Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్దకము (రంగువేత)

వికీసోర్స్ నుండి

అద్దకము (రంగువేత): గుడ్డలపై రంగులు అద్దుట, రంగులతో అచ్చులు వేయుట : రంగులు అద్దుటకు గుడ్డలను సిద్ధపరచు విధము:- రంగులు అద్దుటకు పూర్వము నూలును లేక గుడ్డను శుభ్రపరచుకొనవలెను. నూలును గాని గుడ్డనుగాని ఉడికించుటకు పూర్వము 10 గ్యాలనుల నీళ్ళలో 10 తులముల క్యాస్టిక్ సోడా, 5 తు.ల ఐగోపన్ టి (Igapon T) కాని మరియేదైన సహాయ ద్రవ్యముకాని కల్పి, రాత్రి అంతయు తడిపి ఉంచి, ఉదయమున కఱ్ఱలతో తిన్నగా నదుమవలయును. 10 పౌండ్ల నూలును లేక గుడ్డను, 20 గ్యాలనుల నీళ్ళలో, 20 తులముల బట్టల సోడా, 10 తులముల టర్కి రెడ్ ఆయిల్, 4 తులముల క్యాస్టిక్ సోడా కలిపి సుమారు రెండు గంటలవరకు బాగుగా ఉడికించిన పిదప, శుభ్రమైన నీటిలో ఉతికి, సిద్ధపరచుకొనవలయును. లేనిచో చాకలివానిచే నుతికించి ఆరిన గుడ్డలకు లేక నూలుకు రంగులు అద్దవలసినచో 20 గ్యాలనుల నీళ్ళు అనగా 5 కిరసనాయిల్ డబ్బాల నీళ్ళలో మూడునాల్గు తులముల బట్టల సోడా (Soda ash), 2, 3 పౌనుల క్యాస్టిక్ సొడా కలిపి ఉడికించవలయును. మరొక విధముగా పొడిగుడ్డను 20 గ్యాలనుల నీళ్ళలో 2 పౌనుల టర్కి రెడ్ ఆయిల్ కలిపి రెండుగంటల వరకు తడిపియుంచిన తరువాత, గట్టిగా పిండి సిద్ధముగా నుంచవలయును.

సాధారణముగా వాడుకొను రంగులు (14) రకాలు :1. బేసిక్ రంగులు, 2. డైరక్టు రంగులు, 3. (అ) సల్ఫర్ రంగులు. (ఆ) హైడ్రాన్ రంగులు, 4, ఇండాన్ త్రీన్ రంగులు, 5. ఆలిజరిన్ రంగులు, 6. నెఫ్రోల్ రంగులు, 7. ఇండిగో రంగులు, 8. ఆసిడ్ రంగులు, 9. ఆసిడ్ క్రోం రంగులు, 10. మార్డెంటు రంగులు. పైని చెప్పబడ్డ 10 రంగులలో కొన్ని మాత్రము ఈ దిగువను విపులముగా చెప్పబడినవి. పై నుదహరించిన రంగుల పేర్లు జర్మనీ దేశము వారివి. ఇంగ్లండు, స్విట్జర్లాండు మొదలగు దేశములలో తయారు అయిన రంగుల పేర్లు వేరుగా నుండును.

1. బేసిక్ రంగుల అద్దకము : పట్టుకు ఉన్ని వస్తువులకు మాత్రము ఈ రంగులు వాడుదురు. 10 పౌనుల నూలుకు లేక గుడ్డకు 1 తులమునుండి 6 తులముల వరకు బేసిక్ రంగును మనకు అవసరమగు ఛాయా ప్రమాణమునుబట్టి వేసికొనవచ్చును. ఆసిటిక్ ఆసిడ్ తో రంగును మర్దించి అందులో బాగుగా మరుగుచుండెడి నీరుపోసి కలుపవలెను. శుభ్రపరచిన నూలును లేక గుడ్డను, పది పౌనులకు ¼ పౌ. చొ. పటికను 20 గ్యాలనుల నీళ్ళలో కరిగించి, గట్టిగా పిండిన తరువాత దానిని 1% సజల టానిక్ ఆసిడ్ లో తడియ పెట్ట వలెను. ఇట్లు తయారుచేసిన నూలుపై లేక గుడ్డపై, వడియగట్టిన రంగును నీటితో అద్దకము చేయవచ్చును.

