Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అద్దకము

వికీసోర్స్ నుండి

అద్దకము  :- అను పదము ప్రత్యేకముగా బట్టల పరిశ్రమకు సంబంధిచినదై యున్నది. బట్టల ఉత్పత్తిలో విస్తారముగా ఉపయోగింపబడు ముఖ్యములగు దారములు మూడు రకములు. అవి ప్రత్తి, సిల్కు, ఉన్ని అను వాటిచే నిర్మితములు. దారపు పోగులను మూడు ముఖ్యరకములుగా విభజింపవచ్చును (1) వృక్షజన్యములు, ఉదా : ప్రత్తి, జనుము, లెనిన్; (2) జంతు జన్యములు, ఉదా : ఉన్ని, సిల్కు; (3) కృత్రిమ జన్యములు, ఉదా : రేయాన్సు, లోహ లవణ జన్యములగు బంగారము, వెండి, ఏస్ బెస్టాస్ వంటి వాటికి అద్దకము విషయములో ప్రాముఖ్యము తక్కువ. రంగువేయుట ఒక దారపు పోగుపై గాని, బట్టపై గాని, రంగును కనబరచు విధానమును రంగువేయుట అందుము. దారపు పోగులపై కేవలము రంగు కనబడునట్టు చేయుటకంటె గూఢమైన అర్థము ఈ పదమునకు గలదు. దారపు పోగులందు అంతటను సమానముగా రంగు విస్తరించి యుండుటయే అద్దకపు పని అనబడును. పై భాగమున కేవలము పై పూతగా రంగు పూయుట అద్దకము కాజాలదు; ఇట్టిపని చిత్రలేఖన మనిపించు కొనును. దారపు పోగు, లేక బట్ట రంగు వేయబడినదని చెప్పబడుటకు అట్టి దారపుపోగు లేక బట్ట ఈ క్రింది విశిష్ట ధర్మములను కలిగియుండవలెను.

1. రంగు సరిసమానముగా అంతటను విస్తరించి యుండవలెను. రంగు అంటని భాగములు ఉండరాదు.
2. ఉపయోగింపబడిన రంగు కేవలము పైభాగమున అంటినదిగా నుండరాదు.
3. రంగు వేయబడిన వస్తువు ఉతుకును, వెలుగును,చెమటను నిరోధించునంత మన్నిక కలిగియుండవలెను.

రంగువేయు విధానమునందు ముఖ్య విషయములు రెండు. (1) దారపు పోగు (2) రంగు పదార్థము. రంగువేయు విధానము ఈ రెండింటిపై గాని, వీటిలో నొకదానిపై గాని ఆధారపడియుండును. రంగువేయు విధానము దారపు పోగులనుగాని, రంగు పదార్థమును గాని అనుసరించి మారుచుండును. ఈ విధానమును నిర్ణయించు మూడవ అంశ మొకటి కూడ కలదు. అది “సహాయక ద్రవ్యము" (Mordant) అని పిలువబడును. సహాయక ద్రవ్య మనగా దారపు పోగునకు రంగు పదార్థముతో సన్నిహిత సంబంధమును పొందుటకు సహాయపడు నొక వస్తువు. “సహాయక ద్రవ్యము” (Mordant)యొక్క సహాయము లేనిచో కొన్ని రంగుపదార్థములు కొన్నిరకముల దారపు పోగులకు రంగువేయుటకు శక్తి గలిగియుండవు. సహాయక ద్రవ్యముచే దారపుపోగు రంగు పదార్ధమును తనలోనికి గ్రహించుకొను గుణమును పొందును. అప్పుడు దానికి రంగు హత్తుకొనును. “సహాయక ద్రవ్యము" నేడు ఎక్కువగా నుపయోగింప బడుటలేదు. పూర్వకాలములో 'ఎనిలైన్' అను రంగు పదార్థములు దొరకని దినములలో సహాయక ద్రవ్యములు వాడబడుచుండెడివి. ఆ దినములలో ప్రకృతినుండి తీయబడిన రంగు పదార్థములచే రంగులు వేయబడు చుండెడివి. "సహాయక ద్రవ్యములు" దారపు పోగుల యొక్క సూక్ష్మ రంధ్రములను పెద్దవిగా చేయునవియు, ఇట్లవి రంగుపదార్థములతో సన్నిహిత సంబంధమును గూర్చు టకు సహాయ పడుననియు నమ్మబడు చుండెను. దీని పని ఇంతమాత్రమే కాదని తరువాత తేల్చబడినది. "సహాయక ద్రవ్యము” ప్రత్యక్షముగా రంగు పదార్ధములతో రాసాయనిక సంయోగమునుపొంది, కరగని ఒక అవక్షేపము(precipitate) గా నేర్పడునని ఇప్పుడు రుజువు చేయబడినది. ఈ అవక్షేపము “సరస్సు" (Lake) అని పిలవబడును. ఈ రాసాయనిక సంయోగము దారపు పోగు మీద జరుగును. పూర్వము వాడబడుచుండెడి “సహాయక ద్రవ్యములు" బరువు లోహముల యొక్క లవణములై యుండెడివి. అవి జంతు లేక వృక్ష సంబంధ మైనవనియు(organic) ఖనిజ సంబంధమైనవనియు (inorganic) రెండు రకములుగా నున్నవి. లోహ సంబంధముకల “సహాయక ద్రవ్యము"లలో గురుత్వము గల లోహ లవణము లున్నవి. ఉదా : ఇనుము, క్రోమియం, అల్యూమినియము, తగరము, రాగి మొదలగు వాటి లవణములు. జంతు లేక వృక్ష సంబంధమైన “సహాయక ద్రవ్యము" - అనగా వివిధములగు నూనెలు, వాటి రాసాయనిక సంయోగములు (compounds) (ఉదా: సబ్బులు) టేనిన్ పదార్ధములు మొదలగునవి.

సహాయకములు (Assistants): సహాయకములు అనగా దారపుపోగులోనికి రంగు చొచ్చుకొని పోవుటకు సహాయపడు వస్తువులు. అవి లేకుండ కూడ రంగు వేయవచ్చును. కాని దారపు పోగులు రంగును సులభముగా గ్రహించుటకు సహాయకములు తోడ్పడునేగాని వాటివలన రంగులకుగాని, దారపు పోగులకుగాని, ఎట్టి ప్రమాదములేదు. రంగు వేసిన తర్వాత సహాయకములను సులభముగా కడిగివేయ వచ్చును. దారపు పోగులతో గాని రంగు పదార్థముతోగాని అవి ఎట్టి రాసాయనిక సంయోగమును పొందవు. ఈ సహాయకములు బజారులో వేర్వేరు కంపెనీ పేరులతో విక్రయింపబడును. నేడు లభ్యములగు ఎనిలీన్ రంగులలో ప్రతిదానిలోను ఒక సహాయకము ఉండును. దాని సహాయముననే రంగు వేయుటను జయప్రదముగా నిర్వహింప వచ్చును.

