Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభ్యవహారము-ఆర్షపద్ధతి

వికీసోర్స్ నుండి

అభ్యవహారము-ఆర్షపద్ధతి  :- విషయములు : ధాన్యభేద నిరూపణము, దంపు, వంట, వంటకు పాత్ర విశేషము, భోజనము, తదితర ప్రసక్తాంశములు.

లోకములో తరతమభావముచే ( తారతమ్యముచే) మానవులలో కొందరు జొన్నలు, మరికొందరు గంటెలు, సన్న ధాన్యము, ముతక ధాన్యము, నల్ల ధాన్యము, గోధుమలు మున్నగు ధాన్యవిశేషములు అన్నము, రొట్టె, జావ మున్నగు రూపభేదములచే ఎట్లు భుజించుచుండిరో అటులనే దేవతలలోగూడ అగ్ని (గృహపతి)కి నల్లధాన్యము (కృష్ణ వ్రిహులు) తో చేయబడిన పురోడాశము (యజ్ఞార్థమయిన అపూపము) ; సోమునకు చామ- బియ్యపు అన్నము(చరువు) ; సవితకు అశువ్రీహుల (60 దినముల పంట ధాన్యము) తో చేయబడిన రొట్టె; బృహస్పతికి నివరి ధాన్యపు అన్నము; ఇంద్రునకు మహావ్రీహుల (పెద్దవారి ధాన్యముతో చేయబడిన) రొట్టె ; వరుణునకు యవధాన్యపు అన్నము ; పూషదేవతకు దంతములు లేకపోవుటచే పిండితో చేసిన జావ మున్నగునవి; ఆగ్ని, సోముడు మున్నగు దేవతా భేదముచే, నల్లధాన్యము మున్నగు ద్రవ్య భేదముచే రొట్టె, అన్నము, జావ మున్నగు రూప భేదముచే శ్రుతిలో విధింపబడియున్నవి. దీనికి కృష్ణయజుర్వేద సంహితలో---

శ్రు. "అగ్నయే గృహపతయే పురోడాశం - కృష్ణా
నాం వ్రీహీణాగ్ ం; సోమాయ -
శ్యామాకం
రుగ్ o ; సవిత్రే - పురోడాశం - ఆశూనాం వ్రీహీణాం
బృహస్పతయే.నై వారం చరుం; ఇంద్రాయ.పురోడాశం-
మహావ్రీహీణాం ; వరుణాయ - యవమయం చరుం "

(కృ. య, సం. 1-8-10)

“పూషా ప్రసిష్టభాగో ఒదంతకోహి" (కృ. య. సం. 2-6-8) అని కలదు. భావము :' లోకములో దైనందిన ప్రక్రియలో గోధుమరొట్టెలు, బన్ను రొట్టెలు, జొన్న అన్నము, సన్న బియ్యము అన్నము మున్నగు వాటిని గంటెజావ, గోధుమ జావ మున్నగువాటిని వేరు వేరుగా ప్రతి నియతముగా భుజించు మానవుల వలె, దేవతలలో గూడ ధాన్యాది భేదముచే ప్రతినియతాహారమును పై శ్రుతివాక్యములు బోధించుచున్నవి.

ప్రకృతములో - పై దేవతలకు తత్తత్కర్మలందు ఆయా ధాన్యములచే (చరుపురోడాశాదులను) అన్నము మొదలగువాటిని చేయదలచినపుడు వీటి అన్నిటికిని మొదట బియ్యము అవసరముగాన అట్టి బియ్యమును తయారుచేయుటకు లౌకిక సాధనము లగు నఖవిదళన మొనర్చుట ( అనగా గోళ్ళతో ధాన్యమును ఒలిచి బియ్యముగా తయారుచేయుట), మిల్లులో పోయుట, దంపుట మున్నగువాటిలో దేనిచేనైనను బియ్యమును తయారుచేయుటలో విశేషము కానరాదు గాన ఏ ఉపా యముచే నైనను బియ్యమును తయారుచేయవచ్చునని లౌకిక దృష్టిచే సిద్ధమగుచు నుండగా;

