Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభ్యసన మనస్తత్వము

వికీసోర్స్ నుండి

అభ్యసనమన స్తత్వము  :- అభ్యసన మను విషయమును గురించి ప్రసంగించుటకు ముందు మన స్తత్వమునకు సమానార్థకమగు సైకాలజీ (Psychology) అను పదము యొక్క అర్థమును స్పష్టముచేయుట అవసరము. శబ్ద వ్యుత్పత్తి ననుసరించి సై కాలజీ అను పదము 'ఆత్మ' అను అర్థమునిచ్చు 'సైక్' అను పదమునుండి ఉద్భవించినది. అందువలన ఈ శాస్త్రమును మొదట ఆత్మసంబంధమైన శాస్త్రముగా పరిగణించిరి. కాని ప్రాచీన తత్వజ్ఞులు ఆత్మ పదార్థ వివేచనకై ప్రయత్నించియు విఫలులైరి. అందువలన మొదటి నిర్వచనమును సవరించి వారు సై కాలజీ అను పదమునకు మనస్సు అని అర్థముచెప్పిరి. వివేచనము వలన మనస్సు అను అర్థము కూడ అసమగ్రమని విదిత మయ్యెను. పిదప కొందరు నిపుణులు సై కాలజీని చైతన్య పరిశీలనమని నిర్వచించిరి. ఆ నిర్వచనముచే చైతన్యము కొంచెముగా నున్నపుడును, పూర్తిగా లేనపుడును ఏర్పడు సమస్యలకు పరిష్కారములు లభింపవయ్యెను. అందుచేత వారు సైకాలజీ అను పద నిర్వచనమును సమగ్రమొనర్చిరి. ఆ నిర్వచనమును బట్టి సై కాలజీ అను పదము మానవ ప్రవర్తన శాస్త్రమను నర్థమునందు రూఢమయ్యెను. ఒక సుప్రసిద్ధుడయిన మనస్తత్వజ్ఞుడు వచించినట్లు సై కాలజీ అను పదమునకు ఆత్మ, మనస్సు, చైతన్యము అను నర్థములు క్రమముగా మారి “మానవప్రవర్తనశాస్త్రము" అను నర్థము మాత్రమే రూఢియైనది. మానవప్రవర్తన శాస్త్రము విశాలమైనది. ఇందులో శారీరక శాస్త్రము (Physiology), సాంఘిక శాస్త్రము (Social Science) వంటి శాస్త్రము లనేకములు ఇమిడియున్నవి.

