Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభినవగుప్తుడు

వికీసోర్స్ నుండి

అభినవగుప్తుడు  :- (కాశ్మీరము - క్రీ. శ. 11 వ శతాబ్దము) "సరస్వత్యా స్తత్త్వం కవి సహృదయాఖ్యం విజయ తామ్" అని కీర్తించినటుల కవి సార్వభౌములగుట చేత సరస్వతీతత్వమూర్తులగు శ్రీమ దభినవగుప్తపాదాచార్యులవారు, శాస్త్ర సర్వస్వము నెల్లరికిని ప్రసాదించుటకై, అవతరించిన శ్రీపతంజలి మహర్షివలె నొకయవతార మనుటకు సందియము లేదు.

ఈ మహామహోదయుడు - కవిసార్వభౌముడుగను, ధ్వనిమార్గ ప్రవర్తనాచార్యుడుగను, నాట్యశాస్త్ర విశదీకరణ ప్రవీణుడుగను, కాశ్మీర శైవ సంప్రదాయమగు ప్రత్యభిజ్ఞాదర్శనమునకు మూల స్తమ్యాయమానుడుగను, నాలుగు వేషములు ధరించి లౌకిక, వైదిక కళా విద్యాస్థానరంగములయం దన్నిటియందును తన అసాధారణ ప్రతిభా విశేషములను ప్రదర్శించి, చతుర్విధ గ్రంథ రచనాభినయ చాతుర్యమున సకల సహృదయహృదయముల వికసింపజేసిన ఒకానొక అసాధారణవ్యక్తి. వీరిని గూర్చి సమగ్రముగ దెలిసికొన వలయుననిన నెవ్వరికిని సాధ్యము గాదు. అయినను పై నాలుగు విధములైన విద్యా ప్రభేదములలో వారు విరచించిన ఉత్త మోత్తమ గ్రంథముల పరిశీలించితిమేని, వీరి ప్రభావమును, ప్రతిభా. సంపత్తిని, వీరు లోకమున కనుగ్రహించిన ప్రబోధమును కొంతవరకు గుర్తెరుగ వచ్చును. ఆయా విభాగములలో. వీరు రచించిన ప్రబంధములు ఆదర్శప్రాయములై విరాజిల్లు చున్నవి.

సరస్వతీ విహారరంగస్థల మగు కాశ్మీరమున శివభక్తి పరిపూతమగు నొక విద్వత్కుటుంబమున (క్రీ. శ. 950 నుండి 966 సంవత్సరముల లోపల) వీరు జన్మించిరి.

వీరి వంశకూటస్థుడగు అత్రిగుప్తుడు గంగాయమునలకు మధ్యనుండు కాన్యకుబ్జమునకు రాజగు యశోవర్మ (క్రీ. శ. 720-740) రాజ్యకాలమున "అంత ర్వేది" యను గ్రామమున నివసించుచుండెను. అతడు సర్వశాస్త్ర పారగు డగుటయేకాక శైవాగమములయందు అద్వితీయ ప్రవచనాచార్యుడై విరాజిల్లుచుండెను. కాశ్మీర రాజగు లలితాదిత్యుడు (క్రీ.శ.725-761) యశోవర్మను జయించినప్పుడు అత్రిగుప్తుని పాండిత్యమునకు సంతసించి కాశ్మీరమునకు ఇతనిని తోడ్కొని చని, ఇతని నిత్యనివాసమునకై వితస్తా (jhelam) నదీతీరమున శీతాంశుమాలి దేవాలయమున కెదుట సముచితమైన యొక గృహమును నిర్మించి, ఆ నదీ మూల భాగముననే ఒక జాగీరును గూడ కల్పించి మిక్కిలి గారవించెను. వీరి కుటుంబమున “వరాహగుప్తుడు" అను మహాను భావుడు అవతరించెను. అతని శివభక్తికి మెచ్చి అతనిపై పరమ శివుడు విశేష కటాక్షమును ప్రసరింపజేసెను. అతని ఆత్మజుడు “చుఖులక” అను ఉపనామముగల నరసింహగుప్త సకల శాస్త్రములయందును అసమాన పాండిత్యమును గలిగినవా డగుటయేగాక, అత్యంత శివభక్తి పరాయణుడైయుండెను. అతనిభార్య విమలకళ. మహాసాధ్వియు, సనాతన ధర్మాచార పరాయణయునై యుండెను. వీరిట్లు సనాతనధర్మ పరాయణులై, విద్యావ్యాసంగైక తత్పరులై, శివభక్తి భరితులై, అతి పవిత్రమగు దాంపత్యమును నిర్వహించుచుండిరి. ఆదివ్యదంపతులకే. “యోగినీభూ” అని ప్రసిద్ధిచెందిన మన అభినవగుప్తపాదు డుదయించెను.