దంపుడు బియ్యము  : శ్రుతిలో "వ్రిహీనవహంతి" (ధాన్యమును దంపియే బియ్యమును తయారుచేయవలెను) అను విధివాక్యము పూర్వమీమాంసాశాస్త్రములో బహు విపులముగ విచారించి సిద్ధాంతీకరింపబడినది. ఆ నియమ విధి ననుసరించి 'అవహననముచేతనే (దంపుడుచేతనే) బియ్యమును తయారుచేయవలెను గాని నఖవిదళనాది... ఉపాయాంతరములచే తండులములను నిష్పాదనము చేయరాదు' అని సిద్ధమయినది.

దంపుడు బియ్యపు మహత్త్వము : నఖవిదళన మొనర్చుట మిల్లులో తయారుచేయుట, దంపుట మున్నగు సాధన ములలో దేనిచే సిద్ధము చేసినను బియ్యములో విశేషము కానవచ్చుట లేదుగదా! అట్టిసందర్భములో (అవహననము) దంపుచే తయారుచేసిన బియ్యములో మహత్త్వముండునా అని శంకింపరాదు. దానియందుగల అలౌకికమహత్త్వము నటులనుంచి లౌకిక మహత్త్వమును గమనింపదగును.

“వషట్కారోవై గాయత్రియై శిరో ౽చ్ఛినత్త స్యైరసః పరావతత్సపృథివీం ప్రావిశత్సఖదిరో భవద్యస్య ఖాది రస్స్రు వో భవతి ఛందసామేవర సేనావద్యతిసరసా అస్యాహుత యోభవంతి" ఇతి (కృ.య. సం.3.5-7).

పూర్వమువషట్కార దేవతగాయత్రీ ఛందస్సు యొక్క శిరస్సును ఛేదింపగా దానిసారము పృథివియందు ప్రవేశించి ఖదిర (చండ్ర) వృక్షరూపముగ ఉద్భవించెను. కావున చండ్రకఱ్ఱతో నిర్మించిన స్రువముతో శ్రోతకర్మ లందు ఆజ్యము మున్నగు ద్రవద్రవ్యములను గ్రహించిన యెడల ఛందస్సుల యొక్క సారముతో గ్రహించినట్లగును అని కృష్ణయజుర్వేదములో చెప్పబడినది.

ఈ శ్రుతివలన 'చండ్రకఱ్ఱగాయత్రీ ఛందస్సు యొక్క సారము అని స్పష్టమగుటచే, లోకములో దంపుటకు, రోకళ్ళను చండ్రకఱ్ఱతోనే తయారుచేయుచుండెడి సంప్రదాయము ఏర్పడినది గాన అట్టి రోకళ్ళచే ధాన్యమును దంపినచో ఛందస్సుల యొక్క సారము ఆ బియ్యమునందు ప్రవేశించును. కావుననే దంపుడు బియ్యము ఆరోగ్యమునకు సాధనమగుచున్నవి — ఈ గాథను తెలిసికొనక పోయినను దంపుడు బియ్యము ఆరోగ్యమునకు కారణమని వైద్యులు పలుకుచుందురు. కాని ఈ శ్రుతిబోధితమగు కారణమును మాత్రము గ్రహింపజాలక, బియ్యము మిల్లులో పోసినచో వేడిమిచే విటమినులు పోవుచున్నవి. అందుచే అనారోగ్యము కలుగుచున్నది అని కొందరును, తవుడు పోవుటచే అనారోగ్యము ఏర్పడుచున్నది అని మరి కొందరును వచించుచున్నారు. ఈవిషయము ఎంతవరకు వాస్తవమో విమర్శింపవలసియుండును. ఎండులకన, దంపునప్పుడుకూడ శ్రోతకర్మలలో నున్న "సంప్రేష్యతి " త్రిష్ఫలీకర్త వై (అ.శ్రౌ.సూ.) అను ఈ ప్రేషమంత్రముచే మెరుగుపోటు వేయుమని అధ్వర్యుడు ఆజ్ఞాపింపగా "దేవేభ్య శ్శుధ్యధ్వం, దేవేభ్య శ్శుంధధ్వం, దేవేభ్య శుృంభధ్వం, సుఫలీకృతాన్ కరోతి" అను సూత్రమంత్రములచే పత్ని మెరుగుపోటు వేసి పిదప చెరుగును. తవుడు అంత్యమున ఆ ఇష్టిలో దక్షిణాగ్ని యందు ఫలీకరణ హోమము చేయబడును. లోకములో కూడ మెరుగు పోటుచే తవుడును తీసియే బియ్యమును సిద్ధము చేయు నాచారము పూర్వము నుండియు గలదు.

