Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అధికార వర్గము

వికీసోర్స్ నుండి

అధికార వర్గము (Bureaucracy) : మానవులకు గల వాంఛలలో శాంతి సౌభాగ్యములు ముఖ్యమైనవి- వీటిని సమకూర్చుటకు ఏర్పడినది రాజ్యము (State). ఇది కాలక్రమమున విస్తరించినది. అనగా దీనియందలి సభ్యుల సంఖ్య పెరుగుటయు, ఇది ఆక్రమించిన ప్రదేశము విస్తరించుటయు, ఎదుర్కొనవలసిన సమస్యలు, ఏర్పాటు చేయవలసిన సౌకర్యములు ఎక్కు వగుటయు, అందువలన కార్యనిర్వహణభారము వృద్ధియగుటయు జరిగినవి. ఇట్టి కార్యనిర్వహణమును సక్రమముగను, సమర్థముగను, సంతృప్తికరముగను సాగించుటకు ప్రత్యేక మైన శక్తి సామర్థ్యములు గల ఉద్యోగి బృందము, అవసరమైనది. ఇదే క్రమముగ అధికారవర్గముగ రూపొందినది.

అర్థము : అధికారవర్గము అనగా ప్రభుత్వోద్యోగుల సిబ్బంది. ఇది సాధారణమైన అర్థము. అయితే ఈ పదమునకు నిగూఢ మైనట్టియు, నిందార్హమైనట్టియు అర్థము గూడ గలదు. ఉద్యోగులందు తమకు పాలనమును నిర్వహించుటలో గల శక్తియుక్తులనుబట్టియు, తద్ద్వారమున అనుభవించు అధికార గౌరవములను బట్టియు, అతిశయము ప్రబలినది. అంతేగాక స్వార్థపరత్వము, సంకుచితదృష్టి, అలసత, అవినీతి మొదలగు అవలక్షణములు గూడ ఏర్పడినవి. ఇవి ఉద్యోగులకు సంభవించిన విపరీత స్థితిని సూచించును. ఈ స్థితిని వర్ణించుటకుగాను Bureaucracy అను పదమును వాడుట మొదలిడిరి. ఇది అధికారవర్గము అను పదమునకుగల అశ్లీలార్ధము. దీనిని బట్టి ఆ వర్గము విపరీత మనస్తత్వముతో వర్తించు ఉద్యోగుల ముఠాయని గ్రహింపవచ్చును. నేటి రాజ్యములలోని ఉద్యోగి బృందమును సివిలు సర్వీసు (Civil Service) అందురు. దీనికి పై దుర్గుణములు ఏర్పడినచో ఇది అక్రమమైన స్థితికి దిగిన అధికారవర్గము (Bureaucracy) గ భావింపబడును.

పుట్టుపూర్వోత్తరములు : అయితే అధికార వర్గము రాజ్యమునందేగాక, విస్తారమైన ఆర్థిక, మత, సంఘము లందును (అనగా ఉత్పత్తి కేంద్రములు, వర్తకుల యొక్కయు, శ్రామికులయొక్కయు, సంఘములు, దేవాలయములు, మఠములు, మతపీఠములు మొదలగు వాటియందును) ఏర్పడియుండును. అయినను అది రాజ్యమునందు ఎక్కువగ ప్రబలినది. కావున రాజ్యపాలనమునందు అధికార వర్గమునకుగల పాత్రకు ఇచట ప్రాముఖ్యమీయబడినది.

సాధారణముగ అధికారవర్గపు ప్రభావము వివిధ రాజ్యములందు ప్రత్యక్షముగ కాక ప్రచ్ఛన్నముగ నుండును. అనగా ఆవర్గము రాజ్యాధినేతలయిన ప్రభువుల క్రిందగాని, ప్రజా నాయకుల మరుగునగాని, దాగి యుండును. యూరవు ఖండమందలి ఫ్రాన్సు దేశము దీనికి పుట్టినిల్లుగ పరిగణింపబడును. ఫ్రాన్సు, ప్రష్యాదేశములను 17, 18 శతాబ్దులలో పాలించిన నిరంకుశ ప్రభువులు తమ పాలనము సౌష్ఠవముగ సాగుటకై ప్రత్యేక అధికారులను నియమించిరి. వీరు అధికారవర్గముగ పరిణమించిరి. 19వ శతాబ్దికి పూర్వము ఇంగ్లండునందు ఇది యెక్కువగ కానరాదు. తదుపరి అచటగూడ వ్యాపించినది. యూరపు రాజ్యములందు ప్రభుపాలనము అంతరించి ప్రజాపాలనము అవతరించిన తరువాతగూడ అధికారవర్గము స్థిరముగనే ఉన్నది. అది నేటికిని నిలిచియున్నది.

