సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమరావతి
అమరావతి :- అమరావతి మేరుపర్వతముపై గల ఇంద్రుని రాజధాని. దీనికి స్వర్గలోకమని పేరు. ఇందు సుందరమగు నందనవనమును, అద్భుతమగు నింద్రసభయు గలవు. ఇం దప్సరసలు, దేవతలు, యజ్ఞయాగాదు లాచరించిన మానవులు నివసింతురు.
భూలోకమందు అమరావతి యను పేరుకల పురములుఅనేక ములుకలవు. ఒకప్పుడు నగరహారమను ఉపనామము గల అమరావతీపురము ఆఫ్గన్ దేశమునం దుండెను. అది ఇప్పుడు ఆఫ్ గన్ స్థానములోని జలాలాబాదునకు పశ్చిమమున 'నగరాక్' అనబడు చిన్న పల్లెటూరును చుట్టియున్న పాడుదిబ్బలుగ మారియున్నది. మధ్య రాష్ట్రమునందు పూర్వపు విదర్భ (వర్హాడు) కు ముఖ్యపట్టణమై వరలిన "ఉమరావతి” యను మరియొక పట్టణము నేటికిని " అమరావతి" యనియే వ్యవహరింపబడుచున్నది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో కృష్ణానది వొడ్డున ఉత్తర అక్షాంశము 16° 34' 45" పైనను, తూర్పు రేఖాంశము 80° 24′21″ పైనను ఉన్న అమరావతీ పట్టణము మరియొకటి. ఇది ఇప్పుడొక చిన్న పల్లెటూరుగా మారినది. దీని కొకప్పుడు నాగరాజు దేశ మను పేరుండెను. "అస్తిశ్రీ ధాన్యకటకపురమ్ సురపురాత్పరమ్. . .” అను ప్రాచీనశాసన వాక్యమునుబట్టి ఈ గ్రామమునకు పూర్వము ధాన్యకటకమను పేరుండినట్లు తెలియును. ఆంధ్రదేశము నందుగల పంచారామములలో నొకటి యగు అమరేశ్వరాలయము నందలి అమరేశ్వరుని బట్టియే ఈ నగరమునకు అమరావతి యను పేరు ఏర్పడినది. ఇందలి శివలింగము ఒకప్పుడు జైన బౌద్ధ విగ్రహములలో నొకటై యుండెననియు తరువాత బ్రాహ్మణులు దానిని శివలింగముగమార్చిరనియు కొందరు చరిత్రకారుల అభిప్రాయమై యున్నది. ఇక్కడ బుద్ధునిపూజయు, అమరేశ్వరుడను పేర శివుని పూజయు, జరుగుచుండెను. క్రీ. శ. 13 వ శతాబ్ది వరకు ధాన్యకటకమను పేరే దీనికి వ్యవహారమునందుండెను. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ. శ. 78 ప్రాంతమున ధాన్యకటక సింహాసనము నధిష్ఠించెను. ఆనాటి నుండియే దీనికి ప్రసిద్ధికలిగెను. క్రీ.శ. 7వ శతాబ్దిలో వచ్చిన చీనా యాత్రికుడు యువాన్ చాంగ్ ధాన్యకటక వైభవమును ప్రశంసించియున్నాడు. ఈ ధాన్యకటకమను పేరు కాలక్రమమున ధరణికోటగ మారినది. ధరణికోట అను పేరు క్రీ. శ. 1409 నాటి శాసనమున కనబడుచున్నది. ఇప్పుడు వ్యవహారమునందున్న ధరణికోట, అమరావతియను పేరులు పూర్వము ఒక్క నగరమునకే వర్తించియున్నను, నేడు ఆ నగరమున్న పశ్చిమభాగమునకు ధరణికోట యనియు, స్తూపమున్న భాగమునకు అమరావతి యనియు పేరులు స్థిరమై ఆ పూర్వపు పట్టణము ఇప్పుడు రెండు వేరువేరు గ్రామములుగా విడిపోయినది.
