Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అనంతపురముజిల్లా

వికీసోర్స్ నుండి

అనంతపురముజిల్లా  : అనంతపురము జిల్లా ఆంధ్రప్రదేశములోని ఒక జిల్లా. ఈ జిల్లా ఉత్తర అక్షాంశ రేఖ 13°-40' నుండి 15°-15' వరకును, తూర్పు తులా రేఖ 76°-50 నుండి 78° 30' వరకును విస్తరించి యున్నది. ఈ జిల్లా దీర్ఘచతురాకారమున (oblong) నుండును. నిడివి ప్రాంతము ఉత్తరము నుండి దక్షిణమునకు ప్రాకుచుండును. కల్యాణదుర్గము, మడకసిరా తాలూకాలమధ్య పడమటినుండి మైసూరురాష్ట్ర భాగముచొచ్చుకొనిఉండును. ఈ జిల్లాకు ఉత్తరమున బళ్ళారి కర్నూలుజిల్లాలును, తూర్పున కడపజిల్లాయును దక్షిణమున చిత్తూరు జిల్లాయును, మైసూరు రాష్ట్రమును పడమట మైసూరు రాష్ట్రమును, బళ్ళారి జిల్లాయును, ఎల్లలుగానున్నవి. మడకసిరాతాలూకాలోని కనజనహళ్ళి, సరజమ్మనహళ్ళి, కోట గారలహళ్ళి అను గ్రామములును, హిందూపూరు తాలూకాలోని చంటికుంటపల్లి అనుగ్రామమును మైసూరు రాష్ట్రముతో 1950 లో చేర్చబడినవి.

ఈ జిల్లా అంకెలు ఈ క్రిందివిధముగా నున్నవి. జిల్లా మొత్తము : విస్తీర్ణము - 6706 చ.మై; గ్రామములు- 858; పురములు 14; జనాభా 13,61,556; పురుషులు 7,01,242; స్త్రీలు 6,60,314; గ్రామ వాసులు 11,39,998; పురవాసులు 2,21,558; జనసాంద్రత, 203.

ఈ జిల్లాలో తొమ్మిది తాలూకాలు గలవు. వివరములు ఈ క్రిందివిధముగా నున్నవి.

1. అనంతపురం తాలూకా : విస్తీర్ణము, 926 చ.మై, గ్రామములు, 114; పురములు, 9; జనాభా 164703; పురుషులు 85459; స్త్రీలు 79244; గ్రామవాసులు 132751; పురవాసులు 31952.

2. గుత్తి తాలూకా : విస్తీర్ణము 896 చ. మై; గ్రామములు 137; పురములు 4; జనాభా 214851; పురుషులు. 109340; స్త్రీలు 105511; గ్రామ వాసులు 144938; పురవాసులు 69913.

3, తాడిపత్రి తాలూకా : విస్తీర్ణము 641 చ. మై; గ్రామములు 98; పురములు 2; జనాభా 132794; పురుషులు 67,998; స్త్రీలు 64796; గ్రామవాసులు 105431; పురవాసులు 27363.

4. కల్యాణ దుర్గము తాలూకా : విస్తీర్ణము 821 చ. మై. గ్రామములు 74; పురము 1; జనాభా 118394; పు రు షు లు 61381 ; స్త్రీలు 57013; గ్రామవాసులు 110231; పురవాసులు 8163.

5. ధర్మవరము తాలూకా : విస్తీర్ణము 736 చ. మై; గ్రామములు 65; పురము 1; జనాభా 114812; పురుషులు 59229; స్త్రీలు 55583: గ్రామవాసులు 100109; పురవాసులు 14703.

6. పెనుగొండ తాలూకా : విస్తీర్ణము 682 చ. మై; గ్రామములు 99; పురముఖ 2; జనాభా 123349: పురుషులు 63487; స్త్రీలు 59862; గ్రామవాసులు 105245; పురవాసులు 18104.

7. కదిరి తాలూకా: విస్తీర్ణము 1157 చ. మై; గ్రామములు, 140: పురము 1; జనాభా 219,112; పురుషులు, 113115; స్త్రీలు 105997; గ్రామ వాసులు 198758; పురవాసులు 20354.