జననకాల నిర్ణయము  : కాశ్మీర సంప్రదాయమున సప్తర్షిశకము వాడుకలో నున్నది. అది కలియుగారంభమునకు 25 సంవత్సరముల తరువాత నారంభమగుచున్నది. అందుచే "బృహతీ విమర్శినీ" గ్రంథము నందు ఇతడు. చెప్పిన రీతిగ, 4090 సప్తర్షి వర్షమున ఆ గ్రంథము సమాప్త మైనటుల తెలియుచున్నది. "భైరవ స్తవ” మున, 4068వ సంవత్సరమున పుష్యబహుళ దశమితిథిని అది పూర్తిచేయ బడినటులను, “క్రమ స్తోత్ర"మున 4066 సంవత్సర మార్గశీర్ష కృష్ణ నవమియం దది పూర్తిచేయబడినటులను `తెలిపి యున్నాడు. అందుచే 4066 నుండి 4090 వరకును ఇతడు గ్రంథములను రచించుచుండెనని తెలియుచున్నది. అది క్రీ. శ. 990-1014 అగుచున్నది. ఇతని గ్రంథములలో మొదటిది క్రమస్తోత్ర మనియే చెప్పుటకు వీలు లేదు. అదియును గాక నితడు పెక్కుమంది గురువుల నాశ్రయించి అనేక విషయములలో నారితేరినవాడు. దీని కెంత లేదన్నను 30 లేక 40 సంవత్సరముల కాలము పట్టి యుండవలయును. అందుచే నితడు క్రీ. శ. 950.960 సంవత్సరములకు మధ్య జన్మించి యుండవలయును.

విద్యాభ్యాసము : అభినవగుప్తపాదనామ నిర్వచనము: అతి బాల్యముననే తలిదండ్రు లితనిని సమీపమున నుండు పాఠశాలకు బంపిరి. అప్పటి నుండియే ఇతని గొప్పతనము బయలుపడుచుండెను. ఇతని నవనవోన్మేషమగు బుద్ధి వైభవమునకును వాగ్మిత్వమునకును ముగ్ధులై, ఉపాధ్యాయు లితనిని పతంజలియపరావతారమని నిశ్చయించి, "అభినవ గుప్తపాదుడే" (నూతన పతంజలియే) ఇతడని, ఇతని నామధేయమును సమన్వయ మొనర్చిరి. మరియు సహాధ్యాయు లందరును ఇతనిని జూచి మహాసర్పమును జూచినటుల భయభ్రాంతు లగుచుండిరి. అందుచే నితడు అందరిచేతను గుప్తపాదుడగు నాదిశేషుని అపరావతారముగనే భావింపబడుచుండెను. "బాలవలభిభుజంగు" డని ఇతనిని గురువులు కీర్తించినటులు కావ్యప్రకాశ వ్యాఖ్యానమగు బాలబోధినిలో నున్నది. కనుక ఇతని సమగ్ర నామ ధేయము "అభినవ గుప్తపాదు" డనుటయే యుక్తము, "భట్టాభినవగుప్తార్య పాద ప్రోక్తేన వర్త్మవా" అని కీర్తించుటయు దీని కనుకూలముగనే యున్నది.

ఇతని ఆచార్యులు  : “బహుభ్యః శ్రోతవ్యం ; బహుధా శ్రోతవ్యమ్" అను నార్యోక్తిని ఆచరణములో పెట్టగలిగిన దిట్ట ఇతడే. ఆయా సంప్రదాయములలో మిక్కిలి ప్రవీణులగు నాచార్య మహోదయుల నాశ్రయించి, మధుకర వృత్తితో సర్వశాస్త్ర విషయ మకరందముల నితడు ఆస్వాదించెను. వేయేల, నాస్తికులగు జైన బౌద్ధాదుల నాశ్రయించి, వారల కడ వారి మత పరమార్థములను దెలిసికొనెను. ఇటుల నితడు సర్వశాస్త్రముల యందును అద్వితీయ పాండిత్య మండితుడై విలసిల్లెను.