వైద్యులు తలచినట్లు మిల్లు బియ్యమునకు వేడిమిచే విటమినులు పోవుటగాని, తవుడు పోవుట గాని అనారోగ్య కారణమైనచో ధాన్యమును గోళ్ళతో ఒలిచి, బియ్యమును తయారుచేసినచో పై అనారోగ్యకారణములు ఆ బియ్యము నందు ఉండవు గాన అట్టి బియ్యమును స్వీకరించవలసి యుండును. అట్లు స్వీకరించినచో అవహననవిధికి పూర్వ మీమాంసా శాస్త్రములో విచారణచేసి నిర్ణయింపబడినట్టి (దంపు చేతనే బియ్యమును తయారుచేయవలెను గాని ఇతర సాధనములచే చేయరాదు అను) నియమము వ్యర్థమగును.

వేద బోధితమయిన విశేషము రుజువు కావలెనన్నచో, కొంతకాలము గోళ్ళతో నిలిచిన బియ్యమును, మరి కొంతకాలము దంపుడు బియ్యమును ఉపయోగించినచో, గోళ్ళతో నొలిచిన బియ్యమునకు మిల్లు బియ్యమునకువలె వేడిమి ప్రసక్తి యుండదు. తవుడు ఏమాత్రము పోదుగాన దంపుడు బియ్యమునందు కంటే గోళ్ళతో ఒలిచిన బియ్యమునందు అధిక గుణము కనుపింపవలెను. అట్లు కనుపించక, దంపుడుబియ్యమును ఉపయోగించినప్పుడే విశేషారోగ్యము కనుపించినచో వేదప్రతిపాదితమయిన ఛందస్సారము చండ్రరోకలిద్వారమున దంపుడు బియ్యమునందు సంక్రమించుటచేతనే ఆ గుణవిశేషము కన్పట్టు చున్నట్టు స్పష్టమగును. ఛందస్సారము బియ్యమునందు సంక్రమింపవలెనను తాత్పర్యముతోనే శిష్టాచారములో ధాన్యము నలుగుటకు సౌకర్యార్థము చండ్రరోకళ్లకు చుట్టు ఇనుపపొన్నులను వేయించుచున్నను, ఆ చండ్రకఱ్ఱ యొక్క మధ్యభాగ సంబంధము ధాన్యమునకు ఉన్నట్లును మనము గ్రహించుచునే ఉన్నాము.

ఈ విధముగ దేవతాహవిస్సులలో అంతటను దంపుడు బియ్యమునే ఉపయోగింపవలెనని, నిరూపించిన పిదప,నిర్ ఋతి దేవతాకమయిన కర్మలో గోళ్ళతో ఒలిచిన బియ్యమునే ఉపయోగించవలసినదిగా శ్రుతి బోధించు చున్నది. కృష్ణయజు ర్వేద సంహితలో "నైర్ ఋతం చరుం పరివృక్ష్యై గృహే కృష్ణానాం వ్రీహీణాం నఖనిర్భిన్నం" అని కలదు. (1-8-9)

