Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అధికార పరావృత్తి - అధికార విభజనము

వికీసోర్స్ నుండి

అధికార పరావృత్తి - అధికార విభజనము :ప్రభుత్వము ప్రజల సౌఖ్యముకొరకు అనేక కార్యములను నెరవేర్చవలసి యున్నది. వీటిని నిర్వహించు నపుడు వివిధములైన అధికారములను అది చలాయించును. సక్రమముగా సాగుటకు, ఇవి సాధారణముగ రెండు విధములుగ విభజింపబడును. మొదటిది యధి కారములను, వాటివలన నెర వేరు కార్యముల యొక్క స్వభావమునుబట్టి ప్రభుత్వమందలి వివిధ అంగముల మధ్యను విభజించుట; రెండవది, అధికారములను, అవి వర్తించు ప్రదేశము (Territory) ను బట్టి జాతీయ (National), రాష్ట్రీయ (Provincial), స్థానిక (local) ప్రభుత్వముల నడుమ విభజించుట. మొదటిదానిని అధికారపరావృత్తి (Separation of Powers) అనియు, రెండవ దానిని అధికార విభజనము (Division of Powers) అనియు అందురు. అయితే ఈ రెంటియందును జరుగునది అధికార విభజనమే గాన, వాటిని అధికార విభజనము పేర వర్ణింపవచ్చును.

ప్రాముఖ్యము : రాజ్యపరిపాలనలో అధికార విభజనము అతిప్రాముఖ్యముకలది. అది సక్రమముగ నున్నచో పరిపాలన సుష్ఠు (efficient) గా సాగును, ప్రజలకు స్వేచ్ఛ (liberty) లభించును. లేనిచో ఈ పరమ ప్రయోజనములకు భంగము కల్గును. కావున పైన సూచించిన రెండు అధికార విభజన పద్ధతులను సరిగా బోధచేసికొని, అవలంబించుట ఆవశ్యకము.

అధికార పరావృత్తి లేక విభజనము (Separation of Powers); అర్థము : ప్రభుత్వమునకు గల అధికారములు ముఖ్యముగ మూడు రకములు. అవి శాసననిర్మాణము (Law making), కార్యనిర్వహణము (Law enforcing), న్యాయనిర్ణయము (Law interpreting). వీటిలో ఒక్కొక దానిని ఒక్కొక ప్రభుత్వ అంగము (లేక శాఖ లేక భాగము) నిర్వహించును. అనగా శాసన నిర్మాణమును శాసనసభయు (Legislature); కార్యనిర్వహణమును కార్యనిర్వాహక వర్గమును (Executive); న్యాయ నిర్ణయమును న్యాయస్థానమును (Judiciary) నిర్వహించును. ఇట్లు మూడు రకములైన అధికారములును మూడు ప్రభుత్వభాగముల మధ్య విభజింపబడి, వాటిచే ప్రత్యేకముగ నిర్వహింపబడు పద్ధతిని అధికార విభజనము అందురు.

పుట్టు పూర్వోత్తరములు : అరిస్టాటిలు మొదలు నేటి వరకు పెక్కుమంది రాజనీతిశాస్త్రజ్ఞులు అధికార విభజనము యొక్క స్వరూప స్వభావములను వివిధరీతుల తీర్చిదిద్దిరి. వీరిలో 18 వ శతాబ్దమున ఫ్రాన్సు దేశము నందున్న మాంటెస్క్యూ ప్రముఖుడు.

మాంటెస్యూ సిద్ధాంతము: అధికార విభజనము విశేష వ్యాప్తిలోనికి వచ్చినది మాంటెస్క్యూ పండితుని వలన గాన, అతని సిద్ధాంతమును కొంతవరకు ఇచట విచారింతము. శాసననిర్మాణము, కార్యనిర్వహణము, న్యాయ నిర్ణయము అను మూడు రకములైన అధికారములును మూడు ప్రత్యేక ప్రభుత్వ భాగములమధ్య స్పష్టముగ విభజింపబడి, ఆయాభాగములచే ప్రత్యేకముగను, స్వతంత్రముగను, నిర్వహింప బడవలెను. అపుడే ప్రజలకు స్వేచ్ఛ సిద్ధించును. ఇదే అతని సిద్ధాంత మందలి సారాంశము.