శారీరక శాస్త్రము ప్రాణి యొక్క పనులను నిర్వహించు అవయవములను, జీవాణువులను పరిశీలించును. సాంఘిక శాస్త్రము రాజ్యములను, మానవ సంఘములను పరిశీలించును. ఈ రెండు శాస్త్రములకు మధ్య మరియొక శాస్త్రము కలదు. అదే మనస్తత్వశాస్త్రము. అది వ్యక్తి యొక్క పుట్టుక మొదలుకొని అతని శైశవము, బాల్యము, యౌవనము, వార్ధక్యము, అంత్యదశ మున్నగు వివిధ దశలను పరిశీలించు శాస్త్రము. ఒక వ్యక్తి యొక్క జీవితములో పెక్కు పరిణామములు కలిగినను, అతని వ్యక్తిత్వము మాత్రము మార్పుచెందదు. అందుకు కారణము అతనియందు వివిధ పరిణామములు జరుగుచుండగా అతని ప్రవర్తనములో అవిచ్ఛిన్నమైన ఐక్యమొకటి కనిపించుటయే, బాలునకును, వయోజనునకును, సామాన్యతకును, అసామాన్యతకును, మానవునకును, జంతువునకునుగల తారతమ్యమును సై కాలజీ చూపును. వ్యక్తుల మధ్యగల తారతమ్యములను విద్య, ఆలోచన, ఉద్రేకము మొదలగు వ్యక్తి యొక్క కార్యశక్తి నియమములను, సైకాలజీ విశేషముగా పరిశీలించును. సై కాలజీ, వ్యక్తి యొక్క ఉత్సాహకృత్యములను పరిశీలించు శాస్త్రమని చెప్పవచ్చును. ఇచ్చట కృత్యము అన్న పదము విశాలమైన అర్థముతో వాడబడినది. ఈ పదములో భౌతిక, ఆంగిక, మానసిక కృత్యములు ఇమిడియున్నవి. సాధారణముగా మనచే మానసికకృత్యములుగా ఎంచబడినటువంటి నేర్చుకొనుట, జ్ఞాపకముంచుకొనుట, ఆలోచించుట, పరిశీలించుట, పన్ను గడచేయుట, నిశ్చయించుట, తెలిసికొనుట, అనుభవించుట, అసహ్యించుకొనుట మున్నగువాటితో సైకాలజీకి ఎక్కువ సంబందము కలదు. తెలిసికొనుట, అనుభవించుట, చేయుట అను నీ ప్రధాన శీర్షికల క్రింద సులభముగా తెలిసికొనుటకు, పరిశీలించుటకు వీలు కలుగుటకై, ఈ ఉత్సాహకృత్యములన్నిటిని వర్గీకరించినను, వీటిలో ఒకదానినుండి మరొక దానిని విభజించుచు సరిహద్దు గీతలు గీయుట అసాధ్యము. కారణము, ప్రతి మానసిక కృత్యము శారీరకకృత్యముగా గూడ పరిగణింప బడుచుండుటయే. పైగా, మెదడు తీవ్రముగా పనిచేయుటకు ఉపక్రమించిన ప్రతి కృత్యమునందును, సాధారణ ముగా, కండరములు, ఇంద్రియములు కూడ తమ పాత్రను నిర్వహించుచుండును. వివిధ అంగములు తమ తమ కృత్యములను నిర్వహించు రీతిని పరిశోధించుట శారీరశాస్త్రము యొక్క కర్తవ్యము. ఆశాస్త్రము సంపూర్ణ వ్యక్తి యొక్క జీవితమునకు ప్రతి అవయవము ఏమేమి సమకూర్చునో పరిశీలించుటకు ప్రయత్నించును. ఉదా : చూచునప్పుడు కంటిలోను, మాట్లాడునప్పుడు వాగింద్రియములోను కలుగుచున్న పరిణామములను ఈ శాస్త్రము పరిశోధించును. ఆయితే శారీరకశాస్త్రమే మానవప్రవర్తనమును గూర్చి అన్ని వివరములను తెలియ జేయగలిగినచో, ఇక సైకాలజీ అను శాస్త్రముతో మనకేమి అవసరము కలదు అను ప్రశ్న ఉదయింపవచ్చును. ఈ ప్రశ్నకు సమాధానమిది. శారీరక శాస్త్రము మనము తెలిసికొనవలసినవిషయములో కొంత భాగమునుమాత్రమే చెప్పును. ప్రేమించునది, ద్వేషించునది, జయించునది, ఓడిపోవునది యథార్థముగా నొక వ్యక్తియే. అతనికి కర్తవ్యములు కలవు; పరిష్కరింపవలసినవమస్యలు కలవు.అతడు సమర్థతతోను, సంతోషముతోను, ఇతర వ్యక్తులతోమ, వస్తువులతోను మెలగవలసి యుండును. సంపూర్ణుడైన వ్యక్తికిని, అతని చుట్టునున్న ప్రపంచమునకు మధ్య అనంతమును పారస్పరికమును నగు కార్యసమూహము కలదు. ఈ పరస్పర క్రియాకలాపమును శాస్త్రీయముగా పరిశోధనచేయుట అవసరము. అందువలన ఒక సంపూర్ణుడైన వ్యక్తి ఇతర వ్యక్తులతోను, ప్రపంచముతోను యథార్థముగా కలిసి మెలిసి సంచరించు విధానమునే సైకాలజీ శాస్త్రీయముగా పరిశీలించుటకు పూనుకొనును.

