Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్దె

వికీసోర్స్ నుండి

అద్దె (Rent) :- చదువరి ముఖ్యముగా విద్యార్థి యగుచో సరకుల ఉత్పత్తి, వాటిని తయారుచేయుట కగు ఖర్చులు, బజారులో వాటి ఖరీదులు - ఈ అంశముల నడుమగల సంబంధములు స్పష్టీకరించు సిద్ధాంతమును తెలిసికొనుటకు కుతూహలమును ప్రదర్శించును.

ఖర్చులు మొత్తమును నిశ్చయించు సిద్ధాంతము కొన్ని సూత్రముల ననుసరించి పనిచేయును. నిర్దిష్టమగు ఖర్చులు, మారు ఖర్చులు, అను ఖర్చుల మధ్యగల తారతమ్యము అల్పకాల వ్యవధికిమాత్రమే వర్తించు అంశమనునది ఒక సూత్రము. మారుచున్న ఉత్పత్తితో కలిసి మారనిఖర్చులు నిర్దిష్టమగు ఖర్చులు. పారిశ్రామికవేత్త కల్గియుండిన ఉత్పత్తి సాధనములు, వేరు అవకాశములు లభించునెడల సంపాదింపగల ధనరూపమైన సంపాదనలు, పారిశ్రామిక వేత్త ఇతరుల కొసంగవలసిన నిర్దిష్టమగు ఖర్చులుకూడ నిర్దిష్టమగు ఖర్చులుగనే ఎంచబడును. నిర్దిష్టమగు ఖర్చులు అనునది తప్పక రాబట్టవలసిన ఖర్చులు ఇవి యను అంశమును తెలియజేయునదని అనుకొనవచ్చును. కాని అల్ప వ్యవధికి సంబంధించినంతవరకు ఇది నిజము కాదు. ఏలయన, ఒక పారిశ్రామిక వేత్త తన పెట్టుబడి పై గాని తన కృషిఫలితముగా కాని అల్ప వ్యవధియందు ఏమియు సంపాదింపకుండినను పరిశ్రమ సాగుచునే యుండవచ్చును. ముఖ్యమగు ఖర్చులను రాబట్టగల్గిన పక్షమున, పరిశ్రమ కొంతకాలమువరకు సాగుటకు ఎట్టి అడ్డంకులును ఉండవు. కొలదిగనైనను గొప్పగనైనను ఉత్పత్తి జరుగుటకు అల్పవ్యవధియందు సైతము రాబట్టబడవలసిన ముఖ్యమగు ఖర్చులు కొన్ని గలవు. అన్ని విధములైన మారుచుండు ఖర్చులు, కొన్ని నిర్దిష్టమగు ఖర్చులు, ముఖ్యమగు ఖర్చుల క్రిందకు వచ్చును. ముఖ్యమగు ఖర్చుల జాబితాలోనికి వచ్చు నిర్దిష్టమగు ఖర్చులకు ఉదాహరణము.' కార్యాలయోద్యోగుల కొసంగు వేతనములను పేర్కొన వచ్చును. తక్కిన నిర్దిష్టమగు ఖర్చులను ఉపఖర్చులు అందుము. మొత్తముమీద ఎప్పటికో అప్పటికి నిర్దిష్టమగు ఖర్చులకు, మారు ఖర్చులనుకూడ ప్రతి పారిశ్రామిక వేత్త రాబట్టవలసినదే. కానిపక్షమున ఆ పారిశ్రామిక సంస్థ వ్యాపారరంగమున నుండజాలదు.