ఎట్టి దారపు పోగునకైనను రంగు వేయుటకు ఒక ప్రత్యేకపు చాయగల రంగుగాని రంగు ద్రవ్యముగాని కావలసి యుండును. అప్పుడు రంగు ద్రవ్యమునుగాని రంగునుగాని దారపు పోగులలోనికి ప్రవేశ పెట్టుటకును అక్కడ దానిని స్థిర పరచుటకును ఒక సాధనము అవసరమగును. తడిరంగు వేయు విధానములో సాధారణముగా నీరు అవసరము. అట్టి నీరు తగినంత శుభ్రముగా నుండవలెను. స్వాదుజలము ఇందుకు పనికివచ్చును. కఠిన జలము పనికి రాదు.

రంగు వస్తువును దారపు పోగులును ఉంచబడిన పాత్రను నిప్పుమీద ప్రత్యక్షముగా నుంచుట చేగాని పాత్రలోనికి ప్రత్యక్షముగా ఆవిరిని పంపించుటచేగాని రంగువేయుటకు వలసిన వేడిమిని సంపాదింప వచ్చును. రంగుద్రవ్యమును దారపు పోగులునుగల పాత్ర ఆవిరి (steam bath) లో నుంచి వేడిచేసెడి విధానము “పరోక్ష విధానము అనబడును. దారపు పోగులకు రంగువేయుటకు ఉపయోగించు పాత్రను (Dye bath) లోహముతో గాని కఱ్ఱతోగాని పింగాణిలోగాని చేయుదురు. లోహ పాత్రలలో రాగి పాత్రలు స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు

రంగువేయు తొట్టె

1. పెద్ద కొయ్య తొట్టె
2. ఆవిరి గొట్టము
3. లోనికి ఆవిరి వచ్చు ద్వారము
4. ఆవిరి బైటికి పోవు ద్వారము
5. కొయ్య రూలర్లు
6. రంగు మట్టము
7. దారము లేక బట్ట
8. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు.

రంగువేయుటకు ఉపయోగింతురు. యంత్రాగారముల యందును పెద్ద అద్దకపు కర్మాగారములందును దీర్ఘ చతురస్రాకారముగల కఱ్ఱతొట్టిని ఉపయోగింతురు. ఒక ఆవిరిగొట్టము అమర్చబడి యుండును. దీనిని "రంగుతొట్టి" అందురు. రంగువేయుటకు ఉపయోగించు పాత్ర రంగువేయబడు దారపుపోగుల స్థితిపై ఆధారపడి యుండును. ప్రత్తి, ఉన్ని, సిల్కు- ఇవి విడివిడి దారపు పోగులుగా రంగు వేయబడును. నిడు పైన బ్రద్దలకు దూదిపింజ చుట్టిగాని, పోగులుగాగాని చుట్టిగాని, నూలు పిడిగాగాని, నూలు చిట్టముగాగాని, కండెలుగాగాని, వస్త్రరూపమున ఉన్న నూలు పోగులుగాగాని రంగు వేయబడును. దూది పింజలు, నూలు పిడులు మున్నగు వాటికి రంగువేయునపుడు (packed system) రంగు ద్రావకమును వీటిగుండా ప్రవహింపజేయుదురు. చిట్టము (Hank) రూపములోనున్న నూలునకు తఱచుగా రంగు వేయునపుడు ఒక పెద్ద తొట్టెలో నుంచుదురు. రంగు వేయుటకు పూర్వము వస్తువును కడిగి, తడిగా నుండగనే రంగుపాత్రలో నుంచుదురు. కడుగని వస్తువులో కొన్ని సహజ మలినములుండును. వీటిని వ్యతిరేకించు ధర్మము వీటికుండును. కడుగుటచే ఇట్టి సహజ మలినములు తొలగిపోవును. దారపు పోగుల స్థితినిబట్టి మలినములు ఆధారపడియుండును. బట్ట తయారగు స్థితివరకు అవి సమానముగానే యుండును. కాని బట్ట స్థితిలో సహజ మలినములేకాక ఇతర మలినములుకూడ నుండును. నూనె మరకలు, దుమ్ము ఇట్టి మలినములు నేత నేయు సందర్భములో ఏర్పడును.

ఉన్ని విషయములో, ముద్దగానున్న ఉన్నిలో దుమ్ము, ఎండుటాకులు మొ. సహజ మలినములు ఉండును. కాని నూలులో రంగు వృక్షసంబంధమయిన నూనెలు తప్ప ఇతర సహజ మలినము లుండవు. ఉన్ని బట్టయందుకూడ ఉన్ని నూలులో గల మలినములే కనిపించును. సిల్కు విషయములో విడిచారపు పోగులు, నూలు, బట్ట మున్నగు వాటియందు 'జిగురు' లేక 'సెరిసిన్' అను మలినము ఉండును. ప్రత్తి, మైనమునందు (wax) నీటిని వ్యతిరేకించు ధర్మమును ప్రత్తికి కలిగించును. ఇది సబ్బుగా మార్పరాని ఒక రకపు నూనె. నీటిని, నూనెను కలుపగా ఏర్పడు పాలవంటి ద్రవమును ఉపయోగించి (Emulsifcation) ప్రత్తిమైనమును తొలగింపవచ్చును. ప్రత్తిలో నుండు క్రొవ్వుసంబంధమగు ఆమ్లము 'మార్గంక్ ఆమ్లము' 'పాల్మిటిక్ ఆమ్లము' అను రెండు ఆమ్లముల మిశ్రమముచే నేర్పడును. ఈ ఆమ్లములు 55.5° సెంటిగ్రేడ్ వద్ద కరగును. ఇవి క్షారములందు మిళితములగును. రంగువేయు పదార్థమునందు నత్రజని సంబంధమైనవియు, అస్ఫటికాకారముగా నేర్పడ నవియును అగు రెండు రంగువేయు వస్తువులు ఉండును. వీటిలో ఒకటి 'ఆల్కహాల్'లో కరగును. రెండవది ఆల్కహాలునందు అత్యల్పముగా కరగును. ఈ రంగులు చలవచేయుటవల్ల నశించి పోవును. మలినములన్నియు కలసి విడి ప్రత్తిలో 5% ఉండును. 'పెక్టిక్ ఆమ్లము' ఈ మలినములలో అత్యధికాంశముగా ఉండును,

చలువ చేయుట : పూర్వకాలము 'చలువ చేయుట'చాలమోటును, సుదీర్ఘమును, శ్రమతో గూడినదియునగు విధానము ననుసరించి జరుగుచుండెడిది. ఇందుకొరకు పాట్ ఆష్ (Pot ash=K2 Co3) ఉపయోగించు చుండెడివారు. పులియ పెట్టుటకై మజ్జిగయు, తెలుపు జేయుటకై సూర్యరశ్మియు సాధనములుగ ఉండెడివి. రంగు వేయుటకు పూర్వము బట్టలను చలువ చేయుటకై ఆరు నెలలు పచ్చగడ్డిపై పరచెదరు. ఈ విధానమునకు తృణప్రక్రియ అని పేరు.