రెండు వేల ఏండ్లకు పూర్వము నిర్మింపబడిన బౌద్ధస్తూప రాజమును బట్టి ఈ పురమునకు లోకవిఖ్యాతి కలిగినది. భారతీయ బౌద్ధకళాచరిత్రమున అమరావతి చరిత్రము ఒక గొప్ప ప్రకరణముగ నున్నది. బౌద్ధయుగమునాటి ఆంధ్ర శిల్పులు భ క్తితత్పరులై బుద్ధభగవానుని దివ్యస్మృతికి కానుక పెట్టిన శిల్ప నీరాజనము అమరావతీ స్తూపము. సంప్రదాయమునుబట్టి 'స్తూప' శబ్దము బౌద్ధ నిర్మాణమునకే వర్తించును. బౌద్ధ వాఙ్మయమునందును, అమరావతి శాసనములందును “స్తూప పదము కనిపించదు. దానికిబదులుగ 'చైత్య' మను పదమే వ్యవహారమునందుండెను. చితాశబ్దభవమే ఈ చైత్యము. బౌద్ధ కళాస్తూపముల ఉత్పత్తులను గూర్చి “మహాపరినిబ్బానీసుత్తము"నందు ప్రధానములగు రెండు విషయములు గోచరించును. బుద్ధుల యొక్కయు, ప్రత్యేక బుద్ధుల యొక్కయు, అర్హతుల యొక్కయు, చక్రవర్తుల యొక్కయు ధాతువులు చైత్యనిర్మాణమున భద్రపరచి పూజింపవలయును. బుద్ధుని నిర్వాణమునకు పిదప ఆతడు పుట్టిన స్థలమును సంబోధి నొందిన స్థలమును, మొట్టమొదట ధర్మమును బోధించిన స్థలమును, నిర్వాణ మొందిన స్థలమును బౌద్ధులు దర్శింపవలయును అనునవి ఆ రెండువిషయములు. వీటిని బుద్ధుడే ఆనందునితో చెప్పెనట. బుద్ధుని ఆదేశానుసారముగ అతడు నిర్వాణ మొందిన వెంటనే ఆ మహనీయుని ధాతువులను ఎనిమిదిభాగములుగ చేసి ఒక్కొక్క ధాతువుపై ఒక్కొక్కటిచొప్పున ఎనిమిది చైత్యములును శిష్యులు నిర్మించిరి. వీటికి శారీరక చైత్యములని పేరు. ధాతుగర్భవదము యొక్క భ్రష్టరూపములే దాగొబ్బ, దగ్బ, దబ్బగ అనునవి. వీటినుండియే దిబ్బ అను పదము వచ్చియుండును. అశోకుడు తన రాజ్యమునందలి ప్రజల యొక్క బౌద్ధధర్మ తృష్ణను తీర్చుటకై 7 చైత్యములను త్రవ్వించి అందలి ధాతువులను ఎనుబదినాలుగు వేల శకలములుగా చేసి తన రాజ్యమునందలి వేరువేరు భాగములందు వేర్వేరు స్తూపములను వెలయించెను. మతప్రచారమునకై, 'మహిషమండలమునకు అశోకునిచేత పంపబడిన మహాదేవ భిక్షువను నాతడు అమరావతియందు బుద్ధుని ధాతువును, చైత్యగర్భితము కావించి చైత్యవాదమును స్థాపించినట్లు శాసనములవలన తెలియుచున్నది. సమ్యక్సం బుద్ధుని శారీరక ధాతువును ఇచ్చట స్థాపించుటచేతనే వేర్వేరు సంప్రదాయములకు చెందిన బౌద్ధులు ఇచట స్థావరము లేర్పరచుకొనుట తటస్థించినది. యూవాన్ చాంగ్ వ్రాసిన వ్రాతలనుబట్టియు, అమరావతి శిల్పమును బట్టియు, ధాన్యకటకము మహా బౌద్ధక్షేత్రమై యుండుటనుబట్టియు మహాయానపక్షావలం బకులకువలెనే "హీన యాన" పక్షమువారికి కూడ అమరావతి వాసస్థానముగ నుండినట్లు గోచరించును.
