Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబుల్ ఫజల్

వికీసోర్స్ నుండి

అబుల్ ఫజల్  :- అబుల్ ఫజల్ క్రీ. శ. 1551 జనవరి 14 వ తేది యందు ఆగ్రాలో జన్మించెను. ఖురానుపై వ్యాఖ్యాతయును, సర్వజ్ఞాన సంపన్నుడును అగు షేక్ ముబారక్ నాగోరీ అను నాతనికి ఇతడు రెండవకుమారుడుగా జన్మించెను. అక్బరు ఆస్థానములో సుప్రసిద్ధ కవి యగు ఫయిజీకి ఇతడు తమ్ముడు. తండ్రి వైపు విచారించినచో, ఇతడు భారతదేశమునకు వలస వచ్చిన ఒక అరేబియా కుటుంబమునకు చెందినవాడు. ఈ కుటుంబము తొలుత సింధులోను, తరువాత జోధ్ పూరు నందలి నాగోరులోను స్థిరనివాస మేర్పరచుకొనెను. అందుచేత ప్రజలు అబుల్ ఫజల్ తండ్రియగు షేక్ ముబారకును నాగోరీ యని పిలుచుచుండిరి. అబుల్ ఫజల్ పుట్టుకకు కొన్ని సంవత్సరములకు ముందు షేక్ ముబారక్' పెండ్లి చేసికొని ఆగ్రాలో స్థిరావాస మేర్పరచు కొనెను. ఐనను నాగోరీ యను పేరుతోనే ప్రజలీతనిని పేర్కొను చుండెడివారు. తల్లి పక్షమున పారసీక దేశమునందు షిరాజ్ దగ్గర మన్న ఇడిజ్ లో నివసించుచుండెడి రఫీయాల్ దీన్ సఫాలీతో అబుల్ ఫజల్ బంధుత్వము కలిగి యుండెను. ఈ సఫాలీ, సిద్దపురుషుడుగా, మహాత్ముడుగా ప్రసిద్ధికెక్కి యుండెను. అందుచే సమ్రాట్టు హుమాయూను ఆతని విరోధియగు షేర్షా సూరి ఇరువురును ఆ మహాత్ముని సలహాలను పొందు చుండిరి.