'ఒక వస్తువు తయారుచేయబడిన తరువాత, ఆవస్తువునకు గల అపేక్షలో కల్గు మార్పులననుసరించి దాని మూల్యము మారుచుండు నప్పటికి సామాన్యముగా ప్రతి వస్తువు ఖరీదు దాని ఉత్ప త్తికగు ఖర్చునుబట్టి నిర్ణయింపబడునను ఊహ సర్వసాధారణమైనది. ఉత్పత్తికగు ఖర్చులో పారిశ్రామిక వేత్త యొక్క లాభముకూడ ఇమిడియున్నదని దీని భావము. కాని పారిశ్రామిక వేత్త యొక్క లాభము, వేరువేరు సమయముల యందు వస్తువు యొక్క ఖరీదులో కలుగు మార్పుల ననుసరించి మార్పు చెందుచుండును. ఇంతేగాక ఉత్పత్తి పరిమితి, తయారు చేయబడుచున్న ఆ వస్తువు యొక్క అపేక్షపై ఆధారపడి యుండగా, ఉత్పత్తి పరిమితి ననుసరించియే ఉత్పత్తికగు ఖర్చు మారుచుండును. కావున తయారైన వస్తువుల ధరలు ఖర్చులవలనగాని, ఖర్చులు తయారైన వస్తువుల ధరలవలనగాని నిర్ణయింపబడజాలవు. ధరలన్నియు పరస్పరము ఒకదాని పై నొకటి ఆధారపడుచుండును.

కొన్ని ఖర్చులయందు అర్థశాస్త్రమున 'అద్దె' అని వ్యవహరింపబడు దాని లక్షణములు కననగును. ఉత్పత్తి సాధనములు పరిశ్రమయందు నిలచియుండుటకు గాను వెచ్చింపనవసరములేని మొత్తములను 'అద్దె' అని అందుము.

అర్థశాస్త్రమున మనము 'అద్దె' అని వ్యవహరించునది ఉత్పన్నమగుటకు కారణము. అద్దెను ఆర్థికఫలముగా సంపాదించు ఉత్పత్తి సాధనము యొక్క పరిమితి దానికి గల అపేక్షతో వచ్చు మార్పులకు అనుగుణముగా ఎట్టి మార్పును పొందలేకుండుటయే. ఏదేని ఒక ఉత్పత్తి సాధనము యొక్క యూనిట్ అది ప్రస్తుతము ఏ వృత్తి యందు గలదో ఆ వృత్తియందు; అనియుండుటకుగాను అవసరమైన కనీసపు మొత్తముకన్న ఎక్కువ ఆదాయ మును సంపాదించుచున్నచో, దాని సప్లయి వెలకన్న అదనముగా వచ్చు రాబడి అర్థశాస్త్రమున అద్దె అని పిలువబడును. మరియు ఒక ఉత్పత్తి సాధనము యొక్క సప్లయి సంపూర్ణస్థితి స్థాపకతకన్న తక్కువగా నున్నప్పుడే అద్దె ఏర్పడుటకు వీలగును.

ఇట్టి తరగతికే చెందిన అదనపు రాబడి లేక అద్దె ఇతర ఉత్పత్తి సాధనముల యొక్క కొన్ని యూనిట్లుకూడ పొందు చుండుట మనము చూడవచ్చును. ఏదేని ఒక ఉత్పత్తి సాధనము యొక్క సప్లయి సంపూర్ణస్థితి స్థాపకత కన్న తక్కువగాకున్నప్పుడే అదై ఏర్పడుననుట దీని అర్ధము. ఒక ఉత్పత్తి సాధనము యొక్క సప్లయి సంపూర్ణ స్థితి స్థాపకతకన్న తక్కువగా నున్నపుడు, లేదా, కనీసపు సప్లయి వెలకే పని చేయుటకు సిద్ధపడు ఒక ఉత్పత్తి సాధనము యొక్క యూనిట్లకు మించి ఎక్కువ యూనిట్లను ఉప యోగింపగలుగునంతటి అపేక్ష ఆ ఉత్పత్తి సాధనమునకు ఉన్నప్పుడు అదే ఏర్పడునని చెప్పవచ్చును.

సాంఘికదృష్ట్యా 'అద్దె' అర్థము : 'భూమి' పై వచ్చు 'అద్దె' కు సంబంధించిన ఆర్థికాంశములను సరిగా వివరించుటకు, భూమి యొక్క ఆర్థికోపయోగములు వాటికి గల అపేక్షకు సంబంధించినంతవరకు వాటి వినియోగమునకు గాను ప్రతిఫలము ముట్టచెప్పవలసినంత కొరతగా నున్నవని మనము చూపగలిగి యుండవలెను.

భూమి అద్దె నొసంగునని చెప్పుటలోగల అర్థమిది :

భూమియొక్క సప్లయి అనగా (1) ఒక ప్రత్యేక మైన ఉపయోగమునకుగాను కేటాయింపబడిన భూమిసప్లయి, (2) యావత్ప్రపంచమునందలి భూమి యొక్క విస్తీర్ణము,(3) ఒక దేశమునందలిగాని ఒక జిల్లాయందలి గాని భూమి యొక్క మొత్తము విస్తీర్ణము.