ప్రస్తుతము చలువచేయుటకు చాలవరకు బ్లీచింగ్ పౌడరు (కాల్షియం హైపోక్లోరైట్) వాడుచున్నారు.ప్రస్తుతము విశేషముగా వక్త్రరూపమున చలువ చేయుదురు. నూలు దారము రూపమున స్వల్పముగను, వైద్యావసరముల కొరకు నీరు పిల్చెడి స్వభావముగల దూదిపింజల రూపమున అత్యల్పముగను చలువచేయుదురు. దూదిపింజలను తోటాలు చేయుటకును తుపాకీ ప్రత్తి కొరకును చలువచేయుచున్నారు. ఈ దూదిపింజ రూపమున చలువచేయునపుడు నారపోగులు బలముగా నుండ అవసరము లేదు. దారమును బట్టలను తయారుచేయు విషయమున దారపుపోగులు బలముగా నుండుట అవసరము - ప్రత్తిదారమును పెద్ద యెత్తున తెలుపు చేయుటకై మూతలేని తొట్టిలో అనగా తక్కువ ఒత్తిడిగల తొట్టిలో దానిని ఉడక బెట్టుదురు. చలువ చేయుటకై ఉడక బెట్టుటలో దారపుప్రొగులలోని ప్రత్తి మైనమును, క్రొవ్వుసంబంధము లగు ఆమ్లములను, తదితరములగు జీవకణ నిర్మాణ ద్రవ్యములు కాని (Non-cellulosic) మలినములను, పూర్తిగా తొలగించుట అవసరమై యున్నది. పెద్దతొట్టిలో ఉడక బెట్టుటకు వేరు వేరు పద్ధతులు ఉన్నవి. మూతలేని తొట్టిపద్ధతి' లో తగిన కొల

వివృతాంతస్క్రావణ ద్రోణి

1. పెద్ద కొయ్య తొట్టె
2. ఆవిరిని చిమ్ము గొట్టము
3. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు
4. బోలు గొట్టము
5. ఆవిరిని క్రమబద్ధముచేయు మూత
6. వస్తువులు మజ్జము
7. క్షారద్రావణ మట్టము

తలుగల ఒక గుండ్రని నిలుపుకొట్టిని ఉపయోగింతురు. అడుగున రంధ్రములు పొడువబడిన ఒక కృత్రిమ నిర్మాణము అమర్పబడి యుండును. దానిలో రంగువేయబడు పదార్థము ఉంచబడును. ఈ కృత్రిమపు టడుగునకును, నిజమైన అడుగు భాగమునకును మధ్య జానెడు ఖాళీ స్థలము ఉంచబడును. ఈ స్థలము ద్రవము చేరుకొనుటకును, ఆవిరిగొట్టము లుంచుటకును ఉద్దేశింపబడినది. బయటికి తీసినపుడు అది చిక్కులు పడకుండ నుండుటకై చలువచేయబడు వస్తువును తగు జాగ్రత్తతో తొట్టియందుంచవలెను. చలువచేయు పదార్థమునకు సమముగా రంగుపట్టుటకయి, దానిని తొట్టిలో క్రమమైన రీతిలో నుంచవలయును. మొదట నొక వేడివీళ్ళ తొట్టిగుండా పోనిచ్చి, తరువాత “ఒత్తుడు రోలర్ల”చే ఒత్తుదురు. “మూతలేని తొట్టిపద్ధతి" (Openkier) ననుసరించి పదిపండ్రెండు గంటలవరకును వస్తువును ఉడక బెట్టుదురు. ఇట్లు మూత లేని తొట్టిలో ఉడక బెట్టుట మిక్కిలి ప్రశస్తము కాదు. ఏమనగా అది ఈ పద్ధతియందు ఎక్కువ ఖర్చగును.ఇందలి దీర్ఘకాల ప్రక్రియ మూలమున "ఆక్సి సెల్లులోస్" మరియు, "హైడ్రో సెల్లులోస్" అనునవి ఏర్పడి చలువ చేసు వస్తువు మెత్తబడి, చెడిపోయెడి ప్రమాదము కలుగును. తక్కువ ఒత్తిడితో గూడిన తొట్టిలో రంగు వేయబడు వస్తువు 10, 12 గంటలవరకు ఉడక బెట్టుచు ఆ వస్తువు యొక్క బరువులో "సోడా ఆష్"ను కలువుదురు. ఈపని తర్వాత ఆ వస్తువు భ్రమణ ముద్రాయంత్ర (Washing mangle) సాహాయ్యమునను ఒత్తుడు రోలర్సు యొక్క (Squeeze Rollers) సహాయమునను శుభ్రముగానుతకబడును. దీనివలన రంగుపదార్థముతప్ప తక్కిన మలినములన్నియు తొలగిపోవును. నూలు పోగులలోని సహజమైన రంగుపదార్థమును తొలగించుటకు “బ్లీచింగ్ పౌడరు" ను, ద్రావకమును ఉపయోగింతురు. ప్రయోగమును “కెమికింగ్" అందురు.

2° టి. డబ్లియు. బ్లీచింగ్ పౌడరు ద్రావకముగాని ½° ¾° టి. డబ్లియు పెర్ కొరన్ గాని, సుమారు 6 నుండి 8 గంటల కాలము చలువచేయు నిమిత్తము వాడుదురు. ఈస్థితియందు వేడిచేయుట అనవసరము. “బ్లీచింగ్" చేయబడిన తర్వాత, దారము చన్నీళ్ళలో తడవకు 15 నిమిషముల చొప్పున రెండుసార్లు కడుగబడును. గంధకితఆమ్లము ½ నుండి 1° టి. డబ్లియు ద్రావకములో 15 నిమిషములు పులియబెట్ట బడును. ఇట్లు చేయుటలో నూలుపోగులనుండి "బ్లీచింగ్ పౌడర్" యొక్క అవశేషములను తొలగింపనగును. పులియబెట్టిన తర్వాత ఆమ్లము యొక్క లవలేశములను పూర్తిగా తొలగించుటకై తడవకు 10 నిమిషముల చొ॥న మూడు సార్లు పరిభ్రమించుచున్న తొట్లలో తిరిగి దారము కడుగబడును. తుది దశలో ఆమ్లముయొక్క తుది లవలేశములను తటస్థపరచి తొలగించుటకును, ప్రత్తిని మెత్తపరచుటకును సబ్బును వాడుదురు. మజ్జిగకు బదులుగా గంధకిత ఆమ్లము వాడుటవలన చలువ జేయుటకు వలసిన కాలము 6 నెలలనుండి 3 నెలలకు తగ్గును.