మనదేశములో సయితము వెనుకటి కాలమునగూడ కొద్దిగనో గొప్పగనో ఇదియుండినట్లే తెలియును. బ్రిటిషు వారు పాలించిన కాలమున మనదేశమున ప్రచ్ఛన్నముగనే గాక చాలవరకు ప్రత్యక్షముగనే ఉద్యోగులు (ముఖ్యముగ I. C. S. ఉద్యోగులు) పరిపాలనమును సాగించిరి. అప్పటి అధికారవర్గము భారతజాతిని బంధించిన ఇనుప బోను (steel frame) అని వర్ణింపబడినది. అంతకుపూర్వము గూడ అధికారులు కొన్ని సమయములందు అధికార రోగపూరితులై వర్తించుచున్నట్లు వెనుకటి వాఙ్మయమునందు నిదర్శనములుగలవు.

అధికార వర్గమువలన ప్రయోజనములు : అధికార వర్గము వివిధ దేశ కాలములందున్నట్లు ఇదివరకు సూచింపబడినది. ఇపుడు దానివలన వెనుక చేకూరినట్టియు, నేడు నెరవేరుచున్నట్టియు ప్రయోజనములను గమనింతము. 17,18 శతాబ్దులలో ఫ్రాన్సు మొదలగు యూరపు దేశములలో అధికారవర్గము ప్రభుపాలనమును పటిష్ఠ మొనర్చి, ప్రజానీకమునకు శాంతిసౌభాగ్యములను చేకూర్చినది. ఆయా దేశములు క్రమముగ జాతీయైక్యమును, ఆర్థికాభివృద్ధిని పొందగలిగినని. తరువాతి కాలమున పశ్చిమరాజ్యములందు ప్రబలిన ప్రజాప్రభుత్వపు (Democratic State) శ్రేయోరాజ్య (Welfare State) వ్యవస్థలందు గూడ అధికారవర్గము నిర్వహించిన పాత్ర కొన్ని విధముల ప్రశంసాపాత్రమైనదే. ప్రజాశ్రేయస్సు కొరకై శాంతిభద్రతల నిచ్చుటయేగాక, అనేక రకములైన సౌకర్యములను ప్రభుత్వము ప్రజలకు సమకూర్ప వలసి వచ్చినది. ఈ సౌకర్యములు వ్యవసాయము వాణి జ్యము, విద్య, వైద్యము, వినోదము, నైతిక-ఆధ్యాత్మిక వికాసము మొదలగువాటికి సంబంధించినవి. ఈ కార్యములను అభివృద్ధి చేసి వీటిని సామాన్య ప్రజలకు గూడ అందచేసి వారి జీవితమును సౌఖ్యప్రదము చేయవలసి యున్నది. మనదేశమున అమలు జరుగుచున్న పంచవర్ష ప్రణాళికలు ఇందు కేర్పడినవే. ఇటువంటి పథకములను సూచించుటకును, వాటిని ప్రజాప్రతినిధులతో గూడి యున్న ప్రభుత్వము ఆమోదించిన తర్వాత అమలు జరుపుటకును సమర్థులగు ఉద్యోగులు సహాయ పడుదురు, ప్రభుత్వ కార్యాలయములందు పనిచేయు ఉద్యోగులతో పాటు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ప్రచారకులు, మొదలగు నిపుణుల తోడ్పాటు లేనిదే ప్రజాహిత కార్యములు సరిగ నెరవేరవు. ఇది ఇతర దేశములందు వలెనే మన దేశమునందు గూడ ఇపుడు గుర్తింపబడు చున్నది. ఉద్యోగులందరు తమతమ శక్తిరక్తుల నన్నిటిని వినియోగించి ప్రభుత్వ పథకములు ప్రజా క్షేమమును పెంపొందించునట్లు పాటుబడుదురు. అందుకై తమకుగల ప్రత్యేక మైన పరిజ్ఞానమును, పాలనానుభవమును వినియోగింతురు. కార్యదీక్షను, కార్యదక్షతను ప్రదర్శింతురు. ప్రభుత్వమునకును, ప్రజానీకమునకును, మధ్యవర్తులుగ నుండి ఒకరి సహాయ సానుభూతులను మరొకరికి అంద చేయుదురు.