అబుల్ ఫజల్ బాల్యమున పఠనాసక్తి గలవాడె తండ్రి రక్షణమున అత్యుత్సాహముతో చదువుకొనుచు వృద్ధినొందెను. మహదవీ సంప్రదాయము నెడ అభిమానమును కలిగియున్న కారణముచేత ఇతని తండ్రియగు షేక్ ముబారక్ పెక్కు క్లేశములకు గురి కావలసివచ్చెను. ఆ క్లేశములు అబుల్ ఫజల్ లేతమనస్సుపై శాశ్వతముద్రను గావించెను. తన్మూలము ననే అబుల్ ఫజల్ కు సహనగుణ మబ్బెను. ఈ సహన గుణాభ్యాసము ఇతనికి ఉత్తరకాలము నందు అక్బరుతో స్నేహ మేర్పడుటకు మూలమయ్యెను. అబుల్ ఫజల్, తన మానసిక వికాసమును గూర్చి ఇనాష యను గ్రంథమున వ్రాసికొనెను. ఆ వ్రాతను బట్టి ఇట్లు తెలియు చున్నది: ఐదవ సంవత్సరమున ఇతడు చదువ నారంభించి పదునేనవ సంవత్సరము నాటికి ఆనాడు వ్యాప్తిలో నున్న విజ్ఞానశాఖలన్నిటియందును ప్రజ్ఞావంతు డయ్యెను. అటు తర్వాత పది సంవత్సరముల పాటు విద్యార్థులకు విద్యగరపుచు సమకాలికులగు పండితులతో మతవిషయక చర్చలయందు పాల్గొనుటలో కుతూహలుడగుచు ఇతడు కాలము గడపెను. కాని వైజ్ఞానిక వ్యాసంగములవలన ఇతనికి అంతశ్శాంతి లభింపలేదు. అందుచేత సన్యసింపవలయునను కోరిక ఇతనికి కలుగుచుండెడిది. అబుల్ ఫజల్ అన్నయగు ఫయిజీని ఆస్థానములో చేరవలసినదిగా అక్బరు ఆహ్వానించెను. అది మొదలుకొని అబుల్ ఫజల్ యొక్క మనమున ఉజ్జ్వల తరమైన తన భవిష్యత్తును గూర్చి ఆశలు పొడమెను. అక్బరు ఆస్థానములో తన తండ్రి అయిన షేక్ ముబారక్ ను ద్వేషించినవారు అనేకులుండిరి. ఐనను అక్బరు తన కొసగు ప్రోత్సాహమునుబట్టి ఓరిమితోడను రాజభక్తితోడను తాను సేవచేసినచో అది నిష్ఫలము కాజాలదని అబుల్ ఫజల్ కు విశ్వాస మేర్పడెను. ఈ లోపుగా ఫయిజీ అక్బరు యొక్క స్నేహమును సంపాదించుకొని దానిని నిలుపుకొనుటలో గొప్ప నేర్పును చూపెను. ఆనేర్పు అబుల్ ఫజల్ యొక్క శ్రేయస్సునకు సాధనమయ్యెను. 1574 ప్రారంభములో అబుల్ ఫజల్ ఫయిజీ యొక్క సోదరుడుగా అక్బరునకు పరిచయము కావింపబడెను. అక్బరు ఇతనిని మిక్కిలి ఆదరముతో స్వీకరించెను. అందుచేత ఇతడు ప్రపంచ పరిత్యాగబుద్ధిని త్యజించెను. అక్బరునామాలో ఇత డిట్లు తన్ను గూర్చి వ్రాసికొనెను. "కాలము మొదట నాకు అనుకూలపడలేదు. అందుచేత నేను దాదాపు స్వార్ధపరుడను, గర్వితుడను అయి సర్వసంగ పరిత్యాగిని కావలయు నని నిశ్చయించుకొంటిని. నా చుట్టును అనేక శిష్యులు చేరిన కొలదియు నా విద్యాడంబరము అతిశయింప దొడగెను. నిజమునకు విద్యాగర్వముచే ఏకాంత వాసమునక ఆతురపడితిని. నా అదృష్టవశమున ఏకాంత ప్రదేశములలో నిజమైన సత్యాన్వేషకుల సాంగత్యములో కొన్ని రాత్రులు గడపుట సంభవించెను. నిర్ధనులయ్యు జ్ఞానధనులైన పెద్దల సాంగత్యము నా కానందమును చేకూర్చెను. అందువలన నేను నేత్రములను తెరచితిని. అంతట పండితంమన్యుల స్వార్థ పరత్వము నాకు గోచరించెను. నా తండ్రియొక్క ఉపదేశములు అజ్ఞానోపద్రవమున బడకుండ ఎట్టకేలకు నన్ను రక్షింపగలుగు చుండెను. నా మనస్సునకు శాంతి లేదాయెను. మంగోలియా యందలి యతుల దెసకును, లెబనాన్ లోని మునుల వైపునకును నా హృదయము ఆకర్షింబడ సాగెను. టిబెట్ దేశపు లామాలతోడను, పోర్చుగలులోని మత గురువులతోడను, పార్శీ మత గురువులతోడను, “జెండా ఎవస్తా" పండితులతోడను సమావేశములకొరకు ఉవ్విళ్ళూరుచుంటిని. నా స్వంత దేశపు పండితుల విషయమున నా కసహ్యభావ మేర్పడెను. ఉదారవిషయ విచారమార్గమున సమ్రాట్టు నాకు నేత కాగలడను నాశతో ఆతని యాస్థానములో చేరుమని నా సోదరులును తక్కిన బంధువులును నాకు సలహా నొసగిరి. వారి హెచ్చరికలను తిరస్కరించుటకు నేను వ్యర్థప్రయత్నమును చేసితిని. ఇప్పుడు నేను ఆనందినై యున్నాను. ఏమనగా సమ్రాట్టు కర్మప్రపంచమున మార్గ దర్శకుడుగను, ఏకాంతవాసమున ఆశ్వాసకుడుగను నాకు ఉపకరించెను, నా ధార్మిక వాంఛయు నా నిర్దిష్ట కృత్య నిర్వహణ వాంఛయు అతనిలో సాఫల్యము నొందెను.”