“క్లోరిన్" 1774 లో కనుగొనబడినది. కాని దాని తెలుపుచేయుశక్తి 1785 లో మాత్రమే బెర్తోలెట్ చే కనుగొనబడినది. దానిని కర్మాగారములలో తెలుపు చేయుటకు ఉపయోగించినవాడు జేమ్స్ వాట్ అనునతడు. అతడు క్లోరిన్ నీటిని ఉపయోగించెను. ఈ క్లోరిన్ నీరు అంతగా ఉపయోగించు వస్తువు కాకపోవుటచే 1799 లో చార్లెస్ టెన్నెన్చ “బ్లీచింగ్ పౌడరు" వ్యాపారార్ధము తయారుచేయబడినది. కాని అది ఉపయోగములోనికి 1800 సం॥లో మాత్రమే వచ్చెను. క్రమముగా "పాట్ ఆష్ "నకు బదులుగా సున్నము వాడుకలోనికి వచ్చెను. పిడప సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా 1830 లో వాడుకలోనికి వచ్చెను. అపుడు తెలుపు చేయుట కుపయోగించిన విధానము లీ

అధిక పీడన ద్రోణి

1. పీడన మాపకము
2. మూతి
3. చిమ్ముడు గొట్టము
4. క్షారద్రావణ మట్టము
5. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు
6. కేంద్రావగ ఉదంచము (Centrifugal pump)
7. క్షార ద్రావణము .
8. నీరు
9. ఆవిరి
10. ఖాళీచేయు గొట్టము
11. గుడ్డ లేక నూలు

బహు నాళీయతాపక ద్రోణి

1. మూతి
2. పీడన మాపకము
3. ఆవిరి
4. సాంద్రీకృతమయిన ఆవిరి
5. కేంద్రావగ ఉపచయము (Centrifugal pump)
6. క్షారద్రావణ మట్టము
7. వస్తువుల మట్టము
8. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు
9. బహునాళీయ తావకము
10. క్షారద్రావణము

క్రింది రీతిగ నున్నవి: 1. నీళ్ళలో ముంచిఎత్తుట, 2. ముడి పదార్థమును కడుగుట, 3. సున్నములో ఉడుక బెట్టుట, 4. కడుగుట, 5. కాస్టిక్ సోడాతో మూడుమారులు ఉడుక బెట్టుట, 6. బట్టను పచ్చిక పై పరచుట,లేక “బ్లీచింగ్ పౌడరు”, గంధకిత ఆమ్లము ఉపయోగించుట. సోడా ఆష్ (సోడియం కార్బనేట్) ను యంత్రములను వాడుటవలన ఈ విధానమునకు అభివృద్ధి చేకూరెను.

1. మూత పెట్టబడిన తొట్లలో ఒత్తిడిక్రింద ఉడక బెట్టుట.
2. మరుగుచుండగా "కాస్టిక్ సోడా” ద్రవమును ప్రసరింప జేయుట.
3. సంపూర్ణముగా కడుగుట కొరకు "కడుగుడు యంత్రములు” ఉపయోగించుట.
4. "ల్లీచింగ్ పౌడరు" ద్రవము సహాయముతో చలువచేయుట.

బట్టల మీద అద్దకము (Textile Printing): అద్దకము కూడ నిజమునకు రంగువేయుటయే ; భేద మేమనగా ఒకే రంగు పదార్థము అంతటను సమముగా బట్టయందు విస్తరించదు. కారణమేమనగా పదార్ధము రంగుతొట్టిలో ముంచబడదు. రంగు చిక్కబరచిన స్థితిలో బట్టమీదకు వచ్చునట్లు చేయబడును. ఈ రంగు కొన్ని ప్రత్యేక స్థలములపై వేయబడును. ఇట్లు చిక్కబరచిన రంగును ఉపయోగించుటవలన సూక్ష్మనాళముల గుండా ప్రసరించి వ్యాపించదు. ఏర్పాటు చేయబడినదియు, సునిశితమును అగు అంచు దీనివలన సాధ్యపడును. రంగు ఉపయోగింప బడిన చోట నెల్ల బట్టలో ఆ ప్రదేశమునకు మాత్రమే రంగు పట్టును.

వివిధములైన బట్టలపై రంగు రీతులు, లేక రూప రచనలు, అచ్చువేసి తయారుచేయుటకు అనేక పద్ధతులు కలవు.

1. చేతి దిమ్మలతో అచ్చువేయుట.
2. పెరొటైన్, లేక యంత్రపు టచ్చులతో అచ్చు వేయుట.
3. చేతికుంచెతో రూపరచన కల్పించుట. (Stencilling by hand-brush)
4. గాలికుంచెతో రూపరచన కల్పించుట, (Stencilling by air brush) (ఎయిరోగ్రాఫ్ Aerograph).
5. తెర అచ్చు (Screen printing).
6. చెక్కబడిన రాగి పలకలనుండి చదును టచ్చుముద్రణ.(Flat press printing from engraved copper plates).
7. యంత్రముద్రణము, లేక రూప రచనలు రాగి రోలర్లపై చెక్కి రోలర్లచే అచ్చు వేయుట.

దిమ్మలతో అచ్చువేయుటలో రూపరచనలు కఱ్ఱపై ఉబుకునట్లుగా చెక్కబడి యుండును. ఈ ఉబికిన భాగములు రంగు భూమిక (colour pad) నుండి రంగును గ్రహించి బట్టపై ఒత్తబడినప్పుడు ఆ రంగును బట్టమీద పడునట్లు చేయును. దిమ్మలతో రూపరచనలను అచ్చు వేయుటలో ఇది చాల సులభమగు విధానము. బట్టలపై అచ్చు వేయుట కిది మిక్కిలి పురాతనమైన పద్ధతి. ఇది ఆలస్యముతోను, వ్యవయముతోను గూడిన పద్ధతి. ఆధు నిక మైనరోలర్ ముద్రణముతో పోల్చినచో, దీనికి సంకుచితమును, పరిమితమును, అగు స్థానము మాత్రమే కలదు. మిక్కిలి సున్నితములును, సునిశితములును అగు రేఖలు కఱ్ఱదిమ్మలపై చెక్కుట శక్యము కాదు. చెక్కిననుకూడ అచ్చుకొట్టుటలో అవి పాడై పోవును. అట్లే సన్నని చుక్కలను చెక్కుటకు కూడ వీలుపడదు. సన్నని రేఖలైనచో రంగును సమముగా గ్రహించును. వాటితో అచ్చు సమముగా వచ్చును. కాని విశాలములైన సమూహ రూపములు రంగును సమముగా గ్రహింపవు. వాటితో అచ్చు ఎగుడు దిగుడుగా కూడ నుండును.