బేసిక్ రంగు వైవిధమున సిద్ధపరచి, జిగురులో కలిపి, గుడ్డలపై అచ్చులు వేసి, 1½ లేక 2 గంటల వరకు ఆవిరి పట్టినచో ఉన్ని, పట్టు, చీటి గుడ్డలు తయారగును.

డైరెక్టు రంగుల అద్దకము: 10 పౌనుల నూలుకు లేక గుడ్డకు 8 తులములు మొదలుకొని 16 తులముల పరిమితిగల రంగును ఒక పాత్రలోనున్న చన్నీళ్ళలో బాగుగా కలిపిన తర్వాత బాగుగా మరుగుచుండెడి వేడి నీళ్ళను ఆ రంగులో పోయవలయును. లేదా అగ్నిపై పెట్టి, కొంతకాలము ఉడికించవలయును. నూలు లేక గుడ్డను అద్దుకొను పాత్రలో నూలుకు 30 పాళ్ళు ఎక్కువ నీళ్ళుపోసి, అందులో 2 తులములు మొదలు 12 తులముల వరకు బట్టల సోడాను ఉడికించి వడియకట్టిన రంగును కలుపవలెను. ఆ రంగులో నూలు లేక గుడ్డను ఉడక పెట్టుచు ఒక గంటవరకు ఆ రంగుపాత్రలోనే యుంచి పిదప వెలుపలకు తీసి శుభ్రమైన నీటితో ఉతికి ఆరవేయవలెను. రంగుపాత్రలో నుండు రంగును పూర్తిగా వాడుటకుగాను, 2% తినునట్టి ఉప్పును కలిపి అద్దకమును పూర్తి చేయవలెను.

సల్ఫర్ రంగుల అద్దకము: పది పౌనుల నూలు లేక బట్టకు సల్ఫర్ రంగు 20 తులములనుండి 40 తులముల వరకు ఉపయోగింపవలెను. సల్ఫర్ నల్లరంగు మాత్రము 80 తులములవరకు గూడ వాడవచ్చును. లైట్ షేడ్ కావలయునన్న, రంగుతో సమమైన బరువుగల సోడియం సల్ఫైడ్ ను రంగుతో కలుపవలెను. గాఢచ్చాయ షేడ్ను కోరినచో సోడియం సల్ఫైడ్ రెట్టింపు తీసికొనవలెను. బట్టలసోడా. పది పౌండ్ల నూలుకు లేక గుడ్డకు డార్కు షేడ్ (Dark shade) కావలయునన్న 20 తులములు, లైట్ షేడ్ కావలయునన్న 8 తులములు, రంగుపాత్రలో వేయవలెను. ఆఖరు దళలో తిను ఉప్పు 2 పౌండ్లవరకు రంగుపాత్రలో వేసినచో, రంగును పూర్తిగా వాడుటకు వీలగును. కొంతవరకు టర్కీ రెడ్ ఆయిల్ కూడ వేయుట మంచిది. పైన చెప్పబడ్డ రంగును బాగుగా ఉడికించి అనగా 140° F. నుండి 180 F. వేడివరకు వేడి అయిన పిదప అద్దకము చేయవచ్చును.

