Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబ్దుర్ రజాకు

వికీసోర్స్ నుండి

అబ్దుర్ రజాకు  :- అబ్దుర్ రజాకు అను పారసీక రాయబారి క్రీ. శ. 1443 వ సంవత్సరమున హంపీ — విజయనగరమును సందర్శించి అచ్చట సుమారు ఏడు నెలలు నివసించెను. ఆ కాలమున ఆతడు విజయనగర రాజ్యమునందలి వింతలు, విశేషములు, విజయనగర రాజ్యవై భవమును బాగుగా గమనించి, వాటిని గ్రంథస్థము కావించెను. సమకాలికుడును, విదేశీయుడును, అగుటవలన ఈతడు విజయనగర రాజ్యమునుగూర్చి వ్రాసిన విషయములు మిక్కిలి విశ్వసనీయములై యున్నవి. ఈతని వ్రాతలను ఆధునిక చారిత్రకులు ఉత్తమ చారిత్రక సాధనములనుగా మన్నించుచున్నారు. అబ్దుర్ రజాకు విజయనగరసామ్రాజ్యమును గూర్చియే గాక, ఆనాటి దక్షిణ భారతదేశ స్థితినిగూర్చియు, తన స్వదేశమునుగూర్చియు, అనేకములయిన అంశములను తెల్పి యున్నాడు. ఈతడు క్రీ. శ. 1441 వ సంవత్సరమున జనవరి నెలయందు స్వదేశమును విడిచి మరల 1444 వ సంవత్సరము జులై నెలయందు హర్మజు రేవును చేరెను. ఈ విధముగ ఈ యాత్రికుడు సుమారు మూడు సంవత్సరముల కాలము ప్రయాణములో గడపెను.

అబ్దుర్ రాజాకు యొక్క పూర్తిపేరు కమాలుద్దీన్ అబ్దుర్ రజాకు. ఈతని తండ్రి జలాలుద్దీన్ ఇషకు. ఈ జలాలుద్దీను సమర్కండ్ వాస్తవ్యుడు. అబ్దుర్ రజాకు క్రీ.శ. 1413 వ సంవత్సరము, నవంబరు 16 వ తేది యందు, హిరాట్ నగరమున జన్మించెను. జలాలుద్దీన్ ఇషకు పారసీక చక్రవర్తి యగు షారుఖ్ కొలువునందు “కాజీ”, “ఇమామ్” అను పదవులలో ఉద్యోగిగనుండెను. ఈతడు గొప్ప విద్వాంసుడు. అబ్దుర్ రజాకుకూడ తండ్రి వలెనే విద్వాంసుడు. ఈతడు అరబ్బీ భాషయందు పండితుడును, వైయాకరణియునై యుండెను. ఈతడు ఒక ప్రామాణిక వ్యాకరణమునకు వ్యాఖ్యానము వ్రాసి, తన యేలిక యగు షారుఖ్ నకు అంకితము కావించెను. అబ్దుర్ రజాకు పారసీక చక్రవర్తి యగు షారుఖ్ మరణించిన తరువాత మీర్జా అబ్దుర్ లతీపు, మిర్జా అబ్దుర్ ఖాసిం అను ప్రభువులవద్ద వివిధములగు ఉద్యోగములలో నియోగింపబడెను. అబ్దుర్ రజాకు తాను సేవించిన ప్రభువుల యొక్కయు, వారి పూర్వుల యొక్కయు, చరిత్రను వర్ణించుచూ, “మల్లూ ఉస్ సయిదయిస్" అను చారిత్రక గ్రంథమును వ్రాసెను. ఇది పారసీక భాషలో రచింపబడిన రెండు సంపుటముల గ్రంథము. ఇందే, విజయనగర సామ్రాజ్యమునకు సంబంధించిన అనేక అంశములు మనోహరముగ వర్ణింపబడినవి. ఈ గ్రంథము క్రీ. శ. 1480వ సంవత్సరమున పూర్తియయ్యెను. 1482 వ సంవత్సరమున అబ్దుర్ రజాకు కాలధర్మము నొందెను. అబ్దుర్ రజాకు వ్రాసిన పారసీక గ్రంథమును సి. జె. ఓల్డుఫీల్డు అను బెంగాలు సివిలు సర్వీసు ఉద్యోగి ఆంగ్ల భాషలోనికి అనువాదము చేసెను. సర్ హెన్రీ ఇలియట్ అను నాతనిచే ఈ అనువాదము సంస్కరింప బడినది. ఈగ్రంథమే ఆధునిక చారిత్రకులకు ప్రామాణికముగ నున్నది.