కఱ్ఱదిమ్మలపై లోహ రూప రచనల నుంచి, అభివృద్ధికరమైన మార్పులు చేయుదురు. దిమ్మలలో విశాల సమూహ రూపములు ఉన్న సందర్భములలో ఆ రూపముల మధ్య తొలిచి " ఫెల్టు” (కంబళివంటి పదార్థము) తో నింపుదురు. "ఫెల్టు" అందుచే రంగును సమముగా గ్రహించును. ఈ విధముగా అచ్చు వేయుటచే అచ్చులు సున్నితముగను, సమముగను వచ్చును. దిమ్మలతో అచ్చు వేయుటలోగల మిక్కిలి గొప్పకష్టములు తిరిగి వేయబడు అచ్చులలో ఒకదానితో ఒకటి సరిగా కలుపుటకు సాధ్యపడకపోవుట; వేర్వేరు రంగుల ముద్రా రచనయు సరిగా నుండకుండుట.

ఏదైన ఒక రూపరచనకు కావలసిన దిమ్మల సంఖ్య ఆ రూపరచనలో నున్న రంగులసంఖ్యకు సమానముగా నుండును; ఏమన, ఒక దిమ్మ ఒక రంగును మాత్రమే గ్రహింపగలదు.

రంగు భూమికలు (Colour Pads) : అనేక విధములైన రంగు భూమికలు అచ్చువేయుటలో ఉపయోగింపబడును. ఒక దుప్పటి ముక్కను ఒక సమతలముపై పరచి, భూమికగా నుపయోగించుట వీటిలో మిక్కిలి సులువైనది. ఇట్టిదానిలో రంగు ముద్దను గ్రహించుశక్తి చాలా పరిమితమై యుండును. కాన ఎక్కువగా అచ్చు వేయవలసిన సందర్భములలో దీని ఉపయోగము లేదు. దీనిలో దిండువంటి సౌలభ్యము లేకపోవుటచే, కఠినమైన భూమిక నుండి దిమ్మలు ఎక్కువరంగును గ్రహించును; అందుచే, అచ్చు హెచ్చుతగ్గులు కలదిగా నుండును. కనుక, దేశమందంతటను సర్వసామాన్యముగా ఉపయోగింపబడు భూమిక ఒక కఱ్ఱ పళ్లెము లేక తొట్టిని కలిగియుండును. ఈ తొట్టిలో ఒక వెదురు జల్లెడ ఉంచబడును. ఈ వెదురు జల్లెడపై దుప్పటి పరచబడి, దానిపై ఒక గుడ్డముక్క ఉంచబడును. వెదురు జల్లెడ వెదురు బద్దలతో చేయబడును. ఇవి రెండు కాళ్ళపై ఆధారపడి యుండును. వెదురు బద్దలు దారముతో కట్టబడును. వెదురుజల్లెడ (జాలి) "స్ప్రింగ్" (Spring) లక్షణము కలిగియుండును. కాన, రంగును సమానముగా గ్రహించుటలో అది సాయపడును. జల్లెడ "స్ప్రింగ్" లక్షణముచే రంగును విడగొట్టును; మరియు సరియగు మార్గములద్వారా దానిని వచ్చునట్లు చేయును. దుప్పటి, రంగును ఇంకను విడగొట్టును. దుప్పటి సందులు నుండి వెలువడు రంగు ఇంకను సూక్ష్మ విభజన పొందిన స్థితిలో దాని పైభాగమునకు వచ్చును; అక్కడనుండి దిమ్మ రంగును గ్రహించును.

అచ్చువేయు బల్ల : కూర్చుండు స్థితిలో బట్టలను అచ్చు వేయుటకు ఉపయోగింపబడు సాధారణమైన బల్లకు బలమైన తలమును, బలమైన కాళ్ళును ఉండును. బల్ల పనివాని వైపునకు కొంచెముగా వాలి ఉండును. సాధారణముగా ఈ బల్ల 20 - 22" వెడల్పుగల్గి పనిచేయుటకు అనుకూలముగా నుండును. బట్టను పరచెడి ప్రదేశము కూడ అచ్చువేయుట పై ప్రభావము కలిగియుండును. ఆప్రదేశము హెచ్చుతగ్గులుగా నున్నచో, దిమ్మ రంగును సమానముగా గ్రహించినప్పటికీ అచ్చు హెచ్చుతగ్గులుగా నుండును. అందుచే మెత్తని దిండుగల ఉపరిభాగము అవసరము; ఉన్ని ఫెల్టు బట్ట సాధారణముగా ఉపయోగింపబడును. అచ్చు వేయబడు బట్టగుండా ప్రసరించు రంగు ఉన్ని ఫెల్టు లేక 'నామా' ను పాడుచేయును;అందుచేత ఈ ఉన్నికప్పుపై ఒక ముదుక బట్ట పరచబడును. "బేక్ గ్రే" అని దీనికి పేరు.

“పెరొ టైన్" లేక యంత్రములతో చేయబడు దిమ్మ. అచ్చు: "పెరొ టైన్" అనునది 4 రంగులను మాత్రము ఒక మారు అచ్చు వేయును. పెరొటైన్ కొరకు రూపరచనలు చేయుటలో రంగుపై రంగు రాకుండా చూడవలెను. ఎందుచేతననగా దిమ్మ అచ్చులో రంగు ఇంచుమించు బట్టయొక్క పై భాగమున నుండును; ఈ తడి రంగులు కలిసి పడినచో, అవి తప్పనిసరిగా వాటి హద్దు లను దాటి ప్రసరించి ప్రతికూల ఫలితమును కలిగించును. రూపరచన యొక్క రీతి పరిమాణములను అనుసరించి, పెరొటైన్ యంత్రములోని దిమ్మలు సాధారణముగా 30" పొడవు 3" - 5½" వెడల్పును కలిగియుండును.

యంత్రములో (మూడు రంగుల యంత్రము) మూడు దిమ్మకూర్పులుండును. ప్రతి దిమ్మయు రంగు నింపుట, రంగు వ్యాపింపజేయుట, ముద్రను అచ్చొత్తుట, అనుప్రత్యేకములగు ఏర్పాటులను గలిగియుండును. అన్ని దిమ్మలును ఏక కాలమున పనిచేయునట్లు చేయబడును. అచ్చువేయు సమయములో తరువాతి ముద్రణము పూర్వపు ముద్రణముతో కలియుటకు సరిగా ఎంతచోటు అవసరమా, అంతవరకు మాత్రమే బట్ట ముందునకు జరుగును. మూడు దిమ్మలును రంగులన్నియు పొరపాటులేక సరిగా పడునట్లు సరిచేయబడును.

పైభాగపు అచ్చులేక "పెగ్" (Peg) అచ్చు: పై భాగము లేక "ఫెగ్" (Peg) అచ్చు నేటికాలపు స్థూప ముద్రణము (Cylinder Printing) లేక "రోలరు" ముద్రణమునకు ప్రాతిపదిక. ఈ “పెగ్" - అచ్చులో చెక్కబడిన 'రోలరు' కఱ్ఱతో చేయబడును. అనగా దిమ్మ వర్తులా కారముగా నుండును. దీనిలో అనేక లోపములు కలవు. రంగు సమానముగా సమకూర్ప బడదు. ఒత్తిడిని క్రమ పరువ వీలు కాదు. ఎడతెగక తడియుట వలనను, ఎండుట వలనను, కఱ్ఱరోలరు గుంటలుపడి చెడిపోవును.