రాజసూయమను మహాక్రతువులో 'రత్ని నాంహవిస్సులు' అను ఇష్టప్రక్రమములో, మహారాజునకు మహిషి, వావాత, పరివృక్తి అను ముగ్గురు భార్యలుందురనియు, వారిలో పట్టాభిషిక్తురాలగు భార్యకు 'మహిషి' అనియు సామాన్య ప్రీతిగల భార్యకు 'వావాత' అనియు, ప్రీతి రహితురాలగు భార్యకు ‘పరివృక్తి' అనియు నామములను నిర్దేశించి, వారి ముగ్గురిలో ‘పరివృక్తి ' అను భార్య యొక్క గృహమున కేగి 'మహారాజు అచ్చట నైర్ ఋతేష్టిని చేయునప్పుడు నిర్ ఋతి దేవతకు నల్లధాన్యమును గోళ్ళతో ఒలిచి బియ్యము చేసి బియ్యముతోనే చరువును (అన్నమును) వండి ఆ దేవతకు ఆహవిస్సును ఇయ్యవలసినదిగా శ్రుతి చెప్పుటచే, గోళ్ళ బియ్యమును, మిల్లు బియ్యమును దేవతలకు నివేదనము చేయుట, భుజించుట తగదని శ్రుతిశిష్టాచారములవలన స్పష్టమగుచున్నది.

వంటకు పాత్ర విశేషము  : మృణ్మయపాత్రతోనే వండ వలెను. ఎట్లన మహాగ్నిచయనమను క్రతువులో 'ఉఖ' అను కుండలో రంపపు పొట్టు మున్నగువాటిని ఉంచి ఆహవనీయ మను అగ్నిపై ఆ 'ఉఖ' ను ఉంచి ఆడుగున ఆహవనీయాగ్నిని లెస్సగా జ్వలింప చేసినచో, అడుగు మంటచే, ఉఖలో రంపపు పొట్టు మొదలగునవి అంటుకొని, అగ్ని పుట్టిన పిదప, “ఉఖ్యేజాత ఆహవనీయమనుగ మయ్య" (ఆ. శ్రౌ. సూ.) అను సూత్రానుసారము ఉఖాగ్ని పుట్టుట తోడనే, అడుగుననున్న ఆహవనీయాగ్నిని, పూర్తిగా ఆర్పివేసి, ఈ ఉఖాగ్నినే, ఆహవనీయాగ్ని స్థానీయముగా వ్యవహరింతురు. అనగా ఆహవనీయాగ్నియందు చేయవలసిన హోమాదులను ఉఖాగ్నియందే చేయుదురు. ఇట్టిది ఆచారముగా చెప్పబడినది. అనంతరమందు కామనా విశేషముచే కృష్ణ యజుర్వేద సంహితలో “అంబరీషా దన్న కామస్యావధ్యా దంబరిషేవా అన్నం బ్రియతే సయోన్యేవాన్న మవరుం ధే॥ (1-1-10) “లోకములో మృణ్మయ పాత్ర యందు అన్నము వండుదురు గాన అన్నమును కోరు యజమానునకు అంబరీషము (మృత్పాత్ర)నుండి అగ్నిని తీసికొని వచ్చి ఉఖయందు అగ్నిని ఉత్పాదనము చేసినచో అట్టి యజమానునకు సమృద్ధమైన అన్నము లభించును" అని చెప్పబడినది. ఈ శ్రుతివలన ఆర్ష సంప్రదాయములో మృణ్మయపాత్రచేతనే అన్నమును వండు చున్నట్లు స్పష్టమగు చున్నది.

మృణ్మయపాత్రను తడుపుట  : లోకములో క్రొత్త మృత్పాత్రలను ప్రథమములో పాలతో తడిపి వాడుచుండెడి సంప్రదాయము కలదు. దీనిని సహేతుకముగ శ్రుతి విధించుచున్నది. కృష్ణ యజుర్వేద సంహితలో

"అసుర్యం పాత్ర మనాచ్ఛృణ్ణ మాచ్ఛృణత్తి దేవత్రా
కరజ క్షీ రేణాచ్ఛృణత్తి పరమం వా ఏత త్పయోయ
దబుక్షీరం పరమేణై పానాం పయసాచ్ఛృణత్తి
యజుషా వ్యావృత్యే. (కృ. య. సం. 5-1-7)

