Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబుల్ హసన్ తానాషా

వికీసోర్స్ నుండి

అబుల్ హసన్ తానాషా  :- అబుల్ హసన్ తానాషా కుతుబుషాహీ పరిపాలకులలో తుదివాడు. ఇతడు క్రీ. శ.. 1672 నుండి 1686 వరకు గోలకొండ రాజ్యమును పాలించెను. ఇతనిని గురించి ప్రచారములో నున్న కథలు పరస్పర విరుద్ధములయిన చరిత్రలు ఈతని జీవితచరిత్రను దురవగాహ మొనర్చుచున్నవి.. పరస్పర విరుద్ధములయిన గాథలను, చరిత్రలను శోధించి సమన్వయపరచిన స్థూలముగ రెండు సిద్ధాంతములు రూపొందుచున్నవి. 1. అబుల్ హసన్ విదేశీయుడు. 2. అబుల్ హసన్ కు తు బు షా హీ రాకుమారుడు.

అబుల్ హసన్ పర్షియా వాడనియు అరేబియా వాడనియు, హమ్డాన్ వాడనియు, మొగలాయి వాడనియు గ్రంథస్థములు చేయబడిన విషయములు సమన్వయ మగుటలేదు.

సిద్దిపేట తాలూకా లోని అనంతగిరి యందును, ఇతర స్థలముల యందును ప్రచార మందున్న కథనములలో సత్యము లేదు.

సమకాలికులును, స్థానికులును, ప్రామాణికులును అగు చారిత్రకు లీతడు కుతుబుషాహీ వంశమువాడనియే వ్రాసినారు. శత్రుకూటమువారుకూడ ఈ విషయమును ఒప్పుకొన్నారు. ఇతడు అబుల్లా కుతుబుషా (1626-1672) తమ్ముడగు ఆయినుల్ ముల్కు (ఇమాదుల్ ముల్కు) కుమారుడు. సుల్తాన్ అబ్దుల్లా తల్లియగు హయాత్ బక్షు బేగం పౌత్రుడు.

హయాత్ బక్షు బేగం సుల్తాన్ మహమ్మదు కులీ కుతుబుషా (1580-1612) కూతురు: సుల్తాన్ మహమ్మదు కుతుబుషా (1612-1626) భార్య; సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా (1626 -1672) తల్లియగుటచే అబుల్ హసన్ రాజవంశీయుడనియు, రాజ్యార్హత కలవాడనియు అసందిగ్ధముగ తేలుచున్నది. ఈతని మేనల్లుడు షరీఫల్ ముల్కు, మంత్రి మసూదుఖాన్, అత్తగారు బేగంసుల్తానా ఈ విషయమును సందేహమున కాస్పదము లేకుండ స్పష్టపరచి యున్నారు.

చరిత్రకులు, సమకాలికులగు యాత్రికుల సంపుటములు అబుల్ హసన్ ప్రారంభ జీవితమును సమగ్రముగ చిత్రింపలేదు, అతని బాల్యదశావిశేషములను వివరింప లేదు. అందందు లభ్యములగు శకలములను, సూచనలను సమన్వయపరచి సూత్రీకరించినచో ఈతని కౌమార యౌవనదశా విశేషములను గూర్చి తెలిసికొనవచ్చును.

కుతుబ్ షాహి పాదుషాలు విషయలంపటులు, ఆద్యంతముల రాజులిరువురు తప్ప మిగత వారెవ్వరును షష్టి పూర్తి చేసికొనలేదు. వీరి యల్పాయుర్దాయమునకు కారణములను ఇతరత్ర వెదకనవసరము లేదు. అబుల్ హసన్ పుట్టి పెరిగిన వాతావరణ మెట్టిదో పై విషయముల వలన సుగ్రాహ్య మగుచున్నది. పరిసర పరిస్థితుల ప్రభావమువలన అబుల్ హసన్ విషయ లౌల్యమున నెల్లరను తలదన్ను వాడయ్యెను. అంతఃపుర ఆదర్శములు పవిత్రత సడలి మలినమయి పోయినవి. అంతఃపుర స్త్రీల మానములు, పరిచారకుల శీలములు శిథిలములుకా జొచ్చినవి. అతి మెత్తనివాడును, విషయలోలుడును అగు అబ్దుల్లా సుల్తానుకు గూడ నీతని ప్రవర్తనము దుస్సహ మయ్యెను. ఆతడు మందలించెను, రాణులు చులకన చేసిరి. రాజును, రాణులను అనుసరించి తిరుగు పరిచారికా బృందముకూడ ఈ మార్పును గమనించి ఆ రాజకుమారు నవమానించి యుందురు.

