Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనుభవమూలవాదము

వికీసోర్స్ నుండి

అనుభవమూలవాదము (Empiricism): ఈ అనుభవమూలవాదము పశ్చిమఖండమున 17,18 శతాబ్దములలో వ్యాప్తి నంది గొప్ప సారస్వతమును సృజించినది. బేకను పండితుడు దీనికి మూలస్థాపనాచార్యుడు. తరువాత విఖ్యాతిగాంచిన బెంథామ్, లాకే, హ్యూమ్, జాన్ మిల్, జాన్ స్టూవర్టు మిల్ మున్నగువారు దీనిని బహురూపముల పోషించి, సమర్థించి, ప్రచారము గావించినారు.

ఈ వాదము ఉద్భవించుటకు తగిన కారణములు లేకపోలేదు. పూర్వశతాబ్దములలో మతాచార్యప్రోక్తములైన సిద్ధాంతములను అంధవిశ్వాసముతో స్వీకరించుట ప్రజాసమూహమునకు అభ్యాసమైనది. మతప్రచారకులైన గురువర్గము ఈ యంధవిశ్వాసములనే ప్రోత్సహించి, హేతువాదమునకు ఎట్టి యవకాశమును లేకుండ చేసిరి. ప్రకృతిశాస్త్రరవికిరణము అప్పుడే విజ్ఞాన ప్రపంచమున ప్రసరించుటకు ఆరంభించి, హేతువాదాంకురములను జనింపజేసెను. నిర్హేతుకముగా ఏదియు విశ్వసింపరాదను ఈ వాదవిధానము అన్ని రంగములలో ప్రవేశించినది. రాజకీయరంగమున ఈవాద ఫలితముగా ప్రజాప్రభుత్వ భావములు · సాంఘిక రంగమున సర్వమానవ సమానత్వ భావములు, మతరంగమున నాస్తిక, నాస్తిక సమ సంశయ వాదములు రేకెత్తినవి.

ఈ అనుభవమూలవాదత త్వమునందలి ముఖ్యభావములు ఏవనగా, 1. మనస్సు అనునది నిర్గుణమైన ఒక రూపము. దానికి స్వయంప్రకాశకత్వమువలన గలుగు స్వయంనిర్ణయశ క్తి లేదు. మనస్సు స్వయముగా చేయునవి అన్నియును ఊహాజన్యములైన కల్పనములే. వాటికి వాస్తవిక జగత్తులో నుండి తెచ్చుకొనిన ఆధారము లేదు. 2. మనకు లభించునవి బాహ్యజగత్తులోని వస్తువులవలన ఇంద్రియములకు గలుగు వేదనములు మాత్రమే (Impressions). ఈ వేదనముల మూలమున వస్తువుల ఆకృతులు మన మనస్సునందు ముద్రితము లగుచున్నవి. ఈ వ్యక్తులను, వస్తువులను గూర్చిన భావములు క్షణక్షణమునకు జనించి, అంతరించుచున్నవి. ఇవి యొకదాని వెనుక నొకటి కన్పట్టుచున్న వేగాని, వీటి కన్యోన్య సంబంధ మెట్టిదో మనకు తెలియదు. కొన్ని తాటస్థ్యములు కలసి, తిరిగి తిరిగి సంభవించుచుండుటచే, అవి పరస్పర సంబంధములుగలవి యగుటచేతనే అట్లు తటస్థించుచున్న వని యూహించు మానసిక భావమునకు ఆధారము లేదు. లోకములో కొన్ని సందర్భములు తిరిగి తిరిగి ఆదేరీతిగా సంభవించుటకే " సాహచర్యసిద్ధాంత " (Associationism) మని పేరిడిరి. వస్తువుల బాహ్యాకృతియేగాని, వాటి యాంతరంగిక స్వరూపముగాని, వాటి అన్యోన్య సంబంధ సూత్రముగాని, మన ఇంద్రియములకు వేదనముల రూపములో లభించుటలేదు. వీటినిగూర్చి మనస్సు చేయు కల్పనములు వాస్తవికాధారశూన్యములు.

ఈ సిద్ధాంతముననుసరించి, మతసూత్రములన్నియు మనః కల్పితములైన మానసికాహ్లాదము నొసంగు నిరాధార భావములే. కాని, నిజప్రపంచమునకు సంబంధించినవని రుజువుచేయుట కాధారములేదని ఈ అనుభవమూల వాద తత్త్వజ్ఞుల నిశ్చయము.

అదేవిధముగా నైతిక సూత్రము (The Moral Law) శాశ్వతమైన పరమప్రమాణము కాదు. ఆయా కాలముల యందు సమాజాభ్యుదయమునకు అవసరములని తోచిన కొన్ని నియమములను నాటి మేధావులు కల్పించి, ఇవి నీతిధర్మము లనిరి. దేశకాల పాత్రములలోని మార్పులను బట్టి నీతిసూత్రావళియు,తదాచరణ విధానమును పరివ ర్తనమందుచు వచ్చెనని చరిత్ర మనకు చెప్పుచున్నది. ఈ కారణముచే ఈ అనుభవమూలవాదులు ప్రయోజన సిద్ధాంతమును (Utilitarianism) సమర్థించిరి. మనము విశ్వసించుచున్న మతసిద్ధాంతములు, నీతిసూత్రములు, సామాజిక నియమములు, రాజకీయ శాననాదులు, అన్నియు ఆయా దేశకాల జనావసరములైన కల్పవములే యనియు, వాటికి పరమప్రామాణ్యమును అంటగట్ట జూచుట హేతువిరుద్ధమనియు వీరి వాదమై యున్నది. పరమార్థము లేక పరమసత్యమున్న నుండవచ్చును. కాని మన ఇంద్రియవ్యాపారమునకు దానిపోకడ లెవ్వియు గోచరించుటలేదు. మానసికముగా జేయు ఊహాకల్పనములు వాస్తవికతకు సంబంధములేని వని వారి నిశ్చయ సిద్ధాంతమై యున్నది.

ఈ సిద్ధాంతము బలహీనమైనదని నిరూపించుట కష్టము కాదు. మనస్సు అనునది, నిర్గుణనిష్క్రియాత్మక రూపము గాదు. అది వస్తు సత్యాసత్య స్వరూపములను విచారించి, తెలిసికొను స్వయంప్రతిభగలదని తరు వాత వచ్చిన తత్త్వజ్ఞులు ఉద్ఘాటించియున్నారు.

ఋ. వేం.