Caption text
ఆచార్యుల నామధేయములు వారు బోధించిన శాస్త్రములు
1. నరసింహగుప్త (వీరితండ్రి) వ్యాకరణము
2. వామనాథుడు ద్వైతాద్వైత తంత్రములు
3. భూతిరాజతనయుడు ద్వైత శైవము
4. భూతిరాజు బ్రహ్మవిద్య
5. లక్ష్మణగుప్త క్రమ-త్రికదర్శనములు
6. భట్టేందురాజు ధ్వనిమార్గము
7. భట్టతోతుడు నాట్యశాస్త్రము

ఇతని కుటుంబము, దానిపరిస్థితులు : ఇతని తల్లిదండ్రులే కాక, ఇతనికి వామనగుప్తుడు అనునొక పినతండ్రియు, మనోరథుడను నొక తమ్ముడును, క్షేముడు, ఉత్పలుడు, అభినవుడు, చక్రకుడు, పద్మగుప్తుడు అను నైదుగురు పినతండ్రి కొడుకులును గలరు. గురుపంక్తిలో పినతండ్రి పేరుగూడ నున్నది. వారు అలంకార శాస్త్రగ్రంథముల విరచించినటుల, అభినవభారతిలో ఇతడు ఉదాహరించి యున్నాడు. సోదరులందరును సకలశాస్త్రపారగులగుట మాత్రమే గాక, ఉత్తమ గ్రంథ రచయితలై యున్నటుల దెలియుచున్నది. "స్పన్దనిర్ణయ" మను శైవగ్రంథమును క్షేముడు (క్షేమరాజు) అను సోదరుడు విరచించెను. ఇట్లు వీరి కుటుంబములోనివా రందరును ప్రౌఢశాస్త్ర ప్రవీణులును, అత్యంత శివభక్తి సమన్వితులునునై యుండిరని తెలియుచున్నది.

ఇతడు సాహిత్యాధ్యయనము చేయుచుండినపుడే ఇతని తల్లి చనిపోయినది. అప్పటికి ఇతని తండ్రి, వయసు చెల్లనివాడయ్యు, వివాహాంతరమును చేసికొన నొల్లక పరమ విరక్తుడై యుండెను. ఈ సంఘటనచే మన అభినవ గుప్తుల మనస్సు ఫారలౌకిక శ్రేయోను చింతనాదులందే నిమగ్నమయ్యెను. అందుచే నితడు వివాహముచేసికొనుట కంగీకరింపలేదు. అటుపై ఆగమవిజ్ఞానసంపాదనకై కడగి, అందు సంపూర్ణమయిన విజ్ఞానమును నార్జించుటయేగాక, తద్యోగసిద్ధులై తాము తరించి, ఇతరులను గూడ తరింప జేసిరి. ఇతని అతివిపులమైన తంత్రాలోకము ఇతని అస దృశమగు ఆగమపరిజ్ఞానమునకును, అద్వితీయ పాండిత్యమునకును నిదర్శనము.

నిర్యాణము  : ఇత డుద్దేశించిన కార్యమును ముగించిన తరువాత, తన 12 వందల శిష్యులతో గూడ భైరవుని గుహలో ప్రవేశించి మరల తిరిగిరాలేదట. ఆ గుహ మాత్రము ఇప్పటికిని శ్రీనగరుకును, గుల్మార్ గు కును మధ్యనుండు “మగమ్” అను ప్రదేశమునకు 5 మైళ్ళ దూరములో నున్నది. అచ్చట నుండు ముసల్మానులు గూడ ఈ ఐతిహ్యమును ఇప్పటికిని స్మరించుచున్నారు. అట్లు యోగ సిద్ధి నొందిన మహామాహేశ్వరు డీతడు.

