అభ్రకపు రేకులు లభ్యమగుటలో గల యిబ్బందులవలనను, దాని యధిక మూల్యము వలనను ఇతర దేశములు కృతకాభ్రకమును తయారుచేయుటలో ఉత్సుకతను ప్రదర్శించినవి. తత్ఫలితముగా గత శతాబ్దాంతమున మొదటిసారిగా "మైకా నైట్" నిర్మింపబడుట జరిగెను. సన్ననిపొరలుగా నున్న అభ్రకమును జాగ్రత్తగా నమర్చి సరియగు జిగురు (adhesive) పదార్థమును ఉపయోగించి అవసరమగు దళసరితోను, పరిమాణములలోను దీనిని తయారుచేయు చున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రములయందలి అభ్రకపరిశ్రమ అభ్రకపు ముక్కలను వినియోగించి "మైకానైట్" నిర్మించుటపై చాలవరకు ఆధారపడి యున్నది. సుదీర్ఘ పరిశోధనల ఫలితముగా ఈ పరిశ్రమ యందు ఈ దేశము అగ్రస్థానము వహించు నవకాశము పొందగలిగినది.

అభ్రకపు స్థానీయములు (Substitutes for Mica): సాధారణ పరిస్థితులలోను, అంతకంటే ముఖ్యముగా యుద్ధ సమయము లందును తమతమ యవసరములకు సరిపడు అభ్రకముతో ఇతర దేశములనుండి దిగుమతి చేసికొనుటలో గల ఇబ్బందులనుబట్టి కొన్ని దేశములు అభ్రకస్థానమున ఉపయోగించుటకు వీలగు పదార్థములపై తమ దృష్టిని మరల్చినవి. ఇట్టి పదార్థములలో కొన్ని ఖనిజములు, మరికొన్ని కృత్రిమ పదార్థములు కలవు. ఖనిజములలో వెర్మిక్యులైట్ (Vermiculite) మొదలగునవి కొన్ని ప్రత్యేకోపయోగములు కలిగి యున్నను అభ్రక స్థానమును నాక్రమించు ఖనిజ మింకొకటి లేదు. అభ్రకమునుండియే తయారగుచున్న " మైకాలెక్స్" సంగతి ఇదివరకే పేర్కొనబడినది. అభ్రక స్థానమున వాడబడు కృత్రిమ పదార్థములు చాలవరకు కాగితమునందు కృత్రిమ సజ్జరసముల (Artificial resins) పూతచే తయారగుచున్నవి. పెర్టి నాక్స్ (Pertinax), బేక్ లైట్ (Bakelite), పేక్పోలిన్ (Paxolin), ఫార్మలైట్ (Formalite), ఆల్సిఫిల్మ్ (Alsi film) మొదలగు పదార్థము లీ తరగతికి చెందినవే. ఇవి అన్నియు కొన్ని కొన్ని " ప్రత్యేకావసరముల కుపయోగపడునవే కాని అభ్రకము వలే వివిధావసరముల కుపయోగించు పదార్థ మేదియును లేదు. అభ్రకమును దానియందలి వివిధ రాసాయనిక భాగములనుండి కృత్రిమముగా తయారుచేయు ప్రయత్నములుకూడ జరుగుచున్నవి. పెద్ద యెత్తున ఈ ప్రయత్నము లింకను ఫలించినట్లు కన్పించదు.

మనదేశమున అభ్రక పరిశ్రమను ఎదుర్భొను సమస్యలు :మన దేశములో అభ్రక పరిశ్రమను ఎదుర్కొనుచున్న సమస్యలు అతిక్లిష్టమైనవి. ఈ పరిస్థితికి ముఖ్య కారణము అభ్రకమును ఉత్పత్తిచేయుటలో అగ్రస్థానము వహించిన ఈ దేశములో ఉత్పత్తిని వినియోగించు నవకాశము లేకపోవుటచే ఉత్ప త్తిదారులు ఇతర దేశములందలి అవసరములను బట్టియు, అచటి కొనుగోలుదారులు దయాధర్మములను అనుసరించియు ఈ అమూల్య ఖనిజమును ఇతర దేశములకు ఎగుమతిచేయుట తప్పనిసరి అగుటయే అని చెప్పవచ్చును. ఉత్పత్తి అంతయు అనేకములగు చిన్నచిన్న గనులనుండి వచ్చుచుండుటచే, ఉత్పాదనవిషయమై యెట్టి ప్రణాళిక తయారు చేయబడలేదు. ఇట్టి ఉత్పత్తి దారులమధ్య నేర్పడు పోటీలు ఈ పరిశ్రమ కింకను చిక్కులు కల్గించుచున్నవి. ఇతరదేశములందు అభ్రక స్థానీయములను ఉత్పత్తిచేయు పరిశోధనలు కూడ నిర్విరామముగా సాగుచున్నవి. ఇట్టి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనుటకు ఉత్పత్తిదారులు సహకార పద్ధతులలో తమ వ్యవహారములను నిర్వర్తించుకొనుటకు కాలహరణము చేయక సన్నద్ధులు కావలయును, ఉత్పత్తిని అధికము చేయుటతో పాటు ఖననరీతులు, విపణిరీతులు ప్రమాణీకరించుట అత్యావశ్యకము. దేశీయముగా అభ్రకము నుపయోగించు పరిశ్రమలను పెంపొందించుట, “మైకానైట్” పరిశ్రమను ప్రోత్సహించుటవలన ఇట్టి ముఖ్య ఖనిజమును ఉత్పత్తిచేయుటలోను, ఉపయోగించుటలోను మన దేశము ఇతరదేశములపై ఆధారపడక స్వయంసమృద్ధమగుటకు అవకాశము కలుగగలదు.

కె. జి. కె. ఎస్.

[[వర్గం:]]