అధికారవర్ధమువలన నష్టములు : అధికారవర్గపు పరిస్థితి విపరీత మైనపుడు దానివలన కొన్ని నష్టములు ఏర్పడును. అందుగమనింపదగినవి ఈ క్రింద పేర్కొనబడినవి :

ఉద్యోగులు తమకు లభించిన ప్రత్యేక మైన అధికార శక్తులను పురస్కరించుకొని అహంభావముతో విర్రవీగుదురు. ప్రజలు మంచి, చెడ్డలు తెలియని మూఢులనియు, తమచే పాలింపబడుటకు మాత్రమే అర్హులనియు వారు భావింతురు. అందువలన సామాన్య జనులను సోదర పౌరులుగ గాక, తమ సేవకులవలెగాని, ఆశ్రితులవలెగాని చూతురు. ప్రజల యెడ ప్రేమనుగాని, దయాదాక్షిణ్యములను గాని కనబరచరు. అందువలన ప్రజల అభిమానమును పొందనేరరు. ఇట్లు ప్రజలకును, అధికారులకును మధ్య నుండదగిన సానుభూతి సహకారములకు బదులుగ వైమనస్యము, వైరుధ్యము ప్రబలును. ఇది ప్రజాప్రభుత్వమునకు గొడ్డలిపెట్టు. ప్రభువుల నిరంకుశత్వము పోయిన తర్వాత వెలసిన అధికారవర్గ విజృంభణమును ఇంగ్లండు దేశమున "నూతన నిరంకుశత్వ" మనిరి. సామాన్య ప్రజయెడ కనబరచు అలక్ష్యభావము క్రమముగ తమకు పైనుండి పరిపాలనా చక్రమును త్రిప్పు ప్రజాప్రతినిధులపట్ల గూడ అధికారులు చూపుట కద్దు. చివరకు ఆవర్గములోని పైతరగతులవారు క్రిందితరగతుల వారినిగూడ పీడింప వెనుకాడరు. ఇట్టి విపరీతస్థితిలో మాన వత్వము నశించి, మాత్స్యన్యాయము ప్రబలును. పరిపాలనానుభవమును సంపాదించుకొనిన ఉద్యోగులకు స్వాతిశయముతో పాటు స్వార్థపరత్వముగూడ ఏర్పడును. పరిపాలనములో ప్రజాక్షేమముకన్న తమ వర్గము యొక్క లాభమునకు ఎక్కువప్రాధాన్యమును ఒసగజూతురు, తమ పదవులను, అధికారములను, ఆదాయములను నిలువబెట్టు కొనుటకును, వృద్ధిచేసికొనుటకును. అవినీతి మార్గములనుగూడ అవలంబింప యత్నింతురు. లంచగొండితనము, సమ్మె సన్నాహములు ఇందుకు సంబంధించినవి.

సంకుచితదృష్టి వీరి దుర్గుణములలో మరొకటి, ప్రభుత్వ కార్యకలాపములను నెరవేర్చుటలో తమకు తోచినట్లేగాని ఇతరులు సూచించినట్లు వర్తించుట వీరికి గిట్టదు. నిష్ప్రయోజనకరముగ కనబడినను ప్రాతపద్ధతులనే అవలంబింతురు గాని, క్రొత్తపద్ధతులను అనుసరింప యత్నింపరు. ఇందువలన వీరియందు సృజనాత్మకశక్తి సన్నగిల్లును.