దీని తర్వాతి అభివృద్ధి దశలో రంగును సమకూర్చుటకును బాగుపరచుటకును ఒక ఏర్పాటు చేయబడినది. దీని కొరకు నిరంతరమైన (రెండు కొసలు కలుపబడిన) ఒక పెద్ద దుప్పటి ఉపయోగింపబడును. ఈ దుప్పటి రంగుతో సమకూర్పబడి యుండును. రంగు సమకూర్పు సమానముగా చేయుటకై ఒక కఱ్ఱగాని ఇనుప "బ్లేడు" గాని (Blade) ఏర్పాటు చేయబడును. "డాక్టరు" అని దీనికి పేరు. ఇది రంగును విస్తరింపజేయుటకు సహాయ పడును. ఈ “డాక్టరు ” ముందుకును వెనుకకును కొంచెముగా కదలిక గలిగియుండును. మోటు ముద్రణములో ఇది ఉపయోగింపనగును. అందు రేఖలు మిక్కిలి సునిశితముగా, సుస్పష్టముగా నుండవు.

యంత్ర ముద్రణము: దీనికి యంత్ర ముద్రణము, స్తూప ముద్రణము (cylinder printng) లేక "రోలరు" ముద్రణము అని పేరు. ఇతర పద్ధతులలో దిమ్మలు, తెరలు “స్టెన్సిళ్లు" (Stencils) వాడబడుచుండును. దీనిలో

తిరుగుడు యంత్రము

1. వర్ణ పేటిక
2. వర్ణ సంపాదకము
3. వర్ణ వ్యవస్థాపకము
4. తొలచబడిన తిరుగుడు చుట్ట
5. స్తూపము
6. బొత్తివలె దూర్చుట
7. దుప్పటి
8. "బాక్ గ్రే"
9. గుడ్డ
10. నార పీచు
11. ముందుకు నడుపు రోలర్లు

రూపరచన కొరకు చెక్కబడిన రాగి 'రోలర్లు' ఉపయోగింపబడును.

'రోలరు' ముద్రాయంత్రము 1788 లో ఇబేల్ అను నాతనిచే కనిపెట్టబడినది. మిక్కిలి సామాన్య రూపముకల ఈ ముద్రాయంత్రములో ఈ క్రిందిభాగములు కలవు.

(1) స్థూపకము (Cylinder) (2) లేపింగ్ (Lapping) (3) దుప్పటి, (4) 'బేక్ గ్రే' (Back Grey) (5) చెక్కడపు పనిగల 'రోలరు' (6) రంగు 'డాక్టరు' (7) లింటు (Lint) (8) రంగు సమకూర్చునది. (9) రంగుపెట్టె.

స్థూపక మనగా అచ్చు వేయబడు బట్ట దేనిమీద గుండ్రముగా తిరుగుచుండునో అట్టి పెద్ద "డ్రం" వంటి “రోలరు”. ఈ స్థూపకముమీద ఒక దట్టమైన ఉన్ని "ఫెల్టు" బట్ట, లేక మైనపుగుడ్డ కొలదిగా చుట్టబడును. ఇది అచ్చు వేయు సమయమున తగినంత స్థితిస్థాపకత్వమును (Elasticity) చేకూర్చును.

అచ్చుయంత్రపు దుప్పటి బిగువుగా నేయబడును. గట్టిగా నేసి పెనవేయబడి అది దట్టమును స్వచ్ఛమును అగు ఉన్ని బట్ట (Lapping) యొక్క స్థితిస్థాపకతను (Elasticity) వృద్ధిచేయును. ' లేపింగ్ ' నకును అచ్చు వేయబడు బట్టకును నడుమ ఒత్తిడి—స్థూపకమును (Pressure cylinder) ఎడ తెగకుండా తిరుగునట్లు చేయును. ఆ దుప్పటి గట్టి పడి, బట్టగుండా చొచ్చుకొనివచ్చు తడిరంగుచే, మలినము నొందును. ఇట్లు జరిగినప్పుడు సామాన్యముగా దుప్పటిని ఆవలిప్రక్కకు తిప్పుచుందురు. ఆ దుప్పటి స్వచ్ఛముగా నున్నచో ఇట్లు చేయవచ్చును. లేనిచో క్రొత్త దుప్పటిని ఉపయోగించవలసి యుండును. 'బ్రేక్ గ్రే'ల నుపయోగించుటవలన దుప్పట్లు ఎక్కువకాలము ఉపయోగపడును. ‘బేక్ గ్రే*లు (Back Greys) అనగా దుప్పటికిని అచ్చువేయబడు బట్టకును మధ్య నుంచబడు తెలుపు ‘కేలికో' ముక్కలు, ఉన్ని దుప్పట్లకును, వాటర్ ప్రూఫ్ మైనము దుప్పట్లకును అవి తప్పనిసరిగా వాడబడును. ఉతుకుటకు వీలయిన దుప్పట్లు లభించినచో వీటిని వాడుట మానివేయవచ్చును.

'రోలర్లు' : అచ్చువేయుటకు ఉపయోగించు రోలర్లు రెండువిధములు : (1) ఘనపదార్థపు రోలర్లు (Solid Rollers): ఇవి రాగి లోహముతో మాత్రమే చేయబడును. (2) 'షెల్ రోలర్లు' (Shell Rollers): ఇవి రాగి ఖరీదును తగ్గించు నుద్దేశముతో ఇనుముతో చేయబడును. వాటిపై విద్యుత్తుచే రాగిపూత వేయుదురు.

'రోలరు'లోపల, పొడుగునను 'నాళము' లేక 'నాలుక' ఒకటి వ్యాపించియుండును. ఈ 'నాథము' (Tab) రోలరులోనికి పోవునట్లు అమర్చబడిన "మేన్ డ్రిల్" లేక ఇనుప ఇరుసులో ననురూపముగానున్న కన్నములో అమర్పబడుటకు వీలుగానుండును. దీనివలన ఇరుసే తిరుగుట జరుగకుండ చేయబడును. అచ్చువేయు రోలర్లు ఒకప్పుడు ఇత్తడితో చేయబడును. కాని దీనివలన ప్రత్యేక లాభము లేదు. రాగి రోలర్ల పై తలము యొక్క గట్టితనమును వృద్ధిచేయుటకై "నికెల్ ప్లేటింగు" ఒకప్పుడు క్రోమియం ప్లేటింగు కూడ చేయబడుచుండును. ఇట్టి ప్లేటింగుచే పై తలము యొక్క గట్టితనము వృద్ధి అగును. రోలర్ల “రోలర్లు" క్షీణింపక ఎక్కువ కాలము మనును.