8. మడకసిర తాలూకా : విస్తీర్ణము 417 చ. మై; గ్రామములు 55; పురము 1; జనాభా 120209; పురుషులు 61766; స్త్రీలు 58443; గ్రామవాసులు 113641; పురవాసులు 6568.

9. హిందూపురము తాలూకా : విస్తీర్ణము 430 చ. మై; గ్రామములు 76; పురము 1; జనాభా 153332 ; పురుషులు 79467: స్త్రీలు 73865; గ్రామవాసులు 128894; పురవాసులు 24438;

భాషలు: మాట్లాడు ప్రజల సంఖ్య (1) తెలుగు, 10,73,739. (2) కన్నడము 1,32,660.(3) హిందూస్తాని 1.04,580. (4) లంబాడి 19,384.(5) తమిళము 11,004. (6) మరాఠి 7,282. (7) హిందీ 4,310. (8) తులుభాష 3,134 (9) ఎరుకల భాష 2,828. (10) మలయాళము 2071. (11) ఇతరభాషలు 564. మొత్తము 13,61,556.

ఈ జిల్లాలో నైసర్గికముగా మూడు విభాగములున్నవని చెప్పవచ్చును. అవియేవనగా: 1. విస్తృతముగా నల్లరేగడి భూములు గల ఉత్తరమందలి గుత్తి, తాడిపత్రి తాలూకాలు. 2. మధ్యనున్న కల్యాణదుర్గము, ధర్మవరము, పెనుగొండ, కదిరి తాలూకాలు. ఇవి జల శూన్యములు. చెట్లు లేని విశేష విస్తీర్ణముగల నిస్సారపు ఎఱ్ఱమట్టి నేలలు. 3. మడక సిర, హిందుపురము తాలూకాలలోని ఎత్తైన సమప్రదేశము. ఇది మైసూరు పీఠభూమితో కలియుచు, జిల్లాలోని ఇతర తాలూకాల కంటే ఎక్కువ ఎత్తు కలిగియున్నది. జిల్లా పశ్చిమ భాగమందున్న గుత్తి, కల్యాణదుర్గము అను తాలూకాల భాగములు పశ్చిమదిశగా వాలియుండును. గుత్తి, తాడిపత్రి తాలూకాల ఉత్తర భాగములు దక్షిణముఖముగా వాలి పెన్నానదిలోనికి జారును. ఇక జిల్లాలో శేషించిన భాగము దక్షిణమునుండి ఉత్తరమునకు వంగుచుండును.విశాలమైదానములు రాతిగుట్టల మూలకముగా గట్టులుగను, పంక్తులుగను, గుంపులుగను చీలియుండును.

పర్వతములు : ముచ్చుకోట గుట్టలు 35 మైళ్ళ నిడివి కలవి. కొన్ని చోట్ల 7 మైళ్ళవరకు వెడల్పుకలిగియున్నవి. ఇవి గుత్తిపట్టణపు ఉత్తరమునుండి తాడిపత్రి తాలూకా చివర దక్షిణపుమూలవరకు వ్యాపించియున్నవి. ఇవి తాడిపత్రి పడమటి కొన నానుకొని, గుత్తి, అనంతపురము తాలూకాలలోని తూర్పు సరిహద్దులను అనుసరించిపోవు చుండును. వీటిని తాడిపత్రి తాలూకా నైరృతి మూల యందు చిత్రావతీ నది చీల్చును.

గుత్తి తాలూకా పశ్చిమమునుండి ఇంకొక గుట్టల వరుస బయలుదేరును. ఇది గుత్తితాలూకా మధ్యనుండి 50 మైళ్ళవరకు దక్షిణముగా సాగి అనంతపురము, ధర్మవరము తాలూకాలలోనికి పోవును. ఈ గుట్టల వరుసను నాగసముద్రపు గుట్టలందురు. ఈ గుట్టలవరుసలో ఎన్నో విరుగుడులు కలవు. ఇది దక్షిణమునకు పోవుకొలది ఎత్తు. పరిణామము తగ్గుచుండును.