తదుపరి ఈవలకు తీసి గాలికి ఆరవేసి సోడా, సబ్బు వేసి నీళ్ళలో ఉడక బెట్టి, శుభ్రమైన నీళ్ళలో ఉతికి ఆరవేయ వలయును. పైన చెప్పబడ్డ సల్ఫర్ రంగులు మొదట వేసిన తూకము మరల అద్దుకొను సమయమున ⅓ వంతు రంగు ఇతరములు తగ్గింపుచేసి అద్దుకొన వచ్చును. ఇదే విధముగా నాల్గవ సమయానికి ఏ రంగు వేయకుండగనే అద్దుకొనవచ్చును. రంగులు అద్దుకొన్న తదుపరి నీళ్ళు పారపోయకూడదు. ఎందుకనగా వాటిలో రంగుఉండును, అది చెడిపోదు. మరల అద్దుకొను సమయాన వాటిలో కొద్దిరంగు కలిపిన పనికివచ్చును.

నెప్తాల్ రంగుల అద్దకము: పదిపౌండ్ల నూలుకు లేక గుడ్డకు 8 తులములనుండి 12 తులముల నెఫ్తాల్ రంగు అవసరము. దీనికి సరియైన రంగు ఉప్పులు (1:3) అనగా 8 తులముల నెప్తాల్కు 24 తులముల రంగు ఉప్పు చొప్పున అందులో 24 తులములు తిను ఉప్పు వేసి సిద్ధము చేసికొనవచ్చును. ఈ రంగులు అద్దుటకు రెండు మట్టిపాత్రలు వెడల్పు మూతులు గలవిగాని, మట్టి తొట్లు గాని అవసరము.

బేస్ తయారుచేయు విధము: నెఫ్తాలను మోనోపోల్ సొప్ తో మర్దించి, అందులో వేడినీళ్ళు కలిపి, కాస్టిక్ సొడాను కలుపవలెను. అట్లు కలిపినచో, నెప్తాల్ రంగు మారి నీళ్ళలో కరగును.

రంగు ఉప్పు తయారుచేయు విధము : రంగు ఉప్పు తూకమునకు సమముగా తిను ఉప్పు కలిపి, నీళ్ళలో రెంటిని కరుగబెట్టినచో రంగు ఉప్పు సిద్ధమగును. శుభ్రపరచిన నూలును లేక బట్టను నీటిలో తడిపి, పిండి నెప్తాల్ బేస్ లో తడియబెట్టవలెను. దానిని పైకి తీసి, గట్టిగా పిండి, తయారైన రంగు ఉప్పునీళ్ళతో రంగు వేయవచ్చును.

ఇందాన్ త్రీని రంగులు వేయు పద్ధతి: ఈ రంగులు అన్ని రంగులకంటె గట్టిరంగులు. కాస్టిక్ సోడా నీళ్ళకు గాని, బ్లీచింగ్ పౌడరు నీళ్ళకుగాని, ఈ రంగులు దిగి పోవు.

ఈ రంగుల అద్దకము 3 విధములు : IN, IW, IK.

నూలును లేక గుడ్డను శుభ్రముగా నుతికి రెడ్ ఆయిల్తో నాన్పి మెత్తగా చేయవలెను. 1% నుంచి 4% వరకు అవసరాను సారముగా రంగు ఉప్పును తీసికొని ఒక చిన్న పాత్రలో నీళ్ళతో మర్దించి దానిలో మరుగుచుండెడి నీళ్ళను పోసి, అందులో కాస్టిక్సోడాను కలువవలెను. అందులో సోడియం హైడ్రోసల్ఫైట్ను కొద్దికొద్దిగా కలుపుచు పోవలెను. మొదటిరంగు మారును. అట్లు రంగు మారినప్పుడే రంగు. ఉప్పు నీటిలో కరిగినదని తెలియును. ఇట్లు మారిన రంగునీటికి గాలి తగిలినచో మొదటిరంగు వచ్చును. ఈవిధముగా రంగు తయారైనదనుకొనవచ్చును. ఇట్లు తయారైన రంగునీటిని నీరుగల పెద్దతొట్టిలోపోసి తగినంత కాస్టిక్ సోడాను, సోడియం హైడ్రోసల్ఫైటన్ను కలిపి నూలుకు లేక బట్టలకు అద్దకము చేయుటకు వాడవచ్చును. అట్లు అద్దించిన నూలును లేక గుడ్డను పైకి తీసి గాలిలో కొంత సేపు ఉంచినచో మొదటి రంగు మరల వచ్చును. ఆ బట్టను లేక నూలును సబ్బు, సోడా నీళ్ళలో ఉడకబెట్టి తదుపరి మంచినీటిలో శుభ్రపరచవలెను.