అబుల్ ఫజల్ తొందరగా ఉన్నతపదవి కెక్క లేదు. పదునొకండు సంవత్సరములు భక్తి తత్పరమైన సేవచేసిన తర్వాత మాత్రమే ఇతడు వేయిమంది భటులకు నాయకుడయ్యెను. 1586 లో అనుభవవృద్ధుడైన షాఆలీ మహ్రమ్ తొకలసి ఇతడు ఢిల్లీ యొక్క సంయుక్త పరిపాలనలో పాల్గొనెను. 1592 లో ఇతడు రెండువేల మంది భటులకు నాయకు డయ్యెను. 1600లో నాలుగు వేలమంది భటులకు నాయకుడుగా ఇతడు నియుక్తుడయ్యెను.

'ఇబాదత్ ఖానా' లో ప్రతి గురువారము సాయంకాలమున జరుగు సమావేశములలో చర్చలు జరుగుచుండెను. వీటి యందు అక్బరునకు అభిరుచి మెండుగనుండెను. అట్టి తరుణములందు పూర్వాచార పరాయణులగు పండితుల వివాదములను రెచ్చగొట్టుటలో అబుల్ ఫజల్ కృతకృత్యుడయ్యెను. పూర్వాచార పండితులలో అంతకు ముందుండెడి ఐకమత్యము లోపించెను. అక్బరునకు గల మతవిషయక సంశయములు తొలగలేదు. అవి పెంపొందజొచ్చెను. అక్బరు తన సభ్యపక్షమునకు అబుల్ ఫజల్ ను నాయకునిగా నిర్ణయించెను. తుదకు అబుల్ ఫజల్ ఉలేమా మత పండితులను చర్చలలో ఓడింపగలిగేను. ఐహిక విషయములలో మాత్రమే కాక, ఆధ్యాత్మిక విషయములలో గూడ పరిపాలిత ప్రజలు తమ సమ్రాట్టును నాయకునిగా అంగీకరించుట ధర్మము అనుమాటకు అక్బరు సమ్మతించునట్లుగా అబుల్ ఫజల్ బోధించెను. ఈ నూతన మత సిద్ధాంతము రాజుచే ప్రకటింపబడుట అబుల్ ఫజల్ యొక్క అదృష్టమునకు నాంది యయ్యెను. పూర్వాచార పరాయణులగు పండితులు తమ పదవులకు ప్రమాదము వాటిల్లుట చూచి లోబడుటకు సంసిద్ధతను సూచించిరి. కాని ప్రయోజనము లేకపోయెను. షేక్ ముబారక్, ఆతని పుత్రులు కలిసి తయారు చేసిన విశిష్టమైన పత్రముపై ఆ పండితులు సంతకములను కూడ చేసిరి. ఈ పత్రము నందు సమ్రాట్టునకు ధర్మపాలకు డనియు "ముజ్ తాహిద్” (అనగా ఇస్లామునకు సంబంధించిన అన్ని వ్యవహారము లందును) అప్రమాధశీలుడగు అధికారి అనియును రూఢి చేయబడెను. “సత్యవ్రతుడగు రాజు యొక్క విజ్ఞానము” అనునది ఒకటే ఇట్లు శాసన నిర్మాణమునకు మూలాధారమయ్యెను. సమస్త పండితులును, న్యాయవాదులును మత విషయములలో అక్బరు విధించు శాసనములకు బద్ధులగుటకు అంగీకరించిరి. పండితులు తా మింతకు ముందు అనుభవించుచున్న సమున్నత స్థానమును కోల్పోయిరి. అక్బరునకును వారి యెడగల అనుమానములు అధికతరము అయ్యెను. ఈ లోపల “దీన్ -ఇ-ల్లాహీ” లేక దివ్యమతము అనబడు నూతన మతమును అక్బరు స్థాపించెను. ఈ నూతన మత పరిణామములు అబుల్ ఫజులు కు అక్బరుపై గల పలుకుబడిని ఇంకను అతిశయింపజేయుటకు కారణముల య్యెను. అక్బరు ఆస్థానమునందలి ఉన్నత వంశీయులగు ఉద్యోగులు అబుల్ ఫజల్ యెడల అసూయను వహించిరి. ఇతనిని దక్కనుకు పంపుట మంచిదని వారు అక్బరునకు సలహా చెప్పిరి. అక్కడ పొసగిన ఏదైన ఒక యుద్ధములో గాని, నిర్వహింపవలసిన పరిపాలనములో గాని లోటు వచ్చిన యెడల సమ్రాట్టునకు అబుల్ ఫజల్ యందు గల గౌరవమునకు న్యూనత వాటిల్లునని వా రూహించుటయే దీనికి కారణము. యువరాజగు సలీమున (జహంగీరు)కు కూడ అబుల్ ఫజల్ ఎడల అనిష్టము ఏర్పడియుండెను. తనకును తన తండ్రికిని వైమనస్యము ఏర్పడుటకు అబుల్ ఫజలే ముఖ్యముగా కారణభూతుడని గూడ అతడు నిశ్చయించెను. 1601 లో యువరాజగు సలీము యొక్కయు, తదితరుల యొక్కయు ప్రేరణచే అబుల్ ఫజల్ దక్కనునకు సైనిక కార్యనిర్వహణమునకై పంపబడెను. అబుల్ ఫజల్ దక్కనులో అపజయము నొందునని ఇతని విరోధులు ఊహించియుండుట సరికాదు. ఎందుచేతననగా ఇతడు తన సర్వ కృత్యములను అచ్చట సమర్థతతో నిర్వహించెను.సైనికచర్యను నిర్వహించు విషయములో గూడ అత్యంత సమర్థుడు అను కీర్తిని ఇతడు పొందెను.