మొదటి అంశము - భూమి యొక్క ఉపయోగమునకై గల అపేక్షలోని పెరుగుదలను ఇంతవరకు ఇతర ఉపయోగములకు గాను వినియోగింపబడుచున్న కొంత భూమిని అపేక్ష పెరిగిన ఆ ప్రత్యేకోపయోగమునకు మార్చుటవలన పరిష్కరింప వచ్చును. ఇట్లే ఇతర ఉపయోగముల విషయమునందు సైతము అపేక్ష పెరుగుదల తగ్గుదలలు, వినియోగమును ప్రత్యేకోపయోగములకు మార్చుటవలన సులభముగా ఎదుర్కొన వచ్చును.

రెండవ అంశము - ప్రపంచమునందలి భూమి యొక్క మొత్తము విస్తీర్ణము ఇంచుమించుగా మార్పజాలనిది. భూమి కై గల అ పేరులోని పెరుగుదల భూస్వాముల రాబడి అధికము చేయునని, తద్వ్యతిరేకముగా తగ్గుదల వారి రాబడిని తగ్గించునని దీని అర్థము. శ్రమవిషయమునందును ఇట్లే భూమి యొక్క గాని శ్రమ యొక్కగాని సప్లయి ప్రత్యేకోపయోగములకు మాత్రమే అధికము చేయబడ వచ్చును, తగ్గింపబడవచ్చును.

మూడవ అంశము- ప్రతి ఒక్క ప్రత్యేక మైన ఎకరము యొక్క భౌగోళికస్థానము నిర్ణీతము అను విషయము చాల ముఖ్యమైనది. 'గోదుమలకు' అపేక్షలో కలిగిన పెరుగుదల వేరొక ప్రదేశమునందు భూమి గోదుమల సేద్యమునకు వినియోగింపబడుచున్నదని అర్థము. ఇతర ప్రదేశములయందును గోదుమలు పండింపగల్గి నందువలనను, వారి గోదుమలకు పోటీగా ఇతరులును గోదుమలు అమ్మకలిగినందువలనను ఆ జిల్లాయందలి భూస్వాములు మునుపటి కంటె విశేషించి హెచ్చు రాబడిని పొందజాలక పోవచ్చును. కాని ఆ ప్రత్యేకము జిల్లాకు సంబంధించి నంతవరకు భూమి అపేక్షయందు కలిగిన పెరుగుదలను ఇతరప్రదేశముల యందలి భూమి తీర్పజాలదు.

భూమి అంతయు ఒకే వస్తువును ఉత్పత్తిచేయుటకు వీలైనదిగా ఉండినను, మరియు పూర్తి పోటీ విధానము క్రింద నుండి, భూమి అంతయు ఒకే ఉత్పత్తి శక్తిని కలిగి యుండినను, ఆ వస్తువునకై హెచ్చగు చున్న అపేక్షను భూమి అంతయు వినియోగము క్రిందకు వచ్చునంత వరకు కనీసపు సరాసరి యూనిట్ ఖర్చుల మొత్తపు బిందువువద్ద ఉత్పత్తిచేయు హెచ్చయిన పారిశ్రామిక సంస్థలు తీర్పగలవు. . భూమి అంతయు వినియోగము క్రిందకు తేబడునంత వరకు భూమి కొరతగానున్న ఉత్పత్తి ఆ వస్తువుధర పరిశ్రమయందలి అన్ని పారిశ్రామిక సంస్థల కనీసపు సరాసరి యూనిట్ ఖర్చుల మొత్తమునకు సమానమై యుండి భూమి యజమానునకు అద్దె పేరున చెందు అదనపు రాబడి ఏమియునుండదు.

భూమి అంతయు ఉపయోగము క్రిందనుండి, ఆ వస్తువునకుగల అపేక్ష ఇంకను హెచ్చగుచో భూమిని ఎక్కువ చేయుటవలన ఉత్పత్తిని అధికము చేయజాలము. ఇతర సాధనముకాదు. ఉత్ప త్తిసాధనముల వినియోగమును, అధికము చేయజాలని నిర్ణీతమైన భూమి వినియోగమునకు జోడించుటవలననే ఉత్పత్తి ఎక్కువగును. విషమ నిష్పత్తుల ఉత్పత్తి సూత్రము అమలు జరుగును.