స్తూపము చితాసంబంధియైనను, ధాతుగర్భ సంబంధియైనను దాని ఆకృతిని గూర్చి భిన్నాభిప్రాయములు గలవు. కొందరు దాని యాకారము సగముదయించిన సూర్యబింబము యొక్క ఆకారమును పోలియున్నదనియు, మరికొందరు జీవితము బుద్బుద సదృశమను తాత్త్వికాశయమును లోకమునకు వెల్లడించుటకో యన్నట్లు స్తూపము బుద్బుదాకారముతో నిర్మించబడి యున్నదని అందురు. అనగా శరీరము బుద్బుదమువంటిది అను భావము బుద్బుదాకృతి గల స్తూప రూపమున ప్రకటితమైనది. పరమాత్మ స్తూపాంతర్గతమగు ధాతు రూపమున వ్యక్తీకరింపబడెను. ఈ స్తూపముపై ఒకటి కాని, మూడుకాని, ఛత్రము లుంచుట వాడుక— (1) దేవతలకు (2) మనుష్యులకు (3) నిర్వాణము అనగా బుద్ధ మోక్షమునకు. ఈ ఛత్ర త్రయమే బౌద్ధుల నిర్వాణ, పరినిర్వాణ, మహాపరి నిర్వాణములనుకూడ సూచించును. అండోపరిస్థితమైన హర్మిక (Pavalion) విభాగములు విశ్వ భాగములను సూచించును. ఈ విధమున స్తూపమందలి వేరువేరు భాగములు వేర్వేరు విషయములకు సంకేతములైనవి. స్తూపమంతయు గలపై మేరుపర్వతమునకు చిహ్నముగా నైనది. శాస్త్రజ్ఞులు ఇతర స్థలముల యందుకంటే అమరావతియందు స్తూపలక్షణము పరిపూర్ణత చెందిన దందురు. క్రీస్తు శకము మూడవ శతాబ్దికి పూర్వమే యమరావతి గొప్ప విద్యాస్థానముగను, బౌద్ధమత ప్రథాన పీఠముగను విఖ్యాతి చెందియుండెను.
ఈ యమరావతీ స్తూప మెప్పుడు నిర్మితమైనదో స్పష్టముగా తెలిసికొనుట కాధారములు లేవు. స్తూపపు రాలమీద మౌర్య లిపితో శాసనము లుండుటవలన మౌర్యవంశమువారి పరిపాలనలోమాత్ర మిది నిర్మింప బడియుండుననుట నిస్సంశయము. స్తూపము నందలి అపరిణతములైన ప్రాచీన రీతులను, పరిణతములుగా గానవచ్చు అర్వాచీన రీతులను వేరు పరచి చూచిన యెడల ప్రాథమిక స్తూపము క్రీ.పూ. 200 సం ౹౹ ప్రాంతమున వెలసినది కను పట్టును. మొత్తము
నిర్మాణమంతయు నాలుగు దశలలో జరిగినదనియు, ప్రథమదశ క్రీ. పూ. 200 సం. నాటిది కాగా చతుర్థదశ క్రీ. శ. 3వ శతాబ్దినాటి దనియు చెప్పవచ్చును.
బౌద్ధకళ ఆరంభదశలో శిల్పమున బుద్ధుని చిత్రింపవలసివచ్చినప్పుడు భౌతిక మానవిధేయములైన నామ రూపములను విడిచి ఆ మునిపుంగవుడు నిర్వాణము నొందేనని తెలుపుటకు గుర్తుగ నచ్చటి స్థలమును శూన్యముగ నుంచువారు. చిత్రాభావమే బుద్ధ భావమునకు చిహ్నముగ నుండెను. కాలము, గడచినకొలది మొదట నీ స్థలమున శాక్యముని శ్రీపాదములును, పిదప రూపమును చిత్రితములైనవి. బౌద్ధ కళయందు బుద్ధుని మహా పరినిర్వాణమునకు స్తూపమును, జననమునకు పద్మమును, మహాబోధి, పరమ సత్య ప్రబోధనమునకు బోధి వృక్షమును మృగదావమునందలి బుద్ధుని మొదటి ధర్మబోధనమునకు 'ధర్మచక్రమును సంకేతములుగు చిత్రితములైనవి.