ఇంతలో యువరాజగు సలీము తండ్రితో కలహింప దొడగెను. అక్బరు యొక్క ఉన్నతోద్యోగులు కొందరు సలీము పక్షమును అభిమానించుచున్నట్లు సమ్రాట్టునకు స్ఫురించెను. అబుల్ ఫజల్ ఒక్కడే అక్బరునకు నమ్మదగిన బంటు అయియుండెను, ఆస్థానములో ఇతని ఉనికి అత్యవసరమై యుండెను. ఆ కారణములచేత ఉత్తర హిందూదేశమునకు తత్ క్షణమే బయలు దేరి రావలయునని అక్బరు అబుల్ ఫజల్కు ఉత్తరువులు పంపెను. రాజాజ్ఞ చొప్పున తన కుమారుడగు అబ్దుల్ రహమానునకు తన దళాధిపత్యమును అప్పగించి, కొలదిమంది అనుచరులతో మాత్రమే అబుల్ ఫజల్ 'ఆగ్రాకు బయలు దేరెను. బుందేలా నాయకుడగు రాజా బీర్ సింగు యొక్క రాజ్యభాగము గుండ అబుల్ ఫజల్' ప్రయాణము చేయవలసివచ్చెను. ఈ అవకాశమును పురస్కరించుకొని ఇతనిని హత్య చేయుటకు సలీము రాజాబీర్ సింగును ప్రేరేపించెను. ఆస్థానములో అగౌరవమును పొందియున్న బీర్ సింగు, యువరాజును సంతోష పెట్టుటకై దొరికిన అవకాశమును ఆసక్తితో పరిగ్రహించెను. రాజ్యాభిషిక్తుడైన తర్వాత, సలీము వలన తప్పక తనకు గొప్ప బహుమానము లభింపగలదని విశ్వసించి, ఆశ్వికుల యొక్కయు, పదాతులయొకయు ఒక పెద్ద దళమును బీర్ సింగు నార్వారువద్ద నిలిపెను. అబుల్ ఫజలు, ఇతని ఆశ్వికులును బీర్ సింగు యొక్క సంఖ్యా బలమునకు లోబడిరి. అబుల్ ఫజల్ ఇట్లు 1602 ఆగస్టు 12 వ తేదినాడు హత్య గావింపబడెను. ఇతని తల అలహాబాదులో నున్న యువరాజు నొద్దకు పంపబడెను. శత్రువగుటచే అబుల్ ఫజల్ ను తానే హత్యకు పాల్పరచితినని సంపూర్ణమైన నిర్లక్ష్య భావముతో సలీము తన 'జీవన స్మృతులు ' అను గ్రంథములో బహిరంగముగా ఒప్పుకొనెను. 'నేను పితృభక్తి గల కుమారుడను, అబుల్ ఫజల్ మొదలగువారు తమ దుస్తంత్రములచేత నాతండ్రి నన్ను ప్రేమింపకుండ జేసిరి' అని సలీము వ్రాసికొనెను. అక్బరు అబుల్ ఫజల్ యొక్క మరణమునకు మిక్కిలి దుఃఖించెను. కొంతకాలము ఎవ్వరికిని దర్శన మొసగుట కాతడు ఇష్టపడలేదు. అబుల్ ఫజల్ దుర్మరణమునొందిన పరిస్థితులను గూర్చి విని "సలీము సమ్రాట్టు కాగోరిన యెడల నన్నే చంపి అబుల్ ఫజల్ ప్రాణములను కాపాడినచో బాగుండెడిది" అనుచు అక్బరు వాపోయెను.