అబుల్ హసన్ అవమానములను సహింపలేని వాడయ్యెను. రాజ భోగములకు స్వస్తి చెప్పి, అంతఃపుర సౌఖ్యములను త్యజించి ఫత్తేదర్వాజా (విజయ ద్వారము) కడ నివసించియున్న విఖ్యాత వలీ (యోగి) యగు షా రాజూ ఖత్తాల్ ను ఆశ్రయించెను. అప్పు డాతని వయస్సు రమారమి ఇరువది సంవత్సరము లని తెలియుచున్నది. అతడు భయ భక్తులతో, ప్రేమ విశ్వాసములతో గురువును సేవించుచు, అతని కృపకు పాత్రుడయ్యెను. అందుచే నా వలీ అబుల్ హసనును “తానాషా" యని ముద్దుగ పిలిచెడువాడు. “తానాషా" యన "బాలయోగి" యని యర్థము. తానాషా పదునాలుగేండ్లు గురు శుశ్రూష చేయుచు ఆ యాశ్రమమందే గడపెను.

ఆ యాశ్రమజీవిత మాతనిని ప్రజాసామీప్యమునకు దెచ్చినది. ప్రజల అవసరములు, ఆవేదనలు, ఆ వేశ కావేషములు, కష్టసుఖములు తెలిసికొని, వాటిలో భాగస్వామి యగుట కనేక అవకాశములు అతనికి లభించినవి. ప్రజాబాహుళ్యములో రాజుగ నాతడు సంపాదించిన అనుపమ ప్రేమ గౌరవములకు ఈ ఆశ్రమ జీవితము పునాది రాయియైనది. క్రింది తరగతి వారితో సన్నిహితత్వ మేర్పా టయినది. మతసహనము, పీడిత ప్రజానీకము నెడ సానుభూతి, విశాలదృక్పథము ఏర్పడినవి. అందువలన దక్షిణాపథ మేలిన ముస్లిం ప్రభువులలో సేరికిని లభ్యముగాని గౌరవ ప్రతిపత్తు లీతనికి లభించినవి. ఇతనిలో కలిగిన అద్భుతమగు మార్పును గమనించి మున్నీతని ద్వేషించిన వారిప్పుడు ఈతనియెడ అనురక్తు అయిరి.

అబుల్ హసన్ వివాహము విశ్రాంతి గొల్పు పరిస్థితులలో జరిగినది. సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా తన మూడవ కుమారిక వివాహము చేయవలసి వచ్చెను. పెద్దల్లుడగు సయ్యదు నిజామొద్దీన్ అహమదు ఆలోచనానుసారము అతని గురు పుత్రుడును, అరేబియా దేశీయుడును అగు సయ్యదు సుల్తాన్ అనువానికి ఆమె నిచ్చి పెండ్లిచేయుటకు అబ్దుల్లా కుతుబుషా నిశ్చయించెను. రాజ ప్రాసాదములో వివాహ సన్నాహములు చురుకుగా సాగు చుండెను.

ఆ సమయముననే ఫతేదర్వాజాకడ నున్న ఆశ్రమములో షా రాజూ ఖత్తాల్ తన శిష్యపుంగవుడగు అబుల్ హసన్ తానాషాను పెండ్లికొడుకును జేసెను. ఆ యోగి పుంగవుడు సొంత పర్యవేక్షణమున అంతఃపురములో జరుగు వివాహ కార్యకలాపములను స్నాతకములవంటి వాటిని ఆశ్రమములోకూడ జరిపించెను. ప్రజలు ఆశ్రమములోని వేడుకలను, ఆ యోగిచర్యలను విడ్డూరముగ చూడసాగిరి. అబుల్ హసన్ వివాహప్రయత్నము జరుగనున్నదని షా రాజూ ఖత్తాల్ వలీ అందరకు వివరించుచుండెను.

