Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబిసీనియా (భూగోళము)

వికీసోర్స్ నుండి

అబిసీనియా (భూగోళము) :- అబిసీనియా లేక ఇథోపియా అనబడు దేశము ఆఫ్రికా ఖండములో నొక పెద్ద స్వతంత్ర దేశము. 1936 లో ఇటలీ తనలో అబిసీనియాను కలుపుకొన్నప్పటికి, రెండవ ప్రపంచ యుద్ధానంతరము, అనగా 1942 లో ఈ దేశము మరల స్వాతంత్య్రమును సంపాదించుకొనెను. దీని చుట్టును బ్రిటిషు, ఫ్రెంచి, ఇటలీ రాజ్యము లున్నవి. ఈ దేశము చాల భాగము పర్వతమయము. ఈ దేశము యొక్క విస్తీర్ణత 3,50,000 చదరపు మైళ్ళు. దీని జనాభా షుమారు 1,00,00,000. దేశమంతయు మొత్తముమీద ఎత్తైనభూమి అగుటచేతను, పర్వత ప్రాంత మగుట చేతను, అందు రాకపోకలకు ఎంత మాత్రము సౌకర్యములు లేవు. ఈ కారణము చేతనే, ఈ దేశములో కొంత ఖనిజసంపద ఉన్నప్పటికిని ఆర్థిక-అభివృద్ధి చాల మందముగా నున్నది. ఈ దేశమునకు సముద్ర ప్రాంతము ఎంతమాత్రము లేకపోవుట చేత, ఇతర దేశములతో వ్యాపారమునకై ఫ్రెంచి సోమలిలాండు లోని జిబుతి రేవు పట్టణము మీదనే అబిసీనియా ఎక్కువగా అధారపడవలసివచ్చినది. భూమి సారవంతమైన దగుట చేతను, వేసవి యందు వర్షములు కురియు కారణము చేతను, ఈ దేశములో వ్యవసాయము ఎక్కువగా అభివృద్ధి నొందినది. ప్రత్తి, గోధుమ, కాఫీ, బార్లి - ఇచ్చట ప్రధానమైన పంటలు. బ్లూనైలు నది ఆధారము వలన ఎల్లప్పుడు భూమి దున్నుటకును, వ్యవసాయము చేయుట కును ఇచ్చట అవసరమైన నీటి సదుపాయము ఉన్నది. ఎట్టి పరిశ్రమలు లేవనియే చెప్పవలసియుండును. అడవులు విశేషముగా కలవు. ఇనుము, రాగి, బొగ్గు, సల్ఫరు గనులు ఈ దేశములో ఎక్కువగా నున్నవి. చెప్పదగిన ఖనిజ సంపదయు, వ్యవసాయ సంపదయు ఉన్నప్పటికిని ఈ దేశము ఆర్థికముగా ఉన్నత స్థితిలో లేదు. దీనికి ముఖ్య కారణములు దేశమంతయు పర్వతమయమగుట, రైలు మీద గాని, నీటి మీద గాని ప్రయాణమున కెంత మాత్రము తగిన సౌకర్యములు లేకపోవుట. ఈ దేశమునకు అడ్డిస్ అబాబా ముఖ్య పట్టణము. అడోవా, గండక్ అనునవి ఈ దేశములోని ముఖ్య వ్యాపార కేంద్రములు.

బి. రా.రా.

[[వర్గం:]]