మల్లప్పకొండ గుట్టలవరుస ధర్మవరములో ప్రారంభమయి మైసూరురాష్ట్రములోనికి పోవును. ఇది 3,088 అడుగుల ఎత్తుకలది.

మడకసిరా తాలూకాలో మడకసిరా గుట్టలు ఆ తాలూకాను దక్షిణ, ఉత్తర భాగములుగా విడదీయును.

దక్కను భూభాగమునకు విలక్షణమయిన విడి విడి గుట్టలు, శిలల గుంపులు కలవు. ఉదా: గుత్తిశైలము, కల్యాణదుర్గము చుట్టునున్న గుంపులును అనంతపురము తాలూకాలో సింగనమాలయు పేర్కొనదగినవి. తాడిపత్రి తాలూకా తూర్పుభాగమున కర్నూలుకు సంబంధించిన ఎఱ్ఱమల గుట్టల వరుస యొక్క నిమ్న భాగములు కలవు.

హిందూపురము, మడకసిరా అను తాలూకాలలో పుష్కలముగ తృణకాష్ఠ సమృద్ధికలదు. ఇక శేషించిన జిల్లా భాగ మంతయు ఊసర క్షేత్రము. కొన్ని తోపులలోను లోయలలోను వ్యవసాయము వెదజల్లబడి యుండును.

నదులు : ఈ జిల్లాలో పెన్నానది ముఖ్యమైనది, ఇది మైసూరురాష్ట్రములోని నందిదుర్గమునకు వాయవ్యమున చెన్న కేశవ గుట్టలలో ప్రభవించి, హిందూపురము దక్షిణ భాగాంతమున ఈ జిల్లాలో ప్రవేశించి, హిందూపురము, పెనుగొండ, ధర్మవరము అను తావుల పడమటి భాగముల ననుసరించి ఉత్తరముగా ప్రవహించును. తరువాత ఇది అనంతపురము తాలూకా పడమటి సరిహద్దున ప్రవహించుచు, తూర్పునకు మరలి, గుత్తి, అనంతపురముల మధ్య నుండి త్రోవ చేసికొని, తాడిపత్రి తాలూకా గుండ పోవును. తరువాత ఇది కడప, నెల్లూరు జిల్లాలగుండ పోయి చివరకు బంగాళాఖాతములో పడును. హిందూపురము తాలూకాలోని ఊటుకూరు దగ్గర ఉపనదియగు జయమంగళి దీనితో కలియును.

ఈ జిల్లాలో పేర్కొనదగిన మరొక నది చిత్రావతి. పెన్నానదివలెనే ఇది మైసూరురాష్ట్రములోని నందిదుర్గమునకు ఉత్తరమున నున్న హరిహరేశ్వర గుట్టలో జనించును. ఇది హిందూపురము తాలూకా తూర్పు ప్రాంతమున అనంతపురము జిల్లాలో ప్రవేశించును, హిందూపురము తాలూకాగుండ ఉత్తరముగా ప్రవహించి, ఇది పెనుకొండ తాలూకాలోని బుక్కపట్ట ణము చెరువులో పడును. అచ్చటినుండి మిగులు పరీవాహముగా (Surplus) బయలుదేరి ధర్మవరము తాలూకా గుండ ఉత్తరముగా ప్రవహించి, ధర్మవరము చెరువులో పడును. తిరిగి మిగులు పరీవాహముగా అచ్చటినుండి బయలు దేరును. తరువాత అది ధర్మవరము తాలూకాగుండ తాడిపత్రి తాలూకా దక్షిణపుమూలగుండ ఈశాన్యముగాపోయి ఈ జిల్లాను వదిలి కడప జిల్లాలో పెన్నానదిలో కలియును.

హిందూపురము తాలూకాలోని కుళాపతి యను నది చిత్రావతీనదికి ఉపనదియై యున్నది.

నాగసముద్రము గుట్టలలో దక్షిణ దిశాంత భాగమున తడక లేరు జనించి, అనంతపురము జిల్లాలోని సింగనమాల చెరువులోనికి ప్రవహించి, తరువాత పెన్నానదితో సంగమించును.