“మేన్ డ్రిల్స్" : ఇవి పొడవైన ఉక్కు కడ్డీలు. అచ్ఛు యంత్రములో నుంచబడినప్పుడు ఇవి తాత్కాలికముగా అచ్చు వేయు 'రోలర్ల'కు ఇరుసులవలె ఉపకరించును.

రాగి రోలర్లు చెక్కుట : అచ్చు రోలర్లను చెక్కుట 'కేలికో' ముద్రణమునందలి చాల ప్రత్యేక శిక్షణమును అపేక్షించు శాఖయై యున్నది. ఇది యొక ప్రత్యేక పరిశ్రమయై యున్నది.

చెక్కడపు పనిలో మూడు ముఖ్య పద్ధతు లున్నవి: (1) చేతి చెక్కడము, (2) యంత్రముచే చేయబడు చెక్కడము, (3) రసాయనికపు చెక్కడము.

ఏ పద్ధతి ఉపయోగింపబడినము, రాగి రోలర్ల చెక్కడపు పని ఉత్కీర్ణపద్ధతిగా (Intaglio) గా నుండును.

"ఉబికిన వ్రాత" (Relief) గా మాత్రము ఉండదు.

చేతిచెక్కడమునకు చాలకాలము పట్టును, ఇది చిన్నవియు, పెద్ద వియునగు వాడి పనిముట్లతో చేయబడును.

చెక్కడము యొక్క అన్ని పద్ధతులలోను, రూప రచన తగు విధముగా నేర్పాటు చేయబడవలెను. రూపరచన యొక్క లంబరూప దైర్ఘ్యము (Vertical length) 'రోలరు' పరిధికి ఒక పూర్ణాంక గుణిజముగా (integral multiple) నుండవలెను. అట్లే 'అడ్డముగా ఉండు పునశ్చరణము' (Horizontal repeat) 'రోలరు' యొక్క వెడల్పు విషయములో ఒక పూర్ణాంకముగా ఉండవలెను.

చుక్కలతో చెక్కుట (Stippling): ఇది రోలర్ల పై భాగమున గుంటలు చేసి, రూపరచనల లిఖించుటచే చేయనగు ఒక విధమగు చెక్కడపుపని. పూర్వము ఇది చేతితోనే చేయబడుచుండెడిది. సన్నని ఉక్కు సాధనముచే దీనిని చేయుచుండెడివారు, ఈ రోజులలో చుక్కల చెక్కడముకూడ యంత్రముతో చేయబడుచున్నది.

యంత్రపు చెక్కడము : యంత్రపు చెక్కడములో వాడి పనిముట్లచే రూపరీతి చెక్కబడదు. దీనికి బదులుగా ముందుగా తయారుచేయబడి ఉబికిన రచనగల యంత్రముచే (Mill) రూపరీతి రోలరుమీద ముద్రింపబడును. రసాయనికపు చెక్కడము, “పెంటగ్రాఫ్": రోలరుపై,'వాటర్ ప్రూఫ్ ' ను, అమ్లనిరోధకమగు నొక 'వార్నిషు”ను పూతగా పూయుదురు. అట్టి రోలరుపై వజ్రపుగంటము (Diamond Pointer) పనిచేయునపుడు రూపరీతి నొక్కులుగా నేర్పడును.

ఇట్లు తయారుచేయబడిన 'రోలరు' నత్రికామ్లపు తొట్టిలో నుంచబడును; అప్పుడు 'వార్నిష్' మీద నొక్కులుగా త్రవ్వబడిన భాగములు ఆమ్లము యొక్క చర్యకు పాల్పడును. ఇట్లు ఉత్కీర్ణముగా నమూనా (design) ఏర్పడును.

"స్టెన్సిలింగ్" (Stencilling): బట్టలపై స్టెన్సిలింగ్ పురాతనపద్ధతి; దీనివలన అనేక ఉపయోగములు కలవు. అవి యెవ్వియన, దిమ్మ అచ్చులోకంటె, రూపరచనా నిర్మాతకు అల్లిబిల్లికతో గూడినరీతిని రచించుటలో స్టెన్సిలింగ్ ఎక్కువ స్వాతంత్య్రము నిచ్చుచున్నది. సన్నని రేఖలతోగూడిన సున్నితపు రచన, గొప్ప ఫలితము,-ఈ రెండును దీనివలన చేకూరును. వేర్వేరు రంగు చాయలను కల్పించుట స్టెన్సిలింగులో సాధ్యపడును. రంగులు సులభముగా మేళవింప వీలగును. "స్టెన్సిల్” సాధారణముగా పలుచని రాగి రేకుతోగాని ఇత్తడి రేకుతొ గాని తయారుచేయబడును. అందుచేత ఇద తడుపు ఎక్కువగా నున్నపుడు కూడ చెడిపోదు. "స్టెన్సిల్" తయారు చేయుటలో పెక్కు “బలములు" (Stays) లేక ఆధారములు నేర్పుగా ప్రవేశ పెట్టబడును. ఇవి నమూనాలో అంతర్భాగములుగా కలిసిపోవునట్లు చేయబడును. "స్టెన్సిల్” పలకకు ఇవి తగు బలమునిచ్చును. ఇట్టి బలము లేనిచో "స్టెన్సిల్ బలహీనమై అచ్చువేయబడు వస్తువుపై అంటుకొని యుండదు. అచ్చువేయబడు పదార్థముపై స్టెన్సిల్ ఉంచబడును. కుంచెతో చెక్కిన భాగములగుండా రంగు వేయబడును. కుంచెతో ఒత్తి వ్రాయుట ('డబ్బింగ్') వలన రంగు అంటుకొనును.

గాలికుంచె (Air Brush) ను రంగు వేయుటకు ఉపయోగించుట మరియొక పద్ధతి. దగ్గరకు ఒత్తబడిన గాలి యొక్క శక్తి రంగు బిందువులను తుంపురులుగా విడగొట్టును. ఈ సన్నని జల్లులు స్టెన్సిల్ ద్వారమున బట్ట మీదపడును. దీనిని కుంచెవలెనే వాడవచ్చును. దీనిచే తేలికయును, గాటమును అగు చాయలు రచించి, వివిధములగు ఛాయా ఫలితములను సాధింపవచ్చును.

జపాను దేశీయులు స్టెన్సిల్ తయారు చేయుటకు ఒక సున్నితమగు రీతిని అవలంబింతురు. ఒకేమారు రెండు పలుచని కాగితములను కత్తిరించి వాటితో నొక కాగితముపై సిల్కు దారములను సమానముగా పరచి పిదప నీరెండు కాగితములను అంటించుదురు. దీనిచే స్టెన్సిల్ యొక్క బలము అధికమగును.