దేశకాల పాత్రముల కనువుగ మారుట వీరికి మించిన పని. సామాన్య పరిస్థితులందు సరిగ పనిచేయగలరుగాని అసాధారణ పరిస్థితులందు (అనగా యుద్ధములు, కరవులు, కాటకములు చెల రేగినపుడు) ఈ అధికారులు అసమర్థులగుదురు.

సామాన్య సమయములందు నైతము వీరు కార్యాచరణ సందర్భమున చేయు కాలయాపన సహింపరానిది. ఒకరోజులో పూర్తి చేయదగు పనికి పదిరోజులు తీసికొనుట వీరి అలవాటు, ఇందుమూలముగ కాగితములమీద జరుగు క్రియాకలాపములు పెరుగును. కావుననే ఉద్యోగుల కార్యాచరణ విధానమును దస్త్రాల పెరుగుదల యనియు, ఆశాపాశమువలె అంతులేకుండా పెరుగు ఎఱ్ఱదారపు విధాన (Red Tapism) మనియు, హేళన చేయుదురు.

మొత్తముమీద ఇటువంటి పద్ధతులవలన కాలయాపన, వ్యయప్రయాసలు, అసంతృప్తి, అలజడి పెరుగును.

కర్తవ్యము : అధికారవర్గము వలన కొన్ని ప్రయోజనములును, కొన్ని అనర్థములును కలవని తెలిసికొంటిమి. అయితే ఆ వర్గము విషయమున అవలంబింపదగు విధానమేది ? అనర్థములను జూచి అంత మొందించనిచో శ్రేయోరాజ్యస్థాపనము సులభము గాదు. ప్రయోజనములను గాంచి దానిని విచ్చలవిడిగ వదలినచో ప్రజాస్వామ్యము సన్నగిల్లును. కావున దానిని అదుపు నందుంచదగును గాని అంత మొందింపరాదు; సంస్కరింపదగును గాని సంహరింపదగదు. అపుడు దానివలన ప్రయోజనములను పొంది, ప్రమాదములనుండి తప్పించుకొనవచ్చును.

సంస్కరించుటెట్లు ? ఉద్యోగులను నియమించునపుడు వారి సామర్థ్యము, శీలము, పరిగిణింపబడవలెను గాని, ఇతర విషయములు ( ఉదాహరణకు జాతి, మత, కుల భేదములు) పాటింపబడరాదు. న్యాయబుద్ధితో నియమింప వలెను గాని ఆశ్రితపక్షపాతముగాని, బంధుపక్షపాతము గాని పనికిరాదు. నియమించు అధికారము రాజకీయ ముఠాలకుగాక చట్టబద్ధముగ వర్తించు "పబ్లిక్ సర్విస్ కమిషన్ల " కు అప్పగింపబడవలెను. ఉద్యోగుల నియామకము మాత్రముగాక, వారి ప్రమోషన్లు, సెలవు సౌకర్యములు, క్రమశిక్షణము మొదలైనవి గూడ పై కమిషన్ల పర్య వేక్షణముక్రిందనుండవలెను. మొత్తముమీద ఉద్యోగులు అనుభవించు సౌకర్యములకును, వారుచేయు సేవకును, వీలయినంతవరకు సామ్యముండుట మంచిది. సంతృప్తికరముగ వ్యవహరించు అధికారులకు ఉచితమైన ప్రోత్సాహమును, అవినీతిపరులకు తగినశిక్షను ఇచ్చుచుండవలెను.

అధికారులు, శాసన సభలు, మంత్రివర్గములు మొదలగు ప్రభుత్వాంగములందుండి పరిపాలనా విధానములను నిర్ణయించు ప్రజాప్రతినిధుల యెడల తగిన వినయవిధేయతలతో వర్తించుట అవసరము. ప్రజాప్రతినిధులకు సరియగు సలహాలనిచ్చి, వారి నిర్ణయములను సక్రమముగ అమలుజరుప యత్నింపవలెను.