మనము సై కాలజీని అనుసరించి చూచినచో వ్యక్తి యొక్క కృత్యములన్నిటిలోను మిక్కిలి ప్రధానమైనది అభ్యసనము. తెలివి, వ్యక్తిత్వము, మనోవికారము, ఇంద్రియజ్ఞానము లేక ఆలోచన మున్నగు వాటిలో ఏ విషయమును మనము గ్రహించినను అది అభ్యసనము పైననే ఆధారపడును. మనుష్యుడు గ్రహణశక్తి కలిగిన జంతువు. అతడు నిత్యము నేర్చుకొనుచుండును. అతడు నిస్సందేహముగా సాంఘిక ప్రభావములచే పూర్తిగా కాకున్నను కొంతవరకైనను మారుచుండును. పూర్తిగా మారుటకు అతడు కేవల మొక మంటిముద్ద కాదు. ఒక విధముగా అతనిని "ప్లాస్టిక్" తో పోల్చవచ్చును. అతడు వాతావరణముతో స్పందించి, తన స్వార్థమును స్వీయ యత్నముచేతనే సంపాదించుకొనును. అతడు తన వర్గసంస్కృతిని ఒక క్రమపద్ధతిలో తెలిసికొని, ప్రత్యేకపాత్రను అర్థము చేసికొనును. సాంఘిక శాస్త్రములు “వ్యక్తి నేర్చుకొనును” అన్నంతవరకే బాధ్యతను వహించుసు. కాని సైకాలజీ అనునది ఆ నేర్చుకొను క్రమపద్ధతిని పరిశీలించునట్టి విశేషబాధ్యతను కూడ నిర్వహించును. అందువలన నేర్చుకొనుట అనుదానికి సరియైన అర్ధమేమియో, ఎప్పుడు ఏ పరిస్థితులలో ఏ విధముగా మనము నేర్చుకొందుమో, ఇత్యాది విషయములను సైకాలజీ వివరించును.

అభ్యసనము యొక్క క్రమపద్ధతులను గురించి తెలిసికొనుటకు ముందు, విద్య అను పదము యొక్క నిర్వచనము అవసరము. ఆక్సుఫర్డు నిఘంటువు దీనిని అధ్యయనము వలన లభించిన విజ్ఞానము అని నిర్వచించినది. అందుచే అధ్యయనము చేతను, ప్రయత్నముచేతను నేర్చుకొనిన విషయమంతయు విద్యయను పదమున నిమిడి యున్నది. మరియు అప్రయత్నముగా నేర్చుకొనిన విషయములు, సంభవాత్మకములైన క్రియలవలన నేర్పడిన కౌశల్యము, వస్తువులతోను, మనుష్యులతోను గలిగిన పరిచయము వలనను సంబంధమువలనను లభించిన నిపుణత, అభి ప్రాయములు గూడ ఈ పదమునందు ఇమిడియున్నవి. ఇచ్ఛాపూర్వకముగ నేర్చుకొనునవి విషయములను వల్లెవేయుట వంటివి కొన్ని గలవు. అభ్యసన మనునది అన్ని పనులకు వర్తించును. చదువుటవలన చదువనేర్తుము. పాడుటవలన పాడనేర్తుము. ఒక మనుష్యుని స్వభావమును ఆతని ముఖమును చూచుటవలన తెలిసికొందుము. ప్రొఫెసర్ వుడ్ వర్తు చెప్పినట్లు, ఏ ఉత్తమ కృత్యమునైనను విద్యగా పరిగణింపవచ్చును. కాని ఆ కృత్యము వ్యక్తిని మంచి వానిగాగాని, చెడ్డవానిగాగాని వృద్ధిచేసి అతనికి ఉత్తర కాలమున ఏర్పడు ప్రవర్తనమును, అనుభవమును అతని పూర్వకాలికములైన ప్రవర్తన అనుభవములకంటే భిన్నమైన వాటిగా చేయవలెను.

అభ్యసనమన నేమి  ? : కొన్ని పనులు మనుష్యునకు నేర్చుకొనకుండనే వచ్చును. ఉదా: పుట్టినతోడనే శిశువు శ్వాసమును పీల్చుట. నేర్చుకొను అవకాశము లేకుండగనే శిశువు ఈ పనిని చేయుచున్నది. కాలక్రమమున శ్వాసము పీల్చుటయందు ప్రావీణ్యము లభించగా, శ్వాసము పీల్చుకొనుటయందలి ప్రత్యేక పద్ధతులను కూడ శిశువు నేర్చుకొనును. ఉదా: శ్వాసమును బిగబట్టుట ; శ్వాసమును లోనికి పీల్చుకొని చేయు వ్యాయామములు; క్రొవ్వొత్తిని ఊది ఆర్పివేయుట; మొదలగునవి. స్వతస్సిద్ధములైన శారీరక కార్యములు తప్ప, తక్కిన వన్నియు నేర్చుకొను పనులే అయియున్నవి.