యజ్ఞసాధనమగు మృణ్మయపాత్రను కాల్చిన పిదప ప్రథమములో ద్రవద్రవ్యముచే తడపకుండా వాడినచో ఆ పాత్ర అసురయోగ్యమగును. ద్రవద్రవ్యముచే తడిపి వాడినచో ఆ పాత్ర దేవకర్మలకు యోగ్యమగును. అనంతరము దేనితో తడపవలెను అను శంకపై లోకములో మేకపాలు సర్వవ్యాధులను తొలగించునటుల ప్రసిద్ధి కలదు. కావున అవి ఉత్తమ మయినవని తెలియనగును. వేదములో గూడ "ఆగ్నేయీ వా ఏషొ యదజా" (కృ.య. సం. 5-4-3) (ప్రజాపతి ముఖమునుండి అగ్నితో కూడ మేక పుట్టినది గాన మేక అగ్ని సంబంధ మైనది. అందుచే అది ఉత్తమమయినది) అని చెప్పబడినది. ఇవ్విధముగ లోకమునను వేదములలోను మేక ఉత్తమమైనది గాన దాని పాలచే క్రొత్తకుండలను తడుపవలెను అని చెప్పి “లోకములోవలె మంత్రరహితముగ తడుపరాదు. లోక వైలక్షణ్యముకొరకు యజ్ఞములో మంత్రములచే తడుపవలెను." అని వచించుటచే, లోకములో మంత్ర రహితముగ పాలతో తడుపుచున్నట్లు స్పష్టమగుచున్నది.

లోకములో మేకపాలు తరచుగ సంభవించక పోవుటచే పాలతో మాత్రము తడుపుచుండెడి ఆచారము నేటి వరకు ప్రచారములో నున్నది. ఈ విధముగ శ్రుతిప్రమాణములచే క్రొత్తకుండను ప్రప్రథమము పాలతో తడిపి, అనంతరము ఆకుండతో వంటచేయవలెనని స్పష్టమగు చున్నది.

అన్నము వండుట  : వంట చేయునపుడు దంపుడు బియ్యమును కడుగకుండ అత్తెసరుగా వండవలసినదిగ “న ప్రక్షాళయతి, న ప్రస్రావయతి, న గాలయతి, జీవతండుల మివ శ్రవయతీతి విజ్ఞాయతే" అని ఆ. శ్రౌ. సూత్రము చెప్పుచున్నది. ఈ సూత్రముచే వంట చేయు బియ్యమును కడుగకూడదు. దానిలో పోసిన నీటిని, కడుగును తీసివేయరాదు. నీటిని పోసిన తరువాత గాలించరాదు. అనగా నొక్కికడిగి నేమరాదు. అత్తెసరుగా వండవలయును. అన్నము చిముడకూడదు. వంట బిరుసు పదునుగా నుండవలయును అని అగ్న్యాధానమునందలి శ్రౌతకర్మలో చెప్పబడినది. దర్శపూర్ణమాసలు అను శ్రౌతకర్మలో "ప్రక్షాళ్య తండులాన్" (తండులములను కడిగి) అని చెప్పబడినది గాని గాలించి కడుగవలయునని చెప్పబడలేదు. అందుచేత బియ్యమును కడుగుకుండ అత్తెసరుగా వండుట, బియ్యమును కడిగి అత్తెసరుగా వండుట అను రెండువిధములు కలవనియు, అట్టి అన్నము దేవతా యోగ్యమగుననియు స్పష్టమగుచున్నది.

రొట్టెను కాల్చుట  : కృష్ణయజుర్వేదమునందు "యో విదగ్ధ స్స నైర్ ఋతో యో ౽శృత స్స రౌద్రోయ శ్శృత స్స దేవ స్తస్మా దవిదహతాశృతం కృత్య స్స దేవత్వాయ॥ (కృ. య. నం.2 కాం.6ప్ర.3అ.) అని కలదు. పురోడాశము (రొట్టె) మాడునట్లు విశేషముగ కాల్చ బడినచో అది రాక్షసులకు ప్రియమగును. కొంచెము పచ్చిగా నుండినచో ఆ పురోడాశము రుద్రునకు ప్రియమగును. సమముగా శ్రవణము చేయబడినచో అది దేవతాప్రియమగు హవిస్సగును. అందుచేత విదాహాదులు లేకుండ సమముగా శ్రపణము చేయవలెనని దీని భావము.