సామాన్య ప్రజలపట్ల అధికారులు స్నేహ సానుభూతులతో మెలగుట ఆవశ్యకము. తాము ప్రజల సేవకులమని గుర్తింపవలెను. ప్రజలను పీడించువారుగ మారగూడదు. అధికారులు శక్తితోబాటు సౌజన్యమును గూడ ప్రదర్శించుట యుక్తము.

ప్రజానాయకులతోను, ప్రజలతోను, సన్నిహితమై నట్టియు సక్రమమైనట్టియు సంబంధము అధికారుల కుండుటకుగాను ముఖ్యముగ అవసరమైనది వికేంద్రీకృత పరిపాలనము (Decentralised administration). అనుభవజ్ఞులు తెలిపినట్లు, కేంద్రీకృతపాలనము (Centralised administration) అధికారవర్గ విజృంభణమునకు దోహదమిచ్చును; వికేంద్రీకృత పాలనము ఆ జాడ్యమునకు విరుగుడుగ పనిచేయును.

ఇంతేగాక నేటి పరిస్థితులలో అధికారులు కార్యాచరణమునందు మాత్రమేగాక కొంతవరకు శాసననిర్మాణమునందును, న్యాయనిర్ణయమునందును గూడ పాల్గొనుట జరుగుచున్నది. ఇట్టిజోక్యమును సాధ్యమైనంతవరకు పరిమితము చేయుట ప్రజాస్వేచ్ఛకు శ్రేయస్కరము. ముఖ్యముగ కార్యనిర్వాహక వర్గమునకు చెందిన ఉద్యోగులు చేయు న్యాయనిర్ణయ కార్యములను సందర్భమునుబట్టి న్యాయస్థానములందలి న్యాయాధికారులు పరిశీలించుచుండుట క్షేమకరము.

అన్నిటికన్నను మిన్నయైనది మానసిక మైన మార్పు.అనగా అధికారులందు సోదరమానవుల యెడ ప్రేమ, ప్రజా సేవయం దనురక్తి, పరోపకారబుద్ధి, స్వార్థ త్యాగము మొదలగు సద్గుణములు పెంపొందవలెను.అధికారులు తమ అధికారమును దుర్వినియోగము చేయక, సద్వినియోగము చేయుటకై దృఢ సంకల్పముగల్గి, యథాశక్తిగ పాటుపడవలెను. ఇట్టి ప్రయత్నమునందు ప్రజానాయకులును, ప్రజలును గూడ వారికి అనుకూల పరిస్థితిని కల్పించి తోడ్పడవలయును.

సారాంశము : అధికారవర్గ సమస్య రాజకీయ, సాంఘిక, నైతిక, రంగములకు సంబంధించినది. అధికారవర్గము తమ అగ్ని వంటి శక్తిని అదుపునందుంచుకొనినచో, అది ప్రయోజనకరముగను, అదుపునందు లేకున్నచో, ప్రమాదకరముగను పరిణమించును. దానిని సక్రమముగ నుపయోగించుకొని సత్ఫలితములను పొందుటకుగాను ప్రజాసముదాయమునకు తెలివి తేటలు అవసరము. ఇక అధికారులు గూడ తమ మానవత్వమును, పౌరసత్వమును మరచిపోక, తమ వర్గము మొత్తము సంఘములో ఒక భాగము మాత్రమే యైయున్నదనియు, వర్గశ్రేయస్సు, సంఘశ్రేయస్సు మీద ఆధారపడి యున్నదనియు, రెంటికిని సంఘర్షము సంభవించినపుడు వర్గ క్షేమమును సంఘ క్షేమమునకై వినియోగింపవలెననియు, గ్రహించి వర్తింపవలెను. ఇందుకు అధికారులకు మనోనిగ్రహము, నైతికబలము ఆవశ్యకము. కాలక్రమమున వర్గరహిత సమాజము (classless society) ఏర్పడు పరిస్థితి వచ్చినపుడు, ఇతర వర్గములతోపాటు అధికార వర్గముకూడ దానియందు లీనము కాగలదు.

ఓ. స. మూ,

[[వర్గం:]] [[వర్గం:]]