అభ్యసనము ఎప్పుడు జరుగును ? : విషయములు అభ్యసింపబడినవని మనము ఎప్పుడు చెప్పుదుము? లేదా ఏ పరిస్థితులలో నేర్చుకొను క్రమపద్ధతి యేర్పడును? అను ప్రశ్న ఇప్పుడు ఉదయించుచున్నది. అభ్యసనము యొక్క స్వభావమును పరిశీలించుటకు అనేక ప్రయోగములు చేయబడి, అమూల్యమైన ఫలితములు సేకరింపబడి యున్నవి. ముఖ్యముగా నీ ప్రయోగాత్మక పద్ధతి ఈ అభ్యసన రంగమునందు చాల సఫలమైనది. మానవుని జ్ఞాపకశక్తిపై మొట్ట మొదటగా ప్రయోగములు పందొమ్మిదవ శతాబ్ది చివరి 25 సంవత్సరములలో చేయబడినవి. కొన్ని సంవత్సరముల తర్వాత నిపుణములయిన సంచలనాత్మక కృత్యములపై ప్రయోగములు కావింప బడెను. పిదప ఆ శతాబ్ది అంతమున ఉత్తములయిన మన స్తత్వజ్ఞులు జంతు విజ్ఞానముపై ప్రయోగములను జరిపిరి. ఇట్టి ప్రాథమిక ప్రయోగములు మనుష్య విజ్ఞానముపై గాక జంతువిజ్ఞానముపై ఏ కారణముచే ప్రారంభింపబడినవి అని మనకు సందేహము కలుగవచ్చును. అందులకు కారణములు రెండు. జంతు విజ్ఞాన మెట్టిదో తెలిసికొనవలయునను మనస్తత్వజ్ఞుల కుతూహల మొకటి. అతి సూక్ష్మమును ప్రాథమికమును నైన జంతువిజ్ఞాన సూత్రములతో నారంభింప దలచుట రెండవది మానవుని స్థితి చిక్కైనది. అట్లే అతడు ఆర్జించు విజ్ఞాన పద్ధతులును చిక్కులతో కూడినవే. జంతువిజ్ఞాన పద్ధతి యొక్క పరిశీలనము, మానవుడు విజ్ఞానార్జనము చేయు క్రమమును అర్థము చేసికొనుటకు ఎక్కువ ఉపకరించినది. అందులకు కారణము, జంతువులు నేర్చుకొనుటలో కనిపించు అనేక అంశములు, ప్రవృద్ధమైన దశలో, మానవులలో కనిపించుటయే.

జంతువుల అభ్యసనము : జంతువులను గురించి అతి విస్తృతముగా జరుపబడిన ప్రయోగ పరిశీలనయందు, లాయిడ్ మార్గన్ అను నాతడు కృషి చేసి, ప్రాథమికమైన ఒక మూలసూత్రమును ఏర్పరచెను. దానిని లాయిడ్ మార్గను సూత్ర మందురు. “ఏ క్రియయైనను మన స్తత్వ' పరిధులకంటే అధోభాగమున పనిచేయు శక్తి యొక్క ఫలితముగా పరిగణింపబడినచో, ఆ క్రియను ఒక ఉన్నతమానసిక శక్తి యొక్క ఫలితమని ఏ విధముగాను చెప్పలేము. అను నదియే లాయిడ్ మార్గన్ యొక్క సిద్ధాంతము. దీని ననుసరించి పరిశీలించగా, జంతువులలో - ముఖ్యముగా అతి తెలివిగల జంతువులగు కోతులలోకూడ సంపూర్ణమగు హేతుజ్ఞానము ఉన్నట్లు కనపడదు. కాని వాటి యొక్క ఏమాత్రపు వివేకమును చూపు ప్రవర్తనమైనను హేతుజ్ఞాన పూర్వకముగా చేయబడినదేమో అను విభ్రాంతిని కలిగించును. జంతువుల అభ్యసనమును తెలిసికొనుటకై చేయబడిన వివిధ ప్రయోగ పద్ధతులును, వాటిలో ముఖ్యముగా ప్రయత్న- ప్రమాద పద్ధతియు ఈ దిగువ చెప్పబడిన సామాన్యాంశముల పై ఆధారపడి యున్నవి :