భూమి అంతయు ఉపయోగము క్రింద నున్న తరువాత మిక్కిలి తక్కువ ఖర్చుల కలయికతో ఉత్పత్తి చేయగలిగిన దానికన్న విశేషముగా నొక వస్తువును ప్రజలు వాంఛించుచున్న యెడల వారు మార్జినలు ఖర్చుకు సమమైన ఖరీదు నొసంగవలసినవా రగుదురు. ప్రతి ఉత్పత్తిదారుడును వస్తువు ఖరీదు మార్జినల్ ఖర్చుతో సమమగు నంతవరకు ఉత్పత్తిని సాగించును. కాని ఈ ఉత్పత్తివద్ద సరాసరి యూనిట్టు ఖర్చుల మొత్తము వస్తువు ఖరీదుకన్న తక్కువగా నుండును. మరియు మొత్తమురాబడి, మొత్తము ఖర్చుకన్న ఎక్కువ. ఖర్చులను మించిన అదనపు రాబడి ఇచ్చట కలుగుచున్నది. మార్జినలు రాబడి మార్జినలు ఖరీదులు సరిసమానముగా నుండి ప్రతి పారిశ్రామిక సంస్థయు నిశ్చలతను పొందును. ఉపయోగించుటకు వేరుగా భూమిలేనందున, ఈ అదనపు రాబడికి ఆశపడి క్రొత్త పారిశ్రామిక సంస్థలు పారిశ్రామిక రంగమును ప్రవేశింపజాలవు. పరిశ్రమయు నిశ్చలతను పొందును. ఈ అదనపు రాబడియే అర్థశాస్త్రమున చెప్పబడు భూమియొక్క అద్దె.

వ్యత్యాసమును సూచించు అద్దె : ఒకేవిధమైన ఉత్పత్తి, శక్తి, సారము భూమికంతకు గలదను మన ఊహను తొలగించి వివిధములగు తరగతులకు చెందిన భూమిగలదను వాదమును అంగీకరించినను మన పరిశీలన తప్పు కానేరదు. స్వల్ప వివరణము మాత్రము అవసరమగును.

ఒకే పరిశ్రమ యందు అద్దె : పరిశ్రమ వ్యాప్తి చెంది, ఎక్కువగా పెరిగిపోవుచున్న భూమి యొక్క ఇతర ఉపయోగముల నుండి దానిని విడుదల చేయవలసిన అవసర మేర్పడినప్పుడు భూమి వినియోగమునకుగాను ఆ పరిశ్రమ చెల్లించవలసిన మూల్యము పెరిగి పోవును. ఆ పరిశ్రమ చెల్లించవలసిన ప్రతి భూ విభాగము యొక్క కనీసపు సప్లయి ఖరీదు ఆ భూమి మిక్కిలి ఎక్కువ విలువైన తన ప్రత్యామ్నాయపు ఉపయోగమునకు సంపాదింపగల " ద్రవ్యమునకు సమానమగును. ఆ పరిశ్రమ యందలి ఉపయోగమునకై భూమి బదిలీచేయబడుటకు అవసరమైన ఖరీదును భూమి యొక్క పెట్టు ధర అని పిలువవచ్చును. భూమి హెచ్చుగా ఉపయోగింపబడుచున్న కొలది భూమి యొక్క బదిలీ చేయబడిన ఉపయోగపు వెల అధికమగుచు భూమియొక్క ఆ పెట్టు ధర పరిశ్రమకు ఉత్పత్తి ఖర్చుగా పరిగణింపబడి, ఆ పరిశ్రమ యందే అద్దె అని మనము వ్యవహరించు అదనపు రాబడి సంభవమగును.