గుడ్డలపై రంగులను అచ్చువేయుట: ప్రస్తుతము మార్కెట్టులలో వాడబడుచున్న రంగులు : (1) రాపిడ్ (ఫాస్టు) రంగులు, (2) ఇండిగోసోల్ రంగులు.

1. రాపిడ్ (ఫాస్టు) రంగులు అచ్చువేయు పద్ధతి : రంగును సారాయితో మర్దించి కొద్దిగా చన్నీళ్ళు లేక గోరువెచ్చని నీళ్ళు కలిపి అందులో కాస్టిక్ సోడాను మరికొంత నీటిని కలిపినచో ఆ కాస్టిక్ నీళ్ళలో రంగు కరుగును. ఈ రంగు నీటిని తగినంత బంక లేక జిగురులో కలిపి బట్టపై అచ్చువేయుటకు వాడవచ్చును. అచ్చు వేసిన తరువాత బట్టను ఎండబెట్టి ఆవిరిలో నుంచినచో రంగు బాగుగా అంటుకొనును. అటుపిమ్మట బట్టను ఆసిటిక్ ఆసిడ్ జలములో వేసిన అసలు రంగు బయటపడును. ఆబట్టను నీళ్ళలో ఉతికి పిదప సబ్బు, సోడా నీళ్ళలో ఉతికించి శుభ్రపరచవలెను.

2. ఇండిగోసోల్ రంగు అచ్చువేయు పద్దతి: ఇండిగో సోల్ రంగును కొద్దిగా గ్లిసరిన్ తో మర్దించి వేడినీళ్ళు కలిపి తగినంత సోడియం నైట్రైటు కలుపవలెను. ఈ ద్రావణమును జిగురులో లేక బంకలో కలిపి అచ్చువేయ వచ్చును. అచ్చువేసిన బట్టను ఎండ బెట్టి ఆసిటి కామ్లము లేక హైడ్రో క్లోరికామ్లపు నీటిలో నాన బెట్టవలెను. ఇట్లు చేసినపుడు రంగు స్వభావసిద్ధముగ తయారగును. తర్వాత ఆ బట్టను నాల్గు అయిదుమార్లు మంచినీటిలో ఉతికి, తర్వాత సొడా సబ్బు నీళ్ళలో ఉడకబెట్టి, శుభ్రపరచ వలెను.

అవిలీన్ హైడ్రో క్లోరైడు లేక అనిలీన్ లవణమును నీళ్ళలో కరిగించి ఇందులో తగినంత పొటాసియ హరితమును, కొద్దిగ మైలుతు త్తమును కలిపి బంక లేక జిగురులో కలిపి అచ్చు వేయవచ్చును. అచ్చువేసిన బట్టలు తీవ్రమైన ఎండలో మూడు నాల్గు గంటలవరకు పెట్టినచో నల్లరంగు తేలును. పిమ్మట బట్టను చాల కొద్దిగ ఆమ్లము కలిసిన నీటిలో నానబెట్టినచో దాని పూర్తిరంగు తేలును. అట్లు అచ్చువేసిన బట్టను మామూలు పద్ధతిని 4, 5 సార్లు మంచినీటిలో కడిగి, సోడా సబ్బుతో మరల శుభ్రపరచవలెను. ఈ రంగు సాధారణముగా డిజైను యొక్క అంచుకు వాడవచ్చును.

ఆర్. వెం. స్వా.

[[వర్గం:]] [[వర్గం:]]