(అ) ఒక లక్ష్యమును చేరుటకు ఒక సంకల్పము,
(ఆ) లక్ష్యమును చేరుటకు స్పష్టమైన మార్గము కనిపించక పోవుట.
(ఇ) పరిస్థితి పరామర్శము.
(ఈ) లక్ష్యమార్గములను వివిధరీతుల అనుసరించుట.
(ఉ) చిట్టచివరకు లక్ష్యమును జేరుట.

ప్రయత్న - ప్రమాద - పద్ధతి : జంతువు ఈ ప్రయోగ విధానము నంతయు నడిపి జయము గాంచినపుడు ఆది ప్రయత్న-ప్రమాద- పద్ధతి ద్వారమున అభ్యసించినదని మనము చెప్పగలమా? కాని మనస్తత్వజ్ఞులు ఆ పద్ధతి ప్రకారము అది నేర్చుకొనలేదని అందురు. ఏలనగా ప్రతి దినము కావించిన ఈ సంక్లిష్టప్రయోగమునందలి ఏ విభాగము యొక్క సాయమున ఆ జంతువు ప్రయత్న ప్రమాద పద్ధతియొక్క ఆవృత్తిని తగ్గించి, విషయ గ్రహణములో నేర్పును సంపాదించినది అను నంశము విచారణీయము. ఈ ప్రయోగము జరుగుచున్నంత కాలము జంతువు కదిలి పరిశీలించు చున్నదన్నమాట నిజమే. కాని చలనము, పరిశీలనము అను నీ రెండింటిలో దేనివలన అది నేర్చుకొనుచున్నది? మొత్తముమీద ఈ నేర్చుకొను క్రమములో చలనాత్మక క్రియకున్న జ్ఞానేంద్రియముల ద్వారమున చేయు పరిశీలనమే ఎక్కువగా ఉపకరించు చున్నది. పరిశీలన మునకు చలనముకూడ అవసరమనుట నిర్వివాదము. అట్టియెడ చలనము కలిగించుటకంటె చలనము యొక్క ఫలితమును పరిశీలించుటయే నిర్లాయకమైన అంశము. ఈ ప్రయోగములో పెట్టె, వల, మొదలగు ఏ విధమైన వస్తువులను ఉపయోగించినను, జంతువు ఎదురుగా కనిపించు వస్తువుల తత్త్వమును తెలిసి కొనును. ఈ స్థితియందు జంతువునకు ప్రయోగమునందలి వస్తువుల యొక్క తత్త్వమును తెలిసికొనుట యందుకంటె వాటినుండి తప్పించుకొనుటయందే తాత్పర్యముండును.

ఈ పరిస్థితులలో జంతువులకు అంతర్దృష్టి ఉన్నదా, అను ప్రశ్న ఉదయించును. కారణమేమన, పిల్లులకంటెను కుక్కలకంటెను ఎక్కువ తెలివిగలిగిన కోతులును, చింపంజీలును (ఒకజాతి కోతులు) బాగా క్లిష్టమైన యుక్తులు నేర్చుకొనుట కలదు. ఈ స్థితిలో అంతర్దృష్టి యనగా ముందుచూపు వెనుకచూపునై యున్నది - అని అనుభవము వలన తెలియుచున్నది. మరియును, అంతర్దృష్టి యనగా వస్తువు యొక్క తత్త్వము యొక్క అవగతియై యున్నది. ప్రొఫెసర్ వుడ్ వర్తు ఇట్లు చెప్పెను: ఆధునిక యుగములో మనము మోటారు కార్లను, రేడియోలను, వాటి యంత్ర రచనాజ్ఞానము ఏమాత్రమును లేకయే ఉపయోగించుకొనుచున్నాము. ఏ వస్తువు యొక్క గాని సంపూర్ణమైన అంతర్దృష్టిగలవా రెవ్వరును లేరు. 'అంత ర్దృష్టి' అను పదములో పనులను నెరవేర్చుకొనుటకై మనము చేయు సామాన్య పరిశీలనముకూడ ఇమిడి యున్నది" కావున అంతర్దృష్టి యొక్క స్థానమున మనము 'పరిశీలనము' అను పదమును వాడవచ్చును. ఈ పదమును వాడుటలోకూడ కొంత చిక్కు లేకపోలేదు. కారణము - పరిశీలన మనగా బుద్ధిపూర్వకమైన పరిశీలన మగుటయే, జంతువు దాని జ్ఞానేంద్రియముల ద్వారమున పరిస్థితి యొక్క వివరములను తెలిసికొనును. ముందు చూపు కలిగియున్నచో అది కార్యరంగమును పరిశీలించి లక్ష్యసిద్ధికై మార్గమును అన్వేషించును. తరచుగా జంతువు కేవల పరిశీలనముచేతనే అనగా, యత్న - ప్రమాద పద్ధతి ననుసరింపక యే, లక్ష్యసిద్ధి నొందజాలదు. ఇందులో విశేషముగా వెనుకచూపు అవసరమగుచున్నది.