పారిశ్రామిక సంస్థ దృష్ట్యా అద్దె: పారిశ్రామిక సంస్థ దృష్ట్యా అన్ని ఉత్ప త్తిసాధనముల అద్దెలు ఉత్పత్తి ఖర్చులు గనే పరిగణింపబడవలయును. ఒక పారిశ్రామిక సంస్థ భూమిని ఇతరుల నుండి బాడుగకు తీసికొనినచో అది ధన రూపమున చెల్లింపవలసిన అద్దె ఖర్చుగా కనుపించుచునే యున్నది. భూమి యజమానుడే దానిని ఉత్పత్తి సాధన ముగా వినియోగించినచో దాని నతడు ఇతరులకు బాడుగకు ఒసంగిన యెడల సంపాదింపకలిగిన ద్రవ్యమంతయు అవకాశపు ఖర్చు అగును. అవకాశములలోని తేడాలు కారణముగా నేర్పడు అద్దెను "పారిశ్రామిక సంస్థ దృష్ట్యా అద్దె" అని చెప్పవచ్చును.

స్థానపు విలువ: ఒకే ఉత్పత్తి శక్తిని కలిగియున్నరెండుభూముల విషయములో (ఉత్ప త్తిఖర్చులు రెండింటి యందును సమానమని అర్థము.) అంగడికి అతి సామీప్యమున గల భూమి ఎక్కువ సంపాదన కలిగినదగును. బజారుకు సరకును రవాణా చేయుట కగు ఖర్చులలో గల తారతమ్యమే దీనికి కారణము. భూమి యొక్క స్థాన లాభమువలన అదనముగా వచ్చు అద్దెను 'స్థానపు విలువ' అని పిలువవచ్చును.

ఒక చిల్లర వ్యాపారస్థుని కిరాణా అంగడి యొక్క స్థానపు విలువను ఇట్లు పేర్కొననగును. ఆస్థలమునందు ఎక్కువ వ్యాపారము జరుగగలదు కావుననో, లేదా ఆ స్థలమునందు వ్యాపారస్థులనుండి ప్రజలు ఎక్కువ ఖరీదునకే సరకులు కొనుటకు ఇష్టపడుట వలననో చిల్లర వ్యాపారస్థులకు అద్దె ఏర్పడుచున్నది. పై అంశమునకే సంబంధించిన మరియొక స్థానపు విలువకు తార్కాణముగా ఇతర ప్రదేశముల యందు అంతే వ్యాపారము చేయుట కగు ఎక్కువ ఎడ్వర్టయిజుమెంటు ఖర్చులను ఉదాహరింపవచ్చును. పట్టణ ప్రదేశముల అద్దె : పట్టణ ప్రదేశముల స్థానపు విలువ యందు ఒక ప్రత్యేకమైన మొనావలీ (గుత్త) లక్షణమును చూడవచ్చును. అలవాటు వలననో బద్ధకము వలననో తమకు అనువగు స్థలములందే వ్యాపారము చేయుటకు జనులు ఇష్టపడుట వలన కొనుగోలు దారులలో ఒక ప్రత్యేక వర్గమువారి వ్యాపారమునంతను వశపరచుకొని మొనావలి లాభమును కొంతవరకైనను కొన్ని స్థలములందలి వ్యాపారస్థులు అనుభవింపవచ్చును.

కొనుగోలుదారుల వస్తువుల క్రయము ఒకే ప్రదేశము నందు కేంద్రీకరింపబడుట ఎక్కువగు కొలది నగరము లందలి వ్యాపారపు సంబంధమైన స్థలముల అద్దెలు ఎక్కువగుట జరుగును.

క్వాసీ . అద్దె : కాపిటలు వస్తువులపై పెట్టిన పెట్టుబడి, భూమిపై వచ్చు అద్దెవంటి ప్రతిఫలమును పోలిన రాబడిని తరచుగా నొసంగును. ఇట్టి కాపిటలు వస్తువులపై వాటి యజమానులకు తప్పక క్వాసీ అద్దె ముట్టును.

భూమి యొక్క కనీసపు సప్లయి ఖరీదు సున్న యను కొనినట్లే కేపిటలు వస్తువుల యొక్క కనీసపు సప్లయి ఖరీదు కూడ సున్న యనియే చెప్పవచ్చును. ఈ విధముగా ఇట్టి వస్తువులపై వచ్చు ప్రతిఫలము కూడ అద్దె స్వభావమునే కల్గియున్నది.

బి. వి. రా.


[[వర్గం:]] [[వర్గం:]]