Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనుమకొండ

వికీసోర్స్ నుండి

అనుమకొండ  : అనుమడు, కొండడు అను ఆటవికులవలన ఈ గ్రామమునకు 'అనుమకొండ' యను పేరేర్పడెననియు, అనుమడు హనుమకొండను ఏర్పరచెననియు, కొండడు కొండిపర్తి గట్టెననియు స్థానిక చరిత్రమున గలదు. ప్రాచీన శాసనములలో అమ్మన్ కొండ, అనుమకుండాపురము, అనుమకొండ అను రూపాంతరములు గలవు. హనుమంతుడుగల కొండయగుటచే హనుమకొండయను నామ మేర్పడియుండుననియు, హనుమద్గిరి సంస్కృతరూపము దాని కేర్పడెననియు, ప్రతాపరుద్రీయమున విద్యానాథుడు దానినే హనుమదచలమని వ్యవహరించెననియు కొందరి అభిప్రాయము. అనుమకొండ ప్రాచీననగరములలో నొక్కటి. పురబాహ్యమునందు (హంటరురోడ్డు చెంత) రాకాసిగుండ్లు అను అనార్యుల సమాధులు (cairns) కలవు. వాటి విస్తృతినిబట్టి అవి 6000 సంవత్సరములనాటి వని పరిశోధకులు నిర్ణయించిరి. స్థానిక చరిత్రములలో 14 మంది రాజులు పాలించిన పిమ్మట త్రిభువనమల్లుడు (రెండవ బేతరాజు) రాజయ్యెనని కలదు. అచటినుండి కాకతీయవంశ క్రమము అందు గలదు. అచట పాలించిన 14 మంది రాజులు చరిత్రమున కనుపట్టరు. నందుడు, సోమరాజు, మాధవవర్మ - వీరి చరిత్ర లెంతవరకు నిజమో! నందుడు నందగిరి వెల కొల్పి పాలించెననియు, సోమరాజు కటక వల్లభునితో పోరాటమున మరణింపగా, గర్భవతిగ నున్న అతని భార్య సిరియాలదేవి అనుమకొండలో మాధవశర్మ ఆశ్రయమున సురక్షితగ నుండి కుమారుని గని ఆ బాలునకు మాధవవర్మ యని నామకరణము చేసెననియు, మాధవవర్మ పెద్దవాడై పద్మాక్షి దేవి అనుగ్రహమును బడసి, పితృరాజ్యమునంతయు నాక్రమించెననియు స్థానిక చరిత్రలందు కలదు. మాధవవర్మ కొన్ని రాజకుటుంబములకు మూలపురుషుడుగ కన్పడుచున్నాడు.

అమోఘవర్షుడను రాష్ట్రకూట రాజు హనుమకొండలో తొమ్మిదవ శతాబ్దమున చాళుక్య భీమరుసును ప్రతినిధిగా నుంచెను. మొదటి కాకతి ప్రోలరాజు త్రైలోక్యమల్లుడను కల్యాణి చాళుక్యునిచే పదునొకండవ శతాబ్దమున అనుమకొండ విషయమునకు అధీశ్వరుడుగ చేయబడెను. ఈ మొదటి ప్రోలరాజు తండ్రి మహావీరుడై, కాకతి పురాధినాథుడయ్యెను. అతనినే మొదటి బేతరాజుగ వ్యవహరింతురు. మొదటి ప్రోలరాజు కొడుకు రెండవ బేతరాజు. ఇతని కుమారుడు రెండవ ప్రోలరాజు.అనుమకొండలో మూడు కొండలను గలిపి ఎత్తైన మట్టి కట్టబోసి కోట నిర్మింపబడినది. కొండలపై దృఢముగా రాతికోట కట్టబడినది. కొండలపై దిగంబర జైనమూర్తులు కలవు. జైనమత మిచ్చట వ్యాప్తమైనది. పద్మాక్షి యను దేవతయు సిద్ధేశ్వరుడును కోటలోనున్నారు. వీరును జైనదేవతలే. ఇప్పుడు వైదిక దేవతలుగ మారిరి. సిద్ధేశ్వరాలయము చెంతగల కొండపై అనుమకొండ రాజధానిగ నుండి సమస్త సౌభాగ్యముల కాటపట్టుగ నుండెననుచు అతి విస్తృతమైన యొక శాసనము చెక్కుటకు ప్రారంభింపబడి మధ్య ఆపబడినది. చాళుక్యులును, కాకతీయులును దీనిని రాజధానిగా రూపు రేఖలు దిద్దిరి. జైన మందిరములకు, శివాలయములకు, శివలింగములకు లెక్కలేదు. భూగర్భమున నెన్నియో దేవళములున్నవి. గోడలకు పునాదులు తీయునపుడు ఆలయములు, ఇటుక రాళ్లవరుసలు, విగ్రహములు, కోనేరులు, బావులు కనవచ్చును. విరుగగొట్టబడిన దేవతామూర్తులకు లెక్కయే లేదు. మొదట జైనమతము, తరువాత శైవమతము రాజాదరణమును బడసినవి. ఈ రెండు మతముల సంఘటనము గూడ జరిగిన దిక్కడనే. ఆవిస్తృత కథలు జ్ఞాపకము జేయు చిహ్నములు లిఖితరూపముగ, విగ్రహరూపముగ పెక్కులు గలవు.