క్రీ. శ. 1441 వ సంవత్సరమున పారసీక చక్రవర్తి యగు షారుఖ్, అబ్దుర్ రజాకును పిలువనంపి భారతదేశమునకు రాయబారిగా పోవలసినదని ఆ దేశ మొసగెను. ఆ యాజ్ఞను శిరసావహించి, రజాకు తన ప్రయాణమును ప్రారంభించెను. హార్మజు పట్టణమున అతడు ఓడనెక్కెను. హార్మజు నగరము ఆకాలమున గొప్ప విఖ్యాతిగాంచిన రేవుపట్టణము. అచ్చటికి ప్రపంచమందలి అనేక దేశముల నుండి వర్తకులు వ్యాపార నిమిత్తమై వచ్చెడివారు. హార్మజు పట్టణమునుండి ప్రయాణమును ఆరంభించి అనేక కష్టముల నెదుర్కొని అబ్దుర్ రజాకు తుదకు భారత దేశపు పశ్చిమతీరమందలి కాలికట్టు అను ఓడ రేవును చేరెను, అచ్చట సామూర్తి అను రాజు రాజ్యము చేయు చుండెను. ఆ రాజు ప్రభుత్వము రామరాజ్యముగ నుండి నట్లును, అచటి వర్తకులు చోరాదులవలన భయములు లేక స్వేచ్ఛగ తమ వ్యాపారమును సాగించుకొనుచుండి నట్లును, రజాకు వర్ణించియున్నాడు. అచ్చట అనేక మహమ్మదీయ కుటుంబములు సుఖముగ నివసించు చుండెను, అబ్దుర్ రజాకు సామూరిరాజును సందర్శించెను. కాలికట్టునందు కొంత కాలము నివసించిన తరువాత విజయనగర ప్రభువు అగు రెండవ దేవరాయలకడ నుండి అబ్దుర్ రజాకునకు ఆహ్వానము వచ్చెను. అనతి కాలములో ఆతడు బయలుదేరి విజయనగరరాజ్యమును చేరెను. త్రొవయందు అతడు బేదునూరు అను ప్రదేశమునగల దేవాలయమును చూచి చాల అద్భుతపడెను. దాని అందము వర్ణనాతీతమని రజాకు వ్రాసెను. 1443 వ సంవత్సరము మార్చి నెలయందు అతడు విజయనగరమును చేరెను.

విజయనగరమును ఆకాలమున రెండవ దేవరాయలు పరిపాలించుచుండెను (1423-46). ఈరాజు అబ్దుర్ రజాకును సగౌరవముగ తన రాజధానికి కొనివచ్చుట కేర్పాట్లు కావించెను. విజయనగరమున నివసించినంత కాలమును అబ్దుర్ రజాకునకు చాల గౌరవము జరిగెను. అతనికి అనేక పర్యాయములు రాజదర్శనము లభించెను. ఆ సమయములందు దేవరాయలు పారసీక రాయబారి యగు అబ్దుర్ రజాకును మిక్కిలి ఆదరించి, అతని యేలికయగు పారసీక చక్రవర్తిని గూర్చియు, ఆ దేశపు విశేషములను గూర్చియు ప్రశ్నించెడివాడు. రాయబారి వెడలిపోవు.నప్పుడు రాజు అతనికి ఉచిత సన్మానము కావించెను. విజయనగర ప్రభువగు రాయలు ఉత్తమ రాజన్యుడనియు, అతని రాజ్యము సర్వ సౌఖ్యములకు ఆకరమనియు, ఆతని రాజధానియగు విజయనగరము ప్రపంచమందలి నగరముల కన్నిటికంటే మిన్నయనియు రజాకు తాను వ్రాసిన గ్రంథములో తెల్పియున్నాడు. విజయనగర సౌందర్యమును గూర్చి అతడు తెల్పిన అంశములు ఇతర విదేశ యాత్రికులు తెల్పిన విషయములతో ఏకీభవించుచు, ఆనాటి విద్యానగర సామ్రాజ్య శోభను మనకు కండ్లకు కట్టినట్లు చూపుచున్నవి. విజయనగర చరిత్ర రచనకు అబ్దుర్ రజాకువంటి వారి వ్రాతలు చక్కని సాధనములు.

ఖం. డా. శే.

[[వర్గం:]]