మాంటెస్క్యూ సిద్ధాంతమందలి లోపములు : తన సిద్ధాంతమునకు నిదర్శనముగ మాంటెస్క్యూ ఇంగ్లండు నందలి పాలనావిధానమును పేర్కొనెను. అయితే, ఇంగ్లండునందు ఆతని కాలమునగాని, తరువాతగాని, ఆతడనుకొనిన అధికార విభజనములేదు. పార్లమెంటరీ విధానము (parliamentary System) నందు, శాసనసభయు, కార్యనిర్వాహక వర్గమునకు చెందిన మంత్రివర్గమును, విడిగా నుండక కలిసి మెలిసి యుండును. అయినను ఇందువలన స్వేచ్ఛా జీవనమునకు భంగము కలుగదు. పై రెండు శాఖలును ప్రత్యేకముగ నుండునట్లు ఏర్పాటుచేయబడిన అధ్యక్ష విధానము (Presidential System) నందుగూడ విభజనమునకు తోడుగ కొంత సమన్వయము (Co-ordination) ను పాటింపక తప్పలేదు. ఇక కార్యనిర్వహణ, న్యాయనిర్వహణ శాఖల మధ్యగూడ విభజనము మాత్రమే గాక కొంత పరస్పర సంబంధముండుటయే శ్రేయస్కరమని అమెరికా, ఇంగ్లండు, దేశములలోని న్యాయ నిర్వహణ విధానములు వ్యక్తము చేయును.

ఇంతకు తేలినదేమనగా - స్వేచ్ఛ, మాంటెస్క్యూ నిర్ణయించినట్టి అధికార విభజనము మీద మాత్రమే ఆధారపడి యుండదు; అధికార విభజనమునకు తోడుగ సమన్వయము గూడ కొంతవరకు స్వేచ్ఛకు దోహదముగ నుండును. అధికార విభజనము గతకాలపు నిరంకుశ ప్రభుత్వము (Despotic Government) నందలి పరిస్థితులకు సరిపడునంతగా నేటి ప్రజాప్రభుత్వము (Democratic Government) నందలి స్థితిగతులకు వర్తించదు.

మాంటెస్క్యూ సిద్ధాంతమందలి గుణములు : పై విమర్శనము, మాంటెస్క్యూ పండితుడు అధికార విభజనము పూర్తిగా నుండవలెననియు, ఆ యధికారములను చలాయించు ప్రభుత్వశాఖలు పూర్తిగా ప్రత్యేకముగ నుండవలెననియు, వాటిమధ్య సహకారము ఉండగూడదనియు, నిర్ణయించెనను ఊహపై ఆధారపడియున్నది. అతడు అట్లే అభిప్రాయ పడెనా లేదా అనునది వివాదగ్రస్తమైనది. కొందరు పండితులు అతడు ప్రభుత్వశాఖల మధ్య పూర్తి విభజనమును కోరలేదనియు, కొంతవరకు మాత్రమే కోరెననియు వాదింతురు. ఇట్లు పరిమిత విభజనమును మాత్రమే సూచించునదిగా గ్రహించిన యెడల మాంటెస్క్యూ సిద్ధాంతము ఆచరణయోగ్యమును, అభిలషణీయమును అగును. దానివలన ప్రభుత్వోద్యోగులు తమ విధులను శక్తిసామర్థ్యములతో నెర వేర్చుచు, తమ అధికారములను బాధ్యతాసహితముగ చలాయించుటయు ప్రజలు తమ న్యాయ సమ్మతమైన హక్కులను నిరాటంకముగ అనుభవించుటయు సంభవించును.

నేటి రాజ్యములందున్న అధికార విభజనము : పైన సూచించిన పరిమిత మైన అధికార విభజనము ప్రయోజనకారి గనుక నే అట్టి పద్ధతి నేటి రాజ్యములందు, తరతమ భేదములతో అనుసరింపబడుచున్నది. అనగా శాసనసభ, కార్యనిర్వాహక వర్గము, న్యాయస్థానములు ప్రత్యేక ప్రభుత్వ సంస్థలుగ నుండును. అవి సాధారణముగ ప్రత్యేకముగ పనిచేసినను, అవసరమగు నంతవరకు అన్యోన్యముగ గూడ మెలగును. ఒక్కొక్క శాఖ తన ప్రధాన కార్యముతో బాటు ఇతర కార్యములను గూడ కొంతవరకు నెరవేర్చును. శాసనసభ ప్రధానముగ శాసన నిర్మాణము నొనర్చుచు, కార్యనిర్వాహక వర్గము చేయు పనులపై సమీక్ష, ఆదాయవ్యయముల పై అజమాయిషీ, కొన్ని విషయములందు న్యాయ నిర్ణయము చేయును. కార్యనిర్వాహకవర్గము తన ముఖ్య విధియగు కార్యనిర్వహణముతోబాటు శాసననిర్మాణ కార్యమును సరిదిద్దుచు, న్యాయమూర్తులను నియమించుచు నుండును. ఇక న్యాయస్థానము అందలి న్యాయమూర్తులు న్యాయనిర్ణయ సందర్భమున న్యాయచట్టములపై వ్యాఖ్యానించి, న్యాయశాస్త్రమును తీర్చిదిద్దుదురు. శాసనసభ, కార్య నిర్వాహక వర్గముల అధికార పరిమితిని నిర్ణయించును. ఇట్లు ప్రభుత్వ-అధి కారముల మధ్యను, వాటిని నిర్వహించు ప్రభుత్వశాఖల మధ్యను, కల విభజనము పూర్తిగకాక పరిమితముగనే యున్నది. అయితే, శాసనసభ, కార్యనిర్వాహక వర్గముల మధ్యగల విభజనము పార్లమెంటరీ పద్ధతి ననుసరించు ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలైన దేశములందు తక్కువగను, ప్రెసిడెంటు పద్ధతి నవలంభించు అమెరికా సంయుక్త రాష్ట్రము లందు ఎక్కువగను ఉండును. స్వతంత్ర భారతదేశము చాలవరకు ఇంగ్లీషువిధానమునే అవలంబించినది.