పరిస్థితి జనిత క్రియ (Conditioned Reflex): జంతువుల మనస్తత్వ రంగమున పరిశీలన రహితమైన మరియొక ముఖ్యమైన అభ్యసనక్రమము కలదు. అదియే పరిస్థితి జనితక్రియ. ఈ శతాబ్ది ఆరంభమున (జంతుదేహ ధర్మ శాస్త్రజ్ఞుడైన) ఒక రష్యను దేశీయుడు 'పాన్ ల్లోవ్' అనునాతడు కుక్కలను పరిశోధనవిషయముగా గ్రహించి, వాటి యొక్క జీర్ణశక్తిని గురించి పరిశీలించెను. అందు అతడు కుక్కల లాలాజలస్రవణమును నిర్ణయించుటకు ఒక పద్ధతిని కనుగొనెను. కుక్కలకు నోటిలో ఆహార మన్నప్పుడేగాక, అవి ఆహారమునుగాని, ఆహారమును పెట్టు పళ్ళెరమునుగానీ, ఆహారమునిచ్చు మనుష్యునిగాని, చూచినవుడును, ప్రక్కగదిలోనున్న ఆ మనుష్యుని కాలిచప్పుడు విన్నప్పుడును, వాటి నోటినుండి లాలాజలము ఊరుటను 'పావ్ ల్లోవ్' కనిపెట్టెను. నోటియందు ఆహార మున్నప్పుడు లాలాజలము ఊరుట సహజక్రియయై యున్నది. ఆహారపుపళ్ళెరమును చూచుటచేతను, ఆహార మిచ్చు మనుష్యుని పదధ్వనిని వినుటవలనను, లాలాజలము ఊరుట నిస్సంశయముగ అసహజక్రియ, అనగా, అభ్యస్తమైన క్రియ. దీనికి ఆధారము ఆ జంతువునకు అంతకు మునుపు ఆహారము పెట్టబడిన పరిస్థితులు. అందుచేత 'పావ్ ల్లొవ్' దీనికి 'పరిస్థితిజనిత క్రియ' యని పేరి డెను. ఇది యథార్థముగా ఒక ప్రతిక్రియ కాదు. అందుచే దీనిని మనస్తత్వజ్ఞులు సంనియమక్రియ యనిరి. (Conditioned Response).

మానవుల అభ్యసనము : జంతువులు నేర్చుకొను సామాన్య విధానమును గూర్చిన వివరములను తెలిసి కొనిన పిదవ మానవులు నేర్చుకొను రీతిని పరిశీలించుట మన కర్తవ్యము. మానవుడు జంతువుకంటె అధికుడు, కొన్ని అంశములలో అతడు నేర్చుకొను పద్ధతి జంతువులు నేర్చుకొను పద్ధతికంటె విశిష్టము.