పండెమేరు నది అనంతపురము చెరువునకు నీటివసతిని కల్పించును. అచటినుండి మిగులునీరుగా బయలు దేరి తడక లేరుతో కలియును.

స్వర్ణముఖీ నది మడకసిరా తాలూకాలోనిది. ఇది మైసూరురాష్ట్రములోని హగరీనదిలో, కలియును.

మద్దిలేరునది కదిరితాలూకాలో ఉత్తరముగా ప్రవహించుచు చిత్రావతితో కలియును.

పాపఘ్నీనది కదిరి తాలూకాలోని మరియొక నది.

అడవులు: ఈ జిల్లాలో 698.84 చదరపు మైళ్ళ అరణ్యప్రాంతము కలదు. పెనుకొండ తాలూకాలోని రక్షితారణ్యమున వంటచెరకు, వెదురు మున్నగువాటి ఫలసాయము లభించును. కదిరితాలూకాలోని రక్షితారణ్యములో ముండ్లచెట్లజాతులు కలవు. హిందూపురము తాలూకాలోని రక్షితారణ్యసంపద ఇతర తాలూకాలోని సంపదకంటె మెరుగయినట్టిది.

శీతోష్ణము - వర్షపాతము : మార్చి, ఏప్రియల్ మే నెలలు అత్యుష్ణముగా నుండును. నైరృతి మేఘవాయువులు (monsoon) వీచుట సాగగానే జూన్ నుండి డిసెంబరు వరకు ఉష్ణోగ్రత (Temperature) క్రమముగా పడిపోవును. ఎండకాలమునందలి మూడు నెలలు అసౌఖ్యకరమైనట్టివి. నవంబరునుండి జనవరివరకు రాత్రులు ప్రభాత సమయములు మోదావహముగలు నుండును. ఈ జిల్లా మిక్కిలిగ పొడిప్రాంతమయి ఉన్నది.

ఆంధ్రరాష్ట్రములో అత్యల్ప వర్షపాతముగల జిల్లాలలో నొకటిగా ఈ జిల్లాయున్నది. ఈ జిల్లాలో సగటున వర్షపాతము 20.12 అంగుళములు.

తాలూకాలలోని ఉష్ణోగ్రతయందు ఎక్కువ భేదము లేదు. కాని మడకసిరా, హిందూపురము పెనుగొండ తాలూకాలు మిగుల ఎత్తైన ప్రాంతములగుటచే అవి కొంతవరకు చల్లనివాతావరణమును కలిగియుండును.

నేలలు : నల్ల రేగడి, నల్లగరప (black loam), నల్ల యిసుక, ఎఱ్ఱమట్టి, ఎఱ్ఱగరవ (Red loam), ఎఱ్ఱయిసుక భూములు కలవు. నల్లరేగడి ఎక్కువ పంటవండుటలో శ్రేష్ఠమైనది. ఎఱ్ఱయిసుకభూమి అన్నింటికీన్న చెడ్డది.

నీటిపారుదల: తాడిపత్రి తాలూకాలోని ఎల్లనూరు చెరువుతప్ప ఈ జిల్లాలో చెప్పుకొనతగిన నీటివనరులు లేవు. ఈ జిల్లాలోని నదులు మంచివానలు పడినప్పుడు మాత్రమే నీటిప్రవాహములు కలిగియుండి సంవత్సరమునం దధిక కాలము ఎండిపోవును. నదులకు ఆనకట్టలు సరిగా కట్టబడలేదు. తాత్కాలికోపయోగమునకై ఇసుక కట్టలు వాటి కడ్డముగ. వేయుదురు. అడవిబాగులందు, చెరువు గర్భమునందు, గుట్టల పార్శ్వపు లోయలందు, ఊట కాలువలు త్రవ్వుదురు. ఇట్లు ఏ కొలది భాగమో వ్యవసాయము చేయుదురు. కొన్ని చిన్న చెరువులు కలవు. కాని పంటలు పండువరకు ఈ చెరువులను నింపవలసియుండును. ఈ చెరువులు కదిరి తాలూకాలో అనేకము లున్నవి. ఈజిల్లాలో కొన్ని నదీప్రవాహపూరితముగల తటాకములు గలవు. అనంతపూరు తాలూకాలోని సింగనమాల చెరువునకు తడకలేరు ఆధారము. పెనుగొండ తాలూకాలోని బుక్క పట్టణ చెరువునకును, ధర్మవరము తాలూకాలోని ధర్మవరము చెరువునకును చిత్రావతీనది ఆధారము. పెక్కు చెరువులు పూడిక పడిపోవుచుండును. బావులున్నవి గాని అవి వట్టి పోవుచుండును.