అబుల్ ఫజల్ గొప్ప కార్యశూరుడు. అక్బరు నామా అను నాతని గ్రంథము అతని గొప్ప కృషికి ఒక స్మారక చిహ్నము. దాని తర్వాత మిక్కిలి విలువగలది అతని (గ్రంథ భాగమగు) మూడవ సంపుటము. దీనికి 'ఆయిన్-ఇ-అక్బరీ లేక అక్బరు యొక్క నియమావళి అను పేరు కలదు. అక్బరు యొక్క పరిపాలనమునకు చెందిన విషయములు తెలిసికొనుటకు ఇది అన్నిటికంటె సాధికారమైన ఆధారముగా నున్నది. అబుల్ ఫజల్ ఇతర గ్రంథములను పెక్కింటిని రచించెను. " ఆయార్ -ఎ- దానిష్ " అనునది “అన్వర్ -ఇ-సుహైలీ" అను గ్రంథము యొక్క సంక్షిప్త రచనా రూపము, "మక్తుజర్-ఇ-అల్లామీ' లేక 'ఇస్తాయా అబుల్ ఫజల్ ' అను శీర్షికతో ఇతని లేఖలు అనేకములు ఇతని మరణానంతరము ఇతని బంధువులచే రెండు సంపుటములుగా ప్రచురింపబడెను. మహాభారతము యొక్క పారశీకానువాదము తోడను, "తారీఖ్-ఇ-అల్ఫీ " అను గ్రంథము తోడను ఇతని నామము సంబంధమును కలిగి యున్నది.

రచయితగా అబుల్ ఫజల్ సాటిలేనివాడు. ఇతని శైలి ఉదాత్తమైనది. ఇతని శ క్తియుత పదప్రయోగ కౌశలము, వాక్య నిర్మాణ విధానము, సమాస రచనౌచిత్యము, సంపూర్ణ వాక్యముల లాలిత్యము ఎట్టివారికిని అనుకరించుటకు అవి కానివి.

అబుల్ ఫజల్ నేతగా నుండగా అక్బరు తన విధ్యుక్త ధర్మములను బాగుగా గుర్తింపగల్గెను. రాజాస్థానములో ప్రవేశము కలిగినది మొదలుకొని భిన్న జాతులకును, భిన్న మతములకును చెందిన ప్రజలను జయప్రదముగా పరిపాలించు సమస్యను అప్రమత్తుడై ఇతడు పరిశీలింప దొడగెను. దీనికి ఫలితముగా అన్యమత సహనముతో గూడిన పరిపాలనా విధానము రూపొందెను. నూతన విధానమును పరిపాలనలో అమలుపరచుటకు అక్బరునకు అవసరము కలిగినపుడెల్ల అబుల్ ఫజల్ ఆ విధానమును లేఖన రూపమున స్ఫుటముగా ప్రతిపాదించి తత్ప్రతి కూల వాదములను నిర్భయముగా తన లేఖినిచే నెదుర్కొనెను.

అక్బరు అవలంబించిన నూతన విధానము మొగలాయి పరిపాలన యెడల ప్రజలు సమాధానపడుటకు ఎక్కువగా తోడ్పడెను. “రాజు ప్రజలకు తండ్రి" అను నాదర్శము భారతదేశమును పాలించిన సమ్రాట్టులలో నెల్ల అక్బరు నందు విశేషముగా అన్వర్థమయ్యెను.

డా. యూ. హు. ఖా.

[[వర్గం:]]