చిత్రము! ఇంతలో సుల్తాను పదమున పెత్తనము వహించి వరనిశ్చయము చేసిన పెద్దల్లుడు నయ్యదు నిజామొద్దీన్ అహమదునకును, వరుడుగా నిశ్చయింపబడిన సయ్యదు సుల్తానునకును మధ్య దైవ ప్రేరితముగ తీవ్ర విరోధ మేర్పడెను. కలహభోజనుల యాజ్ఞికమున ఆవిరోధ జ్వాల యాకసమంటునట్లు ప్రజ్వరిల్లినది. సయ్యదు సుల్తానునకు రాకుమారి నిచ్చి పెండ్లి చేయవలదని ఆతడు పట్టు పట్టెను. తనమాటనుత్రోసిపుచ్చి, నిశ్చయించిన ప్రకారము రాకుమారి వివాహమును జరుపనున్నచో తాము సపరి వారముగ ఔరంగజేబుతో జేరిపోయెదనని పెద్దల్లుడు బెదరించెను. సయ్యదు సుల్తాన్ సంబంధము మేమొల్ల మనియు, మమ్ము నిర్బంధించినచో ఆత్మహత్య చేసికొందు మనియు పెండ్లికూతురును, ఆమె తల్లియును శఠించిరి. సర్వసన్నాహములు పూర్తియగుటచే సుల్తాన్ అబ్దుల్లా కర్తవ్యమును ఊహింపజాలకుండెను. వివాహమాపుట మంచిదిగాదు. గృహకల్లోలము దెచ్చుకొనుటకూడ వాంఛనీయము కాదు. అందుచేత ఆ సుముహూర్తముననే రాకుమారిని మరియొకని కిచ్చి పెండ్లి చేయుటకు రాజు నిశ్చయించెను. అంతరంగికులును అట్లే అభిప్రాయపడిరి . అరిషడ్వర్గముల కతీతుడై సర్వసంగ పరిత్యాగియై సర్వజన రంజకుడై యున్న అబుల్ హసన్ మాత్రమే ఈ సందర్భమున ఎల్లరకును హృగ్గోచరుడయ్యెను. రాణులును, మంత్రి సామంత హితులును, సర్దారులును ముక్తకంఠముగ అబుల్ హసనునకు రాజు తన మూడవ కుమార్తెనిచ్చి వివాహము చేయనగునని చెప్పిరి. రాజును అబుల్ హసన్ విషయమున తాత్పర్యముగలవాడయి యున్నందున మనఃపూర్తిగ నందుల కంగీకరించెను.

పెండ్లినాడు సుల్తాను యొక్క ఆజ్ఞా ప్రకారము సామంతహిత పురోహితులు సాలంకృతమును, సుసజ్జీ కృతమును అగు నుత్తమాశ్వమును తీసికొని గోలకొండ కోట తూర్పు ద్వారమగు విజయ ద్వారమునొద్ద ఘాజీ బండపై నున్న ఖత్తాల్ ఆశ్రమమునకు వచ్చిరి. పెండ్లి కుమారుని వేషములోనున్న అబుల్ హసనును వివాహ వేదిక కడకు తీసికొనిపోయిరి. సయ్యదు సుల్తానుతో వివాహము కొరకు సిద్ధమయిన సరంజామాతో సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా ఆ సుముహూర్తముననే తన మూడవ కుమార్తెను అబుల్ హసనున కిచ్చి పెండ్లిచేసెను. సయ్యదు సుల్తాన్ సపరివారముగ ఔరంగజేబు కొల్వులో ప్రవేశించెను. అబుల్ హసనున కీ భార్యవలన అబ్దుల్లా జీవిత కాలములోనే ఇరువురు కుమార్తెలును, ఒక కుమారుడును కలిగిరి. ఈ వివాహము తరువాత సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా పండ్రెండు సంవత్సరములు రాజ్యము చేసెను. ' అబుల్ హసను పట్టాభిషేకము గూడ అత్యద్భుత పరిస్థితులలో జరిగినది. పెద్ద అల్లుడగు నయ్యదు నిజామొద్దీన్ అహమదు రాజ్యాంగముపై అధికారము నెరపు చుండెను. క్రీ, శ. 1670 లో హయాత్ బక్షు బేగం చనిపోయెను. అప్పటి నుండి గోలకొండ పరిపాలనా చక్రము అతనికి సంపూర్ణముగ స్వాధీనమయి పోయెను. 1672 ఏప్రిలులో అబ్దుల్లా కుతుబుషా జబ్బుపడెను. 1672 సం. ఏప్రిలు 19 వ తేదీనాడు అతనికి స్మారకము తప్పినది. అతడెట్టి మరణ శాసనమును వ్రాయలేదు. అబ్దుల్లా రెండవ అల్లుడు మహమ్మదు సుల్తాను అనుమానముపై తండ్రి యగు నౌరంగజేబుచే నిర్బంధింపబడి, చెరసాలయందే కృశించి మరణించెను పెద్ద అల్లుని అవజ్ఞతయు, పెద్ద బిడ్డ అహంభావమును అబ్దుల్లాకు సహింపరానివయ్యెను. తనకల్లుడును, కొడుకువంటి వాడును అగు అబుల్ హసనునే రాజుగా చేయవలయునని ఆతడు కోరుచుండినట్లు ఆతని నడవడికయే నిదర్శనముగ నుండెను. పెద్ద బిడ్డకు సంతానములేదు. అయినను, ఆయమ తన సవతి కుమారుడగు సయ్యదలీ మాసూం అనువానికి పట్టము కట్టవలయునని భావించుచుండెను. సైన్యము, సర్దారులు, రాజ లాంఛనములు, పరిపాలనా చక్రము, బొక్కసము అన్నియు పెద్దల్లుని స్వాధీనమున నుండెను.