నీటిపారుదల సౌకర్యములంతగా లేనందునను, రెండు మాన్సూనులకొనలు తాకెడు భౌగోళిక పరిస్థితిరూపమయిన దురదృష్టమువల్లను, నేల యొక్క నిస్సారపు గుణము జిల్లాయందర్ధభాగమును మించియుండుటచేతను. జిల్లాయంతయు క్షామపరిస్థితులకు గురియగుచుండును. ఎగువ పెన్నా ప్రాజక్టు, కుముదవతీ ప్రాజక్టు, భైరవాని తిప్ప ప్రాజక్టు నిర్మాణములు ప్రభుత్వమువారు చేపట్టి నందున నీటిపారుదల సౌకర్యములు కొంతవరకు బాగు పడవచ్చును.

ఈ జిల్లాలో 2478 చిన్నరకపు నీటి వనరులు కలవు. వీటిక్రింద 91,258.27 య.ల ఆయకట్టు గలదు. 109 పెద్దరకపు నీటి వనరులు కలవు. వీటిక్రింద 52,637.76 య.ల ఆయకట్టుకలదు.

పంటలు: వరి, చోళం, కుంబు, కొఱ ఇవి ముఖ్యమయిన తిండిపంటలు. వరిగె, రాగి. సమై అనునవి స్వల్పముగా పండును. సెనగలు ఎక్కువగా సాగుచేయబడును. వేరుసెనగ, ప్రత్తి - ఈ రెండును ముఖ్యమయిన వ్యాపారపుపంటలు. మడకసిరా, హిందూపూరు తాలూకాలలో కొబ్బరితోటలు, పోక తోటలు కలవు.

రహదారులు: బళ్ళారి, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కలుపుచు ఈ జిల్లాలో రహదారిబాటలు కలవు. రోడ్ల నిడివి 1,360 మైళ్ళు. ఇందు 106 మైళ్ళు జాతీయ రహదారి మార్గములు. 251 మైళ్ళు రాష్ట్రీయ మార్గములు, 548 మైళ్ళు జిల్లా పెద్ద బాటలు, 124 మైళ్ళు ఇతర జిల్లా రోడ్లు, 275 మైళ్ళు గ్రామమార్గములు. 61 మైళ్ళు మ్యునిసిపల్ మార్గములు. ఈ రాజమార్గములలో పెక్కుమార్గములు కరవుకాలమందు ప్రజాపోషణార్థము నిర్మితమయినట్టివి.

రైలు : ఈ జిల్లాలో 61 మైళ్ల పెద్దలైను రైలు మార్గము కలదు, 191½ మైళ్ల చిన్న లైను మార్గము కలదు. కల్యాణదుర్గము తాలూకాలోను, మడకసిరా తాలూకాలోను రైలుమార్గములు లేవు.

తపాలా : ఈ జిల్లాలో 14 తంతి తపాలా ఆఫీసులు కలవు. 5 సబ్ పోస్టు ఆఫీసులు కలవు. 207 బ్రాంచి పోస్టాఫీసు లున్నవి.

వైద్యము : ఈ జిల్లాలో 8 పెద్ద ఆసుపత్రులు, 11 చిన్న ఆసుపత్రులు కలవు. అనంతపురములోని ఆసుపత్రి అన్నిటి కంటె పెద్దది. ఇచ్చట 100 మంచాలు కలవు. ఈ ఆసుపత్రిలో " ఎక్సురే ” యంత్రము గలదు. కుష్ఠురోగ చికిత్సకు ఏర్పాటు చేయబడినది.