వెన్న, నెయ్యి  : "మృతం దేవానా మస్తు పితౄణాం నిష్పక్వమ్, మనుష్యాణాం తద్వా ఏత త్సర్వదేవత్యం యన్నవనీతం" (కృ, య.సం. 6-1-1) అను శ్రుతివాక్య మొకటికలదు. యజ్ఞములో ప్రధమ దినమున యజమానుడు యజ్ఞశాలలో ప్రవేశించిన పిదప తన శరీరమందంతటను వెన్నను నఖశిఖాపర్యంతము రాచుకొనవలెననియు, అట్టి వెన్నను సంపాదించు నిమిత్తము మజ్జిగ చేయునపుడు చల్ల గుంజకు త్రాటిని కట్టి పెరుగును చిలికి తీసిన వెన్న దేవతలకు ప్రియమైనదనియు, చల్లగుంజ లేకుండ రెండు చేతులతో (చిన్న కవ్వముతో) మాత్రమే పెరుగును మధించి తీసిన వెన్న పితృదేవతలకు ప్రియమైనదనియు శ్రుతిబోధఅయియున్నది. కావున శిష్టాచారానుసారముగ స్మృత్యాది బోధితమగు కవ్వముచే మధితమైన వెన్న దేవతా యోగ్యమును సర్వదేవతా ప్రీతిపాత్రమును నై యున్నదని తేటపడు చున్నది. ఈ వెన్నను కాచి నెయ్యిగా తయారు చేయునపుడు పాక జన్యమయిన అవస్థాభేదములచే సర్వదేవతలకు ప్రియమైనట్లు శ్రుతి వక్కాణించుచున్నది. ఎట్లన మామూలుగా కాగిన నెయ్యి దేవతలకు ప్రియమైనది. అరకాక నెయ్యి పితృదేవతలకు ప్రియము. కాగి పరిమళముతోగూడిన నెయ్యి మనుష్యులకు ప్రియము గాన ఈ తీరున వెన్న సర్వదేవతా ప్రీతికరమని చెప్పబడినది. అట్టి వెన్నకు మూలమగు పాలను గూర్చి కృష్ణ యజుర్వేదములో “అభివా న్యాయైదుగ్గేభవతి | సాహిపితృ దేవత్యందు హే॥" (కృ. య. బ్రా.) అను శ్రుతివాక్యము కలదు. దూడ చనిపోయిన గోక్షీరములు పితృదేవతలకు ప్రియమైనవి అని దీని భావము. మరియు దూడగల గోక్షీరములు దేవతలకు ప్రియములయినట్లు దర్శపూర్ణ మాసాది శ్రౌతకర్మలందలి గోదోహనాది పర్యాలోచనచే స్పష్టమగుచున్నది. కావున తత్తదేవతాక ములగుకర్మలందు తత్త ద్దేవతానుగుణమగు క్షీరజన్యమగు నవనీతముచే, తత్తద్దేవతానుగుణముగ ఆజ్యమును తయారుచేసి తదనుగుణముగ హోమాదులయందు ఆజ్యమును వినియోగింపవలసినట్లు విశదమగుచున్నది.

పాత్ర నిర్ణయము  : భోజనము రజతపాత్రలో పితృదేవతలకును, సువర్ణపాత్రలో దేవతలకును ప్రియమైనట్లు ఆబ్దికమంత్రములో విశ్వేదేవతలకును, పితృదేవతలకును, అర్చనచేయు సందర్భమునందలి “సౌవర్ణ మిదం పాత్రం" "రాజత మిదం పాత్రం" అను వాటిచే స్పష్టమగుచున్నది. వెండి కంచములను ఉపయోగించువారు దేవతానివేదన చేయుటకు యోగ్యతా సంపత్తి కలుగుటకు, బంగారపు పువ్వును వేయించినచో అది సువర్ణపాత్ర అగును గాన అది దేవతానివేదనకు అనుకూలమగును. శక్తి లేనివారు అరటి ఆకును ఉపయోగించి తత్తత్కర్మానుగుణముగ రాజత, సౌవర్ణపాత్ర భావనచే ఆబ్దికాదులయందు కర్మను నిర్వర్తించేడి ఆచారముకలదు, కాని 'కదళీ గర్భపత్రంచ'అను స్మృతిచే అది నిషేధింపబడినది. అందుచే అరటి డిప్పచే కుట్టబడిన బొంద విస్తళ్ళను ఉపయోగించరాదు.