స్తూపాధిష్టానము రమారమి 138 అడుగుల వ్యాసము కలది. అండము (Dome) ఎత్తు 90 అడుగులకంటే ఎక్కువ. కీట్లు కిట్లుగ మట్టి పోయుచు, దిమ్మెస కొట్టుచు, తేల్చిన స్తూపాకృతిని చివరకు పాలరాతితో చిత్రశోభితము గావించినారు. అండము దిగువభాగమునకు వేదిక యని పేరు. ఈ వేదిక చుట్టుకొలత 521 అడుగులు. దీని లోపలివైపు భాగము నిర్మాణమునందు పడిపోవుట చేత నిది వెలుపలవైపు మాత్రమే చిత్రితమైనది. ఈ వేదిక పై భాగమును కప్పియుండు శిలాఫలకములలో పెక్కింటి వయ్న-చైత్య చిత్రములు చెక్కబడియున్నవి. దగోబాలు, నాగములు చెక్కిన పలకకు కుడి ఎడమవైపు లందు విడిరాల మీద చెక్కిన స్తంభము లున్నవి. ఈ విడి స్తంభముల మీద బోది వృక్షము, ధర్మచక్ర ప్రవర్తనము, మారప్రలోభనము మొదలైన చిత్రము లున్నవి. ఈ వేదిక చైత్య శిలాఫలకములకు మీద నంచు కట్టినట్లు చిత్రాలంకృతమైన యొక్క పట్టిక యుండును. ఇది వేరువేరు రాతిపలకలనుగూర్చి కాని యొకే రాతిఫలకముపై గాని తీర్చుట చూడనగును. నాలుగు దిక్కులయందును ఈ వేదిక ప్రతిద్వారమునకు నరుగు తీర్పబడినది. ఈ ప్రతి యరుగుపై నై దేసి స్తంభములు చొప్పున నాలుగు దిక్కులందును ఆయక స్తంభములు (పూజనీయ స్తంభములు) ఇరువది గలవు. ఉత్తర హిందూస్థానమునందలి ఏ స్తూపమందును లేని యీ ఆయక స్తంభ ప్రతిష్టాపనము ఆంధ్రదేశ స్తూప విశిష్ట లక్షణమునకు తార్కాణము.
ఈ వేదిక చుట్టును శ్రీవీథియను పేర ప్రదక్షిణవీథి యుండెడిది. ఈ వీథి నావరించి నిలువ రాతికంబములతో నిర్మించిన కట్టువవంటి శిలాప్రాకారము కలదు. ఆచార్య నాగార్జునునిచేత నిర్మితమైనదని పరికీర్తితమైన ప్రాకార రేఖ యిదియే. ఈ స్తూపప్రాకారమునకు రెండువైపుల మనోహరము లగు శిల్పచిత్రములు గలవు. శాసనములందీ నిలువు రాతిస్తంభములు ఊర్ధ్వపటలములనియు, అడ్డు కమ్ములు సూచులనియు, పేర్కొనబడినవి. ఈ ప్రాకారమంతయు 9 అడుగుల ఎత్తుగల నిలువరాతి స్తంభములతోను, రెండు స్తంభములకు నడుమ కుసులుగా చొనిపిన అడ్డుకమ్ములతోను, నిర్మింపబడినది. ప్రాకారమునకు వెలుపలవై పునగల బొమ్మలు ఆచారసిద్ధమైన రీతిని చెక్కబడినవి. ప్రతి స్తంభము మధ్యభాగమునందు దారుమయ ప్రాకారమున గానవచ్చు మేకుతలలవలె వృత్తములు తీర్పబడినవి. ఈ వృత్తములందు పద్మములు చెక్కినారు.ఈ వృత్తముల నడిమి భాగములు మూడేసి నిలువు పట్టికలుగ విభాగింపబడి రకరకములు మనుష్య, జంతు, పుష్ప చిత్రములతో నొప్పుచుండును. ప్రాకార రేఖయందలి శిలా స్తంభోపరితలమున దూలములతో మదురువలే నేర్పడిన భాగమునకు ఉష్నీషమని పేరు. సూచీ స్తంభోష్ఠీషములు అతి మనోహరములై దివ్య చిత్రసంపదతో నలరారినవి. వెలుపలివైపున తరంగాకృతిగల పొడుగైన పుష్పదండమును ఎడనెడ మనుష్యులు మోయుచున్నట్లు చిత్రితమైనది. లోపలివైపున జాతక కథలను, బౌద్ధ సంప్రదాయ చరితములను చెక్కినారు.