ఇత డనుగ్రహించిన గ్రంథములు  : (1) బోధ పంచ దశిక (2) మాలినీ విజయవార్తికము (8) పరాత్రింశికా వివృతి (4) తంత్రాలోకము (5) తంత్రసారము (6)తంత్రవట ధానిక (7) ధ్వన్యాలోక లోచనము (8) అభినవ భారతి (నాట్యశాస్త్రవ్యాఖ్యానము) (9) భగవద్గీతార్థ సంగ్రహము (10) పరమార్థ సారము (11) ఈశ్వర ప్రత్యభిజ్ఞావిమర్శిని (12) ఈశ్వర ప్రత్యభిజ్ఞావివృతి విమర్శిని (13) క్రమస్తోత్రము (14) దేవస్థ దేవతాచక్ర స్తోత్రము (15) భైరవస్తోత్రము (16) పరమార్థద్వాదశిక (17) పరమార్థచర్చ (18) మహోప దేశవింశతిక (19) అనుత్త రాష్ఠిక (20) అనుభవనివేదనము (21) తంత్రోచ్ఛయము (22) ఘటకర్పరకుళక వివృతి (28) కర్మ కేళి (24) శివ దృష్ట్యాలోచనము (25) పూర్వపంచిక (26) పదార్థ ప్రవేశనిర్ణయటీక (27) ప్రకీర్ణక వివరణము (28) ప్రకరణ వివరణము(29) కావ్య కౌతుక వివరణము (30) కథాముఖ తిలకము (31) లఘ్వీప్రక్రియ (32) భేద వాదవిదారణము (33) దేవీస్తోత్ర వివరణము (34) తత్త్వార్థప్రకాశిక (35) శివశ క్త్యవినాభావస్తోత్రము (36) బింబ ప్రతిబింబ వాదము (37) పరమార్థసంగ్రహము (38) అనుత్తరశతకము (39) ప్రకరణస్తోత్రము (40) నాట్యాలో చనము (41) అనుత్తర తత్త్వవిమర్శినీ వృత్తి. ఇంకను అనేక గ్రంథములు విరచించి నటుల ఇతని గ్రంథములయందలి ప్రస్తావనల వలనను ఇతరుల గ్రంథములయందలి ప్రస్తావనల వలనను తెలియు చున్నది.

ఇందు మొదటి 11 గ్రంథములు ముద్రితములు; 12-22 వరకును లిఖితగ్రస్థములు, 23-36 వరకును కొన్ని ముద్రితములు, కొన్ని అముద్రితములు. మిగిలినవి గ్రంథముల పట్టికలవలన తెలియనగుచున్నవి.

అభినవగుప్తుని అభినవభారతి నాట్య రసమార్గములకును, తంత్రాలోకము కాశ్మీర శైవాగమ మార్గమునకును, ఆదర్శప్రాయములును నిరుపమములును నగు మహా త్కృష్టగ్రంథములు. ఇవి, ఆయా మార్గములయందలి ప్రయాణమూర్ధన్యము లగు “ఆకర” గ్రంథములై యలరారును. శ్రీమదభినవగుప్తుల అమోఘ శేముషీ ప్రభావమును, యోగసిద్ధిని, ఇవి బాహాటముగ తెలియ జేయుచున్నవి.

ఇతని పాండిత్యము సర్వతో ముఖమైనది. అందుచే ఇతనికి పద వాక్య ప్రమాణ పారావారపారీణ- ప్రబంధ సేవా రస- ధ్వనినాటక ప్రత్యభిజ్ఞాదర్శన ప్రవర్తకాచార్య-మహామా హేశ్వర... ఇత్యాద్యనేక బిరుదములు లభించెను. అభినవగుప్తుని లోచనము ధ్వన్యాలోక వ్యాఖ్యలలో నెల్ల మిన్నయైనది. పాణినీయమునకు మహాభాష్య మెట్లో అలంకారశాస్త్రమునకు లోచన వ్యాఖ్యఅట్లు. ఈ వ్యాఖ్య వలననే ధ్వన్యాలోకమునకు అనంత ప్రచార ప్రసిద్ధులు కలిగెను. లోచనమును రచించుట యందు అభినవగుప్తునకు ఉపకరించిన వ్యాఖ్య అతని పూర్వుడే రచించిన చంద్రిక యనునది. ఇతడచ్చటచ్చట చంద్రికను ఖండించుచు మా పూర్వవంశీయునితో కయ్యము చాలును అనుచు తన వ్యాఖ్యను ఉపసంహరించు చుండును.

టీ. కె. వి. యస్. సు.

[[వర్గం:]]