తెర- అచ్చు తెర-అచ్చు కూడ స్టెన్సిలింగ్ : విధాన

తెర అద్దకము

1. తెర చట్రము
2. తీగె వల లేక సిల్కు గుడ్డ
3. అదుము రబ్బరు
4. రంగు పిండి
5. రంగు వేయవలసిన గుడ్డ
6, రంగు వేయబడిన గుడ్డ
7. చదునుబల్ల

ములలో చేరినదే. ఒక సన్నని దోమతెర గుడ్డ లేక సిల్కు గుడ్డను ఒక చట్రముపై గ్రహింతురు. నమూనా పై రంగు పూయుదురు. అవుడు రంగు వేయబడని భాగము స్టెన్సిల్ పై చెక్కబడిన భాగములవలె సన్నని అల్లిక కలదగుటచే, వేసిన రంగును, తెరక్రింద నున్న బట్టమీదకు దిగునట్లుచేయును. తెరలు సన్నని “వైర్ గాజ్" లేక స్వచ్ఛమగు సిల్కు బట్టతో చేయబడును. తెరలలో పునశ్చరణము చేయబడు రూపములు కలుపుటకు వీలగునట్లు కొన్ని “పట్టుకొను ప్రదేశములు" (Catch points) ఏర్పాటు చేయబడి యుండును. కఱ్ఱనార (Cellulose) రంగు, లేక లక్క రంగు తెరకు రంగువేయుట కుపయోగింపబడును. ఈ రంగులు తడుపును నిరోధించుచు, "గాజు గుడ్డు" లేక బట్టయందలి సూక్ష్మరంధ్రములను పూడ్చి వేయగలవు. రంగునీటివలన. చేయబడును. రంగు, బట్టపై అంతటను వ్యాపింపకుండుటకై నీరు మిక్కిలి తక్కువ పరిమాణములో అచ్చువేయునప్పుడు ఉపయోగింపబడును. రంగు ముద్దలను గట్టిపరచు సాధనములుగా జిగురులు, పిండి పదార్థములు మొదలగునవి ఉపయోగింపబడును.

అచ్చువేయు జిగురు రంగును వ్యాపింపకుండునట్లు చేయునదిగను, రంగును సమానముగా పంచుటకు సహాయ పడునదిగను ఉండవలెను. మరియు జిగురు, బట్టపై రంగు ఫలితమును పూర్తిగా ప్రదర్శించుచు, కడిగివేయుటకు సాధ్యపడునదిగా నుండవలెను. రంగును సమకూర్చగలశక్తి, చిక్కపరచెడి సాధనము యొక్క మరియొక ముఖ్య లక్షణము. ఆశక్తి అవసరములను బట్టి మారుచుండును.. ఆశక్తిని అవసరమైన విధముగా సవరింపవచ్చును. తటస్థములును, ఆవిరి కానివియును అగు నూనె పదార్థములను స్వల్ప పరిమాణములలో కలిపి వివిధములయిన చిక్కదనములను పొందవచ్చును. ఈ నూనెలు వృక్షజన్యములుగ గాని, జంతుజన్యములుగ గాని, ఖనిజ సంబంధములుగ గాని యుండవచ్చును. అచ్చు రంగులకు మిక్కిలి చౌకగా కావలసిన చిక్కదనమును కలిగించుటకై " మెర్ట్" (Mert) ను, ఇతర ఘనపదార్థములను చేర్పవచ్చును. కొన్ని సందర్భములలో బాగుగా పొడిచేయబడిన చైనామట్టిని (Kaolin), జింక్ ఆక్సయిడ్ ను, లితోపోనును (Lithopone), బ్లేన్ ఫై (Blank fie) మొదలగు వస్తువులను, ఉపయోగింతురు. ఇట్టి పదార్థములు ఎక్కువగా వాడినచో అచ్చుపడు ధర్మములకు భంగము కలిగించును. కారణము అచ్చురంగులు, అచ్చు రోలర్ల యొక్క చెక్కడములపై మట్టిపొరలవలె కప్పుకొను గుణము దీనివలన ఎక్కువగుటయే.

నిరోధక శైలికి విసర్జన శైలికి (Resist and Discharge Styles) సంబంధించిన ముద్రణములలో అట్టి వస్తువులు కలుపుట నిరోధక చర్యకు అనుకూల్యమును కల్గించును; మరియు తెలుపు రంగు ఫలితముల రూపమిచ్చు శక్తిగల లక్షణమును ఎక్కువ చేయుటలో సాయపడును. ఏమనగా, అవి శూక్ష్మరూపములో అంతటను విస్తరించి యుండుటచే నూలు పోగులు కొంతవరకు వాటిని నిలుపుకొన గల్గును. కడిగివేయుటకు సాధ్యముకాని కోడిగుడ్డులోని తెల్లని భాగమును పాలవిరుగుడు లేక పరేసు(Glue) వంటి చిక్కపరచు వస్తువులను కలిపి ఈ తెల్లని అణువులను నూలు ప్రోగుల పైభాగమునకు అంటి పెట్టుకొనునట్లు చేయుట తరచు వాంఛింపబడుచున్నది. జింక్ఆ క్సైడ్ విసర్జన శైలిలో వాడబడును. కొన్ని సందర్భములలో అది తెల్లని అణు వ్యాప్తికి తోడ్పడును. విసర్జన విధానక్రమమున రాసాయనిక చర్యలోకూడ అది సాయపడును.

గోధుమపిండిని (Starch) తక్కిన చిక్కపరచు సాధనములతో కలిపినచో అధికలిసి ఎక్కువ ఉపయోగపడును. కాని అచ్చువేసిన పదార్థములకు కఠినస్పర్శను ఆపాదించుటయు, ముఖ్యముగా పెద్దదిమ్మలు అచ్చు వేయునపుడు అసమఫలితము నిచ్చుటయు, అను ఈ రెండులోపములును దీనియందు కలవు. ఈ లోపములు కొంతవరకు ‘బాదముబంకను' గాని బ్రిటిష్ జిగురును గాని ఉపయోగించి తొలగింపవచ్చును. తక్కువరకముల పిండి పదార్థములతో చేయబడిన జిగురులు ముద్దకట్టు స్వభావమును కలిగియుండును. పిండిపదార్థములతో చేయబడు జిగురులు కొలది ఉష్ణోగ్రతచే మార్పుచెందును. ఇవి కొంతకాలము నిలువయున్నచో పుల్ల బడుట, చిక్కపడుట, నురుగుపట్టుట, నీటివలె పలుచగా నేర్పడుట జరుగును. క్రిమిసంహారకములు, పెనోల్, నెఫ్ తాల్, సాలిసిలిక్ ఆమ్లము, బోరిక్ ఆమ్లము మొదలై నవి కొలదిగా కలిపి ఈ లోపములను తొలగింపవచ్చును.

ఆర్. వెం. స్వా.

[[వర్గం:]] [[వర్గం:]]