1. మానవుడు జంతువుకంటే విశేషముగా నేర్చుకొనును.
2. మానవుడు నేర్చుకొను విషయము జంతువు నేర్చుకొను విషయముకంటే ఎక్కు వ శక్తికలిగి యుండును.
3. మానవుడు నేర్చుకొనగలిగినదంతయు జంతువు నేర్చుకొనలేదు

మానవుడు జంతువు నేర్చుకొనునట్లే నేర్చుకొనును. నేర్చుకొను క్రమము, పరిశీలనము. యత్న- ప్రమాదపద్ధతి ఇవి ఉభయత్రసమానములే. అయినను, ఆతని పరిశీలనము, యత్న - ప్రమాద పద్ధతి రెండును ఉన్నత స్థాయికి చెంది యుండును. మనుష్యునిపరిశీలనము కేవలము జ్ఞానేంద్రియ జన్యమే కాదు.అతడు నియమములు కలిగినవాడై, అల్పములయిన ఉద్రేకములకు లోనుకాడు. చిక్కులు పెట్టుట, కలవర పెట్టుట, అను ప్రయోగములు మనుష్యుని పరముగా జరుగగా, అతడు వాటిని బోధ చేసికొనుట యందును, వాటినుండి విముక్తిని సంపాదించుకొనుట యందును జంతువులకంటే విశేషమైన ఉత్కృష్టతను ప్రదర్శించునని తెలియుచున్నది.

మానవుని చేతులు కౌశలముతో పనిచేయుటకు ఎక్కువ వీలుగానున్నవి. దీనికంటే ముఖ్యమైన విషయమేమనగా అతని పరిశీలనశక్తి, జంతు పరిశీలనశక్తి కంటె గొప్పది. అతడు పరిశీలనమువలన వేర్చుకొనుట అనగా, కేవలము పరిస్థితులను తెలిసికొనుటయేగాక, వాటి యందలి రహస్య విషయములను తెలిసికొనుట కూడ అయియున్నది. మనుష్యుడు అభ్యసించునపుడు తాను అనవేషించు పరిస్థితుల యొక్కయు తాను ఉపయోగించు వస్తువుల యొక్కయు లక్షణములను తన మనస్సునకు పట్టించుకొనును. అతడు చలనాత్మక విషయములను అభ్యసించునపుడు, ఒక సారి కదల్పబడిన పిదప స్వతంత్రముగా నడచునట్టి క్లిష్టచలన క్రియలను సాధనముగా చేసికొనును. అభినయించుట, నృత్యము చేయుట, ఉపన్యసించుట అనునవి ముఖ్యోదాహరణములు, ఇట్టి చలనాత్మక అభ్యసన రీతులన్నియు ఆరంభమున పరిశీలనము పై నెక్కువ ఆధారపడినవే అయినను, కాలక్రమమున అవి నిత్యాభ్యాస కారణముగా, నాడీసంప్రదాయమున లీనమై కనీసములైన పరిశీలన నిగ్రహములతో కొనసాగును. అందువలన అభ్యాసవిషయమున, పరిశీలనములోను నిర్వహణములోను భాషను, భావమును అర్ధముచేసికొనుటలోను, మనుష్యుడు జంతువుకంటె అనేక రెట్లు అధికుడు. అల్పకృత్యములను చేర్చి వాటిని పెద్ద విషయముగా రూపొందించుటయందే మనుష్యుని కౌశలము విశదమగుచున్నది.