అనుమకొండలో బాలసముద్రము, భద్ర కాళి చెరువు, సిద్ధసాగరములు పేరు చెందిన తటాకములు. గంగా ధర మంత్రి ప్రోలరాజు కాలమునందు నగరపాలకుడై, రుద్ర దేవుని కాలమున మంత్రియై ప్రసిద్ధిగడించెను. ఇతడు అనుమకొండలో ప్రసన్న కేశవాలయము, రుద్రేశ్వరాలయము, పున్నేశ్వరాలయము, త్రిమూర్తుల ఆలయములు మొదలగునవి కట్టించెనని శాసనములలో గలదు. కాని ఇపు డవి గుర్తింపరాకుండ నాశనమైనవి. గోసగి ఈశ్వరదేవుడు వేయి స్తంభాలగుడిలో సహస్రలింగ ప్రతిష్ఠ చేసెనట. జగద్దేవుడు సర్వ మాండలిక రాజుల సహాయమున రెండవ ప్రోలరాజు కాలమున అనుమకొండను ముట్టడించి పరాజితుడయ్యెను. రామేశ్వర పండితుడు లకులేశ్వర మతము వాడు. ప్రోలరాజుచే సత్కారములొందిన గురువర్యుడు. హనుమకొండలో సుప్రసిద్ధమగు శివపురము ఆకాలమున నుండెను.

రుద్రదేవుడు అనుమకొండలో గట్టించిన వేయి స్తంభముల గుడి మిగుల ప్రశస్తమైనది. మండపము వేరుగను, ఆలయము వేరుగను ఉన్నవి. ఈ రెంటికి మధ్య సజీవముగా నున్నటుల చెక్కబడిన నంది దర్శనీయము. అందలి శిల్ప నైపుణ్యము వర్ణనాతీతము. నందికి అభిముఖముగా త్రికూటాలయము గలదు. అందు రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు ముఖ్య దైవతములు. ద్వారములపై దేవతామూర్తులను అంతరాళములు తొలిచి సుందరముగా చెక్కించినారు. కాకతీయ శిల్పమునకు పరమావధియగు నీ ద్వారా శిల్ప మద్భుతమైనది. కాకతి రుద్రదేవు డీ యాలయమును లోకోత్తరముగ శా. శ. 1084 చిత్రభాను సంవత్సర మాఘ శుద్ధ పంచమినాడు (క్రీ. శ. 1162) నిర్మింపించెను. ఆలయ నిర్మాణానంతరము ఓరుగల్లును రాజధానిగా చేసికొనెను.

ఓరుగల్లు కాకతీయుల రాజధానిగ జేసికొనబడి నప్పటి నుండి అది మహానగరముగా మారినది. అట్లని, నాడు అనుమకొండను చిన్న చూపు జూడ లేదు. రాజ పరివారము, రాజులు, విద్వాంసులు హనుమకొండ నుండి ఓరుగల్లునకు రాకపోకలు చేయువారు. రెంటికిని అవినాభావ సంబంధముండెడిది.

ప్రస్తుత కాలమున అనుమకొండ గొప్ప వ్యాపార స్థలముగ ప్రశస్తవహించినది. లలితకళారాధకులు పలువురచటగలరు, అనుమకొండ జిల్లా ముఖ్యస్థానము. ఉద్యోగు

లందరు ఇట నుందురు. నైజాము దొరతనమున ఇది తెలంగాణమునకు సుబాయై వరలెను. సుబేదా రిట నుండువాడు. బి. యే. వరకు గల మొదటితరగతి కళాశాలయు, బోధనాభ్యసన కళాశాలయు అనుమకొండలోనే ఉన్నవి.తెలంగాణమున రెండవ గ్రంథాలయమనదగిన రాజరాజ నరేంద్ర గ్రంథాలయము గలదు. ఇది సువర్ణోత్సవము జరుపు వయస్సున నున్నది. భద్రకాళి తటాకము జల సమృద్ధము. దాని క్రింద వరిపంట విస్తారము. ఆ చెరువు కట్టపై నున్న భద్రకాళీ దేవాలయము ప్రసిద్ధమైనది. ఆమె కాకతీయుల కులదేవత. శిథిలమైన ఈ ప్రశస్తదేవళమును పునః ప్రతిష్ఠచేసి, నగరవాసులు ఆ దేవతను భక్తిశ్రద్ధలతో పూజించుచున్నారు. ముప్పది యిద్దరు మంత్రులలో గణనీయుడుగా విఠలమంత్రి శాసనము లిందు గలవు. వైష్ణవ మతోద్ధారకుని పేరిట గల శ్రీ రామానుజ దేవాలయము .ప్రశస్తమైనది, దక్షిణ దేశములో నున్నట్లు తీర్చిదిద్ద బడిన రామానుజుల విగ్రహము మిగుల ప్రాచీనమైనది. 'యతిపతీ హనుమద్గిరి రాజమందిరా' అను మకుటముగల శతకరాజ మీయనను గూర్చినదే. ఈ రాష్ట్రమును జూడవచ్చు కళాప్రియులు వేయి స్తంభముల గుడిలోని అద్భుత శిల్పములకు ముగ్ధులగుచుందురు. కాకతీయుల కీర్తిచిహ్నమగు నీ దేవళము ఆర్షశాఖవారి కృషి ఫలితముగా ఇప్పుడు దర్శనీయముగా నున్నది.

ది. వి. ర.