ఇట్లు యథాసంభవముగను, యథాశక్తిగను పాత్రను సంపాదించి పూర్వోక్త ఆజ్యముచే పాత్రాభిఘోరమును చేసి పదార్థములను వడ్డించిన పిదప తిరిగి అన్నాభిఘారమునుచేసి, అనంతరము పూర్వపరి షేచనముచేసి ప్రాణాహుతులను పండ్లకు తగులకుండ మ్రింగవలెను. దీనిని ప్రాణాగ్నిహోత్ర మందుకు. ఇట్లు ప్రాణాహుతులను తీసికొనకుండ భోజనమును చేసినచో నరుడు భగ్నవ్రతుడగునని స్మృతులు బోధించుచున్నవి. భోజనము చేయు రీతినిగూర్చి "ప్రాచీ మభ్యాకారం అగ్రై రంతతః । ఏవ మివ హ్యన్న మద్యతే" (కృ. య. బ్రా. 3-3-1) “హస్తం పురతః పాత్రే ప్రసార్య అభితః భోజ్యా న్యాకృష్య ముఖబిలే ప్రక్షిపతి తద్వత్"అని శ్రుతిస్మృతులు కలవు, దర్శపూర్ణమాసలు అను శ్రాతకర్మలో స్రువము, జుహువు మున్నగు నామములచే ప్రసిద్ధములగు దారుమయములగు హోమపాత్రలను దర్భాగ్రములచే తుడుచు సందర్భమున, లోకమునందు మానవుడు భోజన సమయములో ఎదుటనున్న భోజనపాత్రయందు హస్తమును ప్రసరింపజేసి, ఇరుప్రక్కలగల వ్యంజనములను ఆకర్షించి అన్నములో కలుపుకొని నోటిలో ఎట్లు వేసికొనునో అటులనే ఈ హోమపాత్రలను తూర్పు నుంచి దర్భాగములచే .మధ్యభాగమునకు సంమార్జనము చేయవలయునని పై శ్రుతి సూత్రములు బోధించుచున్నవి. గాన ప్రాణా హుతులను తీసికొనిన పిదప అన్నమును వ్యంజనముల సమ్మేళనముతో భోజనమును చేయుచున్నట్లు లోకము నందును వేదమునందును ప్రసిద్ధి కానవచ్చుచున్నది.

దధి (పెరుగు) : ఇవ్విధముగ భోజనమును చేయు సందర్భములో అంత్యమున పెరుగుతో భోజనమును సమాప్తి చేయవలెనని చెప్పి, ఆ పెరుగును తయారుచేయు విధానమును శ్రుతి ఈ క్రిందివిధముగా బోధించుచున్నది:

"య త్పూతికై ర్వా పర్జవల్కై ర్వా పంచ్యాత్సౌమ్యం
తర్వత్క్వీలై రాక్షసం తద్య త్తండులై ర్వైశ్వ దేవం
తద్యదాతం చనేన మానుషం తద్య ద్దన్నాతత్యేంద్రం
దధ్నాతనక్తి సేంద్రత్వాయ" (కృ. య. సం.2-5-3)