అభ్యసనము జరుగు విధానము : జంతువులు, మానవులు అభ్యసించు పరిస్థితులను పరామర్శించిన పిదప, అభ్యసన క్రమమునందలి ముఖ్యాంశములను పరిశీలించుట అవసరము. అభ్యసన క్రమమును గూర్చి వెలువడిన ఏ చిన్న సిద్ధాంతమునుకూడ ప్రపంచమునందలి మనస్తత్వ శాస్త్రజ్ఞులందరును సర్వసామాన్యముగా ఒప్పుకొని యుండ లేదు. అయినప్పటికిని, ప్రతిపాదింపబడిన ప్రతి సూత్రమునందును కొంత సత్యము లేకపోలేదు. ప్రాజ్ఞు లింకను అభ్యసన క్రియ విషయమున నూతన సూత్రములను కనుగొనుటకు విశేష ప్రయత్నము చేయుచునే ఉన్నారు. అభ్యననమును గూర్చి వెలువడిన ఆదిమ సూత్రములలో నొకటి 'సన్నిహితత్వమువలన కలుగు భావ సంయోగము.' అనగా రెండుభావములు కలిసి అనుభవింపబడుటచే, అవి సంయోగము నొందును. వ్యతిరేకముగా చెప్పబడినచో ఈ సూత్రము ఎక్కువదృఢముగాను స్పష్టముగాను ఉండును. రెండు భావములును కలిసి అనుభవింపబడినప్పుడుగాని సంయోగమును చెందవు. సంబంధములు సమకూర్చుటలో సన్నిహితత్వముకూడ ఎక్కువ సమర్థము కాదు. రెండు భావములను సమ్మేళనము చేయుటకు నేర్చుకొనువానికి వాటిలో ఏకత్వము గోచరింపవలెను. మరియెక ప్రాచీన సూత్రము కలదు—అది, "సాతత్యము, ఆవృత్తి, అభ్యసన క్రమమునకు తోడ్పడును" అని చెప్పుచున్నది. పరిస్థితి జనితక్రియా విషయమున ఇది సత్యమే. అందు ఆవృత్తి జరుగనిచో సరియైన సమాధానము ఉండజాలదు. అయితే ఈ సూత్రము కూడ పూర్వపక్షము చేయబడినది. ఎందుచేత ననగా వట్టి ఆవృత్తివలనను అభ్యసనము వలనను, ఎవరును సంపూర్ణులు కాజాలరు. ఎన్ని ఆవృత్తులు జరిగినను సరియగు కృషి లేనిచో, గొప్ప కౌశలముగాని, పాండిత్యముగాని చేకూరజాలదు. ఒక కార్యములో నిమగ్ను డగుటకు వ్యక్తికి సరియగు అభిరుచి ఉండవలెను. అభిరుచియే అతడు చేయు పనిమీద ఎక్కువ శ్రద్ధను చూపుటకు తోడ్పడును. అట్టికృషి అభ్యాస క్రమమునకు దోహదము చేయును. అభిరుచి, శ్రద్ధ అను వాటిని మనము విమర్శించినచో నిక్కముగ, ప్రతిఫలము, శిక్ష అనునవి వాటి లక్ష్యములనియు వీటివలన అభిరుచియు, శ్రద్ధయు జనించుననియు, ఇవియే అభ్యసన క్రమమునకు తోడ్పడుననియు తేటపడగలదు. ఇవి అభ్యసనమును నియమించు ప్రోత్సాహకారణములలో కొన్నియైయున్నవి.

ముగింపు : అభ్యసన సూత్రములలో, కొన్ని లోపములు (limitations) ఉన్నను అవి అభ్యసన క్రమమును కొంతవరకు విశదీకరించును. అన్ని రంగములయందువలె, సామాన్యమైన అభ్యసనమునందును, కొన్ని అపవాదములు కలవు. కొందరు వ్యక్తులు తమ ప్రతిభ చేత గాని, సులభగ్రహణ శక్తి చేతగాని ఇతరులకంటే అతి త్వరితముగాను, ఉత్తమము గాను నేర్చుకొనగలరు. అట్లే కొందరు సామాన్యమైన తెలివితేటలుకూడ లేని వారుగానున్నారు. ఈ విషయమున ఇతర అంశములుగూడ పరిగణింప దగి ఉన్నవి. మనస్తత్వ శాస్త్రమును పరిశీలించునపుడు సంపూర్ణ విషయమును దృష్టిలో నుంచుకొని ఇతర శక్తులన్నింటి సాయమున దానిని పరిశీలింప వలెను. అభ్యసన క్రమ పద్ధతిని సంపూర్ణముగా అర్థము చేసుకొనుటకు వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి, ఆలోచన, తెలివి, మనోవృత్తి, మున్నగు వాటినికూడ పరిశీలింపవలెను. ఇట్టి బహుళాంశములతో కూడిన వాతావరణమునందే అభ్యసనకృత్యము కొనసాగును. అభ్యసనక్రమ రంగమున ప్రస్తుతము పరిశోధనము జరుగుచున్నది. ఈ రంగమున ఇంకను ఇట్టి పరిశోధనము ఎంతో అవసరము. ప్రతి రంగమునందును లక్ష్యసిద్ధియు, అభివృద్ధియు అభ్యసన మనస్తత్వము పైననే ఆధారపడి యున్నవి.

డా. శ్రీ.శ్రీ.

[[వర్గం:]]