అండాగ్రభాగమున చతురముగనో, చతురస్రముగనో పేటికవలె నుండు నిర్మాణమునకు హర్మిక యని పేరు. ఈ హర్మిక పార్శ్వములు సాంచీ మొదలగు స్తూపము లందువలె దారుమయ ప్రాకార శోభితములై యున్నట్లు చిత్రితము లయినవి. కొంద రీ హర్మికయంచే బుద్ధ ధాతువులు నిక్షిప్తము అయి యుండెనని చెప్పుదురు. స్తూపమంతటిలో నిదియే పవిత్రమైన యుచ్ఛస్థానము.
ఈ విధముగ ప్రాచీన శిల్ప కళాభిజ్ఞతకు అపూర్వోదాహరణముగ పొలుపారిన అమరావతీ స్తూప రాజము కాల విపర్యయమున శతాబ్దులు గడిచిపోవ శిథిలమై భూగర్భస్థమయినది. ఆయాకాలములందు స్థానికాధికారులగు శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారి భవనమునకు మంచిరాతి నిచ్చునదిగా నుండి క్రీ. శ. 18వ శతాబ్దమున సౌందర్యకళాఖిజ్ఞులగు, 'సూయల్' 'బూలర్' మున్నగు పాశ్చాత్యుల మూలమున తన అస్తిత్వమును బయలుపరచుకొనినది. కొన్ని శతాబ్దులకు పూర్వము, దీపసహస్రాలంకృతమై, విద్యాకారమై, ప్రార్థనామందిరమై లోకవిఖ్యాతిని సంతరించుకొన్న దీ యమరావతి, బౌద్ధమతావసానదశలో రానురాను తన మహావిభూతి యెల్ల అంతరించిపోగా దీపాలదిన్నెగ మారినది.
చలువరాతిమీద చిలితమైన యీ శిల్ప సంపదను జాగరూకతతో పరిశీలించినచో బౌద్ధయుగమునాటి యాంధ్ర శిల్పకళా ప్రవీణుల చేతిలో ఈ చలువరాయి కాఠిన్యమును వీడి వారి భావనానుగుణముగ మైనపు ముద్దవలె మారినదని తోపక మానదు. బౌద్ధ ఆంధ్ర శిల్పి తాను మలచుటకు ప్రత్యేక కథావస్తు వున్నంతకాలము తన సొంతదారినే త్రొక్కెను. కాని, గ్రీకుకళా ప్రభావమునకుమాత్ర మాతడు వశ్యుడు కాలేదని విమర్శకుల యభి ప్రాయము. గ్రీకుల ఉత్తమ శిల్ప రచనలను, అనేకములను ఆతడు చూచి యుండవచ్చును. కాని అతడు వాని ననుసరించి యుండలేదు. అమరావతీ శిల్ప చిత్రమునందు గానవచ్చు బుద్ధ విగ్రహ శిల్పముననేగాక మరియే యితర మానవ విగ్రహ రచనమునందుకూడ గ్రీకు విగ్రహ శిల్ప ముఖ్యలక్షణమగు “స్నాయువిస్ఫుటత్వమును” గాంచ లేము. ఇది యొక్కటియే, అమరావతీ మానవవిగ్రహ శిల్పము దేశీయమే కాని గ్రీకు కళానుసరణము కాదని చెప్పుటకు జాలును. ' స్త్రీ ప్రతిమారచనమునం దమరావతీ శిల్పమున త్రిభంగములను చూపుట వాడుక. గ్రీకుల కీ పద్ధతి కేవల విదేశీయము. కాని కొన్ని గిన్నెలు, దుస్తులు, జంతువులు మొదలయినవాని రచనయందు కొన్ని గ్రీకు శిల్ప సామాన్యలక్షణములు గోచరించును. ఇక స్త్రీపురుషుల జంటలలో స్త్రీపురుషులు వస్త్రములు ధరించుట గ్రీకుపద్ధతి. కాని దేశీయ కళాపద్ధతియందు స్త్రీపురుషులు కొంచె మించుమించుగ విగతవస్త్రులుగనే కనబడుదురు. కొన్ని కొన్ని సందర్భములందు శృంగార రూపమయిన ఆచ్ఛాదన ముండిన నుండవచ్చును. బౌద్ధ శిల్ప పవిత్రములైన బుద్ధ జీవిత గాథలను కాని, జాతకకథ అనుగాని చెక్కినప్పుడు నగ్నతచూపి యుండ లేదు.