సోమలతా సదృశములగు ఓషధివిశేషములచేగాని పూతీకముచేగాని, మోదుగ చెట్టు యొక్క బెరడుచేతగాని, క్షీరములలో తోడు పెట్టుట చేత నిష్పన్న మయిన పెరుగు సోమదేవతకు ప్రియమైనది అని పై శ్రుతిభావము. అటులనే క్షీరములకును స్థూల బదరీఫల సంబంధముచే నిష్పన్నమయిన పెరుగు రాక్షసులకు ప్రియమయినది. తండుల సంపర్కముచే నిష్పన్నమగు దధివిశ్వేదేవతలకు ప్రియము కొంచెము పులిసిన మజ్జిగచే నిష్పన్నమయిన పెరుగు మనుష్యులకు ఇష్టమయినది. క్షీరములలో పెరుగు తోడు పెట్టగా నిష్పన్నమయిన దధి ఇంద్రునకు ప్రియమయినది. అట్టి పెరుగును ఇంద్రునకు హోమము చేయుటకై పాత్రయందు గ్రహించునపుడు పాలను ముందు గ్రహించి అంత్యమున పెరుగును గ్రహణము చేయవలెను. అట్లు చేయుటచే ‘ధినోతీతి దధి' అని వ్యుత్పత్తి కావున, 'ధివ్ ప్రీణనే' అను ధాతువువలన ఏర్పడిన 'దధి' శబ్దమునకు 'సంతోషపరచునది' అని అర్థము కావున అట్టి వస్తువును చివర గ్రహణముచేసి హోమమొనర్చుటచే ఇంద్రునకు సంతోషము (తృప్తి) జనించును, అని తెలియుచున్నది. “దధ్నో పరిష్ఠాద్దినోతి” అను నీ శ్రుత్యర్ధము ననుసరించియే లోకములో పెరుగుతో అంత్యమున భోజనము చేయు నాచారము ఏర్పడెను. ఇట్లు సర్వపదార్థములను భుజించిన పిదప అంత్యమున పెరుగుతో భోజనమును సమాప్తి చేయుటచే, మానవునకు సంతృప్తి జనించుచున్నది.

రెండుసార్లు భోజనము:

 "ప్రజాపై సత్రమాసత తప
_స్తవ్యమానా అజుహ్వతీః ..మనుష్యా అవశ్యన్
చమనం మృతస్య పూర్ణగ్ స్వధాంతముపోదతిష్ఠన్
తమ జుహవుః | తేన ద్వయీ మూర్ఖ మవారుంధత
తస్మా ద్విరహ్నో మనుష్యేభ్య ఉపహ్రియతే ప్రాత
శ్చ సాయం చ" (కృ. య. బ్రా. కాం. 4. ప్ర. 9. అ.)

అని కలదు.

పూర్వము ఒకప్పుడు ప్రజలు హోమము లేకుండ ఉపవాస రూపమగు తపస్సును చేయుచు, సత్రయాగ సదృశమగు సుకృతమును సంపాదించిరి. ఇట్లు తపస్సును చేయుచుండగా కొంతకాలమునకు వారికి ఉచితమగు అన్నమును ధరించునట్టియు, ఘృతపూర్ణమగు నట్టియు దారుమయమునగు నొక పాత్రవిశేషము కానవచ్చెను.వారు దానిని చేతబూని నిలువబడి ఆ ఆజ్యమును అగ్ని యందు హోమము చేయగా ఆ హోమ ప్రభావముచేత ఒక దినమున కాలద్వయమందు భోజ్యమగు అన్నము సంప్రాప్తమయ్యెను. అప్పటినుండి నేటివరకును లోకములో సామాన్యులచేతను, శిష్టులచేతను దినమునకు భోజనము రెండుసార్లు (సాయం ప్రాత స్సమయము లందు) చేయబడుచున్నది. ఇవ్విధముగ రెండు పూటల భుజించునపుడు కొంచెము తక్కు వగ భుజింపవలెననియు, ఏకాదశి మున్నగు దినములందు దినమున కొకసారే కడుపునిండ భుజింపవ లెననియు స్మృతి భోధించుచున్నది. పై విధముగ, శ్రుతి, స్మృతి, శిష్టాచారములననుసరించి ఆహారమును భుజించు మానవులకు ఆయురారోగ్యములు సంపూర్ణముగ సిద్ధించునని అనుభవపూర్వకముగ స్పష్ట మగుచున్నది.

ఉ. గ. శా.

[[వర్గం:]]