మరణశయ్యపయి నున్న మామను చూడబోయిన అబుల్ హసనును అంతఃపురములోనికి పెద్దల్లుని పరివారము రానీయలేదు. అతని గుఱ్ఱమును గాయపరచిరి. అతని నవమానించి పంపివేసిరి. సైన్యాధ్యక్షుడును, నిజామొద్దీను నసహ్యించు కొనువాడును అగు సయ్యదు ముజఫరు ఈ సంఘటనను సాకుగ దీసికొని తన కార్యదర్శి, పేష్కారు లగు మాదన్న అక్కన్నల దీవిశేషమున సైనిక పరిపాలన, ఆర్థిక ప్రాముఖ్యముగల ప్రదేశములను చేజిక్కించుకొని రాజ ప్రాసాదమును ముట్టడి వేసెను .నిజా మొద్దీనును లోలోన నేవగించువారెల్లరు ఈ పరిస్థితిని గమనించి అబుల్ హసనున కండగ నిలిచిరి. అబ్దుల్లా కుతుబుషా 1672 ఏప్రిలు 21 తేదిన మరణించెను. సయ్యదునిజా మొద్దీన్ అహమదు, అతని భార్య, అతని కుమారుడు సయ్యద లీ మాసూం బంధింపబడిరి. మాసూం పారిపోయి ఢిల్లీ చక్రవర్తి కొలువులో చేరెను. నిజామొద్దీను అతనిభార్యయు వధింపబడిరి 1672 సం. ఏప్రిలు 23 వ తేదీయందు అబుల్ హసన్ తానాషా రాజుగ ప్రకటింపబడెను. - అబుల్ హసను 20-4-1672 (క్రీ. శ.) నాడు పట్టాభిషిక్తు డయ్యెను. పదునైదు సంవత్సరములు అత్యంత వైభవముతో, ప్రజారంజకముగ ఇతడు గోలకొండ రాజ్యమును పరిపాలించెను. ఇతడు 21-9- 1687 ఉదయము రమారమి తొమ్మిది గంటలవేళ గోలకొండను ముట్టడించిన మొగలు సైన్యమునకు వశుడయ్యెను. ఔరంగజేబు ఇతనిని దౌలతాబాదు కోటలో నిర్బంధించెను.

ప్రతి సంవత్సరము అబుల్ హసన తన రాజ్య ప్రజల .బాగోగులను విచారించుటకై దేశభ్రమణము చేయుచుండెడివాడు. ఇతడు పాడుపడిన వందలకొలది గ్రామములను పునరుద్ధరించెను. నూతన గ్రామముల ననేకములను నిర్మించెను. భూముల విస్తీర్ణమును, పంటల పరిస్థితిని అనుసరించి శిస్తులను నిర్ణయించెను. అనేక రాజమార్గములు, అన్న సత్రములు, దేవాయతనములు, వాపీ,కూప, తటాకములు, విద్యాలయములు, ఔషధాలయములు ఏర్పాటుచేసెను. ధనవంతుల దౌర్జన్యమునుండి, అధికారుల క్రౌర్యమునుండి, దొంగల అలజడినుండి, ప్రజలను రక్షించి, అబుల్ హసన్ వారిని కన్నబిడ్డలవలె కాపాడెను. సర్వమత సహిష్ఠు డయి, అందరను అతడు సమముగ చూచుచుండెను అనేక ముఖ్యపదవులపయి తెలుగువారిని, హిందువులను ప్రతిష్ఠించెను. ఈ ఘన కృత్యములచే ఆతని కీర్తి చంద్రికలు దశదిగంతముల వ్యాపింప జొచ్చెను.