పానీయజలమునకు బావులే ముఖ్యాధారములు. అచ్చటచ్చట చెరువునీరు త్రాగుచుండుటకలదు. అనంతపురములో పరిశుద్ధముచేయబడిన జలము లభించును. 673 మంచినీటి బావులను ప్రభుత్వమువారు త్రవ్వించి నారు.

జాతరలు : ఈ జిల్లాలో 37 యాత్రా స్థలములు, 11 పశువుల సంతలు కలవు.

విద్య : ఈ జిల్లాలో 892 సంస్థలు విద్యగరపునవి కలవు. వీటియందు 58,750 మంది బాలురు, 22,208 మంది బాలికలు విద్యనేర్చుచున్నారు. విద్యా సంస్థలలో కళాశాల 1; వృత్తి కళాశాల(ఇంజనీరింగు) 1; బాలుర హైస్కూళ్ళు 19: బాలికల హైస్కూలు 1; ఆంగ్లో – ఇండియన్ స్కూళ్ళు 2; శిక్షణ పాఠశాలలు 3; బాలుర మిడిల్ స్కూళ్ళు 3; బాలికలమిడిల్ స్కూళ్ళు 2; ఎలిమెంటరీ స్కూళ్లు 834; బేసికు స్కూళ్లు 2; వయోజన పాఠశాలలు 24 కలవు. కళాశాలలో 56 గురు బాలి కలును, హైస్కూలులో 396 గురు బాలికలును విద్య నభ్యసించుచున్నారు. - కుటీర పరిశ్రమలు : నూలు నేత, నూలు అద్దకము, ఉన్ని వడకుట, నేయుట, పట్టునేత, చాపలల్లుట, నూనెగాను గలు, బీడీలు కట్టుట, తోళ్ళు పదును చేయుట, చెప్పులు, బూట్లు కుట్టుట, కుండలు చేయుట, తట్టలల్లుట, పొడి చేయుట బెల్లము వండుట - ఇవి ఈ జిల్లాలోని కుటీర పరిశ్రమలు.

కళ్యాణదుర్గము, ధర్మవరము, పెనుగొండ, మడకసిరాతాలూ కాలలో భారీపరిశ్రమలులేవు. ఇతర తాలూకాలలో 52 ఫ్యాక్టరీలు కలవు.

మతము : హిందువులు 12,01,226. ముస్లిములు 1,46,068, క్రైస్తవులు 13,499, ఇతరులు 763. మొత్తము 13,61,556 మంది.

విశేషాంశములు : గుత్తిలోని కొండమీద గొప్ప కోటగలదు. దీనిని మరాఠా సర్దారు మురారి రావు కట్టించి నాడు. ఇదియును, మన్రో కట్టించిన ధర్మశాలయు, చరిత్ర ప్రాముఖ్యముకలవి. పెనుగొండలో విజయనగర రాజన్యులు కట్టించిన దుర్గముకలదు. బాబయ్య అను ముసల్మాను సాధువుయొక్క కోటయుండుటచే పెనుగొండ దక్షిణాపథమునందలి ముస్లిములకు యాత్రాస్థలముగా తనరారుచున్నది. హిందూపురములోని లేపాక్షి దేవాలయము శిల్పచాతుర్యముగల స్థానము. కళా ప్రియులకు ఇచ్చటి రాతినంది విగ్రహము ఆకర్షణీయముగా నుండును.

కదిరిలోని నృసింహస్వామి కోవెలలోనికి రథోత్సవము ముగిసిన తరువాత హరిజనులకు ప్రవేశమిచ్చుట సనాతనాచారముగా వచ్చుచున్నది. కదిరి తాలూకా కటారు పల్లిలో వేమనకవి సమాధి మందిరము కలదు.