లలితకళలలో నొకటియైన సంగీతమునకు గూడ అమరావతీ శిల్పమున ప్రాధాన్యమియ్యబడినది. శిల్పికి చిత్రరచనమున నెట్టిప్రావీణ్యముకలదో అట్లే ఆ కాలము వారికి నృత్తగాన విద్యలందును విశేషకౌశలాభిమానములు గలవని చిత్రములనుబట్టి ఊహింపవచ్చును. ఒక్క స్త్రీ పురుషులే కాక, నాట్యాభినయాన ర్హములైన కుబ్జ యక్షగణములుకూడ నాట్యముచేయుచుండినట్లు మనము అమరావతీ శిల్పమునందు కాంచగలము. అభినయమును పురస్కరించుకొనియుండు జంత్రగాత్ర సంగీతముకూడ శిల్పమున ప్రదర్శిత మైనది.
అమరావతీ శిల్పమున చూపబడిన యుద్ధ చిత్రములను బట్టి అప్పుడు సైన్యము రథ, గజ, తురగ, పదాతి సమేత మని తెలియుచున్నది. యుద్ధ చిత్రములు గల అమరావతీ చిత్ర శిలాఫలకములు శిథిలమై యుండుటచే క్షేత్రజీవ్యు చితమైన వేష, భూషా, శిరస్త్రాణాదులను గురించి విశేషముగ తెలియదు.
అమరావతీ శిల్పమునందు సామాన్యమైన పూరిగుడిసెలు మొదలు రాజహర్మ్యములవరకు చూడగలము. గ్రామప్రాకార ద్వారములు, విలాసద్వారములు తోరణ సంశోభితములై కానవచ్చును. రాజకుమారు లుష్ఠీషమును చిత్రమయిన రీతుల మిక్కిలి సొంపుగ రచించువారు, రూప సంపదయందు రాజకుమారు లెప్పుడును యౌవనవంతులే. బ్రాహ్మణులకును, యతులకును, భూషణము లుండవు.యతులు పెక్కురీతుల జటాధారణము చేయువారు. బౌద్ధభిక్షువులు ముండిత శిరస్కులు గానవత్తురు. యోధులు శిరస్త్రాణములను ధరించుచుండిరి. దాసజనము మోకాలు దిగని చిన్న పంచెకట్టి నడుమునకు రుమాలు చుట్టుచుండిరి. నడిమితరగతులవా రెప్పటివలెనే దుస్తులను ధరించి కొండిసిగలను, ప్రక్క సిగలను దీర్చుచుండిరి.
అమరావతీ శిల్పమున గానవచ్చు స్త్రీ ప్రతిమలను గాంచినచో ఆకాలపు స్త్రీలు సౌందర్య, శృంగారముల మీద నెంతటి లక్ష్యముంచువారో విశదము కాగలదు. ఇంత యెందులకు? క్రీస్తుశక ప్రాథమిక శశాబ్దులందు ఆంధ్రుల ఆచార వ్యవహారములు, దుస్తులు, ఆభరణములు, మతము మొదలగువానిని గురించి తెలుపుటకు అమరావతి పెన్నిధివంటిది. ఈ శిల్ప మాంధ్రభూమిని కళామయము గావించి, నూతన కళావిన్యాసమును సంతరించుకొని “అమరావతీ రీతి' యను పేర జరగు నొక విశిష్ట కళావిభూతికి సూత్రము పన్నినది. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్యాలంకార పరిణామములు ఇప్పటికి రమారమి 2000 సం. పూర్వమే మన యాంధ్రులనుభవించినారని తెలుపుటకు నిదర్శనము, శాశ్వత సౌందర్య కళాఖండము అమరావతీ శిల్పము.
పి. య. రె.
[[వర్గం:]]