అబ్దుల్లాఖాన్ పొనీ అనువాని ద్రోహమువలన గోలకొండ దుర్గము మొగలులు చేజిక్కినది. కర్మయోగియగు అబుల్ హసను ఈ పతనమునకు ఆవంతయు చింతింప లేదు. ఆతని గుండె నిబ్బరము, సహజ ధీరోదాత్తత, మొగలు దండనాథులను చకితుల గావించెను. వారి ప్రశ్న కాత డీ విధముగా సమాధాన మిచ్చెను:

"ఈశ్వరునియందు నా కచంచల భక్తి విశ్వాసములు గలవు... నా పూర్వులు అమిత ధనవంతులు, అయినను చాల కాలము నేను భిక్షాటనము చేసి జీవించితిని... ఈశ్వరుడు నన్ను రాజుగ చేసినాడు... ఇచ్చిన వాడు నేడు తీసికొన్నచో నేడు నెత్తి, నోరు కొట్టు కొనుట ఏటి న్యాయము? అదియునుగాక భగవద్దాసుడును, నిజ మగు ముసల్మానుడును అగు ఔరంగజేబు వంటి వాడు నావారసు డగుట నిజముగ సంతసింపవలసిన విషయము గదా !"

క్రీ. శ. 18-2-1688 తారీఖున అబుల్ హసనును జాను నిస్సారుఖాను నాయకత్వమున దౌలతాబాదు దుర్గమున కంపి, అందు అతనిని కాలాకోరాలో నిర్బంధించిరి. అతని భత్యమునకై ఏబడివేల హొన్నుల వార్షికము ఏర్పాటయ్యెను. పదునాలుగు సంవత్సరములు చెర ననుభవించి 1113వ హిజరికి సరియగు క్రీ.శ.1703 సంవత్సర ప్రారంభమున అతడు రక్త విరేచనములవలన దాదాపు డెబ్బది అయిదు వత్సరముల ప్రాయమున చనిపోయెను. అతని కోరిక ప్రకారము ఆతని కళేబరమును దౌలతాబాదు సమీపముననున్న హజరత్ గే సూదరాజులో తండ్రి సమాధివద్ద నిక్షేపము చేయబడినది.

అబుల్ హసన్ పట్టువడిన సందర్భమును గురించి దేశీయ, విదేశీయ సమకాలిక చరిత్రకారులు అనేక విధములుగ వ్రాసియున్నారు. అవి యసందర్భములును, అసమర్థనీయములును గావున త్యాజ్యములు.

అబుల్ హసను జననము క్రీ. శ. 1628. వివాహము 1661. పట్టాభిషేకము 1672. రాజ్యచ్యుతి 1687. చెర 1688. మరణము 1703.

అబుల్ హసను పండితుడు, కవి, గాయకుడు, శిల్పి, దైవ భక్తిగల ముసల్మాను, సూఫీ, మతసహిష్ణువు, పవిత్రుడు, న్యాయశీలి, సుందరుడు. అతడు రాజఠీవికి పరాకాష్ఠ. దక్కన్ సుల్తానులలో ఐకమత్యమును గూర్చుచునో, విదేశీయవర్తకుల కలహములను దీర్చుచునో, పరిపాలనా చక్రమును, సైన్య వ్యవస్థను, విదేశ విధానమును చక్కబరచుచునో అబుల్ హసను తానాషా చరిత్ర యొక్క పుటలయందు మనకు గానిపించుచుండును.

నూరీ, ఫాయిజ్, లతీఫ్, షాహి, మిర్జా, గులాం అలీఖాను, మున్నగువారు ఆతని ఆస్థాననకవులు, షారాజూ ఖత్తాల్, రామదాసు అతనికాలపు సుప్రసిద్ధ భక్తులు. గోషామహలు, చారుచమను, ఇమ్లీబాగ్ మొదలగునవి ఆతడు కట్టించిన సుందర కట్టడములు. సామ్రాజ్య వ్యాపార విస్తృతుల కాటంకముగా అబుల్ హసను నిలుచుండుటచే పారసీక చరిత్ర కారులును, విదేశీయ . చరిత్రకారులును ఆతనిని విషయలంపటుడనియు, అవివేకి యనియు, అసమర్ధుడనియు పిరికి పందయనియు వర్ణించి నారు. అందు సత్యము లేదని నేటికిని ప్రజాసామాన్యమునకు అతనియెడగల ప్రేమ, గౌరవములు నిస్సందేహముగ చాటుచున్నవి.

కొ. భూ.

[[వర్గం:]]