అనంతపురము, గుంతకల్లు, హిందూపురము, తాడిపత్రి ఇవి మునిసిపాలిటీ గల పురములు. ధర్మవరము పట్టువస్త్రముల నిర్మాణ కేంద్రము. ధర్మవరపు చీరెలు ప్రసిద్ధిచెందినట్టివి. అప్పుడప్పుడు వజ్రములు దొరకెడు ప్రదేశముగా• గుత్తి తాలూకాలోని వజ్రకరూరు ప్రసిద్ధికెక్కియున్నది.

అనంతపుర పట్టణము : ఇది అనంతపురము జిల్లాకు, డివిజనునకు, తాలూకాకు ప్రధాన కార్యస్థానము. విస్తీర్ణము 2.70 చ. మై. జనాభా, 31,952, ఇందు పురుషులు 17.025; స్త్రీలు 14,927. ఇండ్లు 3,776. చదువుకొన్న వారు పురుషులు 10899; స్త్రీలు 351. శాస్త్రకళాశాలలు 2; ఇంజనీరింగు కళాశాల 1; హైస్కూళ్ళు 3; శిక్షణ విద్యాలయములు 2 కలవు. గవర్నమెంటు హెడ్ క్వార్టర్సు ఆసుపత్రీ 1; గవర్నమెంటు పోలీసు ఆసుపత్రి 1; ఇంజనీరింగు కాలేజీడిస్పెన్సరి 1; మ్యునిసిపాలిటీ డిస్పెన్సరీ కలవు.

విజయనగర రాజయిన బుక్ష రాయలకు (క్రీ.శ. 1343-1379) మంత్రియగు చిక్కప్ప ఒడయరు తన భార్య అయిన అనంతమ్మ పేరిట అనంతపురమును కట్టించెను. హండెవంశజుడైన హనుమప్పనాయడను వాని పరాక్రమమునకు ఆళియ రామరాజు (క్రీ.శ. 1542 - 1565) సంతసించి అతనికి అనంతపురమును, మరికొన్ని గ్రామములను, పదవులను ఇచ్చెను. ఇతని కుమారుడు మలకప్ప నాయడు గోలకొండ నవాబునకు సామంతుడయ్యెను. మలకప్ప నాయడు బుక్క సముద్రమున నివసించుచు, ఒక నాడు అనంతపురములోని ఎల్లా రెడ్డిఇంటికి తాంబూలమునకుపోయెను. ఎల్లారెడ్డి సంతానసంపదను మలకప్పనాయడు చూచి, అచ్చటనివసించినచో తనకుకూడ సంతానము కలుగునని తలచి అతనినడిగి ఆస్థలము తీసికొని, అచటరాజమందిరము కట్టించి, అచ్చటనే నివసింపసాగెను. అప్పటినుండి ఆగ్రామమునకు 'మాండే అనంతపుర' మన్న పేరువచ్చెను. మలకప్ప నాయని కుమారుడు హంపనాయడు (క్రీ.శ. 1619-1631) ఆతని కుమారుడు సిద్దప్ప నాయడు (క్రీ.శ.1631 1659), ఆతని కుమారుడు పవడప్ప (క్రీ.శ. 1659-1671) వరుసగా, రాజ్యము చేసిరి. తరువాత ఈ ప్రాంతము ఔరంగ జేబునకు స్వాధీనమయ్యెను. పిదప నిది కడప నవాబుల పాలనము లోనికివచ్చెను. పిమ్మట దీనిని మరాఠా వారు ఆక్రమించిరి. ఇంతవరకు మలకప్ప వంశజులే సామంతులుగా రాజ్యము చేయుచుండిరి. ఈ వంశము వారి నందరను టిప్పూ సుల్తాను చంపించెను. ఈ వంశములోని సిద్దప్ప యనువాడు తప్పించుకొని పారిపోయి టిప్పుసుల్తాను మరణానంతరము అనంతపురమును తిరిగి స్వాధీనము చేసికొనెను (క్రీ.శ. 1799). తరువాత సిద్దప్ప నిజామునకు సామంతుడయ్యెను. పిదప నిది దత్తమండలములతోపాటు ఇంగ్లీషు వారి ఏలుబడిలోనికి వచ్చెను (క్రీ.శ.1800).

[[వర్గం:]] [[వర్గం:]]