అధికార విభజనము (Division of Powers) : ఇపుడు అధికార విభజనమను పేర అధికారములు రాజ్యము నందలి వివిధ ప్రదేశములు (Areas) మధ్యను విభజింపబడుట వర్ణింపబడును. ఇది భౌగోళికముగా (Territorial) చేయబడు విభజనము. దీనిని అధికార వికేంద్రీకరణము (Decentralisation of Power) అనవచ్చును.

వివిధభాగముల మధ్య విభజనము: ప్రదేశముననుసరించి ప్రభుత్వపు అధికారములను విభజించు పద్ధతిని సామా న్యముగను, స్థూలముగను ఇట్లు సూచింపవచ్చును.

ప్రభుత్వము నెరవేర్చు విధుల (functions) లో కొన్ని రాజ్యమున కంతకును సమానముగా ప్రాముఖ్యము కలవి. ఉదా : విదేశీ వ్యవహారములు, దేశరక్షణము,రవాణా సౌకర్యములు మొదలైనవి. వీటికి సంబంధించిన అధికారములు దేశమున కంతకును ప్రాతినిధ్యము వహించు జాతీయ లేక కేంద్ర ప్రభుత్వమునకు అప్పగింపబడును. కొన్ని వ్యవహారములు దేశమందలి వివిధ భాగములందు లేక ప్రాంతములందు ఒకేవిధముగ గాక వేర్వేరుగ నిర్వహింపబడవలసి యుండును. ఉదా : వ్యవసాయము, విద్య, వైద్యము, మొదలైనవి. వీటికి సంబంధించిన అధికారములు రాష్ట్ర ప్రభుత్వములకు ఒసగ బడును. ఈ ప్రభుత్వ భాగములను రాష్ట్రములనియు, రాజ్యములనియు, ఇంకా ఇతర పేర్లతోను పిలుతురు. మరికొన్ని పనులు దేశమున కంతకునుగాక, రాష్ట్రములకునుగాక, అంతకన్న చిన్నవైన పట్టణములకో, పల్లెలకో సంబంధించినవి. ఉదా : మంచినీటిసరఫరా, మురుగు నీటిపారుదల, ప్రాథమిక పాఠశాలలు, ప్రజారోగ్య సౌకర్యములు. మొదలగునవి. వీటిని నెర వేర్చుటకు తగిన అధికారములు స్థానిక సంస్థల కొసగబడును. ఇట్లు పాలనాధికారములు జాతీయ, రాష్ట్రీయ, స్థానిక ప్రభుత్వముల మధ్య ప్రత్యేకింపబడును. పైమూడు ప్రభుత్వ భాగములకు నడుమ మరికొన్ని విభాగములు గూడ నుండవచ్చును. ఉదా : మన దేశమందున్న జిల్లాలు.

పై అధికార విభజనము భిన్న రాజ్యములందు భిన్న రీతుల నుండును. వీటిని గురించి వివిధ ప్రభుత్వ వ్యవస్థల సందర్భమున విపులముగ తెలిసికొనవచ్చును. కావున అవి ఇచట సూక్ష్మముగ సూచింపబడును.

జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వముల నడుమనుండు అధికార విభజనము ఫెడరల్ (Federal) వ్యవస్థయందు ఒక రకముగను, యూనిటరీ (Unitary) విధానమందు మరొక విధముగను ఉండును. ఫెడరల్ రాజ్యములందు అధికార విభజనము చాల నిష్కర్షగ నుండును. అనగా అది లిఖిత రూపమున నున్నట్టిదియు, సులభముగ మారనట్టిదియునై యున్న రాజ్యాంగ చట్టములో పొందు పరచబడియుండును. ఈ విభజనమునకు భంగము కలుగకుండ కాపాడుటకును, దానికి సంబంధించిన వివాదములను పరిష్కరించుటకును, స్వతంత్రమైన, ఉన్నతమైన న్యాయస్థానము స్థాపింప బడును. విభజన ఫలితముగ రాష్ట్ర ప్రభుత్వములకు రాష్ట్రీయ వ్యవహారములను నెరవేర్చుకొనుటలో, సాధారణముగ స్వాతంత్య్రము ఉండును. ఇట్టి విభజనము కొన్ని తారతమ్యములతో ఆమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా మొదలైన రాజ్యములలో కాననగును. ఇక యూనిటరీ విధానము ననుసరించు ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలగు దేశములలో అధికార విభజనము ఇంత కట్టుదిట్టముగనుండదు. ప్రాంతము అందున్న పాలనాసంస్థలకుగాని, ప్రభుత్వములకుగాని తమ వ్యవహారములను పరిష్కరించుకొనుటలో సిద్ధాంతదృష్ట్యా అంత స్వేచ్ఛయుండదు. ప్రాంతీయపాలనము న్యాయ రీత్యా కేంద్రప్రభుత్వపు అదుపు ఆజ్ఞలకు లోనై ఉండును.

ఇపుడు రాష్ట్రీయ, స్థానిక ప్రభుత్వభాగముల మధ్య నుండు అధికార విభజనమును గమనింతము. రాజ్యాంగ చట్టము నందుగాక, సాధారణ న్యాయ చట్టము లందు రూపొందింపబడును. స్థానిక సంస్థలు ఫెడరల్ రాజ్యములందు రాష్ట్ర ప్రభుత్వపు అజమాయిషీకిని, యూనిటరీ రాజ్యములందు కేంద్ర ప్రభుత్వపు అజమాయిషీకిని లోబడియుండును. స్థానిక పాలనము నెడల పై ప్రభుత్వము చలాయించు అధికారము యొక్క పరిమితియు, స్థానిక సంస్థలనుభవించు స్వేచ్ఛ యొక్క పరిమితియు, వివిధ రాజ్యములందు వివిధముగ నుండును. ఇంగ్లండు, ఫ్రాన్సు దేశములు రెండును యూనిటరీ విధానము నవలంబించియున్నను, ఇంగ్లండునందు ఫ్రాన్సులో కన్న యెక్కువగా స్థానిక పాలనమునందు స్వేచ్ఛగలదు. యథార్థముగ చూచినచో ఇంగ్లండు నందలి స్థానిక స్వపరిపాలనము ఫెడరల్ వ్యవస్థను గల్గియున్న అమెరికా సంయుక్త రాష్ట్రములలో నున్న దానిలో సరితూగ గలదు. దక్షిణ అమెరికాయందలి కొన్ని ఫెడరల్ రాజ్యములలో కాననగు స్థానిక స్వపరిపాలనము ఇతర ఫెడరల్ రాజ్యములలో నున్న దానికన్న స్వల్పము. ఇక స్వతంత్ర భారతదేశపు పాలనా విధానమునందు అధికార వికేంద్రీకరణము ఒక ప్రధానమైన లక్ష్యముగను, లక్షణముగను గూడ నున్నది. నేటి గ్రామపంచాయితీలు ఇందుకు నిదర్శనము.

ఉపసంహారము : అధికారము వివిధ ప్రభుత్వశాఖల నడుమ విభజింపబడుటయు, వివిధ ప్రదేశ ప్రభుత్వముల మధ్య వికేంద్రీకరింప బడుటయు, ప్రయోజనకరమనునది నిర్వివాదాంశము. అందువలన ప్రభుత్వమునకు పటుత్వము (efficiency) ను, ప్రజలకు స్వేచ్ఛ (liberty) యు లభించును. అయితే పై విషయములందు అధికార విభజనము పరిమితముగ నున్నప్పుడే, ఈ ప్రయోజనములు చేకూరును; వివరీతముగ నున్నప్పుడు చేకూరవు. అనగా అధికార విభజనము అత్యధిక మైనచో అరాజకత్వము (Anarchy) ను, అత్యల్పమైనచో నిరంకుశత్వము (Tyranny) ను ఏర్పడును. అతి సర్వత్ర వర్జయేత్' అను ఆర్యోక్తి అధికార విభజనమునకు గూడ వర్తించును. తగు పరిమితిని తెలిసికొని దానిని అవలంబింపదగును. అధికార విభజనము సుపరిపాలనమునకు సాధనము మాత్రమే అని గ్రహించి, దానిని దేశ కాల పాత్రముల కనువుగ సంస్కరించి, అనుసరించుట శ్రేయోదాయకము,

ఓ. స. మూ.

[[వర్గం:]] [[వర్గం:]]